సంప్రదాయ సంకెళ్ళను బద్దలు కొట్టిన వేగుచుక్క: ఇస్మత్ చుగ్తాయ్

ప్రపంచ సాహిత్య చరిత్రలో చాలా మంది రచయిత్రులు, ముఖ్యంగా స్త్రీవాదులు, తమ రచనల్లో జెండర్ డిస్క్రిమినేషన్ ని అంటే లింగ వివక్షను చిత్రీకరించే ప్రయత్నం చేసారు. చరిత్రలో అన్ని రంగాల్లో స్త్రీలు ఎదుర్కొనే లింగ వివక్షను, అణిచివేతను, దోపిడీ, దౌర్జన్యాలను స్త్రీలు వివిధ సాహితీ రూపాల్లో కథ, కవిత, కథానిక, నాటకం, నవల, వ్యాసం, నానీల రూపాల్లో పోరాటాలను, ప్రశ్నలను, విజయాలను, ఆత్మ కథాశ్రయ రూపాల్లో చెప్తూ వచ్చారు. పితృస్వామిక సమాజంలో తమపై నిరంతరం జరిగే పీడన అణిచివేతలను స్త్రీలు కళా రూపాలు, సాహిత్యాల్లో లిఖిస్తూనే ఉన్నారు. ఇదంతా కూడా చరిత్ర పొడుగుతా రచయిత్రులు కవయిత్రులు కళాకారిణుల రచనల్లో మనకు కనిపిస్తుంది. అన్ని రంగాల్లో పురుషస్వామ్య వివక్షను ఎదుర్కొన్న – కొంటున్న స్త్రీలు సాహిత్య రంగంలో కూడా అవే వివక్ష, అణిచివేతలను, ఘోరమైన సెన్సార్‌షిప్ ను ఎదుర్కొంటూనే ఉన్నారు. ఏమీ రాయకుండా నిరోధించడం… రాస్తే ఏం రాయాలో… ఏం రాయకూడదో ఎలా రాయాలో… ఏ భాష ఉపయోగించాలో అన్నీ పురుషులే నిర్ణయించే స్థితి. రచయిత్రుల భావ వ్యక్తీకరణ స్వేచ్ఛపై అడుగడుగునా ఊపిరాడనీయని ఆంక్షలు. రచయిత్రులు వేసే ప్రశ్నలను, నిలదీతలను, నిజాలను తట్టుకోలేక తమ ఆధిపత్య పితృస్వామ్యపు పునాదులు, సమాజంలో, కుటుంబంలో ఎక్కడ కదలి, కూలిపోతాయో అన్న భయం.

మన అన్ని వ్యవస్థలు పితృస్వామిక పునాదులపై నిలబడ్డాయి. స్త్రీలు రాసే అభ్యుదయ సాహిత్యం ఎక్కడ స్త్రీలను చైతన్యవంతం చేసి తమ హక్కులను తెలుసుకుంటారో ఎదురు తిరిగి ప్రశ్నిస్తారో అన్న భయాలతో పురుషుల అనేక నిబంధనలు ఆంక్షలు స్త్రీల సాహిత్యాన్ని సెన్సార్ చేస్తూ వచ్చాయి. కుటుంబంలో, సమాజంలో ఉన్న పితృస్వామ్య భావజాలం బయటినించి నిత్యం స్త్రీల సబ్‌కాన్షియస్ మనసులో అనేక బలమైన నెగటివ్ సూచనలు, స్త్రీల పరిమితులు, బలహీనతలు, పితృస్వామ్యం ఆపాదించిన వ్యక్తిత్వ లోపాలు, ఆంక్షలు, భయాలు నిత్యం ఎక్కిస్తూ ఉంటుంది. దాని వల్ల చాలా సార్లు స్త్రీలు ఈ పితృస్వామ్యం, పురుషుల అధికారం బలం తెలివి, స్త్రీలపై వారి నిర్ణయాధికారం మేధస్సు అన్నీ సహజమైనవి అని నమ్మేస్తూ ఉండటం మూలంగా తమను తాము చాలా సబ్‌మిసివ్ గా ఊహించుకోవడమే కాదు నమ్ముతారు కూడా. అది వారి ప్రతి చర్యలో ప్రతిఫలిస్తూంటుంది కూడా. అదే కోవలో రచయిత్రులు కూడా చాలా కాలం స్త్రీవాదం తమ జీవితాల్లోకి వచ్చే వరకూ, చాలా సార్లు వచ్చాక కూడా తమ రచనల్లో తాము రాసేది ఎలా ఉందో, ఎంత స్వేచ్ఛగా హక్కుల అనుభూతుల ప్రకటన రాతల్లో చేయచ్చో, సమాజం ముఖ్యంగా పురుషులు ఎలా స్వీకరిస్తారో, తమ మీద బరి తెగించినదనో, విశృంఖల వాది అనో ముద్రపడుతుందేమో, కుటుంబం నుంచి, సమాజం నుంచి, స్నేహితుల నుంచి తోటి స్త్రీ పురుష రచయితల నుంచి బహిష్కరణకు గురి అవుతామేమో అని రాసేటప్పుడు స్వీయ సెన్సార్‌షిప్ ను విధించుకుంటూ అనేక భయాలలో, పరిమితులలో తమను తాము నియంత్రించుకుంటూ రాస్తూ వస్తారు.

ఇట్లా సాహిత్య రంగంలో రెండు వైపుల నుంచీ సెన్సార్‌షిప్ అనే అణిచివేత ఉంటుంది. తమకు తాము సెన్సార్‌షిప్ విధించుకున్నా అది పురుషుల వైపు నుంచే అని భావించాలి. తమ భావాలను, రాజకీయ విశ్వాసాలను సూటిగా ధైర్యంగా రాసిన రచయితలు కుటుంబం, సమాజం, రాజ్యం నుంచి వెలివేతలు, హత్యలకు కూడా గురి అవటం చరిత్రలో ఉంది.

మరీ ముఖ్యంగా కుల వివక్ష, మత హింస, వీటితో పాటు తమ లైంగిక అనుభూతులు, లైంగికత అంశాలను పురుషులు వ్యతిరేకించే, ఉలిక్కిపడేలా చేసే పురుష లైంగిక విషయాలను రచనల్లో వ్యక్తీకరించే వాళ్ళకు ఈ అణిచివేత, వేటు తప్పటం లేదు.

యునైటెడ్ కింగ్‌డమ్ నించి పంతొమ్మిదో శతాబ్దపు రచయిత్రి వర్జీనియా వూల్ఫ్ నించి భారతదేశంలో ఇస్మత్ చుగ్హాయ్, కమలాదాస్, తస్లీమా నస్రీన్ తమ రచనల మీద ఈ సెన్సార్‌షిప్ ను, రచనల నిషేధాలను కూడా ఎదుర్కొన్నారు. తీవ్రమైన మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటూనే తమ రచనలను ధైర్యంగా కొనసాగించారు.

వర్తమాన భారత సమాజంలో ఆర్ఎస్ఎస్ ప్రభావిత బీజెపి ప్రభుత్వం ముస్లిం మైనారిటీలపై కొనసాగించే మతోన్మాద హింసలను, దాడులను, హత్యలను తన రచనల్లో ప్రశ్నించిన బెంగుళూరు జర్నలిస్టు, రచయిత్రి గౌరీలంకేష్ ను రాజ్యం అత్యంత కిరాతకంగా హత్య చేసింది. వీరినే కాదు దబోల్కర్, కలబర్గీ లాంటి హేతువాద రచయితలను కూడా హత్యలు చేసింది. ఇంత భయానకమైన అణచివేతల నిషేధాల కాలంలో కూడా రచయిత్రులు ఎప్పుడూ రాయడం ఆపలేదు. స్టీరియోటైప్ ధోరణుల్లో స్త్రీలను చిత్రించడాన్ని తిరస్కరించి చైతన్యమూర్తులుగా హక్కుల కోసం పోరాడే ధీరులుగా రచనల్లో చిత్రించే సాహసాన్ని స్త్రీవాదం నుంచి పుణికి పుచ్చుకున్నారు.

ఈ ప్రత్యామ్నాయ స్త్రీ పాత్రలు పురుష సమాజానికి, పురుష రచయితలకీ విమర్శకులకీ కంటగింపైనా పట్టించుకోలేదు. చైతన్యవంతమైన పాత్రలను సృష్టించడమే కాదు, సాహిత్య విమర్శ కూడా స్త్రీవాద దృక్కోణం నుంచి చేయడం, దానిలో పితృస్వామ్యాన్ని ప్రశ్నించడం వారి పీఠాలను కదిలించి వేసింది. స్త్రీవాదం రచయిత్రులకు ఒక కొత్త ప్రాపంచిక దృక్పథాన్ని, ప్రశ్నించే ఎదిరించే నైతిక స్థైర్యాన్ని, ఆత్మ విశ్వాసాన్ని ఇచ్చింది. సైద్ధాంతిక భూమికనిచ్చింది.

అయితే స్త్రీవాదం భారత దేశంలో బలంగా రాకముందు నుంచీ తన గొంతును ధైర్యంగా వినిపించిన రచయిత్రి భారతదేశంలో అందునా ఉర్దూ సాహిత్యానికి దిశానిర్దేశం చేసిన ముస్లిం రచయిత్రి ఇస్మత్ చుగ్తాయ్. వందేళ్ళ క్రితమే భారత స్వాతంత్ర్యోద్యమ పూర్వ, తర్వాత కాలంలో… 1947 ముందు, తర్వాతా తను మరణించే 1991 దాకా అత్యంత సాహసోపేతంగా స్త్రీవాదాన్ని, ముఖ్యంగా స్త్రీల లైంగికతకు సంబంధించిన భిన్నమైన అంశాలను, పురుషుల భిన్నమైన లైంగిక ప్రవృత్తులకు సంబంధించిన అంశాలను అసలు మానవ లైంగికతకు సంబంధించిన వైరుధ్యాలను, ఆమె మేల్ హోమోసెక్సువాలిటీ, లెస్బియనిజం, పీడోఫీలియా లాంటి శృంగార ప్రవృత్తులను తన రచనల్లో చర్చించారు. ఈ మూడు అప్పటి కాలం నుండి మొన్నటి దాకా సమాజం అసహజంగా భావించి అంగీకరించని లైంగిక ధోరణులు.

