ఇక ఎవరికీ వ్యక్తిత్వం లేదు

తెలుగు: పద్మ కొండిపర్తి

నా తరం ప్రతి లక్షణాన్ని ఒక వ్యాధి లక్షణంగా పరిగణించడంలో మునిగి ఉంది. మీరు బిడియస్తులు కాదు, మీరు ఆటిస్టిక్ (1). మీకు మతిమరుపు లేదు; మీకు ఎడిహెచ్‌డి (2) ఉన్నది.

“ఈ రోజుల్లో, ప్రతీ వ్యక్తిత్వ లక్షణాన్ని ఒక పరిష్కరించాల్సిన సమస్యగా చూస్తున్నారు. మరీ మానవ సహజమైనవి ఏవైనా సరే—అలవాటు, వింత ప్రవర్తన, మరీ తీవ్రంగా ఉండే భావోద్వేగం మొదలైనవాటన్నింటికీ ఒక ముద్ర వేసి, వివరించాల్సిందేనని అనుకుంటున్నారు. ‘థెరపీ భాష’ (చికిత్స భాష) మన వాడుక భాషను ఆక్రమించేసింది. ఇది మనం ప్రేమ, అనుబంధాల గురించి మాట్లాడుకునే విధానాన్ని పాడుచేస్తోంది. మన బాధ, వేదనల గురించి ఆలోచించే విధానాన్ని కుచించుకుపోయేలా చేస్తోంది. ఇప్పుడు, అసలు మనం ఎవరము అని చెప్పుకోవడానికి కూడా పదాలు దొరకడం లేదు. ఎవరికీ ఇప్పుడు ఒక వ్యక్తిత్వం అంటూ ఏమీ ఉండటం లేదు.

వాస్తవానికి, పరిస్థితి అంతకంటే దారుణంగా ఉంది. ఇప్పుడు, మన వ్యక్తిత్వాలే ఒక వ్యాధి అని మనకు నేర్పిస్తున్నారు. 2024 సర్వే ప్రకారం, 72 శాతం మంది జెన్-జెడ్3 అమ్మాయిలు “మానసిక ఆరోగ్య సవాళ్లు నా గుర్తింపులో ఒక ముఖ్యమైన భాగం” అని చెప్పారు. బూమర్ తరానికి (1946-1964) చెందిన పురుషులలో కేవలం 27 శాతం మంది మాత్రమే ఇలా అన్నారు. ఆధునిక జీవితంలో ప్రతిదానినీ—మానసికంగా, శాస్త్రీయంగా, పరిణామక్రమ రీత్యా—వివరించాలనే ఒక లోతైన ప్రవృత్తిలో ఇది ఒక భాగం. మనకు సంబంధించిన ప్రతిదానికీ ఒక కారణం ఉంది; ఆ కారణం వర్గీకరణలో ఉంటుంది; దానిని సరిదిద్దవచ్చు అని భావిస్తున్నారు. మనం సిద్ధాంతాలు, చట్రాలు, వ్యవస్థలు, నిర్మాణాలు, యంత్రాంగాల గురించి మాట్లాడుతున్నాము. కానీ వివరణ కోసం పాకులాడుతూ, మనం జీవితంలోని నిగూఢత్వాన్ని, మాధుర్యాన్ని, చివరకి మనల్ని మనమే కోల్పోయాము.”

“మనుషుల గురించి వర్ణించడానికి ఒకప్పుడు మనకున్న ఆప్యాయమైన, భావోద్వేగపూరిత పద్ధతులను మనం కోల్పోయాము. ఇప్పుడు మీరు దేనికైనా ఆలస్యంగా వెళ్తే, అది మీకున్న ముచ్చటైన మతిమరుపు వల్లో, లేదా మీకున్న గందరగోళం వల్లనో లేదా ఆసక్తి లేకపోవడం వల్లనో కాదు—కేవలం ‘అటెన్షన్-డెఫిసిట్/హైపర్ యాక్టివిటీ డిజార్డర్’ వల్ల మాత్రమే అని అంటున్నారు.

