ఎక్కడి రాజన్నరో, ఎవ్వని రాజన్నరో

సమకాలీనంలో కొన్ని వెంటాడే సన్నివేశాలు:
పాలమూరి గడ్డమీది నుండి షర్మిల మాట్లాడుతుంది. పాత మాటలే మాట్లాడుతుంది. తెలంగాణ ఉద్యమకాలంలో కేసీఅర్ ప్రతి వేదిక మీద చెప్పిన మాటలే. కాలం మారింది కాని మాటలు మారలే. “ఇంకెన్నాళ్ళు ఈ వలస బతుకులు. బొగ్గుబాయి, బొంబాయి, దుబాయి. ఈ వలసలు ఆగుతయి అన్నారు కదా. మరేమయ్యింది.” ఎంత న్యాయమైన ప్రశ్న కదా!

నిరుద్యోగుల కోసం లోటస్ పాండ్ లో చేపట్టిన దీక్షలో ఏపూరి సోమన్న అమరుల త్యాగాలను కీర్తిస్తున్నాడు. షర్మిల కన్నీరు కారుస్తుంది. ఒక చేత తన కంట నీరు తుడుచుకుంటూనే మరో చేత తన పక్కనే కూర్చొని వున్న ఒక అమరుడి తండ్రి కన్నీరు తుడుస్తూ ఓదారుస్తుంది. ఎంత కరుణామయి కదా!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందర్భంలో “జగనన్న వస్తాడూ రాజన్న రాజ్యం తెస్తాడూ” అని ప్రచారం చేసిన షర్మిల ఇప్పుడు తెలంగాణలో తానే రాజన్న రాజ్యాన్ని తెస్తానని ప్రకటిస్తుంది. ఆమెను ఆహ్వానిస్తూ కొందరు తెలంగాణ కవిగాయకులు ఎగిరెగిరి గానం చేస్తున్నారు. కొందరు దళిత, బహుజన మేధావులు ఎదురెళ్ళి ఆహ్వానిస్తున్నారు. షర్మిలలో సమ్మక్క, సారలమ్మలను, చాకలి అయిలమ్మను పోల్చుకుంటున్నారు. ఎంతటి వింత పోకడల విచిత్ర కాలం కదా!

ఈ సంఘటనలన్నీ జరగక ముందు దాదాపు ఒక సంవత్సరం క్రితం కేసీఅర్ ఒక రైస్ మిల్లర్ తో జరిపిన ఒక ఫోన్ సంభాషణ బయటకు “లీక్” అయ్యింది. అందులో ఒక సందర్భంగా గౌరవనీయ ముఖ్యమంత్రి గారు గల్ఫ్ దేశాలకు బతుకుదెరువు కోసం వలస పోయిన కార్మికులను ఉద్దేశించి ఒక మాట అంటారు: “సోమరిపోతులు. దుబాయి పోతరు గాడిదికొడుకులు… పిచ్చిముండా కొడుకులు ఉన్న ఊరినిడిచిపెట్టి పోతరు.” పాలకవర్గాలకు కాలం కలిసొస్తే ఎంత కండకావరం పెరుగుతుంది కదా!

ఈ సంఘటనలన్నింటికి కపట బూర్జువా రాజకీయాలు పునాదిగా వున్నాయి. వాటిని రాజకీయార్థిక, సామాజిక కోణాల నుండి విశ్లేషించవచ్చు. కాని అంతకన్నా లోతైన జీవిత అనుభవం నుండి కూడా చూడడం అవసరం. ఈ సందర్భంగా పదిహేను సంవత్సరాల కిందటి ఒక నా అనుభవాన్ని పంచుకుంటాను.

2006వ సంవత్సరం. అంటే రాజన్న పరిపాలనా కాలం. అప్పుడు నేను కెనడాలో పి హెచ్ డి చేస్తున్న. అందులో భాగంగా ఆరు నెలలు ఇండియాలో క్షేత్రస్థాయి పరిశోధన చేయాలని ప్లాన్ చేసుకున్న. దానికి తగ్గట్లుగా ప్రయాణ ఏర్పాట్లన్నీ చేసుకున్న. ఇక ఇండియా ట్రిప్ అంటేనే ముందు షాపింగ్ తో మొదలవుతుంది. అయితే “ఈసారి ఎలాంటి షాపింగ్ అవసరం లేదు, అక్కడ అన్నీ దొరుకుతున్నాయి కదా” అని నా భార్య సునితతో అన్నాను.

