ఇది ఆమె ప్రపంచం

‘భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది.’ భూమి కదలిక వల్లే రాత్రింబవళ్లు యేర్పడుతున్నాయి. రుతువులు మారుతున్నాయి. కదలిక మార్పుకి కారణమౌతుంది. ఆ మార్పులో, ఆ కదలికలో మనం భాగమైనా అది భౌతిక దృష్టికి అందదు. ప్రత్యక్ష ప్రమాణాలకు లొంగదు. కార్యకారణ సంబంధం తెగదు. షాజహానా ‘మేరా జహా’ నవల చదువుతుంటే చిన్నప్పుడు చదువుకున్న భూభ్రమణం పాఠం బాగా గుర్తొచ్చింది. అయితే భూభ్రమణం సహజం. ఈ నేల మీద షాజహానా తిరుగాడిన ప్రపంచం మాత్రం నిర్మితం. ఆ నిర్మాణంలో మనుషులు స్వార్థంతో తయారు చేసిన అసహజతలు, అవకతవకలు యెన్నో వున్నాయి. అక్కడ మతం వుంది. కులం వుంది. ప్రాంతం వుంది. దేశం వుంది. వాటి కారణంగా గీసుకున్న యెన్నో గీతలున్నాయి. కార్పణ్యాలున్నాయి. విద్వేషాలున్నాయి. ఈర్ష్యాసూయలున్నాయి. కనిపించే/కనపడని ఆంక్షలున్నాయి. నిషేధాలున్నాయి. వ్యవస్థలున్నాయి. విధ్వంసాలున్నాయి. అవి చేసిన గాయాలున్నాయి. మిగిల్చిన కడగండ్లున్నాయి. కన్నీళ్ళున్నాయి. అన్నిటినీ ఆమె ప్రేమతో జయించింది. ఆత్మవిశ్వాసంతో అధిగమించింది. అనంతమైన ఆకాశంలోకి పక్షిలా యెగిరే స్వేచ్చా ప్రయాణం ఆమెది. స్వచ్చంద గమనం ఆమెది. అది కొందరికి కంటికి యింపు. మరి కొందరికి కంటగింపు. అయినా ప్రవాహంలా ఆమె కదులుతూనే వుంది. జలపాతంలా దూకుతూనే వుంది. సముద్రంలా యెగసి పడుతూనే వుంది. మంద మారుతంలా వీస్తూనే వుంది. పువ్వులా పరిమళాలు వెదజల్లుతూనే కరకు రాతి పర్వతంలా స్థిరంగానూ వుంది.

ఆమె సలీమా; ఆమె షాజహానా.

జీవితాన్ని ప్రయాణంతో పోలుస్తూ చేసిన రచన యిది. ఆ ప్రయాణంలో యెన్నో యెత్తు పల్లాలున్నాయి. చిక్కువడ్డ దారులున్నాయి. ఊహించని మలుపులున్నాయి. చీకటి వెలుగుల మజిలీలున్నాయి. శిశిర వసంతాలున్నాయి. ఆసరా యిచ్చే భుజాలున్నాయి. తోడు వచ్చే ఆత్మీయ స్నేహాలున్నాయి. తన కోసం చెమర్చే కళ్ళున్నాయి. పాతాళానికి తొక్కడానికి ప్రయత్నించే వుక్కు పాదాలున్నాయి. సాంత్వన పలికే కవిత్వ పాదాలూ వున్నాయి. జీవితాన్ని, ప్రపంచాన్ని గెలవాలనే జిగీష ఆమెను సామాజిక సాహిత్య రంగాల్లో నిలదోక్కుకోడానికే కాదు; శిఖరారోహణకు సైతం ప్రేరేపించింది. వెరసి – ఇది ఆమె అస్తిత్వం. ఇది ఆమె జీవితం. ఇది ఆమె ప్రపంచం. ఇది ఆమె ప్రయాణం.

