దొరల గుండెల్లో భూకంపం పుట్టించిన ‘ఊరు మనదిరా! ఈ వాడ మనదిరా!’

అట్టడుగు ప్రజల జీవితాల్లో గూడుకట్టిన దుఃఖాన్ని తన పాటలోకి ఒంపుకొని నెత్తురు ఆవిరయ్యేలా పాడిన ప్రజాకవి గూడ అంజయ్య. తెలంగాణ రాష్ట్రోద్యమానికి, విప్లవోద్యమాలకు తన ఉద్వేగపు స్వరాన్ని తుదిశ్వాస వరకు ఊదిన వాగ్గేయకారుడు అంజన్న. ఊరి ప్రజల వ్యవహారిక సంభాషణలను పాటలుగా మలిచి పతాక గీతంగా జనుల గుండెల్లో ఎగరేసిన సహజకవి. ఆకుపచ్చని ఆదిలాబాద్ అడవుల దగ్గర దండెపల్లి మండలం, లింగాపూర్ గ్రామంలో 1954 నవంబర్ ఒకటిన పుట్టిన కవి పాటల పాలధారల్లో పెరిగాడు. బాల్యంలోని భాగవతుల కథలు, జానపదుల కళాకృతులు అంజయ్యలో నిగూఢంగా దాగిన సృజనావేశం ఒక్కసారిగా పాటై పెల్లుబికింది. నిరుపేద కుటుంబంలోని వ్యథలు, చుట్టూవున్న ప్రజల వెతలు, తెలంగాణ సాయుధ పోరాట గాథలు అంజయ్య అక్షరానికి ఒక లక్ష్యాన్ని నిర్దేశించింది. మాక్సిం గోర్కి ‘అమ్మ’, ‘మాలపల్లి’, ‘ప్రజల మనిషి’, ‘చిల్లర దేవుళ్ళు’, ‘మహాప్రస్థానం’ మొదలైన రచనలు అంజయ్యలోని కవిని కల్లోలపరిచాయి. శ్రామికవర్గపు సమాజంలో నెలకొన్న జీవన సంక్షోభం కవిని తీవ్రంగా గాయపరిచాయి. ఊరిలోని దొరల దౌర్జన్యాల్ని దగ్గర్నుండి చూసి అంజయ్య ఒకదశలో నిరాశలోకి కూరుకుపోయాడు. “ఊరిడిసినేబోదునా… అయ్యో వురిబోసుకొని సత్తునా…” అని విలపించాడు. పాటంటే ఊపిరినిపోసి జీవశక్తిని అందించే సాధనమని తెలుసుకున్నాడు. ఊరుని విడవాల్సింది ఎవరో అర్థమైంది. ఊరు ఎవరిదో మూలాలు దొరికాయి. ఆ మట్టిపొరల కింది చరణాలతో “ఊరు మనదిరా! ఈ వాడ మనదిరా!” అనే పాట ఉద్భవించింది. ఒక తరం దొరతనం గుండెల్లో ప్రతిధ్వనించి ఊరినుండి దొరలను తరిమేసిన సంచలనాత్మక గీతాన్ని మరోసారి ఇక్కడ పాడుకుందాం!

ప్రతి పాట వెనక ఒక లోతైన చరిత్ర వుంటుంది. అలాగే “రాసిన ప్రతి పాట వెనక ఒక కథ వుంది. నేను జీవితాన్ని చూసి చలించి పాటలు రాశాను” అన్న అంజయ్య మాటలు యధార్థాలు. ఉన్నఊరుని కన్నతల్లిలా ప్రేమించిన కవికి ఊరిలోని దొరలు, జాగీర్దార్లు ఎన్నడూ చూడని నరకాన్ని చూపించారు. ఈ నరలోకపు కష్టాలు తనొక్కడివే కాదు. ఊరందరివి. ఊరందరి వెన్నుల్లోని వణుకును, బతుకుల్లోని బానిసత్వాన్ని పోగొట్టాలనే నిర్ణయానికి వచ్చాడు. ఇలా నినదించాడు.

