కొత్త జీవిత కోణాలను దర్శింపజేసే “ఈస్తటిక్ స్పేస్”

తెలుగు సాహిత్యంలో కథలకు ప్రస్తుతం మంచి ప్రాచుర్యం ఉంది. ఇప్పుడు ఎన్నో కథా సంకలనాలు ప్రచురితమవుతున్నాయి. ఒకే విషయం పై ఎన్ని కథలు వచ్చినా, ప్రతి రచయిత ఆలోచన, విషయం పట్ల అవగాహన, జీవితానుభవం, వారిని ప్రభావితం చేసిన విషయాలు ఒకేలా ఉండవు. అందువలన ప్రతి రచయిత కథాశైలి భిన్నంగా ఉంటుంది. దీని వలన పాఠకులు ఎన్నో కొత్త కోణాలను అవగతం చేసుకునే అవకాశం ఉంటుంది. దగ్గుబాటి పద్మాకర్ గారి “ఈస్తటిక్ స్పేస్” ఒక మంచి కథా సంకలనం, రచయిత ఆలోచనలోని లోతు, పరిశీలనా దృష్టి ప్రతి కథలోనూ కనిపిస్తాయి. వాస్తవానికి ప్రతిరూపాలుగా అన్ని కథలున్నాయి అని చెప్పను కాని ప్రతి కథ ద్వారా కొత్త జీవిత కోణాలను దర్శించగలం.

“యూ టర్న్” అన్న కథనే తీసుకుంటే, జీవితంలో ఎంతో సంపాదించిన ఒక వ్యక్తి సంతోషాన్ని వెతుక్కున్న విధానం, చివరికి అతనికి తన జీవిత పరమార్ధం అర్ధమయిన విధానాన్ని గమనిస్తే, ఇది పూర్తిగా ఐడిలిస్టిక్ కథ అని ఒప్పుకుంటాం. కాని కొన్ని వాక్యాలు మనకు చాలా దగ్గరవుతాయి. “బాధగా, సంతోషంగా అనిపించకపోయినా నిద్ర పట్టని సంఘటనలు” ఉంటాయని అవి చాలా మంది జీవితాలలో భాగాలని ఈ కథ చెబుతుంది. దాచి పెట్టుకున్న బలపాలను ప్రేమగా తనకు ఎంతో నచ్చిన టీచర్ కి ఇస్తూ తన అమూల్య నిధిని మరొకరి పరం చేయడంలోని ఆనందాన్ని అనుభవించే ఒక పసి మనసు మిస్టర్ సేన్ అనే ఒక ధనవంతునిలో ఆలోచనలను రేపుతుంది. వాస్తవదృష్టిని అంగీకరించడానికి అవసరమైన ధైర్యం జీవితంలో ప్రతి ఒక్కరికి ఉండవలసిన అవసరాన్ని ఈ కథలో రచయిత చర్చించడం వెనుక వారి జీవిత పరిశీలన కనిపిస్తుంది. “శాస్త్రవేత్తలు పది సంవత్సరాల పాటు కొనసాగించిన ప్రయోగాలను కూడా ఫలితాలు వ్యర్ధమని తేలితే నిర్దాక్షిణ్యంగా మూలన పడేస్తారు” అంటారు ఆయన. ఇది చాలా గొప్ప సత్యం. జీవితంలో ఒక దారిన ప్రయాణించి ఆ దారి మనకు సరయినది కాదు అని అర్ధం అయిన తరువాత అలావాటు కొద్దీ, ఓటమి ని ఒప్పుకోవడాని అహం అడ్డు వచ్చి, జీవితాన్ని మళ్ళీ మొదటి నుండి మొదలెట్టడానికి భయపడే మనుషులు, తమ జీవన పంధా మార్చుకోవడానికి వెనుకాడడం వలన ప్రశాంతతకు ఎంత దూరం అవుతున్నారో అర్ధం చేసుకోగలిగితే, ఎన్నో మానవ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. కధలో ఎంత సంపాదించినా తృప్తి లేక చివరకు సేవా మార్గం పట్టిన మిస్టర్ సేన్ గురించి చదువుతున్నంత సేపు ఈ కథావస్తువు పాతదే అనిపిస్తుంది. కాని ఆ మార్గానికి రావడానికి మిస్టర్ సేన్, డాక్టర్ల మధ్య జరిగిన మేధోమధనం ఎన్నో ఆలోచనలకు బీజం వేస్తుంది. రచయిత ఎన్నుకున్న కథావస్తువు పాతదే, కాని ఈ కథ ద్వారా ఆయన చర్చించిన విషయాలు అనేకం “దేనినైనా కోల్పోవలసి వచ్చినప్పుడే తన నమ్మకం పట్ల తనకు గల నిజాయితీ మనిషిని నిలదీస్తుంది. అలా కోల్పోయేందుకు సిద్ధపడనివారి నమ్మకం అనుమానాస్పదం అవుతుంది” అని కథను ముగింపు వైపుకు నడిపిస్తారు రచయిత. అలాగే ఎడ్యుకేషన్ సెక్టర్ పై మనం చూపుతున్న చిన్న చూపుని కూడా ఈ కథలో పొందుపరిచారు. “రాళ్ళను కూడా తవ్వుకొచ్చి కనీసం, వ్యాపారం పేరుతోనైనా వినియోగంలోకి తెస్తున్నాం, కాని మట్టిలో పుట్టి మట్టిలో కలిసిపోతున్న వారికి జ్ఞానాన్ని అందించి, తిరిగి దానిని వినియోగంలోకి తీసుకురాలేకపోతున్నాం” అని చెప్పిన డాక్టర్ మాటలు విన్న తరువాత మిస్టర్ సేన్ తన ఆస్తిని విద్యారంగం కోసం వినియోగించాలని నిశ్చయించుకుంటాడు. తాను పోగుచేసుకున్న బలపాలను సేన్ కు ఆ పసి పాప క్లాసులో చూపించినప్పుడు, కొందరికి ఒక్క బలపం కూడా లేని సమయంలో అన్ని బలపాలు దాచుకోవడం తప్పని ఆ చిన్నపిల్లకు చెబుతున్నప్పుడు మిస్టర్ సేన్ మనసులో మొదలయిన మధనం, తాను తన ఆస్థిని పోగు చేసుకున్న విధానం గురించి ఆలోచించడం వైపు ప్రయాణించి చివరకు ప్రజా జీవితాన్ని ప్రారంభించాలనే ఆలోచనతో ముగుస్తుంది. ఈ ముగింపు వైపుకు మిస్టర్ సేన్ చేసిన ప్రయాణం ఈ కథలో ఆస్వాదించవలసినదే.

