‘ఇన్నాళ్ల మౌనం తరువాత‘ – వాచక విశ్లేషణ

(ఈ ఏటికి పుస్తకానికి ఐదేళ్లు నిండిన సందర్భంగా రాసిన సమీక్షా వ్యాసం)

అరుణ నారదభట్ల గారిది ఎన్నాళ్ల మౌనమో తెలియదు గానీ ఆమె రాసిన ‘ఇన్నాళ్ల మౌనం తరువాత’ పుస్తకం ఎందరి మౌనాలనో చెరిపేసింది. మనుషుల గురించి, మనసుల గురించి ఆలోచించేలా, బాధ్యతతో బాధను అనుభవించేలా చేసింది. ప్రేమలోని తియ్యదనం ఓ పేజీలో, ప్రేమ దూరమైన బాధ మరో పేజీలో. ప్రకృతిపై ప్రేమ ఓ పేజీలో, ప్రకృతి విధ్వంసాన్ని నిలదీయడం మరో పేజీలో. బంధాల మీద ఆర్తి ఒక పేజీలో, ఆ బంధాల నుండి మనిషి పరాయీకరణ ఇంకో పేజీలో.. ఇలా పుస్తకం లోని ఏ పేజీని తిరగేసినా అందులో ఏదో ఒక సందేశంతో మనిషిని ఉన్నతీకరించే ప్రయత్నం ఉంటుంది. ఏ మూలో మనిషి అనుభవిస్తున్న ఏదో వెలితిని ప్రపంచానికి చూపిస్తుంది. 119 పేజీల పుస్తకం చదువరులను ఏకబిగిన చదివిస్తుందంటే అందులోని వాక్యాలన్నింటిలో ఎవరికి వారు తమను తాము దర్శించుకోవడమే కారణం. అందుకుగాను మనిషి మనసుకు అంత దగ్గరగా ఆమె రాసిన విధానం, శైలే కారణం. దానికై ఆమె ఎంచుకుని తీసుకున్న కవితా వస్తువులే కారణం.

ఏ కవి అయినా సాధారణంగా కవితావస్తువు ఎంపిక విషయంలో జాగ్రత్తలు వహించడం పరిపాటి. ఈ ఎంపిక పరిధి సంకుచితమైతే ఆ కవిత అందించాల్సిన సందేశం పలుచబడిపోతుంది. చాలాసార్లు వస్తువు సామాజికమైనదైనపుడు, విలువల ఆధారితమైనదైనపుడు సహజంగా ఆ వస్తువు పాఠకున్ని ఆకర్షిస్తుంది. ఆలోచనలు రేకెత్తిస్తుంది. గమ్యం వైపుకు ఆలోచింపజేస్తుంది. ఈ పని విజయవంతంగా జరగడమనేది కవి ఆ వస్తువును మలిచేందుకు గాను ఎంత శక్తివంతంగా శైలిని వాడతాడో దానిమీద ఆధారపడి ఉంటుంది. శైలికి వస్తువుతో సమానమైన స్థానం కేటాయించుకోవడానికి కారణమిదే. ఇది ముదిరి వస్తువుకంటే శైలే ముఖ్యమని, శైలిని ఎంత గొప్పగా ప్రదర్శిస్తే అంతగొప్పగా రాసినట్టనే శైలీఆధిపత్య ధోరణులు కూడా కాలానుగుణంగా బలపడుతూవచ్చాయి. అయితే సామాజికాంశాలలో శైలీ నిర్మాణం పటిష్టంగా జరగాలంటే కవికి సమాజంపై, సమాజంలోని విషయాలపై, వాటి చలనశీలతలపై మొత్తంగా సమాజగమనంపై పట్టు ఎక్కువగా ఉండాలి. సాధారణంగా ప్రకృతిసంబంధిత అంశాలను వస్తువుగా మలిచే క్రమంలో నిర్వహించే శైలీప్రదర్శన సులభంగా ఉండటానికి కారణం చాలామందికి ప్రకృతి విషయాలపై, ప్రకృతి పరిశీలనపై సహజంగానే అవగాహన ఉండటం. సామాజికాంశాలలోని శైలీ ప్రదర్శనల్లో చాలామంది తడబాటు పడటానికీ కారణం అదే. ఈ రెండింటికీ మధ్యస్థంగా సాధారణాంశాలను వస్తువులుగా తీసుకుని రాసే క్రమంలో వాటిలో శైలి, సందర్భానుగుణంగానే చోటు చేసుకుంటుంది.

ఈ పుస్తకంలో అరుణ గారు వస్తువులుగా ఎంపిక చేసుకున్న సాధారణాంశాలలో కూడా సంపద్వంతమైన శైలిని అనుసరించారు. తీసుకున్నవి కూడా ప్రయోజనకరమైన వస్తువులు కావడం, వాటికి తనదైన శైలిని జోడించడం వల్ల అవి ఆకర్షణీయమైన కవితాలుగా పుస్తకానికెక్కాయి. కొంగు భారతీయతనో హైందవాన్నోసూచిస్తుందని, కొంగు మతాలతో సంబంధం లేని సౌకర్యవంతమైన ధారణను సూచిస్తుందనే రకాల వేర్వేరు కోణాల చర్చలను పక్కనబెడితే కొంగు స్త్రీ జీవిత వేషధారణలో భాగమైపోయింది. అలాంటి కొంగు ఆ స్త్రీ కంటే ఇతరులకే ఎక్కువ ప్రయోజనకరమని అంటారు అరుణ.

పొత్తిళ్లలోని పనితనానికి మొదటిస్పర్శ(పొత్తిళ్ల నుండి మరణం దాకా, పే.68) గా ప్రారంభమై,
కౌమార్యంలోని పరువాల పరుగులను
పలకరించే తొలకరి నజరానా
అత్తింటికి వెళ్ళే ఆడపిల్లకు
నూరేళ్ళ తలంబ్రాల మూట
యవ్వనంలోని చెమటచుక్కలకు
తోడైన హృదయస్పందన
కన్నీళ్లను తుడిచే ఆత్మీయచెలిమి
వృద్ధాప్యానికదో విశ్రాంతి తలగడ (పొత్తిళ్ల నుండి మరణం దాకా, పే.68)

గాను ఇంకా…
ముఖాన్ని దాచేసే ప్రియనేస్తం
దుమ్ముకొట్టే కళ్ళకు స్వేచ్చా వస్త్రం
దుమ్ముపడని అభాగ్యులకు ఆశాకిరణం (పొత్తిళ్ల నుండి మరణం దాకా, పే.69)
ఇట్లా అన్నీ ప్రయోజనాలను నెరవేరుస్తూ చివరికి…
చివరిగా మిగిలిపోతుంది
శవం కాలివేళ్ళను చుట్టుకొని
స్మశానందాకా తోడై నడుస్తుంది (పొత్తిళ్ల నుండి మరణం దాకా, పే.69) ఒక స్త్రీ రోజూ ధరించే చీర కొంగును ఇంత పరిశీలనగా గమనించి ఆ కొంగు ప్రయోజనాలను విభిన్నంగా వివరించారు అరుణ.

ఇలాంటి మరో పరిశీలనే ‘ఖైరున్నీసా’లో కనిపిస్తుంది. హైదరాబాద్ లోని కోఠి వుమెన్స్ కళాశాలది అందరికీ తెలిసిన భవనమే. ఇది హైదరాబాద్ లోని ఒకప్పటి బ్రిటిష్ రెసిడెన్సీ. దీన్ని మొదట్లో కిర్క్ పాట్రిక్ తన భార్య ఖైరున్నీసా కోసం కట్టాడు. ఆ తర్వాత అది బ్రిటిష్ రెసిడెన్సీ ఆఫ్ హైదరాబాద్ గా మారి ప్రస్తుతం కోఠి వుమెన్స్ కళాశాలగా కొనసాగుతున్నది. ఈ భవనం మీద ప్రేమను, ప్రస్తుత ఈ భవన శైథిల్యాన్ని అరుణ ‘ఖైరున్నీసా’ లో చూపించారు.
ఆమె ఇంకా అక్కడే తిరుగుతున్నట్లుంది
ఉద్యానవనంలో సీతాకొక చిలుకలా
అన్నీ రంగులనూ చూసినందుకేమో
గుమికూడిన చెట్ల సందుల్లో
చిక్కిన నెమలి కళ్ళల్లో (ఖైరున్నీసా, పే. 76)…. అంటూ ఖైరున్నీసాను సంపూర్ణంగా మనసులో నింపుకుంటూ, ఖైరున్నీసా ‘వెలిసిపోయిన ఫ్యాను రెక్కల్లో చిక్కి’, ‘బీటలు వారిన పునాదిలా… అక్కడే!’ విలపిస్తున్నదని బాధపడతారు. ఇక్కడ ఖైరున్నీసా మీద జాలిపడటం వెనక ఆ భవన దుస్థితిని ముందుకు తెచ్చిచూపే ప్రయోగం ఉంది. ఈ ప్రయోగమే కవిత మొత్తంలో ఖైరున్నీసా మీద ఇష్టాన్ని, ప్రస్తుత భవన దుస్థితిని సమాంతరంగా నడిపించింది.

సైనికుల ధైర్యం, వారి మీద గౌరవం కనిపించే కవిత ‘సింధూరం’. సైనికులు ప్రదర్శించే తెగువ, సాహసం, వాళ్ళు చేసే త్యాగాలను ఇందులో చూపిస్తారామె.
భయానికే భయంవేసే బలగాలు సింహాలై
మానవుని పుట్టుకలోని చరిత్రకు మళ్ళుతాయి!
పోరాటం సొంత ఆరాటం కాదు
కోట్ల ప్రాణులకు ప్రశాంతనిద్రను పంచే
త్యాగజీవుల హృదయపు హిమపాతం! (సింధూరం, పే. 74-75)

ఈ కవితలోని ‘పరమవీర చక్రమైన నీ తరువాతే నమ్మాలి’ అనే వాక్యాన్ని వదిలేసి చూస్తే ఇతర వాక్యాలన్నీ ప్రజా ఉద్యమాలను నిర్వహించే వాళ్ళకు కూడా వర్తించడంలో భావాత్మక సాధారణీకరణ ప్రయోగాన్ని గమనించవచ్చు.

అరుణకు కార్పొరేట్ ఆసుపత్రులంటే భయం, అయిష్టం. ఆక్టోపస్ ల్లా విస్తరించి మనుషుల ప్రాణాలతో దోపిడీ వ్యాపారం చేస్తున్న ఆసుపత్రుల శక్తి ధాటికి నిలిచి ఎదురొడ్డి పోరాడలేని అశక్తత.
కార్పొరేట్ ఆసుపత్రంటే
పోలవరంలో మునకేయడమని తెలియదు (ఫలించని చికిత్స, పే.65)
సందర్భానికి సరిపోయే ప్రతీక ఇది. మునిగిపోవడం తప్ప ప్రాణాలు నిలుపుకోవడం జరగని పని అక్కడ. చిత్రమేమిటంటే ప్రాణాలు నిలపడానికున్నామంటూ ప్రాణాలను ముంచేసే పనులు చేస్తుంటాయీ ఆసుపత్రులు.

గొడవపడితే నడవగలడంటే
ఏకంగా కోర్టుకే ఎక్కేదాన్ని (ఫలించని చికిత్స, పే.65)… అంటూ గొడవ పెట్టలేని తన అశక్తతని చెప్పుకుంటూనే….
ఎముకలను విరిచినంత తేలిగ్గా అతికించలేము
పక్కకు తొలగిన కండరాలనూ సవరించలేము
చూస్తూ ఉండటం తప్ప (ఫలించని చికిత్స, పే.65)…

అంటూ కార్పొరేట్ ఆసుపత్రుల ఈ దోపిడీని, అన్యాయాన్ని వాటి నైతిక విజ్ఞత పరిధికి కుంచించి చెప్తారు. కార్పొరేట్ ఆసుపత్రులు తమ విద్యుక్త మానవీయ ధర్మాన్ని వదిలేసి వ్యాపారం వైపుకు పరుగులు పెట్టడం లాంటి అనేక దుర్మార్గాలు- కనిపించేవి, కనిపించనివెన్నో సమాజంలో ఉన్నాయి. గ్రామీణ పట్టణ ప్రాంతాలలో ఇవి సాధారణ ప్రజల దృష్టికి తక్కువగా కనిపించినా నగర ప్రాంతాలలో విషయాన్ని దగ్గరగా గమనించే దృష్టి ఉన్న వాళ్ళకు చాలానే కనిపిస్తాయి. నగరాల్లో బోలెడు ఇలాంటి ప్రజా వ్యతిరేక వ్యాపారాలు జరుగుతుంటాయనే భావన జనాల్లో కలిగిఉండటం చూస్తుంటాం. చాలామందికి నగర జీవితమంటే ఇష్టముండకపోవడానికి గల కారణాల్లో ఇదొకటి. ఈ కారణం ఎలా ఉన్నా అరుణ గారికి కూడా నగరజీవితమంటే ఇష్టంలేదు. అక్కడ తాను గడిపింది బందీగానే అంటారు.

