హోరెత్తే ఎర్రగాలి

నక్సల్బరీ గిరిజన రైతాంగ పోరాటం పెను సంచలనం రేపింది. కోపోద్రిక్త యువతరాన్ని కదిలించింది. దేశవ్యాప్తంగా యూనివర్సిటీలన్నీ యుద్ధ క్షేత్రాలుగా మారాయి. వాళ్లంతా సమాజాన్ని అధ్యయనం చేశారు. దోపిడీ, పీడన, అణచివేతకు కారణాలు తెలుసుకున్నారు. వాటిని నిర్మూలించేందుకు పోరుబాట పట్టారు. సమాజ సాహిత్య సంబంధాలను అర్థంచేసుకున్నారు. మార్క్సిజం వెలుగులో సమాజాన్ని విశ్లేషించారు. లెనినిజం, మావోయిజాన్ని సమాజానికి అన్వయించారు. ప్రజల దీర్ఘకాలిక పోరాటమే విముక్తి మార్గమని నమ్మారు.

అది నెత్తురు మండే శక్తులు నిండిన యువతరం, కొత్త ఆలోచనలతో ఎగసిపడుతున్న కాలం. అడవుల్నీ, మైదానాల్నీ మండించిన కాలం. నక్సల్బరీ ఏకీ రస్తా నినాదం వెల్లువైన కాలం. అట్లాంటి కాలాన తెలుగు నేలంతా ప్రభంజనమైంది. ఆ ప్రభంజనంలోంచే అనంతపురం నుంచి ఓ యువ కవి ‘ఎర్రగాలి’లా దూసుకువచ్చాడు. సాయుధ విప్లవ చైతన్యాన్ని నలుదిశలా వ్యాప్తిచేశాడు. ‘ఎర్రగాలి’ పేరుతో కవితా సంకలనం ప్రచురించాడు. ఇవి విప్లవ కవిత్వంలో కొత్త వెలుగు.

ఇది హోరుహోరుగా వీచే గాలి. ఎరుపెక్కిన గాలి. తూర్పు గాలి. విప్లవ కవి జైరామ్ రాసిన ‘ఎర్రగాలి’. ఇది నక్సల్బరీలో వెల్లువెత్తిన గాలి. అడవుల్నీ, కొండల్నీ తాకుతూ పల్లెలన్నీ పల్లవించిన గాలి. జనం గుండెల్ని మీటిన గాలి. అది నక్సల్బరీ గిరిజనం ఊపిరిలో నిండిన గాలి. నిప్పంటుకున్న శ్రీకాకుళం అడవులు, కొండలు, మైదానాలు. ఉరిమిన ఉత్తర తెలంగాణ మాగాణాల్లో నెత్తురై చిందిన గాలి. అది పాణిగ్రాహి పాటల్లో రణభేరై మోగిన జమిడీకె. ఇప్పవనాల్లో నిప్పుల పాటల్ని రాజేసిన తూర్పుగాలి.

కవి పూర్తి పేరు జెట్టి జైరామ్ చౌదరి. 12 జులై 1948లో అనంతపురం జిల్లా గుత్తి తాలూకా చింతలాంపల్లి గ్రామంలో పుట్టాడు. గుంతకల్లు, బళ్లారి, తిరుపతి ప్రాంతాల్లో చదివాడు. 1965కు ముందు నుంచే రచనా వ్యాసంగంలోకి వచ్చాడు. అభ్యుదయ భావాలవైపు రావడానికి పూర్వమే (1965-1968) కొన్ని కథలు, నాటికలు, కొంత భావకవిత్వం రాశాడు. మిత్రులతో కలిసి ప్రచురించిన ‘లే’, ‘విప్లవం వర్థిల్లాలి’, ‘రక్తగానం’ సంకలనాల్లో కవితలు ప్రచురితమయ్యాయి. సారధి, రాయలసీమ, జనశక్తి, జీవనాడి, ప్రజాసమస్యలు, ప్రజాసాహితి, సృజన పత్రికల్లో కవితలు, వ్యాసాలు, అనువాదాలు, విమర్శలు, పుస్తక సమీక్షలు ప్రచురితమయ్యాయి.