“ఒక భార్య – ఒక భర్త” కథ భార్య భర్తల మధ్య అవసరమయే కాంప్రమైజ్ గురించి చర్చిస్తుంది. కౌన్సిలర్లు ఈ కథలో చెప్పిన విధంగా భార్యతో చర్చించినవి భర్తకి, భర్తతో చర్చించిన విషయాలు భార్యకీ చూపించడం జరగదు. అది ఫ్రొఫెషనలిజం కాదు. కాని ఈ కథలో ప్రస్తావించిన విషయాలు మాత్రం అర్ధం చేసుకుంటే కొన్ని జంటల సమస్యలకు పరిష్కారం దొరికి తీరుతుంది. “s/o అమ్మ” ఈ సంకలనంలో గుర్తుంచుకోవలసిన కథ. ఒంటరి తల్లి దగ్గర పెరిగిన కొడుకు ఆ తల్లికి మాత్రమే కొడుకుగా మిగిలిపోవాలనుకోవడం, చివరకు అతని మరణం తరువాత కూడా అతని తండ్రి పేరుకే ప్రాధాన్యత ఉండడం, మన చుట్టూ ఉన్న పితృస్వామ్య భావ్యజాలంతో నిర్మించబడిన సిస్టం ను ప్రశ్నిస్తుంది. ఈ కథలో ఇద్దరు స్నేహితుల మధ్య సంభాషణను ప్రస్తావిస్తూ “జీవితాన్ని విశ్లేషించి ఓదార్చే, ఒక్క స్నేహితుడుంటే చాలు, మనిషి ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు దరిదాపులకు కూడా రావు” అని రాస్తారు రచయిత. చాలా మంది జీవితాలలో ఒంటరితనానికి, కారణం ఆ స్నేహ హస్తం లేకపోవడమే, దీన్ని కథ లోని మూలవిషయానికి సంబంధం లేకపోయినా రచయిత చాలా కన్వింసింగ్ గా ఈ కథా వస్తువుతో కలిపి చెప్పగలిగారు. కథా విషయానికి ఈ సంభాషణకు సంబంధం లేకపోయినా, ఇది కథకు ముఖ్యం అవుతుంది. కథ కు గాంభీర్యాన్ని పెంచుతుంది. అలాగే లక్ష్యం ఒక్కటైనంత మాత్రాన అది గొప్ప స్నేహం కాదని కూడా రచయిత స్నేహం పట్ల తన వాదం వినిపిస్తారు. “ఆ మగాడు వదిలిన ఒక్కకణానికి కోట్ల కణాలను తన శరీరం నుంచి పోగు చేసి బిడ్డకు రూపునిచ్చిన అమ్మనెందుకు గుర్తించ నిరాకరిస్తుంది సమాజం’ అన్న ప్రశ్న ఇప్పటికి కూడా ప్రశ్నలానే మిగిలిపోవడం బాధాకరం.