అయితే ఈ ధోరణులను ఇప్పటి పాశ్చాత్య, భారతీయ సమాజం ఇప్పుడిప్పుడే అంగీకరిస్తున్నది. కానీ చిన్న పిల్లలతో లైంగిక సంబంధాన్ని తెలియజేసే లైంగిక ధోరణి పీడోఫీలియా అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ కూడా ప్రమాదకరం, అసహజమైనది. ఇప్పుడు 2020లో కూడా ఈ లైంగిక ధోరణులను కథా వస్తువుగా స్వీకరించలేని, ఒకవేళ స్వీకరించినా అనేక పరిమితులలో స్వీయ సెన్సార్‌షిప్ చేస్కునే రచయిత్రులు, సెన్సార్‌షిప్ చేసే రచయితలున్న ఆధిపత్య సమాజం ఇది.

కాకపోతే 100 ఏళ్ళ కంటే ముందే ఇస్మత్ చుగ్తాయ్ ఈ కాంట్రవర్షియల్ వస్తువుని తీస్కుని రాయడమే కాదు చాలా ధైర్యంగా తన మీద పురుష రచయితలు చేసిన దాడులను సెన్సార్‌షిప్ ను ఎదుర్కున్నారు. అంతేకాదు తన సీనియర్ రచయిత్రుల రచనల మీద, విమర్శ, దాడి చేసిన పత్రికా సంపాదకులతో వాదానికి దిగారు. ఒకవైపు తన ధైర్య సాహసాలతో కూడిన రచనల వలన కుటుంబంలో, సమాజంలో, తోటి రచయితల వలన తిరస్కారం ఎదుర్కొంటూనే, ఎంతో మానసిక ఒత్తిడికి గురి అవుతూనే ఉన్నా తన రచనల దృక్పథాన్ని మాత్రం విడవకుండా రాస్తూనే పోయారు. అలాంటి సాహసోపేత రచయిత్రి ఇస్మత్ చుగ్తాయ్. ముస్లిం సమాజంలోని మతపరమైన కట్టుబాట్లను ఆ కాలంలోనే ధిక్కరించి రాసిన ఇస్మత్ చుగ్హాయ్ గురించి, ఆమె రచనల గురించి మరీ ముఖ్యంగా సెన్సార్‌షిప్ కి గురి అయిన వివాదాస్పదం అయిన ఆమె రచనల గురించి, ఆమె జీవితం, సంఘర్షణలు పోరాటాలు ఆమె ఎక్కిన ఉన్నత శిఖరాల గురించి తెలుసుకుందాం.

ఇస్మత్ చుగ్తాయ్ బడయూన్ యునైటెడ్ ప్రావిన్స్, బ్రిటిష్ ఇండియాలో 1915 ఆగస్టు 15న మధ్య తరగతి ముస్లిం కుటుంబంలో జన్మించింది. పది మంది పిల్లలలో తొమ్మిదవది. ఆరుగురు అన్నదమ్ములు, నలుగురు అక్కచెల్లెళ్ళు. ఇస్మత్ చుగ్తాయ్ తండ్రి ఒక ఇండియన్ సివిల్ సర్వెంట్. ఆలీఘడ్ లోని మిషనరీ స్కూల్లో ప్రాథమిక విద్యని అభ్యసించింది. ఆగ్రాలో ఉన్నత విద్యను అభ్యసించింది. బియే, బీఎడ్ డబుల్ పట్టాలను పొందిన తొలి ముస్లిం మహిళగా ఇస్మత్ చుగ్తాయ్ పేరు తెచ్చుకుంది. ఆగ్రాలో చదువుకుంటున్నప్పుడే షాహిద్ లతీఫ్ ను ప్రేమ వివాహం చేస్కున్నది. ఇస్మత్ చుస్రాయ్ పెద్దన్నయ్య ‘మీర్జా ఆజీమ్ బేగ్ చుగ్తాయ్’ రచయిత. ఆయన రచనలు చూసి చుర్రాయ్ ప్రభావితురాలు అయ్యింది.

ఇస్మత్ చుగ్తాయ్ భారతదేశంలో ఫెమినిజం రావడానికంటే ముందే, ఫెమినిస్టు ధోరణిలో సాహిత్య సృజన చేయడమే కాదు అదే దృక్పథాన్ని జీవితమంతా ఆచరించింది. అదే భావజాలాన్ని తన రచనలలో జీవితాంతం రాజీ లేకుండా ప్రతిఫలింప చేసింది. ఉర్దూ సాహిత్యంలో షార్ట్ స్టోరీస్ కి మూల స్థంభంలా నిలబడింది. సాహిత్య రంగంలో ఇస్మత్ చుగ్తాయ్ ది చాలా బలమైన గొంతు. పురుషులు కూడా రాయ సాహసించని స్త్రీ పురుష లైంగిక సంబంధాలను, ఆ సంబంధాల్లోని అసమానతలను పురుష లైంగిక రాజకీయాలను, మానవ అపసవ్య లైంగిక ధోరణులను చాలా సాహసోపేతంగా తన రచనలలో చర్చించి అప్పటి వందేళ్ళ క్రితపు సాంప్రదాయ ముస్లిం సమాజంలోని పురుషులను ఉలిక్కిబడేలా చేసిన సాహసి.

ఇస్మత్ చుగ్తాయ్ వ్యక్తిత్వం – తిరుగుబాటు ధోరణి బాల్య జీవితంలో ఘర్షణ:

ఇంత సాహసం ఆమె ప్రవృత్తిలోనే ఉందా, లేదా అక్కలందరి పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత ఒక్కగానొక్క ఆడపిల్లగా నలుగురు అన్నదమ్ముల మధ్య స్వేచ్ఛగా గడిపిన బాల్యం ఆమెలో స్వేచ్ఛగా, మొహమాటాలు లేకుండా ప్రశ్నించే, వెరపు లేకుండా భావాలను ప్రకటించే వ్యక్తిత్వాన్ని సమకూర్చిందా… మొత్తానికి బాల్యం నుంచీ ఆమె ప్రతీ దానికీ కుటుంబంలో ఘర్షణపడేది. ప్రశ్నించేది, దెబ్బలూ తినేది. ఇస్మత్ చుగ్తాయ్ ఆత్మకథ ‘కాగజ్ హై పై రహన్’లో ఆమె జీవన సంఘర్షణ బాగా కనిపిస్తుంది.

ఇస్మత్ చుగ్తాయ్ తల్లి చాలా సంప్రదాయవాది. ఇస్మత్ ను చాలా కట్టడి చేసేది. అన్నదమ్ములతో, ఇరుగుపొరుగు పిల్లలతో స్వేచ్ఛగా ఆడుకోనిచ్చేది కాదు. మగ పిల్లలతో ఆటలేంటి అని నిలవరించేది. అన్న క్రికెట్ ఆడుకుంటే నువ్వు బొమ్మలతో ఆడుకోవాలి అనేది. ఇస్మత్ ఆ బొమ్మను ముక్కలు చేసి పడేసి, నేను కూడా అన్నలు ఆడుకునే ఆటలే ఆడుకుంటాను అనేది. అందరి ఆడపిల్లల్లా కుట్లు, అల్లికలు, వంటలు, అలంకరణ, శుచి, శుభ్రత, ఇల్లు సర్దడం లాంటివి చేయమని పోరే తల్లితో అటువంటి పనులు చేయననీ, చదువుకుంటాననీ గొడవ పడేది. చదువు మాన్పించి ఇంట్లో కూర్చొని ఇంటి పనులు చేయమని పోరే తల్లిపై ఇస్మత్ కి చాలా కోపం. స్కూల్లో చేర్పించక పోతే క్రైస్తవ మిషనరీల్లో చేరి క్రిస్టియన్ గా మారిపోయి కాన్వెంట్ చదువులు చదువుతానని మొండికేసింది. బాల్య వివాహ ప్రయత్నాలను ఎంతో పోరాటం చేసి తప్పించుకుని ఆలీఘడ్ మిషనరీ స్కూల్లో చేరింది. ఇంట్లో పెదనాన్న పర్షియన్ భాష నేర్చుకొమ్మని తన కొడుకులతో పాటు ఇస్మత్ ను కూడా బలవంతం చేసాడు. ఇస్మత్ నేర్చుకోననీ ఆ శక్తి లేదని తిరస్కరించడమే కాదు అన్నలతో కూడా అదే చెప్పిస్తుంది.

పక్కింటి క్రిస్టియన్ అమ్మాయితో ఆటలు ఆడినా, తిండి పంచుకున్నా తల్లి కొట్టేది. “నువ్విలా ఆంక్షలు పెడితే, నేను క్రిస్టియన్ మతంలోకి మారిపోతా” అని బెదిరించేది తల్లిని. ఇస్మత్ పదిహేను సంవత్సరాలకి బాల్య వివాహాన్ని తప్పించుకుని తల్లిదండ్రుల్ని ఒప్పించి ఇసబెల్లా ధోబర్న్ కాలేజీలో బాచిలర్స్ డిగ్రీ కోసం చేరడం చాలా పెద్ద సాహసం, విజయంగా చెప్పుకోవాలి. చదువుకోవడానికి పరదాల వెనక కూర్చోవడానికి కూడా ఇస్మత్ చుగ్తాయ్ వెనకాడలేదు.