“ఊరుమనదిరా! ఈ వాడమనదిరా!
పల్లె మనదిరా! ప్రతి పనికి మనంరా!
సుత్తి మనది! కత్తి మనది
పలుగుమనది! పార మనది
బండి మనదిరా! బండెడ్లు మనయిరా!
దొర యెందుకురో! దొరతనమెందుకురో – నడుమ
దొర యెందుకురో దొరతనమెందుకురో…..”

ఈ పాటలోని ప్రతి పదం, ప్రతి భావం అత్యంత సరళంగా, స్పష్టంగా ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. కాని పాటలో దాగున్న సత్యం, కవి ఆశయం కాలాన్ని సైతం ధిక్కరిస్తుంది. నివ్వెరపరుస్తుంది. భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా, గ్రామాల్లో తరతరాలుగా నెలకొన్న దొరల పెత్తనాన్ని ధిక్కరిస్తూ ప్రజల్లో ఊహించని తిరుగుబాటును ఉసిగొల్పుతుంది. గంటల తరబడి ఉపన్యసించినా అందని కమ్యూనిజం అంతిమ లక్ష్యాన్ని ముద్దాడి ఉద్యమానికి సమాయత్తం చేసిన చారిత్రాత్మక గీతం ‘ఊరు మనదిరా’.

ఊరికి విసిరేసినట్టుండే అస్పృశ్యవాడలు, ఊరిలో అనేక వృత్తిపనులు చేసే వెనకబడిన జనవాడలు, ఊరిలోని దొరల ప్రతి పనికి బానిసలుగా వెట్టిచాకిరి చేసే ఊరిప్రజలు – వీరందరి ఆత్మఘోషకు విముక్తి పలకాలనే ధృఢసంకల్పంతో ఎలుగెత్తి పాడిన పాట ఇది. పంచభూతాలు ఎవరికి చెందని సంపదలు. వాటిని సైతం తమ కబ్జాలో పెట్టుకోవాలనే దోపిడీ లోకంలో పల్లె ప్రజలు తమ ఆస్తిని, ఆయుధాన్ని చూపుతున్నారు. తమ శ్రామిక శక్తి చాటుతున్నారు. సుత్తి, కత్తి, పలుగు, పార, బండి, బండెడ్లు మావే అని నిక్కచ్చిగా తమ శ్రామిక సంస్కృతిని నిర్ధారిస్తున్నారు. వీటిపై ఆధిపత్యం చెలాయిస్తున్న దొరల దాష్టీకంపై యుద్ధగీతికను ఆలపిస్తున్నారు.

శ్రమజీవుల సంపద వారికి దక్కకుండాపోవడం పెనువిషాదం. అంతకన్న తను దున్నిన నేలలో కూలీ కావడం, తను పుట్టిన ఊరుకు పరాయివాడు కావడం మరణంతో సమానం. తన ఉనికిని ప్రశ్నార్థకం చేస్తూ తన మూలాలను పెకలించివేసే శక్తులతో పోరాటం చేయవల్సిన సమయం ఆసన్నమైందనే పోరాట సూచిక ఈ గీతం. సబ్బండవర్ణాల సామూహిక సింహనాదాన్ని వినిపిస్తాడు కవి. సహస్ర వృత్తుల సమస్త చిహ్నాల్ని పలకరిస్తాడు. ఒక మొక్కకు కూడా నీళ్ళుపోయని, ఒక విత్తనం కూడా నాటని దొరల సోమరిపోతు తనాన్ని వెక్కిరిస్తుంది. ‘ఏ పని చేతగాని బలహీనుడు దొర’ అని నిరూపిస్తుంది ఈ గీతం.

