కరోనా కాలంలో మళ్ళెప్పుడు కలుస్తమో సార్…

పదిహేడు నెలల క్రితం రాజ్యం కుట్ర చేసి మిమ్ముల జైల్లో పెట్టినప్పుడు ఎంతో కోపమొచ్చింది. జీవితమంతా ప్రజల కోసం పని చేసిన రచయితలను, మేధావులను అక్రమంగా నిర్బంధించి వాడు (రాజ్యం) చారిత్రక తప్పిదం చేసిండనిపించింది. కాని వాడు ఫాసిష్టు అయినప్పుడు మరోలా ఎలా ప్రవర్తిస్తాడు అని కూడా అనిపించింది. ప్రజాస్వామ్యంలోని అన్ని వ్యవస్థలను (మీడియా, న్యాయవ్యవస్థతో సహా) ఆక్రమించి కాషాయపు విషం చిమ్ముతుంటే వాడు పరిపక్వ ఫాసిస్టు దశకు చేరుతుండనుకున్న. దేశవ్యాప్తంగా రాజుకుంటున్న నిరసనలు ప్రతిఘటనా రూపాలు తీసుకుంటే వాడి పతనానికి వాడే పథకం వేసుకున్నట్లు అవుతుందులే అనుకుంటుండగానే కరోనా వచ్చి పడింది.

ఇప్పుడు దేశమే కాదు, ప్రపంచమే ఒక పెద్ద జైలు అయ్యింది. కాని మీమున్న బయటి జైలు కన్నా మీరున్న లోపటి జైలు కిక్కిరిసిపోయి అక్కడ ఈ వైరస్ త్వరగా సోకే అవకాశం ఎక్కువ ఉండటం, మీ వయస్సు రీత్యా అది ప్రాణాంతకంగా కూడా మారే అవకాశం ఉండటంతో మీ గురించి దిగులు పట్టుకుంది. మళ్ళెప్పుడు కలుస్తము? అసలు కలుస్తామా? అని భయంగా ఉంది. దుఃఖంగా ఉంది.

ఎన్ని కత్తుల వంతెనలు దాటి వచ్చారు. ఎన్ని కల్లోల కాలపు కష్టాలకు, రాజ్యహింసకు సాక్షంగా నిలిచారు. ఎంత మంది అమరుల జ్ఞాపకాలను, వాళ్ళ స్వప్నాలను మోసుకు తిరుగుతున్నారు. ఎన్ని ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహించారు. ఎంత మంది మీ సహచర్యంలో అడుగులు వేసివుంటారు. ప్రజల కోసం ఎంతటి అక్షరసాగు చేసివున్నారు. ఎన్ని సముద్రాలను మీ గొంతులో పోటెత్తించారు. కనబడకుండా కాటేయ వెంటాడిన ఎన్ని “కోబ్రాలను”, మాటేసి తిరిగిన ఎన్ని “గ్రీన్ టైగర్స్” ను ఎదిరించి బతికారు. మూడు పోరాట తరాలకు వారధిగా ఉన్న మీ మీద రాజ్యం ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కేసులు పెట్టినా మీరు భాగమైన చరిత్ర నుండి వాడు మిమ్ముల ఒక్క క్షణం కూడా వేరు చేయలేడని తెలుసు. మీ రాజకీయ విశ్వాసాల ముందు వాడు నిలువలేడనీ తెలుసు. మీరు జైల్లోకి పోతూ చిరునవ్వుతో ఎత్తి పట్టిన ఆ పిడికిలి ఈ కాలపు ప్రజా ఉద్యమాల గుర్తుగా మిగిలిపోతుందని తెలుసు. అయినా కరోనా కాలంలో సహితం వాడు మీ మీద కక్ష సాధిస్తుంటే మీకు ఏమవుతుందో అని బెంగగా వుంది.

నాకు తెలుసు మీము మీ గురించి బాధ పడుతుంటే మీరు అండా సెల్ లో బంధీ అయివున్న సాయిబాబ గురించో, ఆదివాసి ఖైదీల గురించో ఆలోచిస్తుంటారు. నిజమే సాయిబాబ విషయంలో కూడా రాజ్యం తన (అమానవీయ) స్వభావాన్ని నిరూపించుకుంటుంది. తాను రోజురోజుకు మృత్యుముఖంలోకి జారిపోతున్నా కనీసం మెడికల్ బెయిల్ ఇవ్వకపోగా తన తల్లి క్యాన్సర్ తో ఉన్నా ఆమెను చూడడానికి కూడా పరోల్ పై అనుమతివ్వడం లేదు. వ్యక్తులపై ఈ విధంగా కక్ష సాధించే రాజ్యం ఒక రాజ్యమేనా?!

చాలా రోజులుగా మీతో కొన్ని ఆలోచనలు పంచుకోవడానికి మీకు కనీసం ఉత్తరమైనా రాసే అవకాశం వుంటే బాగుండు అని అనుకున్న. వాడు మిమ్ముల హేమక్కతోనే వంద సెకండ్ల కంటే ఎక్కువ మాట్లాడనివ్వడం లేదంటే ఇక నా ఉత్తరం మీకు చేరే దారి ఎక్కడుంటదని రాయలేదు. కాని దాదాపు పదేండ్ల కిందట మీరు పౌరహక్కుల సంఘం చరిత్రకు సంబంధించి చెప్పిన ఒక వీడియో పాఠాన్ని నేను మొన్న యూట్యూబ్ లో చూస్తుంటే నా బిడ్డ అక్షర వచ్చి “వీవీ తాత బయటకు వచ్చేశాడా?” అని ఆతృతగా అడిగింది అది లైవ్ వీడియో అనుకోని. “లేదమ్మా ఇంకా రాలేదు. ఇది పాత వీడియో” అని చెప్పగానే “అయితే తాత ఇంకా మంచి పనులు చేయడం మానేయలేదా?” అని అమాయకంగా ప్రశ్నించింది. అంటే ప్రజల కోసం మంచి పనులు చేసే మనుషులను రాజ్యం నిర్బంధిస్తుందని మా చిట్టితల్లికి కూడా అర్థమయ్యింది. నా బిడ్డ ఆ మాట అన్నప్పటి నుండే ఎలాగైనా మీకు ఉత్తరం రాయాలని అనుకున్న. మీకు వ్యక్తిగతంగా రాసి పంపే అవకాశం లేదు కాబట్టే ఇలా “కొలిమి” ద్వార పంపుతున్న. రాయడానికి ఎన్నో వున్నా ఇప్పుడు ప్రపంచాన్ని ఎక్కడికి కదలలేని స్థితికి తీసుకొచ్చిన కరోనా వైరస్ గురించే రాద్దామనుకుంటున్న. బయట ఉన్నంత సమాచారం మీకు లోపల (“బయట” “లోపల” అనే పదాలు జైలు రెఫరెన్స్ గా వాడాల్సి రావడం విచారకరం!) దొరక్కపోవచ్చు అందుకే కాస్త వివరంగానే రాస్తాను. మరోలా అనుకోవద్దు.

