ఊహ తెలిశాక
ఓ రాత్రి పూట
ఇదే ఒక్కణ్ణే పడుకోవడం
పైకి ధైర్యంగా ఉన్నా
చుట్టూ భయం తిరుగుతున్న చప్పుడు
పిరికిగా నడుస్తున్న కళ్ళు
వస్తూ, పోతూ వణుకుతున్న నిద్ర
కిటికీ కి వేసిన కర్టెన్ లా
ఎగురుతున్న ఆలోచనలు
పగలు ఒక ఆశ
రాత్రొక నిరాశ
ఒక సమాధి క్షణం కోసం నిరీక్షణ
లోపల
మారుతున్న నీడలు
గది అలానే ఉంది
నాలోనే ఏదో మార్పు
ఎన్ని రాత్రులు
రాలిపోలేదు
ఎన్ని నిద్రలు
వెళ్లిపోలేదు
ఈ రాత్రి శాపం లా ఉంది
ఒంటి కన్ను రాక్షసుడి చూపులా ఉంది
కరుణ లేని రాత్రి
దీవెన ఇవ్వని రాత్రి
ఇప్పుడు
అడవి ఎలా ఉంటుంది
సముద్రం
ఎం చేస్తుంటుంది
పిట్ట గూటిలో
లోకం ఎలా ఉంటుంది
భూమి తిరగడం మాములే
ఈ రాత్రి నిద్రకు
జబ్బు చేసింది
నరనరనా పెనుగులాట
ఒడ్డుకు చేరాలి
ఈ రాత్రికి
ఒక్కణ్ణే దొరికిపోయాను
చీకటికి సరదా నేను
ఒక్క మిణుగురు
పలకరించి పోతే బావుణ్ణు
చుట్టూ భయం తిరుగుతున్న చప్పుడు..
..ఒక్క మిణుగురు పలకరించిపోతే బావుణ్ణు
చాలా బావుంది సర్