“అరుకబట్టె మనం! ఆ సెలుక దున్నె మనం
ఈ కంచెకాడ మనం! ఆ మంచెకాడ మనం
ఈ పాడికాడ మనం! ఆ పశులకాడ మనం- హోయ్
దొడ్డికాడ మనమే! గడ్డాముకాడ మనమే
మట్టికాడ మనం! ఆ యెట్టికాడ మనం
ఈ నాటుకాడ మనం! ఆ మోటకాడ మనం- హోయ్
కోతకాడ మనమే! మరి మోతకాడ మనమే”

ఎటు చూసినా సమస్త విశ్వంలో విశ్వరూపం శ్రామికుడిదే. భారతదేశం లాంటి వ్యవసాయ ఆధారిత ప్రదేశంలో వ్యవసాయంలో భాగస్వామ్యులైన పల్లె ప్రజల ప్రాధాన్యం మరవలేనిది. సెలుక-అరుక, కంచె-మంచె, పశువులు-పాడి, దొడ్డి-దొడ్డాము, మట్టి-యెట్టి, నాటు-మోట, కోత-మోత పదాలన్నీ శ్రామిక జీవన దేహంలో విడదీయలేని ఉచ్ఛ్వాసనిశ్వాసాలు. ఈ పాట ఊరును, ఊరి ప్రజలనే కాదు – ఊరును ఊతంగా చేసుకుని ఊపిరిని నింపుకునే పట్టణాలను, నగరాలను, నాగరికులను ఆలోచింపజేస్తుంది. ఊరి ప్రజలు కదిలితేనే ఊరులోని పొలం పచ్చబారుతుంది.ఊరు పచ్చగుంటేనే మిగతాలోకం రంగులద్దుకుంటుంది. అటువంటి ఊరులోని ప్రజల ఆగ్రహాన్ని, ధిక్కారాన్ని దొరల గుండెల్లో ప్రతిధ్వనించేలా తెలుపుతూనే నాగరిక సమాజాన్ని అంతర్మథనంలోకి లాక్కెళ్లుతుంది. దొరల భూముల్లో కండలు కరిగేలా పనిచేసినవారి కష్టానికి తగిన ప్రతిఫలం అందని దుస్థితిలోంచి ఎగసివచ్చిన లావా ఈ గీతం. అందుకే “ఊరు మనదని పోరుశంఖమూదింది ఈ పాట” అని గద్దర్ ఈ పాటలోని శక్తిని వెల్లడించాడు. గద్దర్ గళంలోంచి మరింత జవజీవాల్ని పోసుకుని ఈ పాట విస్తృతంగా ప్రజాదరణ పొందింది. పదహారు భాషల్లోకి అనువాదమై అక్కడి స్థానీయ గీతంగా స్పందనల్ని కలిగించింది. ఖండాంతరాలు దాటి తెలంగాణ పల్లె ప్రజల్లాంటి నల్లజాతీయ వాడల్లోనూ మారుమ్రోగింది. ఒక తెలుగు జానపద గీతం ఇంతగా ప్రభావితం చేయడం పాటలోని సార్వకాలిక సత్యానికున్న విలువగా భావించవచ్చు.

“బందుకు బట్టేది మనం! బరువులు మోసేది మనం
సాకిరేవు కాడ మనం! సారెలు దింపేది మనం -హోయ్
సావుకాడ మనమే! సన్నాయికాడ మనమే”

తెలంగాణ ఉద్యమాలు, సాయుధ పోరాటాల చరిత్ర చూస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రజల నిత్యగాయాల రోదన, త్యాగాల వారసత్వం ఎంత గాఢంగా అలముకుందో అనుభవమవుతుంది. దొరలు, పటేలు, పట్వారీ, జమీందారులు, దేశ్ ముఖ్ లు ఒక్కరేమిటి పిసరంత అధికారం వున్న ప్రతివాడు తెలంగాణ ప్రజానీకానితో వెట్టిచాకిరి చేయించుకున్నారు. వీళ్ళ దౌర్జన్యాలు, దోపిడీలు, పెడుతున్న బాధలు భరించలేక తిరుగుబాటు జరిపిన సాహసోపేత ఘట్టాలు ఎన్నో వున్నాయి. దొడ్డికొమరయ్య, బందగీ, చాకలి ఐలమ్మ, బండి యాదగిరి మొదలైన ఉద్యమకారుల ఎదురుడులు చరిత్రను మలుపుతిప్పిన గొప్ప సంఘటనలు. అయినా స్వాతంత్ర్యానంతరం కూడా దొరతనం నాశనం కాలేదు. కొత్తరూపంతో కాటువేయడం మొదలైంది. దొరల ప్రాణాలు కాపాడటానికి ఆయుధాలు పట్టుకుని పోరాడేది మనమే, ప్రాణాలు పోగొట్టుకొనేది మనమే. నానా చాకిరీలు చేసినా ప్రజల మౌలికమైన బాధలు తీరకపోయేది. చివరకు దొర ఇంట్లో పెళ్ళి అయినా వీరి రెక్కల కష్టం లేనిదే జరుగుబాటు కాకపోయేది. పెళ్ళిలో మంగళ వాయిద్యాలు మోగించేదీ వీరే, ఆఖరుకు దొర చనిపోతే చావుడప్పు కొట్టేదీ వీరే. ఇంతగా ఊరి ప్రజలమీద పడి ఆధారపడి బతుకుతున్న దొర మనమీద ఇంత దుర్మార్గంగా ప్రవర్తించడమేంది అని ప్రశ్నిస్తున్నాడు కవి.