మీ మీద మోపబడిన భీమాకోరేగాం కుట్ర కేసు మాదిరిగనే కరోనా వైరస్ పుట్టుక గురించి కూడా అనేక కట్టు కథలు ప్రపంచమంతా చక్కర్లు కొడుతున్నాయి. ముందుగా కరోనా వైరస్ చైనాలోని వూహాన్ అనే పట్టణం లో ఒక వెట్ మార్కెట్ లో అమ్మే జంతువుల నుండి మనుషులకు సోకింది అనే వార్త బయటకు వచ్చింది. మన దగ్గర కూరగాయల మండీ, రైతు బజార్ల మాదిరిగా కేవలం చైనాలోనే కాదు దాదాపు అన్ని ఆగ్నేయ ఆసియా దేశాలలో వెట్ మార్కెట్లు ఉన్నాయి. అక్కడ తాజా కూరగాయలు, పండ్లతో పాటుగా, అక్కడే కోసిన కోళ్ళు, చేపలు, మేకలు, పందులు, కప్పలు, రొయ్యలు, ఇంకా అనేక రకాల జంతు మాంసం కూడా అమ్ముతారు. జంతు మాంసాలు కోసి అమ్మడం మూలంగా అక్కడి ఫ్లోర్ అంతా తడిగా (వెట్) ఉంటుంది. అందుకే వాటిని వెట్ మార్కెట్ అంటరు. ఆ తడి మూలంగా వెట్ మార్కెట్లు కొంత అపరిశుభ్రంగా ఉంటాయి. కాని రకరకాల కూరగాయలు, మాంసం కూడా అక్కడే దొరుకుతాయి. ఎందుకంటే రైతుల నుండే ప్రత్యక్షంగా కొనుగోలు చేస్తారు కాబట్టి. ఈ మార్కెట్ల ద్వారా కోట్లాది మందికి ఉపాధి దొరుకుతుంది. అయితే కేవలం కొన్ని వెట్ మార్కెట్లలోనే వన్యప్రాణులను (మొసల్లను, తాబేళ్ళను, పాములను, జింకలను, ఇంకా అనేక రకాల జంతువులను) అమ్ముతారు. వాటిని వాళ్ళు తరాలుగా తింటూనే వున్నరు. ఇప్పుడు కూడా ఆ అమ్మకాలంతా అక్కడి ప్రభుత్వ అనుమతులతోనే చేస్తున్నారు.

మొదట కరోనా వైరస్ సోకిన వాళ్ళందరు వెట్ మార్కెట్ లో పనిచేసేవాళ్ళు, అక్కడ కొనుగోలు చేసేవాళ్ళు కావడంతో వైరస్ కు ఆ వెట్ మార్కెట్ కు ముడిపెట్టేశారు. అయితే కరోనా వైరస్ గబ్బిలాల నుండి మనుషులకు సోకిందని చెబుతున్నారు. కాని గబ్బిలాలు అక్కడి వెట్ మార్కెట్ లో అమ్మరని వార్తలు వస్తున్నాయి. మరి వైరస్ ఎక్కడి నుండి వచ్చిండొచ్చు? గబ్బిలాల నుండి వన్యప్రాణులకు సోకి వాటి ద్వారా మనుషులకు సోకిందని ఒక అంచనా. కాని దీనికి ఇంకా శాస్త్రీయమైన ఆధారాలు ఏమీ లేవు. అయినా కూడా “చైనా వాళ్ళు అడ్డమైనవన్నీ తిని పాడయితరు” అని కొందరంటుంటే, “వాడెవడో చైనాలా ఏదో తిని చస్తే, ప్రపంచమంతా చేతులు కడుక్కోలేక చావాల్సి వస్తుంది” అని వాట్సాప్ లో జోకులు వేసేవారు ఇంకొందరు. మొత్తానికి చైనా ను ఒక ముద్దాయిని చేసిండ్రు. అమెరికన్ వైట్ హౌస్ కరోనా టాస్క్ ఫోర్స్ కు ముఖ్య సలహాదారుడు ఆంటోనీ ఫౌచీ ఇక ఒక అడుగు ముందుకు వేసి వెట్ మార్కెట్లు మొత్తం వెంటనే మూసివేయాలని డిమాండ్ చేస్తున్నాడు. అసలు అలా మూయాలంటె ప్రపంచవ్యాప్తంగా ప్రజారోగ్యాన్ని ధ్వంసం చేస్తున్న మక్ డోనాల్డ్స్, కోకాకోలా వంటి అనేక కార్పోరేషన్లను మూసేయాలి. ఇక మన పంటలో, వంటలో విషం నింపుతున్న అనేక కార్పోరేట్ కంపెనీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అవన్నీ ఈ సామ్రాజ్యవాద బంటులకు గుర్తుకురావు. ఎందుకంటే అవి వాళ్ళ లాభాలకు సంబంధించినవి కాబట్టి. మృత్యు ముంగిట కూడా మార్కెట్ రాజకీయాలే!

మొదటి కథ మూలంగానే చైనా వాళ్ళను ప్రపంచమంతా “అంటరానివాళ్ళుగా” చూస్తుంటే రెండో కథ బయటకు వచ్చింది. ఈ కథను అమెరికన్ ఇంటెలీజెన్సీ ఏజెన్సీలు వండితే వైట్ హౌజ్ నుండి అధ్యక్షుడు ట్రంప్ ప్రపంచానికి వడ్డించాడు. కథ వెట్ మార్కెట్ నుండి వైట్ హౌజ్ కు మారే సరికి కథ కాస్త కుట్రగా మారింది. కరోనా వైరస్ ను చైనా తమ ల్యాబ్ లో తయారుచేసి ప్రపంచం మీదికి వదిలిందని, అన్ని దేశాలు అల్లాడుతుంటే తాను ప్రపంచ పగ్గాలు చేపట్టాలనే కపటబుద్ధితో ఈ పని చేసిందని అమెరికా అరోపణలు మొదలుపెట్టింది. వీటికి ఎలాంటి శాస్త్రీయమైన అధారాలు లేవు. అయినా కూడా కరోనాను “చైనా వైరస్” అని ట్రంప్ నామకరణం చేయచూసిండు. కాని అది కాస్త దుమారంగా మారడంతో మళ్ళీ మాట సవరించుకుండు. తన ట్వీట్ ను వెనక్కి తీసుకుండు. (ఇప్పుడు యుద్ధాలన్నీ ఆన్ లైన్ లోనే కదా! చివరికి కొన్ని ఉద్యమాలు కూడా ఆన్ లైన్ కే పరిమితమైనయి. అందుకే జేంస్ పెట్రాస్ “ఇంటర్నెట్ మిలిటన్సీ” కాలమొచ్చిందని అన్నాడు. సరే అది వేరే చర్చ).