ఇస్మత్ చుగ్తాయ్ రచయిత్రిగా మారిన చారిత్రక సామాజిక సందర్భం:

ఆలీఘడ్ ముస్లిం యూనివర్సిటీలో చదివే కాలంలోనే ఇస్మత్ 1930లలో ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్ (అభ్యుదయ రచయితల సంఘం) నిర్వహించే సభలకు వెళ్ళడం వలన స్త్రీల, మానవ హక్కుల పైన అవగాహన కలగడం, అవి ఆమె శక్తిగా మారడం ఆ విలువలే, పెరిగిన చైతన్యమే ఆమె రచనల్లో ప్రతిఫలించడం జరిగాయి. కాలేజీలో చదువుతున్నప్పుడే ఇస్మత్ చుగ్తాయ్ కథలు రాయడం మొదలు పెట్టారు. ఇస్మత్ చుగ్తాయ్ పైన ‘అరసం’ ప్రభావం ఉన్నప్పటికీ ఆమె ఏ చారిత్రక, సామాజిక సందర్భంలో పుట్టింది, పెరిగిందో అర్థం చేస్కుంటే ఆమె రచనలు మనకు బాగా అర్థం అవుతాయి.

ఒక ప్రక్క బ్రిటిష్ సామ్రాజ్యవాదం చేస్తున్న హిందూ ముస్లిం విభజన రాజకీయాలు దేశాన్ని ఆందోళన పరుస్తున్న సమయం, మరో పక్క స్త్రీలకు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు, విద్యా హక్కులు లేని సమయం. సంఘ సంస్కరణలతో బాల్య వివాహాలు, విధవా పునర్వివాహాల ఉద్యమాలు నడుస్తున్న కాలం. మరీ ముఖ్యంగా ముస్లిం సమాజంలో స్త్రీలు అనేక మత సాంప్రదాయాలు, కట్టుబాట్ల మధ్య నలిగిపోతున్న కాలం. నవాబుల జనానాల్లో నవాబులు, ఇతర పురుషులు తమ లైంగిక వాంఛలు తీర్చుకోవడానికి విచ్చలవిడిగా స్త్రీలను లైంగిక వస్తువులుగా వాడుకొంటున్న కాలమది. ఈ సమయంలో ఇస్మత్ తన కుటుంబంలో, సమాజంలో స్త్రీల పైన జరుగుతున్న సమస్తమైన పితృస్వామిక అణిచివేతలను ఎదిరించడమే కాదు, తన చదువు అర్థాంతరంగా ఆపివేసి, తనకు చేయబోయే బాల్య వివాహాన్ని ఎదిరించి, కాన్వెంస్ట్ చదువు కోసం క్రిస్టియన్ మతంలోకైనా మారటానికి అప్పటి సంప్రదాయ కుటుంబాల్లో పరదాల వెనక కూర్చొని చదవడానికైనా సిద్ధపడింది. ఇలా తన చుట్టూ జరుగుతున్న అనేక సామాజిక, చారిత్రక పరిణామాలు ఆమెలో ఆలోచనలను రేపి కథలు రాసేలా చేసాయి. ఇస్మత్ చుగ్తాయ్ కు తన రచనల పట్ల చాలా స్పష్టమైన దృక్పథం ఉంది. 1930-1940లో స్త్రీలు సాహిత్య సృజన చేయడానికి ఎక్కువగా సాహసించేవారు కాదు. పైగా సమాజం నేరంగా
భావించేది. బ్రిటిష్ సామ్రాజ్యవాదులు భారత దేశాన్ని అన్ని రంగాల్లో శాసిస్తున్న కాలంలో రచయిత్రిగా గొప్ప సాహసోపేతమైన కథా వస్తువులతో, సాహిత్య సృజనను అనేక విమర్శలు, దాడులు, అవమానాలు ఎదుర్కొంటూ చేసింది ఇస్మత్ చుగ్తాయ్.

ఇస్మత్ చుగ్తాయ్ రచనలు:

 • నవలలు : జిద్ది, తేడీ లఖీర్, ఏక్ బాత్, మాసూమా, దిల్ కి దరియా ఏకీ ఖత్రా ఏఖూన్, ఇన్సాఫ్ ఔర్ ఫరిస్తే. (తేడీలఖీర్ నవల ‘ది క్రుక్ట్ లైన్’ ఉర్దూ సాహిత్యంలో చాలా ప్రసిద్ధమైన నవల.)
 • కథా సంకలనాలు : చోటే, కలియా
 • దోహాల్ రేడియో నాటకాలు : ధనీ బాంకే, సైతాన్
 • ఆత్మకథా సంకలనం : కాగజీ హై పైరహన్
 • ఇస్మత్ చుగ్తాయ్ చలన చిత్ర దర్శకురాలు కూడా. స్త్రీ పురుష సమానత్వంకై తన రచనల్లో పోరాడిన ఇస్మత్ చుగ్తాయ్ కొద్దికాలం సినిమా రంగంలో కూడా ఉన్నారు. మూడు బాంబే టాకీస్ ప్రొడక్షన్స్ కి కథలు రాసారు. ఈ సినిమాలకు ఆమె భర్త సయ్యద్ లతీఫ్ దర్శకత్వం వహించారు.
 • జిద్ది – 1948, అరుజూ – 1950, సోనే కే చిడియా – 1958లో సినిమాలుగా వచ్చాయి.
 • శ్యాం బెనగల్ సినిమా ‘జునూన్’ 1978 – కి సంభాషణలు రాయడమే కాదు జెన్నిఫర్ కెండాల్స్ పాత్రకి తల్లి పాత్ర పోషించారు.
 • అవార్డులు: ‘తేడీ లఖీర్’ నవలకి 1974లో గాలీబ్ అవార్డ్ 1976లో పద్మశ్రీ అవార్డు . 1975 – గరం హవా కథకి ఫిల్మ్ ఫేర్ ఉత్తమ కథ అవార్డ్. సోవియట్ ల్యాండ్ నెహ్రూ అవార్డ్. 1990లో ఇక్బాల్ సమ్మాన్ పురస్కారం.
 • ఇస్మత్ చుగ్తాయ్ 107వ జయంతిని పురస్కరించుకుని ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ తన హెూమ్ పేపై ఆమె చిత్రాన్ని ఉంచి గౌరవించింది. ఇస్మత్ చుగ్తాయ్ జీవించి ఉంటే ఉర్దూ రచనల స్థాయి ఉన్నతమైన శిఖరాన నిలిచి ఉండేవని గూగుల్ ప్రస్తావించింది.

ఇస్మత్ చుగ్తాయ్ కథా వస్తువులు:

ఇస్మత్ చుగ్తాయ్ ఎక్కువగా మానవ సంబంధాల మీద రాసారు. ఆమె కథల్లో వాస్తవాలు, ప్రపంచ స్థాయి పుకార్లు, ఉత్తర ప్రదేశ్ లో ఇరుకు గల్లీల్లో చిన్న ఇళ్ళల్లో నివశించే కుటుంబాలు వారి జీవితాల్లోని ఘర్షణలు, బాధలు, సంవేదనలు కనిపిస్తాయి. ఇవే కాకుండా మానవ లైంగికతలోని భిన్నమైన అపసవ్య ధోరణులను కూడా ముఖ్యంగా స్త్రీ పురుష సంబంధాలలో చాలా స్పష్టంగా ధైర్యంగా రాసారు. ఈ వస్తువు మీద చుగ్తాయ్ రాసిన ‘లిహాఫ్’ వివాదాస్పదంగా మారింది. ఈ కథ అలీఘరకు చెందిన బేగం తన ఇంట్లో పని చేసే పని మనిషితో లైంగిక సంబంధలో ఉన్నారన్న పుకారుపై రాసిన కథ. దీన్ని దీపా మెహతా ‘ఫైర్’ పేరుతో సినిమాగా తీసారు. అప్పటి సమాజంలో మూఢనమ్మకాలు, అంటరానితనంపై చుర్గాయ్ రాసిన కథలు, నవలలు సంచలనం సృష్టించాయి. దేశ విభజనపై రాసారు. హిందూ ముస్లిం సామరస్యాన్ని కోరుతూ కథలున్నాయి. దేశ విభజన సమయంలో రెండు మతాలు పరస్పరం చేస్కున్న దాడులు హింసలను ఖండిస్తూ రాసిన కథలున్నాయి.