‘ఎర్రగాలి’ సంకలనంలోని కవితలు విప్లవ రచయితల సంఘం ఏర్పడటానికి రెండేళ్ల ముందు నుంచి రాసినవి. ఆ తర్వాత మూడేళ్లలో అప్పుడప్పుడూ రాసినవి. ఈ కవితా సంకలనానికి ‘విప్లవం జయిస్తోంది’ అని శ్రీశ్రీ (9 నవంబర్, 1973), ‘ఈ తరం కవి జైరామ్’ అని త్రిపురనేని మధుసూదనరావు (7 నవంబర్, 1973) ముందుమాటలు రాశారు. కానీ వివిధ కారణాలతో అదే ఏడాది పుస్తకం వెలుగులోకి రాలేదు. ప్రచురణకర్త దగ్గరే చాలా కాలం ఉండిపోయింది. జులై 1981లో మొదటి ప్రచురణ వచ్చింది. తూర్పు దిక్కు ఎర్రబారినట్టు ఈ పుస్తకానికి మపా కవర్ పేజీ రూపొందించాడు.

నిరంతరం దోపిడీకి గురవుతున్న రైతులు, కూలీలు, నక్సల్బరీ, శ్రీకాకుళం కొండల్లో ప్రతిధ్వనించిన విప్లవ నినాదాలు ఈ కవికి స్ఫూర్తినిచ్చాయి. దేశవ్యాప్తంగా జరుగుతున్న సాయుధ తిరుగుబాట్లు, పోరాటాల్లోకి ఉవ్వెత్తున వస్తున్న యువతరం, శ్రీశ్రీ కవిత్వం అతణ్ని ప్రభావితం చేసింది.

జైరామ్ రైతుబిడ్డ. పల్లెల్లో జీవించాడు. పల్లెజనంతో తిరిగాడు. వాళ్ల భాషనూ, నుడికారాన్నీ పట్టుకున్నాడు. జానపద గేయాల్లోని మాధుర్యాన్ని అనుభవించాడు. పల్లెజనం బాణీలను అర్థంచేసుకున్నాడు. ఆ బాణీలను అనుసరించాడు. పాటలు రాశాడు. ఆ పాటలు పల్లెపల్లెకూ చేరాలనే తపనతో శ్రమజీవుల బాణీలో రాశాడు. ఈ పాటల రచనను చెప్తూ జైరామ్… “పుస్తకాలు చదవడానికి కనీసమాత్రం అక్షర జ్ఞానం గానీ, కాస్తో కూస్తో అక్షర జ్ఞానం ఉన్నవాళ్లకి చదివే అవకాశం గాని మనదేశంలోని శ్రమజీవులకు లేదు. అందుకే నేటికవి ప్రజల మధ్యకు రావాలి. కేవలం పుస్తకాల్లో ఉంటే చదివే అలవాటున్న మధ్యతరగతికే అందుతాయి. అది ప్రజాగేయమైనా, వచన కవిత అయినా ఒకటే అవుతుంది” అని రాసుకున్నాడు.
(ఎర్రగాలి, జైరామ్; 1981, పు. 9)

జైరామ్ మధ్యయుగాల భావాల మీద తిరుగుబాటు చేశాడు. చరిత్ర గతిని అర్థంచేసుకున్నాడు. సమాజ సాహిత్య సంబంధాలను అధ్యయనం చేశాడు. వాటిని గతితార్కిక వెలుగులో విశ్లేషించాడు. అశాస్త్రీయ భావాలను నుంచి బయటకు రమ్మని యువతకు పిలుపునిచ్చాడు. ఫ్యూడల్, బూర్జువా సంసతిని నిరసించాడు. వస్తువును విప్లవీకరించాడు. శిల్పంలోనూ ప్రజాస్వభావాన్ని సాధించాడు. జానపద కళారూపాలను అధ్యయనం చేశాడు. జానపద బాణీల్లో ప్రజలకు అర్థమయ్యేలా రాశాడు. ప్రజలన్ని విప్లవీకరించాలంటే వాళ్ల భాషలోనే రాయాలనే ఎరుక వున్న కవి అతడు. అందుకే పల్లె జనం గుండెచప్పుళ్లను పాటలుగా మలిచాడు. సెలయేటి పాటలా. తూర్పు కొండల్లోంచి దూసుకువచ్చే గాలిని చెప్తూ…

