ఉన్నాయో!? లేవో!?

నీ కోసం డైరీలో రాసుకున్న పదాలు-
నిలబడతాయి ఎదురుగా,
వలస పోయే పక్షుల బారులా,

నీలం అంబరాన్ని చూస్తో నేను,
నిన్ను ఊహించుకుంటాను.
అక్కడ మేఘాల దొంతరలు, నీ రూపుని కట్టడానికి
గాలి తోడుని పిలవడం కనబడుతుంది.

నా పాదాలపైకి
చెట్టు పూలు రాలుస్తుంది,
మెదడులో మొలచిన ఊహలకు నకలుగా అనిపిస్తాయి పారాణి వర్ణపు కుసుమాలు.

తీగెలకు వేలాడే
మొగ్గలు,
నవ్వుని
నీ
చెక్కిలి నుంచి అరువుతెచ్చుకున్న
మెరుపుల్లా అనిపిస్తాయి.

దారిన పోయే బడ్డెండ్ల మెడగంటల గలగలలు
నీ గజ్జెల సవ్వడిలా అనిపిస్తాయి

నా భుజాలు పట్టుకొని కవిత్వంలోకి చూస్తో,
అందులో ఒక వాక్యం నచ్చి
విచ్చుకునే నీ మందహాసంలా
ఓ అల నదిలోంచి తీరందాకా వచ్చిపోతుంది.

వెనుక నుంచి ఒరుగుతున్న సాయంత్రం
నీ పైట కొంగులా,
కొంగులో స్నిగ్ధమైన నీ మోము
సూర్యుడినీ తలపిస్తాయి

నేను మళ్ళీ అవే
పదాలను పట్టి పట్టి చూస్తాను
దృశ్యానికి సరిపోయేలా ఉన్నాయో లేవో..అని..

ఊహల నేల పచ్చటి పొలంలా
పరుచుకున్నదని తెలిసి
నెమ్మదిగా ఇంటికేసి నడుస్తాను

నది నా వీపునెక్కి
తొంగి చూస్తుందేమోనన్న భ్రమ
నా తోడు గా వస్తుంది

నదికి నీవు,
నీకు నది,
నదీ-నువ్వు, నాకు-
ఇచ్చి పుచ్చుకునేదేమిటీ?
ఒక్క జీవన తడి!!

కడప జిల్లా ప్రొద్దుటూరు వాసి. 1998 నుంచి కవిత్వం, కథలు రాస్తున్నారు. ఇప్పటి వరకూ 100 కు పైగా కవితలూ 12 కథలూ, అడపా దడపా వ్యాసాలు రాశారు.

One thought on “ఉన్నాయో!? లేవో!?

  1. వందకు పైగా మాత్రమేనా భయ్యా.
    ఎన్నో కవితలు రాశారు కదా.
    కవిత్వంలో మీది ప్రత్యేక శైలి.

Leave a Reply