ఆమె వెంటనే “నీకేంది బాగనే అంటవు. ఎవ్వరికి ఏమి తీసుకోకుండా ఎట్ల పోతం” అని నా ప్రతిపాదనపై చర్చ లేకుండానే కొట్టిపారేసింది.

“అదికాదు ఎప్పుడు ఇదే పనా. ఇక్కడ షాపింగ్ చేసుకోని ఆడికి పోతం. అక్కడ షాపింగ్ చేసుకోని ఈడికొస్తం. ఇదర్ కా మాల్ ఉదర్. ఉదర్ కా మాల్ ఇదర్. ఆడికీడికి సరుకులు మోసుడే. బతుకంటే షాపింగే అయ్యింది…” అని నేను ఏదో చెబుతుండగానే “సరేపో నీ పేపర్ల పనేదో చూసుకోపో ముందు. ఇవన్నీ తర్వాత చెబుదువు” అని నా మాటను మధ్యలనే కట్ చేసింది. అప్పుడే నాకర్థమయ్యింది. మళ్ళీ ఎప్పటి వ్యవహారమే అని. నాకు డబ్బుల ఖర్చు కన్నా బరువులు సరిచేస్తూ బ్యాగులన్నీ సర్దడం ప్రతిసారి ఒక పెద్ద తలనొప్పి. ఇక ఈసారి తీసుకుపోవడానికి నా రీసర్చ్ మటీరియల్, పుస్తకాలు చాలా వున్నవి. తిప్పలు తప్పవని తెలిసిపోయింది.

అనుకున్నంత పనే అయ్యింది. కొన్న గిఫ్టులతో, మా బట్టలతో అన్ని సూట్ కేస్ లు ఎయిర్ లైన్స్ వాళ్ళ పరిమితిని మించి బరువయినయి. అష్టకష్టాలు పడి ఎలాగో అలా సర్దినం. ఇక నా పుస్తకాలను, మెటీరీలియల్ మెత్తాన్ని నా బ్యాక్ ప్యాక్ లో కుక్కిన. ఎందుకంటే దాని బరువు చూడరనే ఒక నమ్మకం. అది దాదాపు పదిహేను కిలోల వరకు అయ్యింది. నేను అనుకున్నట్లే ఎడ్మంటన్ ఎయిర్ పోర్ట్ లో నా బ్యాక్ ప్యాక్ బరువు చూడలేదు. “ఇక బతికి పోయినం పో” అనుకుని ఊపిరి తీసుకున్నం. ఎడ్మంటన్ నుండి హైద్రాబాద్ కు మధ్యలో మాకు దుబాయ్ ఒక స్టాప్ వుంది. దాదాపు నాలుగు గంటల విరామం దొరుకుంది అక్కడ.

ప్రయాణ ఒత్తిడి మూలంగా బాగా అలిసిపోయి వున్నాం కాబట్టి విమానం ఎక్కగానే నిద్రపోయాము. దానితో ఎడ్మంటన్ నుండి దుబాయ్ కి ప్రయాణం చేసినట్లే అనిపించలేదు. కాని ఇండియా దగ్గరికి వచ్చి మరో నాలుగు గంటలు వేచివుండాలంటేనే చిరాకుగా వుంది. చేయడానికి ఏమి లేక మెయిన్ గేట్ కు దగ్గర్లో కూర్చొని వచ్చిపోయేవాళ్ళను చూస్తున్నాము.

కాసేపయిన తర్వాత ఒక రెండు వందల అడుగుల దూరంలో ఒకతన్ని పోలీసులు చేతులకు సంకెళ్ళతో తీసుకొచ్చి అక్కడ ఎయిర్ పోర్ట్ అధికారులతో ఏవో ఫార్మాలిటీస్ పూర్తిచేసి లోపలికి వదిలిపెట్టారు. ఇక అక్కడి నుండి అతను లోపలికి మెల్లగా నడుస్తున్నాడు. పోలీసుల నుండి విముక్తయిన ఆనందం ఏమి కనబడటం లేదు. ఏదో భారంగనే అడుగులేస్తుండు. అదంతా దూరం నుండే నేను చాలా జాగ్రత్తగా గమనిస్తనే వున్న.