”ప్రళయ భీకరంగా
వీస్తున్న
ఈ గాలి
గండ్రగొడ్డలై
అన్యాయం శిరస్సు ఛేదిస్తుంది
తుపాకి తూటాయై (ఎర్రగాలి; 1981, పు.1)
అవినీతి గుండెలో దూసుకుపోతుంది…”. ఈ కవితపై శివసాగర్ ప్రభావం కన్పిస్తున్నది. ఈ కవిత నిండా వర్గకసి. దోపిడీ వర్గాలపై ప్రజలెత్తిన పిడిళ్లు. మనిషికి మనిషికి మధ్య నిలువెల్లా మొలిచిన అడ్డుగోడల్ని కూల్చే గాలి ఇది. చుట్టూ పేగులెండిన జనం. గుండెలు మండిన బక్కరైతులు. అణగారిన దళితులు. గిరిజనం. ఈ తూర్పు గాలి వీళ్ల చేతుల్లో బల్లెమై దోపిడీసంఘాన్ని నేలకూల్చుతుందన్నాడు. ప్రభంజనమై వీచే గాలిని విప్లవానికి ప్రతీకగా చిత్రించాడు కవి. 27 డిసెంబర్, 1972లో రాసిన కవిత ఇది.

జైరామ్ శ్రీకాకుళం కొండల్లో ప్రతిధ్వనించిన విల్లంబుల గర్జనల్ని విన్నాడు. గిరిజనం గుండెల్లో మార్మోగిన జంగ్ పాటలు విన్నాడు. అవి జనం గుండెల్లోంచి చెలరేగిన పాటలు. ఉత్తరాంధ్రనంతా ఉప్పెనలా చుట్టుముట్టిన పాటలు. ఆ పాటల్లో సత్యం. వాళ్ల మాటల్లో సత్యం. వాళ్ల పోరాట బావుటా సత్యం. గిరిజనం పోరాటం ఆనాటి యువతరాన్ని మండే కొలిమిలోకి నడిపించింది. వాళ్ల మాటల్నీ, పాటల్నీ సాయుధం చేసింది. అట్లా ఈ కవి వెంపటాపు సత్యం పోరాటాన్ని విన్నాడు. గిరిజనం వెంట నీడలా నడిచిన అతని ధీరత్వాన్ని విన్నాడు. వాళ్లది ఆకలి పోరాటం. మండిన గుండెల పోరాటం. మాడిన డొక్కల పోరాటం. దోపిడీపై పోరాటం. ఆకలి జ్వాలల్లో రగిలిన పోరాటం. ఈ పోరాటాన్ని ఆకలి సత్యం` పోరాటం సత్యం (2 డిసెంబర్, 1971) అని రాశాడు. బలవంతుల రాజ్యంలో నలుగుతున్న జనం గుండె గోసల్ని చిత్రించిన కవిత ఇది.

కామాందుల గుండెల దూసే
గిరిజన చేతులు విసిరిన బాణం
సాయుధ సత్యం
ఆకలి పోరాటంలో చిందిన
గిరిజన నాడుల రక్తం సత్యం
ఆకలి సత్యం (ఎర్రగాలి; 1981, పు. 5)
పోరాటం సత్యం… అన్నాడు.
పేదల బతుకులు మారే పోరుకు గొంతుకలిపాడు. సమసమాజ స్థాపనే అంతిమ గమ్యమని అతనికి తెలుసు. ఈ దీర్ఘకాలిక యుద్ధంలో రాటుదేలే గెరిల్లాల కోసం రక్తగానం (2 ఫిబ్రవరి, 1972) ఆలపించాడు.

”పేదల బతుకును పీల్చే
దోపిడీ రక్తంలో
చురకత్తుల నాట్యం చేయించే
విప్లవ భావానికి
ఉజ్వల శక్తిని కలిగించే
జీవన రణగీతం విరచిస్తున్నా (ఎర్రగాలి; 1981, పు.7)
పీడిత ఆక్రోశం లయగా…” అని రక్తగానం రాశాడు. రాజ్యం ఉక్కుపాదాలకింద పడి నలిగే కోట్లాది జనం గోసను విన్నాడు. శ్రమజీవులందరినీ విప్లవీకరించే పనిలోకి దిగాడు. ఈ దోపిడీని కూల్చందే పేదల బతుకులు మారవని తెలుసు జైరామ్ కు. అందుకే రణ సంగీతం రాజేశాడు. రక్తగానమై పల్లె పల్లెనా మార్మోగాడు. సమాజ తాత్విక పునాదిని, శ్రమ సంబంధాలను అర్థంచేసుకున్నకవి మాత్రమే ఇట్లాంటి పాటల్ని సఈష్టిస్తాడు. జైరామ్ మట్టి మనుషుల గుండె లయల్ని విన్నాడు కనుకే ఇది సాధ్యమైంది.