“గట్టుమీద దొరోడు! చెట్టులెక్క నిలుసుండి
ఆలి నుండి తల్లి దాక! వాయి వరుస లేకుండ
తిట్టుడే౦దిరో! దొర కొట్టుడేందిరో – నడుమ
దోపిడేందిరో – దొర పీకుడేందిరో”

కాలచక్రంలో ఋతువులు మారినా మారని బతుకులు శ్రమజీవులవే. నిరంతరం సూర్యుడు ఎలా దగ్ధమవుతుంటాడో బడుగు జీవుల బతుకులు కష్టాల కొలిమిలో కాలిపోతుంటాయి. శ్రమజీవి ఎండలో మాడిపోతూ పనిచేస్తుంటే గట్టుమీదున్న దొర చెట్టునీడలో వుండి వాయీవరస లేకుండా తిట్టడాలు, కొట్టడాలను కవి వేదనీకరిస్తున్నాడు. అందుకే పాట గొప్పదనాన్ని తెలుపుతూ “పాట పుట్టింది పనిలో. అందుకే పనికి, పాటకు తల్లికొడుకుల లాంటి సంబంధం వుంది. శ్రమజీవుల చెమట బిందువుల్లోనుంచి పాట పుట్టింది. శ్రమజీవుల శ్రమనుండి పుట్టిన పాటకు శ్రమజీవుల బ్రతుకే భావం. వారి చేతి పనిముట్లే పాటకు లయ, తాళం” అని అంజయ్య ఆ పల్లె ప్రజల జీవనంలోని ఘోసను ఇతివృత్తంగా తీసుకుని ఈ పాట రాసాడు. వారి చేతి పనిముట్లే ఈ దొరతనం నుంచి విముక్తిని అందించే ఆయుధాలుగా మారడం ఈ పాట ప్రభావమే. అందుకే ఈ పాటను ‘సైరన్మోత’గా శ్రీశ్రీ అభివర్ణించాడు.
గూడ అంజయ్య ఎమర్జెన్సీ కాలంలో జైలుజీవితాన్ని గడిపాడు. ప్రభుత్వ వ్యవస్థల్లోని అన్యాయాలను ఎత్తిచూపుతూ శక్తిమంతమైన పాటలు రాస్తూ ప్రజల్లో విప్లవ చైతన్యస్ఫూర్తిని కలిగించాడు. అందుకు ప్రతిఫలంగా జైలుకెళ్ళినా, నిర్బంధాలకు గురైనా, అజ్ఞాతంగా గడపవలిసివచ్చినా తన పాటలోని విప్లవాగ్నులను ఆరిపోనివ్వలేదు. అందుకనుగుణంగా ఊరి ప్రజలందరికి ఈ విధంగా దిశానిర్దేశం చేస్తాడు.