అతను దూరంగా వుండగానే దక్షిణ భారతానికో, శ్రీలంకకో చెందిన వ్యక్తిలాగ కనిపించాడు. కాని అతను కొంత దగ్గరికి రాగానే ఆ రూపం ఏదో చాలా పరిచయం వున్నట్లుగా అనిపించింది. అతని చెరిగిన జుట్టు. ఎప్పుడో పట్నం పోతే కాని వేసుకోని ముడతలు బడిన ప్యాంట్ షర్ట్. అన్నింటికి మించి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక జత బట్టలను ఒక పేపర్ లో చుట్టి పట్టుకొని నడుస్తుంటే నేను చిన్నప్పుడు మా దేవరకొండ బస్టాండ్ లో చూసిన ఎందరో మనుషుల పోలిక గుర్తుకొస్తుంది. అతను మా వైపుకే నడుస్తున్నాడు. నేను అతని వైపే తదేకంగా చూస్తున్న. అతను కూడా నన్ను గమనించాడు. చెదిరిపోయి కలుసుకున్న పక్షుల చూపుల్లా వున్నాయి. అతన్ని చూస్తూ నేను స్నేహపూర్వకంగా నవ్విన. కాని అతను మొద్దువారినట్లు ఎలాంటి బదులివ్వలేదు.

అతను మాకు ఐదు అడుగుల దూరంలోకి రాగానే నేను సునితతో గట్టిగా తెలుగులో ఏదో మాట్లాడటం మొదలుపెట్టిన. ఆమెకు అర్థం కాలేదు “ఇప్పడిదాక మంచిగనే వున్నవు కదా. అంత గట్టిగ మాట్లాడుతవ్. నాకు చెవుడొచ్చిందనుకున్నవా ఏంది” అంటుంది. కాని ఆమె మాటలు పట్టించుకోకుండ అట్లనే గట్టిగ మాట్లాడుతున్న. నా మాటలు విన్న అతను మెల్లగా ఆగి మేము కూర్చున్న దగ్గరికి వచ్చి నా పక్క కుర్చీలో కూర్చుండు.

కూర్చున్న ఒక్క నిమిషం తర్వాత “అన్నా మీరు తెలుగోళ్ళా?” అని నిదానంగా అడిగిండు. చూస్తే వయస్సులో నాకంటే కనీసం పదిహేనేండ్లయినా పెద్ద వుంటడు అయినా తెల్లబట్టలు ఏసుకున్నందుకు నన్ను అన్నా అంటున్నడంటే కచ్చితంగా ఇతనిది తెలంగాణనే అయివుంటది అనుకున్న. “అవునన్నా మాది తెలంగాణ” అని బదులిచ్చిన. “అవునా అన్నా” అని చిన్న చిరునవ్వుతో అన్నడు.

అతను నన్ను అంతకన్నా ఎక్కువ అడగడు అని నాకు అర్థమయ్యింది. నేనే ఏదైనా మాట్లాడిద్దాం అని “అన్నా ఏమయ్యింది నిన్ను పోలీసులు ఎందుకు తీసుకొచ్చిండ్రు? ఇల్లాంక చూసిన బేడీలు తీసి వదిలిపెట్టి పోయిండ్రు. ఎక్కడినుండి వస్తున్నవ్? అసలు ఇంత దూరం ఎందుకొచ్చినవ్? ఏ ఊరు నీది?” తెలుసుకోవాలనే అతి ఆసక్తితో అన్ని ప్రశ్నలు ఒకదాని తర్వాత ఒకటి వేసిన. నా ప్రశ్నలు అతన్ని గతంలోకి నెట్టినట్లున్నవి కొన్ని క్షణాలు వర్తమానంలో లేనట్లు మౌనంగా నేలకేసి చూస్తూ కూర్చుండు.

అప్పుడే తేరుకుని “అందరిలాగే బతకనీక వచ్చినన్నా” అన్నడు.

“మరి ఇట్లెట్ల అయ్యిందన్న” అని అడిగిన.