పిల్లలకు పెద్దలకు మధ్య ఉండవలసిన ప్రేమపూరిత వాతావరణం గురించి చర్చ “ఇనుప తెర” అనే కథలో చూస్తాం. “లక్ష రూపాయల కథ” రచయిత పై గౌరవాని పెంచుతుంది. కులం అనే వాదం పై వచ్చిన ఎన్నో కథలలో ఇది నిష్పక్షపాతంగా రాయబడిన గొప్ప కథ అని నిస్సందేహంగా చెప్పవచ్చు. కులం పేరు పెట్టుకోవడం, కులాన్ని వ్యక్తీకరించుకోవడం పట్ల కొన్ని వర్గాలలో చిన్నచూపు ఉంది. కాని దాని వెనుక ఉన్న సామాజిక కట్టుబాట్లు, భద్రత అనే మాయా చట్రం, మన అనుకునే సామూహిక బంధం మనిషిని బలహీనపరుస్తాయి. తనదంటూ ఒక సమూహం ఈ ప్రపంచంలో ఉండాలని మనిషి నిత్యం కోరుకుంటూ ఉంటాడు. ప్రపంచమంతా నాదే అనుకున్నప్పుడు ఆ విస్తారత మనిషిని ఒంటరిని చేస్తుంది. కాని అదే ఒక చిన్న సమూహంతో కలయిక ఒక మనిషిని మరికొందరికి పరిచయం చేస్తుంది. ఆ కొందరు ఒక సామాజిక అండగా అతని పక్కన నిలబడే అవకాశం ఉంటుంది. ఆర్ధికంగా, మానసికంగా, వ్యక్తిగతంగా ఒక అండ దొరుకుందనే ఆశ మనిషిని ఒక వర్గానికి దగ్గరచేస్తుంది. అదే భారతదేశంలోని కుల వ్యవస్థకు కారణం, ఈ అండ అనే బలహీనతకే మనిషి లోబడిపోయి కులం అనే చట్రంలో బంధింపబడతాడు. దీని వెనుక మనిషి అవసరం ఉంది. ఈ అవసరం మానసికమైనది కూడా. ఈ విషయాన్ని చాలా అద్భుతంగా చర్చిస్తారు రచయిత ఈ కథలో. ఇక్కడ కుల వ్యవ్యస్థను ఆయన సమర్ధించరు. కులం అనే వ్యవస్థకు మనిషి ఎందుకు లొంగుతాడో, ఆ కారణాలను చర్చకు తీసుకువస్తారు. ఆ కారణాల గురించి ఆలోచించకుండా కుల సమస్య కు సమాధానం వెతకలేము. కుల వ్యవస్థ పై పోరాటం చేయాలంటే దానికి ప్రత్యామ్నాయమైన మరో వ్యవస్థ రూపకల్పన మన దేశంలో చాలా అవసరం, దీని గురించి ఆలోచించకుండా, కుల నిర్మూలన వైపుగా భారతీయ సమాజం ప్రయాణించలేదు. ఇంత అవసరమైన చర్చను చేయడానికి చాలా మంది అభ్యుదయవాదులు వెనుకాడతారు. కులం అనే చట్రంలో మనిషి ఎందుకు బంధింపబడి ఉండాలనుకుంటాడో, దాని ద్వారా ఎటువంటి లాభాలను మనిషి ఆశిస్తాడో, పొందుతాడో అర్ధం చేసుకొకుండా ఆ వ్యవస్థ పై పోరు సాగించలేం. చాలా లోతైన ఆలోచనకు తెర తీసే కథ ఇది.