“కూలినాలి పేదోళ్ళ౦! కలిసిమెలిసి వుండాలే
సంఘపోల్ల జెండ కింద! సంఘమొకటి బెట్టాలే
మనల దోచే – ఈ దొరల మక్కెలిరుగదన్నాలే…”

కవి నినాదాల మీదే కాదు నిర్మాణాత్మకదారుల మీద నడవాలి. పాటలోంచి ఒక ఆచరణాత్మక బాటను చూపించాలి. గూడ అంజయ్య అటువంటి నిబద్ధనిమగ్న కవి. ‘ఊరు మనది’ అనే స్పృహతోపాటు, తమ శ్రమ విలువను తెలుపుతూ అదనపు విలువల్లోని మతలబును ఎరుకపరుస్తాడు. తమ జీవితాలని ఛిద్రం చేస్తున్న దొరతనాన్ని ధిక్కరించడమెలాగో తెలియజేస్తున్నాడు. మన వేలితో మన కన్నే పొడుచుకునేట్లు చేస్తున్న దొరల కుట్రలను భగ్నం చేస్తూ ప్రజలలో ఐకమత్యభావనలను పెంపొందిస్తున్నాడు. ఒక సంఘాన్ని, దానికో జెండాను అందిస్తున్నాడు. దోపిడీదారులను ప్రతిఘటించే స్ఫూర్తిని, ప్రతిచర్యను, అనివార్యమైన ప్రతిహింసను ప్రేరేపిస్తున్నాడు. చివరి చరణాలతో ప్రజలను దొరలపై ఎక్కుపెట్టిన బాణాలుగా, గురిచూసి కాల్చే ట్రిగ్గర్ మీది వేలుగా మార్చేస్తాడు.

ఈ పాటలో మరో ప్రత్యేకత వుంది. ఊరి మీద శ్రమజీవులకున్న హక్కులను క్లెయిం చేస్తూనే దొరల దాష్టికాన్ని పలుకోణాల్లో చూపుతూ, పలురకాలుగా వారి పైశాచికత్వాన్ని చూపుతూ విభిన్న విధాలుగా దొరలను న్యూనతపరుస్తాడు కవి.

“నడుమ దొర యెందుకురో! దొరతనమెందుకురో”
“నడుమ దోపిడేందిరో? దొర పోకడేందిరో?”
“నడుమ దొర ఎందుకురో? దొర జులుమెందుకురో?”
“నడుమ దొర ఎందుకురో? పెత్తనమెందుకురో?”
“తిట్టుడేందిరో! దొర కొట్టుడేందిరో – నడుమ
దోపిడేందిరో – దొర పీకుడేందిరో”
“మనల దోచే – ఈ దొరల మక్కెలిరుగదన్నాలే”

ఊళ్ళలోని దొరలను ఇంత తీవ్రంగా సంబోధిస్తూ దొరల గుండెల్లో భయాందోళనలు సృష్టించి, దొరల గడీలను కూల్చిన మందుపాతరల్లాంటి పదప్రయోగ గీతంగా విప్లవోద్యమ సాహిత్యంలో స్థానం పొందింది. ఊరు రోజురోజుకి శిథిలమవడం, దొర మాత్రం వైభవంగా వెలిగిపోవడం, ఊరిపేరు గొప్పగా వుండటం, ప్రజల జీవితాలు దిబ్బగా మారడాన్ని చూసిన కవి ఊరుని ఏకం చేసేలా రాసాడు. ‘మనది’ అని అనుకోవడంలో వుండే సామూహిక చైతన్యాన్ని ఒక దగ్గరికి తీసుకువచ్చాడు. “తెలుగు సామాజిక, రాజకీయ, సాహిత్యసాంస్కృతిక రంగాలలో ఊరు మనదిరా పాట నిజంగా ఒక భూకంపాన్ని సృష్టించింది” అని వరవరరావు చెప్పిన మాట అక్షరసత్యం.

గూడ అంజయ్య ఒక్క పాటలకే పరిమితం కాని సాహితీవేత్త. తానెదుర్కోవడమే కాదు తమవారి అవమానాలను మరచిపోకుండా దళితబానిస బతుకుపోరాటాన్ని ‘దళిత కథలు’గా చిత్రించాడు. ఎమర్జెన్సీ కాలం నుండి తను నడిసొచ్చిన ముళ్ళదారులను, దేశకాల పరిస్థితులను, సంక్షోభాలను, జీవితపు మలుపులను ‘పొలిమేర’ నవలలో సహజంగా వివరిస్తాడు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో “పుడితొక్కటి సత్తెరెండని” సాహసాన్ని నూరిపోసే పాటలను రాసి ‘ధూంధాం’ చేసిన ఉద్యమకవి. ఆధిపత్యపు వెండితెరమీద తెలంగాణ యాసతో నిజమైన ఎరుపును అద్దిన సినీకవి. తన పాటల్లో అన్ని వాదాలను పలికించాడు. వచన దళిత కవితకు ఉద్యమ స్ఫూర్తినిచ్చే దళిత గీతాలను రాసిన దళితోద్యమ సృజనకారుడు అంజన్న.

