“ఇదుగో… నీకు నా కానుక తీసుకో!!!”

– అసాంగ్ వాంఖడే

ఇదుగో నీకు నా కానుక తీసుకో
నీ మనువు నన్ను చాలా మలినపరిచాడు కదూ…
నీ సంకుచిత బుద్ధి నన్ను కుల దుర్గంధంలో ముంచి, బహిష్కృతుణ్ణి చేసింది.
నీ అణిచివేత కుళ్లులో మగ్గిపోయాను కానీ
నీవు వదిలే మలపు కంపులో కాదు.
నేను నా పచ్చి గాయాల పరిమళాలతో మెరుస్తాను చూడు…
నీ రారాజుని ప్రసన్నం చేసుకోడానికి
ఈరోజు నాకు సబ్బులు, షాంపూలు కానుకగా పంపించావు.
వీటిని ఎప్పుడైనా చిన్నపిల్లల హత్యాచారాల రేపుల గురించి మాట్లాడే
పోనీ… మనుధర్మాన్ని, వర్ణాశ్రమధర్మాన్ని పొగిడే
నీ దుర్గంధ భూయిష్టమైన నాలుకను శుభ్రం చేయడానికి వాడావా అసలు?

నీ సిగ్గు మాలిన కానుకతో
నా ఆత్మ సమ్మానాన్ని అవమానపరిచావు.
నేనూ నీకో కానుక పంపిస్తా… తీసుకో!
అది నీ అహంకారాన్ని అణిచివేస్తుంది చూసుకో!
బాబా సాహెబ్ మాకు ఈ మలిన మైన సమాజాన్ని
శాశ్వతంగా శుభ్రం చేసే జ్ఞాన నిధులు ఇచ్చాడు.
అదే మాకు అత్యంత విలువైన కానుక.
నీవు మమ్మల్ని శుభ్రపరచడం కోసం సబ్బులు పంపించావు చూడూ…
అది అణిచివేత అహంకారం కాక మరేమిటి?
నీ బహిష్కరణ మా గాయాలనింకా పచ్చిగా చేశాయి.
నువ్వెవ్వరు అసలు సబ్బుల కానుక మా దళిత గ్రామానికి పంపడానికి
నీ జాలి మాకు అవసరం లేదు
నీకు బుద్ధి చెప్పడమే కావాలిప్పుడు.
మేము ఈ అవమానపు దుఃఖపు మనసులతో
ధిక్కార ప్రకటనలతో పాడే పాటలు
మాకు ఆత్మ సమ్మానాన్ని ఇస్తాయి.
నీతో పోరాడే స్వేచ్ఛని ఇస్తాయి.

రెండు పూటలా ఆకలి తీర్చుకోవడం కోసం…
నీ మలపు తట్టలు ఎత్తుతాను నేను.
లేక పోతే ఈ స్వతంత్ర భారత దేశంలో
ఆకలితో నిద్రపోతాను నేను.
విను…
నువ్వు ఇచ్చిన సబ్బులు షాంపూలు
నీ అహంకారాన్ని తృప్తి పరుస్తాయి కానీ
నా కడుపు నింపవు.

చూడు… చూడు…
నీ అధినాయకులు ఈ దేశపు దృష్టిని
ఆకర్షించడానికెలా బారులు తీరి కొలువైనారో?
మేం పొట్ట గడవని వాళ్ళం
బానిసల నవ్వుతో వాళ్లకు కనపడమని సంకేతం అందగానే
సబ్బులతో రుద్దుకొని తెల్లగా మెరిసిపోతూ వాళ్లెదురుగా నిలబడ్డాం.
అయినా…
మేం ఊరికే ఏమీ లేము!
మా లోపలి మనిషి
వాళ్ళ కుస్థిత మౌనాన్ని బద్దలు కొట్టినప్పుడు.,
ఈ విశ్వం వణికి పోదా… చెప్పు?