మనిషి ఎన్నో రకాలుగా డబ్బు సంపాదిస్తాడు. తన సంపాదన సహేతుకమైనదనే వాదన వినిపిస్తాడు. కాని నిజంగా ఆలోచిస్తే, కష్టపడి సంపాదించే డబ్బుకు మాత్రమే ప్రతి వ్యక్తి తనకు తెలియకుండానే విలువ ఇస్తాడు. ఇటు అటు మార్చి రొటేషన్ లో సంపాదించే డబ్బు ను అంత తేలికగానే ఖర్చు చేస్తాడు, వ్యాపారంలో తిప్పుకుంటాడు, ఆ డబ్బుతో ప్రయోగాలు చేస్తాడు. కాని కష్టార్జితాన్ని అవినీతిపరుడు కూడా గౌరవిస్తాడు. ఈ విషయాలను చర్చిస్తుంది “పతనం కాని మనిషి” అనే కథ. ఇలాంటి ఇతివృత్తంతో వచ్చే కథలు తెలుగు లో అరుదు. ఇంత గంభీరమైన విషయాన్ని చాలా తేలికగా చెప్పగలిగారు రచయిత. వారి పరిశీలనా దృష్టి ఈ కథలో అర్ధం అవుతుంది. నిజజీవితంలో ధనం తో మనిషి ఏర్పరుచుకున్న సంబంధాన్ని చాలా సునిశితంగా పరిశీలించి రచయిత ఈ కథలో సంఘటనలను ఎంచుకుని రాసారని ఆర్ధం అవుతుంది.

తమ ఆశయాలకు పిల్లలను ప్రతీకలుగా నిలపాలనుకునే తల్లి తండ్రులకు కనువిప్పు కలిగించే కథ “పరిధులు – ప్రమేయాలు” పిల్లల జీవితాలపై తల్లి తండ్రుల ప్రమేయానికి కూడా కొన్ని పరిధులు ఉండాలని, ఉంటాయని చెప్పే కథ ఇది. “సెవెన్త్ సెన్స్” కథలో రాత్రుల్లు వీధులలో తిరిగే కుక్కలు నిర్వర్తించే సామాజిక భాద్యతను అర్ధం చేసుకుని మనిషిగా దేశాన్ని కాపాడుకోవడానికి మనం చేయవలసినది ఆలోచించమని చెప్తారు రచయిత. నిద్రపోతున్న కుక్కలని అరవని కుక్కలని కాకుండా, తమ బాధ్యత నెరవేరుస్తూ అరుస్తున్న కుక్కలని కర్ర తీసుకుని బాదే మానవ నైజాన్ని ప్రస్తావిస్తూ, “ప్రతి బాధ్యత కూడా సోమరితనానికి ఒక డిస్ట్రబెన్స్” అంటూ దాన్ని మనుషులు భరించలేకేపోతున్నారని ముగుంపు ఇస్తారు. కథలో మరో కథగా వచ్చే ఈ కథలో రచయిత చర్చకు పెట్టిన విషయం చిన్నది కాదు.

