ఇకనైనా మేలుకో మోడీ

ప్రపంచవ్యాప్తంగా సహజ వనరులు రోజు రోజుకీ క్షీణిస్తున్నాయి. వనరుల కొరత సమాజంలో అశాంతిని సృష్టించి హింసను ప్రేరేపిస్తాయి. ఆయా దేశాలు తమ మనుగడ కోసం సహజ వనరులను పొరుగు దేశాల నుండి కుట్ర పూరితంగా లేదా బలవంతంగానైనా తీసుకునే ప్రయత్నం చేస్తాయి. ఈ క్రమంలో దేశాల మధ్య ఉద్రిక్తతలు అవి యుద్ధాలకు దారితీస్తాయి. 21వ శతాబ్దంలో అమెరికా జరుపుతున్న ప్రత్యక్ష యుద్ధాలు, చైనా, రష్యా లు నిర్వహిస్తున్న పరోక్ష యుద్ధాలు ఈ కోవకు చెందినవే. మతోన్మాద చాందసంతో రాజ్యాలను విస్తరించుకునే శక్తులు కూడా యుద్ధాలను చేస్తున్నాయి. భారత్ చుట్టూ ఉన్న దక్షిణాసియా దేశాలలో చైనా, అమెరికాలు వివిధ ఒప్పందాలతో పాగా వేస్తున్నాయి.చైనా బర్మా తో, శ్రీలంకతో సహజవాయు వెలికితీత రవాణా ఒప్పందాలు చేసుకుంది. బంగాళాఖాతంలో సమృద్ధి ఉన్న సహజ వాయువుల పై కూడా చైనా, అమెరికా అదీన బహుళ జాతి కంపెనీలు కన్ను వేశాయి. ఈ చర్యలు భారతదేశ ప్రయోజనాలకు విపత్తుగా మారి ఒక అనివార్య యుద్ధానికి దారితీసే పరిస్థితులు ఏర్పడనున్నాయి. భారత్ తో సఖ్యత లేని సరిహద్దు దేశాలు, సరిహద్దు జలవివాదాలు, ఆసియా దేశాల మధ్య ఆసియా లో చెలరేగుతున్నా మతోన్మాద శక్తులు, అగ్రరాజ్యాలతో పాటు చిన్న చిన్న దేశాలు సముద్ర జలాలపై, అంతరిక్షం పై, సైబర్ సెక్యూరిటీ పై, విపరీతమైన పట్టును సాధించుకున్న సందర్భంలో భారతదేశం తన రక్షణ వ్యవస్థను పటిష్ఠంగా చేసుకోవాల్సిన అనివార్యత ఉంది.

సేవా పరమో ధర్మ అని భారత సైన్యం, నభా స్పర్షం దీప్తం అనగా వాయు దేవుడా “గగనతలంలో శత్రువులను ఓడించే శక్తినివ్వు” అని భారత వైమానిక దళం, శాన్ నో వరుణ అనగా “సముద్ర దేవుడా మాకు శుభమును ప్రసాదించు” అని భారత నౌకాదళం 26 జనవరి, 1950 నుండి భారత రక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. గౌరవం,విధేయత,అస్తిత్వ పతాకాలు త్రివిధ దళాలను నడిపిస్తున్నాయి. బ్రిటిష్ ఇండియా లోనే ప్రాథమికంగా రూపుదిద్దుకున్న త్రివిధ దళాలను స్వతంత్ర భారత పరిపాలకులు నెహ్రు నాయకత్వంలో రక్షణ వ్యవస్థ నిర్మాణానికి బలమైన పునాదులు వేసి విస్తరింపజేశారు. బ్రిటిష్ ఇండియాలోని బలమైన సంస్థానాల పరిధిలో ప్రజల ఆకాంక్షలను తెలుసుకొని సైనిక చర్యలతో వాటిని భారత్ లో విలీనం చేయించారు. చైనా పాకిస్తాన్ దేశాలు ఈశాన్య రాష్ట్రాలను కబళించే ప్రయత్నం చేసినప్పుడు వాటిని ఎదుర్కొని ఆయా ప్రాంతాలను భారత్ లో విలీనం చేయించారు. రక్షణ వ్యవస్థ కు సొంత ప్రతిపత్తి ఉండాలని స్వయం సమృద్ధి గా ఎదగాలని దానికోసం వందలాది శిక్షణ సంస్థలను, రక్షణ రంగ పరిశ్రమలను నెహ్రు స్థాపించాడు. BEL,BDL,HAL,BEML,ISRO,BARC,GRSE ,DRDO వంటి అనేక పరిశ్రమలను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో స్థాపించారు. 1971 రష్యాతో గౌరవప్రదమైన రక్షణ మైత్రి ఒప్పందం కుదుర్చుకుని త్రివిధ దళాలను పటిష్టంగా తీర్చిదిద్దాడు. శతాబ్దాలుగా వలస పాలనలో మదీనా భారతదేశానికి ఒక పటిష్టమైన రాజకీయ భౌగోళిక స్వరూపాన్ని ప్రజల ప్రగతికి, రక్షణకు కావాల్సిన మౌలిక రంగాలను తీర్చిదిద్దిన ఘనత జవహర్లాల్ నెహ్రూ కు చెందుతుంది.