‘కఫీర్ – ధీత్’ లాంటి చిన్న నవలల్లో ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్ ను ఇస్మత్ అవమానించాలని చాలా దుమారం రేగింది. బుర్ఖా స్త్రీలను ఎదగడానికి అవరోధంగా ఉంటుంది అన్న భావనతో ‘బురఖా’ కథ రాసారు. కుల వివక్ష, మత వివక్ష, ఆధిపత్యం, ఆర్థిక అసమానతలు డొల్లతనం నిండిన వివాహ వ్యవస్థ, వివాహేతర సంబంధాల్లోని నైతిక అనైతిక అంశాలు, స్త్రీల శృంగారాసక్తులు,
వ్యక్తీకరణలోని స్వేచ్ఛ, లైంగిక వివక్ష, అణిచివేత, హింస, సెక్స వర్కర్స్ జీవితాలు, గౌరవనీయమైన సమాజంలో వారు పడి ఘర్షణలు, ఆరాటాలు, అవమానాలు, హింసలు, దాడులు, మూఢనమ్మకాలు ఆచారాల వల్ల ధ్వంసమైతున్న స్త్రీల, ప్రజల జీవితాలు, వివాహం, దాంపత్య జీవితం చుట్టూ ఉన్న సామాజిక పితృస్వామ్య, సాంస్కృతిక భావనలలోని తప్పొప్పులు ‘ఇస్మత్ ఆపా’ అని పిలిపించుకునే ఇస్మత్ తన కథల్లో నవలల్లో అణిచివేతకు గురయ్యే స్త్రీల హక్కులను బలంగా ప్రశ్నించేవారు. ‘క్యు-ఏక్ బాత్’, ‘చోటే’ కథా సంకలనాలు వీటన్నింటిలో స్త్రీల అణిచివేతలు, పోరాటాలు ఆకాంక్షలు, అసంతృప్తులు, బలమైన స్వీయ వ్యక్తీకరణలు చిత్రీకరించారు. ఇస్మత్ చుగ్తాయ్ కథల్లోని స్త్రీలందర్ని అణిచివేత అనే లంకె కలిసి ఉంచుతుంది. వీరంతా తమ జీవితాల్లోని ఊపిరాడనివ్వని ఉక్కిరి బిక్కిరి తనం నుంచి బయట పడటానికి శతవిధాలా ప్రయత్నిస్తుంటారు. ఆ పోరాటంలో స్త్రీలుగా సమాజంలో తప్పులు చేసేవారిగా ముద్రించబడతారు. చాలా స్త్రీ పాత్రలు తమని లైంగికంగా అణిచివుంచే లేదా హింసించే పురుషులను ఎదుర్కొని ఆ పంజరాల నుంచి బయట పడడానికి మగవాడికి ఆడదానిపట్ల ఉండే దేహ లౌల్యాన్నే వాడతారు. ‘ఫర్వాలీ’ కథలో ఇదే కనపడుతుంది.

ఇస్మత్ స్పష్టమైన అభిప్రాయాలు:

స్త్రీల ప్రతిఘటన, లొంగుబాటు పురుషుడి ఆధిపత్యం అహంకారాల మీద ఇస్మత్ చుగ్తాయ్ కొన్ని అభిప్రాయాలు చాలా నిర్మొహమాటంగా ఇలా ఉంటాయి.
‘ఆడది బలహీనమైతే కావచ్చుకానీ బుద్ధిహీనురాలు కాకూడదు.’
‘భర్త నుండి విడిపడి స్వతంత్రంగా ఉండే ఆర్థిక పరిస్థితి లేనందున, ఆమె భర్తను అంటి పెట్టుకొని ఉంటే ఆమె వేశ్యకన్న అధమురాలు.’
‘ఇది పురుష ప్రపంచం. అతడు చేసుకున్న, పాడు చేసుకున్న ప్రపంచం. అందులో ఆడది ఒక ముక్క. అతడి ప్రేమనూ ద్వేషాన్ని వ్యక్తపరుచుకునే ఆసరా. తన మూడ్ కి అనుగుణంగా ద్వేషిస్తాడు, పూజిస్తాడు లేదా తన్ని తరిమేస్తాడు’ లాంటి ఘాటు అభిప్రాయాలు నిక్కచ్చిగా వెలిబుచ్చారు.

అలాగని ఇస్మత్ చుగ్తాయ్ పురుష ద్వేషి మాత్రం కాదు. నాన్న, అన్నదమ్ములు, స్నేహితులు, భర్త గురించి ఆమె ఎంతో గౌరవంగా తన ఆత్మకథా సంకలనంలో పేర్కొంటారు.

ఇస్మత్ కి పిరికితనంలో ఉండే స్త్రీలంటే చిరాకు. ధైర్యంగా ఉండాలంటారు. స్త్రీ పురుషుల మధ్య సమాన సంబంధాలను గౌరవిస్తాననీ అంటారు. తన ఆత్మకథా సంకలనంలో తన భావ సంఘర్షణలన్నీ రాసారు. ‘కాగజీ హై పైరహన్’ – ‘ఇస్మత్ ఏక్ ఔరత్’ నాటకంగా ప్రదర్శితమయ్యింది. దీంట్లో తన బాల్య జ్ఞాపకాలను, అనుభవాలను రాస్తూ ఆ అనుభవాలు తనలో కొన్ని బలమైన అభిప్రాయాలను ఎలా ఏర్పర్చాయో చెప్తారు ఇలా.

“నల్లటి బక్కపిల్లని హృదయం లేని మనిషొకడు బెత్తంతో కొడుతున్న చప్పుడు, ఆ పిల్ల ఏడుపు నాలో భయాన్ని, ఏడుపుని కలిగించాయి. బాగా ఏడ్చాను. ఆ కర్ర శబ్దం ఇప్పటికీ వినిపిస్తుంటుంది. పెద్ద వాళ్ళు చిన్న వాళ్ళని కొడతారు. బలవంతులు బలహీనుల్ని హింసిస్తారు, తలెత్తుకుని నిలబడతారు. బలహీనులు తలదించుకుని వాళ్ళ కాళ్ళ కింది ధూళిలా మారిపోతారు. బలవంతుల్ని అభిమానించి బలహీనుల్ని ఏవగించుకోవడం మొదలెట్టా ఆ చిన్న వయసులో. కానీ దృఢమైన గోడకి నాచు
మొక్క మొలిస్తే గోడ బలహీనం అయ్యి మొక్క బలవంతం అయితే నాలో సంతోషం కలిగేది.”

ఇస్మత్ చుగ్తాయ్ కథల్లో చాలా వివాదాస్పదమైన కొన్ని కథలు ముఖ్యంగా ‘లిహాఫ్’ కథ అప్పటి సమాజంలో పెను ప్రకంపనలు సృష్టించింది. ఉలిక్కిపడేలా చేసింది. ఖంగారు భయంతో పురుషులు ఇస్మత్ చుగ్తాయ్ ని వెంటాడి వేధించారు. కథలో అశ్లీలత ఉంది అని ఆంక్షలు విధించారు. బ్రిటిష్ ప్రభుత్వం లాహోర్ కోర్టులో కేసు కూడా వేసింది. కానీ ఇస్మత్ చుగ్తాయ్ ధైర్యంగా కేసుని ఎదుర్కొని బయటపడింది.

లిహాప్ కథని దీపామెహతా 1996లో ‘ఫైర్’ (నిప్పు) అనే సినిమాగా హిందీ, ఇంగ్లీష్ భాషలలో వచ్చింది. షబానా ఆజ్మీ, నందితాదాస్ లెస్బియన్ జంటగా నటించారు. సినిమా విడుదలయ్యాక సమాజంలో అలజడి లేచింది. కానీ రచయిత్రి, దర్శకురాలు, నటీనటులు సమాజం విసిరిన అన్ని ప్రశ్నలకు దీటుగా సమాధానాలు ఇచ్చి నిలబడ్డారు. ఈ కథనే ఇస్మత్ చుగ్తాయ్ జీవితమంతా ఇంత వివాదాస్పదం అయిన ‘లిహాఫ్’ కథలో ఏముంది? ఈ కథ 1947లో రాసింది. ముస్లిం నవాబులు జనానాల్లో రహస్యంగా ఉండాల్సిన లైంగిక విషయాలను బజారులో పెట్టింది ఈ ‘లిహాఫ్’ కథ. సాహిత్య ప్రపంచంలో కొత్త ధోరణిని ప్రవేశపెట్టి పెను తుఫాన్ని సృష్టించి వదిలి పెట్టింది. ఈ కథంతా ఒక చిన్న 8 ఏళ్ళ పాప ‘అమీరన్’ వైపు నుంచి నడుస్తుంది. ఊరెళ్ళే ముందు అమీరన్ ను ఆమె తల్లి నవాబుకి రెండవ భార్యగా ఉన్న తన చెల్లెలైన బేగం జాన్ దగ్గర వదిలివెళ్తుంది. తన ఇంట్లో ఉండే మగ పిల్లలతో ఆడుతూ పాడైపోతుందని. అమీరన్ ఆ పెద్ద జనానాలో అన్నీ గమనిస్తూంటుంది. అమీరన్ కు తన ఇంట్లో, బంధువుల ఇళ్ళల్లో స్త్రీ పురుషులిద్దరిని మాత్రమే జంటగా చూడ్డం తెలుసు. అంటే భార్యా, భర్తలని. కానీ ఇక్కడ జనానాలో పరిస్థితి పూర్తిగా వేరుగా ఉండి ఆశ్చర్యపోతూంటుంది. నవాబు భార్య బేగంజాన్. నవాబు తన ప్రాంతంలో ఉన్న ముస్లిం యువకులను పోగు చేసి వారికి చదువు చెప్పిస్తూ, తనకు నచ్చిన పురుషులతో లైంగిక సంబంధంలో ఉంటూ బేగం జాన్ ను నిర్లక్ష్యం చేస్తూంటాడు. భర్త నిర్లక్ష్యంతో బేగం జాన్ విపరీతమైన అసంతృప్తికి మానసిక ఒత్తిడికీ లోనవుతూ నిరంతరం తలనొప్పులు ఒంటినొప్పులతో, ఒంటిమీది దురదలతో సతమతమవుతూ తలనొప్పులు తగ్గించుకోవడానికి రోజూ చాయ్ మీద చాయ్ లు తాగుతూంటుంది. ఒంటరితనంతో పిచ్చెత్తిపోయి భర్త ప్రేమ కోసం ఎదురు చూస్తూంటుంది. ఆమె అనారోగ్యంలో ఉన్నపుడు వచ్చిన మగ డాక్టరు కూడా ఆమెకి వైద్యం చేసి తలవంచుకుని వెళ్ళిపోతాడు. ఈ డాక్టరుకి కూడా తాను, ఆకర్షణీయంగా అందంగా కన్పించట్లేదెందుకు అని వాపోతుంది. ఆమె తలనొప్పులు తగ్గించడానికి ఆమె దురదలకు గోకడానికి బేగం జాన్ ఇంట్లో పనిచేసే అమ్మాయి పూనుకుంటుంది. ఆమె స్పర్శకు బేగంజాన్ అలవాటు పడుతుంది. ఆమె స్పర్శలో సుఖాన్ని అనుభవిస్తుంది. అది మెల్లగా ఆ ఇద్దరు స్త్రీల మధ్య లైంగిక సంబంధంలోకి దారి తీస్తుంది. మెల్లగా బేగంజాన్ భర్త నిరాదరణను, ఒంటరితనాన్ని మర్చిపోయి పనమ్మాయి ప్రేమలో సేద తీరుతుంటుంది. ఇదంతా చూస్తున్న అమీరన్ ఆశ్చర్యానికి గురి అవుతూ ఉంటుంది. ఈ లోపల ఒకసారి పనమ్మాయి ఊరెళ్ళినపుడు బేగం జాన్ కి ఒంటి మీదికి వచ్చిన దురదలకు అమీరన్ తను రుద్దడానికి వెళ్ళినపుడు బేగంజాన్ ఆ పసిదానితో లైంగిక చేష్టలు చేస్తుంది. అమీరన్ మానసిక దిగ్భ్రాంతి చెందుతుంది. అసహ్యంతో విడిపించుకుని తన తల్లి తనకి ఎంత శిక్ష విధించింది అని కుములుతూ తన బట్టలు తీస్కుని అప్పటికపుడు ఆ జనానాని పెద్దమ్మని ఈసడించుకుని వెళ్ళిపోతుంది.