ఊరు విడిచి వెళ్లాను గానీ
నిలువ నీడలేని భవంతుల చాటున
బందీగానే ఉన్నానింతకాలం (తిరుగు ప్రయాణం, పే.12)

నగరంలో ఆప్యాయత కరువైపోయి కాస్తంత ప్రేమకు కూడా నోచుకోకుండా బతికినా ఆ జీవితానికి మాత్రం తాను ఆకర్షించబడలేదంటారు.
నిలువెత్తునా నిలుచున్న చీకటినుండి
మొండిచెట్టుకు వేలాడే దీపంలా
ఆప్యాయతలేని లోకంలోనే నిలువునా దహింపబడ్డాను
ఒడ్డునంటుకొని ఉన్న నాచుమొక్కనవకుండా
————–
నిండుకుండలా నిండుగానే ఉండిపోయాను (తిరుగు ప్రయాణం, పే.11)

ఎప్పటికైనా తన సొంత ఊరికే ‘తిరుగు ప్రయాణం’ కట్టాలనే, కోరుకుంటూ గడిపారు ఆ బందిఖానాలో.

కొంగు, వుమెన్స్ కాలేజీ భవనం, సైనికులు, కార్పొరేట్ ఆసుపత్రులు, నగర జీవనం లాంటి సర్వసాధారణ కవితా వస్తువులను దాటి ఈ పుస్తకాన్ని పరిశీలిస్తే అరుణ గారు ప్రకృతి మీద ఇష్టాన్ని వస్తువుగా చేసుకుని రాయడం కనిపిస్తుంది. ప్రకృతి అంటే చాలా ఇష్టం కనిపిస్తుంది. ప్రకృతికి, దాని అందాలకు తాను తాదాత్మ్యం చెందడం కనిపిస్తుంది. ఆ రమణీయతకు మురిసిపోతూ ప్రకృతిలోకి వెళ్ళి ఆ అందాలను, ఆనందాలను అనుభవించాలని, సొంతం చేసుకోవాలని, తనలో కలిపేసుకోవాలని ఆశ పడతారు.

రెండు చేతులూ చాచి
చినుకులను వొంటికద్దుకోవడం
ఎంతటి ప్రియమైన స్పర్శ (జడివాన,పే.78-79)
వానంటే, చినుకులంటే ఇష్టముండని వారుండరు. ఆ అందరి ఇష్టమూ ఈ వాక్యాలలో కనిపిస్తాయి. వాన లాగే పొద్దున్నే పరుచుకునే సూర్యకిరణాల అందాన్ని భావుకంగా ఆస్వాదించని వారుండరు. అందుకే ఆ అందమూ ‘మౌనం మాట్లాడిన వేళ’ లో కనిపిస్తుంది.

బాల్కనీ నిండుగా పరుచుకున్న అరుణోదయకిరణాలు
బాహ్య జీవితాన్ని మేల్కొలుపును గానీ
నిర్జీవమై కనురెప్పలచాటున మాటువేసిన
మౌనాన్నెందుకు మందలించదో (పే.60)
అందమైన ఆ కిరణాలకున్న పరిమితిని ఇక్కడ ఎత్తిచూపుతారు. అందరికీ సూర్యకిరణాలు గొప్పవే, అందమైనవే, ఉపయోగకరమైనవే కానీ అంతటి తీక్షణత,శక్తి ఉన్న ఆ కిరణాలకు కూడా పరిమితులున్నాయి. అవి నిర్జీవమై కనురెప్పల చాటున మాటువేసిన మౌనాన్ని మందలించలేవు. ఒకే సందర్భంలో ప్రకృతి వర్ణన తో పాటుగా మనసుబాధను రిలేటివ్ గా చెప్పారిక్కడ.

ఈ ప్రకృతివర్ణనలో ప్రకృతి అందాలమీద ఇష్టం కనపడుతున్ననూ ఆ ప్రకృతి మీద ఆమెకు అంతకు మించిన బాధ్యత ఉంది. ప్రకృతి ఆధారితమైన అంశాలకు సంబంధించిన సమస్యలు, కష్టాలకు చలించిపోతారు. కారణాలను, కారకులను చూపిస్తారు. పరిష్కారాలను ముందుంచుతారు.
ముంచేయడం బాగా నేర్చిన నేల
ప్రకృతికి దూరంగా మరోసారి
మనిషిని తరిమికొట్టడం!
మర మనిషిలా జీవితానికి
నాలుగు వైర్లు చుట్టుకోవడమే
చివరికి మిగిలింది! (కాలం, పే.94)

కేదార్ నాథ్ వరదల నేపథ్యంలో రాసినా కూడా ఇందులో కాలక్రమేణ ప్రకృతికి, మనిషికి మధ్య పెరుగుతున్న అంతరం వల్ల ఏర్పడే ఫలితాన్ని గురించి చెప్పారు. ప్రకృతిని తీవ్రంగా గాయపరిచి నష్టపరుస్తున్న మానవ చర్యలకొక హెచ్చరిక.

మరోచోట కరువు గురించి చెప్తూ కరువు వల్ల వ్యవసాయం,పంటలు,వాటిమీద ఆధారపడ్డ రైతు జీవితాల విచ్ఛిన్నాన్ని గురించి బాధతో,
ఎండ ఆవిరిమేఘమై
లోలోపలే అంతా
మనోవిచ్ఛిత్తి (బీటలు బారిన మట్టి, పే.18)
సాధారణంగా ఎండకు ఆవిరి మేఘమౌతుంది. ఎండే ఆవిరిమేఘంగా మారడం అంటే ఆ మేఘమంతా వేడిమి పాలై లోపల అంతా ఏమీ లేదని చెప్పడం. లోపలంతా మనో విచ్ఛిత్తి. మనసు విచ్ఛిన్నమవడం.. ఆశలు, ఆకాంక్షలు చిన్నాభిన్నమవడం.

వాన లేకపోతే రైతు జీవితం నాశనమైపోతుంది. వానలు లేని కరువు కాలం రైతుకు శాపం. ఈ వానలేని దారుణ స్థితి ఏయేటికాయేడు దాపురిస్తూనే ఉన్నది.
చెట్ల కుదుళ్ళను తడిపిన పులకింతలెప్పుడో
చిగురుటాకుల్లోనే ఇంకిపోయాయి (బీటలు బారిన మట్టి,పే.17)
వాన కుదుళ్లను తడపడం ఒక గతజ్ఞాపకం. ఆ తడి చిగురాకు దాకా వచ్చి అందులో ఇంకిపోయింది. చిగురాకు అభివృద్ధి చెందలేదు, కాయలుగా, పండ్లుగా, ఉత్పత్తిగా మారలేదని చెప్పడమిది.
చుక్క చినుకు లేని ఇసుక
సముద్రపు భారాన్ని మోయడం తప్ప (బీటలు బారిన మట్టి, పే.18)

దానితో లాభం లేదంటారు. కరువు పోవాలంటే వాన పడాలి. ఒంటరి ఇసుకతో ప్రయోజనంలేదు. తనమీదంతా నీళ్లే ఉన్నా ఆ నీళ్లవల్ల రైతుకు ప్రయోజనం లేదు. వాగుల్లో వంకల్లో నదుల్లో చెరువుల్లో చుక్క చినుకును పొందని ఇసుక బతుకు వ్యర్థం. వాన వచ్ఛి కొత్తనీరును తెచ్చి ఆ కొత్తనీరు పాత మట్టిని అతికిస్తేగాని మట్టిని చీల్చిన పగుళ్లు అతకవు. అతికెందుకేమీ కొత్తమట్టి లేదు, రాదు. అతకాల్సింది పాతమట్టే. అందుకే వాన పడాలని కోరుకోవడం. అందుకు పూడిక తీయాలంటారామె. నిజానికి పూడిక చెరువులు బావుల్లో కాదు. జీవితాల్లో పూడిక తీయాలి. వాన రాకడ పట్ల కోరిక స్పందన లేకుండా తయారైన జీవితాల్లో తీయాలి పూడిక.

అయినా రైతు జీవితాలను పట్టించుకున్నదెవరు? సమాజానికి ఆ పట్టింపు లేదు. రాజకీయాలకు అసలే లేదు. దళారీలు, రాజకీయాలే రైతు వలసలకు ప్రధాన కారణాలు. వీటి కారణంగానే రైతుల బతుకులు
పరమపద సోపానానికి
అతివృష్టి అనావృష్టిల దిష్టిబొమ్మై (పొడమరలిన జీవితం, పే.116)

వేలాడుతున్నాయి. ఇవే రైతు తన పల్లెను వదిలి ఎక్కడెక్కడికో వలసపోయి బతుకు చాలించుకోవడానికి కారణాలవుతున్నాయి.
నమ్మిన చెమటచుక్కే
నట్టేట ముంచిందని తెలిసి
భుజానికున్న కండువ దులుపేసి
నాగరిక సంస్కృతిలో
నాలుగు మెతుకులకోసం
అతడు ఊరొదిలి వెళ్లిపోతున్నాడు! (పొడమరలిన జీవితం, పే.116)

నిజమే! దేశపు వెన్నెముకలు నేలకొరుగుతున్నాయి. అయినాగానీ రాజ్యం పట్టించుకోవడం మానేసింది. పైగా ఆ వెన్నెముకలను తానే ఖండఖండాలుగా విరిచేస్తున్నది. రాజ్యం అత్యంత దుర్మార్గమైన ప్రమాదకరమైన అంగంగా ప్రజల నెత్తిన కూర్చున్నది. ఆ రాజ్య కపట స్వభావాన్ని బయటపెడుతూ దాని పనిని గుర్తు చేస్తారు ‘కొత్తపంట’ లో.

నాలుగు గులాబీలను మెళ్ళో హారంగా
జమచేయడం కాదు రాజ్యమంటే! (పే.99)
టెలివిజన్ చానల్స్ లో స్త్రీ ని వాడుకుని వ్యాపారాన్ని పెంచుకునే జుగుప్సాకరమైన చర్యలకు వీక్షిత నామం ‘యాడ్స్’. ఏ వ్యాపారప్రకటన చూసినా స్త్రీలను అశ్లీలంగా చూపడమే. ఈ విధానాన్ని ఎండగడుతూ రాసిన కవిత ‘బలం’.

అందం అరచేతిలోదే
దానికి ఆడతనం జోడించినప్పుడే
అమోఘంగా లాకరు నిండేది (పే.26)
ఈ లాకర్లు నిండాలనే డబ్బు యావ వల్ల స్త్రీ జీవితం కరిగిపోతున్నది.
ఒంటికి రుద్దుకునే సబ్బుబిళ్ళ సాక్షిగా
ఎదుటివారికి సువాసనలు వెదజల్లి
నువ్వు మాత్రం అరిగి…కరిగి పోతూనే ఉంటావు (బలం,పే.27)
అట్లాగే ఈ చానళ్లలో సీరియళ్ల పేరిట కూడా ఆడవాళ్ళను చాలా దుర్మార్గంగా చూపిస్తున్నారు.

ఇక్కడ ఆడదంటే కాళరాత్రి (ఉనికి,పే.80)
స్త్రీలను వ్యాపారంలో భాగంగా చూపే, లాభాంశంగా చూపే వ్యవస్థ మీద ఎక్కుపెట్టిన బాణంగా ‘ఉనికి’ కనిపిస్తుంది.
భార్యంటే స్వేచ్ఛకు చూపుల ఎరుపుగీత సరిహద్దులు
అత్తంటే కనుబొమ్మల బిగింపులో చిక్కుకునే సంతోషాలు
ఆడపడుచంటే కాపురాలు కూల్చే కసాయి చురకత్తి
పాపం మౌనం గొంతుతో బిక్కుబిక్కుమనే
పిల్లనగ్రోవి మొగుడు (ఉనికి, పే.81)

నిజానికి పిల్లనగ్రోవి ఎవరు? చురకత్తి ఎవరు? అనేది ఇన్నేసి వేల ఏళ్ల చరిత్రను తరచి చూస్తేగాని అర్థంకాదు. ఆ ఓపిక ఈ చానళ్లకెక్కడిది? చూస్తున్న వీక్షకులకెక్కడిది? ఇప్పుడు నడుస్తున్నదంతా వ్యాపారం. వ్యాపారం పేరిట దోచుకోవడం. ఎవరికి వారు ఎక్కడికక్కడ దోచుకోవడం.

దాహమేసినప్పుడు తాగాల్సిన
గ్లాసేడు నీళ్ళకు బదులు
విశాలంగా నోరు తెరిచి
జలపాతాన్ని మింగేస్తున్నాడు (తిరగేసిన కాలం, పే.39)

ఈ వ్యాపార చట్రంలోకి దిగిన ప్రతివాడి గమ్యం, గమనం ఇదే. కాస్త ఎక్కువ తక్కువలు. అంతే! మానవత్వం, మనిషితనం అంతా డబ్బుమయం. కొనుగోలు – అమ్మకాల మయం. బేరసారాల మయం.