“ఒక బ్రోకర్ గాడు మోసం చేసిండు. అంతా నాశనం చేసిండు” అని సర్వం కోల్పోయిన గొంతుతో చెప్పిండు. ఆ మాటతో నాకు మరో పక్క కూర్చున్న సునిత కూడా ముందుకు వంగి అతని వైపుకు తిరిగి అతను చెప్పేది వినడానికి సిద్ధమయ్యింది.

“అసలేమయ్యిందో చెప్తవా అన్నా” అని అడిగిన. అతను చెప్పడం మొదలు పెట్టిండు.

“మాది సిరిసిల్ల పక్కన చిన్న ఊరు. బతుకుదెర్వులేక మా ఊరినుండి చాన మంది గల్ఫుకు పోయిండ్రు. నాకు మూడెకురాల భూముంది. కాని నీళ్ళ సౌలతు లేక వ్యవసాయం పెద్దగ అక్కరొస్తలేదు. అందరు గల్ఫుకు పోతుండ్రు కదా అని నేను కూడా పోదామనుకున్న. నా కంటే ముందు మా బామ్మర్ది కూడా పోయుండె. వాడు బాగనే సంపాదించిండు. అట్లనే నేను కూడ చేస్తే పెద్ద పిల్ల పెండ్లి చెయ్యొచ్చు. చిన్నదాన్ని, కొడుకును చదివియ్యొచ్చు అనుకున్న…”

అతను చెబుతుండగానే “మరి ఎట్ల పోయినవన్న. మీ బామ్మర్ది సాయం చేసిండా?” అని అడిగిన.

“నా బామ్మర్ది ఏమి సాయం చెయ్యలే. వాని సంసారం వానికే వుంది. నేనే నా మూడెకురాల భూమి అమ్మితె ఒక అరవై వేలొచ్చినవి. ఇంకో నలభై వేలు అప్పు చేసిన. అన్ని కలిపి లక్ష రూపాలు ఒక బ్రోకర్ కు ఇచ్చిన. వేరే వాళ్ళకైతే ఇంకా ఎక్కువనే అయితదంట. మా బామ్మర్ది కి కూడా ఆయనే చేసిండు కాబట్టి నా దగ్గర కొంచం తక్కువ తీసుకుండు” అని చెప్తుండగానే…

“అన్నా వున్న భూమి అమ్మితివి. మరి ఇంటికాడ వున్నోళ్ళు ఎట్ల బతుకుతరనుకున్నవ్?” అని అడిగిన.

“భూమి అమ్ముడు నాకు బాధగానే వుండే. కాని ఇక్కడికి వచ్చి సంపాదిస్తే భూమి మళ్ళీ కొనుడు ఎంత పనిలే అనుకున్న. నా పెండ్లాం, పెద్ద బిడ్డ కూలికి పోతరు. నేను పైసలు పంపే వరకు వాళ్ళే ఎట్లన్న బతుకుతరులే అనుకున్న. కాని ఇంత కర్మం అయితదనుకోలే” అని గొంతుకు ఏదో అడ్డుతగిలినట్లు ఆగిపోయిండు.

“ఇక్కడికొచ్చినంక ఏమయిందన్నా” అని అడిగిన.

“ఇక్కడికి రావడం రావడమే ఏదో వర్క్ పెర్మిట్ తెస్త అని ఇక్కడున్న బ్రోకర్ ఏజెంట్ నా పాస్ పోర్ట్ తీసుకొని పోయిండు. నన్ను ఒక అపార్ట్ మెంట్ లో వుంచిండు. ఒక్కో రూం లో నలుగురు, ఐదుగురు వుంటరు. ఎక్కువ శాతం మనోళ్ళే. కరీంనగర్, నిజామాబాద్ నుండి మరీ ఎక్కువ. ఆ బ్రోకర్ అందరితో పాటుగా నాకు కూడా ఆరు నెలల పాటు కన్ స్ట్రక్షన్ పని చూపించిండు. తిండికి సరిపోను పైసలు ఇచ్చేది. మిగితావి పర్మిట్ పేపర్లు వచ్చినంక ఇస్త అన్నడు. అందరి పరిస్థితి అంతే. పని చేసుడు పైసలకు ఎదురు చూసుడు. ఒక్కోసారి ఏడ్పొచ్చేది. ఇంతదాక వచ్చి వెనక్కి పోలేమని బాధను దిగమింగుకునేది.”

