ఎక్కడి నించి వచ్చాడు… ఇంతలోనే… ఎక్కడికి వెళ్ళిపోయాడు?

  • నాసిర్ కజ్మి
    తెలుగు స్వేచ్చానువాదం – గీతాంజలి

గడిచిన దినాల సంకేతాలు మోసుకుని… అతను ఎక్కడినించి వచ్చాడు… ఇంతలోనే ఎక్కడికి వెళ్ళిపోయాడు???
నన్ను కల్లోలంలో ముంచివేసిన… విచిత్ర మానవుడతను… అపరిచితుడతడు!
ఆనాటి వియోగపు రాత్రి ఒంటరి నక్షత్రం అతను.
అతడు ఎవరో కాదు… నా సహ పథికుడు…
అందరూ సదా ప్రియాతి ప్రియంగా తలుచుకునే
నా షాయర్!
కానీ…కానీ… హతవిధీ… నిన్న రాత్రే అతను మరణించాడని తెలిసింది.
ఈ రాత్రి ఇక ఏ రాగమూ లేని బాటసారి.
నీ కవి… నీ సహాయకుడు… విజేత కూడా!

ఇందాకే ఈ వీధి మలుపులో చూసాను.
ఇంతలోనే ఎక్కడ అదృశ్య మయిపోయాడో అతగాడు??

చిక్కని… గాఢమైన పదాల సొబగును చూపించి…
అంతే తీయని పాటను వినిపించి…
సాయంత్రపు నక్షత్రమై వచ్చిన వాడు…
మరిన్ని నజ్మాలను… గజళ్లను వాదా చేసినవాడు…
మనల్ని నమ్మించి… అంతలోనే ఒక పగటి కలగా మిగిలిపోయాడు!

ఈ ఉల్లాసమైన రేయి… లేదా విషాదమైన పగలు… ఏదైతేనేం??
ప్రతిక్షణం నా చూపులతన్ని వెతుకుతూనే ఉంటాయి.
అతనొక పూల పరిమళమో…
సాయంకాలపు పాటల ప్రవాహమో… మరేదో కానీ… నా హృదయంలోకి ఇంకిపోయాడు.

ఇప్పుడు… అతను వడి వడిగా జ్ఞాపకాలు ఉప్పొంగే నదీ ప్రవాహం కాదు.
అలాగని… నెమ్మదిగా కురిసే వానా కాలపు మంచు బిందువూ కాదు.
ప్రతీ క్షణం…
నా గుండె గాయపు లోతుల్లో…
ఆగి ఆగి గుచ్చుకునే నొప్పిగా నిండిపోయినవాడు.

నీలి మబ్బులతో
మారిపోతున్న ఆకాశం లాగా…
ఇప్పుడిప్పుడే ప్రాణం కుదుట పడుతున్న వేళ…
భారమైన రాత్రుళ్ళు తేలికైపోతున్న వేళ…
ఏ పగళ్ళల్లో… అతడు ఎన్ని యుగాలుగా అలా నిలబడి ఉన్నాడో కానీ… ఇప్పుడు మాత్రం కదిలి వెళ్లిపోతున్నాడు !
ఎవరైనా ఆపండి…

అతనికి ఎప్పుడూ… ఆకాంక్షలతో నిండిపోయిన గమ్యం ఒకటి ఉంటూనే ఉంటుంది.
దాన్ని చేరడానికి వెయ్యిన్నొక్క హృదయ ద్వారాలు ఉండనే ఉన్నాయి.
ఇదే నాకూ… అతగాడికి ఉన్న వైరుధ్యం.
కాలంతో పాటు గడిచిపోయాను నేను.
నిలిచిపోయాడు అతడు!

అతనితో… గడచిన ఉత్సాహవంతమైన దినాలను మరచిపోయి… విరిగి ముక్కలైపోయి దారి మధ్యలోనే ఆగిపోయాను నేను.
ఈ యాత్రలో… నా సహ బాటసారి…
ప్రయాణపు బడలిక ఇసుమంతైనా లేకుండా… సాగిపోయాడు అతడు.

అతను మరణించాడా…?
నిజమే… అతను మరణించాడు!
నా రక్తమంతా నీరు నీరైనా…
ప్రియమైన వాళ్ళ కనురెప్పలైనా తడవలేదు.
రాత్రంతా హృదయంలో కన్నీటి మత్తడి తెగినా…
ఎందుకో ఆసక్తి చూపకుండా… ఆగకుండా వెళ్ళిపోయాడు అతడు.

మత్తులో జోగే పానశాలలను … రాత్రుళ్ల నిద్రలను మేల్కొల్పేవాడికి ఏమైందీ రోజు… ఏమనిపించిందో ఈ రోజు??
సాయంత్రం కాగానే ఇంటికెళ్లిపోయాడు?

ఎవరి గుండెలపై నిమ్మళంగా చేతులు పెట్టి గమ్యం వైపు సాగిపోయానో…
ఆ రహదారి నించే… ఎందుకో ఈ రోజు… దోస్త్…!
తలవంచుకుని వెళ్ళిపోయాడీ రోజు.
గడిచిన దినాల సంకేతాలను మోసుకుని…
అతను ఎక్కడినుంచి వచ్చాడు… ఇంతలోనే ఎక్కడికి వెళ్ళిపోయాడు??
ఎన్నెన్ని ఆశలను వాదా చేసి, నమ్మించి…
అంతలోనే… పగటి కలగా మిగిలిపోయాడు… నిన్ననే
వీధి మలుపులో కనపడ్డవాడు…
ఈ రోజు మాయమైపోయాడు.

డా. భారతి : Psychotherapist & marital counselor. కలం పేరు గీతాంజలి. పుట్టిన స్థలం హైద్రాబాద్. ర‌చ‌న‌లు: 'ఆమె అడవిని జయించింది', 'పాదముద్రలు'. లక్ష్మి (నవలిక). 'బచ్ఛేదాని' (కథా సంకలనం). 'ప‌హెచాన్‌' (ముస్లిం స్త్రీల ప్రత్యేక కథా సంకలనం), 'పాలమూరు వలస బతుకు చిత్రాలు' (కథా సంకలనం), 'హస్బెండ్ స్టిచ్' (స్త్రీల విషాద లైంగిక గాథలు) 'అరణ్య స్వప్నం' (కవితా సంకలనం) సెప్టెంబర్ 2019 లో విడుదల అవుతుంది.

3 thoughts on “ఎక్కడి నించి వచ్చాడు… ఇంతలోనే… ఎక్కడికి వెళ్ళిపోయాడు?

  1. కవిత ఆసాంతం
    ఉద్వేగ భరితం
    అనువాదం బావుంది
    నెరుడా ‘ప్రజ’ గుర్తుకు వొచ్చింది
    👌 ……👍 -వెంకన్న

Leave a Reply