“పాట ఎన్నో నిర్బంధాలను ఎదుర్కొని ఫ్యాక్టరీ పొగగొట్టాల మీదుగా, గాలిలో గాలై పొలాల నాగటి సాల్లల్లో నుండి సమస్త శ్రమజీవుల పూరిగుడిసె సూరు నీడను చేరుతుంది” అని గూడ అంజయ్య పాటకున్న శక్తిని, వ్యాప్తిని, గమ్యాన్ని, ప్రాధాన్యాన్ని అద్భుతంగా వర్ణిస్తాడు. గూడ అంజయ్య పాటలు కూడా అటువంటి లక్షణాల్ని నింపుకున్నవే. ఊరూవాడా శ్రమజీవుల వారసత్వ సంపదగా నిరూపిస్తూ కవిత్వపు వీలునామా రాసిన ప్రజా ప్రయోజనవాజ్య కవి గూడ అంజయ్య.

(పూర్తి పాట…)

ఊరు మనదిరా!
– గూడ అంజయ్య

చరణం 1:

ఊరుమనదిరా! ఈ వాడమనదిరా!
పల్లె మనదిరా! ప్రతి పనికి మనంరా!
సుత్తి మనది! కత్తి మనది
పలుగు మనది! పార మనది
బండి మనదిరా! బండెడ్లు మనయిరా!
దొర యెందుకురో! దొరతనమెందుకురో – నడుమ
దొర యెందుకురో దొరతనమెందుకురో….. |“ఊరు” |

చరణం 2:

అరుక బట్టె మనం! ఆ సెలుక దున్నె మనం
ఈ కంచెకాడ మనం! ఆ మంచెకాడ మనం
ఈ పాడికాడ మనం! ఆ పశులకాడ మనం- హోయ్
దొడ్డికాడ మనమే! గడ్డాము కాడ మనమే
దోపిడే౦దిరో? దొర పోకడే౦దిరో? నడుమ
దోపిడే౦దిరో? దొర పోకడే౦దిరో? |“ఊరు” |

చరణం 3:

మట్టికాడ మనం! ఆ యెట్టికాడ మనం
ఈ నాటుకాడ మనం! ఆ మోటకాడ మనం- హోయ్
కోతకాడ మనమే! మరి మోతకాడ మనమే
దొర ఎందుకురో? దొర జులుమెందుకురో? నడుమ
దొర ఎందుకురో? దొర జులుమెందుకురో?…. | ఊరు |

చరణం 4:

బందుకు బట్టేది మనం! బరువులు మోసేది మనం
సాకిరేవుకాడ మనం! సారెలు దింపేది మనం -హోయ్
సావుకాడ మనమే! సన్నాయికాడ మనమే
దొర ఎందుకురో? పెత్తనమెందుకురో- నడుమ
దొర ఎందుకురో? పెత్తనమె౦దుకురో…. |“ఊరు” |

చరణం 5:

గట్టుమీద దొరోడు! చెట్టులెక్క నిలుసుండి
ఆలి నుండి తల్లి దాక! వాయి వరుస లేకుండ
తిట్టుడే౦దిరో! దొర కొట్టుడేందిరో – నడుమ
దోపిడేందిరో – దొరపీకుడేందిరో…. |“ఊరు” |

చరణం6: కూలి నాలి పేదోళ్ళ౦! కలిసిమెలిసి వుండాలే
సంఘపోల్ల జెండ కింద! సంఘమొకటి బెట్టాలే
మనల దోచే – ఈ దొరల మక్కెలిరుగదన్నాలే… | “ఊరు” |