మానప్రాణాలు కోర్కెల వాణిజ్యపంటలు
మనిషితనమంతా మార్కెట్టైన నాగరికత
అమ్మ ఆలి అక్క చెల్లే అనే తేడాలేవీ లేవు
కేవలం అమ్మకం ఒక్కటే లక్ష్యం (వాణిజ్యం, పే.54)

స్త్రీని మార్కెట్ చేసుకుంటున్న వాణిజ్యం పై రాసిన కవిత ఇది. ఈ విపత్కర పరిస్థితిని భరించలేనంత బాధతో
ఇంకా చర్చించడానికి ఏమీ మిగలలేదు
నిరామయ జీవితం తప్ప (వాణిజ్యం, పే.54) …. అంటారు అరుణ. అయితే ఈ నిరామయం వెనుక ఏ అయోమయమూ లేదు. స్పష్టమైన గ్రహింపు ఉంది. సమస్యకు మూలం దోచుకోవడంలో ఉందని, దోపిడీ ఆర్థిక వ్యవస్థలో ఉందని కుండబద్దలు కొడతారామె.

దోచుకొని బ్రతికేవాళ్లు కొందరైతే
దోపిడై బ్రతికే వాళ్ళు మరి కొందరు (అలసిన వెలుగు, పే.6)

ఇంతకు ముందటి బలం, ఉనికి కవితల్లో లాగే అరుణగారి కవిత్వంలో కొన్నిచోట్ల ఫెమినిస్ట్ వైఖరులు కనిపిస్తాయి. ఒక సాధారణ విషయాన్ని లేదా ప్రత్యేక విషయాన్ని చెప్పడానికి అనుసరించే దృక్కోణాన్ని బట్టి ఆ కవిత స్వభావాన్ని గుర్తించవచ్చు. అయితే ఒక్కోసారి కవితా వస్తువు, శైలీ ప్రవాహాలు కూడా భావజాల స్థానీకరణను నిర్దేశిస్తాయి. తాత్కాలికంగా కావచ్చు లేదా ఉద్దేశపూర్వకంగానైనా కావచ్చు. ఆ సందర్భంలో వస్తువు వెనక ఉన్న భావజాలం కవితలో లీడ్ అయిపోయి ఆ కవితకు సదరు భావజాల బేస్ ను ఇస్తుంది. అట్లా ఆ పుస్తకంలో లేదా ఆ సంపుటిలో ఆ కవిత ప్రత్యేకంగా ఒక స్థానాన్ని పొందుతుంది. దాదాపు ఫెమినిస్ట్ అవగాహనతో ప్రసవం, స్త్రీ సబలత్వం లాంటి అంశాల ప్రాతిపదికగా రాశారేమో అనిపించే కవితలున్నాయీ పుస్తకంలో.

భారాల పెనుతుఫానొకటి కమ్మే క్షణాన
నిట్టూర్పుల బృందగానం
అడుగుకు అడుగే భారం (మరో జన్మ, పే.13)
ప్రసవం సమయంలోని కష్టం గురించి సహజసిద్ధంగా చెప్పడమిది.
ఒక్కో నీటిబిందువూ
ఒక్కో అశ్రుధార
నరకానికీ ఆత్మానందానికీ మధ్యన
చితికిపోయే శరీరం
ఏడ్చినా ఆగదు
భరించడమొకటే తప్ప
మరో మార్గమేదీ లేదు
జీవం పోసేందుకు…. (మరో జన్మ, పే.14)

ఈ కవితపై ప్రభావం ఉందో లేదో తెలియదుగానీ, చదువుతుంటే కొండేపూడి నిర్మల గారి ‘లేబర్ రూమ్’ కవిత గుర్తుకు రాకుండా ఉండదు. ’నరకానికీ, ఆత్మానందానికీ మధ్య’ అనడం ఎంత నిజం! జీవం పోసేందుకు మరో మార్గమేదీ లేదుకదా!

స్వర్గానికి వేసిన నిచ్చనొకటి
మరుజన్మకై బాహ్యప్రపంచానికి చేరువయ్యే క్షణం (మరో జన్మ,పే.13)
ఇక్కడ స్వర్గానికి నిచ్చెన అనేది ఆశను సూచిస్తే ఆ ఆశ నిజజీవితానికి అందే క్షణమే ప్రసవసమయం. ఆ క్షణం ఎంత అపురూపమో అంత కష్టం కూడా. ఆ క్షణ కాల సమయాన్ని అద్భుతంగా వర్ణిస్తారీ కవితలో.

భూమికీ గర్భానికీ నడుమ
అనూహ్యంగా తచ్చాడే మాంసపు ముద్ద (మరో జన్మ,పే.13)
సరిగ్గా గర్భంలోంచి వేరై భూమిన పడే ఆ రెప్పపాటు కాలంలోని శిశువును గురించిలా గొప్పగా రాశారు. ఈ ప్రసవ వేదనను ధైర్యంగా భరిస్తూనే తాను మరోజన్మ పొందుతూ జన్మనిస్తుంది స్త్రీ. ఆ ఓర్పు, ధైర్యం స్త్రీ లక్షణం.

ఇక్కడే కాకుండా ఈ పుస్తకంలో మరోచోట కూడా స్త్రీ సబలత్వ లక్షణరూపం కనిపిస్తుంది.
గుమ్మం దాటు
అక్షరాన్ని దిద్దు
‘అ ఆ’లకు మరో మాటచెప్పు
‘అ’ అంటే అబల… అణగారడం కాదని
‘అధిగమించడమ’ని చెప్పు (జవాబు, పే.89)

స్త్రీని సబలగా నిద్రలేపే ప్రయత్నమిది. సగర్వంగా ఆత్మవిశ్వాసాన్ని ప్రకటించే అక్షరాలివి. ఈ ఆత్మవిశ్వాసం నిండిన స్త్రీలకు ‘నువు కోరిన లోకం నీకోసం ఎదురుచూస్తుంది’ అంటూ బాధ్యతలను గుర్తుచేస్తారు అరుణ.

ప్రతి మనిషికీ జీవితంలో కొన్ని ఇష్టాలుంటాయి. కొన్ని వస్తువుల మీద,జీవాల మీద,మనుషుల మీద,వారితో పెనవేసుకున్న బంధాల మీద ప్రేమలుంటాయి. జీవితం నుంచి అవి విడదీయరానివిగా ఉంటాయి. జీవితపు ప్రతి సందర్భంలోనూ మనిషి నడవడిలో,ప్రవర్తనలో,ఆలోచనల్లో,జీవిత చర్యల్లో అవి ప్రతిఫలిస్తుంటాయి. తరచూ అవి మనిషి గమనంలో ముందుకు వచ్చి ఆ మనిషిని మూల్యాంకనం చేసే సందర్భాలలో తీర్పరులవుతుంటాయి. బంధాలు,ప్రేమలు,ఉద్వేగాలను బట్టి వ్యక్తి అస్తిత్వాన్ని, దాని ఆచరణను అంచనా వేయడం చాలా సర్వసాధారణ విషయంగా మారిపోయింది. ఈ కోణంలో అరుణ గారి వ్యక్తిత్వాన్ని, అస్తిత్వాన్ని అంచనా వేయడానికి ఆమె రాసిన కొన్ని కవితలను ఇక్కడ ఉదహరించడం అవసరం.

బాల్యం మీద, వివిధ జీవిత బంధాల మీద ఆమెకు ఎనలేని ప్రేమ. చాలా కవితల్లో ఈ ప్రేమాప్యాయతలు తరచూ కనిపిస్తుంటాయి. ఇక్కడ కొన్ని ప్రధానమైనవే పరిగణనలోకి తీసుకుని చూద్దాం. ముఖ్యంగా బాల్యం మీద, సొంతఊరి మీద, అమ్మమ్మ-తాత, అమ్మ-నాన్నల మీద ఉన్న విపరీతమైన, అవ్యాజమైన అనురాగాన్ని, విడదీయలేని అనుబంధాన్ని వ్యక్తీకరించిన తీరును చూసి ఆమె ఎంతటి సున్నితమైన వ్యక్తిత్వం కలిగినవారో అర్థం చేసుకుందాం.

బాల్యం మీద ఇష్టం, వేసవి కాల జ్ఞాపకాలను కలగలిపి రాసిన కవిత ‘చల్లని వేసవి’. వేసవికాలంలో ఊర్లో తాను గడిపిన రోజులను ఇష్టంగా నెమరు వేసుకుంటారిందులో. ఐస్ క్రోట్ లు,పిందెమామిడి కాయలు,ఒక్కపూట బడి,దోర సీమ చింతకాయలు,గన్నేరు పూలు,వేపపూలు లాంటి వాటితో చిన్నతనాన తనకున్న విడదీయరాని బంధాన్ని గుర్తుచేసుకుంటారు. అంత తియ్యని బాల్యంలో కృత్రిమత్వాలకు బాధపడతారు కూడా. మారుతున్నకాలంలో నూతనత్వం,ఆధునికత పేరుతో చోటుచేసుకుంటున్న పరిస్థితుల వల్ల బాల్యం బందీ అయిపోవడాన్ని భరించలేక విలవిలలాడతారు.

ఆరుబయట పరుగులు తీసే
చిన్నపిల్లల గెంతులు
నాలుగుగోడల్లో భద్రంగా
చేతిలోని ప్రపంచాన్ని చూస్తున్నాయి (తిరగేసిన కాలం,పే,40)
సెల్ ఫోన్ విషయంలో ఇదొక ఉటంకింపు మాత్రమే. ‘తిరగేసిన కాలం’లో ఇలాంటివి ఇంకా చాలా చెప్తారు. బడుల్లో ఆటలు తగ్గిపోవడం,ఆరుద్రపురుగులు కనబడకపోవడం,పిల్లల్లు వానల్లో కేరింతలు కొట్టలేకపోవడం లాంటివి. చివరగా

పచ్చని శ్వాసలేదు
అలసటలేని విద్యలేదు
ఆకర్షించే మేధస్సూలేదు
ఆకలైనప్పుడు అలుముకునే ప్రేమా లేదు (తిరగేసిన కాలం, పే.41)
అంటూ బాల్యం ఎంత గిరిగీసుకున్న వృత్తమైపోయిందో చెప్తారు. అంతేకాదు,మనసును బాల్యపు జాదల దగ్గరికి తీసుకుపోయి అక్కడే ఉంచేయాలనుకుంటారు. పెద్దతనంలోని అన్నింటినీ ఇక్కడే వదిలేసి బాల్యానికి పంపించాలనుకుంటారు.

నిరామయస్థితిలా
మౌనమై నిర్మానుష్యమై
ఒక్కోసారీ తెలియని పసితనమై
బోసినవ్వులు నవ్వుతుంది చూడూ
నేను అక్కడే ఆగిపోతుంటాను (స్వాతి చినుకై, పే.110)

మనసును అట్లా బాల్యంలోకి పారదర్శకంగా పంపడం నిజానికి సాధ్యంకాని విషయం. అందుకు ఏం చేయాలో కూడా తానే చెప్తారు.
మనసుకు వేసిన ముసుగు
నెమ్మదిగా తొలగించాలేమో
మళ్ళీ బాల్యంలోకి వెళ్లడానికి! (మంచుగడ్డ, పే.4)

మనసునే కాదు, మనిషి తన శరీరాన్నీ వీలైనంత బాల్యదశలోకి పంపించాలని ఉబలాటపడతాడు. సాధ్యంకాకపోవచ్చునేమో గానీ, ఆ కొరికకు ప్రతిబంధకంగా మారే వర్తమాన వేదనలకు కారణమైన జీవితంలోని పరిస్థితులమీద ఒక తీవ్రధిక్కారం అరుణ గారిలో కనిపిస్తుంది.
ఈ ప్రపంచానికి దూరంగా
పారిపోవాలని ఉంది!
ఇలా కట్టేసిన కాలపు
సంకెళ్ళను తెంచుకోవాలనీ ఉంది
పచ్చగడ్డిలో ముఖం దాచుకొని
ఎంతోకాలంగా దూరమైన
నా బాల్యపు పూలతోటను
తనివితీరా హత్తుకొని ఏడవాలని ఉంది…(తిరగేసిన కాలం, పే.41)

ఎంత హృద్యమైన ఆకాంక్ష ఇది! ఎవరైనా తమ ప్రయాణాన్ని, గమ్యాన్ని తాము వాస్తవంగా గ్రహించేలా రాసిన అక్షరాలివి. బాల్యం మీద ఆమెకున్న స్థిరాభిప్రాయాలు ‘మంచు గడ్డ’లో ప్రకటించారామె.

బాల్యం ఎప్పటికీ బలమైనదే…
ఎదురీదటం అనే భావమే ఎదురుపడదు (మంచుగడ్డ,పే.3)
నిజానికి బాల్యం చాలాసార్లు ఎదురీదుతుంది. చాలామంది పిల్లల అనుభవాలు చేదుగానే ఉంటాయి. ఎదురీదడమే బాల్యం నుంచి జీవిత చరమాంకం దాకా నిత్యపోరాటంగా మారుతుంది. దేశంలోని కార్మిక, మురికి వాడల, చిన్న కులాల పిల్లల జీవితాలెన్నటికీ అంతే. కొందరిలాగా వాళ్ళకు జీవితం, బాల్యం వడ్డించిన విస్తరి కాదు.

