సూర్యోదయం నుండే గస్తీకాస్తున్న రోహిణీ ఎండ
ఏమాత్రం తలుపు తెరిచినా లోపలికి నిప్పుల్ని విసురుతుంది.
మండిపడుతున్న గుల్మొహర్ పువ్వులు
ఎండకు వత్తాసుగా వడగాల్పుల్ని నిశ్వసిస్తుంటాయి.
పారిశ్రామిక విప్లవం ఫ్యాక్టరీ గొట్టాల నుండి
గుప్పుగుప్పున పొగ వదులుతుంటుంది.
మట్టి రోడ్లన్నీ తారుపూసుకొనో, కాంక్రీటు కప్పుకొనో
యథాశక్తి వాననీటిని భూగర్భాన్ని చేరకుండా అడ్డుకుంటూనే ఉంటాయి.
జలచక్రం కాస్తా ఛిద్రమై… వర్షం నల్లపూసైపోతుంది.
ఉష్ణ పరావర్తనం అదనపు బహుమతిగా అందుతుంది.
మధ్యతరగతోడి ఆశలకు
రంగురంగుల బ్రోచర్ల వలేసిన రియల్ ఎస్టేట్ వాళ్ళు
చెట్లన్నిటినీ మొదలంటా నరికి
చల్లని నీడను కాస్తా లోకంనుండే తరిమేస్తారు
తాపానికి ఉపశమనంగా దేహాలు ఏసీల్ని ఫ్రిజ్జుల్ని ఆశ్రయిస్తాయి.
చల్లదనాన్ని పంచే ఏసీలు ఉదారంగా ఓజోను పొరను చిల్లులు పొడుస్తాయి
పాపం క్షతగాత్ర ఓజోన్ పొర నిస్సహాయంగా చేతులెత్తేస్తుంది.
మన ఊరి ఉష్ణోగ్రతలు
సహారా ఎడారి ఉష్ణోగ్రతలతో పోటీపడి
సునాయాసంగా ఓడించేస్తాయి.
ఎలాగోలా సాయంత్రానికి కమ్ముకున్న మేఘాలు
ఉరుములు మెరుపులతో కాసేపు హడావిడి చేసి
చివరికి ఓ చుక్కైనా కురవకుండానే ఓటమి అంగీకరిస్తాయి.
ముక్కుపైకి జారుతున్న కళ్లజోడును సవరించుకుంటూ
ఇదంతా ఎల్నినో ప్రభావం అని ప్రకటిస్తాడో మేధావి.
బిందెడు నీళ్ల కోసం ఊరిలో ఆడబిడ్డలు
ఇప్పటికీ మైళ్లకుమైళ్ళు నడుస్తూనేఉంటారు
గొంతెండి పోయిన సిటీ కాకులు
ఇప్పటికీ కార్పొరేషన్ కుళాయిల్ని బ్రతిమాలుతూనేఉంటాయి.
వానలు కురవాలని బోలెడు ఖర్చుపెట్టి
కప్పలకు ఘనంగా పెళ్లిళ్లు చేస్తూనేఉంటారు.
ఋతువు తప్పిన ఋతుపవనాల రాకకై
లోకం మొత్తం ఎదురుచూస్తూనేఉంటుంది.