అయితే చైనా తన దగ్గర ఉన్న సమాచారాన్ని బయటి ప్రపంచంతో సరిగ్గా పంచుకోకపోవడం, వైరస్ మూలాలకు సంబంధించిన వరిశోధనలను నిలిపివేయడం ఎన్నో అనుమానాలకు దారితీస్తుంది. అంతేకాదు చైనాలో ఏర్పాటు చేసిన మొట్టమొదటి Biosafety Lvel 4 ల్యాబ్ కూడా Wuhan Institute of Virology లో భాగంగానే ఉన్నది. (ల్యాబ్ లలో ఎంత ప్రమాదకరమైన వైరస్, బ్యాక్టీరియాల మీదా పరిశోధన చేస్తున్నారు, అక్కడ భద్రత కోసం ఎలాంటి ప్రోటొకాల్స్ వాడుతున్నారు అనేదాన్ని బట్టి ఈ లెవల్స్ నిర్ణయిస్తారు. లెవల్ 4 అనేది అత్యున్నత స్థాయి. ఇండియలో కూడా లెవల్ 4 స్థాయి ల్యాబ్ ఒక్కటే ఉంది. అది పూనెలో వున్న National Institute of Virologyలో ఉంది). అయితే వూహాన్ ల్యాబ్ లో దక్షిన చైనా గుహల్లో పట్టుకొచ్చిన గబ్బిలాల నుండి సేకరించిన కరోనా వైరస్ జన్యు నిర్మాణంపై పరిశోధనలు చేస్తున్నారు. “గబ్బిలాల మహిళ” గా పేరుపొందిన షీ జంగ్ లీ ఆ పరిశోధనలకు నాయకత్వం వహిస్తుంది. ఆమె ఆ పరిశోధనా ఫలితాలను ప్రపంచ ప్రఖ్యాత సైన్స్ జర్నల్స్ లో ప్రచురించారు కూడా. అయితే పరిశోధనా క్రమంలో ల్యాబ్ లో పనిచేసే శాస్త్రవేత్తల ద్వారా వైరస్ బయటకు వచ్చి ఉండొచ్చు అనే మరో కధనం వుంది. దీనికీ ఆధారాలు లేవు. దీనిని ఖండిస్తూ చైనా బయట వుండే అనేక మంది శాస్త్రవేత్తలు ఒక స్టేట్ మెంట్ ను ప్రముఖ సైన్స్ జర్నల్ The Lancet లో ప్రచురించారు. అయినప్పటికి వైరస్ మనుషుల్లోకి ఎలా వచ్చింది అనే రహస్యం తెలుకోవడం అంత తేలికైన విషయం కాదని ఇంతకు ముందు బయటపడిన వైరస్ ల చరిత్ర చెబుతుంది. ఆ రహస్యం బయటపడేవరకు ఎవ్వరికి తోచిన విధంగా వాళ్ళు తమ రాజకీయ ప్రయోజనాలకు అనుకూలంగా కథలు అల్లుతుంటారు. మీడియా తన అవసరాల కోసమే ఆ కథలను ప్రపంచవ్యాప్తం చేస్తుంది.

అసలు సమస్య ప్రకృతిలో వివిధ జంతువులలో ఉండే వైరస్ లు ఏ విధంగా మనుషుల్లోకి ప్రవేశిస్తున్నాయి, దానికి కారణాలు ఏంటి అనేది ముఖ్యం. కరోనా వైరస్ కాకపోతే మరో వైరస్, ఈ రోజు కాకపోతే రేపు, చైనాలో కాకపోతే మరోచోట వచ్చి తీరుతుంది. ఎందుకంటే మనిషికి సోకగల దాదాపు 17 లక్షల వైరస్ లు మన చుట్టూ ఉన్న అనేక జంతువులలో (ముఖ్యంగా క్షీరదాలలో), పక్షుల్లో ఉన్నాయని ఒక అంచనా. వాటిలో ఏవైనా మరో కరోనా రూపంలో రావచ్చు. ఎందుకంటే మనం ప్రకృతిని ధ్వంసం చేసి ఎన్నో రకాల జంతువుల సహజ ఆవాసాలను నాశనం చేసి వాటిని సరుకులుగా చేయడం, వాటి మనుగడకే ప్రమాదంగా మారడం చూస్తున్నాము. మనిషి ప్రకృతిని దానిలోని జీవవైరుధ్యాన్ని (biodiversity) నాశనం చేసి తాను ప్రకృతినే జయించాడని అనుకుంటున్నాడు. కాని తాను ప్రకృతిలో ఒంటరి అవుతున్నాడనే విషయం అర్థం కావడం లేదు. ఈ విపత్తులన్నీ ప్రకృతి పగ పట్టడంతో (nature’s revenge) జరుగుతున్నవి కావు. ప్రకృతిని జయించడానికి దాని మీద హింస కొనసాగిస్తే అది మన మీద ప్రతీకారం తీసుకుంటది అని ఏంగెల్స్ మెటఫోరికల్ గా వాడిన మాట చుట్టూ కొందరు మేధావులు పెద్ద పెద్ద సిద్ధాంతాలు అల్లుతున్నారు. ప్రకృతికి తన ఉద్దేశాలను, భావాలను ప్రకటించుకునే ఒక ఏజెన్సీ వుందని వాదన చేయడం కష్టం. ప్రకృతికి దైవత్వాన్ని, తిరుగుబాటు శక్తిని లేదా భరించే తత్వాన్ని ఆపాదించి పుక్కిటి పురణాలు చెప్పేవాళ్ళు వేరే వున్నారు. అది బుద్ధిజీవులు చేయాల్సిన పని కాదు. ప్రకృతి విపత్తులన్నీ మనిషి తనకు తానుగా చేసుకుంటున్న హాని మూలంగా జరుగుతున్నవే. మనిషంటే ఏ మనిషి? ఏ మనిషి ప్రపంచ మనుగడకు ప్రమాదంగా మారిండు? సునామీలు వచ్చినా, కరోనాలు వచ్చినా వాటికి కారణమై బోనులో నిలబడాల్సిన ఆ మనిషి ఎవ్వరు? ఎవ్వడి అంతులేని ఆశ కోటానుకోట్ల అభాగ్యుల జీవితాలను అంతం చేస్తున్నది? ఇవి కదా అసలైన ప్రశ్నలు.