సొంత ఊరిపై ఇష్టం అనేకరకాలుగా ఉంటుంది. అక్కడి ప్రకృతి మీద, సామాజిక పరిస్థితులమీద, రాజకీయాల మీద, మనుషుల మీద.. ఇట్లా అనేక రకాలుగా. అది ఎలాంటి ఇష్టమైనా ఆ ఇష్టాన్ని పొందలేనివాళ్ళమీద అరుణ గారికి జాలి. సొంత ఊరికి మేలుచేయని ఉద్యోగాలు, మనుషుల ఎదుగుదలను ఆమె అంగీకరించరు.

గోడవతలకు వంగిన చింతచెట్టు
వేర్లతో భూమిని చీల్చి
భారాన్ని మోపి
పంటను పరదేశానికి పంచడం (పరాయి వసంతం, పే.119)

విదేశాలకు వెళ్ళి సొంత ఊరిని, మనుషులను నిర్లక్ష్యం చేసే, మరిచి పోయేవాళ్ళ గురించి నిక్కచ్చిగా రాసిన వాక్యాలు. తాను మాత్రం ఎక్కడున్నా ఏ స్థాయిలో ఉన్నా సొంతఊరి ప్రేమలను వదులుకోనని ఖరాఖండిగా చెప్తున్నారు.
కొత్తచరిత్రను వెలికితీయడానికి
ఇంతకన్నా ప్రశాంతత ఇంకెక్కడుంటుంది
ఈ చెరువుగట్టుపై కాకుండా! (తిరుగు ప్రయాణం, పే.12)

ఇక్కడ కొత్తచరిత్ర అంటే తాను కోల్పోయిన, కోల్పోకూడని ఊరిలోని మనుషుల ప్రేమలు, ఆప్యాయతలు, అక్కడి ప్రజలతో అనుబంధాలు. అందుకే ఈ ‘తిరుగు ప్రయాణం‘ సందేశంతోపాటు కర్తవ్య ప్రకటనా చేస్తారు.
నిన్నూ నన్నూ మోస్తున్న
ఈ మట్టికి మరో విత్తనమై
మరోయిన్ని విత్తనాలకు ఊపిరవ్వాలి (పరాయి వసంతం, పే.119)

ఎంతమంది స్వీకరిస్తారో గానీ బాధ్యతాయుతమైన ఆహ్వానం ఇది. బంధాలను నిలుపుకోవడం నుంచి ‘ఎదిగి’ బంధాలను విచ్ఛిన్నం చేసుకోవడం వైపు ప్రయాణిస్తున్న మనిషి- అమ్మ, నాన్న, అమ్మమ్మ – తాత లాంటి అన్నీ బంధాలకు దూరమైపోతున్నాడు. విలువల కోసం అరుణ గారు ఆ బంధాలకు అమూల్యమైన ప్రాధాన్యతనిస్తారు.
అమ్మమ్మ-తాత ఇల్లంటే ఆమెకు దేవాలయంతో సమానం.
నాలుగు చేతులు కలిసి నీడై
కట్టుకున్న గూడులా మా అమ్మమ్మా తాత!
సెలవులొస్తే మాకోపండగలా ఆ ఇల్లు! (అనుబంధం, పే.95)

అమ్మమ్మ- తాతతో తన బంధానికి ఆలవాలమైన ఇల్లు మూలబడిందని చాలా బాధపడతారామె.
ఆ ఇల్లు మూలబడింది
ప్రేమలు కరువైన దేహంలా!
————-
దీపం లేని గుడిలా ఆ ఇల్లు (అనుబంధం,పే.96)
నాన్నంటే,నాన్న చెప్పే ధైర్యమంటే ఆమెకు జీవిత మార్గదర్శనాలు. పసితనంలో వేలు పట్టుకుని నడిపిన నాటినుండీ ఆమెకు నాన్నే ధైర్యం.
మట్టి తిన్నా మతాబులు కాల్చినా
కేరింతలు కొడుతూ ఎగిరే కళ్లను చూస్తూ
మురిసిపోయే నాన్న హృదయం
ధైర్యాన్నే నేర్పుతుంది! (మంచుగడ్డ,పే.3)
తన జీవితంలోని అన్ని సుమధుర పరిమళాలకు అమ్మానాన్నలే కారణమని వాళ్ళకు తన కృతజ్ఞత ప్రకటించుకుంటారు.

నాకు పరిమళాన్ని అందించిన చెట్టు అమ్మానాన్నలే.
తమ వయస్సునో అవస్థనో తీసుకోలేను గానీ
చేయూతనై ఆ చెట్టుకు చిగురుగానే ఉంటానెప్పుడూ
దూరమున్నప్పుడు ప్రశాంతంగా ఆప్యాయంగా
తన జీవితపుకథ వింటూనే ఉంటానెప్పుడూ
తన అనుభవాలనుండే జాగృతమవుతూ ఉంటానెప్పుడు (పరదేశి,పే.71)

అమ్మ ప్రేమ ,విలువగా మారని శ్రమ,జీవితకాలపు తోడు మరచిపోలేనిదంటారు. అమ్మ నేర్పిన నడవడే ఒరవడిగా జీవితం రూపుదిద్దుకుందంటారు. రాత్రి,పగలు చాకిరీ చేసే అమ్మ, నిత్యం ముఖం మీద నవ్వుతోనే ఉంటుంది.
రాత్రీ పగలు పెద్దగా తేడాలేదని
సమానంగా వచ్చిపోయే చుట్టాలని
అమ్మ నడవడి చెబుతుంది (మంచుగడ్డ,పే.4)
అమ్మ నిర్వహించే సరైన బాధ్యత ఆటుపోట్లను సమం చేయడం. అంటే కేవలం బిడ్డ గొప్పతనాన్ని పొగడడమో, బిడ్డ లోపాలను ఎత్తిచూపడమో కాకుండా ఆ రెండిటినీ చెప్తూ బిడ్డకు లోకాన్ని చూపడం. ఆటు=పోటు గా పెంచడం.

నాలోని ఆటుపోట్లను సమం చేస్తూ
వెన్ను తట్టి నడిపించిన అమృతధార (జీవామృతధార,పే.24)
అమ్మకు లోకం పిల్లలే. వాళ్ళే ఆమెకు జీవిత సర్వస్వం. అమ్మ ప్రేమంతా పిల్లలకే.
అమ్మ తిట్టినా హాయిగానే దులిపేసుకుంటాం
మరుక్షణం ఎలాగూ ప్రేమగా హత్తుకుంటుందని!
నేనూ అనే తనానికి తావే ఉండదు (మంచు గడ్డ, పే.3)

తనను తానే మైమరచిపోతూ
మా లోకమే తన ఆయువుగా మార్చుకుంది (జీవామృత ధార, పే.25)

కానీ పిల్లల ప్రేమ తల్లిమీద అంతే సమానస్థాయిలో ఉండదు. ఏ వెయ్యోవంతో, పిల్లలు తల్లీమీద ప్రదర్శిస్తే చాలు, అమ్మ పొంగిపోతుంది. అమ్మ ప్రతిక్షణంలోనూ బిడ్డమీద నింపుకున్న ప్రేమను ప్రతి ఉదయం మొక్కను తాకే తుషారంలా కురిపిస్తుందంటారామె.
అప్పుడప్పుడూ చేరే వసంత కాలపు వర్షంలా
తనకేసి తొంగి చూస్తే
ప్రతి ఉషోదయం మొక్కల్ని
నిండుగా హత్తుకుంటున్న తుషారంలా అమ్మ ప్రేమ
తరగదూ…. చెరగదూ! (జీవామృత ధార, పే.25)

అరుణ గారు మనిషిని అర్థం చేసుకున్న తాత్విక పార్శ్వాలు అడుగడుగునా ఈ పుస్తకంలో కనిపిస్తాయి. ఒకరకంగా మనిషి సైకాలజీని విభిన్నకోణాలలో విశ్లేషిస్తూ రాశారు. మనిషిలోని నిరాశలు,అశక్త చర్యలు,మనిషి నుంచి మనిషి దూరమైపోతున్న పరాయీకరణ పార్శ్వాలను విభిన్న సందర్భాలలో,విభిన్న ఉదాహరణలలో, విభిన్న విశ్లేషణలతో రాశారు. మనిషిని కాచివడబోసిన సారంగా చాలాపంక్తులు చాలా కవితల్లో కనిపిస్తాయి. మనిషిలోని బహుముఖ విన్యాసాలన్నింటినీ గుప్పిట బంధించి వాటిలో నిలబెట్టారు.

మనిషిలోని అంతర్ముఖాన్ని దర్శింపజేసే కవిత ‘ప్రవర్తన’. తనలోతాను మనిషి ఎంత వైరుధ్యంతో బతుకుతాడో ఇందులో చాలా స్పష్టంగా చూపారు. పుట్టుకతో మనిషి ఎంత మంచివాడైనా నడవడిలో చాలా వైరుధ్యాలను కలిగిఉంటాడు.
పుట్టుకకూ నడవడికీ పొంతనా లేదు (ప్రవర్తన,పే.15)
ఈ నడవడి పట్లే ఆమెకు బాధ, కోపం. నడవడిలోని వైరుధ్యమే అశాంతికి కారణం.

సంఘజీవితమే కానీ ఒంటరితనం
తిరిగిరానిదేదో కోల్పోయినతనం
అతనిది సున్నిత స్వభావమే ఐనా
ఎక్కడో పైశాచిక మనస్తత్వం (ప్రవర్తన, పే.15)

సరిగ్గా హాబ్స్ గుర్తుకువస్తాడు ఈ మాటల్లో. స్వాభావికంగా మానవుడు జంతు సమానుడంటాడాయన. ప్రాకృతిక స్వభావం మీద థామస్ హాబ్స్ అద్భుత సిద్ధాంతాలను నెలకొల్పాడు. మార్క్సిజం ప్రకారం అదొక తప్పుడు సిద్ధాంతమైననూ, మార్క్సిస్టులు ఆ సిద్ధాంతాన్ని తీవ్రంగా విమర్శించిననూ ఇప్పటికీ సోషల్ కాంట్రాక్ట్ థియరీస్ లో ఆయన సిద్ధాంతానికో విశేష ప్రాధాన్యత ఉంది. ‘ప్రవర్తన’ కవితంతా హాబ్స్ ప్రభావంతో రాసిన కవితగా అనిపిస్తుంది.

మంచితనమే కానీ మూర్ఖత్వం
విజ్ఞానమే కానీ అజ్ఞానం
ప్రేమమయుడే కానీ వ్యక్తీకరణలో ఉన్మాదం
—————–
ఎందుకలా ప్రవర్తిస్తాడో అర్థం కాదు
చెబితే వినే వయసూ కాదు
ఆత్మీయంగా పంచుకునే స్నేహితులుండరు
అంతా అపనమ్మకమే
అంతా నిర్లక్ష్యమే క్షణికావేశమే (పే. 15-16)
ఈ క్షణిక చర్యలే మనిషిని సమాజంలో అపసవ్యంగా బతికే దిశకు నెడుతుంటాయి. కృత్రిమంగా బతికేలా చేస్తాయి. అయితే ఇంతకుముందు ఓ కవితలో ప్రస్తావించిన క్షణకాల నిర్ణయాలకు, ఈ క్షణికావేశ చర్యలకు చాలా తేడా ఉంది.

అధైర్యాన్ని అరువు తెచ్చుకోవడం!
లేని మౌనాలను తొడుక్కొని బ్రతకడం
చేతకాని తనాలను అద్దెకు తీసుకొని
ఆకళింపు చేసుకోవడం! (మంచుగడ్డ,పే.4)
క్షణికావేశ చర్యల, అశక్త చర్యల ఫలితాలివి. చాలాసార్లు ఒక మనిషిలోని అశక్తత,బాధ ఎదుటిమనిషికి అర్థంకావు. అర్థమైనా అటునుంచి పెద్దగా ప్రతిస్పందన ఉండదు. ఆశించిన తోడు దొరకనే దొరకదు.