ఓ నాయకుడా! రా!
ఇలా వచ్చి ఒకసారి నా ఇల్లు చూడు.
నువ్వు నీ శరీరానికి చుట్టుకునే
కాషాయ కండువా కంటే కూడా శుభ్రంగా లేదూ?
ఏమేమో మాట్లాడుతున్నావు కానీ…
నీకు తెలీదు కాబోలు
నీ అంతరాత్మ శుభ్రంగా ఉన్నప్పుడే
నువ్వేదైనా మాట్లాడితే న్యాయంగా ఉంటుంది సుమా…!
కపటపు నవ్వు నవ్వుతున్నావు కానీ…
నీ చిరునవ్వు ఎప్పుడు బాగుంటుందో తెలుసా…
నీ గుండెల్లో వికృత నాట్యం చేస్తున్న
మనువుని కాల్చి బూడిద చేసినప్పుడు మాత్రమే…!

నీవు వెనక్కు తిరగక ముందే
అదిగో తెల్లవారింది.
ఇక…
నా నిశ్శబ్దం బద్దలు కానుంది.
ఇదుగో నీకు నా కానుక తీసుకో!
అవి ఏమిటో తెలుసా?
అంబేద్కర్, బుద్ధుడు!
తీసుకో…
ఫో! పోయి నీ మానసిక బానిసత్వాన్ని శుభ్రం చేసుకో!
ముందు నీ స్వార్థం కోసం నువ్వే సృష్టించిన
కులాన్ని, మనువుని నిర్మూలించు ఫో!
నీ కాషాయ కండువా నిర్మలమైన తెల్లని రంగు వచ్చేవరకు శుభ్రం చేసుకో…
అందుకు నా కానుక స్వీకరించు ముందు.
ఒక నిజం తెలుసుకో…
ఇక్కడ ఇద్దరు సూర్యుళ్ళు ఉండలేరు.
మాకు మా స్వంత సూర్యుడు ఉన్నాడు.
గుర్తు పెట్టుకో…
అతను మీ సూర్యుణ్ణి కాల్చి తీరుతాడు.!!!

(కవితా నేపథ్యం:
2017 లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ ఒక దళిత గ్రామాన్ని సందర్శించాల్సి వచ్చింది. అది దళిత గ్రామం కాబట్టి బ్రహ్మణికల్ భావజాలం తో వారిని స్వచ్ఛ పరిచే ఉద్దేశంతో, యోగి తను అక్కడికి వెళ్లేముందు వాళ్లకి సబ్బు, షాంపూలు, డిటర్జెంట్ పౌడర్ల కిట్లు మనిషి మనిషికి పంచి దళితులను శుభ్రంగా ఉండమని ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచమని చెప్పించాడట. ఈ విషయం లో అక్కడి దళిత సంఘాలు, గ్రామస్థులు తీవ్రమైన ఆగ్రహంతో నిరసన ప్రకటించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి దళితులకు ఈ అశుధ్ధ కానుక పంపి దళితుల ఆత్మసమ్మానాన్ని అవమాన పరిచినందుకు కవి, న్యాయవాది అంబెడ్కర్-పెరియార్-పూలే స్టడీ సర్కిల్ కో-ఫౌండర్ అసాంగ్ వాంఖడే నిరసనగా ఇంగ్లీష్ లో ‘Here is my offer’ అనే కవిత రాశారు. ఆ కవితకు ఇది తెలుగు అనువాదం… గీతాంజలి)

డా. భారతి : Psychotherapist & marital counselor. కలం పేరు గీతాంజలి. పుట్టిన స్థలం హైద్రాబాద్. ర‌చ‌న‌లు: 'ఆమె అడవిని జయించింది', 'పాదముద్రలు'. లక్ష్మి (నవలిక). 'బచ్ఛేదాని' (కథా సంకలనం). 'ప‌హెచాన్‌' (ముస్లిం స్త్రీల ప్రత్యేక కథా సంకలనం), 'పాలమూరు వలస బతుకు చిత్రాలు' (కథా సంకలనం), 'హస్బెండ్ స్టిచ్' (స్త్రీల విషాద లైంగిక గాథలు) 'అరణ్య స్వప్నం' (కవితా సంకలనం) సెప్టెంబర్ 2019 లో విడుదల అవుతుంది.

Leave a Reply