అయితే ఇక్కడ బేగంజాన్ ముందు నుంచీ లెస్బియన్ కాదు. ఆమె తన భర్తతోనే లైంగిక సంబంధాన్ని సహజంగా కోరుకుంటుంది. కానీ అది దొరక్క పైగా తనతో కాకుండా పురుషులతో లైంగిక సంబంధాల్ని కొనసాగించడం అవమానంగా భావిస్తుంది. తన అసంతృప్తిలోంచి మరో స్త్రీతో యాదృచ్చికంగా అవకాశం వచ్చినప్పుడు సంబంధం కొనసాగిస్తుంది. ఈ కథ రాసి ఇస్మత్ చుగ్తాయ్ కుటుంబంలో బయటి సాహితీ సమాజంలో తీవ్రమైన విమర్శ ఎదుర్కొంది. కథంతా అసభ్యత, అశ్లీలత ఉందని ఆమెపై కోర్టులో కేసు కూడా వేసింది బ్రిటిష్ ప్రభుత్వం.

ఈ కథలో అప్పటి పితృస్వామ్యం, ఆచారాలు, వివాహ వ్యవస్థ కలిసి సృష్టించిన విధ్వంసం, దాని మూలంగా స్త్రీల జీవితాల్లో నిండిన నిరాశా, బాధా, వేదనా, ఒత్తిడి, అవమానం, ఒంటరితనాల నుంచి బయట పడటానికి వారు ఎన్నుకున్న లైంగిక ధోరణులు సానుభూతితో అర్థం చేసుకోవాల్సి ఉంది. అయితే ఈ కథలో జీర్ణించుకోలేని విషయం ఒకటుంది. పసి అమీరన్ మనసు, దేహంపైన బేగంజాన్ విచక్షణ మరిచి లైంగిక చేష్టలకు పూనుకోవడం. పసిపిల్లలో లైంగిక సంబంధాలు బలవంతంగా నెరపడాన్ని ‘పీడోఫీలియా’ అనే మనోలైంగిక వ్యాధిగా పరిగణిస్తారు. ఒక్కసారి బేగంజాన్ మీద పాఠకులకు నెలకొన్న సానుభూతి అంతా ఆమె పసి అమీరన్ పై చేసిన లైంగిక దాడితో తగ్గి పోయింది. పసి అమీరన్ ఆ గాయాలతో పెరిగి పెద్దదై పెళ్లైనాక తన వైవాహిక జీవితంలో ఎన్ని భయాలలో ఉండబోతుంది. ఇది చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్ కాదా? బేగం జాన్ మీద ఎంత సానుభూతి ఉన్నా పసిపాప మీద ఆమె చేసిన లైంగిక అత్యాచారాన్ని ఎలా తక్కువ చేస్తాం? కథ పూర్తి చేసాక బేగం జాన్ బాధ కాకుండా, గుండె గాయాలతో భయవిహ్వలంగా ఆ రహస్యపు జనానాలోంచి పారిపోయిన ఎనిమిదేళ్ళ అమీరన్ గుర్తుకొస్తూనే ఉంటుంది.

అట్లనే… ‘మేలి ముసుగు’ అనే కథ 80 ఏళ్ళ వృద్ధ కన్య గోరీబీ మనలను ఆశ్చర్యచకితులను చేస్తుంది. తన భర్తకు ఉన్న లైంగిక సమస్యను ఆమె సరిగా అర్థం చేస్కోదు. అతనూ అంతే. ఆ భయాల మధ్య పరిష్కారం దొరక్క అలాగే సంవత్సరాలు దాంపత్య జీవితానికి దూరంగా ఉంటూ వృద్ధాప్యం వచ్చే వరకూ గడిపేస్తుంది. భర్తలోని సెక్సు సమస్య అటు పుట్టింటిలోనూ, అత్తింటిలోనూ కనీసం భార్యా భర్తల మధ్య కూడా చర్చకు రాదు. భర్త మాత్రం ఆత్మనూన్యతలో ఆమెను దూరం పెడతాడు. ఇప్పుడు ఈ ఆధునిక శతాబ్దంలో భర్తల సెక్సు సమస్యలను భార్యలు చాలా ధైర్యంగా బయటపెడ్తున్నారు. చికిత్స తీస్కోమని అడగడమే కాదు. తీస్కోపోతే విడిపోయి మరో పెళ్ళి చేస్కుని జీవితాలు ఛిద్రం కాకుండా కాపాడుకుంటున్నారు. ఈ తెగువ గోరీబీ ఉన్న 100 ఏళ్ళ కిందటి సమాజంలో లేదు. గోరీబీ జీవితం ఆమె బతికుండగానే గోరీ అయిపోయింది.

‘తిల్ – ది మోల్’ అంటే ‘పుట్టుమచ్చ’ అనే కథలో కూడా స్త్రీలో ఉన్న లైంగికపరమైన వాంఛలను ఏ విధంగా ఏ బిడియం లేకుండా ఆమె తీర్చుకుంటుందో, అదే సమయంలో ఆమెను దూషించిన పురుషుడిలో ఆమెపై కోరికెట్లా తగ్గిపోయిందో చూపిస్తారు. ఈ కథలో మామూలుగా ఛాతీమీద పుట్టుమచ్చ ఉన్న స్త్రీకి లైంగికవాంఛలు ఎక్కువై తిరుగుబాటు వేశ్య అవుతుందని మూఢనమ్మకం ఉంటుంది. వక్షోజాల మీద పుట్టుమచ్చ ఉన్న పల్లెటూరి రాణి బొమ్మ గీసి డబ్బు సంపాదించాలనుకుంటుంటాడు ఒక కళాకారుడు. ఇద్దరి మధ్య నడిచిన కథ ఇది. అయితే రాణి మాత్రం తన వక్షోజం మీద పుట్టుమచ్చను గర్వంగా భావిస్తుంటుంది. తన శృంగార కోరికల్ని తనకు నచ్చిన పురుషులతో ఏ ఆటంకాలు లేకుండా తీర్చుకుంటుంది కూడా. మచ్చని ఒక శక్తివంతమైన శృంగారానికి ప్రతీకగా భావిస్తుంది. రచయిత్రి లేదా సమాజం అలా అనడం వలన రాణి కూడా ఆ మచ్చ వలన తనలో కోరికలు ఎక్కువ ఉన్నాయి అని అనుకోవచ్చు కూడా. దానికి విరుద్దంగా పుట్టుమచ్చ ఉన్న రాణి బొమ్మ గీయాలనుకున్న కళాకారుడు ఆమె మీద కోరికల్ని చంపుకుంటూ సమాజంలో ఘర్షణకు, ఒత్తిడికి గురి అవుతూంటాడు. సంస్కృతీ, మూఢాచారాలు స్త్రీ శరీర కేంద్రంగా కొనసాగుతూ ఎట్లా వారి జీవితాల్ని నియంత్రిస్తాయో స్త్రీల జీవితాల్ని ఎట్లా నాశనం చేస్తూ పురుషులకే ప్రయోజనం కలిగించేవిగా మారిపోతాయో చెప్తారు రచయిత్రి.

‘గేండా’ అంటే బంతిపువ్వు కథ 1938లో రాసింది. ఈ కథ లింగవివక్ష, కులవర్గ, ఆచారాల అణిచివేతల మధ్య నలిగిపోయిన స్త్రీ కథ. విధవా వివాహం చుట్టూ ఉన్న కట్టుబాట్లు, పెళ్ళి కాకుండా గర్భం దాల్చటం, అనే సంఘటన చుట్టూ తిరుగుతుంది కథ. ఒక ఆధిపత్య కులానికి చెందిన ఇంట్లో పనికి కుదిరిన గేండా అక్కడ ఒకతనిని ప్రేమించి శారీరక సంబంధంలోకి వెళ్తుంది. గేండా దళిత సామాజిక వర్గానికి చెందిన స్త్రీ. భర్త చనిపోయి ఒంటరితనంలోకి వెళ్ళిపోయి శారీరక కోరికలు తీరని అమ్మాయి. గర్భం రాగానే ఆమె గెంటివేయబడుతుంది. గర్భం పోయి గాయపడ్డ గేండా అదే ఇంట్లో ఉన్న ఇంకొక ఒంటరి స్త్రీతో లైంగిక సంబంధంలోకి వెళ్తుంది.