జ‌న‌నం: న‌ల్ల‌గొండ‌. 'ఆధునిక క‌విత్వంలో అస్తిత్వ వేద‌న‌', 'అంతర్ముఖీన క‌విత్వం' అనే అంశాల‌పై ఎం.ఫిల్‌, పీహెచ్‌డీ ప‌రిశోధ‌న చేశారు. ప్రాథ‌మిక త‌ర‌గ‌తి నుండి డిగ్రీ స్థాయి తెలుగు పాఠ్య పుస్త‌కాల రూప‌క‌ల్ప‌న‌లో కీల‌క‌మైన స‌భ్యుడిగా, ర‌చ‌యిత‌గా, సంపాద‌కుడిగా బాధ్య‌త‌లు నిర్వ‌హించారు. అనేక కవితలు, సమీక్షలు, ముందుమాటలు, పరిశోధనా వ్యాసాలు రాశారు. పలు పురస్కరాలు అందుకున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కాలేజ్ తెలుగు శాఖలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. 'జీవ‌న లిపి'(క‌విత్వం), 'స‌మ‌న్వ‌య‌'(సాహిత్య వ్యాసాలు) ర‌చ‌న‌ల‌తో పాటు వివిధ గ్రంథాల‌కు సంపాద‌క‌త్వం వ‌హించారు.

10 thoughts on “దొరల గుండెల్లో భూకంపం పుట్టించిన ‘ఊరు మనదిరా! ఈ వాడ మనదిరా!’

  1. తొంభైవ దశకం దాకా ప్రతి పల్లె గుండెల్లో ధ్వనించిన పాటను ఈ తరానికి పరిచయం చేసినందుకు ధన్యవాదములు

  2. పాటలో దాగున్న సత్యం, కవి ఆశయం కాలాన్ని సైతం ధిక్కరిస్తుంది. నివ్వెరపరుస్తుంది.

    Sir l loved those lines ….🙏👌

  3. సమసమాజ స్థాపనకు భూమికైన పాట ఇది ఈ తరానికి పరిచయం చేసినందుకు డాక్టర్ రఘు గారికి ధన్యవాదాలు .
    ఈ పాటలో గొప్ప సాహిత్య విలువలతో పాటు అంజన్న గొప్పతనం ,ఈ ప్రాంత వెనుకబాటుతనాన్ని కళ్లకుకట్టినట్లు రూపొందించారు.మీ అద్భుతమైన రచన అందరి హృదయాలను కదిలించేలా స్ఫూర్తిని నింపేలా ఉంది

  4. అంజన్నకు గొప్ప నివాళి మీ వ్యాసం…. ఇప్పటికీ అందరి హృదయాల్లో ఆలోచనలు రగిలించే స్ఫూర్తి ఈ పాట

  5. ఊరుమనదిరా….పాట రచయిత గూడ అంజయ్య గారి అంతర్నిగూఢ తత్వాన్ని ఒడిసిపట్టి మీరు అందించిన ఈ వ్యాసం…. మంచి సమీక్షా వ్యాసాలు రాయాలనుకునే వారికి దిక్సూచి వంటిది. అగ్గిరవ్వ లాంటి పాటకు మీరందించిన విశ్లేషణ ఆనాటి విప్లవాగ్నులను మరోమారు గుర్తుకు తెచ్చింది ధన్యవాదాలు…..

  6. భూమిని తన చెమట చుక్కలతో తడిపి బంగారం పండించే రైతన్నలను దోచిన దొరల అధిపత్యాన్ని పాట అనే గుతప దెబ్బతో శ్రమదోపిడి దారుల గుండెల్లో బుగులు పుట్టించిన గూడ అంజయ్య ‘ఊరు మనదిరా’ గీతంలోని ప్రపంచ కార్మిక ఆక్రోశ విస్ఫోటనానికి అక్షర రూపం కట్టి చూపించారు సర్.

    నిజంగా మీ మాటలు చదివినాక ఈ గీతం శ్రామిక జనుల జంగు సైరన్ లాగా అనిపించింది.

    నాటినుండి నేటిదాకా వ్యవస్థ రూపురేఖలు మారినట్టు దొరతనం కూడా తన రూపురేఖలు మార్చుకొని బలహీన వర్గాలు నెత్తురును తాగుతున్న వెయ్యికాళ్ళ జెర్రీ లా మారిన వైనం కనిపిస్తున్నది.

