ఉత్తర దచ్చినం

కొన్ని కలవ్వు అంతే. ఎదురెదురుగా ఉణ్ణా ఉత్తరదచ్చినం కలవ్వు. తూర్పు పరంటా కలవ్వు. పక్కపక్కే ఉణ్ణా రైలు పట్టాలు కలవ్వు. ఇంగ మడుసులేడ కలస్తారు. కలస్తారనుకొనేది గూడా వొట్టి బెమే.

పొద్దుబుట్టి సద్దేళ దాటి పొయ్యింది. నేను పచ్చాపల్లం పోయొద్దామని ఎలబారి ఊదిలేకొచ్చినాను. బొజ్జిగోడు ఎదురొచ్చి, మావా! ఈ పొద్దు కండిగిలో పెద్దిరెడ్డి కూతిరికి దినమంటనే పోలేదా? అని అడిగినాడు.

నేను “ఏందిరా! నువ్వు సెప్పేది. నాకు తెల్వకుండా పెద్దిరెడ్డి కూతుర్కి దినమా? వొక్క మణిసే గాదు గొడ్డు, గోదా, సచ్చినా, కూటికి లేనోడు సచ్చినా, కోటీస్పుడు సచ్చినా, సొశాణానికి రావాల్సిందే, తోటోడైన నేను వాళ్ళ కట్టె కడతేర్సల్సిందే, అట్ట నాకు తెల్వకుండా పెద్దిరెడ్డి కూతురు సచ్చేదేంది దినమేంది” అన్నాను.

దానికి వాడు “ఏం సెంగల్రాయ మవా! సుట్టు పక్కల ఊళ్ళకు నువ్వు తోటోడైతే, పట్నానికి గూడా నువ్వే తోటోడా? ఇప్పుడాయన కాపరముండేది తిరప్తిలో గదా! ఆడ సచ్చిపొయ్యిందేమో. నేనిప్పుడు ఆడినించే వొస్తావుండా తెల్సింది గాబట్టి నువ్వు తోటోడని సెప్పినాను. పోతావో పోవో నీ ఇష్టం” అని పూడ్సినాడు.

నిజమే ఆయిన ఊళ్ళో ఉంటే నాకు తెల్వకుండా పోదు. ఆయన పట్నం బొయ్యి శానా ఏండ్లయి పొయ్యింది. పట్నంలో జరిగే సంగతులు పక్కింటోళ్ళకే పొక్కవ్, అట్టాటిది మూల కాడులో ఉండే మనకెట్ట తెలస్తాయనుకొని పచ్చాపల్లం ఎలబారేసి నాను. పచ్చాపలమంటే సిన్న టౌను ఏది కావాలన్న పొయ్యి తెచ్చుకుంటా ఉంటాము.

పెద్దిరెడ్డంటే ఆ వూరికే పెద్ద రైతు, వూరిసుట్టూ ఆయని నేలలు భూములే. పచ్చాపల్లంలోనే గాదు తిరప్తిలోనూ జాగాలుండాయి. అంత ఆస్థకి వొకటే కూతురు. కొడుకులు పుట్టిపుట్టీ సచ్చిపొయ్యినారు. ఆయమ్మను సదివించుకొంటా ఆడనే కాపరముండాడు.

నేను పచ్చాపలం బొయ్యి ఆడ పన్జూసుకొని మద్దేనాల కంతా కండిక్కి వొచ్చేసినాను. అప్పిటికే పెద్దిరెడ్డింటికి సుట్టాలంతా వొచ్చేసి ఉండారు. పెద్దిరెడ్డి ఇంట్లేకి బైటికి కాలు గాలిన పిల్లి మాదిరిగా తిరగతా ఉండాడు.

వొకసారి ఆయన్ని కల్సి, కూతురు పొయ్యిందని తెల్సి నాకు బలే బాదై పొయ్యింది. పాపం వొక్కగానొక్క కూతురు. మీకూ బాదగానే ఉంటిది. కన్న పేగు గదా! బాద పడొద్దండి అని సెప్పదామని, అట్ట వాకిట్లేకి పొయ్యి “రెడ్డిగోరూ! మనమ్మి పొయ్యిందని తెల్సింది. యట్ట జరిగింది” అన్నా!

ఆయన నోరిప్పితే ముత్తేలు అనుకున్నాడేమో. మాట్లాడ లేదుగాని, సలసల కాగే సముర్లో ఏసి దేవిన అప్పళం మాదిరిగా మూతి ముప్పైయారు వొంపులు తిప్పి, లోపలికి పూడ్సినాడు. మల్ల నేను ఆయన్ని మాట్లాడించ లేదు. ఎందు కంటే పాపం ఆయన కూతుర్ని దారబోసుకున్న యాదన్లో ఉండాడని అక్కడే వొకసోట కూసునేసి నాను.