ప్రస్తుతం అధికారంలో ఉన్న సంస్థల నేపథ్యం వర్తమానం పరిశీలిస్తే వళ్ళు గగుర్పొడిచే వాస్తవాలు కనిపిస్తాయి. సుదీర్ఘంగా కొనసాగిన భారత స్వాతంత్ర ఉద్యమాన్ని నిర్వీర్యం చేయడానికి, బ్రిటిష్ వారికి కోవర్టుగా పని చేసిన వ్యక్తులు స్థాపించిన సంస్థల వారసులే ప్రస్తుతం అధికారంలో ఉన్నారు. ప్రగతికి అడ్డంకిగా ఉన్న కులమత వ్యత్యాసాలు సామాజిక దురాచారాలు మొదలగు వాటిని నిర్మూలించే సంఘ సంస్కరణ ఉద్యమాలను దాడి చేసిన,చేస్తున్న చరిత్ర వీరిది. విదేశీ దాడుల నుండి కాపాడే రక్షణ వ్యవస్థలో దేశ అంతర్గత భద్రతను కాపాడే పారా మిలటరీ బలగాలలో సంఘ పరివారం నుండి చేరిన దాఖలాలు లేవు. జాతీయోద్యమానికి ద్రోహం చేసిన ఈ సంస్థ దేశ ప్రజల సహజీవన విలువలను భంగపరిచి, శాంతి భద్రతలను విచ్చిన్నం చేసి అధికారంలోకి రావడం కోసం సమాంతర సైన్యాలను నిర్మించుకుంది. ఈ పరివార్ మూకలు జరిపిన విధ్వంసాలతో 1948,1975,1992లలో మూడుసార్లు నిషేధానికి గురైంది. కుల మత వైషమ్యాలను రెచ్చగొడుతూ అన్యమతస్తుల ఊనికి మెజార్టీ మతస్థులకు ప్రమాదం అని చెబుతూ అధికారంలోకి వచ్చింది. భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఎవరు కూడా సైనిక చర్యలను త్యాగాలను రాజకీయ అధికారం కోసం వాడుకోలేదు. బిజెపి మాత్రం సైనికుల త్యాగాలను రాజకీయ అధికారం కోసం ఉపయోగించుకుంది.