    నాగలి పట్టిన రైతన్న, బొగ్గు తట్టలెత్తిన సింగరేణి శ్రామికుడు, కర్మాగారాల్లో నలిగిపోతున్న కార్మికుడు ఇలా ప్రపంచ కార్మికుల పాటవంపై కోట్లకు పడగలెత్తిన పెట్టుబడిదారుల వ్యాపార మనస్తత్వం ఒకవైపు కనిపిస్తుంటే దాన్ని ధనుమాదే సుత్తి,పార,పలుగు, ఒకవైపు కనిపిస్తున్నాయి.
    చరిత్ర పుటల్లో దోపిడీకి వ్యతిరేకంగా నిరంతరం జరుగుతున్న పోరాటం కనిపిస్తుంది.

    భూమికి పచ్చని రంగేస్తూ కులవృత్తుల సమాగమంతో ఒకరికోసం ఒకరం అన్న సమాజంలో దేశముఖ్ దేశాయిలు చేయించుకున్న వెట్టిచాకిరిని నిరసిస్తూ కమ్మరి కొలిమిలో ఊపిరిపోసుకున్న నిప్పురవ్వలా రెక్కల కష్టం తాను పాట రూపమెత్తి శ్రామిక దోపిడీని ప్రశ్నిస్తూ, దాష్టీకాలను ధిక్కరించి దొరల ఊరు దాటించిన తీరు కనిపించింది.
    ప్రజాగ్రహం పెల్లుబికితే ఎంతటి నియంత అయినా కూలిపోవాల్సిందేనన్న జగతిసత్యం మరొక్కమారు ఆవిష్కృతమైంది.

    శ్రామిక పనిముట్లు ఎదురుతిరిగి స్వాతంత్ర్య గీతం పాడుకున్న వైనం గుండె వేగాన్ని పెంచింది సర్🙏

  7. ఆదిలాబాద్ జిల్లా లక్షెట్టిపేట తాలూకాలో గూడ అంజయ్య పుట్టిన లింగాపూర్ సమీప గ్రామాలలో పెరిగిన నాకు ఆనాటి సామాజిక పరిస్థితులపై కొంత అవగాహన ఉంది. అంజన్న రాసిన పాటలు జనసామాన్యంలోకి ఎంత చొచ్చుకుపోయాయో ఎలా ఉర్రూతలూగించాయో, ఎలా ముందుకు ఉరికించాయో గుర్తుచేసిన రఘుగారికి ధన్యవాదాలు.

    ఈ ఊరు మనదిరా పాట రచనా కాలం తెలిస్తే చెప్పగలరా..

  8. చక్కటి విశ్లేషణ సర్… హృదయ పూర్వక శుభాకాంక్షలు….

  9. చాలా బాగా విశ్లేషించారు సార్. పాటలను సమీక్షించాలనుకునే నాలాంటి వారికి దారిదీపంగా ఉపయోగపడుతుందీ వ్యాసం.

  10. నేలతల్లిని నమ్ముకొని తరతరాలుగా జీవిస్తున్న మట్టి బిడ్డలపై తరతరాలుగా దొరలు సాగించిన అకృత్యాలపై తిరగబడ్డ ప్రజాకవి గూడ అంజయ్య గారు. పల్లె అస్తిత్వాన్ని ప్రజల మనుగడను దెబ్బతీసే దొరల పెత్తందారి వ్యవస్థపై తిరగబడ్డ మట్టి మనుషుల ఆగ్రహజ్వాలల నుండి రూపుదిద్దుకున్న ఈ పాటకు ఎస్.రఘు గారు తనదైన శైలిలో చేసిన అద్భుతమైన విశ్లేషణ అక్కడి ప్రజల ఇక్కట్లను ఆనాటి స్థితిగతులను తెలియచేసింది. దొరల గుండెల్లో భూకంపాలు పుట్టించిన ఆనాటి పాట ఈ తరం కళ్లముందుకు
    తీసుకొచ్చినందుకు మరొక్కసారి మీకు ధన్యవాదాలు🙏

Leave a Reply