‘ఈస్తటిక్ స్పేస్” కథ స్త్రీ పురుష సంబంధాలను చర్చించే కథ. భార్య చనిపోయిన ఒక భర్త, భర్త చనిపోయిన మరో స్త్రీ ఇద్దరి నడుమ స్నేహం చిగురిస్తుంది. పెళ్ళి చేసుకోవాలనుకునే మగవాని ఆలోచనను ఆమోదించలేని స్త్రీ తరువాత ఆ స్నేహం లోని ఆప్యాయతకు కరిగి ఆ పురుషునికి శారీరికంగా దగ్గరవుతుంది. ఆ జంట తమ సంబంధాన్ని విశ్లేషించుకోవడం ఈ కథ లోని కథావస్తువు. ఈ సంకలనంలోని అన్ని కథల మధ్య ఈ కథలో మాత్రం రచయిత శైలిలో స్పష్టత లోపించినట్లు కనిపించింది. స్త్రీ పురుష సంగమం గురించి రాసిన కథ అయినా, ముందు అదే సంగమానికి భయపడిన స్త్రీ తరువాత వెనువెంటనే అంత ఇష్టపూర్వకంగా వివాహం ప్రసక్తి లేకుండా అ పురుషున్ని చేరడం వెనుక కొంత అసహజత కనిపించే మాట వాస్తవం. “నీ భార్య ఉండగా నా మీద ఎప్పుడూ మోజు పడలేదంటే – నువ్వు నన్ను ప్రత్యేకించి కోరుకోవడం లేదన్న మాట – అంటే ఇప్పుడు ఆమె స్థానంలో నన్ను ప్రతిక్షేపిస్తున్నావు – అంతే గదా” అన్న మరు నిముషంలోనే అతను చూపిన ఆపేక్షకు అతనితో శారీరికంగా కలిసి “నేనా క్షణంలో కోరిక పుట్టి నీకు చేరువ కాలేదు. నువ్వు చూపిన ఆపేక్షకు నాలో ఏమీ మిగుల్చుకోకూడదనిపించిందా క్షణం’ అని ఆమె ఇచ్చిన వివరణ, అంత కన్వింసింగ్ గా లేదు. తరువాత సెక్స్ పట్ల నిగ్రహం ఆవశ్యకతను ఆమె ప్రస్తావించడం, మనుష్యులు తమలో దాగి ఉన్న ఈస్తటిక్ స్పేస్ విలువని గుర్తించట్లేదని, శృంగార అనుభవాలను నెమరు వేసుకోవడం నేర్చుకోవాలి” అని ఆమెతో చెప్పించడం, అర్ధరహితంగా అనిపించింది. ఈ కథా సంకలనానికి ఈ కథ పేరే పెట్టి, దీన్ని ప్రధాన కథగా రచయిత ఎంచుకున్నా, ఎందుకో ఈ ఒక్క కథలో మాత్రం రచయిత ఆలోచనలన్నీ కలగాపులగంగా కనిపిస్తాయి.

ఆర్గన్ డొనేషన్ మీద మరో కోణంలో రాసిన “ఒక దుఃఖం రాని సాయంత్రం” కథ చాలా వాస్తవిక దృక్పధంతో రాసిన కథ. త్యాగం పేరుతో జరుగుతున్న వ్యాపారాన్ని, ఆ వ్యాపారం కేంద్రంగా జీవిస్తున్న మనుష్యులని ఈ కథ పరిచయం చేస్తుంది. సామాజిక బాధ్యత అంటూ దాని చాటున మనిషి చేసే ధన సంపాదన గురించి నిర్భయంగా చర్చించిన కథ ఇది. ఆర్గన్ డొనేషన్ పేరుతో మనిషిలోని స్వార్ధపు వ్యాపార దృక్కోణ్నాన్ని చర్చించే కథ ఇది.

