ఉన్నట్లుండి పత్రికలో ఆదివారపు కవిత ఒకటి అదృశ్యమైపోయింది.
సశేషంగా మిగిలిపోయింది.
ఆదివారం ఆ కవిత చదవడం అలవాటైన పాఠకులు పేజీలన్నీ ఆత్రంగా తిప్పి ఆ శీర్షికను వెతుకుతారా..
నరకబడ్డ చెట్టులా.. కూలిపోయిన ఇల్లులా
ఉన్న ఖాళీ పేజీలోని శూన్యం వాళ్ళని కలవరపెడుతుంది.
ఈ కొత్త వియోగపు ఋతువుని మోయలేని వాళ్ళ గుండె ముక్కలవుతుంది.
అవును మరి ఆ పేజీ ఇల్లు నే కవితా వస్తువుగా చేసుకుంది !
పాఠకుల జ్ఞాపకాల్లో ఇల్లు ఒక అమ్మ !
ఇల్లు వాళ్ళ బాల్య యవ్వన కాలాలను రాసుకున్న ఒక కథల పుస్తకం.
కిటికీ దగ్గర కూర్చుని ఆ రోజుటి సుఖ దుఃఖాలను రాత్రుళ్ళు రాసుకున్న డైరీ ఇల్లు!
ఇల్లు,. వాళ్ల ప్రేమమోహవిరహాలను పాడిన ఒక దర్ధ్ భరీ గజల్ !
ప్రేమికుల ఇష్క్ !
దర్వాజాలు,కిటికీలు
గోడలు, నేలా, డాబా, తోటా, వాకిలీ అన్నీ…
మనుషుల్లా మాట్లాడిన ఇల్లు అది.
…
అవును…ఇదివరకు ఈ కవితా పేజీ ఇలా ఉండేది కాదు
రంగు రంగుల గాజులతో…
పిల్లల నోటికి అన్నం ముద్ద పట్టుకున్న అమ్మ చేతుల్లా …
పంట చేతికొచ్చినప్పటి వెలిగిపోయే నాన్న ముఖంలా ఉండేది.
ఈ పేజీ ఒక ఇంటిని కట్టింది.
కొన్ని తరాల్ని అమ్మలా కని పెంచింది
ఒక తోటను పెంచింది.
గదుల్లో మనుషుల్ని నింపుకుంది.
ఆకలికి పొయ్యిలా మండి ఉడికిన అన్నం గిన్నె లా ఉండేది ఇల్లు .
అనగనగాఒకప్పుడు…పెరట్లో విరజాజులను,
వాకిట్లో పున్నాగ పూలను
మనుషుల కన్నీళ్లను రాల్చుకున్న ఇల్లది!
తన మీద కురిసిన వానను దాచుకున్న ముత్యపు చిప్ప ఆ ఇల్లు !
నీరెండని వేడి వేడి కాఫీలో కలిపి తాగించిన ఇల్లది.
చలికాలపు చీకటి గుబులుగా కమ్ము కుంటున్న మలిసంధ్య వేళ
తనకు తాను దీపాలు వెలిగించుకుని
డాబా మీద వెన్నెలని మధువులా తాగుతూ దిగులుగా ప్రియురాలి జ్ఞాపకాల గజల్స్ పాడుకుంది ఆ ఇల్లు !
…
గుమ్మంలో ఆమె వాల్చుకున్న కళ్ళతో
మెరిసే ముక్కు పుడకతో
మల్లెల మాలలు కడుతుంటే..ఆమె వేళ్ళు కూడా కవితా వాక్యాలలా కదలాడేవి.
పొద్దు గూకే వేళ అమ్మ కాల్చే జొన్న రొట్టెల పరిమళం కట్టెల పొగలో కలిసి ఇంటి సువాసనలా గాలిలో పరివ్యాప్తమై …అమ్మ ఉనికిని చాటే కబురు చెప్పే ఇల్లది..కవిత అది…
…
మనుషుల చేతులు తలుపుల తబలా మీద తలుపు తెరవమనే సంగీతాన్ని వాయించేవి.
ఆ ఇంటి తలుపులు మనుషుల్ని తలపులతో సహా కౌగలించుకుని లోనికి తీసుకొని వెళ్ళేవి.
…
ఆదివారపు కవితా పేజీలో… ఆ కవిత సెలయేరులా నవ్వేది
మువ్వలా నాట్యం చేసేది
పసిపాపలా గారాలు పోతూ ఏడ్చేది..
ప్రేయసిలా కొట్లాడేది.
అమ్మలా ఓదార్చేది.
ఆ కవిత…ఆదివారపు కవితా పేజీకి చంద మామ తో సహా ఒక కిటికీని ఇచ్చింది…
కవిత తన పేజీతోనే బోలెడన్ని కబుర్లు చెప్పేది ! చాలా సార్లు కవితకి భావం అందక
పదాలు దొరక్క తాయి మాయి అయిపోయేది. కోపంతో అక్షరాల్ని పుస్తకంలో నెమలీకల్లా…గులాబీ రెక్కల్లా దాచిపెట్టి దొరక్కుండా మేఘాలవతలకి విసిరేసేది.
