ఎరుక

1
మోదుగు డొప్పలో వెన్నెలను జుర్రుకున్న ఓ నేల
సలుపుతున్న సనుబాల తీపిని
మోస్తుంది

నెత్తుటితో తడిసిన
తంగేడు పూల వనంలో
జీరబోయిన బాలసంతు పాట
గుండె గూటిలో గువ్వై ఒదుగుతోంది

అంటరాని జాతంతా అలలుగా కదుల్తుంటే
మట్టి పొత్తిళ్లలోని తల్లి
మాయిని నెమరేస్తుంది

గడప గడపకు జోలెలో నింపుకున్న కన్నీళ్లు
లిపిలేని బాధను మోస్తున్నవి
ఆకులు అల్లాడుతున్న గీ అడివంతా
కొలుపు గుంతల్ల వెండి కొడవళ్లై పూస్తుంది

మట్టి పాత్రలు బీటలెత్తినపుడు జీవితం ఓ పాచిమడుగు
బుడుంగున మునగాలి
కైగట్టిన పాటకు
డప్పు మీద దరువు మార్చాలి
కులపు ఊబిలో అల్లుకుపోయిన నాచు మధ్య ఎంతకాలం?
జలపాత ప్రవాహాలమై సాగాలి

అర్థంకాని యుద్ధంలో
ఆశల నిచ్చెనలు జారవిడుచుకున్నాక
పొలాల్లో పరిగేరుకుంటున్న కలల్ని
ఈ నేల ముఖచిత్రంగా ముద్రించాలి

2
కాసేపన్నా- కిరీటాల్ని, కీర్తి గానాల్ని
పక్కకు నెట్టి
తడి నెత్తడినే పొదుపుకోవాలి

కవిత్వంలో, జీవితంలో
సాకబోసిన కన్నీళ్లనే ప్రేమించాలి
తగలెట్టాలి – కసిగా
డొల్ల కవిత్వాల్ని, కపట ప్రేమల్ని

పుష్పించాలి కొత్తగా
ఓడిపోయిన వీళ్ల కలల్లో
వెన్నుపాములమై
నెత్తురోడుతున్న మోదుగు పూలమై

ఈ మట్లె మొలిచిన ఆత్మల్ని
మొలుచుకొచ్చిన కన్నీటి కాలం
వెయ్యేండ్ల గాయాల్ని
కెలుకుతుంది

ఇప్పుడిక – బోనం కుండల్లో
చేయి జొనిపి తిన్న వెన్నెల ముద్దల్లేవు
జాతరలో వేలాడదీసిన
చిలుకల దండల్లేవు
దరిద్రాన్ని మరిపించిన మోట పాటల్లేవు

దుక్కులు పూసిన ఆరుద్ర పురుగులు
ఇప్పుడీ నేల నిండా
ముడుపు కట్టిన కుంకుమ గుడ్డలు
మా కలల నిండా
పీనుగులు కాలుతున్న వాసనే మా గతం నిండా

3
మా నమ్మకాల నీటి చెలిమెలను మింగి
మా కాలవల్ని మాయజేసిన
ఈ జెండాలు ముదనష్టంగాను
సిగ్గులేకుండా ఎగురుతున్నయ్
ఇంకా ఈ నేల మీద

కొవ్వు కరగకుండా
మా కలల నిచ్చెనల మీంచి
పదవులెక్కే ఈ తెలివెక్కడిదిరా మీకు?

కంప్యూటర్లు ఒచ్చినయ్
కార్పొరేటు చదువులొచ్చినయ్
ఏటీఎం కార్డులొచ్చినయ్
సాఫ్ట్ వేర్ ఉద్యోగాలొచ్చినయ్

కొత్త రాష్ట్రాలొచ్చినయ్
ఉగాదులొచ్చినయ్ ఉషస్సులొచ్చినయ్
ఎన్నో వసంతాలొచ్చినయ్
మేం మాత్రం
ఎండి మొండాలైన మొదళ్లుగానే మిగిలాం

బుగులు బుగులు అయిన ఈ నేలంతా ఏ తల్లి సాపెనో?
ఈ పీనుగుల పెంటల్లో
జంగమోళ్లమై తిరుగుతున్నం
బొందల గడ్డలకు కాటిపాపలమై కాపలా కాస్తున్నం

నెత్తిన మన్నుబోసుకొని, కడుపు కొట్టుకుంటూ
బోరున ఏడ్వడమే మిగిలింది ఈ గడ్డకు

4
ఇప్పుడు
ఈ భూమిలోంచి ఎక్కడ పిడికెడు మట్టి తీసుకున్నా
ఒరిగిన వీరుల కనుగుడ్లే కదలాడుతున్నయ్
నుజ్జు నుజ్జయిన ఎన్నో జీవాల
ఆత్మ కథలే విన్పిస్తున్నయ్…

జననం: నల్లగొండ. కవి, కథకుడు, విమర్శకుడు. రెండు దశాబ్దాలుగా ఆధునిక సాహిత్యంలోని అనేకానేక అంశాలపై రచనలు చేస్తున్నారు. 'జంగం కథ - ఒక పరిశీలన' అనే అంశంపై పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ఎంఫిల్,  'సమకాలీన తెలుగు వచన కవిత్వం-ప్రాంతీయతా ద్రుక్పథాలు' అనే అంశంపై ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీహెచ్ డీ చేశారు. రచనలు: మొగురం(సాహిత్య వ్యాసాలు). ప్రస్తుతం హైదరాబాద్ లోని నిజాం కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు.

Leave a Reply