ఇద్దరు మనుష్యుల మధ్య ఏర్పడే సంబంధం వెనుక ఎన్నో కోణాలుంటాయి. ప్రేమించిన స్త్రీ దూరం అయిన తరువాత ఆమె లేని లోటు పూరించుకోవాలనుకునే ఒక వ్యక్తి ఎనో ప్రయత్నాలు చేస్తాడు. పది మందికి శరీరాన్ని పంచే ఒక స్త్రీతో ఏర్పడ్డ బంధం ప్రేమగా మారి ఆమెతో జీవితాన్ని నిర్మించుకున్న తరువాత కొన్ని రోజుల తరువాత ఆమె మరణిస్తే, కొంత కాలం తరువాత అతను ధనవంతుడై, ఎందరి స్త్రీలతో కలిసినా ఆమె లేని లోటు అతనికి తీరదు. అతనిలోని అ ప్రేమ రాహిత్యం అతన్ని బాధిస్తూనే ఉంటుంది. ఒక సారి అనుకోకుండా అతనికి ఒక మొరటు పల్లెటూరి కార్మిక వర్గానికి చెందిన స్త్రీ కనపడుతుంది. ఆమె నుండి వచ్చే చెమట వాసన అతనిలో కోరికను రేపుతుంది. ఆమె తో శరీరాన్ని పంచుకుని తన లోని తృష్ణను తీర్చుకుని అతను సెదతీరుతాడు. వినడానికి కాస్త ఇబ్బందిగా అనిపించినా, ఒక మనిషి మరో మనిషి నుండి పొందిన దగ్గరితనానికి, అనుబంధానికి అందులో ఆస్వాదించిన ఆనందానికి కారణాలు చాలా సార్లు అ మనిషికే తట్టవు. మనిషి ఎంత నాగరికుడయినా అతనిలోని ఆ ప్రాధమిక జంతు లక్షణాలు అతన్ని అంటిపెట్టుకునే ఉంటాయి. జంతువు అన్నది ఇక్కడ పాజిటివ్ గానే తీసుకోవాలి. కొన్ని సహజ వాంఛలు, ఇష్టాలు, కోరికలు, సంబంధాలు నాగరికత ముసుగులో దాగి ఉంటాయేమో కాని అణిగిపోవు.

“ప్రవహించే పాట” కథలో తనను కోరి వచ్చిన మరో కులం స్త్రీని ప్రేమించి కూడా, పరువు, కుటుంబం లాంటి కారణాలతో ఆమెను అందుకోలేక, తననంటి పెట్టుకుని పడుకునే కూతురు పెద్దదయి, స్త్రీ గా మారి తన జీవితాన్ని తాను గడిపే స్థితిలోకి ప్రయాణిస్తున్నప్పుడు ఒంటరితనంతో తనకంటూ ఏ తోడు లేక మిగిలిపోయిన ఒక సమాజం తీర్చిన మనిషి కనిపిస్తాడు. ‘పున్నమ్మ” అనే కథలో వ్యాపారానికి మనిషి మంచితనానికి ఉన్న బంధాన్ని రచయిత చర్చిస్తారు. ఎటువంటి వ్యాపారంలో కుడా మనిషి మంచితనం ప్రభావం చూపిస్తుందని చెప్పే కథ ఇది. “ఇద్దరు తండ్రులు” కథలో ఒక రిక్షావాని ధైర్యాన్ని, కూతురు పట్ల అతను నిర్వర్తించే బాధ్యతను గుర్తించి, తన పిరికితనాన్ని విశ్లేషించుకుని, తన కూతురు పట్ల నడత మార్చుకున్న ఒక మధ్యతరగతి తండ్రి కనిపిస్తాడు. నాన్న కోసం కొత్త ఇంట్లో ఒక ప్రత్యేకమైన గది, పిల్లల కోసం విడిగా గదులు కాని అమ్మ కోసం ప్రత్యేకమైన గది లేదని బాధపడే ఒక చిన్న పాప వేదన లో కుటుంబం మింగేసే స్త్రీ స్వేచ్చను అభిరుచులను ప్రశ్నిస్తుంది “తప్పిపోయిన గది” అన్న కథ. “ఆగంతకుడి అభిమానం” కథలో పర దేశాల పై అమెరికా చూపే ప్రేమ, ఆ దేశ ప్రజల భవిష్యత్తు గురించి మాట్లాడుతూ అమెరికా ప్రదర్శించే దోపిడి ని రచయిత చర్చిస్తారు. “మిధ్య ఎగ్జిబిషన్” అనే కథలో జూదం అనే ఆటలో మోసపోయిన ఒక యువకుడు కనిపిస్తాడు. అయితే ఆ జూదం ప్రపంచంలో ఏ ఆటయినా కావచ్చు, రాజకీయం కావచ్చు, సమాజంలోని ఆకర్షణలు కావచ్చు, ఐదు సంవత్సరాలకొకసారి వచ్చే పండుగ అనే ప్రసక్తి కథలో ఉంది కాబట్టి అవి ఎలక్షన్లు కావచ్చు, ఎన్నో మాయల మధ్య ఇరుక్కుని సర్వం పోగొట్టుకుని మోసపోయానన్న బాధతో నిరాసక్తతో చివరకు ఒంటరిగా మిగిలేది సామాన్య మానవుడే అన్న నిజాన్ని రచయిత ఈ కథలో ప్రస్తావిస్తారు.