అల్లకల్లోల సముద్రమైనా
తీరానికి మనసు
అందమైన కెరటంలా మాత్రమే కనిపిస్తుంది!
సముద్ర మథనంలో ఉత్పన్నమౌతున్న
అలల వేగం
విద్యుల్లతలై విషం చిమ్ముతుంది చూడూ
అదిమాత్రం కేవలం
అంతర్గత లోతుల్లోని
నిండు జీవితానికే తెలుస్తుంది! (స్వాతి చినుకై, పే.109)

‘ఇన్నాళ్ల మౌనం తర్వాత’ పుస్తకంలో మనిషి సైకాలజీని అరుణ గారులోతుల్లోకి వెళ్ళి గమనించారనడానికి మరో ఉదాహరణ-మానవుని నిరాశాచర్యల గురించి ఆమె రాసిన కవితలు. మనిషిలోకి నిరాశ ఎందుకు ఆవహిస్తుంది, అసలు మనిషి తనలోతాను ఎందుకు ముడుచుకుపోతున్నాడు, మనిషి తన అసలైన అస్తిత్వాన్ని ఎందుకు కోల్పోతున్నాడు, తన నిజమైన ప్రవర్తనాతీరును ఎందుకు వదిలేసుకుంటున్నాడు లాంటి అనేక ప్రశ్నలకు చాలాతక్కువ వాక్యాల్లో ఎక్కువగానే విశ్లేషించారు. జీవితాన్ని,జీవితానుభవాలను లోతుల్లోకి వెళ్ళి దర్శించనిదే ఇది సాధ్యం కాదు. ఆ పని చాలా విజయవంతంగా జరిగినట్లు పుస్తకంలో అనేకచోట్ల మనకు కనిపిస్తుంది.
ఇక్కడిక్కడే సంచరిస్తుంటాం
విశాల ప్రపంచాన్నొదిలేసి
ఇక్కడిక్కడే కోల్పోయిన
కన్నీళ్లను ఒడిసిపడుతుంటాం
ఇక్కడిక్కడే కనబడని బురదలో
కూరుకుపోతుంటాం!
నేస్తం అని పలకరించే
ఎన్నివేల గొంతుకలున్నప్పటికీ
సుడులు తిరిగి వాయుగుండాన్నే
మళ్ళీ మళ్ళీ ఆలింగనం చేసుకుంటాం! (నేను నాకు లేను, పే.86)

మనిషి కుంచించుకుపోవడాన్ని గురించి చెప్పడం. తనకుతానుగా తనలోతాను బందీ అవడాన్ని ఈ వాక్యాలెంత చక్కగా చెప్తున్నాయో చూడవచ్చు. జీవితంలో ఎన్నివేలసార్లో ఆశలు నిరాశలవుతుండవచ్చుగాక. కానీ మనిషి ఆ నిరాశాల వలయంలో పడి ఉండిపోవడమే బాధాకరమైన విషయం. నిరాశ ఆశకు దారితీయకపోతే మనిషి బాధతో తనకుతాను పరిమితులు విధించుకుంటూ పోతాడు. తోటి మనుషులతో సంబంధాల విషయంలో కూడా అంతే. ఎంతో ఆశించినపుడు,ఆ ఆశించినంతా అందకపోతే నిరాశే మనసును ఆవరించి కూర్చుంటుంది.

ఒక్కోసారి అద్దంలో
నా ప్రతిబింబంలో
మెరిసే అందానివీ నీవేనని కలగంటానా
చేజారిన గాజుపాత్రలా
అతకడానికీ వీల్లేనంత ముక్కలవుతుంది మనసు
నాలోనేనా నాలో నువ్వా
అన్న మాటే ఇంకా తేలడం లేదు (ఊహ,పే.49)
చివరకు అనిపించేదొకటే!

సూరీడు అలసిపోయాడు
చుట్టుముట్టిన నల్ల మబ్బులతో పోట్లాడి
వెలుగంతా పంచిన ఉనికి
గాలిమేఘమై పోయింది (అలసిన వెలుగు,పే.5)

ఈ నిరాశే సరిగ్గా మనిషిని ఆ మనిషి నుంచే దూరం చేస్తుంది. మనిషిని ఆ మనిషితోనే పరాయీకరిస్తుంది. తన మనసు నుంచి తానే పరాయి అయిపోయి మనిషి తీవ్ర మానసిక సంక్షోభంలోకి పోతాడు.
మనసూ మనిషీ
బహుశా ఎప్పుడూ వేరేనేమో!
నేనూ నువ్వూ ఒకేలా ఉంటే
నీకూ నాకూ తేడా ఏముంటుంది!?! (గాజుబొమ్మ, పే.101)

చిన్న వాక్యాల్లో ఈ పరాయీకరణ గురించి సూటిగా, స్పష్టంగా చెప్తారు.

మరోచోట కూడా ఈ పరాయీకరణ గురించి రాస్తారామె.
మనసుకూ జీవితానికీ మధ్యన
తెగని దారం ఒకటి
రెండు చివర్లను కలుపుతుంది
తెగకుండా దగ్గరవకుండా (నిర్ణయం,పే.19)

మనసు, జీవితం వేర్వేరవడం గమనించాలిక్కడ. అయినాసరే ఒక ఆశావాహ వైఖరి – దారం ఆ రెండింటినీ తెగకుండా కలిపిఉంచడం. అదేవిధంగా దగ్గరవకుండా కూడా దూరంచేస్తూ ఉండటం. అంటే మళ్ళీ పరాయితనం. తెంపినట్టూ, తెంపనట్టూ..
కేవలం స్వేచ్ఛాభ్రమలో
నిన్ను నువ్వు ఎంత కోల్పోయావు!
————-
చీకటిని
చేతుల్లోకి ప్రేమగా ఎత్తుకుని
నీకు నువ్వు శూన్యమై పోవడం తప్ప! (ఏది ప్రశాంతత,పే.30)

‘ఏది ప్రశాంతత’ దాదాపుగా సంసారజీవితంలో ఎగుడుదిగుడులను, భర్త ప్రేమకోసం వెంపర్లాటను చూపించే కవిత. ప్రేమరాహిత్యంలో పడే మానసిక వేదనను చిత్రించిన కవిత. ఇలాంటివే ఈ పుస్తకంలో ప్రేమరాహిత్యంలో పడే బాధల రూపాలుగా అనేక వాక్యాలు మనకు కనిపిస్తుంటాయి.
ఈ జన్మకు మొండి చెట్టునే
లోపలంతా చిగుర్లున్నా
ప్రేమగా నీడవలేని గతం
కొలుచుకుంటూ ఎన్ని రోజులు గడపాలో
నానీకు నీనాకూ మధ్యన
ఎన్ని వసంతాలు అడవులవాలో (అనిశ్చిత పయనం, పే.51)

ఎంత అద్భుతమైన వ్యక్తీకరణో చూడండి, ‘నా నీకు, నీ నాకు మధ్యన ఎన్ని వసంతాలు అడవులవాలో’ అని. నా నీకు, నీ నాకు అనడమంటే ఇద్దరొకటేనని చెప్పడం. ఒకటే కానీ మధ్యలో వసంతాలు అడవులయ్యేంత దూరం, ప్రేమరాహిత్యం.

అయితే అనేకచోట్ల ప్రేమ గురించిన తియ్యనివాక్యాలు కూడా కనిపిస్తాయి. మనిషిని మనిషితో కలిపే బంధంగా, మనిషి మనిషితో నిలిచిఉండే చిరకాల ఆత్మీయలక్షణంగా ప్రేమ సజీవంగా చిరకాలం నిలిచి ఉంటుందనే గొప్ప వ్యక్తీకరణ కనిపిస్తుంది.

ఎదుటివ్యక్తి మనసంతా నింపుకున్న ప్రేమలో తడిసిపోతే, మనిషికి కలిగే భావనను,
చెట్ల సందుల్లోంచి తొంగిచూసే చందమామను
ఇంటి పైకప్పు చాటునే దాచిపెట్టి
ఇంట్లో నిండిన వెన్నెలతో రోజూ ముచ్చటిస్తా
వెలిసిన వర్షంలో మెరిసే ఇంద్రధనుసులా! (సందెవేళ, పే.53)

అంటూ వర్ణిస్తారు. ప్రేమలో మునిగిన క్షణాలు ఎంతటి సమూహంలోనైనా ఒంటరిగా గడిచిపోతుంటాయి. కానీ అరుణగారు మాత్రం ఏకాంతాలు వసంతాలైపోతాయంటారు.
గిరిగీసుకున్నట్టుగా నీ ప్రేమలో నేను
అది వలపో లోలోపలి తలపోగానీ
ఏకాంతాలన్నీ వసంతాలైన మధురానుభూతులు (సందెవేళ, పే.52)

ప్రేమ చాలా బాధ్యతాయుతమైన బంధం. ఒకరికోసం ఒకరు ఆలోచించడం, బతకడమే కాదు ఒకరిలో ఒకరు కరిగిపోవడమే ప్రేమంటారామె.
పెనవేసుకున్న వత్తిలో దారాల్లా
ఈ మైనపుముద్దలో ముద్దుగా బంధించబడ్డాం
నాలోనేను….నీలోనువ్వు
చీకటిలో వెలుగుతున్నదీపంలా
కరిగిపోతూనే ఉన్నాం! (జీవేమ శరదశ్శతం,పే.56)

మేఘాన్ని తరిమికొడుతూ నేను
నీరై వర్షిస్తున్నా!
అందుకే ఇలా పెనవేసుకొని
చీకటిని చీలుస్తూ మనం
వేకువ జాడలవెంట లేలేత చిగురుల వేస్తూ
పచ్చని చేట్టై పరిమళిస్తూనే ఉన్నాం! (జీవేమ శరదశ్శతం, పే.57)

మేఘం నల్లది, కొంత చీకటిని ప్రసరించేది. కానీ అందులో నీటిని వదిలేయలేం. అందుకే మేఘాన్ని తరిమికొట్టి అందులోని నీటితో చెట్టై పరిమళిస్తుంటామంటారు. ప్రేమలోని తప్పులను, అడ్డంకులను పక్కనబెట్టి మరింత ప్రేమను నింపుకుని ముందుకెళ్లాలనే ఆశ ఈ వాక్యాల్లో కనిపిస్తుంది. ఈ ప్రేమకు కొలమానం, తూనికలు ఉంటాయా? ఎంత కష్టమైన పని, ప్రేమను వ్యక్తీకరించడం! ప్రదర్శించనంత మాత్రాన ప్రేమ లేదంటామా!

కొలమానం ఏముంది
లోపలి తత్వాన్ని బట్టి తొణికేదే తప్ప
ఓ గంటెడో గిన్నెడో
పాయసంలా ఉంటే వొంపేలా ఉండేది
నిరాడంబరంగా లోపలే ఉంటే ఎలా
వొలకబోయడానికి మనసూ ఉండాలి (తోడు, పే.72)

నిజమే! వొలకబోయడానికి మనసు ఉండాలి. అయితే దీని విపర్యయం నిజం కాదు. వొలకబోయనంత మాత్రాన మనసు లేదని కాదు.

ఇంకా ఈ పుస్తకంలో అరుణగారు మనిషి సంసారజీవితం ఏ దశ నుండి ఏ దశకు రూపాంతరం చెందుతుందో పరిశోధించినట్టుగా రాశారు. ప్రతి దశలోనూ సంసారజీవితం ఎలాంటి మార్పులకు లోనవుతుంది, ఆ మార్పులు భాగస్వాముల్లో ఎలాంటి మానసిక చర్యలను కలిగిస్తాయి, వాటి మూలంగా ఆ సంసారాల గమ్యం ఎటువైపు వెళ్తున్నాడో చెప్పారు. చాలా కవితల్లో ఈ విషయాన్ని తీవ్రమైన చర్చకు పెట్టారు. నిజమే! చర్చించాల్సిన విషయమే ఇది.

భార్యాభర్తలకు ఒకరిమీద ఒకరికి ఎంత అనురాగం ఉంటుందో,అనురాగమే ఆ అనుబంధానికి ఎంత పటిష్టమైన పునాది అవుతుందో, ఆ అనురాగాన్ని పెళ్ళికి ముందు ఆ యువతీయువకులు ఎంత అందంగా ఆశపడటారో చెప్తూ,
తోడు నడవాలని ఆశ
ప్రేమగా…అండగా
నాకూ ఒకరున్నారని
నిబ్బరంగా బ్రతకాలని ఆశ
కళ్ళలో నీళ్ళు తిరిగినప్పుడు
ఓదార్చే హృదయం
నాదై ఉండాలని ఆశ
ఒంటరితనం వెంటాడని
ఆప్యాయత వెంట ఆత్రంగా నడవాలని ఆశ
ఆమని రాగం పాడే
అందమైన వేకువలో
అల్లుకుపోయే పందిరికి
తీగలా పెనవేసుకుని సాగిపోవాలని ఆశ (ఏది ప్రశాంతత, పే.29)

‘రోజా’ సినిమాలో ‘చిన్నిచిన్ని ఆశ’ అంటూ పాడుకునే అమ్మాయి ఆశలే ఇవన్నీ. కాకపోతే తియ్యని సంసారాన్ని గురించి కలగనే ఆశలు. అయితే ఈ ఆశలు అంతే తియ్యగా సంసారజీవితమంతా మధురిమలు పంచవు. చాలామంది జీవితాల్లో ఆశలు భంగపడతాయి. ఇది సర్వసాధారణం. ఆశలు తేలిపోవడమే నిజం.