కరోనా వైరస్ ను సామాన్య చైనా ప్రజల బువ్వ గిన్నెలో కాదు వెతకాల్సింది. మనిషిని, పకృతిని ధ్వంసం చేస్తున్న సామ్రాజ్యవాద పుర్రెలో వెతకాలి. నిజమే, ఇప్పుడు చైనా కూడా ఆ సామ్రాజ్యవాద పుర్రెనే ధరించివుంది. తాను కూడా గుత్తపెట్టుబడి (monopoly capital) రేస్ లో ప్రపంచమంతా పాకుతుంది. మావో మరణాంతరం డెంగ్ అంచెలంచలుగా ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు “మార్క్సిజం” స్థానంలో “మార్కెటిజాన్ని” తెచ్చిపెట్టాయి. సంస్కరణలతో “మార్కెట్ సోషలిజాన్ని” నిర్మాణం చేస్తామని మొదలు పెట్టి “సోషల్ సామ్రాజ్యవాది” (social imperialist)గా మారిపోయింది. చైనాలో ఎరుపును చూసి ఇంకా మురుసిపోయేవాళ్ళు ఉండటం చాలా ఆశ్చర్యమే. చైనా ఇప్పుడు కొనసాగుతున్న సామ్రాజ్యవాద పెట్టుబడిదారీ వ్యవస్థలో ప్రధాన భాగస్వామియే.

చైనా ప్రపంచానికే ఒక పెద్ద ఫ్యాక్టరీ అయ్యింది. చైనా టెక్నాలజీ, ముడిసరుకు లేదా సేవలు ఉపయోగించుకోకుండా ప్రపంచంలో ఒక్క కార్పోరేషన్ కూడా లేదంటే ఆశ్చర్యం కాదు. ముఖ్యంగా ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలలో ప్రతి పెద్ద నిర్మాణం చైనానే చేస్తుంది. అమెరికా చేసుకునే దిగుమతులలో 21 శాతం చైనా నుండే వస్తాయి. ముఖ్యంగా ఫార్మసుటికల్ ఉత్పత్తులను 90 శాతం చైనా నుండే దిగుమతి చేసుకుంటుంది. కరోనా మూలంగా మొత్తం గ్లోబల్ సప్లై చైన్ ఆగిపోయింది. దానితో చైనా నుండి రావాల్సిన మాస్క్ లు, వెంటిలేటర్స్, చివరికి వైరస్ టెస్ట్ చేయడానికి కావాల్సిన స్వాబ్స్ కూడా అమెరికాలో కరువయినయి. క్షణాలలో ప్రపంచాన్ని అంతం చేయగల అణ్వాయిధాలు సమకూర్చుకుంది కాని, ఆపద వస్తే తన ప్రజలకు ఆక్సిజన్ అందించే పరికరాలు లేని, తయారుచేయలేని స్థితిలో అమెరికా ఉంది. డాక్టర్లకు, నర్సులకు, ఇతర వైద్య సిబ్బందికి కావాల్సిన మెడికల్ మాస్కులు (N95 మాస్కులు) కూడా అందుబాటులో లేవు.”కరోనాపై యుద్ధమంటున్నవు, మరి ఏ ఆయుధాలు లేకుండా యుద్ధమెట్ల చేస్తమురా” అని వైద్య సేవలు అందించే వర్కర్స్ అడుగుతుండ్రు. చివరికి ఏ దేశం మీదైతే 1962-71 మధ్య కాలంలో దాడి చేసి 7.5 కోట్ల లీటర్ల విష కెమికల్స్ ను (Agent Orange herbicides) 50 లక్షల ఎకరాల విస్తీర్ణం అడవి మీద, 5 లక్షల ఎకరాల పంట భూముల మీద చల్లి అక్కడి వాతావరణాన్ని నాశనం చేసిందో ఆ దేశమే (వియత్నాం) కష్టాలలో ఉన్న అమెరికా కు ఇప్పుడు 2.5 లక్షల మెడికల్ మాస్కులను విరాళంగా పంపింది. వియత్నాం అమెరికాకు మాస్కులు దానం చేసినట్లే వందల ఏండ్లుగా మీరు అంటరానివాళ్ళు మాకు దూరంగా వుండండని ఊరవతలికి విసిరేయబడిన దళితులు (మాదిగ స్రీలు) మా ఊర్లో ప్రతి వ్యక్తికి మాస్కులు కుట్టి పంచారని మా అమ్మ చెప్పింది. సమాజంలో ఉండే అట్టడుగు మనిషే నిజమైన మానవతావాదని ఎన్నిసార్లు నిరూపించబడిందో కదా!

ఇక ట్రంప్ విషయానికొస్తే ఆయన అనేవన్నీ గాలి మాటలని కొట్టేయడానికి వీలులేదు. ఆయన ప్రతి మాటకు ఒక రాజకీయ ప్రయోజనం పొందాలని అనుకుంటడు. తనని ఇష్టపడని వాళ్ళను, తన అభిప్రాయాలతో ఏకీభవించని వాళ్ళను మెప్పించడం ట్రంప్ నైజం కాదు. ఆయన దృష్టంతా తాను నమ్మే భావజాల పరిధిలో వున్న అమెరికన్ల మీదనే. తన బేస్ కాపాడుకుంటే చాలు మళ్ళీ గెలుస్తాడు. దాని కోసమే ఎప్పుడు ఒక కొత్త శత్రువును నిర్మాణం చేస్తూవుంటాడు. కరోనా ఒక కనిపించని శత్రువని, దాని మీద యుద్ధం చేయాలని ట్రంప్ నుండి మోడీ దాకా ఒక్కటే పాట పాడుతుండ్రు. కాని కరోనా ముసుగులో తమ అసలు శత్రువులను టార్గెట్ చేస్తుండ్రు. కరోనా అమెరికాలో “చైనా వైరస్” అయితే, ఇండియాలో “ముస్లిం వైరస్” అయ్యింది. కరోనా మానవాళికి “శత్రువు” కావడాన్ని వదిలిపెట్టి, తమ శత్రువులను కరోనాలో చూసుకుంటున్నారు.