వొచ్చిన సుట్టాలంతా తిన్నెల మింద కూసోని గుసగుసా సెవులు కొరుక్కుంటా వుంటే నాకనిపించింది. ఆయనికుండేది వొకే వొక కూతురుగదా! ఇప్పడాయమ్మా పొయ్యింది. ఆస్తిపాస్తుల గురించి మాటాడతా ఉండారేమో అనుకున్నాను. మల్ల ఆ వూరి వొంకాలబ్బ కనబడితే అడిగినాను.”ఇంతకూ ఆయమ్మ యట్ట సచ్చిపొయ్యిందని

ఆయబ్బ “యట్ట జరిగిందో తెల్దు సెంగల్రాయా! పట్నంలో సచ్చిపొయ్యిందని మాత్రం సెప్పతా ఉండారు” అన్నాడు.

ఇంతలో పెద్దిరెడ్డి దాయాదుల్తో కల్సి రేవు కాడికి ఎలబారేసి నాడు. అంతలో భోజినాలు గూడా ఏసేది ఆరంబించేసినారు. నేను గూడా పొయ్యి వొక వార్న కూసోని తినేసినాను. పలహారాలు గిలహారాలు ఆయన తాహతుకు తగినట్టు బాగనే సేసినారు మల్లా వొచ్చి ఆడనే కూసొనేసినాను.

నేను పెద్దిరెడ్డి కోసమే ఎదురుచూస్తా ఉండాను ఎందుకంటే సావుకు సెప్పలేదు తప్పొయ్యింది సెప్పుంటే తోటోడిగా నా మావూలు నాకు దక్కుండేది. ఆ రోజు తప్పొయ్యింది గాబట్టి ఈ పొద్దు ఎంతో అంత ఇయ్యక పోతాడా అనేది నా ఆశ. పది రూపాయలొచ్చిన వొచ్చినట్టే గదా!

రేవు కాడికి పొయ్యినోళ్ళు గూడా కొత్త గుడ్డలు కట్టుకొని తిరిగొచ్చేసి నారు. పెద్దిరెడ్డి వొంటిగా దొరికితే అడగాలని కూసోనే ఉండాను. కొంసేపిటికి వాకిట్లేకొచ్చినాడు అడగదామని పోయే కొద్దికి ఆడికి రాయుడొచ్చేసి నాడు. ఆయనిముందు అడగ గూడదని తిరిగొచ్చి కూసొనేసి నాను. ఎందుకంటే పంచాయతి ఎలక్సన్ల కాణ్ణించి ఆయన మేము మొకం తపాలతో ఉండాం.

నేను తిరగతా ఉండేది గెవణించిన రెడ్డేరి నారాయణుడు “ఏవిరా! సెంగల్రాయా! తింటివి ఇంటికి పోవచ్చుగదా ఎందుకింకా ఇక్కడ అని అడిగినాడు.

నేను సేతులు నలుపుకుంటా “అయ్యా! అదీ!..అదీ…! సావురోజు సెప్పుంటే నా మావూలు నాకు దక్కుండేది. ఆ రోజు తప్పొయ్యింది. ఈ రోజన్నా గెవణిస్తాడేమోనని ఉండానని నోట్లోనే గొణిగినాను.

ఆయనకెందుకు గమ్మోనుండచ్చు గదా! ఏమన్నాడంటే “ఆవోడు ఆవుకేడస్తా వుంటే నీ బోటోడు కొవ్వు కేడ్సినాడంట అట్టుండాది నీ యవ్వారం. ఆయన బాదలో ఆయనుంటే నీకు మావూలు కావాల్సొచ్చిందా? అంటా లోపలికి పూడ్సినాడు. దాంతో నాకు ముక్కులో ఎంటిక పెరికినట్టై పొయ్యింది. ఇచ్చేది ఆయన తీసుకొనేది నేను. మద్దెలో ఈయన రుబాబేంది అని ఆడనే కూసున్నా.

పొద్దు పరంట తిరిగిపోతా ఉంది పెద్దిరెడ్డింట్లో ఏదో రచ్చా రావిడిగా ఉంది. ఆ రచ్చలు ఎప్పుడు వొగదెగతాయో ఆయనెప్పుడు బయటికొస్తాడో. నేనిట్టా సావులూ దినాళ్ళు ఎన్నో సూసినాను. ఈ సావుకార్ల కార్యాలెప్పుడూ సక్రంగా జరిగింది లేదు. అయినోళ్ళు ఆస్తిపాస్తుల కాడ కొట్లాడకొనే దానికి సరిపోతాది. ఇంగ సచ్చినోళ్ళను యాడ ఆయిగా సాగనంపతారు. ఏమీ లేనోడి పని మేలు కదా! సచ్చేటప్పుడు ఆయిగా కన్ను మూస్తాడు. మేమూ ఆడతా పాడతా ఆయిగా సాగనంపి వొచ్చేస్తాము.