భారత రక్షణ వ్యవస్థ నిర్మాణంలోనూ, పురోగతి లోనూ కనీస భాగస్వామ్యం లేని భారతీయ జనతా పార్టీ 2014లో అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు తీసుకున్న చర్యలు రక్షణ వ్యవస్థ ప్రాభవాన్ని క్షీణింప చేస్తున్నాయి. మేక్ ఇన్ ఇండియా నినాదం పచ్చి బూటకం గా తేలిపోయింది. రక్షణ రంగ కాంట్రాక్టులను ప్రభుత్వ సంస్థలకు తప్పకుండా నాటో దేశాలకు కట్ట పెడుతున్నాయి. ఉపగ్రహ రాకెట్లను, హెలికాప్టర్లను విమానాలను రూపొందించడానికి ఉన్న హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వంటి అనేక కంపెనీలను నిర్లక్ష్యం చేస్తున్నారు. అమెరికాతో 5 బిలియన్ డాలర్లతో అపాచీ హెలికాప్టర్లను ఇతర యుద్ధ విమానాలను దిగుమతి చేసుకోవడానికి ఒప్పందం చేసుకుంది. ఫ్రాన్స్ తో రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం, రష్యా తో ఆరు లక్షల రైఫిల్ లు, జలాంతర్గాములు కొనుగోలు ఒప్పందం, ఇజ్రాయిల్ తో లైట్ మిషన్ గన్నులు,ఎయిర్ బోర్న్ వార్నింగ్ సిస్టంలు, డ్రోన్ల కొనుగోలు ఒప్పందాన్ని మోడీ ప్రభుత్వం చేసుకుంది. రక్షణ రంగంలో విదేశీ ప్రత్యక్ష నిధుల అనుమతి ఇవ్వడం, దేశీయ కార్పొరేట్ అనిల్ అంబానీ కి కొన్ని రక్షణ కాంట్రాక్ట్ ఇవ్వడం వంటి అనేక అనైతిక చర్యలను మోడీ ప్రభుత్వం నిర్వహించింది.

భారత రక్షణ వ్యవస్థ తాత్వికతను, నిర్వహించిన మహత్తరమైన పాత్ర పట్ల అవగాహన లేని మోడీ ఇప్పుడు అగ్నిపథ్ పేరుతో కాంట్రాక్ట్ సైనిక వ్యవస్థను తీసుకొచ్చాడు. 2013 హర్యానాలో మాజీ సైనికులను ఉద్దేశించి మాట్లాడుతూ వన్ ర్యాంక్ వన్ పెన్షన్ విధానాన్ని అమలు చేస్తానని ప్రకటించాడు. ఇప్పుడు నో రాంక్ నో పెన్షన్ అంటూ అగ్ని వీరులను భర్తీ చేయడానికి పూనుకుంటున్నాడు. రక్షణ రంగంలో దీర్ఘకాలం పూర్తి సమయంతో ఉద్యోగం చేయడానికి దేశభక్తి,త్యాగగుణం, జీవన భద్రత ,హోదా ,గౌరవం, పెన్షన్ వంటి అంశాలు ప్రాతిపదికగా పనిచేస్తాయి. ఉనికిలో ఉన్న 15 సంవత్సరాల సర్వీసు,పెన్షన్ సౌకర్యం ఇక ముందు రక్షణ వ్యవస్థలో ఉండబోదు.

సాంకేతిక నైపుణ్యాల అధ్యయనం అత్యుత్తమ శిక్షణ, అనుభవం ఉన్నవారే పదాతి, వైమానిక, నౌకాదళాలలో అత్యుత్తమ ప్రదర్శన ఇస్తారు. అగ్ని వీరులకు ఇచ్చే ఆరు నెలలు శిక్షణ, మూడున్నర సంవత్సరాల సంవత్సరాల ఉద్యోగం కాలంతో తన పరిపూర్ణమైన శక్తిసామర్థ్యాలను ప్రదర్శించలేడు. పని చేసిన కాలంలో లో కూడా అభద్రత, భయాలతో భావోద్వేగంతో కూడిన సామర్ధ్యాలతో పని చేయలేడు. 1/4 వంతు మాత్రమే కొనసాగిస్తామనే నియమం వల్ల అగ్ని వీరులలో అనేక అనైతిక పెడ ధోరణులు తలెత్తే అవకాశం ఉంది. కాంట్రాక్టు సైనికవ్యవస్థ కలిగి ఉన్న కొన్ని మధ్య ఆసియా, ఐరోపా దేశాలలో తలెత్తిన అంతర్ యుద్ధాలలో కిరాయి సైనికులుగా మరి జన హనన యుద్ధాలలో పాల్గొన్న చరిత్ర ఉంది.