అసలు కరోనా “కనిపించని శత్రువు” అయ్యిందనడం, దాని మీద యుద్ధం చేద్దామని అనడమే సరయినది కాదు. ఒక వైరస్ ను మానవీకరించడం (personification) దానికి ఒక ఏజన్సీని అంటకట్టడం ఆధునిక ఆలోచనా పద్ధతి కాదు. కవులు, కళాకారులు వైరస్ తో పొంచి వున్న ప్రమాదాన్ని ప్రజల్లోకి తీసుకుపోవడానికి కొంత భావుకతతో ఉపమానాలంకారాలను వాడితే అర్థం చేసుకోవచ్చు. కాని అది కూడా అతి చేస్తే ఎబ్బెట్టుగానే వుంటది. చివరికి ప్రజా పోరాట పాటల బాణీలను కూడా కరోనా కోసం వాడేస్తున్నారు. ఇక కరోనాకు స్త్రీ లింగాన్ని ఆపాదించి, దానిని తన్ని తరుముదాం అని పాటలు, కవిత్వం రాస్తున్నారు. వైరస్ ఆడదెట్లైంది, రాక్షసి ఎట్లైంది అనే ప్రశ్నలు వస్తున్నాయి. నిజమే కదా, అసలు వైరస్ ఆడనో, మగనో కావడమేంటీ. ఆలోచనల వెనుకబాటుతనం కాకపోతె! అయితే తెలుగు భాషకు ఉన్న పరిమితి మూలంగా వైరస్ ను “అది” అనడం స్రీలను కించపరచడం కాదనే నా అభిప్రాయం. కాని స్రీలపై ఉపయోగించే పితృస్వామ్య పదాలను వైరస్ కు వాడడం తప్పే అవుతుంది. ఇక “గో కరోనా గో” అంటూ ర్యాలీ తీసే వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటె అంత మంచిది. ఎందుకంటే అసలు వైరస్ అంటే ఏంటిదో వాళ్ళకు తెలిసినట్లు లేదు. వీళ్ళు చంపడానికి అసలు వైరస్ ప్రాణమున్న జీవి కాదు. ప్రాణంతో లేని దాన్ని ఎలా చంపగలరు?

“వైరస్” అనే పదం లాటిన్ మూలాల నుండి వచ్చింది. లాటిన్ లో దాని అర్థం “విషం”. జీవావరణవ్యవస్థలో (ecosystem) వైరస్ లేని ప్రాంతం లేదు. కోటాను కోట్ల వైరస్ లు వున్నాయి. వాటితో కేవలం మనుషులే కాదు, మిగతా జీవరాశులు, మొక్కలు కూడా చరిత్ర పొడువునా సహజీవనం చేస్తున్నాయి. ఇప్పటి వరకు జంతువుల నుండి మనిషిలోకి వైరస్ రావడం మూలంగానే (zoonosis) పెద్ద ఎత్తున అంటువ్యాధులు వస్తున్నాయి. అయితే వైరస్ ను మొదటిసారిగా 1892లో డ్మిట్రీ ఇవనోవిస్కీ అనే రష్యన్ శాస్త్రవేత్త పొగాకు ఆకులపై ఉండే “Tobacco Mosaic Virus” ను కనుగున్నాడు. దానికి “వైరస్” అని పేరుపెట్టింది మాత్రం డచ్ శాస్త్రవేత్త మార్టినస్ బేజేరింక్ (1898లో). అయితే వైరస్ లక్షణాలను మాత్రం 1935లో వెండెల్ స్టాన్లీ అనే అమెరికన్ శాస్త్రవేత్త కనుగొన్నారు. వైరస్ ను ఒక జీవరసాయన మూటగా (biochemical package) నిర్ధారణ చేశారు. వైరస్ లో ఎలాంటి జీవకణం (cell) వుండదు. దానికి జీవం ఉండదు. అందుకే స్టాన్లీ వైరస్ మీద చేసిన పరిశోధనలకు జీవశాస్త్రంలో కాకుండా రసాయనశాస్త్రంలో నోబెల్ బహుమతి వచ్చింది. దాని నిర్మాణం కూడా చాలా సాధారణంగా ఉంటుంది. ఒక ప్రోటీన్ షెల్ (capsid), దాని లోపల DNA లేక RNA తో కూడిన న్యూక్లిక్ ఆసిడ్. కొన్ని వైరస్ లలో తన షెల్ చుట్టూ ఒక కొవ్వు పదార్ధపు కవర్ (envelope) ఉంటుంది. అంతకు మించి ఏమి వుండదు. పై కవర్ కొవ్వు పదార్థం కాబట్టి సబ్బుతో చేతులు కడుకుంటే అది ధ్వంసం అయిపోతుంది. (మన ఇండ్లల్లో సబ్బు పెట్టి గిన్నెలు తోమితే నూనె పోయినట్లు ).

మరో విషయం ఏమంటే వైరస్ దానంతటికి అది మరోదాన్ని ఉత్పత్తి చెయ్యలేదు. అలా చెయ్యాలంటే దానికి ఒక జీవకణాలున్న జీవి కావాలి (host). అయితే వైరస్ ఒకసారి హోస్ట్ జీవకణంలోకి వెళ్ళగానే దానిని పూర్తిగా హైజాక్ చేస్తుంది. అంతటితో ఆగకుండ ఆ జీవకణాన్ని ఆధారం చేసుకోని కోట్ల వైరల్ కణాలను ఉత్పత్తి చేసి శరీరంలోని అన్ని జీవకణాలను ఆక్రమించుకుంటూ పోతుంది. దాని ద్వారా మన శరీరంలోని ఒక్కో అవయవాన్ని వైరస్ తన వశం చేసుకుంటుంది. అయితే ఒక శరీరం నుండి మరో శరీరంలోకి పోవాలంటే మాత్రం దానికి ఒక వాహకం (vector) కాని (ఉదాహరణకు దోమలు, నల్లులు), ప్రత్యక్షంగా తాకడం కాని, లేదా ఆహారం, నీళ్ళు కాని కావాలి. కరోనా వైరస్ మరో వాహకం ద్వార కాని, ఆహారం, నీళ్ళ ద్వారా కాని వ్యాపిస్తున్న ఆధారాలు లేవు. ఎవరైనా మన మీద తుమ్మినా, దగ్గినా, గాలి వదిలినా లేదా దానిని ప్రత్యక్షంగా తాకి ముక్కు, నోరు, కండ్ల ద్వారా మన శరీరం లోకి ప్రవేశపెట్టడం ద్వారనే సోకుతుందని నిర్ధారణ జరిగింది. అలాంటి ఏ అవకాశం లేకపోతే అది ఇక ముందుకు పోదు. దాని వ్యాప్తిని కొంతవరకు కట్టడి చేయవచ్చు. ఆలోపు దానిని తట్టుకునే శక్తిని (వాక్సిన్ల ద్వార) మనమైనా పెంచుకోవాలి, లేదంటే దానిని కట్టడిచేసే మందులైనా కనిపెట్టాలి. ఈ రెండూ వెంటనే అయ్యే పనులు కాదు. కాని మాట మాట్లాడితే మార్స్ (అంగారకుడు) మీదికి పోతం, చంద్రుని మీద నీళ్ళు తొవ్వుతం అని చెప్పే వాళ్ళకి ఇది ఎందుకు అంత పెద్ద కష్టం అనే ప్రశ్న రావడం సహజం. దాని గురిచి కూడా కాసేపు ఆగి మాట్లాడుకుందాం.