“అయితే ఒక రోజు రాత్రి అందరం తిని అలసిపోయి పడుకున్నం. అంతట్లనే పోలీసోళ్ళు మా రూములు చెక్ చెయ్యడం మొదలు పెట్టిండ్రు. అందరి దగ్గర పేపర్లు అడుగుతుండ్రు. కాని నా దగ్గర ఏం లేక పాయే. పాస్ పోర్ట్ గినుక లేదు. నన్ను, నాతోటి ఇంకొదరిని పట్టుకొని జైళ్ళ పెట్టిండ్రు” అని చెప్పగానే మాకు ఆందోళన మొదలయ్యింది.

“అయ్యో … అన్నా మరి మిమ్ముల ఇక్కడ జైళ్ళ పెట్టింది ఊర్ల మీ వాళ్ళకు ఎవరికైనా చెప్పిండ్రా?” అని అడిగిన.

“నన్ను జైళ్ళ పెట్టింది నా బామ్మర్ది కి ఒక్కనికే తెలుసు. కాని ఇంటికాడ ఎవ్వరికి చెప్పొద్దని చెప్పిన. చెప్తే ఆయింత గుండె పగులుతరు అని వద్దని చెప్పిన. ఎట్లైనా బయటికొస్తే నాలుగు పైసలు సంపాదించుకొని పోదామనే అనుకున్న. ఇంత దూరమొచ్చి వొట్టి చేతులతోటి పోతే నలుగుట్ల నవ్వుల పాలయిపోత. అయినా అక్కడ పనిచేయనీక ఇప్పుడు సొంత భూమి కూడ లేకపాయె” అని చెప్తుండగానే…

“ఇంతకీ జైళ్ళ ఎంతకాలం వున్నవ్? ఇప్పుడు ఎవరు బయటికి తెచ్చిండ్రు?” అని అడిగిన.

“అట్లనే జైళ్ళ ఏడాదినర వున్న. నెలకు ఒక్కసారి ఇండియన్ ఎంబసీ నుండి లాయర్లు వచ్చి ఎవరెవరిని బయటకు తీసుకపోవొచ్చో ఇంటర్వ్యూ చేస్తరు. కాని బొచ్చడు మంది మనోళ్ళు లోపల వున్నరు. అందరికి చాన్స్ రాదు” అని చెప్పిండు.

“మరి నీకెట్ల చాన్స్ వచ్చిందన్నా” అని నా ప్రశ్న అయిపోకముందే అతను ఏడుస్తూ…

“నా బిడ్డే నన్ను బయటకు తీసుకొచ్చిందన్నా” అని బోరుమన్నడు.

“అసలు ఏమయిందన్నా?” అని అడగగానే…

“నా పెద్ద బిడ్డ సచ్చిపోయి ఇప్పటికి పద్నాలుగు రోజులవుతుంది…”

ఆ మాట వినగానే నాకు దుఃఖం ఆగక పక్కకు తిరిగే సరికి సునిత అప్పటికే ఏడుస్తనే వుంది.

ఒక్క నిమిషం సముదాయించుకొని “ఏందన్నా… నీ బిడ్డ ఎట్ల చనిపోయింది. కూలి పనికి పోయేంత పెద్దది అని చెబితివి. ఇదెట్లయ్యింది” అని అడిగిన.

“అవునన్నా ఆమెకు చిన్నప్పటి నుండి మూర్చ రోగముంది. మందులు వాడుతనే వుండే. నేను ఇక్కడొచ్చినాక ఏం వాడిందో, ఎట్లయ్యిందో. మొత్తానికి పెండ్లీడొచ్చిన పిల్లను నా చేతులార నేనే చంపుకున్న” అంటూ ఏడుస్తుంటే…

“అన్నా నువ్వేం చేసినవ్ చెప్పు. నీ బిడ్డలు బాగుపడుతరనే కదా ఇక్కడిదాక వస్తివి. నువ్వేం తప్పు చేయలేదు” అని ఓదారుస్తూ మాట మారుద్దామని “అన్నా మరి నీకెట్ల తెలిసిందే” అని అడిగిన.