మీతో ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు మీరు సిగ్గుపడుతూ మీ కాళ్ళ వంక చూస్తుంటే, అది మీ అమ్మ పోలికనో, లేక మీరు ఆమెలాగే మృదువుగా ఉండి సిగ్గుపడుతున్నారనో కాదు—అది ‘ఆటిజం’ అని అంటున్నారు. మీరు ఇలా ఉండటానికి కారణం మీకు ఒక ‘ఆత్మ’ ఉండటం కాదు, మీకున్న లక్షణాలు, వ్యాధి నిర్ధారణలు మాత్రమే; మీరు మీ పూర్వీకుల అంశాల కలయికో, లేక విభిన్న లక్షణాల వింత సమాహారమో కాదు, కేవలం బాల్యంలో జరిగిన సంఘటనల తాలూకు ఒక వ్యాధి ఫలితం మాత్రమే.

మీలోని ప్రతి హృదయపూర్వకమైన, చిరాకు తెప్పించే, ఆసక్తికరమైన అంశాన్ని వర్గీకరించేసారు. మీ కుటుంబం మిమ్మల్ని ప్రేమగా వర్ణించే విధానానికి వైద్య రంగు పులిమేశారు. ఒకప్పుడు పెళ్లి ప్రమాణాల్లో రాసుకున్న, చనిపోయినప్పుడు నివాళిగా చదువుకున్న, చిరునవ్వుతో గుర్తుచేసుకున్న మనలోని అంశాలు… ఇప్పుడు డాక్టర్ల నోట్స్ లోనూ, మానసిక ఆరోగ్య అంచనాల్లోనూ, ‘బెటర్ హెల్ప్’ వంటి యాప్‌లలోనూ మిగిలిపోయాయి. మనం ఇప్పుడు మనుషులం కాదు. మనం ఎప్పుడో సరుకులుగా మారిపోయాము, ఇవన్నీ మనకు తగిలించిన లేబుల్స్ .

“మనం ఇప్పుడు ‘ప్రవర్తన’ గురించి కూడా మాట్లాడుకోలేకపోతున్నాం. ఇప్పుడు ఉదార స్వభావం ఉన్న మనుషులు ఎవరూ లేరు, కేవలం ‘నలుగురిని మెప్పించేవారు’ మాత్రమే ఉన్నారు. మనసులో ఉన్నది దాచుకోకుండా బయటపెట్టే స్త్రీపురుషులు ఇప్పుడు లేరు; వారిని కేవలం ‘ఆందోళనతో కూడిన అనుబంధం కలిగినవారు’ అనో, లేదా ‘ఒకరిపై ఆధారపడేవారు’ అనో అంటున్నారు. కష్టపడి పనిచేసేవారు ఎవరూ లేరు, కేవలం గాయపడినవారు, అభద్రతా భావంతో ఎక్కువ సాధించాలనుకునేవారు, లేదా విపరీతమైన ఆశలున్నవారు మాత్రమే ఉన్నారు.

మనం ఇతరుల అనుమతి లేకుండానే వారిని వర్గీకరించేస్తున్నాము. ఇప్పుడు, కాస్త తడబడే మన అమ్మలకు ఎప్పుడూ ‘గుర్తించని ఎడిహెచ్‌డి’ ఉందంటాం; మన మితభాషులైన నాన్నలకు తమకు ‘ఆటిజం’ ఉందని తెలియదంటాం; మన గంభీరమైన తాతయ్యలను ‘భావోద్వేగపరంగా ఎదగనివారు’ అని తేల్చేస్తాం. మనం—సహాయం చేస్తున్నామనే భ్రమలో—చనిపోయిన వారికి కూడా వ్యాధి నిర్ధారణ చేసేస్తున్నాం. అందుకేనేమో, జనాలు ఈ నిర్ధారణల విషయంలో ఇంత పట్టింపుగా ఉంటున్నారు; ఇవే అన్నిటినీ వివరిస్తాయని వాదిస్తున్నారు. వారు తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు; వారి వ్యక్తిత్వంలోని ప్రతి ముక్క ఈ వివరణల్లోనే ఉందన్నది వారి నమ్మకం.