అప్పటికే అధికార మార్పిడి జరిగి ఇరవై రెండేళ్లయింది. ప్రజల బతుకులేమీ మారలేదు. అదే పాలకవర్గ దోపిడీ. అదే పీడన. అదే అణచివేత.
అధికార మార్పిడినే స్వాతంత్ర్యమని నమ్మిస్తూ జనాన్ని మోసం చేస్తున్న వంచనను ప్రశ్నించాడు కవి. ఎక్కడ చూసినా పదవీ వ్యామోహం. ప్రజాస్వామ్య మాటల మాటున దోపిడీ. హక్కుల కోసం ఉద్యమిస్తున్న ప్రజలపై చట్టబద్ధంగా కొనసాగుతున్న అణచివేత. చరిత్ర పొడవునా ఇదే నీతి. పాలకవర్గ నీతి. దమన నీతి. అసలు ఏది స్వాతంత్ర్యం? ఏది ప్రజాస్వామ్యం?

”చీకటి కరెన్సీని సృష్టించి
అంతర్జాతీయ రవాణాలో
బంగారు గజదొంగల లాలూచీతో
దేశ విదేశీ ద్రవ్యాన్ని బ్యాంకుల్లో దాయడమా స్వాతంత్ర్యం?
పదవుల వేటలో ప్రాంతీయ బేధాలు రెచ్చగొట్టి
మత కలహాల చిచ్చు రగిలించి
పామర ప్రజానీకంతో
పాచికలాడ్డమా ప్రజాస్వామ్యం?
నిజాలు పలుకుతున్న నోళ్లు మూయించి
న్యాయం చేకూరుస్తున్న చేతులు బిగించి (ఎర్రగాలి; 1981, పు. 10)
కటకటాల్లో బంధించడమా స్వాతంత్ర్యం?” అని ప్రశ్నించాడు. మనుషుల మధ్య మతాల చిచ్చుబెట్టి మారణహోమం రేపే రాజ్య స్వభావాన్ని ఏమందాం? ఏ పేరుతో పిలుద్దాం? చట్టబద్ధంగా కొనసాగే దోపిడీని ఏమందాం? హక్కులడిగే ఫ్రశ్నలపై ఉక్కుపాదం మోపేది ప్రజాస్వామ్యమెట్లా అవుతది? ఈ కవిత ద్వారా బూటకపు ప్రజా స్వామ్య నగ్న స్వరూపాన్ని కళ్లముందుంచాడు కవి. నయవంచక నాయకస్వామ్యం గురించి చెప్తూ….

”భూస్వామ్య గుత్తాధిపతుల బొజ్జల్లో
ఖద్దరు లాల్చీల జేబుల్లో
ధనస్వామ్య శాసన మందిరాల్లో్ దాగిందేనా స్వాతంత్ర్యం?
అదేనా ప్రజాస్వామ్యం?
నిజాన్ని చూడలేని పండితమ్మన్యుల
అశాస్త్రీయ గ్రంథాల తేనెపూసిన సూక్తులకు
వర్గ సామరస్యవాదుల అంచనాల వంచనలకు
వాస్తవ దక్పథం లేని రాబందుల రాజకీయపు టెత్తుగడలకు
మోసపోయిన విద్యాధికుడా (ఎర్రగాలి; 1981, పు.11)
కనుల ముందు కదలాడే జీవిత సత్యాన్ని చూడు…” అని పిలుపునిచ్చాడు. ప్రశ్న ఆయుధం కావాలన్నాడు. ఈ దోపిడీ రాజ్యాన్ని కూల్చే దారిలో సాగిరమ్మని పిలుపునిచ్చాడు జైరామ్.