ఆమె చేసిన ఆ ప్రయాణం ఇల్లూ వాకిలీ వూరూ వాడా వదిలి బయటి ప్రపంచంలోకి మాత్రమే కాదు. చాలా సార్లు అది లోపలి ప్రపంచంలోకి కూడా. ఆమె లోపలి ప్రపంచం బయటి ప్రపంచం కన్నా అగాథమైంది. సంక్లిష్టమైంది. గాఢమైంది. అది వజ్రం కంటే కఠినమైంది. పువ్వుకంటే సున్నితమైంది. అందువల్ల అనేక విధాలైన కథనాలు ‘మేరా జహా’ లో కనిపిస్తాయి. మనోవైజ్ఞానికంగా పరిశీలిస్తే సలీమా వ్యక్తిత్వంలోని బహుముఖాలు గోచరిస్తాయి. అప్పుడు సలీమా వొక పాత్రగా కాకుండా భిన్న వ్యక్తుల సమాహారమైన నమూనాగా చూడగలం. అంతేకాదు; సలీమా వ్యక్తిత్వాన్ని తెలుపు నలుపుల్లో కాకుండా బహుళ వర్ణ సమ్మిశ్రితంగా రూపొందించడంలో రచయిత్రి నిజాయితీ అర్థమౌతుంది.

ఆత్మ కథాత్మకమైన యీ నవలలో షాజహానా స్వీయ జీవితానికి సంబంధించిన యెన్నో ఘటనల్ని తవ్వి మనముందు కుప్పపోసే నెపంతో చుట్టూ వున్న సమాజంలో స్త్రీలు యెదుర్కొంటున్న అనేక సమస్యల్ని, వాటి భిన్న కోణాల్ని, చీకటి పార్శ్వాలని ఆవిష్కరించింది. ఆ క్రమంలో యింటా బయటా అమలవుతున్న అనేక వివక్షల్ని పదే పదే ప్రశ్నించింది. సమాధానాల కోసం అనుక్షణం అన్వేషించింది. అస్తిత్వ చైతన్యంతో ఆత్మగౌరవం కోసం నిరంతరం పోరాడింది.

సాహిత్య పరంగా చూసినప్పుడు యీ నవల నిర్దిష్టత సాధారణీకరణల మధ్య వూగే గడియారపు లోలకంలా భాసిస్తుంది. సలీమా జ్ఞాపకాల్లో కదిలే ‘నేను’ వొక్క నేను కాదు. అనేక నేనుల సమాహారం. ఆమె గొంతు సమాజంతో అనునిత్యం సంఘర్షించే భిన్న సమూహాలకు చెందిన స్త్రీల ఆత్మ గౌరవ స్వరాలకు ప్రతిధ్వని. స్త్రీల పట్ల అమలవుతున్న పాతుకుపోయిన పితృస్వామ్య విలువలపై ప్రకటించిన ఆగ్రహానికి ప్రతీక. కట్టుబాట్లు తెంచుకుని ముందుకు నడిచే మహిళా సాధికారతకు ప్రతినిధి. నిజానికి యేదీ వ్యక్తిగతం కాదు. వైయక్తికత సామాజికత విడదీయరానంతగా కలిసిపోయేలా చేసే సాహిత్య సృజన మాత్రమే బలంగా పాఠకుల హృదయాన్ని తాకుతుంది. వ్యక్తి స్వానుభవంలో సమూహాన్ని మిళితం చేస్తుంది. అప్పుడు మతం కులం ప్రాంతం వర్గం వంటి నిర్దిష్టతలు ప్రమేయాలు మాయమై మానవ వుద్వేగాలు సంవేదనలు ముందుకు వస్తాయి. అలా జరిగినప్పుడే రచన సఫలమౌతుంది. రచయిత సృజనాత్మకత సార్థకమౌతుంది. అటువంటి సాఫల్యం కోసం షాజహానా పడిన తపన నవల పొడవునా కనిపిస్తుంది.