ఇంటికాడ ఏమనుకుంటా వుండారో ఏమో. రేపటాల వొచ్చినాను ఈడనే మాపటేల అయ్యే మాదిరిగా ఉంది. ఎలబారేద్దా మనుకుంటే ఇంతసేపుండీ వొట్టి సేతల్తో యట్ట పోయ్యేదని ఆడనే కూసున్నాను. అట్టని ఎంతసేపు కూసుంటాం. అందుకే ఆ గొడవేందో సూడాలని పోతే తెల్సింది.

పెద్దిరెడ్డి అప్పజెల్లి ఆస్తిలో బాగం కావాలని అడగతా ఉంది. ఆయనేమో ఇంకెక్కడాస్తి, గుళ్ళకు గోపురాలకు రాసిచ్చేసి నాను అని సెప్పతా ఉండాడు. సూస్తే ఆ రగడ అంత అరీబురిగా తేలేటిగా లేదు. వొట్టి సేతల్తో తిరిగొచ్చేస్థిని ఎప్పుడో వొకప్పుడు ఇయ్యక పోతాడా అని. మల్ల ఆయన ఇచ్చింది లేదు నేను తీసుకునింది లేదు. మల్ల నేనా సంగతే మరిసి పోతిని.

మా బామర్ది దున్నగోడు తిరిప్తిలో అమాలీగా పన్జేస్తాడు అంటే మూటలు మోసే పని. నా కొడుకు గూడా ఆడనే సదవతా ఉండాడు. ఈడ కళ్ళాలు గిల్లాలు లేనప్పుడు, దున్న గోడి దగ్గరికి పొయ్యి రెండు మూడు దినాలుండొస్తాను. ఒక నాడు సందేల కాడ లోడు లారీలేమన్నా వొస్తాయేమోనని రేడీ టేసిని కాడ కూసోనుండాము.

అక్కడ ఉన్నట్టుండి అచ్చం పెద్దిరెడ్డి కూతురి మాదిరి గానే కనబడింది. ఏందిరా! అదే కన్ను అదే ముక్క అదే నడక అంతా పెద్దిరెడ్డి కూతురు మాదిరిగానే ఉందేని నాకరుసోద్దిమై పొయ్యింది. అప్పుడు దున్న గోడితో అంటిని.” ఈ పెపంచంలో మణ్ణిసిని పోలిన మణుసులు ఏడు మందుంటారంటే యేమో అనుకున్నా. ఇప్పుడు ఇక్కడొక పిల్లని జూస్తే నిజమేనని పిస్తావుంది. అచ్చం పెద్దిరెడ్డి కూతురు మాదిరిగానే ఉంది” అన్నాను.

వాడు “మావా! ఆడబొయ్యిన పిల్లని గురించా నువ్వు మాటాడేది పెద్దిరెడ్డి కూతురే సందేహ మేముండాది. రాయల నగర్లోనే కాపరముండాది” అన్నాడు.

నేను “వొరే! నీకు అసలు సంగతి తెల్దను కుంటా. పెద్దిరెడ్డి కూతురు సచ్చిపొయ్యి దినాలు గూడా సేసేసి నారు, మూడో నెల కూడా పెట్టేసింది. నేను గూడా ఆ దినాలకు పొయ్యొచ్చినాను” అన్నాను.

వాడు “ఏంది మావా! నీకేమన్నా ఎర్రా పిచ్చా. పెద్దిరెడ్డి కూతురు సచ్చిపోయే దేంది? ఆ యమ్మి ఇదే దోవలో ఇరవై నాలుగ్గెంటలూ తిరగతా ఉంది. అప్పుడప్పుడు నాతోగూడా మాటాడతా ఉంటింది” అన్నాడు.

సచ్చి పొయ్యిందని నేను. లేదు బతికే ఉందని వాడు. అట్ట మేమిద్దురం శానాసేపు వాదులాడు కొన్నాము. ఊరికి రా నీకే తెలిస్తింది పెద్దిరెడ్డి గూడా ఆడనే ఉండాడు అని నేనంటే. వాడు ఊరిదాకా ఎందుకు? ఇంకొంసేపుంటే ఇదే దోవమ్మిటా వొస్తాదని వాడు. ఇట్ట వాదులాడుకుంటా ఉంటే, ఆ యమ్మి రానే వొచ్చింది. మాతో మాట్లాడను గూడా మాట్లాడింది.” ఏం సెంగల్రాయన్నా బాగుండావా” అని.