సాయుధ పోరాటమే అసలైన విముక్తి దారి అని స్పష్టంచేశాడు. వర్ణాలు, వర్గాలు, దోపిడీని కూల్చేందుకు సిద్ధమవ్వాలని యువతరానికి పిలుపునిచ్చాడు కవి. సమసమాజ స్థాపనే ధ్యేయంగా ముందుకు సాగాలన్నాడు. ‘ఎర్రగాలి’లో మొత్తం 34 కవితలు. వీటిలో ఏడు పాటలున్నాయి. ఇవన్నీ జానపద బాణీల్లో రాసిన పాటలు.

అవి : 1. మేలుకోరా (కోలాటం బాణీ; ఏకునాదం బాణీ) – 16 ఫిబ్రవరి, 1969

  1. కష్టాలు పోతాయి లెండన్నా ( రాయలసీమ జానపద బాణీ ) – 15 డిసెంబర్, 1970
  2. బజంత్రి కూరిమన్నా (కోలాటం పాట) – 4 జూన్, 1971
  3. తూర్పు దిక్కు ఎర్రబారె – 12 డిసెంబర్, 1971
  4. ఓరన్న జీతగాడ – నవంబర్, 1972
  5. ఎత్తుకోరా సుత్తి – 18 సెప్టెంబర్, 1972
  6. గండ్రగొడ్డలి నూరుకోనా చందమామా – 10 జనవరి, 1973

పాటలు :
‘మేలుకోరా’ అనే పాటలో శ్రమజీవుల్ని తిరుగుబాటు చేయమన్నాడు.
”మేలుకోరా కష్టజీవీ
తెలుసుకోరా సత్యమార్గం…” అని దోపిడీకి గురవుతున్న బడుగు జనానికి అసలు సత్యం చెప్పాడు. దోపిడీ స్వరూపాన్ని విప్పి చెప్పాడు. చేను చెలకల్ని దున్ని పొద్దంతా కష్టం చేసినా బుక్కెడు బువ్వ దొరకని పరిస్థితి రైతన్నలది. ఎర్రటి ఎండల్లో రాళ్లుగొట్టి, ఇటుకలు చేసినా ఉండేందుకు నిలువ నీడకూడా లేని విషాదం.
కోలాటం బాణీలో రాసిన పాట ఇది. 16 ఫిబ్రవరి, 1969న రాసిన పాట ఇది.
”మట్ట మధ్యాన్నాన మండేటి ఎండాలోన
గుండల్లన్ని పగిలించి, బండల్ని తొలిచేసి
సుత్తీతో రాళ్లూ గొట్టి
చెమటలోడ్చిన నీ శ్రమల
ఫలితముదీసి యజమానికిస్తీవి
బొబ్బలెక్కిన చేతిలోని
కూలిడబ్బులు జూసి నీవు (ఎర్రగాలి; 1981, పు. 56)
కుంగిపోతివి గదా అన్నా….” అంటూ శ్రమదోపిడీకి గురవుతున్న కష్టజీవుల జీవితాన్ని చిత్రించాడు.

కష్టాలు పోతాయి లెండన్నా (15 డిసెంబర్, 1970) పాటలో్ విప్లవోద్యమమే ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతుందన్నాడు. ఈ పాటను రాయలసీమ జానపద గీతం బాణీలో రాశాడు. పొలాల్లో రైతుకూలీలు సామూహికంగా పాడుకునే పాట. 15 డిసెంబర్, 1970లో రాసిన పాట ఇది.
”కురిసీన వానలుజూసి కూలోల్లు నవ్వీరన్నా
కురిసీన వానలుజూసి రైతూలు నవ్వీరన్నా..” అంటూ శ్రమజీవులను దోచుకుంటున్న దోపిడీ దొంగల్నీ, షావుకార్లనూ తరిమేందుకు కూలిదండు ఏకమైందన్నాడు.

