ఆ ఒక్క క్షణం

ఆ ఒక్క క్షణం నీ ఆలోచనను
ముక్కలు ముక్కలుగా విరిచేసి చూడు,
అప్పుడు నీ ముందు ఎన్ని అనుభవాలు
ఎన్నెన్ని ఆశయాలు నిలబడతాయో..!

పగలు రాత్రులను నిశ్శబ్దంగా తడిపేసే
నీ తడి కనులు,
ఒంటరైపోయిన నీ ఎడారి గుండెతో
చెప్పుతుండొచ్చు నీ నుండి నువ్వు వేరవ్వడం ఇప్పుడు అత్యవసరమని!

అప్పుడు…
నీలోని మానసిక వేదన మేఘాలు
నిన్ను నల్లగా కమ్మేయొచ్చు,
నీ చుట్టూ ముసిరిన నిరాశల వరదలు నిన్ను నిలువెత్తుగా ముంచేయొచ్చు,
నీ గొంతులోని మాటలన్నీ కూడా
కాలం చేయొచ్చు…!
నిన్ను శూన్యంలోకి నెట్టేస్తూ ఉండొచ్చు.
అప్పుడు నీకక్కడ నిర్జీవ శక్తులన్నీ ఎదురై
నీ జీవాన్ని తాగడానికి రమ్మని పిలుస్తూ ఉంటాయి

దశకంఠుడులా మారిన ఈసమాజంలో
ఒకరికొకరు కరువైపోతున్నారనేది
చెప్పకూడని రహస్యంగా బతికేస్తుంటే..
పూల మంటలుగా మారిన
నీ బాధలెవరికి వినబడక
నీ నీడతోనే సహజీవనం చేస్తూ ఉంటాయి.

ఆ సహజీవనానికి
ఈ రాత్రే నువ్విప్పుడు
విడాకులు ఇవ్వడం అనివార్యమని తెలుసుకోవాలి…

ఆ క్షణానికి గనుక నువ్వు మోసంచేస్తే
రేపొద్దున నువ్వు చూసే ఉదయం
నీకొక తొలి ఉదయంగా జన్మిస్తుంది.

పుట్టిన ఊరు వరంగల్ జిల్లా ఘన్‌పూర్‌ స్టేషన్. కవయిత్రి, ఉపాధ్యాయురాలు. M.Sc (Physics), M.A.(Sociology), B.Ed. చదివారు. రచనలు : ఆమె తప్పిపోయింది(కవితా సంపుటి). స్కూల్ అసిస్టెంట్ (మ్యాథ్స్)గా పనిచేస్తున్నారు. వివిధ పత్రికలు, వెబ్ మేగజీన్ లలో కవిత్వం అచ్చయింది.

One thought on “ఆ ఒక్క క్షణం

Leave a Reply