దీంతో నా మనుస్సంతా అయోమయంగా అయిపొయ్యి ఆలోసిస్తా ఉండి పోతిని. ఏం జరిగిందబ్బా ఇదంతా కలా నిజమని.

మల్ల దున్నగోడే “ఏంది మావా ఇంగా ఆలోసెన సేస్తా ఉండావు. ఏం జరిగుంటుందో నేను సెప్పతాను యిను. ఇక్కడ ఆయమ్మి మన మాల పిలగోణ్ణి వొకణ్ణి ప్రేమించి రిజిస్త్రాపీసులో పెండ్లి గూడా సేసుకునింది. ఇది పెద్ది రెడ్డికి తెల్సి అగ్గిమింద గుగ్గలమైనాడు. ఇద్దర్ని యిడదీయాలని ఎన్నో యిదాలుగా సూసినాడు కుదర్లేదు. బతిమాలినాడు బామాలినాడు బయపెట్టినాడు కుదర్లేదు. పోలీసు టేసన్లో పంచాయతి గూడా జరిగింది. పోలీసోళ్ళు ఇద్దరికి మైనార్టీ తీరిపొయ్యింది ఏమీ సెయ్యలేమని సేతులెత్తేసి నారు.

తరవాత పెద్దిరెడ్డి దీన్ని జీర్ణం సేసుకోలేక ఈడ అన్నీ కాళీసేసుకొని ఊర్లేకి పొయ్యినాడని తెల్సింది. నువ్వు సెప్పే దానిబట్టి సూస్తే తన కూతురు తన కులం గానోణ్ణి పెళ్ళి సేసుకుందని సెప్పుకోనే దానికంటే సచ్చిపొయ్యిందని సెప్పుకునేది మంచిదని జనాని నమ్మించే దానికి సచ్చి పొయ్యిందని దినం గూడా సేసినట్టుంది మావా!” అన్నాడు.

అప్పుడర్థమయ్యింది నాకు ఆయన తన పరువును కాపాడు కొనేదానికని కన్న కూతురు బతికుండ గానే కొరివిబెట్టి నాడని.

అప్పుడన్నాడు దున్నగోడు “మావా! ఉత్తర దచ్చినం తూర్పు పరంట ఎదురెదురుగానే ఉంటాయి గాని కలవ్వు. రైలు పట్టాలు పక్కపక్కే ఉంటాయి అయ్యి కలవ్వు. అట్టా టప్పుడు మనం కలవాలనుకున్నా ఈ అగ్ర కులపోళ్ళు యాడ కలవనిస్తారు మావా! తెంతుకోవాలనే సూస్తారు. అట్టిప్పుడు కూతుర్ని వొగదెంచు కునేసుకున్నాడు అంతే మామా!” అన్నాడు. కలవాలను కునేది నాకూ వొట్టి బెమే ననిపించింది.

పుట్టింది చిత్తూరు జిల్లా వెదురు కుప్పం మండలం. బతుకుదెరువు కోసం కార్వేటినగర్ మండలానికి వలసవెళ్లారు. పేదరికం వల్ల ఎక్కువగా చదువుకోలేదు. చిన్న చిన్న చిన్న ప్రైవేటు ఉద్యోగాలు చేశారు. పదవ తరగతి పాసైన తరువాత యస్ వీ ఓరియంటల్ కాలేజీలో తెలుగు ప్రీ డిగ్రీ చదువుతూ మధ్యలోనే ఆపేశారు. తరువాత ఎస్వీ యూనివర్శిటీ(ఓపన్ యూనివర్సిటీ)లో చేరి మధ్యలోనే ఆపేశారు. ఇద్దరు పిల్లలు చదివి పెద్ద ఉద్యోగస్తులయ్యారు. ఇప్పుడు రచనలు చేయటానికి ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. చిన్నప్పటి నుంచి పుస్తకాలు ఎక్కువ చదవడం, నిమ్నకులాలతో కలసి తిరిగి వారి కష్ట సుఖాలను, వారి జీవన విధానాన్ని ఆకళింపు చేసుకున్నారు. రచనలు : చాకిరేవు కతలు(2017), మావూరి మంగలి కతలు(2018), ప్రకృతి వికృతి(2019). మట్టి పూలు(కుమ్మరి కతలు), బాపూజీ ఓకల, వెలివాడ కతలు త్వరలో రానున్నాయి.

Leave a Reply