ఈ కథా సంకలనంలోని కథలన్నింటిలో విషయ వస్తువు పాతదే కాని ప్రతి కథలో రచయిత చేసే చర్చ, లేవదీసిన ప్రశ్నలు ఒకే విషయానికి సంబంధించిన భిన్న కోణాలను ప్రస్తావిస్తాయి. ఆ ప్రశ్నల ద్వారా రచయిత తన మనసులోని ఆలోచనలను పాఠకులకు చేరవేస్తారు. మనుష్యులు జీవితంలో ఎదగడానికి మానసికంగా ఉన్నతులుగా మారడానికి అవరోధం కలిపించే పరిధులు వారు నిర్మించుకున్నవే. ఆ పరిధులను గమనించి వాటిని అధిగమించే శక్తిని మనిషి సంపాదించుకోవాలంటే, అతనిలో ప్రాపంచిక అనుభవాల ఆధారంగా ఉత్పన్నమయ్యే ఆలోచనలు, వాటి నడుమ ఒక సంఘర్షణ అత్యవసరం. ఆ సంఘర్షణ మనిషి పురోగమనానికి దారి చూపగల దిక్సూచి. “నూరు పూలు వికసించనీ, వేయి ఆలోచనలు సంఘర్షించనీ” అన్న మాట విన్నాం కదా. ఈ కథలలో రచయితలోని సంఘర్షణ కనిపిస్తుంది. అది వేల ఆలోచనల కారణంగా ఉత్పన్నమయిన నిర్మాణాత్మకమైన సంఘర్షణ. అది పాఠకులకు మానవ జీవితంలోని భిన్న కోణాలను చూడగల అవకాశం కల్పిస్తుంది. మనల్ని మనం కొంత పరిపక్వతతో మలచుకోవడానికి ఉపయోగపడే సాహిత్యం కోవలోకి తప్పకుండా ఈ సంకలనం చేరుతుంది. అందుకే “ఈస్తటీక్ స్పేస్’ చదవాలి, రచయిత ఆలోచనలతో ప్రయాణించాలి.

పుట్టిన ఊరు సికింద్రాబాద్. రచయిత్రి, అధ్యాపకురాలు. హిందీ సాహిత్యంలో పీహెచ్డీ చేశారు. ఆసక్తి: పుస్తకాలు, సినిమాలు. తార్నాకలోని Spreading light అనే బుక్ క్లబ్ లో ఎనిమిదేళ్లుగా  ప్రతి శనివారం పుస్తక పరిచయాలు నిర్వహిస్తున్నారు. ఫేస్‌బుక్‌లో 'నచ్చిన పుస్తకం', 'నచ్చిన సినిమా' గ్రూపుల్లో 1000 పుస్తకాలు, 1500 పైగా సినిమాలను పరిచయం చేశారు. రైల్వే జూనియర్ కాలేజీ(తార్నాక)లో హిందీ లెక్చరర్ గా పనిచేస్తున్నారు.

 

 

 

2 thoughts on “కొత్త జీవిత కోణాలను దర్శింపజేసే “ఈస్తటిక్ స్పేస్”

  1. ఎస్తటిక్ స్పేస్ పైన dr. P. జ్యోతి గారి విశ్లేషణ బాగుo ది.

Leave a Reply