మా పెద్దన్న కొడుకు సిరిసిల్లల చదువుకుంటడు. వాడు మా బామ్మర్ది కి ఉత్తరం రాస్తే వాడు మా జైలర్ కు పంపిండు. దానిని ఎంబసీ లాయర్లు వచ్చినప్పుడు చూపిస్తే పై సార్లతోటి మట్లాడి నాకు టికెట్ ఇప్పిచ్చి పంపుతుండ్రు” అని చెప్పిండు.

“మరి నువ్వు ఇంటికి వచ్చేది మీవోళ్ళకు తెలుసా?” అని అడిగిన.

“తెలువదన్నా. నేను ఇప్పుడు ఇంటికి ఎట్ల పోవాల్నో నాకే తెలుస్తలేదు. భూమి పొయ్యింది. నా బిడ్డ పోయింది. చేతులున్న పైసలన్నీ పోయి అప్పులే మిగిలినవి. నలుగుట్ల ఇజ్జత్ పొయ్యింది. ఇంకేముందన్న బతకడానికి” అంటుంటే…

“అన్నా నువ్వే ఇట్ల అదైర్య పడితే నీ కోసమే ఎదురుచూస్తున్న నీ భార్య, ఇద్దరు పిల్లలు ఏమవుతరు. ఎన్ని పోయినా కష్టం చెయ్యనీక రెక్కలున్నయి కదనే. అట్లనుకుంటె ఎట్ల” అని ఏదో ఓదార్పు మాటలు చెబుతున్న కాని కొన్ని కష్టాలు అనిభవిస్తే కాని తెలియదు వాటి తీవ్రత ఎంతో.

అట్లనే మాట్లాడుకుంటూ కూర్చోగానే మా విమానం ఎక్కడానికి సిద్ధమయ్యిందని అనౌన్స్ చేసిండ్రు. తీరా చూస్తే అతను కూడా మీము ఎక్కే విమానమే ఎక్కుతున్నడు. అందరం కలిసి విమానం ఎక్కడానికి గేట్ దగ్గరకి పొయ్యి లైన్లో నిలబడ్డం.

లైన్లో వుండి విమానం ఎక్కే గేటు వైపుకు చూస్తే అక్కడ నాకో షాకింగ్ విషయం కనిపించింది. ఎయిర్ లైన్స్ వాళ్ళు అందరి హాండ్ బ్యాగేజ్, బ్యాక్ పాక్ ల బరువు కొలుస్తావుండ్రు. “వీడేంద్రా బాబు ఈడికొచ్చినాక మళ్ళీ బరువు కొలుచుడు మొదలుపెట్టిండు” అని అనుకుంటూ లైన్ల ముందుకు పోయిన. అక్కడ కౌంటర్ దగ్గర వున్నతను నా పాస్ పోర్ట్, బోర్డింగ్ పాస్ చూసిన తర్వాత నా హ్యాండ్ లగేజ్ బరువు చూడమన్నడు. చూసిన అది సరిగ్గనే వుంది. బ్యాక్ ప్యాక్ కూడా కొలువమన్నడు. “ఇక అయిపోయిందిరా అయ్యా” అనుకుంటూనే బరువు చూసిన.

ఆ కౌంటర్ దగ్గర వున్నతను వెంటనే “ఏడు కిలోలు ఎక్కువుంది. అందులో నుండి ఏమైనా తీసెయ్య్. లేకపోతే వంద డాలర్లు కట్టు” అన్నడు. ఏం చెయ్యాలనా అని నేను ఒక్క క్షణం ఆలోచిస్తుంటే నా వెనుకనే వున్న తెలంగాణ సోదరుడు “ఏందన్నా ఏమయ్యింది?” అని అడిగిండు. విషయం చెప్పిన.