భారతదేశ చరిత్రలో కూడా 1857 ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం లో మత ప్రాతిపదికన జరిగిన సైనిక విభజన సైనిక తిరుగుబాటుకు దారి తీసింది. కాంట్రాక్ట్ రక్షణ సిబ్బంది, ఉద్యోగ భద్రత ఉన్న రక్షణ సిబ్బంది అనే తేడాలు ఉండడంవల్ల రక్షణ వ్యవస్థలో తలెత్తే అవాంఛనీయ ధోరణులు దేశ రక్షణకు, అంతర్గత భద్రత పెను ముప్పు వాటిల్లే అవకాశం ఉంటుంది. రక్షణ వ్యవస్థ నియామకాలలో సమాఖ్య స్ఫూర్తికి భిన్నంగా కొన్ని ప్రాంతాలకు, కొన్ని సమూహాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉన్నది. దీనిని కొనసాగిస్తూనే నియమకాలలో అన్ని రాష్ట్రాలకు సమ న్యాయాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. రక్షణ వ్యవస్థలో మానవ వనరులను సాంకేతికతను మిళితము చేసే విధానంలో భర్తీ కార్యక్రమాలను రూపొందించాలి.

ప్రస్తుతం దేశంలో 45 కోట్ల మంది ప్రజలు ఉపాధి కోసం ఎదురు చూస్తున్నారు. ప్రజలు ఉపాధి ఉద్యోగిత కోసం ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాల కల్పన చేస్తానని ఎన్నికల హామీగా నరేంద్ర మోడీ పేర్కొన్నాడు. 80 లక్షల పైగా కేంద్ర ప్రభుత్వ అ ఆధీనం లో ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. ఇవాళ 10 లక్షల ఉద్యోగాలను నింపుతాం అని ప్రకటించాడు. ప్రకటనలు కార్యాచరణ ఇంకా ప్రారంభం కాలేదు. జాతి సంపదను వనరులను విదేశీ స్వదేశీ పెట్టుబడిదారులకు కారుచౌకగా కట్టబెట్టాడు. వ్యయం తగ్గించుకోవడం నెపంతో ప్రభుత్వ రంగ సంస్థలను వదిలించుకుంటున్నారు. ఇప్పుడు అనూహ్యంగా దేశ గౌరవానికి ప్రతీకైన రక్షణ వ్యవస్థలో ప్రతిఘాతుక సంస్కరణలు చేపడుతున్నారు. ప్రజల జీవన ప్రమాణాలు ప్రాతిపదికగా లేకుండా వైషమ్యాలను రెచ్చగొట్టి అధికారంలో కొనసాగిన హిట్లర్, ముస్సోలిని లను చరిత్ర ఈసడించుకుంది. ఆ స్థితి దాపురించక ముందే మేల్కొని రాజ్యాంగబద్ధంగా పరిపాలించాలి. సర్వ సత్తాక సహజీవన విలువలు కాపాడాలి. విధానాల రూపకల్పనలో ప్రతిపక్ష పార్టీలు వివిధ రంగాల నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలి. లేకపోతే అంబేద్కర్ చెప్పినట్లు “రాజ్యాంగ సభ ఎంతగానో శ్రమించి నిర్మించిన రాజకీయ ప్రజాస్వామ్య వ్యవస్థనును అసమానతలతో, వివక్షతలతో, నిరుద్యోగంతో బాధ పడుతున్న ప్రజలు విధ్వంసం చేస్తారు” ఇప్పుడు అది ఆరంభమైనట్లుగా కనిపిస్తున్నది.

పత్రికా రచయిత, కవి. స్వగ్రామం-కడవెండి. ఉస్మానియాలో వృక్షశాస్త్రం, తత్వశాస్త్రం లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. వృత్తి- ప్రిన్సిపాల్, ప్రభుత్వ జూనియర్ కళాశాల, సమ్మక్క సారక్క తాడ్వాయి, ములుగు జిల్లా. సామాజిక సాహిత్య విద్యా పాఠశాల గా నడిపించే దొడ్డి కొమురయ్య ఫౌండేషన్ వ్యవస్థాపకులు. తెలంగాణ ఇంటర్ విద్య గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. సామాజిక కార్యకర్తగా, పోటీ పరీక్షల శిక్షకుడిగా పని చేస్తున్నారు.

One thought on “ఇకనైనా మేలుకో మోడీ

  1. ఈ సంక్షోభ సందర్భానికి చాలా అవసరమైన ఆర్టికల్ సవివరంగా రాశారు. ధన్యవాదాలు శ్రీనివాస్ గారూ

Leave a Reply