‘ఘర్‌వాలీ’ కథలో ఇళ్ళల్లో పనిచేసే అమ్మాయి పెళ్ళికి ముందు చాలా స్వేచ్ఛగా ఉంటుంది. తన అందంతో స్వేచ్ఛాపూరితమైన భావనలతో తనీడు మగపిల్లలతో కలిసి కూలాసాగా గడుపుతుంది. ఏ నియంత్రణా ఉండదు. ఎవరి పెత్తనం ఉండదు. ఆమె ఒకింట్లో పని చేస్తుంది. ఇంటి యజమాని ఒంటరి వాడు ఆమెను ఇష్టపడతాడు. పెళ్లికి ముందు అతను కోఠీలలో తిరుగుతుంటాడు. పెళ్ళయ్యాకా అదే పని చేస్తాడు కానీ భార్యంటే ఇష్టం ఉంటుంది. ఈ విషయం భార్యకు తెలుస్తుంది పైగా పెళ్ళైనాక ఆమె స్వేచ్ఛను కోల్పోయింది. కొత్త బట్టలు నగలు ఆమెను ఎక్కువ కాలం మురిపించవు. మళ్ళీ ఆమె తాను స్నానం చేస్తుంటే దొంగతనంగా చూసే పక్కింటి అబ్బాయిని ఇంటికి ఆహ్వానించి సరదాగా గడుపుతూ ఉంటుంది. అది భర్త కంటబడి ఆమెను కొట్టి గెంటేస్తాడు. ఆమె మళ్ళీ స్వేచ్ఛా విహంగం అవుతుంది. ఆ బంధనాలు తెగి హాయిగా తిరుగుతూ ఉంటుంది ఎప్పటిలాగే. భర్త ఆమెను మర్చిపోయే ప్రయత్నం చేస్తాడు. ఉదాసీనంగా మారిపోతాడు. ఒక రోజు ఆమె వీధిలో భర్తకి తారసపడి అతన్ని ఆపి “మళ్ళీ పనిలోకి రానా సాబ్” అని కొంటెగా అడుగుతుంది. మరుక్షణం ఆమె ఎప్పటిలాగే అతని ఇంటికి పనికెళ్తుంది. ఆమె చేసిన వంట అతను తింటాడు. మళ్ళీ లైంగిక సంబంధాన్ని కొనసాగిస్తారు. కానీ ఆమె ఇంట్లో భార్యలా బందీగా ఉండదు సాయంత్రం వెళ్ళిపోతుంది. స్వేచ్ఛని కోరే స్త్రీని పంజరంలో వివాహం అనే పేరుతో బందీగా పెడితే స్వేచ్ఛ కోసం ఆ స్త్రీ ఎంత తపన పడి విముక్తిని కోరుకుంటుందో ఈ కథ చెప్తుంది.

అలాగే ‘అంగారే’ కథలో బుర్ఖా సంప్రదాయాన్ని విమర్శిస్తుంది. ముస్లిం స్త్రీలు నిఖాబ్ వేస్కోవడం పురుషాధిక్యతకీ, పెత్తందారీ సంస్కృతికీ చిహ్నమని అది స్త్రీలకే అవమానం అని రాసింది. ఈ కథను బాన్ చేసారు.

‘శిల’ కథలో భార్యగా, తల్లిగా, కోడలిగా బంధాలను బాధ్యతలను నిర్వహించడంలో కరిగిపోతూ తనకు తాను మర్చిపోయిన తన స్వంత వదిన సంఘర్షణ రాసారు.

‘భౌతికా జోడా’ కథలో ఇస్మత్ చుగ్తాయ్ సమాజంలోని మూఢనమ్మకాల మీద స్త్రీలకు పెళ్ళే పరమావధిగా పెంచే పితృస్వామ్య వ్యవస్థ మీదా వాటికి బలైపోయే స్త్రీల సంఘర్షణ, బలిదానాల మీద ఘాటుగా విమర్శిస్తూ రాశారు. పెళ్ళైన నాలుగో రోజు వేస్కునే సాంప్రదాయ పెళ్ళి దుస్తులు ‘భౌతికా జోడా’ సరిగా లేకపోతే ఆ స్త్రీ జీవితం నాశనం అవుతుందన్న మూఢాచారం చుట్టూ తిరుగుతుంది కథ. భర్తను కోల్పోయిన ఒంటరి స్త్రీ బీ – అమ్మీ తన పెద్ద బిడ్డ కుబ్రా పెళ్లి కోసం పడ్డ కష్టాలు, ట్రెయినింగ్ కోసం ఇంటికి వచ్చి నెలరోజులున్న రాహత్ కి కుబ్రాని కట్టబెట్టటానికి చిన్న బిడ్డ హమీదాని అతనికి ఆకర్షణగా పంపడం. అతని ఆకర్షణ బలహీనంగా ఉండే కుబ్రా మీద కాకుండా, హమీదా మీద కలగడం జరిగినా బీ అమ్మ పెద్దగా పట్టించుకోదు. రాహత్, హమీదా చేయి పట్టుకున్నందుకు దుఃఖం, అవమానంతో ఉన్న హమీదాను చూసి ‘ఇత్తీసీ బాత్ హై’ ‘ఇంత చిన్న విషయానికే ఇంత బాధనా’ అంటుంది. అంటే రేపిస్టులైన పురుషులు ఇంట్లో బంధువుల రూపంలో ఉన్నా పట్టించుకోని తనం. చిన్నప్పటి నుంచి కుబ్రా కోసం వరకట్నం కూడబెట్టటం, హమీదాకి సంబంధం సులభంగా కుదిరేటట్లున్నా పెద్దమ్మాయి పెళ్ళి అయ్యే దాకా చిన్నమ్మాయి పెళ్ళి చేయద్దన్న మూఢనమ్మకాలతో పాటుగా పెళ్ళి కొడుకుకి అక్కను చేస్కోవాలన్న కబురు చిన్నమ్మాయితో పంపిస్తుంది. వీటితో పాటు అతన్ని ఆకర్షణ హమీదా నుంచి కుబ్రా వైపుకి మళ్ళడానికి, ఒక మౌల్వీ మంత్రించి ఇచ్చిన గోధుమ పిండితో, టీబితో రోగగ్రస్తురాలైన పెద్ద కూతురు కుబ్రాతో రాత్రి రొట్టెలు చేయించి ఎలాగైనా రాహత్ తో తినిపించమని ‘పోను, వాడు నా మీద పడి అత్యాచారం చేసేటట్లున్నాడు’ అని భయంతో తిరస్కరిస్తున్న హమీదాని బెదిరించి, బ్రతిమిలాడి – అక్క కోసం ఈ మాత్రం చేయలేవా అని ఏడిచి పంపిస్తుంది. రాహత్ ఆ రాత్రి ఆమెను రేప్ చేస్తాడు. పొద్దున్నే ఒక నెల శిక్షణ ముగించుకుని ఊరికి కూడా వెళ్ళిపోతాడు. కానీ కుబ్రా జ్వరం ఎక్కువై అదే రాత్రి చనిపోతే, లైంగిక అత్యాచారానికి గురైన హమీదా దిక్కు తోచక ఏడుస్తుంటుంది. బీ అమ్మీ కూడా భ్రమించినట్లు కూర్చుండి పోతుంది. మత సంప్రదాయాలు, పితృస్వామ్య వ్యవస్థ స్త్రీల జీవితాల్లో ఎంత అయోమయాన్ని నింపి విషతుల్యం చేస్తాయో చక్కగా హృదయం ద్రవించి పోయేలా రాస్తారు ఇస్మత్ చుగ్తాయ్.

‘ఝూంఫట్’ కథ కూడా వివాహ వ్యవస్థలోని దుర్మార్గానికి బలైపోయిన స్త్రీ కథ.

మత సంప్రదాయాల మీదనే కాకుండా దేశ విభజన సమయంలో మత సామరస్యం గురించి కూడా మంచి కథలు రాసారు ఇస్మత్ చుగ్తాయ్. ‘తేడీ లఖీర్’, ‘ముఖద్దర్ కా ఫర్జ్’ లాంటి కథల్లో తన లౌకిక వాదం ఆలోచనలను పంచుకుంటారు ఇస్మత్. ‘ముఖద్దర్ కా ఫర్జ్’ కథలో అప్పటి మత విద్వేషాలతో కునారిల్లుతున్న భారతదేశానికి లౌకికవాద దృక్పథం అవసరం చాలా ఉందని చెప్తారు. ఆ కథకి ఇప్పటికీ చాలా ప్రాసంగికత ఉంది అంటే రచయిత్రి దార్శనికత మనకి అర్థం అవుతుంది.

ఇస్మత్ చుగ్తాయ్ లౌకికవాద దృక్పథాన్ని తెలిపే మాటలు:

“మతం వేరు, జాతి వేరు, సంస్కృతి వేరు. ఈ దేశపు మట్టిలో గాలిలో, నీటిలో, సూర్యరశ్మిలో నాకు సగ భాగం ఉన్నట్లే ఈ దేశ సంస్కృతిలోనూ నాకు భాగం ఉంది. నేను హోలీకి రంగులు ఆడితేనూ, దీపావళికి దీపాలు పెడితే నా మత విశ్వాసాలు దెబ్బ తింటాయని నేను అనుకోను. నేను ముస్లిమును. విగ్రహారాధన మేము చేయము. కానీ పురాణాలు అనేవి ఈ దేశపు వారసత్వపు సంపద. యుగాల సంస్కృతీ, తత్వాలు అందులో మిళితమై ఉన్నాయి.”