మనం కేవలం వ్యక్తిత్వ లక్షణాలను మాత్రమే కోల్పోలేదు. ఇప్పుడు అనుభవాలు లేవు, జీవిత దశలు లేవు, అద్భుతాలు లేవు, నిగూఢత్వాలు లేవు… మనలో ఏం లోపం ఉందో తెలిపే ఆధారాలు మాత్రమే మిగిలాయి. జరిగే ప్రతిదానికీ ఏదో ఒక వివరణ ఇచ్చి కొట్టిపారేస్తున్నారు; దేనికీ మినహాయింపు లేదు. మనం ఒకరిని పిచ్చిగా, తర్కానికి అందకుండా ప్రేమిస్తున్నామంటే ఒప్పుకోలేము; లేదు, ఆ ప్రేమ వెనుక ఉన్న అసలు సంగతిని పసిగట్టడం, దాగి ఉన్న ఉద్దేశాలను వెతకడమే తెలివైన పని అని అనుకుంటున్నాము.

మనం ఎవరి ప్రేమలో పడ్డామనేది కేవలం ఒక అఘాతానికి వచ్చిన ప్రతిస్పందన మాత్రమే. ‘నీకు క్రష్ (పిచ్చిగా ఇష్టపడటం) లేదు; నీకు అనుంబంధానికి సంబంధించిన సమస్యలు ఉన్నాయి.’ బహుశా నిన్ను చిన్నప్పుడు గాయపరిచిన సంరక్షకుడిని అతను గుర్తుచేస్తుండొచ్చు. అసలు చెప్పాలంటే, ఇప్పుడు భావాలే లేవు—కేవలం అస్తవ్యస్తమైన నాడీ వ్యవస్థలు మాత్రమే ఉన్నాయి. మన ప్రతి మానవ అనుభవం ఒక ‘డేటా పాయింట్’; వాటన్నింటినీ సరిగ్గా అతికించడమే జీవిత పరమార్థం. గతంలో ప్రజలను ఎంత క్రూరంగా నిర్లక్ష్యానికి లోనయ్యారు అని ఆలోచించడానికి ఇది ఒక ఆరోగ్యకరమైన మార్గం.

“మనం పూర్వ తరాల కంటే ఎక్కువ జ్ఞానవంతులమనీ, భావోద్వేగపరంగా ఎక్కువ తెలివైనవారమనీ నేనిక నమ్మలేకపోతున్నాను. మా అమ్మమ్మ తనను తాను ఒక అమ్మమ్మగా, ఒక తల్లిగా, ఒక భార్యగా చూసుకుంటుంది; కానీ యువతరం మాత్రం తమ రుగ్మతలతోనే తమను తాము గుర్తించుకుంటున్నారు. ఆమె నిస్వార్థంగా ఉంటుంది, విషయాలను మనసుకి తీసుకుంటుంది; మనకేమో తిరస్కరణను తట్టుకోలేని స్థితి (‘రిజెక్షన్ సెన్సిటివ్ డిస్ఫోరియా’) ఉంటుంది. మనం ఇతరులను మెప్పించడానికి చేసే ప్రయత్నం ఒక ‘ట్రామా రెస్పాన్స్’ అంటాం. వాళ్ళు ఆత్మలు; మనం లక్షణాలు.