అతను వెంటనే “నా దగ్గర ఒక జత బట్టలే వున్నయ్. నీ సామాన్లు నాకియ్యన్నా నేను పట్టుకుంట” అన్నడు. అక్కడే ఒక ప్లాస్టిక్ బ్యాగ్ తీసుకోని ఎక్కువ బరువున్న పుస్తకాలు తీసి దాంట్లో వేసి ఆ అన్న చేతికి ఇచ్చిన. మా తక్షణ పరిష్కారం చూసి ఆ కౌంటెర్ దగ్గర వున్నోడు, మా వెనుక లైన్ల వున్నోళ్ళు ఆశ్చర్యంగ చూస్తుండిపోయిండ్రు.

విమానంలో మేము, అతను దూరదూరంగనే కూర్చున్నం. కాని ఆ నాలుగు గంటల ప్రయాణం మొత్తం అతనికి సంబంధించిన మాటలు, ఆలోచనలతోనే గడిచిపోయింది. ఇక హైద్రాబాద్ లో విమానం దిగి ఇమిగ్రేషన్ దగ్గరికి వచ్చాక మళ్ళీ లైన్లో ఒక దగ్గరే నిలబడ్డం. ఈసారి అతను మా ముందు నిలబడ్డడు. ఇమిగ్రేషన్ ఆఫిసర్ అతని దగర వున్న పేపర్లు చూసి పక్కకు నిలబడమని చెప్పిండు. ఎందుకంటే అతని దగ్గర సరైన పేపర్లు లేవు కాబట్టి ఏదో వెరిఫికేషన్ చేసుకుని కాని బయటకు పంపము అని చెప్పిండు. అక్కడ లైన్లో నా సమస్యకు అతను పరిష్కారం చూపాడు కాని ఇక్కడ నేను అతనికి ఏమి సహాయం చేయలేని నిస్సహాయ స్థితి. “వస్తా అన్నా” అంటూ చెయ్యి ఊపి నేను ముందుకు కదులుతుంటే మావైపుగానే అతను దీనంగా చూస్తుండిపోయాడు.

ఆ చూపు పదిహేను ఏండ్లయినా ఇప్పటికి గుర్తుకొస్తా వుంటది. మరీ ముఖ్యంగా దగుల్బాజీ రాజకీయ నాయకులు అణగారిన వర్గాల, కులాల స్థితిని తమ రాజకీయ ప్రయోజనాలకు వాడుకున్నప్పుడు అతని చూపు మంటయి మండుతున్నట్లు అనిపిస్తుంది. అది కేవలం అతని ఒక్కని ఆవేదనే కాదు. అది ఒక సామూహిక వేదన. అలాంటి బతుకులను ఎలుగెత్తి పాడి గద్దెనెక్కినంక ఎగతాళి చేసెటోడు ఒకడు. అధికారం ఆశతో ఆ బతుకుల మీద కొత్తగా కూనిరాగం ఎత్తుకునే వాళ్ళు ఇంకొందరు.

ఆ దుబాయి వలస కార్మికుడి కుటుంబం హింసను అనుభవించింది రాజన్న రాజ్యంలోనే. ఆ కార్మికుడు లాంటి కార్మికులు ఇంకా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా వలస పోతూనే వున్నారు. అవస్థలు పడుతూనే వున్నారు. ఇలాంటి వాళ్ళ గురించే “సోమరిపోతులు. దుబాయి పోతరు గాడిదికొడుకులు… పిచ్చిముండా కొడుకులు ఉన్న ఊరినిడిచిపెట్టి పోతరు” అని కేసీఆర్ మదమెక్కో, మత్తెక్కో నోరు పారేసుకుంది.

తెలంగాణ వస్తే అట్టడుగు వర్గాలకు, కులాలకు ఏం ఒరిగిందని నయాదొరతనాన్ని ఎండగడుతూ “ఎవని పాలయ్యిందిరో తెలంగాణ” అని పాడిన కవిగాయకులు ఇప్పుడు అమాయకమో, ఆత్మవంచనో కాని “రాజన్న బిడ్డ రావాలమ్మా…” అంటూ గానం చేస్తున్నారు.

మరోవైపు దేశంలోనే అత్యంత చైతన్యవంతమైన పౌరసమాజం ఉందని పొంగిపోయే కాలం పోయి పాలక వర్గాల పల్లకి మోసే మేధావులు, రచయితలు, కళాకారులు ఉన్న పరిస్థితి వచ్చింది. ప్రశ్నించే అన్ని గొంతుకులను నిర్భందించి, నిషేధించి రాజ్యమేలుదామని పాలకులు కలలు కంటున్నారు.