రచయిత్రి ఆత్మకథని నవలగా మార్చడానికి అవసరమైన సృజనాత్మకతని జోడించింది. ఈ సృజనాత్మకతలో వూహాశాలీనత కన్నా కళాత్మకత యెక్కువ. ఆమె మాటల్లోనే చెప్పాలంటే స్వీయ జీవితానుభవాలకే అనేక వర్ణాల ‘చమ్కీ’లు అద్దింది. అందుకు అనుగుణమైన కవితాత్మక వాక్యాన్ని యెన్నుకుంది. కల్పనకి తావులేని సన్నివేశాల్ని సమకూర్చుకుంది. వ్యక్తుల మధ్య (పాత్రలు అనడానికి మనసు వొప్పడం లేదు) సంఘర్షణని ముందుకు తెచ్చింది. ప్రకృతిని అందులో భాగమైన మనిషిని ప్రేమించడమే లక్ష్యంగా సాగిన సలీమా వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దింది. అనేక సందర్భాల్లో స్వేచ్ఛకే ప్రాథమ్యం యిచ్చింది. కానీ అంతిమంగా ప్రేమ స్వేచ్ఛ యీ రెండింటి మధ్య సమతౌల్యం సాధించడానికి ప్రయత్నించింది. రెండింటిలోనూ బాధ్యత అవసరాన్ని గుర్తించింది. నవల పొడవునా వాటి మధ్య సంఘర్షణను చిత్రిస్తూనే వొక దానికి మరొకటి పూరకాలుగా వుండాలని గొప్ప సంయమనంతో రుజువు చేసింది.

సలీమా జీవితం బాల్యం నుంచి వొక నిషిద్ధ ప్రశ్న. అందరిలాగే మగా ఆడా మధ్య వేర్వేరు కొలతలు తూనికలు విలువల మధ్యే పెరిగింది. యవ్వనంలో అడుగిడిన సలీమా యెదుర్కొన్న వుద్వేగ భరితమైన అనుభవాలు ఆలోచనలు సందేహాలు సాహసాలు సవాళ్ళన్నీ దాదాపు ఆ వయస్సులోని యువతులందరివీ ( ‘భావాలన్నీ నావి కావు. నాతో పాటు సంచరించే అనేక స్త్రీల హృదయాలవి’ ). అయితే అవి నేర్పే పాఠాలు వొక్కొక్కరికీ భిన్నంగా వుండవచ్చు. వుంటాయన్న యెరుక కూడా రచయిత్రికి వుంది. తేనెటీగ వివిధ రకాల పూల తేనెని సమకూర్చినట్టు యెందరో స్త్రీల ఆత్మల్ని పట్టి తెచ్చి అక్షరాల్లో కూర్చానని ఆమే చెప్పుకుంది.

నిజానికి సలీమా ప్రపంచం చాలా చిన్నది. అది ఆమె చుట్టూనే తిరుగుతుంది. తన చుట్టూ వున్న ప్రపంచం కూడా ఆమె చుట్టూనే తిరుగుతుంది. ఆ పరిమితుల్లోంచీ విస్తృతం కావాలనే ఆమె ప్రయత్నం. తనను కమ్యూనిటీలో వున్న యితర స్త్రీలతో పోల్చుకుని చూస్తుంది. కమ్యూనిటీ లోపలా బయటా స్త్రీలపై అమలయ్యే పురుషాధిపత్యాన్ని విమర్శనాత్మకంగా విశ్లేషించింది.

సలీమా జీవితంలో తన స్వేచ్ఛకి, ప్రేమకి, యెదుగుదలకు అడ్డువచ్చిన ప్రతిదానితో సంఘర్షించింది. తనదైన వ్యక్తిత్వాన్ని నిలుపుకోడానికి కాపాడుకోడానికి అనుక్షణం రాపాడింది. తనను తాను నిర్మించుకోవడానికి వొక్కోసారి తానే ప్రతిబంధకమైనప్పుడు తనతోనే యుద్ధం చేసింది.

నవల కేవలం సలీమా జీవితమే కాదు. ఆమె దాదీ నానీ అమ్మీ ఆపా పుప్పమ్మా చిచానీ అత్తా ఆడబిడ్డ స్నేహితులు యిరుగు పొరుగు …‘జీతా జాగ్తా ముస్లిం స్త్రీల’ వాస్తవిక గాథలివి. పెళ్ళిళ్ళు పురుళ్ళు చదువులు వుద్యోగాలు రిజర్వేషన్లు యేవైనా కుటుంబంలో, సమాజంలో ద్వితీయ శ్రేణి పౌరులుగా స్త్రీలు అనుభవించే అనుభూతుల్ని తనదైన దృష్టికోణంతో ఆమె వ్యాఖ్యానించింది. జీవితాల్ని గెలవాలనే పట్టుదల యేదో మేరకు ఆ స్త్రీలందరిలోనూ కనిపించినప్పటికీ సలీమాకు ఆ గెలుపు పట్ల, చేరుకోవాల్సిన గమ్యాల పట్ల, చేరుకోవాల్సిన యెత్తుల పట్ల వొక ఖచ్చితమైన గురి వుంది. అదే ఆమెను విలక్షణంగా నిలిపింది.