ఆకాశం హరివిల్లై విరిసినప్పుడల్లా
అన్నీ రంగులు జీవితంలో పండుతాయనుకున్న!
నువ్వు ఎరుపు రంగై కాలుస్తుంటే
నేను ఊదారంగై మిగిలిపోయా! (మెరుపు కల, పే.66)

ఈ నిజం తెలుసుకోవడానికి పెద్దగా కష్టపడనవసరం లేదు. సంసారబందీ అవడమే అస్తిత్వ స్వేచ్ఛకు శాశ్వతావరోధం.
ఎగిరే పక్షులను చూసినప్పుడల్లా
నా స్వేచ్చా వృక్షంలా
విశాలమైనదనుకున్నా
మూడుముళ్ల పంజరాన
ముడుచుకుని కూర్చున్న! (మెరుపు కల, పే.66-67)

విరిసే పూలతోటలో తిరిగినప్పుడల్లా
పరిమళాల పలకరింపులు
జీవితాంతం నిండుతాయనుకున్న
మండే సూరీడై
వాడిన పూదోటలా మార్చే
ఆయుధమౌతావని కలగనలేదు! (మెరుపు కల,పే. 67)

ఆయుధంగా మారినంత మాత్రాన ఆ భాగస్వామితో విడిపోవడం కుదరకపోవచ్చు. రాజీ అనేది జీవితసూత్రమైపోయిన సంసారాలెన్నో. సర్దుకుపోవడం నిత్య ఆచరణ మంత్రమైన కుటుంబాలెన్నో. కారణాలేవైనా కావచ్చు, తగ్గడం,తన మానాన తనను వదిలేయడం లాంటివే కుటుంబాలు విచ్ఛిన్నం కాకుండా కాపాడుతుంటాయి. పైకి మాత్రం మన కుటుంబ వ్యవస్థ చాలా గట్టిదని భ్రమ పడుతూనే ఉంటాం, మోసం చేసుకుంటూనే ఉంటాం.
ఒడ్డు మీద తను
కింది కాలినడకలో ప్రతిబింబం
రైలుపట్టాల్లా కలుసుకోముగానీ
కలిసే నడుస్తుంటాం!
ఒక తీగలో మెలిపెట్టిన రెండు హృదయాలు
ఒక్కోసారి జాలిగా అనిపిస్తుంది (నడక, పే.33)

అవును! విడిపోవడం అంత సులభం కాని జీవితాలే ఎక్కువ. తుఫాను తీరం దాటదు. దాటుతుందేమోనని, అప్పటిదాకా ఒదిగి ఉండాలనీ అనుకోవడమూ జరగనిదేమీ కాదు.
ఏ తుఫానో తీరం దాటే దాకా
అలజడితో ఈదురుగాలిని మోస్తూ
ముడుచుకొని ఇసుకముద్దల్లా శిలలై పోతుంటాం! (నడక, పే.34)

కానీ ఈ కలవడమూ నిజంకాదు, శాశ్వతం కాదంటారు అరుణ. అది కూడా తప్పిపోవడంలో భాగమేనంటారు.
కాసేపటి మౌనంలో నిశ్శబ్ధంగా
చిత్రీకరించిన దృశ్యం నీటిపై పడవైపోతుంది
ఎందుకో అర్థం కాదు
అప్పుడప్పుడూ తప్పిపోతూనే ఉంటాం (నడక, పే.34)

అందుకే బతుకు మీద తీవ్రనిరాశ గుదిబండలాగా కూర్చుంటుంది. మోయడం తప్ప ఏమీ చేయలేని దీనస్థితి.
నడినెత్తికెక్కిన సూరీడిని తలపై మోసాక
మాసిబారడం తప్ప బ్రతుక్కేమి మిగిలింది! (ఏది ప్రశాంతత, పే.30)

మొగుడు మొగాడి కంటే ప్రమాదకరం అయినపుడు జీవితం చరమాంకం వైపు వెళ్తుంది. మనిషి తుది శ్వాస కోసం దారులు వెతుకుతాడు.
ప్రస్తుతం మగాడు బ్రతికిలేడు
మొగుడు మాత్రమే మిగిలాడు!
ఆయువును మింగే అశాంతి వలయం
ఆరాటాలు తీరని ఆకలి పోరాటం
అందరాని వెన్నెలలో ఊయలలూగడం
తుదిశ్వాసకు దారులు వెదకటం! (ఏది ప్రశాంతత, పే.30)

భర్తతోనే కాదు ఏ బంధమైనా అపసవ్యంగా మారితే ఆ బంధాన్ని భరించే వాళ్ళకు ఎంత కష్టమో చెప్తారామె.
మంచిని వెదకాలో ఇక్కడ
చెడును చదవాలో
చివరికి మోడువారి శూన్యాకాశమై మిగలాలో
ఈ బంధాలను మోసే ఆడైనా మగైనా
జీవితం మాత్రం అభిమన్య ప్రయాణమే! (ప్రవర్తన పే.16)

ఈ బంధాలు ఇట్లా యాంత్రికంగా మారడానికి కారణం మనుషుల ప్రవర్తనలే. తమ భాద్యతల నుంచి, ఎదుటి వ్యక్తి ప్రేమను నిలుపుకోవడం నుంచి తప్పించుకుపోయే మనిషే బంధాల విచ్ఛిన్నానికి, చివరికి సమాజ విచ్ఛిన్నానికి కారకుడు అవుతాడు.

ఈ మధ్యన మనిషి లో నిర్లిప్త ధోరణులు విపరీతంగా పెరిగి పోతున్నాయి. సమస్య నుంచి తప్పించుకుని వెళ్ళిపోతున్నాడు. ‘ నాకెందుకులే ‘ అనే ధోరణి వల్ల మనిషి తోటి మనిషికి దూరమైపోతున్నాడు. ఈ నిర్లిప్త ధోరణిని ఎండగడతారు, ‘ మనకెందుకులే ‘ లో.
వెళ్ళేదారిన పురుగొకటి చస్తుంది
జంతువొకటి జీవశ్చవమౌతుంది
మానవత్వం నిండిన మనిషోకడూ మరణిస్తాడు
పక్కనుండి ముచ్చటిస్తూ
మనసులో మోకరిల్లి
మౌనంగా వెళ్లిపోదాం (మనకెందుకులే పే.84)

వ్యంగ్యధోరణిలో మనిషి లోని ఈ తప్పించుకు పోయే ధోరణిని చెప్తున్నారు.
నోటకరుచుకున్న
చెక్కెర పదార్థాన్ని జారవిడువకుండా
మనం నడిచి వెళ్లిపోదాం
వర్ణ జలధారల్లో
వదిలేసిన పడవనెక్కి
మతిలేని కాలానికి
మాటెందుకంటూ వెళ్లొపోదాం! (మనకెందుకులే పే.85)

కవులు, రచయితలు కూడా సమాజాన్ని ఏదో చైతన్యవంతం చేస్తారనుకుంటే ఈమధ్యన తప్పించుకుని పారిపోతున్నారు. సమస్యల మీద రాసే వారే కరువైపోయారు. సాధారణీకరిస్తూ రాయడం తప్ప, ప్రత్యేక సమస్యల మీద రాసే దైర్యాన్ని కోల్పోతున్నారు. అలాంటి వాళ్ళ కోసం,

ఆహార్యాన్ని మోసుకుంటూ
మౌనంగానే
మరో అక్షరమై
మనమూ వెళ్లొపోదాం! (మనకెందుకులే పే.85 )
అంటారు. ఈ నిర్లప్త ధోరణి, స్తబ్దత, జడత్వాలకు ఆమె తీవ్రంగా కలత చెందుతారు. మనుషుల ఈ కృత్రిమత్వాలకు బాధపడతారు.

ఇంతగా కదలనితనంలోకి మనుషులు
ఎందుకు సంచరిస్తారో
పచ్చని చెట్టుకు చెదపట్టినట్టు
నిలువునా లోలోపల క్రుంగిపోవడమే జీవితమా? (ఏమిటో..! పే.36)

తఈ కృత్రిమత్వాలు బయటకు కనబడకుండా, పైకి బాధ్యతలను,బాధలను పంచుకుంటున్నట్లు,బంధాల పట్ల ప్రేమలున్నట్లు నటించే మనుషుల మనసులను కూడా విప్పిచెప్పారు, ‘తడిసిన మట్టి’ లో.
పోయేదేముంది
చినుకుల్లాంటి నాలుగు కన్నీటిబొట్లు తప్ప!
గుండె తడిలో మునకలేసిన కొండలు
ఆకులను కప్పుకున్న మట్టిబెడ్డలు!
కుబుసం విడిచే పాములకు నీటితడి
కేవలం పైతోలుకే (తడిసిన మట్టి, పే.82)

లోకంలోని ఈ స్వీయమోసకారితనాన్ని ఈడ్చి లాగిపెట్టి కొడతారు ‘అలసిన వెలుగు’లో. ఎదుటిమనిషి కిందపడితే నవ్వే జనాలకు చెంపదెబ్బ వాక్యాలివి.
ఒక్కోసారి సూరీడూ అలసిపోతాడు
సముద్రంలో మునిగి తల దాచుకుంటూ
అంతలోనే తాము వెలుగని భ్రమిసే
గుడ్డిదీపాలు
పిల్లగాలికి మిడిసిపడుతూనే ఉంటాయి. (అలసిన వెలుగు, పే.6)

అరుణ గారిది జాలిగుండె. సాధారణంగానే బంధాల పట్ల కన్ సర్న్ ఉన్నవాళ్ళకు, వాటిని నిలుపుకోవాలని తాపత్రయపడే వాళ్ళకు, సమస్యలకు స్పందించే గుణమున్న వాళ్ళకు జాలి,సానుభూతి లాంటి లక్షణాలు తప్పకుండా ఉంటాయి. ఈ పుస్తకం నిండా బంధాల పట్ల అలాంటి సున్నితత్వమున్న దృష్టాంతాలు చాలా కనిపిస్తాయి.

శిల్పం గురించి చెప్తూ జీవితాలలోని తాత్వికతలను వివరించే ‘అంతులేదు’ కవితలో, శిల్పాల సౌందర్యం వెనుక వాటి బాధలను చూపుతారు.
ఉలి మోపిన చేతులను మందలిస్తూ
రక్తసిక్తమైన రాళ్ళను ఓదారుస్తుంటా
నొక్కులు పడిన శిలల గాథలు వింటూ (అంతులేదు, పే.21)

ఆ శిల్పాలు చెప్పే విషయాలకు అబ్బురపోతూ, ఆ విషయాలు జీవిత తాత్వికతలను ఎలా విడమర్చి చెప్తాయో అర్థం చేసుకుంటూ కవితలో పంచుకుంటారు.
ఒక్కో నావా మునిగిన వైనాన్ని
నాకెందుకు చెబుతుందో…
ఇంతటి వ్యామోహాలను
ఎందుకు చవిచూపిందో (అంతులేదు, పే.22)

నావ మునగడం(జీవితం చెదరడం)లో వ్యామోహాలు ఏముంటాయి? చెదిరిన జీవితాన్ని అర్థం చేసుకోవాలంటే, ఆ జీవితంతో సహానుభూతి చెండాలంటే ఆ ఎదుటి జీవితం పట్ల ప్రేమ,వ్యామోహం లేకుంటే అది సాధ్యపడదు. అరుణ గారి విస్తృత పరిశీలనా దృష్టికి ఇదొక ఉదాహరణ.
మరలిపోయిన కన్నీళ్లు మళ్ళీ తోడైనాయి
గుప్పెడు నూకలు కాదు కరువైంది
చిటికెడు ప్రేమ (వార్ధక్యదీపం,పే.44)

ముసలితనంలో కరువైన కన్నబిడ్డల ప్రేమ గురించిన ఆర్ధ్ర వాక్యాలివి. సాటిమనిషి ఆత్మీయత కోసం వెంపర్లాటలంటే ముసలితనంలోనే కాదు జీవితకాలమంతా వెదుక్కునే మృగతృష్ణలే.
తీయగా పలకరించే మాటలకోసం
ఆర్తిగా కొన్నిసార్లు ఎందుకో ఎదురుచూస్తాం…
తెగిపడిన తీగలా ఓ క్షణం (ఏమిటో,పే.35)

అయితే ఇలాంటి బంధాలను తెంచుకోవడం చాలా సులభం.కానీ తెంచుకోలేని అశక్తత ఒకటి ఎప్పుడూ మనసును జిగుర్లా పట్టుకుని కూచుంటుంది.
నవ్వునవ్వుకూ
మాటమాటకూ
చూపుచూపుకూ నడుమన
నలిగే మనోభావాలు కొన్ని!
చేయలేని సాహసమేం కాదు తెగింపు
నడక నడకకూ మధ్యన
నాకంటూ లేకుండా పోయినప్పుడు
అస్తిత్వం కనుమరుగైపోయినప్పుడు
కలే నీకు చుక్కాని
కలే అలసిన కనులకు చల్లని చిరునవ్వు (నేను నాకు లేను, పే.87)

