ఊరు చేరిన వేళ… ఊపిరొచ్చే…!

అలసి సొలసిన ఆప్తులు
అరుదెంచె సొంతూరు!
చెమట జీవుల శ్రమలు
కళ్లారా జూసిన నేల కుమిలిపోగా…
వలస బ్రతుకుల వెతలు
కథ కథలుగా చెప్పుతుండే…
మనిషిదో వ్యధ! వినగా వినగా
ఇనుము కరుగుతుండే….!
కనులు మూసిన చాలు
రహదారి కష్టాలు కలత నిద్రనూ
కలవరపెట్టి కలల తెరలై కదలాడ
కానిపనికి పోయిన తలపు వచ్చే…!
రెక్కలూడిన పక్షి
కాళ్ళను రెక్కలు చేసి
రాకాసి దూరాలు దొర్లుకొచ్చే…!
రక్తముద్రలు వేసిన పాదాలు
తల్లి ఓడిన చేర
ప్రతినబూని నడిపి నచ్చిన
దార్లుకు రక్త తిలకం దిద్ది
జై జై నినాదాలు పలికి వచ్చే…!
ఆకలైననాడు అమ్మ గుర్తుకొచ్చే…
దాహమేస్తే ఊర చెరువు
ఊటలు జ్ఞప్తికొచ్చే…!
కష్టమొచ్చి కళ్ళు కన్నీరు కార్చగా…
ఊరు పొలిమేర తెరలు తెరలుగా
కనిపించి భుజంతట్టి కాస్తా
బుజ్జగించి భవితపై ఆశపెంచే…!
అమ్మ ప్రేమ తప్ప ఏమీలేని…
పుట్టినూరు పయనం ఎందుకంటే…
జన్మభూమినొకసారి చూసి…
బ్రతుకు జీవుడుకి నిండు ఊపిరినిచ్చి
నాఅన్న వారి నీడన సేదదీరుటకన్నా
జీవన సాఫల్యమేముందని
బదులు పలికి నిబ్బరాల నవ్వు పూసే…!
ఉన్నపళంగా కరువు ఉప్పెనై…
తరిమి తరిమి తన్నివేసినా…
తనువు మొదలైన చోటకొచ్చి పడి…
ఉన్నామన్న తృప్తి గుండెను
గులాబీ పువ్వును చేసి…గభాళించే!
వలస మాట చెవిన పడగానే….
మనసులో బాటల ములుగుచ్చే
బలుసాకైనా తిని ఊర్లోనే…
బుద్ధిగుండి శేషజీవితాన్ని
శ్రద్ధగా గడుపుకొనగా ….
వలస పక్షులన్నీ ఊసులాడే..!

పుట్టిన ప్రాంతం పుల్లిట మామిడిపల్లి, సంతకవిటి మండలం, శ్రీకాకుళం జిల్లా. కవి, రచయిత, అధ్యాపకుడు, సామాజిక కార్యకర్త. ఎం వీ స్వామిగా సుపరిచితం. కలం పేర్లు ఆజాద్, పృథ్వి. ముప్ఫయేళ్లుగా రాస్తున్నారు. సుమారు వెయ్యి కథలు, ఐదు వందల కవితలు, అధిక సంఖ్యలో పాటలు, గేయాలు, కథానికలు, వ్యాసాలు, హైకూలు, "నేటి బాలలకు నీతికథలు" పేరుతో బాలల కథల పుస్తకం ప్రచురించారు. ప్రస్తుతం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కృష్ణదేవిపేట, గోలుగొండ మండలం, విశాఖ జిల్లాలో ఆంగ్లభాషా పాఠశాల సహాయకునిగా పని చేస్తున్నారు. విశాఖపట్నం జిల్లా చోడవరంలో నివాసముంటున్నారు.

3 thoughts on “ఊరు చేరిన వేళ… ఊపిరొచ్చే…!

  1. బాగుంది గాని పల్లెల్లో ఉపాధి ఏమాత్రం ఉందన్నా

    1. లేదు మిత్రమా… అది కూడా పేదలకు మరో ఇబ్బంది

  2. లేదు అదికూడా ఒక పెద్ద సమస్య పల్లెల్లో

Leave a Reply