పాల్వంచ, డోర్నకల్, ఖమ్మం, ఇల్లెందు, భద్రాచలం, కొండపల్లి, నెక్కొండ, కమలాపురం, పందిళ్ళపల్లె, నవభారత్, నల్గొండ, హైదరాబాద్ నగరం … యిలా ఆమె సంచరించిన చోటల్లా బాల్య కౌమార యుక్త ప్రౌఢ ప్రాయాల్లో సలీమా కుల మతాలకు అతీతంగా అందరితో స్నేహాలు చేసింది. బాంధవ్యాలు కలుపుకుంది. పదుగురి ప్రేమను పొందింది. నిష్కల్మషమైన ప్రేమను పంచింది. ఏ దశలోనూ యెవరి ముందూ తనను తాను కోల్పోకుండా వుంటూనే తప్పటడుగుల నుంచి ప్రయోగాల నుంచి వోటముల నుంచి యెప్పటికప్పుడు కొత్త పాఠాలు నేర్చుకుంటూ జీవిత పరమార్థాన్ని నిర్వచించుకుంది.

నిర్మాణ పరంగా చూసినప్పుడు నవలలో కనీసం మూడు ప్రారంభాలున్నాయి. కథంతా జ్ఞాపకాల స్వగతం. కానీ మోనోలాగ్ లో వుండే మొనాటనీని తొలగించడానికి రచయిత్రి మౌఖిక కథనాన్ని, మాండలిక భాషా వ్యక్తీకరణ రీతులతో సహా, స్వీకరించింది. అక్కడ కూడా అంతఃకథనాల్ని సృజించింది. ఉద్వేగభరితమైన జ్ఞాపకాల్ని తవ్విపోసే పనిలో రచయిత తెలియకుండానే వొకానొక ట్రాన్స్ లోకి జారుకుని మాట్లాడుతుంది. అప్పుడా కథనంలో చైతన్య స్రవంతి ధోరణి చోటుచేసుకుంటుంది. సమాజంలో జెండర్ పరంగా మత పరంగా కుల పరంగా ప్రాంత పరంగా యెదుర్కొన్న వివక్షల్ని చెప్పే క్రమంలో ఆత్మకథనం వైయక్తిక స్తరం నుంచి సామాజికత వైపు సాధారణీకరణం దిశగా నడిచింది. ఒక దశలో నవల కాల్పనిక లక్షణం వదులుకొని సామాజిక రాజకీయ ఉద్యమాల చారిత్రిక ఘటనల పరంపరగా రూపొందింది. ఆ యా సందర్భాల్లో స్త్రీవాద ముస్లిం వాద ప్రాంతీయవాద భావజాలాలు చర్చకు వచ్చినప్పటికీ (కమ్యూనిజానికి రచయిత్రి యిచ్చిన నిర్వచనం గమనార్హం) జీవితమే నవలకి మూలాధారమైన పునాదిగా వుంది. భిన్న భావజాలాలు జీవితాన్ని అర్థం చేసుకోడానికి వ్యాఖ్యానించడానికి వివరించడానికి తోడ్పడే పరికరాలే తప్ప అవి రచనకు ప్రాణభూతాలు కావనే యెరుకతో చేసిన రచన యిది. రచయిత్రి ఆలోచనలతో అందరికీ యేకీభావం వుండాలని కూడా ఆమె ఆశించలేదు. అది ఆమె మార్గం. అది గోరింట పంటల ఎర్రదనంతో ‘హర్యాలి’ పచ్చదనంతో నిండి వుండాలని ఆశంస.