అస్తిత్వం కనుమరుగైనపుడు కలను ఆశ్రయించడం కాదు చేయాల్సింది, తెగింపును ఆశ్రయించాలి. కలలో అస్తిత్వం కాదు, తెగింపుతో కొత్త అస్తిత్వాన్ని పొందాలి. కానీ అరుణ గారి సున్నిత మనస్తత్వానికి ఆ పని చేయడానికి ధైర్యం సరిపోలేదు. ఆ సున్నితత్వమే ఆమెకు మహా సహనాన్నిచ్చింది.
ఉరుముతూ చేసే నల్లమబ్బుల అల్లరిని
మెరుపులాంటి ఆదుర్దాలను
భరించిన ఆకాశంలా అలసిపోతాను గానీ (తొలకరి చినుకులు, పే.2)
అని చెప్పుకుంటారు తనకున్న ఓపికను. ఆమెకు కొత్తకాలం మీద చాలా ఆశ. చాలా నమ్మకం. కొత్తకాలం తప్పకుండా బాధలను తొలగిస్తుందనే విశ్వాసముంది ఆమెకు. కొత్తకాలం కోసం మనసు కోరుకోవాలంటే మనసులోని గాయాలు ఎలా వెంటాడుతూ మళ్ళీమళ్ళీ ఎదురవుతుంటాయో తెలియాలి. వాటిని…
ఆకాశం మేఘావృతం అయినప్పుడు
తొంగిచూసే జ్ఞాపకంలో
పడవ వేసుకొని ఒడ్డున పడాలని కలగంటాను!
అక్కడా నువ్వే కన్నీళ్ళయి పలకరిస్తావు!
కాదని తుడిచేస్తూ ముందుకెళతాగానీ
కొంతకాలంగా దూరమైన చూపులను
కొత్తగా గమనించడం మొదలెడతాను! (గుండెతడి, పే.92)
అంటూ గుర్తిస్తారు. ఆ గుర్తింపులోంచే కొత్తకాలానికి ఆహ్వానం పలుకుతారు. ఆ కొత్తకాలానికి వడగాలిగా మారిన మనసును చల్లబరిచే శక్తి ఉంటుంది. కోయిల నడ్డుపెట్టి చెప్తారీ విషయాన్ని ‘తొలకరి చినుకులు’ లో.
దానికి ముందే తెలుసే
కురిసే వర్షం గురించి
వడగాలిలా మనసు మారినప్పుడు
రాలే తొలకరి చినుకుల గురించి (పే.1)

కొత్తకాలం లేదా కొత్త అడుగు లేదా కొత్త ఆశకు మనిషి నవీకరించుకుంటాడు.. కొత్త చినుకుకు దుమ్మును వదిలేసుకున్న ఆకుల్లా.
దుమ్మును కడిగేసుకున్న చెట్ల ఆకుల్లా
మనసూ తడిసి పోతుంది (పే.2)
మనిషిని ఈ ఆశే ముందుకు తీసుకుపోతుంది. నిరాశ చిరకాలం నిలిచి ఉండదనే నమ్మకం, ఆశే శాశ్వతంగా మనిషి గమనానికి తోడ్పాటవుతుందంటారు.

చినుకు పడగానే నాట్యం చేసేందుకు
నెమలిపిల్లనేం కాను
ఇవాళ రాలిన చినుకులన్నీ
శాశ్వతమౌతాయని కలగనడానికి (అలసిన వెలుగు, పే.5)
అందుకే నిరాశను పక్కకు నెడుతూ పోవాలి. అలాంటి ప్రయాణంలోనే సూరీడు వెలుగుకిరణాలు నిరాశను పారద్రోలడానికి సహాయంగా వస్తాయి.

మెరవడానికీ మెరిపించడానికీ
పాలపుంతలను కవ్వించడానికీ
సూరీడిని మించిన వరుడెక్కడనీ (అలసిన వెలుగు, పే.6)
ఈ సమయంలో నిర్ణయాలు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. నిర్ణయమే తీసుకోకుండా ఉండలేము. అడుగు వెనక్కువేస్తే అంతా తిరోగమనమే. జీవితమంతా సాగాల్సింది పురోగమనం వైపుకే.

నిర్ణయానికీ భవిష్యత్తుకూ పొంతనా ఉండదు
అడుగు వెనక్కెస్తే ముందుకెళ్లడం ఆగిపోతుంది
ఒక్క క్షణమే కాలానికీ గమనానికీ ముడివేసేది (నిర్ణయం, పే.19)
ఆ నిర్ణయమే జీవితాన్ని,జీవిత గమనాన్ని, దిశను మారుస్తుంది. అది జీవితానికి దిక్సూచి అవవచ్చు, లేదా జీవితాన్ని అగాధంలోకి తోయవచ్చు.

ఆ ఒక్కక్షణమే
గతిమార్చే జీవితానికి
మార్గమయ్యేది అగాధమయ్యేది! (నిర్ణయం, పే.20)

కాలం మనిషికి ఎంత సహకారం ఇస్తుందో తెలిపే కవిత ‘ఒక అడుగు వెనుక వైపుకు’. కాలం మనిషికి ఎన్నో అవకాశాలిస్తుంది. తప్పులు సరిదిద్దుకునేందుకు కాలం తాను దిగజారుతుంది.
నీకోసం నడిచొచ్చిన కాలం
ఎన్నిమెట్లు దిగజారిందో (ఒక అడుగు వెనుక వైపుకు, పే.46)

తెగిన గాలిపటాన్ని సాధారణంగా నెగెటివ్ అర్థంలో చెప్తుంటారు. కానీ దాన్ని పాజిటివ్ కోణంలో జీవితంలోని మధురకాలాలను,మంచి వ్యక్తులను చూసి మనసు ఆనందపడటంగా చెప్తారు అరుణ.
శిల్పాలన్నీ మౌనంగా చూస్తున్నా
నేను మాత్రం మాట్లాడుతుంటా…గతంలో సంచరిస్తుంటా!
తెగిన గాలిపటాన్నవుతుంటా! (అంతులేదు,పే.21)
బాధలను చూసి మనసు చలించిపోయి గమ్యం ఎరుగక, ఎగురుతూ పోయే తెగిన గాలిపటంగా మారుతుందేమో!

నిజంలోకి ఒక్కసారి తొంగిచూడు
ఉనికిని కాపాడే జాడ చూడు
ముందు పదిలమవడానికి
వెనకకు తిరిగి చూడు (ఒక అడుగు వెనుక వైపుకు, పే.47)
ఒకసారి వెనక్కు తిరిగిచూస్తే తాను నిలబడటానికి కారణమైన ఎందరో మనుషులు,ఎన్నో ఘటనలు కనిపిస్తాయి. కాలం అట్లాంటి సహకారం అందించక పోతే అది తనకంటే ఎంతో వెనకబడిపోయినట్టేనంటారు, ఈ అద్భుత వ్యక్తీకరణ లో.
కాలానికి నాకు ఎంత దూరముంది
నాతో నడుస్తున్నట్టే ఉంటూ వెనక్కు వెళ్లిపోతుంది (అంతులేదు, పే.22)

సరిగ్గా ఈ పుస్తకంలో చాలాచోట్ల అరుణ గారి విశాల దృక్పథం,ఆలోచనా విధానం ముందు కాలం వెనకబడిపోయింది. కాలాన్ని దాటేసి ఆమె ఎంతో ముందుకెళ్లిపోయారు. అందుకుగాను ఆమె తననుతాను ఎప్పటికప్పుడు రిఫ్రెష్ చేసుకుంటూ,మనసులోని వ్యతిరిక్త ఆలోచనలను దులిపేసుకుంటారేమో ఇట్లా!
ఏరోజూకారోజు శుభ్రపరుస్తున్న దేహంతో పాటూ
కమ్ముకుంటున్న మేఘాలను శుద్ధి చేస్తూ
దుమ్ము పెరుకుపోయిన మనసునూ దులిపేయాల్సిందే..
ముందుకు నడవడం కోసం! (గాజుబొమ్మ, పే.102)

ఈ విధమైన నడవడితోనే తానో స్వీయచరిత్రనవుతానంటారు.
నిమగ్నమైన చరితల్ని చూస్తూ
నేనూ ఓ స్వీయచరిత్రనౌతున్నా (అంతులేదు, పే.22)
బాధలు, కష్టాలు, ఆనందాలు కలగలిసిన జీవితాలను చదువుతూ స్వీయచరిత్రగా రూపాంతరం చెందుతూ పోతున్నారు. ఆ చరిత్రగమనంలో రాళ్ళుండవచ్చు, ముళ్ళుండవచ్చు కానీ రూపాంతరం చెందడం మధ్యలో ఆగిపోయే లేదా వెనక్కి చెదిరిపోయే ప్రక్రియ కాదు. చరిత్రగమనం ఎప్పుడూ పురోగమనం వైపుకే. అందులో నిరాశకు ఎన్నడూ తావులేదు. ఇదే సందేశాన్ని యువతకూ అందిస్తారు. ధైర్యంగా జీవించాలనేలాగా,

రాతి మనసుల్లో వివేకశిల్పమవ్వాలనో
యువత మనుగడకు శిల్పి కావాలనో
మరో నాగరిక ప్రపంచానికి మార్గమవ్వాలనో
అతడింకా నడుస్తూనే ఉన్నాడు
(ఇంకా ప్రశ్నార్ధకమే, పే.8)
అంటారు. మరణించిన మనిషిని గుర్తు తెచ్చుకుంటూ,
మనిషిగా మరుగైపోయినా
మాటగా వినబడుతూనే ఉన్నాడు (ఇంకా ప్రశ్నార్ధకమే, పే.8)
అంటారు.

ఇక ఈ పుస్తకంలోని అరుణ గారి కవిత్వంలో అనేకచోట్ల అద్భుతమైన వ్యక్తీకరణలు,పోలికలు,భేదాలు చాలా కనిపిస్తాయి. ఏ సందర్భానికికాసందర్భంలో అవి ప్రత్యేకంగా ఉంటాయి. చదివినంతనే ఆకట్టుకునేలాగా, గుర్తుండిపోయేలాగా..

‘బీటలు బారిన మట్టి’లో వానాకాలాన్ని సప్తవర్ణకాలమని అంటారు. హరివిల్లుల కాలమనే భావంలో అలా అన్నా, ఇదొక మంచి వ్యక్తీకరణ. వానాకాలంలోని వాన కలకు, జీవితానికి మధ్య మనసుకు, నిజానికి మధ్య నలిగిపోతున్నది, తాను కురవాలా వద్దా అని.

కలకూ జీవితానికీ
మనసుకూ నిజానికీ మధ్య నలిగే
సప్తవర్ణాల కాలానికీ
ఇవాళ రూపు లేదు (పే.18)
సంఘజీవి చేసే పనులన్నీ కోయిల చేస్తుందట. కోయిల పనులను,సంఘజీవి పనులతో పోల్చి చెప్పే వాక్యాలు ‘తొలకరి చినుకులు’లో ఉంటాయి.
చల్లని ఆకాశాన్నీ
చిలకపచ్చ మెరుపు తీగలను
తన్మయత్వంగా కదిలే కొమ్మలను
కళ్ళు తెరవని లేలేత కిరణాలను మాట్లాడిస్తుంది
సంఘజీవిలా (పే.1)

మరోచోట ఒంటరితనాన్ని ఊగే లోలకంతో పోల్చుతారు. లోలకం జీవితాంతం తాను ఒంటరిగానే ఊగుతుంది,ప్రయాణం చేస్తుంది.
ఎక్కడో ఒంటరితనం!
ఊగే లోలకంలా (సీతాకొక చిలుక,పే.37)
‘నడక’ కవితలో ఇంకో వ్యక్తీకరణ ఇలాగే ఆసక్తిగొలిపేలా కనిపిస్తుంది.
అప్పుడప్పుడూ తప్పిపోతుంటాం
కావలసినది అందనప్పుడో
మరీ మరీ గుర్తొచ్చినప్పుడో! (పే.33)

ఏదైనా అందనపుడు ఆ అందకపోవడమే మనం తప్పిపోవడంగా అనుకుంటాం. అయితే ఆ అందనిది గుర్తొచ్చినప్పుడైనా అందంగా సంతృప్తి పడలేమేమో! అందుకే ఆ గుర్తొచ్చింది అందుకోవాలనే ఆతృతలో పడి మళ్ళీమళ్ళీ తప్పిపోతుంటాం. లోతైన ఆలోచనతో కూడిన వ్యక్తీకరణ ఇది.

యంత్రం(మిషిన్)తో మనిషిని పోల్చే మరో పోలిక ‘నడిచే యంత్రం’లో కనిపిస్తుంది.
ఈ ఆరాటమూ పోరాటమూ అన్నీ
బ్యాలెన్స్ లో ఉంటేనే
లోపలి విద్యుత్తు సరిగా పనిచేసేది!
కాసేపు ధ్యానమనే గ్రీసులో ముంచేస్తే
కొత్తచిగుర్లు పుట్టినట్టుగా
నూతన ఉత్సాహం…
మరింతకాలం పదిలంగా ఉండేందుకు తోడ్పడుతుందేమో! (పే.105)

అట్లాగే మనిషిని,మనసును భూమితో పోల్చి, వాటికి భూమితో ఉన్న సంబంధాన్ని చెప్తారొకచోట.
ఆకాశంలోకి విసిరేసిన బంతి మనసు
మళ్ళీ భూమినే చేరుతుంది
గురుత్వాకర్షణ సిద్ధాంతం నమ్ముకున్నాం గనక
భూమికీ మనకూ తేడా ఏం లేదు
అదే మట్టి దేహం అవే నీళ్ళు
అదే అగ్ని అదే మనసు గాలి (కృత్రిమ నక్షత్రం, పే.113)

మరణాన్ని పోల్చిన వాక్యాలు ‘ఇంకా ప్రశ్నార్థకమే’లో కనిపిస్తాయి.
తిమిరాన్ని చీల్చే వేకువో
గగనాన్ని తాకే వాయువో
అమ్మఒడినాశ్రయించినంత ప్రశాంతతలోకి ఎలా వెళ్లాడో.?
మతి మరిచో జీవితం మరిచో
కలగన్నాడో..కనుమరుగవ్వాలనుకున్నాడో (పే.7)

ఇవే కాకుండా కొన్ని నెగెటివ్ వ్యక్తీకరణలు కూడా కనిపిస్తాయీ పుస్తకంలో.
‘నడక’ కవితలో ‘చినుకుల్లా తడిపెసే బాధలు’ అంటారు(పే.33).