”కష్టాలు చేసీచేసీ రైతూలు ఏడ్చీరన్న
వడ్డీలు కట్టీకట్టీ పేదోల్లు ఏడ్చిరన్న
కారీన కన్నీరంత కసిబట్టి లేచిందన్నా
పారీన నెత్తురంత పగబట్టి లేచిందన్నా
కన్నెర్రజేసీరన్న కూలోల్ల నాయకులంతా
కన్నెర్రజేసీరన్న రైతూల నాయకులంతా (ఎర్రగాలి; 1981, పు. 58)
నిప్పూలు చిమ్మీరన్న ఊరూరి కూలీలంతా…” ఇది తిరగబడ్డ కూలీల గుండె దరువు. నాగలి సాళ్లలో రైతన్నల పొలికేక. పోరు కేక. ఉత్తర చూసి ఎత్తిన గంపల్లో రగలిన పోరాట నెగళ్లు. కొలిమంటుకున్న జాడల్లో హోరెత్తిన రగల్ జెండా రాగాలాపన. ఈ పాటపై శివసాగర్ ప్రభావం (నర్రెంక చెట్టుకింద నరుడో భాస్కరుడా…) కన్పిస్తుంది.
కోలాటం బాణీలో రాసిన మరో పాట ”బజంత్రి కూరిమన్నా”. ఈ పాటను 4 జూన్, 1971న రాశాడు. ఈ పాటలో రాముడు కేవలం ఒక వ్యక్తి కాదు. పీడిత ప్రజల విముక్తి కోసం పోరుబాటలోకి నడిచే ఉద్యమానికి సంకేతంగా రాశాడు.

”పోలీసులొచ్చినారు పోలీసులొచ్చినారు పొలిమేర నిలిసినారు
బయ్యంగ తిరుగు కొడుకో బాజంత్రి కూరిమన్నా బాజంత్రి కూరిమన్నా
బాజంత్రి కూరిమన్నా బాజంత్రి కూరిమన్నాబలమైన ప్రజల మనిసీ
బయ్యంగ తిరుగు కొడుకో బాజంత్రి కూరిమన్నాబాజంత్రి కూరిమన్నా
పోలీసులొచ్చిరయ్యొ పోలీసులొచ్చిరయ్యొ ఇల్లిల్లు దిరిగిరయ్యొ
బాజంత్రి కూరిమన్నా బాజంత్రి కూరిమన్నా
ఇల్లిల్లు దిరిగిరయ్యొ ఇల్లిల్లు దిరిగిరయ్యొ
రాముణ్ని బట్టిరయ్యొ బాజంత్రి కూరిమన్నా బాజంత్రి కూరిమన్నా
రాముణ్ని బట్టిరయ్యొ రాముణ్ని బట్టిరయ్యొ (ఎర్రగాలి; 1981, పు.60)
బేడీలు ఏసిరయ్యొ బాజంత్రి కూరిమన్నా బాజంత్రి కూరిమన్నా…’ ఈ బాణీలో సాగుతూ చివరికి ఆ రాముణ్ని కాల్చి చంపిన దుర్మార్గ పోలీసుల గురించి చెప్పాడు. ఇది కరుణ రసార్ద్ర గేయం.

ఈ సంకలనంలో కూలిపొయ్యే సంస్కృతి, కలాలకు సంకెళ్లు లేవు, మంటలు, రగిలిన సత్యం, సైనికులని దుస్తులు, నా తరం విప్లవిస్తుంది లాంటి అద్భుతమైన కవితలున్నాయి. తూర్పు దిక్కు ఎర్రబారె, ఓరన్న జీతగాడ, ఎత్తుకోరా సుత్తి, గండ్ర గొడ్డలి నూరుకోనా చందమామా లాంటి అద్భుతమైన పాటలున్నాయి.

ఎర్రగాలి, కవి: జైరామ్, మొదటి ముద్రణ : జులై 1981.

ముకుందాపురం, నల్లగొండ జిల్లా. క‌వి, రచయిత, ప‌రిశోధ‌కుడు. ఇండిపెండెంట్ జర్నలిస్ట్. సాక్షి దిన‌ప‌త్రిక‌లో ఎనిమిదేళ్లు జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేశాడు. 'ఓయూ సాహిత్య వేదిక' వ్య‌వ‌స్థాప‌క స‌భ్యుడు, మొదటి కన్వీనర్. ఉస్మానియా యూనివ‌ర్సిటీ నుంచి 'విప్ల‌వ క‌విత్వంలో వ‌స్తురూప వైవిధ్యం'పై ప‌రిశోధ‌న (పిఎచ్. డి.) చేశాడు. రచనలు : 1. తూర్పార, 2. ఏరువాక (సాహిత్య విమర్శ). 'కొలిమి' వెబ్ మేగజీన్ ఎడిటోరియల్ లో పనిచేస్తున్నాడు.

3 thoughts on “హోరెత్తే ఎర్రగాలి

Leave a Reply