ఇస్మత్ చుగ్తాయ్ ధైర్యం, సాహసం అప్పటి ప్రముఖ ఉర్దూ రచయిత్రి ఖురుతలున్ హైదర్ మెచ్చుకుంటూ ముద్దుగా ఇస్మత్ చుగ్తాయ్ కు “మహిళా చెంఘిజ్ ఖాన్” అని అన్నారు.

ఇస్మత్ చుగ్తాయ్ రచనల మీద సెన్సార్షిప్:

ఇస్మత్ చుగ్తాయ్ తన ముప్పై ఏళ్ళ వయసులో ‘లిహాఫ్’ కథ రాసారు. తనకు బాగా తెలిసిన ముస్లిం నవాబుల జనానాలో ఆమె దృష్టికి వచ్చిన స్త్రీ పురుషుల సంబంధాలకు విరుద్ధంగా నడుస్తున్న పురుషుడు – మరో పురుషుడితో, స్త్రీలు – స్త్రీలతో చేసిన సెక్సు సంబంధాలు, అలాగే చిన్న పిల్లలతో వికృత సెక్సు సంబంధాలకు సంబంధించి స్వేచ్ఛగా చర్చించారు ఈ లిహాఫ్ కథలో. ఈ కథ 1996లో దీపా మెహతా ‘ఫైర్’ అనే సినిమాగా తీసారు. ఆ సినిమా కూడా చాలా విమర్శలకు లోనైంది. లిహాఫ్ కథ 1944లో లాపూర్ కేంద్రంగా ప్రచురితమయ్యే సాహిత్య పత్రికలో ప్రచురించబడింది. సభ్య సమాజం, పురుష సమాజం, పురుష రచయితలు, సంప్రదాయ రచయిత్రులు ఉలిక్కిపడ్డారు. జీర్ణించుకోలేక పోయారు.

ఈ కథ 2020 వర్తమాన సమాజంలో కూడా కొద్ది మంది మాత్రమే రాయ సాహసించే వస్తువుతో ఉన్నది. ఈ కాలంలో పాఠకులు ఈ వస్తువును కొద్దికొద్దిగా అంగీకరిస్తున్నారు. కానీ వందేళ్ళ కిందట? సాహసమే మరి. కథలో అశ్లీలత పాలు ఎక్కువైందని ఇస్మత్ మీద లాహోర్ కోర్టులో బ్రిటిష్ ప్రభుత్వం కేసు వేసింది. క్షమాపణ కోరింది. కథను విరమించుకోమంది.

కానీ ఇస్మత్ చుస్రాయ్ క్షమాపణ చెప్పలేదు. ఇద్దరి స్త్రీల మధ్య ప్రేమ, ఆకర్షణ చిగురించడానికి ఉన్న సామాజిక పితృస్వామ్య పరిస్థితులు అంతా వివరించి ఆ కేసునుంచి బయటపడ్డారు. కోర్టు కేసు కొట్టి వేసింది. అదే సమయంలో ఇస్మత్ చుగ్తాయ్ సమకాలీన రచయిత సాదత్ హసన్ మంటో కూడా దేశ విభజన సమయంలో చెలరేగిన హింస, స్త్రీలపై జరుగుతున్న లైంగిక అత్యాచారాల మీద కథలు రాసి కోర్టు కేసులు ఎదుర్కొన్నారు. బయట కూడా పడ్డారు. ఇద్దరి ప్రవృత్తీ ఒక్కటే. సాహసోపేతంగా ఉంటూ అప్పటి సామాజిక వాస్తవికతలో ప్రతిబింబించే రచనలు నిర్భయంగా చెయ్యడం. వాటివలన వచ్చే ప్రమాదాలను ప్రశ్నలను తిరస్కారాలను ధీటుగా ఎదుర్కోవడం. లిహాఫ్ కథను రాసి కోర్టు కేసుని ఎదుర్కొని బయటపడినా ఇస్మత్ చుగ్తాయ్ కుటుంబం, సమాజం వలన చాలా విమర్శలను ఒత్తిడిని ఎదుర్కొన్నారు. చాలా బాధను అనుభవించారు. ఆమె ఎన్నో మంచి కథలు రాసినప్పటికీ ‘లిహాఫ్’ కథకురాలు అని పిలిచేవారు. ఒక దశలో విమర్శలు తట్టుకోలేని ఇస్మత్ తనకు జీవితంపై విరక్తి కలుగుతున్నదని చెప్పుకునేవారు. ఇస్మత్ చుగ్తాయ్ సాహిత్యం మీద ‘లిహాఫ్’ కథ సృష్టించిన సంఘటనల తర్వాత పురుష రచయితల ప్రపంచం చాలా పెత్తనం చేసింది. సెన్సార్‌షిప్ చేసింది.

ఇస్మత్ తన ఆత్మ కథా సంకలనం అయిన ‘కాగజీ హై పైరహన్’లో 1994లో ఇలా రాస్కున్నారు. “‘లిహాఫ్’ కథ నన్ను నిరంతరం ఒక కర్రదెబ్బలా వెంటాడుతూ ఉండింది. నేను ఆ కథ తర్వాత ఎన్నో కథలు జీవన వాస్తవికతను ప్రతిబింబించే భిన్నమైన వస్తు వైవిధ్యంతో కథలు, నవలలు, రేడియో నాటకాలు రాసినప్పటికీ ఈ కథలనీ ‘లిహాఫ్’ కథ బరువు కింద నలిగిపోయాయి. నా మీద సెక్స్ కథలు రాసే రచయిత్రి, అశ్లీలంగా రాసే రచయిత్రి అనే ముద్ర పడిపోయింది. ఒక ఐదేళ్ల నించి మాత్రమే ఇప్పటి నూతన తరం పాఠకులు నన్ను వాస్తవిక రచయిత్రి అని గుర్తించార”ని ఆవేదనతో 1994 సంవత్సరంలో రాస్కున్నారు. “నా కథల్లో ప్రతీది నేను ఆబ్జెక్టివిటి (నిష్పాక్షిత) తో రాస్తాను. అవి కొంతమందికి అసభ్యంగా కనపడితే అది వాళ్ల సమస్య దానికి నేనేమీ చేయలేను. ఎందుకంటే మానవ అనుభవాలు జీవన వాస్తవికత నుంచి వచ్చినవి అయితే అవి ఎన్నడూ కూడా అసభ్యంగా ఉండవని నేను భావిస్తాను. ఒక స్త్రీ కలం ద్వారా తన భావాలను రాయాలని అనుకున్నప్పుడు పురుషస్వామ్యం పెద్దన్న లేదా పోలీస్ పాత్ర పోషించి ఆమెను అదుపులో పెట్టే ప్రయత్నం చేస్తుంటుంది. ఎందుకంటే స్త్రీలని మేధస్సు, సృజనాత్మకత, స్వంత శక్తి సామర్థ్యాలు లేని వారిగా చిత్రించి అణిచివేసిన పురుషస్వామ్యం స్త్రీల రచనలు శక్తివంతంగా ఉంటే మటుకు వీళ్ళ పునాదులు కదిలిపోయి అభద్రతకు గురవుతుంది. వాళ్ళకెప్పుడూ స్త్రీలు అణిగిమణిగి బలహీనంగా ఉండాలి. బిడ్డల్ని మోసి కనే యంత్రంలా ఉంటూ సిగ్గూ బిడియాలతో ఉండాలి. దేహం ఉంది కానీ స్త్రీలకు వ్యక్తిత్వం ఉండద్దు ఈ పితృస్వామ్య వ్యవస్థకి. దానికి భిన్నంగా ఉండి ప్రశ్నించే, రాసే స్త్రీలను చూస్తే వణికిపోయింది. కానీ నా ఆత్మ విశ్వాసం ఎప్పటికీ దెబ్బ తినలేదు.” ఇంత ఎదుర్కొన్నా ఇస్మత్ చుగ్తాయ్ తనదైన వాస్తవిక ధోరణిలో రాస్తూనే పోయారు. చాలా సాహసోపేతమైన రచనలు చేసారు. ఎవరినీ పట్టించుకోలేదు.

గేండా కథ, వోకేషన్ కథలు కూడా స్త్రీల లైంగికత మీద భిన్నమైన దృక్పథాలతో రాసిన కథలు. ‘వొకేషన్’ కథలో సెక్స్ వర్కర్స్ ఆధిపత్య కులాలకు చెందిన స్త్రీలతో స్నేహం చెయ్యడాన్ని రాస్తారు. ఆ స్త్రీలు ఈ సెక్స్ వర్కర్స్ ను వారి వృత్తిని మొదట్లో అసహ్యించుకున్నా మెల్లగా వాళ్ల అపోహలు తొలగి వారితో స్నేహం చేయడాన్ని రాస్తారు. ‘గేండా’ కథలో ఆధిపత్య కులానికి చెందిన పురుషుడుతో దళిత సామాజిక వర్గానికి చెందిన స్త్రీ ప్రేమ లైంగిక సంబంధం కొనసాగించడం గురించి రాస్తారు. పురుష సాహిత్య ప్రపంచం ఇస్మత్ చుగ్తాయ్ రచనలను అడుగడుగునా విమర్శించింది, అడ్డుకునే ప్రయత్నం చేసింది. అట్లనే సాహిత్య ప్రపంచంలో స్త్రీల, పురుషుల రచనలను అంచనా వేయడానికి ఎట్లాంటి సామాజిక అంశాలను ప్రామాణికంగా తీస్కుంటారు అనేది చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఎంత ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తాయో తెలిస్తే విస్తుపోతారు.