ఆశ్చర్యంగా ఉండొచ్చు కాని వైరస్ గురించి చదువుతున్నప్పుడు “వైరస్” స్థానంలో “పెట్టుబడి” గుర్తుకొస్తావుంది. పెట్టుబడి కూడా తనంతట తానుగా అభివృద్ది చెందదు కదా. మారకం (exchange) లేకపోతె పెట్టుబడి ముందుకు సాగదు, లాభాలు రావు, మరింత పెట్టుబడి పోగు కాదు. పెట్టుబడిదారీ వ్యవస్థ కూడా వైరస్ మాదిరిగానే ఒక పరాన్న వ్యవస్థ. అంతేకాదు వైరస్ ఏ విధంగానైతే తాను ఆక్రమించిన అవయవాలను నాశనం చేస్తుందో అలాగే పెట్టుబడి కూడా తాను వెళ్ళిన ప్రతి సామాజిక రంగాన్ని ధ్వంసం చేస్తూ పోతుంది. పెట్టుబడి చుట్టూ నిర్మించబడే (బూటకపు) ఉదారవాద, ప్రజాస్వామిక విలువల మాదిరిగానే కరోనా వైరస్ కూడా స్థాయితో సంబంధం లేకుండా ఎవ్వరికైనా సోకవచ్చు అనేది వాస్తవం. అయితే బూర్జువా ప్రజాస్వామ్యం మాదిరిగానే “కరోనాస్వామ్యం” కూడ అపసవ్యంగానే ఉంది. ఎందుకంటే అమెరికాలో నల్లజాతీయులు, లాటిన్ అమెరికన్ జాతీయులు లేదా వాళ్ళ సంతతి, పేదరికంలో ఉన్న ఇతరులు కరోనా బాధితులు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రాధమిక పరిశోధనలు ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నాయి. దీనికి కారణం కరోనా కంటే ముందే వాళ్ళను పేదరికం అనే వైరస్ కాటేసి వుంది. వాళ్ళ రోగనిరోధక శక్తిని దెబ్బతీసి వుంది. అనేక దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడుతున్నారు. లాక్ డౌన్ పరిస్థితుల్లో కూడా పని చేయకపోతే పూట గడవని స్థితిలో వున్నది కూడా వాళ్ళే. అమెరికాలో అమలవుతున్న structural racism దానికి వర్గంతో ఉన్న సంబంధం అర్థం అయితే కాని కరోనా బాధలు సరిగ్గా అర్థం కావు.

ఒక కరోనా బాధితుడు చనిపోతాడని తెలిసి అతనికి చివరి కోరిక ఏదైనా వుందా అని అడిగితే “నేను చనిపోయాక నా బిల్లు ఎవ్వరు కడుతారు?” అని అడిగాడట. తాను చనిపోతే ఆ మెడికల్ ఖర్చుల భారం తన కుటుంబం మీద పడుతదేమో అనే భయంతో ఆ ప్రశ్న అడిగివుంటాడు. చావులో కూడా వ్యక్తి జాతి, వర్గం వెంటబడుతుంది ఈ దేశంలో. అయినా ఇవేవి మనుషుల కదిలించే విషయాలు కావు ఈ సమాజంలో. ఎందుకంటే ఆస్తి ఎంత వ్యక్తిగతమో, ఆరోగ్యము అంతే. నా పరిశోధనలో భాగంగా ఒక కాన్సర్ పేషంట్ ను ఇంటర్వ్యూ చేస్తే ఆమె చెప్పిందేమంటే “నేను కాన్సర్ బారినుండి బయట పడినా, నా ట్రీట్మెంట్ కు అయిన ఖర్చు నన్ను తప్పక చంపేస్తది” అని. అంటే ఈ వ్యవస్థ కాన్సర్ కంటే భయంకరమైనది. అమానవీయమైనది. మన వాళ్ళకు అమెరికా అంటే అదెదో “భూతలస్వర్గం” అనే భావన ఎప్పటినుండో ఉంది. కాని వాస్తవాలు చాలా విరుద్ధంగా, కఠోరంగా ఉంటాయి. 2019 సర్వేల ప్రకారం 78 శాతం వర్కర్స్ తమ నెల నెలా వచ్చే జీతం మీదనే ఆధారపడి బతుకుతారు. నలుగురికి ఒక్కరు మాత్రమే ప్రతి నెలా కొంత సేవింగ్ లో పెట్టగలరు. 40 శాతం మందికి అనుకోకుండా $400 డాలర్ల (దాదాపు 28 వేల రూపాయలు) అత్యవసర ఖర్చు వస్తే ఏమి చేయ్యాలో తెలియని పరిస్థితి. ఈ దేశ సంపదంతా మొత్తంగా 1 శాతం వున్న సంపన్నుల చేతుల్లోనే వుంది. అందుకే 1:99 ఉద్యమం మొదలయ్యిందని మీకు తెలుసు. ఇటువంటి పరిస్థితుల్లో కరోనా విజృంభన. ఇక ఆలోచించండి.