కవయిత్రిగా కథకురాలిగా పరిశోధకురాలిగా గ్రంథ సంపాదకురాలిగా సాహితీ క్షేత్రంలో కృషి చేస్తున్న షాజహానా యిప్పుడు నవలా రచయిత్రిగా తానే ప్రధాన పాత్రై మన ముందుకు వచ్చారు. కేంద్రాన్ని విస్మరించకుండా (అదేంటో నేను చెప్పను, మీరే గ్రహించండి) బహుధా విస్తృతమవుతున్నారు. ఆమె సాధించిన యీ విస్తృతి యే దిశగా సాగుతుందో యెదిరి చూద్దాం.

కీ బోర్డ్ లో కంట్రోల్ ప్లస్ యస్ నొక్కి డాక్యుమెంట్ సేవ్ చేస్తుంటే పొద్దుణ్ణుంచీ టీవీలోచూపిస్తున్న రాఖీ కబుర్లే/దృశ్యాలే కళ్ళముందు కదలాడుతున్నాయి. నవల్లో వర్ణించినట్టు బతుకమ్మ, పీర్ల పండగ వంటి యెన్నో పండుగల్ని పల్లె జనం వొకప్పుడు మతాతీతంగా సామూహిక వుత్సవ సంరంభంతో కలిసిమెలిసి జరుపుకున్న సందర్భాలు యాదికొచ్చాయి. రాఖీ సందర్భంగా ఛోటీ బహెన్ షాజహానాకి నా నజరానా యిది.

రచయిత్రిగా షాజహానా చెప్పాల్సిందీ మనం వినాల్సిందీ యింకా చాలా మిగిలే వుంది. అంతేకాదు; ఆమె చెప్పినదాన్నుంచి తెలుసుకోవాల్సిందీ చాలా వుంది. కాలం అనంతం. పృథ్వి సువిశాలం.

ఆత్మీయాభినందనలతో …

  • 22 ఆగస్ట్, 2021

సాహిత్య విమర్శకుడు. తెలుగు కన్నడ రాష్ట్రాల్లో ముప్ఫై ఏదేళ్లపాటు సంస్కృతం – తెలుగు పాఠాలు చెప్పి రిటైర్ అయ్యారు. ‘తెలుగులో మాండలిక కథాసాహిత్యం’ పై పరిశోధన చేసి అదే పేరుతో ప్రచురించారు. స్త్రీ వాద కథలు, నిషేధ గీతాలు, డక్కలి జాంబ పురాణం, రెండు దశాబ్దాలు కథ , జానపద చారిత్రిక గేయగాథలు, బయ్యారం ఖ ‘నిజం’ ఎవరిది?, కన్నీటి సాగరాలొద్దురా మల్లన్నా, నోబెల్ కవిత్వం, అదే నేల (ముకుందరామారావు), తొవ్వ ముచ్చట్లు (జయధీర్ తిరుమల రావు ), యుద్దవచనం (జూలూరి గౌరి శంకర్), పాపినేని శివశంకర్ కథలు, తాడిగిరి పోతరాజు కథలు, రాయలసీమ : సమాజం సాహిత్యం (బండి నారాయణస్వామి), బహుళ - సాహిత్య విమర్శ : సిద్ధాంతాలు, ప్రమేయాలు, పరికరాలు (పర్స్పెక్టివ్స్), 50 యేళ్ల విరసం : పయనం - ప్రభావం … వంటి పుస్తకాలకి సంపాదకత్వ బాధ్యతలు వహించారు. ‘వేమన దారిలో’ పేరున ఎంపిక చేసిన వేమన పద్యాలకు వ్యాఖ్యానం చేసారు. ‘సమకాలీనం’ పేరుతో కథా విమర్శ పై వ్యాస సంపుటి వెలువరించారు. ప్రగతిశీల ఉద్యమ సాహిత్యాన్ని ప్రేమించే ప్రభాకర్ అస్తిత్వ ఉద్యమాలు శకలాలుగా కాకుండా ఏకోన్ముఖంగా సాగుతూ అంతిమంగా పీడిత జన విముక్తికి దారి తీయాలని కోరుకుంటున్నారు.

One thought on “ఇది ఆమె ప్రపంచం

  1. ఆమె కృషికి సరి అయిన సమీక్ష ..ఆమెకు మీకు అభినందనలు

    ముకుంద రామారావు
    హైదరాబాద్

Leave a Reply