పదాలకి దూరమైన కవిత విరహాన్న పడి స్పృహ తప్పేది.
…
ఆ కవిత ఇంటి గది గదినీ పలకరించేది.
తప్పులు చేస్తున్న మనుషుల్ని మందలించేది.
ఇంట్లోని మనిషి మనిషినీ ప్రేమిస్తూ కబుర్లు చెప్పేది
వేదనతో కుమిలిపోయే వాళ్ళని ఆ ఇల్లు గుండెల్లో పొదువుకునేది
వాళ్ళ కలలకి తన కళ్ళిచ్చేది.
పగలంతా పని చేసి అలసి అమ్మల నిద్రకి తన వొడినిచ్చేది.
ఊరంతా నడిచి.. నడిచిన నాన్న పగిలిన పాదాలకి వెన్నపూసైయ్యేది.
…
ఏడుపులతో..నవ్వులతో.. అరుపులతో ..ఉరుకుల పరుగుల సవ్వళ్ళతో ఆ ఇల్లు నిత్యం మోగే సంగీతప్పెట్టే అయి పోయేదని ఆదివారపు కవితా పేజీ కవిత.. తానూ ఒక రాగమై చెప్పేది కాదూ?
…
ఆ కవిత ఇంట్లో దాచిపెట్టిన బాల్యపు సైకిల్ రహస్యాన్ని,
పాత చెక్క అలమారలో పదో తరగతి తెలుగు వాచకం పుస్తక జాడని
తుట్టలోని తేనెలా తియ్యగా దాచి పెట్టింది.
ఆమెకి ఇవ్వని యవ్వన కాలాల ప్రేమలేఖలని కూడా !
బహుశా..ఆమె ఫోటోని కూడా !
…
ఏదీ..ఎక్కడా..?
ఎక్కడ తప్పిపోయింది ఇంటి అణువణువునీ సృజించిన ఆ కవిత ?
ఉన్నట్లుండి ఆదివారపు కవితా పేజీ మాయం అయింది ఎందుకు?
దారి తప్పి.,
ఎక్కడికి పోయింది ?
ఎవరేం చేసారు ఆ కవితని?
పాడుకుంటున్న రాగాల పెట్టెను మూసేసినట్లే ఆదివారపు కవితా పేజీని మాయం చేసారెందుకని?
ఏదీ ఆ కవితా పేజీ.. ఏవీ ఆ కవితలు?
ఈ కవితా పేజీని ఎవరో కొట్టేశారు.
ఎవరో కవితని తోసేసారు.
ఎవరో కవిత మీద ఒక మాయ పొర కప్పేసి దాచేసారు.
…
తలుపు తెరుచుకుని తనంతట తాను ఆదివారపు కవితా పేజీ నుంచి వెళ్లిపోయిన కవిత
ఏ ఇంటి తలుపులు తట్టటానికి వెతుక్కుంటూ ఎటు వెళ్ళిపోయింది ?
ఏ ఇంటి కిటికీని ఆనుకుని
ఏ రాగాలను వినబోయింది ?
ఆదివారపు కవితకి ఏమైంది?
ఎందుకంత అలిగింది?
ఎందుకంత కుమిలిపోయింది?
అనేక దుఃఖాశ్రువులై ఆ ఇంటి కళ్ళనుంచి ధారలు కట్టింది ?
మౌనంగా అందుకుని గుండెన నింపుకున్న రాగాలు గొంతు దాటని తనంతో..
చెట్టు మారిన పక్షిలా .. ఇల్లు ఖాళీ చేసిన మనిషిలా ఆకాశాలు దాటి.,
ఆదివారపు కవితా పేజీకి ఇక ఎప్పటికీ అందనంత దూరాలకు ఎగిరి పోయింది ?
…
అవును కానీ… నాకిది చెప్పండి ఎవరైనా..
నంది వర్ధనాలు, చంద్రకాంతలు., పారిజాతాలు..
మంచు స్నానం చేసిన వెన్నెల పూల సువాసనలు వెదజల్లే సౌగంధికా అక్షరాలు, పదాలు,వాక్యాలను ఇటుకల్లా పేర్చి.. ఇల్లులా కట్టుకున్న ఆదివారపు కవితా పేజీని .. చేజేతులా ధ్వంసం చేసిన వారెవరు ?
ఎందుకు..ఎందుకని.. అయ్యో ఎందుకని ?
ఇల్లు కట్టిన కవితలని…కవితలలో కట్టుకున్న ఇల్లుని కూల గొట్టు కున్నారెందుకని ?
చెబుతారా ఎప్పటికైనా?
ఎంతో అమాయకంగా…స్వచ్ఛంగాప్రేమగా., స్వప్నాలను మోసుకుంటూ…పాటలను,రాగాలను…గజల్స్ ను గున్..గునాయిస్తూ… ఆ కవితా పేజీలోకి అడుగు పెట్టిన ఇల్లు లాంటి కవితని…ఆ కవితా పేజీని…ఎందుకు … ఎందుకని?