నిజమే, గతంలో కూడా నిజమైన సమస్యలు ఉండి, సరైన సహాయం అందని వారు ఉండేవారు. కానీ అదే పూర్తి నిజం కాదు; చాలామంది అప్పుడు సంతోషంగా ఉండేవారు, తమ గురించి తాము మరీ ఎక్కువగా ఆలోచించుకునేవారు కాదు, అసలు తమను తాము మైమరచిపోగలిగేవారు. ఆరు దశాబ్దాలుగా కాపురం చేస్తున్న మా తాతయ్య, అమ్మమ్మలను ‘మీరు ఒకరినొకరు ఎందుకు ఎంచుకున్నారు?’ అని అడిగాను. వారి దగ్గర నుండి తడబడుతున్న సమాధానం వచ్చింది. వాళ్ళు దాని గురించి ఎప్పుడూ పెద్దగా ఆలోచించలేదట. బహుశా నేను గతం గురించి మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నానేమో, కానీ మనం ఏదో కోల్పోయాము. ఆ క్షణంలో నాకు అర్థం కానిది ఒకటుంది: అదే ‘సరళమైన జీవన విధానం’. మనం ఇంత ఆందోళనలో, గందరగోళంలో ఉండి కూడా… గతంలో ఉన్న మనుషులను అసంపూర్ణమైనవారిగా, పరిష్కారం లేనివారిగా చూడటం మన అహంకారమే.

బహుశా అందుకేనేమో, నా తరం వారు బంధాలు; తల్లిదండ్రులుగా మారడం వంటి విషయాల్లో ఇరుక్కుపోతున్నారు. మనం తడబడే బాధ్యతలు, మనం తెగ చర్చించే నిర్ణయాలు, మనం పాటించడానికి కష్టపడే సంప్రదాయాలు… ఇవేవీ మనం అంత తేలికగా వివరించలేనివి. మనం వివరించలేని వాటిని వివరించడానికి ప్రయత్నిస్తున్నాము. ఒంటరిగా ఉండటంతో పోలిస్తే, ప్రేమలో పడటం సరైనదని వాదించడం కష్టం. ఎందుకంటే ప్రేమ సురక్షితమైనది కాదు, మన అదుపులో ఉండేది కాదు, ముఖ్యంగా అది తర్కానికి అందేది కాదు. పిల్లల్ని కనడం కూడా అంతే. వీటిని లాభనష్టాల పట్టికలో పెట్టి చూస్తే, అవి తార్కికంగా అనిపించవు. వాటిని లెక్కలేసి చెప్పలేము. పాత తరం వారిని ‘మీరు కుటుంబాన్ని ఎందుకు మొదలుపెట్టారు?’ అని అడగండి. తరచుగా, వారు దాని గురించి లోతుగా ఆలోచించి ఉండరు. బహుశా మనం నమ్మేలా చేసినంత పిచ్చిగా అది ఉండకపోవచ్చు, బహుశా అది అంత అజాగ్రత్తగా ఉండకపోవచ్చు, బహుశా అందులో ఏదో మానవత్వం ఉండి ఉండవచ్చు.”

“కానీ, ఈ తరంపైన సుమారు 38 బిలియన్ డాలర్ల విలువైన మానసిక ఆరోగ్య పరిశ్రమ ప్రభావం ఉందనేది నిజం. ఇంతకుముందు ఈ పరిశ్రమ ఉనికిలో లేదు. ఇంటర్నెట్ ద్వారా మనం ఎక్కువ విషయాలు తెలుసుకోగలుగుతున్నాము; అందుకే ప్రపంచం మరింత సంక్లిష్టంగా అనిపిస్తుంది. దీనివల్ల మనం నియంత్రణను, ఖచ్చితత్వాన్ని కోరుకుంటున్నాము. విషయాలకు కారణాలు ఏమిటో తెలుసుకోవడం ద్వారా మనం ఓదార్పు పొందుతున్నాము. అయితే, రోగనిర్ధారణల జరిగి, చికిత్స లేకుండా పనిచేయలేని యువతకు సహాయం అందుతున్నా, ఆ సంఖ్య మనం అనుకున్నదానికంటే చాలా తక్కువ. జీవిత పరమార్థం ప్రతిదానినీ వర్గీకరించి, వివరించడమేనని ఇంకెంతో మంది నమ్ముతున్నారు. అది వారిని దుఃఖానికి గురిచేస్తోంది.