అప్పట్లో ‘అస్లాం’ అనే పురుష రచయిత ‘గునా కీ రాతే’ ‘చీకటి రాత్రిళ్ళు’ అనే కథ రాసాడు. ఆ కథలో మోతాదుకు మించి అసభ్యత దిగజారుడు అభిరుచే ఉన్న పాఠకుల కోసం రాస్తాడు. దీన్ని చదివిన ఇస్మత్ కథలో అసభ్యత చాలా ఉంది అస్లాం సాబ్ అని ప్రశ్నిస్తే… ‘నేను మగాణ్ణి ఎట్లా అయినా రాస్తాను’ అంటాడు. ఇది సమాజంలో స్త్రీ – పురుషులకు విడివిడిగా ఉన్న ద్వంద్వ ప్రమాణాలను తెలుపుతాయి. ఒక్క ఇస్మత్ చుగ్తాయ్ మాత్రమే కాదు చాలామంది రచయిత్రులు కులం, మతం, లైంగిక వివక్షల మీద వాస్తవిక దృక్పథంలో రాసినందుకు ఎంతో సెన్సార్‌షిప్ ను, వేధింపులను ఎదుర్కొన్నారు. ఇస్మత్ కంటే ముందు తర్వాత కూడా ఎంతో మంది రచయిత్రులు తాము కేవలం స్త్రీలు కావడం మూలంగా స్వేచ్ఛగా రాయలేక పోయారు స్వీయ సెన్సార్‌షిప్ చేస్కున్నారు భయంతో. కుటుంబమో, సమాజమో ఏదో ఒక తలంలో తమ రచనలను సెన్సార్ చేస్తాయని ఈ రచయిత్రులు బలంగా అభిప్రాయపడతారు.

ఇక ఇస్మత్ చుగ్తాయ్ కేవలం తన రచనల మీద జరిగిన సెన్సార్‌షిప్ తో మాత్రమే పోరాడలేదు తనకంటే సీనియర్, తనకు రోల్ మాడల్ అయిన ఉర్దూ రచయిత్రి రాషిద్ జైన్ (1905-1952) రచనల మీద జరిగిన సెన్సార్‌షిప్ కి వ్యతిరేకంగా ప్రశ్నించి, పోరాడారు. రాషిద్ ‘అంగారే’ కథా సంకలనం (1932) లో వచ్చింది. అసభ్యంగా ఉండడంతో పాటు బ్లాస్‌ఫెమి అంటే దైవ దూషణ కలిగి ఉందని పత్రికా సంపాదకులు సెన్సార్ చేసారు. ఆ సమయంలో ఇస్మత్ చుగ్తాయ్ కు 18 సంవత్సరాలు కాలేజీలో చదువుకుంటున్నది. ఈ విషయం తెలుసుకొని తన క్లాస్ మేట్ తో కలిసి కథను బాన్ చేసిన మత పెద్ద మౌల్వీ ఆర్వారీ ఆఫీస్ కి వెళ్ళారు. నిలదీసారు. అయినా ఆయన కథ మీద బాన్ ఎత్తేయనన్నారు. ఇస్మత్ చుగ్తాయ్ ఆవేశంగా ఇంటికి వచ్చి ఈ కథ మీద పత్రిక మీద వచ్చిన కువిమర్శ మీద తీవ్రంగా పెద్ద ఉత్తరం రాసారు. దీన్ని ఇస్మత్ చుగ్తాయ్ తన ఆత్మకథలో ‘రాషిద్ రాసిన ఈ కథలో మేం అసభ్యత, అశ్లీలత గురించి ఎంత వెతికినా మాకు మాత్రం ఎక్కడా దొరకలేదు’ అని రాసుకున్నారు.

అంతేకాదు ఇస్మత్ చుగ్తాయ్ మత సంప్రదాయాల్ని ఎదిరిస్తూ బురఖా గురించి, ఖురాను గురించి రాసిన కథల్ని కూడా ముస్లిం మత పెద్దలు సెన్సార్ చేస్తూ నిషేదించారు. ఇస్మత్ చుగ్తాయ్ స్త్రీల రచనల మీద జెండర్ కారణాల వలన మతపరమైన రాజకీయ కారణాల వలన జరిగే జెండర్ డిస్క్రిమినేషన్ ను సెన్సార్‌షిప్ ను జీవితమంతా ధైర్య సాహసాలతో ఎదుర్కొంటూ రాస్తూనే ఉన్నారు. రాయడం ఎన్నడూ ఆపలేదు.

డా. భారతి : Psychotherapist & marital counselor. కలం పేరు గీతాంజలి. పుట్టిన స్థలం హైద్రాబాద్. ర‌చ‌న‌లు: 'ఆమె అడవిని జయించింది', 'పాదముద్రలు'. లక్ష్మి (నవలిక). 'బచ్ఛేదాని' (కథా సంకలనం). 'ప‌హెచాన్‌' (ముస్లిం స్త్రీల ప్రత్యేక కథా సంకలనం), 'పాలమూరు వలస బతుకు చిత్రాలు' (కథా సంకలనం), 'హస్బెండ్ స్టిచ్' (స్త్రీల విషాద లైంగిక గాథలు) 'అరణ్య స్వప్నం' (కవితా సంకలనం) సెప్టెంబర్ 2019 లో విడుదల అవుతుంది.

7 thoughts on “సంప్రదాయ సంకెళ్ళను బద్దలు కొట్టిన వేగుచుక్క: ఇస్మత్ చుగ్తాయ్

 1. ‘ఇస్మాయిల్ చుగ్తాయ్’ ధీరోదాత్త వ్యక్తిత్వాన్ని, 1930ల నాటికే ఆమెలోని స్త్రీ వాద సాహిత్య సృజన శీలతను డా.భారతి గారు తెలియజెప్పారు. అభినందనలు.

 2. ఇస్మత్ చుగ్హాయ్ ను చాలా ప్రేమగా ఆవిడ భావాలతో ఏకీభావంతో గీతాంజలి గారు రాసిన పరిచయం ఎన్నో వివరాలతో ఆవిడ విలక్షణమయిన రచనలను ఉదహరిస్తూ చాలా బావుంది

 3. పి.సత్యవతిగారు అనువాదాల లాగా కాకుండా అచ్చం తెలుగు కథల్లాగే అనుసృజించిన ఇస్మత్ చుగ్తాయ్ కథలు చదివాను. వేణూ అనువాదం “తలపుల తోవ” లో కూడా ఇస్మత్ ఆపా గురించిన రిఫరెన్స్ వస్తుంది. ఆమె ధీరోదాత్త వ్యక్తిత్వాన్ని గురించి నువ్వు వివరించిన తీరు చాలా ప్రశంసనీయంగా ఉంది గీతా!

 4. 2020 లో గీతాంజలి గారు ఇస్మాత్ చుగ్తాయ్ పరిశీలన విశ్లేషణ ఆవిడ కధలమీద ఆరోజుల్లో (ఎప్పటి లాగే ) ఉండే ఆంక్షల గురించి రాశారు . ముఖ్యంగా ” ఇస్మత్ తన ఆత్మ కథా సంకలనం అయిన ‘కాగజీ హై పైరహన్’లో 1994లో ఇలా రాస్కున్నారు. “‘లిహాఫ్’ కథ నన్ను నిరంతరం ఒక కర్రదెబ్బలా వెంటాడుతూ ఉండింది. నేను ఆ కథ తర్వాత ఎన్నో కథలు జీవన వాస్తవికతను ప్రతిబింబించే భిన్నమైన వస్తు వైవిధ్యంతో కథలు, నవలలు, రేడియో నాటకాలు రాసినప్పటికీ ఈ కథలనీ ‘లిహాఫ్’ కథ బరువు కింద నలిగిపోయాయి. నా మీద సెక్స్ కథలు రాసే రచయిత్రి, అశ్లీలంగా రాసే రచయిత్రి అనే ముద్ర పడిపోయింది. ఒక ఐదేళ్ల నించి మాత్రమే ఇప్పటి నూతన తరం పాఠకులు నన్ను వాస్తవిక రచయిత్రి అని గుర్తించార”ని ఆవేదనతో 1994 సంవత్సరంలో రాస్కున్నారు”

  ఈ లీహాఫ్ కధ మిధ ఆధారపడి దీప మెహ్తా గారు షబానా అజ్మీ , స్మితాపాటిల్ తో లెస్బియనిజమ్ మీద తీసిన సినిమా చాలా చర్చకు తీసింది . ఇలాంటి కధలెన్నో రాశారు ఆవిడ.

  “స్త్రీల ప్రతిఘటన, లొంగుబాటు పురుషుడి ఆధిపత్యం అహంకారాల మీద ఇస్మత్ చుగ్తాయ్ కొన్ని అభిప్రాయాలు చాలా నిర్మొహమాటంగా ఇలా ఉంటాయి.
  ‘ఆడది బలహీనమైతే కావచ్చుకానీ బుద్ధిహీనురాలు కాకూడదు.’
  ‘భర్త నుండి విడిపడి స్వతంత్రంగా ఉండే ఆర్థిక పరిస్థితి లేనందున, ఆమె భర్తను అంటి పెట్టుకొని ఉంటే ఆమె వేశ్యకన్న అధమురాలు.’
  ‘ఇది పురుష ప్రపంచం. అతడు చేసుకున్న, పాడు చేసుకున్న ప్రపంచం. అందులో ఆడది ఒక ముక్క. అతడి ప్రేమనూ ద్వేషాన్ని వ్యక్తపరుచుకునే ఆసరా. తన మూడ్ కి అనుగుణంగా ద్వేషిస్తాడు, పూజిస్తాడు లేదా తన్ని తరిమేస్తాడు’ లాంటి ఘాటు అభిప్రాయాలు నిక్కచ్చిగా వెలిబుచ్చారు.”

  ఇంత గొప్ప కధలను పరిచయం చేసిన గీతాంజలిగారు అభినందీయులు. వీటిని పైన 2020 మాట్లాడినా మళ్ళీ రాయడానికి నిర్ణయించుకున్నాను

Leave a Reply