అంతేకాదు కెనేడియన్ ఉద్యమకారిని, రచయిత నయోమీ క్లైన్ తన Shock Doctrine లో విశ్లేషించినట్లు ప్రతి సంక్షోభాన్ని తన ప్రయోజనాలకు అనుకూలంగా మలుచుకునే పెట్టుబడిదారి వ్యవస్థ ఈ విపత్తులో కూడా అదే పనిలో వుంది. ఈ పద్ధతిని ఆమె disaster capitalism గా పేర్కొంది. కరోనాకు ముందే సంక్షోభంలో ఉన్న అనేక కార్పోరేషన్లు ఇప్పుడు విపత్తును అడ్డం పెట్టుకోని stimulus package పేరిట ప్రభుత్వం నుండి భారీగా ప్రజల సొమ్ముతో బతికేయ చూస్తున్నాయి. కార్పోరేట్ ఆస్తులకు, లభాలకు రక్షణ కల్పించే ప్రభుత్వాలు వాటికి నష్టాలు వస్తే మాత్రం వాటిని ప్రజల సొమ్ముతో పూడుస్తారు. ఇదే కదా బూర్జువా రాజ్య స్వభావం. మనం సామ్రాజ్యవాద పెట్టుబడిని కనబడని శత్రువని చెప్తూవస్తున్నం. కాని ఇప్పుడు సామ్రాజ్యవాదులు, దళారీ పెట్టుబడిదారులు, బూర్జువా పాలకులందరు వైరస్ ను కనబడని శత్రువని ఒక్కటే మాటగా అంటుండ్రు. ఇక ఆ “శత్రువుని” అడ్డం పెట్టుకోని ప్రజల మీద ఎంత అణిచివేత కొనసాగించినా దానికి పౌరసమాజ మద్దతు దొరుకుతుందని పాలకులకు తెలుసు. అందుకే అన్ని సమస్యల నుండి ప్రజల దృష్టిని మల్లించి కరోనా పునాదుల మీద తమ అధికారాన్ని మరింత పదిలం చేసుకుంటున్నారు. తాము అమలు చేయదలిచిన ప్రజావ్యతిరేక పాలసీలను, ప్రాజెక్టులను ఇదే అదనుగా ఆచరణలోకి తెస్తారు.

మీకు జైల్లో ఎంత సమాచారముందో నాకు తెలియదు కాని కరోనా వైరస్ సోకితే దాదాపు పద్నాలుగు రోజుల లోపు (incubation period) దాని వ్యాధి (కోవిడ్-19) లక్షణాలు బయటపడొచ్చు. కాని కరోనా దెబ్బకు ప్రపంచ పెట్టుబడిదారి వ్యవస్థ ఒక వారం, పది రోజుల్లోనే తన నిజస్వరూపాన్ని, తనలోని వైరుధ్యాలను, తానెంత పెళుసైనదో (fragile), తన రోగ లక్షణాలన్నింటిని ప్రపంచానికి నగ్నంగా బయటపెట్టుకుంది. అన్ని ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలుతున్నాయి. అధునిక చరిత్రలో ఇంత తొందరగా ఇంత పతన స్థాయికి పెట్టుబడిదారి వ్యవస్థ ఎప్పుడు పడిపోలేదని ఆర్థికవేత్తలు అభిప్రాయబడుతున్నారు. 1930లో వచ్చిన తీవ్ర ఆర్థక మాంద్యం (Great Depression), ఆ తర్వాత వచ్చిన ఆర్థిక సంక్షోభాలు (recessions) ఇంత త్వరగా ఎప్పుడూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చలేదు. ఈ పరిస్థితిని గమనిస్తున్న కొందరు మార్క్సిస్టులు సహితం ఇంతటితో పెట్టుబడిదారి వ్యవస్థ పతనమై కమ్యూనిజానికి దారులు పడుతాయని అత్యుత్సాహంతో జోష్యం చెబుతున్నారు. జోష్యమని ఎందుకంటున్నానంటే వారి ఆలోచన చారిత్రిక భౌతికవాద ప్రాధమిక సూత్రాలకే వ్యతిరేకమయినది. వాస్తవానికి కమ్యూనిజం రావడం అటుంచి బూర్జువా రాజ్యాలు కరోనా సందర్భంగా మరింత అధికారవాద (authoritarian) లేదా ఫాసిస్టు రాజ్యాలుగా మారే అవకాశం వుంది. ఆ దిశగా అడుగులు పడటం ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే మొదలయ్యింది.

వాస్తవానికి ప్రపంచం ఎప్పుడూ ఒక విపత్కర పరిస్థితిలోనే (chronic pandemic) వుంది. పేదరికం, అనారోగ్యం, అంటురోగాలు, నిరుద్యోగం, అనేక రకాల హింసలు నిరంతరంగా కొనసాగుతున్న విపత్తులే. కాని ఇవి పెట్టుబడి కోటలను కూల్చలేదు కాబట్టి వాటికి అంతగా ప్రాముఖ్యం ఇవ్వలేదు. కాని కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తిని, పంపిణీని, వినిమయాన్ని దాదాపుగా నిలిపివేసింది. అంతేకాదు ద్రవ్య పెట్టుబడి చరిత్రలో ఎప్పుడు లేనంతగా పతన స్థాయికి పడిపోయింది. దీనితో ముఖ్యంగా అమెరికాలో నిరుద్యోగం ఇప్పటికే 20 శాతానికి చేరింది. ప్రతి వారం కొన్ని లక్షల్లో ఉద్యోగాలు పోతున్నాయి. మరో రెండు నెలల్లో Great Depression కాలం లో ఉన్న నిరుద్యోగ శాతాన్ని (25%) మించిపోతుందని ఒక అంచనా. 1930లలో ఆర్థిక సంక్షోభం నుండి బయట పడడానికి అమెరికా “న్యూ డీల్” పథకాలను అమలుచేసింది. దాని మూలంగా ప్రభుత్వం ప్రజలకు ఉపాధి కల్పించే ఎన్నో పథకాలను తెచ్చింది. అనేక ప్రభుత్వ రంగ నిర్మాణాలను చేసింది. సామాజిక భద్రత చట్టం లాంటి అనేక సంక్షేమ చట్టాలను తెచ్చింది. ఒక అడుగు సంక్షేమం వైపు వేసి ఆర్థిక వ్యవస్థ కొంత కోలుకోగానే 1970 ల నుండి పాత దోపిడీ పద్ధతులను కొత్త రూపంలో (నయాఉదారవాద రూపంలో) ప్రవేశపెట్టి సమాజాన్ని 1:99 కు నెట్టివేసింది. కేవలం 1 శాతం సంపన్నులు మిగిలిన 99 శాతాన్ని నియంత్రిస్తున్నారు కాబట్టే ఆ ఒక్క శాతం ప్రతినిధి ట్రంప్ అధ్యక్షుడు కాగలిగాడు. మళ్ళీ గెలిచినా ఆశ్చర్యం లేదు.