ఈ ‘క్రూరమైన జ్ఞానం’ విముక్తినిస్తుందని మనం అనుకోవడం నాకు వింతగా అనిపిస్తుంది. ఈ స్వీయ-నిఘానే స్వేచ్ఛాయుతమైన జీవన విధానమని అనుకుంటున్నాము. వైద్య లేబుళ్ళలో బంధనాకు గురవడం ద్వారా మనం తక్కువ అణచివేతకు గురవుతున్నామని భావిస్తున్నాము. యువతరం తమ జీవితాలలో అత్యంత నిశ్చింతగా ఉండే కాలాన్ని తమను తాము పట రూపంలో గీయడానికి, కంపెనీలు, ప్రకటనల కోసం తమను తాము వర్గీకరించుకోవడానికి గడుపుతోంది. జీవిత అర్థం ప్రపంచంలో బయట కాకుండా, వారి తలల్లో మాత్రమే ఉందని మనం ఒక తరానికి నేర్పించాము. మనల్ని మనం అర్థం చేసుకునే ఈ దుర్భరమైన వ్యాపారాన్ని మనం తక్కువ అంచనా వేస్తున్నాము. తమ బాల్యాన్ని న్యాయసంబంధమైనదిగా విశ్లేషిస్తున్న అమ్మాయిలను చూస్తే నాకు బాధగా అనిపిస్తుంది—వారు ఇంకా బాల్యంలోనే ఉన్నారు; తమ ఆశను, బాధను, వేదనను శ్రేణుల్లో కుదించి, తమను తాము కేవలం ‘ట్రామా రెస్పాన్స్‌’లకు తగ్గిస్తున్నారు. ఈ తరంపై మనం రుద్దిన ఈ గుండె పగిలే అవగాహనను చూస్తే బాధ కలుగుతోంది. ప్రపంచం గురించి వారికి తెలిసినదల్లా ఈ సమరశీల శోధన, కారణాలను వెతకడమే. దేవుడా, వారు కోల్పోతున్న జీవితం ఎంత ఉందో!

“ఎందుకంటే మనం ఎప్పటికీ ప్రతిదానిని వివరించలేము. ఏదో ఒక దశలో మనం విశ్లేషణను ఆపివేసి, విషయాలను లోతుగా చూడటం మానేసి, తెలియనిదాన్ని అంగీకరించాలి. మనం నిజంగా సాధించగలిగేదల్లా విశ్వాసం మాత్రమే. బహుశా, మన గురించి మనకు కొంత హాస్యచతురత కూడా ఉండాలి. మానవులుగా ఉండటం నుండి కోలుకోవడం అసాధ్యం. అందుకే మానసిక ఆరోగ్య పరిశ్రమకు అంతులేని డిమాండ్ ఉంది. ఏదైనా విషయాన్ని ఎక్కువ కాలం వివరించడానికి ప్రయత్నిస్తే, మీకు ఒక రుగ్మత దొరుకుతుంది; మరీ లోతుగా తవ్వితే, మీరు అదృశ్యమవుతారు.

ఇప్పుడు ‘పని చేయడం’ చాలా ధైర్యమైన విషయం అని మనకు చెబుతున్నారు. కానీ ప్రతిదానిని వివరించకుండా ఉండటానికి, నియంత్రణను వదులుకోవడానికి, లోపలికి వెళ్ళాలనే ఆవేశాన్ని నిరోధించడానికి ధైర్యం కావాలని నేను అనుకుంటున్నాను. మనం ఎలా ప్రవర్తిస్తాము, ఎలా జీవిస్తాము, ఇతరులతో ఎలా వ్యవహరిస్తాము అనే దాని ద్వారా తప్ప, మనం మనల్ని మనం ఎప్పటికీ అర్థం చేసుకోలేమని అంగీకరించడం కూడా చాలా తెలివైన పని. మనం మన గురించి సరిపడా ఆలోచిస్తున్నాము. మనకు ఎక్కువ అవగాహన లేదా జవాబులు అవసరం లేదు. నా ఆందోళన ఏమిటంటే, ఒక తరం తమను తాము వివరించుకోవడానికి, తమ బలమైన భావాలను పరిష్కరించడానికి, తమ వ్యక్తిత్వాలను ప్రమాణీకరించడానికి, ప్రతి అనుభవాన్ని అర్థం చేసుకోవడానికి జీవితకాలం గడిపిన తర్వాత, వారికి ఉన్న ఏకైక సమస్య, మానవులుగా ఉండటమే అని గ్రహించవచ్చు.