నిజానికి చినుకులు బాగుంటాయి.ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. కానీ బాధలు చినుకుల్లాగా తడిపేస్తాయని రాశారు. చినుకుల నెగెటివ్ వ్యక్తీకరణ ఇది. ఇలాంటిదే మరో నెగెటివ్ వ్యక్తీకరణ ‘చుక్కాని’లో కనిపిస్తుంది.
ఒక్కోసారి వసంతం
దట్టంగా విరిసిన వేపపూతంత మాధుర్యంగా (పే.31)
వేపపూత చేదుగా ఉంటుంది కదా,అందులో మాధుర్యాన్ని చూడటం.

రోజులో పగలంతా సాధారణంగా రొదలతో,శబ్ధాలతో ఉంటే రాత్రిపూట చీకటి సమయం నిశ్శబ్ధంగా ఉంటుంది. కానీ మేఘం యొక్క ఉరుము శబ్ధాన్ని చీకటి సడితో పోల్చుతారు.
మేఘం ఎప్పుడూ ఉరుముతూ
కటిక చీకటిలా శబ్ధం చేస్తూనే ఉంటుంది (జడివాన, పే.79)

ఇట్లా చాలా వ్యక్తీకరణలు సందర్భోచితంగా సరిపోయే విధంగా దాదాపు ప్రతి కవితలో కనిపిస్తాయి. జీవితాన్ని అభిమన్య ప్రయాణంతో పోల్చే(ప్రవర్తన, పే.16) లాంటి వాక్యాలైతే పుస్తకం మూసేసిన చాన్నాళ్ల దాకా గుర్తుండిపోతాయి.

ఇక అరుణ గారి కవిత్వంలో మరో చెప్పుకోవాల్సిన విషయం ఆమె వివిధ సందర్భాలలో వివిధ భావనలకు ఇచ్చిన నిర్వచనాలు. అలాంటివి కొన్నింటిని తప్పకుండా చెప్పుకోవాలి. ఆ నిర్వచనాల్లోని , నిర్వచించిన తీరులోని భావపునాదిని అర్థం చేసుకుంటే పుస్తక సారాన్ని చాలావరకు స్థూలంగా గ్రహించవచ్చు.
రైతు లక్షణాలను నిర్వచిస్తారు ‘పొడమరలిన జీవితం’లో.
మట్టంటే అతని పంట
మనుగడంటే విత్తనం
చినుకంటే చెమటచుక్క
ఊపిరంటే అతని పంతపై వీచే పైరగాలి (పే.114)

మరోచోట చరిత్ర ను నిర్వచిస్తారు.
చరిత్రంటే నువ్వోనేనో
సృష్టించే కథనాలు కావు
నాలుగు పుస్తకాలు చదివి
నచ్చిన కోణంలో రాయడం కాదు!
చరిత్రంటే వాస్తవికత
చెదిరిపోనీ జ్ఞాపకం
చరిత్రంటే
రేపటితరాలకు మార్గదర్శి
మన్నికైనా మనుగడనిచ్చే దిక్సూచి (ఎర, పే.107)

కానీ ఇప్పుడు చరిత్ర పేరుతో రాస్తున్నదంతా, చెప్తున్నదంతా ఈ వాక్యాలకు పూర్తి వ్యతిరేకమైన చెత్త.
రవికి తెలియని కొత్తలోకం రాత్రి
———–
వెలుగుకు గుర్తింపునిచ్చేది
ఎన్నో కలాలకు… కలలకు పనిచెప్పేది (మేల్కొలుపు, పే.43)

రాత్రిని, చీకటిని నిర్వచించిన ఈ వాక్యాలు ఎంతగా అతికిపోయి అక్షరాల వెంట పరుగులు పెట్టిస్తాయో గమనించవచ్చు.‘చుక్కాని’ కవితలో ఆడతనం నిర్వచనం కూడా ఇంతే అందంగా ఉంటుంది. వసంతంలో పూల సున్నితత్వాన్ని ఆడతనంతో చూపి చెప్తారక్కడ.
రాలిపోతున్నాయని బాధపడవు
వికసిస్తున్నందుకు పొంగిపోవు!
పరిమళమే తన బాధ్యతగా
అచ్చూ ఆడతానంలా సున్నితత్వమే! (పే.32)

ఏ మనసునైనా అర్థం చేసుకోవడానికి ఏ మనిషైనా ఏ సందర్భంలోనైనా తర్జనభర్జన పడుతూనే ఉంటాడు. కానీ మనసంటే ఏమిటో ఏకవాక్య నిర్వచనంగా చెప్తారు ‘అదే పేజీలో ఆగిపోతుంటా…’ కవితలో.
మనసంటే తీరరేఖలగుండా పోటెత్తే సముద్రఘోషే (పే.23)

అమ్మ ను కూడా నిర్వచనానికి కుదించడం చాలా కష్టం. సాధ్యపడదు కూడా. కానీ చాలా చిన్నపదాలతో అద్భుతంగా నిర్వచిస్తారు… మరోజన్మ’లో.
తనను తను కోల్పోయే
నిరంతర శ్రమజీవి (పే.14)
జీవితంతో, ప్రపంచంతో పరాయీకరించబడిన అమ్మ గురించిన క్లుప్తమైన చక్కని వాక్యాలు.

ఈ వ్యక్తీకరణలు, నిర్వచనాలను ఆమూలాగ్రం అర్థం చేసుకుంటే అరుణగారి తాత్వికత, భావ పునాది, ఆలోచనాలు తెలుస్తాయి. పరిశీలనా దృక్పథం, విషయాన్ని చూసే దృక్కోణాలను లోతుల్లోకి వెళ్ళి గమనిస్తే ఆమె ఆయా తాత్వికతల నిర్మాణానికి పడ్డ కష్టం తెలిసిపోతుంది. ఈ పుస్తకంలోని అలాంటి మరోటి మచ్చుకు చూద్దామిక్కడ. ఈ ఒక్కటి చూస్తే ఆమె తత్వమేమితో సూటిగా బోధపడుతుంది.
సాహసం సహనం నాకు నేస్తాలు
అద్భుతాలనైనా
అఖాతాలనైనా
ఆస్వాదించడం నా అభిరుచి
———–
అందమైన ఆల్చిప్పలో
అప్పుడప్పుడూ రాలే
స్వాతిచినుకులు అక్షరమై తాకగానే
కవిత్వమై ప్రవహించే ఆణిముత్యాన్నే! (స్వాతి చినుకై, పే. 111)
ఈ నాలుగు వాక్యాలు చాలు, ఆమె కవిత్వంలోని తత్వవిచారం అర్థంచేసుకోవడానికి.

అసలైతే కవిత్వం అంటే ఏమిటి,దాన్ని ఎలా అర్థంచేసుకోవాలనడానికి ఆమెకు ఒక ప్రత్యేకమైన నిర్ధిష్టమైన ఆకళింపు కోణం ఉంది.
నిర్మలంగా మారిన పిల్లగాలిలా
కవిత్వం కోయిల పాటలాగే వచ్చి చేరుతుంది
ఉరుముటూ చేసే నల్లమబ్బుల అల్లరిని
మెరుపులాంటి ఆదుర్దాలను
భరించిన ఆకాశంలా అలసిపోతానుగానీ (తొలకరి చినుకులు, పే.2)

కవిత్వం పట్ల ఆమెకున్న అభిప్రాయమిది. సరిగ్గా ఇలాగే మరోచోట అంటారిలా.
కోకిలకూ పిచ్చుకకూ మధ్య సంభాషణలా
చైత్రానికీ చిగురాకుకూ మధ్య
తీయని సంగమం కవిత్వం!
శిశిరాల్లో ముడుచుకున్న అలకలు
వసంతమై కొండలనుండి జాలువారే
జలపాతపు సంగీతం కవిత్వం (ఇన్నాళ్ల మౌనం తరువాత,పే.63)

కవిత్వమంటే ఎంత ఇష్టమో చాలాచోట్ల ఇట్లాగే ప్రకటిస్తుంటారు.ఆత్మీయనేస్తంగా అక్షరాల కూర్పు కవిత్వంగా మారే తీరుకు ఆమె పరవశం చెందుతుంటారు.
అప్పుడప్పుడూ ఆ అక్షరాలు గుర్తొచ్చినప్పుడు
జీవితాన్ని తడిమినంత ఆనందంగా ఉంటుంది
ప్రాణనేస్తమేదో పలకరించినంత స్వచ్ఛంగా
రాలిపోయిన రేకులు మళ్ళీ అతుక్కున్నంత అందంగా!
(అదే పేజీలో ఆగిపోతుంటా.., పే.23)

ఏది కవిత్వం? ఎప్పుడది తన్నుకొస్తుంది?అనే మీమాంసకు ఎంతగొప్పగా జవాబిస్తారంటే,
కళ్ళు మాట్లాడినప్పుడల్లా
కవిత్వమౌతుందని తెలియదు (ఇన్నాళ్ల మౌనం తరువాత, పే.62)

ప్రకృతి రమణీయత ఎంత అందమైందో కవిత్వమూ అంతా రమణీయమైన మనసుమొలక అంటారామె.
చినుకుల తాకిడికి
ముసిరిన మట్టివాసనలు సోకి
కొత్తగా మొలకెత్తిన విత్తనంలా కవిత్వం (ఇన్నాళ్ల మౌనం తరువాత,పే.63)

ఈ కవిత్వానికి వ్యక్తిగతంగా సంతృప్తినిచ్చే కోణమే కాకుండా బాధలను పోగొట్టే బాధ్యతా ఉందని చెప్తారు.బాధ్యతాయుతమైన కవయిత్రిగా నిలబడ్డ అరుణ గారు కవిత్వ బాధ్యతను ‘చుక్కాని’లో గుర్తు చేస్తారు.
బ్రతుకుపోరులో చుక్కానిలా కవిత్వం
కొత్తదారుల్లో పూలై పూస్తుంది
అగాధాలన్నీ మూటకత్తి ఆవల పారేస్తుంది (పే.32)

ఇట్లా కవిత్వాన్ని ఆమె చూసిన, నిర్వచించిన తీరు గురించి ఇంకాఇంకా చెప్పుకోవాల్సినవి ఉన్ననూ, ఇక వాటిని ఆపేసి చివరగా ఈ పుస్తకంలో అరుణగారి కవిత్వం ఎంత చిక్కగా, ధారాపాతంగా, అందంగా, రమ్యంగా సాగిందో రెండుమాటల్లో చెప్పుకుంటే ఈ సమీక్షావ్యాసాన్ని ఆపేసే సాధికారతను పొందగలము.
చూసే కళ్ళకు చూసినంత
ఆస్వాదించే మనసుంటే ప్రతిదీ సౌందర్యమే
కానరాని లోకాలన్నీ
అందంగా ఆరాతీసే నేస్తం
కేవలం కవిత్వం మాత్రమే! (చుక్కాని,పే.32)
ఇదీ ఈ పుస్తకంలోని అరుణగారి కవిత్వరూపం. ఆమె చేతి రాతలో పుస్తకమంతా ఎలా సాగి నిలుచుందో చెప్పే వాక్యాలివి.

కడలి ప్రసవించే లేలేత సూర్యుడిలా
ఎర్రబడిన కళ్ళలో కాంతులు నింపుకొని
కవిత్వమై జ్ఞాపకం పక్కన శిలాఫలకమై నిలుచుంటా!
(అదే పేజీలో ఆగిపోతుంటా.., పే.23)

తన కవిత్వంతో తానేమి సాధించాలనుకున్నారో ఈ వాక్యాలలో ఉంది.

అంతే! ఇక చాలు! ఇంకేమీ అక్కర్లేదు. ఈ పుస్తకం గురించి, అరుణ గారి గురించి ఈ వాక్యాలు చాలు. అర్థం చేసుకోవడానికిగాను సంపూర్ణ జ్ఞానం పొందడానికి. ఇంత మంచి కవిత్వాన్ని అందించిన అరుణ గారి కలం నుండి మరెన్నో అక్షరాలు కవితలుగా మారి పుస్తకాలుగా బంధించబడాలని ఆశిద్దాం!

పెద్దపల్లి జిల్లా మంథని. కవి, రచయిత, ప్రభుత్వ ఉపాధ్యాయుడు. వివిధ పత్రికలు, ఆన్లైన్ మ్యాగజీన్ లలో దాదాపు 300 వ్యాసాలు, 50 కవితలు ప్రచురితమయ్యాయి.

2 thoughts on “‘ఇన్నాళ్ల మౌనం తరువాత‘ – వాచక విశ్లేషణ

  1. సమగ్రమైన సమీక్ష వ్యాసం రాసిన రాజ్ పవన్ గారికి అభినందనలు

  2. చాలా సమగ్రంగా రాశారు.సుదీర్ఘమైన వ్యాసం కూడా..బాగుంది ధన్యవాదాలు

Leave a Reply