ఎర్రజెండా కోసం పోరాడిన కళ్ళే ఎరుపెక్కాయి…

చెర గురించి నన్ను రెండు మాటలు మాట్లాడమన్నారు. ఏం మాట్లాడను? మాట్లాడాలంటే చాలా భయంగా ఉంది. బాధగా ఉంది. ఆయన రాసిన కవిత్వం, పాటలు చాలా సహజంగా అందరికీ అర్థమయ్యే రీతిలో ముఖ్యంగా కష్టజీవుల గురించి, కార్మికుల గురించి రాసే వాడు. తాను ఎప్పుడూ పేదవాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉండే వాడు. ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, బస్సులో ఉన్నా, సైకిల్ మీద వున్నా ఎక్కడవున్నా కూడా ఆయనకు అదే ఆలోచన. అట్లా ఆలోచిస్తూ, ఆలోచిస్తూ ఒకసారి లారీ యాక్సిడెంట్ అయింది.

ఆయన రాసిన మాటలు, పాటలు మననందరినీ కదిలిస్తాయి. అట్లాగే ఒక పాట “ఇంటింట చీకటే ప్రతి కంట కన్నీరె రాజ్య మెవడికి వచ్చెనో …. సుఖము లెవరికి దక్కెనో” అనే ఈ పాట పేదవాళ్ళ కన్నీళ్ళ గురించి, ఇంటింట ఉండే చీకటి గురించి రాసాడాయన. మరి ఇంటింటి చీకటిని తొలగించాలంటే మనమంతా కృషి చేయాలి. మన ఇంట్లో దీపం మనమే వెలిగించుకోవాలి. దానికి మనం పాటుపడాలి. యధార్ధంగా చెర నడిచిన దారిలో మనమంతా నడుస్తాం. పేదవాళ్ళ గురించి పేదవాళ్ళ కష్టాల గురించి ఆయన బాటలో నడుస్తూ, మున్ముందుకే పోతామని ఆశిస్తాను.

చెర సంవత్సర కాలం హాస్పటలులో ఉండి నానా అవస్థలు పడ్డాడు. అది మాటల్లో చెప్పలేను నేను. పెద్దవాళ్ళు అంటారే పెట్ట ఘోష అనుభవించాడు అని “పెట్ట ఘోష అంటే ఎలా వుంటుందో మనకు తెలియదు కాని, నేను మాత్రం కళ్ళారా చూసాను. చాలా బాధతో నెట్టుకొచ్చాడు సంవత్సరం పాటు. అయినా ఏ రోజుకారోజు చెర మాట్లాడతాడు, చెర నన్ను పిలుస్తాడు అని ఆశించేదాన్ని.

కానీ ఏ రోజుకారోజు తను దిగజారిపోతూ ఏమీ చెప్పలేకుండా, మాట్లాడలేకుంగా ఎనిమిది నెలల కాలం పాటు మాట లేకుండా, చూపు లేకుండా చాలా కొట్టుమిట్టాడుతూ మాట చెప్ప లేకుండా కళ్ళ లోంచి నీళ్ళు కారేవి. కొంత కాలం తరువాత నీళ్ళు కారికారి కళ్ళల్లోంచీ నీము, రక్తం రావడం మొదలైంది. (తను ఎప్పుడైతే ఎర్రజెండా కోసం పోరాడాడో, ఆ ఎరుపే కళ్ళలోకి రావటం మొదలైంది)

( సుదీర్ఘమైన చప్పట్లు. కామ్రేడ్ చెరబండరాజు అమర్ హై అని నినాదాలు) తను ఏమీ చేయలేని స్థితిలో ఉండి కూడా కళ్ళల్లో తన నెత్తురుని చూపించాడు. అంటే “ఆ ఎరుపు బారిలో నడవండి; ఆ ఎర్రజెండాను ఎగరేయండి. నా శక్తి ఉన్నంత వరకూ నేను చేసాను. ఆ తరువాత మీరే”… అని మనస్సులో ఉందన్న మాట.

ఇన్ డైరెక్ట్ గా చెరబండరాజుని ఈ ప్రభుత్వం హత్య చేసింది. జబ్బు కొంచెమే ఉన్నా చాలా మటుకు ఆలోచనలతో, చదువుతో, తలనొప్పితో …. ఈ దోపిడీ ప్రభుత్వం, ఈ కుష్టు వ్యవస్థ మా చెరను చంపింది కాబట్టి, మా చెరను హాస్పటలులో ముక్కలు ముక్కలుగా కోసారు కాబట్టి, మనమింకా కలిసి ఈ ప్రభుత్వాన్ని ముక్కలు ముక్కలుగా కోసి, ఆయన ఆశయాల కోసం మనమంతా పోరాడుతామని, (సుదీర్ఘ హర్షధ్వానాలు, నినాదాలు) – మనమంతా ఐక్యంగా ఉంటామని …. మీ అందరిలో నా చెరను చూసుకుంటాను. మనం చెర రాసిన పాటలు పాడుకుందాం. ఆయన పాటల్తో పాడుదాం. ఆటలతో ఆడుదాం. నా చెర, మన చెర ఎప్పుడూ మనలోనే ఉంటాడు. మనల్ని వెన్నంటే ఉంటాడు. మనల్ని తడుతూనే ఉంటాడు. అది మాత్రం మరిచిపోకూడదు.
మా పిల్లలిద్దరూ చాలా చిన్న వాళ్ళు. మా పాప పదేళ్ళు ఉంటుంది. బాబుకు అయిదేళ్ళు ఉంటాయి. పిల్లలంటే చెరకు పంచప్రాణాలు. చాలా కాలం దాకా పిల్లలు కలుగలేదు మాకు. కలిగిన తరువాత వాళ్ళ ముద్దు ముచ్చట ఏమీ చూసుకోకుండా, ఆడకుండా పాడకుండా వెళ్ళిపోయాడు.

ఈ రోజు ఉదయం ‘నాన్న మీటింగు జరుగుతోంది. అక్కడి కెళ్తాం’ అన్నాను బాబుతో. అప్పుడు ‘నాన్న అక్కడికి వస్తాడా? అమ్మా’ అని అడిగాడు. ఏం సమాధానం చెప్పాలి? వస్తాడని చెప్పనా? రాడని చెప్పనా? ఏమీ చెప్పలేక పోయాను. కష్టజీవుల గురించి, కార్మికుల గురించి, కన్నీళ్ళ గురించి కొండలు పగలేసినం పాట తాను రాసాడు. ఆంధ్ర దేశమంతటా ఆ పాట పాడుకుంటున్నారు. అట్లాగే మా పాప ఆ పాటకు, వాళ్ళ నాన్న రాసిన పాటకు డాన్స్ చేస్తుంది. చూడండి. నేను ఇంతకంటే ఎక్కువ ఏమీ చెప్పలేను.

(కామేడ్ చెరబండరాజు స్మృతిలో RSU – RYL నిర్వహించిన సదస్సులో( 1983 జులై 1, 2) 2న జరిగిన బహిరంగ సభలో కామ్రేడ్ శ్యామల ప్రసంగం)

Leave a Reply