కాబట్టి, వివరణ కోసం కాకుండా అనుభవం కోసం మిమ్మల్ని మీరు స్వేచ్ఛగా ఉంచుకోండి. సాధారణంగా ఉండటానికి ధైర్యం చేయండి. మీ భావాలను, నిర్ణయాలను, జ్ఞాపకాలను మార్కెట్ చొరబాట్లకు, నిపుణుల వివరణలకు అప్పగించకండి. వైద్య పరిశ్రమ ఆరోగ్యంగా ఉందని నిర్ణయించే వాటి నుండి భిన్నంగా వాటిని దాఖలు చేయనివ్వకండి. మిమ్మల్ని మీరు పరిష్కరించబడనిదిగా వదిలివేయండి. ఎవరికి తెలుసు? అదొక రహస్యం. నక్షత్రాలలోరాశి ఉన్నది. ఏదో తెలియని చోటి నుండి వచ్చింది. మీ వ్యక్తిత్వాన్ని అంటిపెట్టుకుని ఉండడం అంటే మీరు మానవులని ప్రకటించడంతో సమానం. మీరు ఒక వ్యక్తి; ఒక ఉత్పత్తి కాదు. వేరే వివరణ అవసరం లేదు.”

వివరణ:

  1. సామాజిక సంభాషణ, పరస్పర చర్య, పునరావృత ప్రవర్తనలలో ఇబ్బందులను ఎదుర్కొనే ఒక నాడీ సంబంధిత వ్యాధి
  2. అటెన్షన్ డెఫిసిట్/హైపర్ ఆక్టివిటీ డిసార్డర్: రోజువారీ జీవితంలో జోక్యం చేసుకునే నిరంతర అజాగ్రత్త, అతి చురుకుదనం, మొదలైన లక్షణాలు ఉండే నరాల సంబంధిత వ్యాధి. సామాజిక సంబంధాలు, విద్యా లేదా వృత్తిపరమైన పనితీరు, మొత్తం రోజువారీ పనితీరును ప్రభావితం చేస్తుంది. లక్షణాలు సాధారణంగా బాల్యంలోనే ప్రారంభమవుతాయి కానీ యుక్తవయస్సు వరకు కొనసాగవచ్చు మందులు- చికిత్సల కలయిక ద్వారా బాగుపరచవచ్చు.
  3. జెన్ Z అనేది 1997- 2012 మధ్య జన్మించిన మిలీనియల్ తరం తరువాత వచ్చిన జనాభా సమూహం. వారు ఇంటర్నెట్‌తో పెరిగారు; అనుకూలత, వైవిధ్యం, మానసిక ఆరోగ్యం, ప్రామాణికత లాంటి సమస్యలపైన శ్రద్ధ చూపడం ద్వారా వారిని “డిజిటల్ నేటివ్స్” అని పిలుస్తారు. 2008 మహా మాంద్యం, కోవిడ్-విపత్తు కాలంలో ఈ తరం డిజిటల్ యుగం రూపొందింది.

https://www.thefp.com/p/nobody-has-a-personality-anymore-culture-internet-society?utm_source=meta&utm_medium=paid-social&utm_campaign=intl&utm_content=personality&utm_adgroup=fevsu&utm_adid=120232096824970270&utm_id=120232090651140270&utm_term=120232090653150270&fbclid=IwY2xjawOOV5NleHRuA2FlbQEwAGFkaWQBqyfNJc1LjnNydGMGYXBwX2lkEDIyMjAzOTE3ODgyMDA4OTIAAR6CIk_h-RTjMrjQ01PzLIkmF2MaidTvkSdGfBJ8E-nDW-_5SyB35yjrTsSiJg_aem_k41rP7YpBoZNB8uVg0U8jg

Leave a Reply