ప్రజా సమస్యలను పక్కదారి పట్టించడానికి “తాను ముక్కల తన్నులాట” మొదలుపెట్టారు. అది ఈటెల రాజేందర్ “ఆత్మగౌరవాన్ని” వంచించడం కావచ్చు. షర్మిల ఆత్మగౌరవ జ్యోతై తెలంగాణ గడప తొక్కడం కావచ్చు. ఆత్మగౌరవం అనే బ్రహ్మపదార్థం ఎప్పుడు కూడా పాలక వర్గాల రాజకీయ ముడిసరుకే. వాళ్ళు ఆ ముడి సరుకును సరిగ్గా వాడుకుంటే అది అధికార పీఠం అవుతుంది. అదే పీడిత కులాలు, వర్గాలు ఆత్మగౌరవం మాట ఎత్తితే వాళ్ళ జీవితాలు అంధకారమయం అవుతాయి. ఇది ఒక దుర్మార్గ చరిత్ర!

కాని ప్రజాపోరాటాల చరిత్ర తెలిసిన ఎవరికైనా అర్థమయ్యే విషయం ఒకటుంది: కొన్ని మేధో గొంతుకులు లొంగిపోవొచ్చు, మరికొన్ని వంగిపోవొచ్చు, ఇంకొన్ని అమ్ముడుపోవచ్చు, కాని కాలాన్ని కాపలా కాసే ప్రజలు కొత్త కలలను కంటూనేవుంటారు. ప్రశ్నల కొలిమిని రాజేస్తనే వుంటరు. “ప్రశ్నించే తత్వాన్ని చంపుకొని పాటమ్మ ఊరేగుతున్నవ్. దొంగ నేతలకాడ వంగి దండంపెట్టి అడుక్క తింటున్నవ్…” అని ప్రశ్నల తుఫానై రాచకొండ నుండి వస్తున్న సుక్క రామనర్సయ్య వంటి వాగ్గేయకారులు పుట్టుకొస్తూనే వుంటరు.

“ఎక్కడి రాజన్నరో, ఎవ్వని రాజన్నరో” అంటూ షర్మిల లాంటి పాలక వర్గాల ప్రతినిధుల కుట్రలను నిలదీసే ఆర్గానిక్ మేధావులు కొత్త గాలై వీస్తూనేవుంటారు. నమ్రత (humility) కోల్పోయిన భుజకీర్తి మేధావుల బుర్రలను సహితం పాలీష్ చేస్తూనే వుంటరు. ఉద్యమకాలంలో వాళ్ళు చెప్పిన మాటలను, పాటలను మళ్ళీ వాళ్ళకే చెప్పి వాళ్ళను గడీల నుండి విముక్తి చేసే ప్రయత్నం నిరంతరం చేస్తూనే వుంటరు. రామనర్సయ్య చెబుతున్నట్లే “నా తెలంగాణ ఎప్పుడు నిండు కానుపుతో వుంటది. ప్రశ్నించే తత్వాన్ని నిరంతరం కంటూనే వుంటది.” ఇదీ ఇప్పుడు కావాల్సిన భరోస.

పుట్టింది చారకొండ (పాలమూరు). పెరిగింది అజ్మాపూర్ (నల్లగొండ). సామాజిక శాస్త్ర విద్యార్థి, ప్రజా ఉద్యమాల మిత్రుడు. అమెరికాలో అధ్యాపకుడిగా, పరిశోధకుడిగా పనిచేస్తున్నాడు.

3 thoughts on “ఎక్కడి రాజన్నరో, ఎవ్వని రాజన్నరో

  1. అంతే సర్. ప్రశ్నించే తత్వం… పాట లు పుడతాయి. ఎంతమంది లొంగినా. లొంగాక రాజధాని రోడ్ల మీద నూనె పారబోసి ఎత్తు కోవచ్చు అంటున్నారు. పోతే పోనీ వస్తూనే ఉంటాయి ఎన్నో కలాలు గళాలు

  2. 100% true sir -chala chakkaga chepparu Ashok garu
    40 years living in california —call me sir 5623080234 cell

Leave a Reply