నయాఉదారవాదం (neoliberalism) కేవలం ఆర్థిక వ్యవస్థకే పరిమితం కాలేదు. అదొక భావజాలమయ్యింది. పరిపాలనయ్యింది. ప్రజల నిత్యజీవితంలో భాగమయ్యింది. అందుకే సోషల్ డెమాక్రసీ గొంతుక వినిపించిన బెర్నీ సాండేర్స్ ను కరడుగట్టిన కమ్యూనిస్ట్ గా భ్రమ పడి అధ్యక్ష పదవి పోటీలో లేకుండ చేశారు. నయాఉదారవాదం ప్రభావితం చెయ్యని రంగమంటూ లేదు. విద్యా, వైద్యం కూడా ఆ ప్రభావానికి లోనయినయి. సైన్స్ రీసర్చ్ ఒక వ్యాపారమయ్యింది. మార్కెట్ లో దేనికైతే విలువుంటుందో అదే జ్ఞానమయ్యింది. దానితో శాస్త్రవేత్తలు కూడా చిన్నపాటి వ్యాపారులయ్యారు. పేటేంట్స్ కోసం పోటీలో మునిగిపోయారు. ప్రాధమిక పరిశోధన పనికిరాని పనిగా మారిపోయింది. ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్స్ తగ్గిపోయి ప్రైవేట్ సంస్థల చుట్టు, ధాతృత్వసంస్థల చుట్టు శాస్త్రవేత్తలు తిరుగుతున్నారు. వాళ్ళకు ఏది అవసరమో ఆ పరిశోధనే చేస్తున్నారు. కరోనా సంక్షోభంలో ప్రజలకు ఇస్తున్న సలహాలు, చేస్తున్న పరిశోధనలు సహితం మార్కెట్ విలువలకు లోబడే జరుగుతున్నవి. ఇంకా మిగిలివున్న ప్రజా ప్రయోజనాలు కోరుకునే శాస్త్రవేత్తలు తమ నిరసన గళాలు వినిపిస్తున్నా వాళ్ళ గోడు వినేవారు తక్కువే.

ఈ సందర్భంలో నాకున్న ఒక అనుభవం మీతో చెప్తాను. నేను గత ఐదు సంవత్సరాలుగా “Science Beyond the Lab” అనే ఒక పిహెచ్ డి కోర్స్ ను తయారుచేసి టీచ్ చేస్తున్నాను. నా క్లాస్ లో యువ శాస్త్రవేత్తలు, డాక్టర్లు విద్యార్థులుగా ఉంటారు. ఆ క్లాస్ లో మొదటి మూడు వారాలు ప్రపంచ రాజకీయార్ధిక అంశాలు చెప్పి ఆ దృక్పధంలో నుండి సైన్స్ ను ఎలా అర్థం చేసుకోవాలో చెబుతాను. అయితే నా విద్యార్థులు ఆ మొదటి మూడు వారాలు “అసలు వీడి బాధేంది. మాకు ఈ సోదేంది” అన్నట్లు మొఖం పెడుతుండేవాళ్ళు. అయినా నా పద్ధతి మార్చుకోలేదు. ఎందుకంటే నేను ఆ కోర్స్ ఏర్పాటు చేసిందే శాస్త్రవేత్తలకు సమాజాన్ని, రాజకీయాలను పరిచయం చేద్దామని. అయితే గత నెల రోజులుగా నా పాత విద్యార్థుల నుండి మెస్సేజెస్ వస్తున్నాయి. “మీరెందుకు సైన్స్ ను, వైద్యాన్ని సామాజిక, రాజకీయార్థిక కోణంలో చూడాలని చెప్పారో ఇప్పుడు అర్థమవుతుంది” అని. కొందరు పాత నోట్స్ మళ్ళీ తిరిగేస్తున్నామని రాశారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ సంక్షోభం ప్రజల గొంతుకై మాట్లాడే వాళ్ళందరికి ఒక అవకాశాన్ని ఇస్తుంది, ఆ గొంతుకలను వినే మనుషులను ఈ వ్యవస్థే పుట్టిస్తుంది. ఒక రకంగా ఇది ఉద్యమాలకు మంచి సందర్భాన్ని ఏర్పరుస్తుంది. అయితే ఇప్పుడు అందరిలోనూ ఉన్న పెద్ద ప్రశ్న ఏమంటే: ఎప్పుడు మళ్ళీ సాధారణ పరిస్థితి వస్తుంది అని. దీనికి సమాధానంగా విజయ్ ప్రసాద్ ఒక మంచి మాట చెప్పాడు. అదేమంటే “we won’t get back to normal, because normal was the problem.” మరి మరో కొత్త స్థితిని (new normal) తీసుకురావడానికి ఉద్యమ శక్తులు ఎంత ఐక్యంగా పోరాడుతాయన్నదే ఇప్పుడున్న ప్రధానమైన ప్రశ్న.

మీకు తెలిసిందే అయినా నాకు నేను గుర్తు చేసుకోవడం కోసం రాస్తున్న. చైనీస్ భాషలో సంక్షోభం (crisis) అనే పదాన్ని రెండు అక్షరాలు ఉపయోగించి రాస్తారు. అయితే ఆ రెండు అక్షరాలకు విడివిడిగా రెండు అర్థాలు ఉన్నాయి. ఒక అక్షరం (危) అర్థం ప్రమాదం. మరో అక్షరం (机) అర్థం అవకాశం. ఈ సంక్షోభం కూడా ప్రజలకు, ఉద్యమకారులకు ఎంత ప్రమాదమో, అంతే అవకాశాన్ని ఇస్తుంది. ఈ చారిత్రక సందర్భంలో మీరు, మీ సహచరులు నిర్బంధంలో ఉండడం ప్రజా ఉద్యమాలకు పెద్ద నష్టం. అయితే మీ అందరి స్ఫూర్తితో ప్రజలు ఉద్యమిస్తారనే ఆశ వుంది. మీరు త్వరగా, ఆరోగ్యంగా బయటకు రావాలన్నదే మా ఆకాంక్ష.

మీ ఆత్మీయ ఆలింగనం కోసం ఎదురు చూస్తూ…

పుట్టింది చారకొండ (పాలమూరు). పెరిగింది అజ్మాపూర్ (నల్లగొండ). సామాజిక శాస్త్ర విద్యార్థి, ప్రజా ఉద్యమాల మిత్రుడు. అమెరికాలో అధ్యాపకుడిగా, పరిశోధకుడిగా పనిచేస్తున్నాడు.

Leave a Reply