ఆలోచనల్లో ముంచెత్తే కవిత్వం

సూక్ష్మజీవి అంటే కంటికి నేరుగా కనబడని అతి చిన్నజీవి. కానీ, ఈ పుస్తకంలో “సూక్ష్మజీవి” అంటే సమాజంలో అంతర్లీనంగా జరుగుతున్న విషయాల కలయిక. అమ్మ ఆకలిని వదులుకొని, ఎన్నో కలలను చంపుకొని మన కోసం జీవిస్తుంది. అమ్మ మొదటి ముద్ద, స్పర్శ. కానీ, రేపటి యుగానికి మాత్రం అమ్మ, ఆడపిల్ల ఇద్దరూ వద్దు. ఎందుకంటే మనుషులకు ఆడపిల్ల ఒక బరువుగా మారింది.
ఆడపిల్ల రాల్చిన రక్తపు బొట్టు నుంచి అందరూ బయటకు వచ్చారు. ఒక తల్లికి ఆడపిల్ల పుట్టడం క్రోమోజోమ్ కలయికైనా కాని ఆడపిల్ల పుడితే మాత్రం ఆ తప్పు తనదే అని ఆలోచిస్తూన్న మూర్ఖపు మనుషులు ఉన్న సమాజంలో మనం బతుకుతున్నమా అనే అనేక ప్రశ్నలను బాలు అగ్నివేష్ మన ముందు ఉంచాడు.

నేను చాలా కవిత్వ పుస్తకాలు చదివాను. కానీ, ఇంత సులువైన పదాలతో రాసిన కవిత్వం చదవడం ఇదే మొదటిసారి.

“ఉరితాళ్లే ఉయ్యాలలై
ఊగిన మెడలెన్నో
మిగిలిపోయిన కలలు ఎన్నో “
ఇక్కడ అందరి కలలు చెదిరిపోయాయి. అభివృద్ధి, అప్డేట్ అవుతున్న మనుషుల వల్ల పొలానికి నాగలి, మగ్గానికి దారం… ఇలా అన్ని కులవృత్తులు కనుమరుగు అవుతున్నాయి. కులవృత్తులకు దూరమై, జీవితం భారమై మరణించిన వారు ఎందరో. వారి సమాధులపై నిర్మించిన అద్దాల మేడలు ఎన్నో అని వాస్తవాలను వెలికితీశాడు.

రైతులు ఈ దేశానికి వెన్నెముక. కానీ, వాళ్ల జీవితం చినుకుతో ముడిపడింది. పంటను పండించడానికి గుప్పెడు వరి గింజల కోసం, ఆ చినుకు రాక కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్లు పంట పడించకపోతే మనుషులు ఆకలితో చనిపోతారు. కానీ, ఎన్నెముకలు, పంటలు నాశనమై, ప్రకృతి విపత్తులకు కరువుకు, నేల నెర్రలు బారి ఇప్పటికే ఆ గుండెలు ఆగిపోతుందని రైతుల గోసను మన కళ్ళ ముందు ఆవిష్కరించాడు.

సూక్ష్మజీవి కంటికి కనిపించని ఒక చిన్న కణం. కానీ, అదే మనిషికి జీవులకు రూపం ఇచ్చింది. ప్రపంచాన్ని తయారు చేసింది. ఈ భూమి పై ప్రతి అణువులో ఒక జీవి ఉంది. కానీ, మనిషి అభివృద్ధి అని ఈ భూమిపై అణువులను, జీవులను నాశనం చేస్తున్నాడు. అదే అగ్ని పర్వతం బద్దలై ఊర్లను మింగింది. ఆమ్ల వర్షమై భూమిని నాశనం చేసింది. చెత్తను పారేసి ఈ వైరస్ కు కారణమైంది. ఇలా ఎన్నో ప్రకృతి విపత్తులకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మనుషులే కారణం అవుతున్నారు. కానీ, ఆ తప్పు మాదే అని ఒప్పుకోరు.

కులం, మతం, ప్రాంతం అనే భేదంతో నా దేశం అనేక గాయాలతో విడిపోయింది.
‘‘పాలస్తీనా నీ దేహం ముక్కలైంది,
నీ దగ్గర మనుషులు చనిపోయారు
అది ఈ స్వార్థపు మనుషుల తప్పు అని తెలిసినా
సంఘీభావం తప్ప ఏమి చేయలేని
నా నిస్సహాయ స్థితిని క్షమించు…’’ అని సంఘీభావం తెలిపాడు. 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో మూడు రంగుల జెండా మనుషులను విడదీసి ఆ స్వాతంత్ర్యం వెలివాడకు రానీయకుండా జాతి, వర్ణ, కులం వివక్షను ఎదుర్కొంటూనే ఉంది. కానీ, దానికి కారణం ఈనాటికీ రాజకీయం. అది ఈ వివక్షతో పాలించినంత వరకు ఈ దేశం కోసం కలలు కన్న ఆ మహనీయుల కల నెరవేరదు. వాళ్లు విగ్రహాలల్లో, మాటల్లోనే ఉంటారనీ… అందుకే ఈ దేశం నిరసన ఎప్పుడూ ఒక నిరాశను మిగిలిస్తుందని తెలియజేశాడు.

“మనిషి ఒక ముగింపు వాక్యం” హక్కుల కోసం మాట్లాడిన, ప్రజల కోసం మాట్లాడిన, నిలబడిన, న్యాయం అడిగినా కారాగారం దేశద్రోహివి అని నా దేశం బిరుదును ఇస్తుంది. ఈ దేశంలో న్యాయం ఒక అమ్ముడు సరుకు. అందుకే ఈ మనుషుల గొంతు మూగబోయింది. మైరాకు మాత్రం ఇవి ఏవీ లేవు. ఈ ఆలోచన లేని మనుషుల మధ్య నువ్వు లేనందుకు ఆనందంగా ఉంది అన్నాడు. ఈ అమానవీయ వ్యవస్థ వల్లనే నా దేశం వెలుగులో బతుకుతున్న చీకటి రాజ్యం.

సెక్స్ ఎడ్యుకేషన్ అందించడం వల్ల పిల్లలను రక్షించవచ్చు. ఆ విద్యను ఎవ్వరూ నేర్పరు. అందుకే ఈ దేశంలో రాత్రివేళల్లో ప్లై ఓవర్ కింద వ్యభిచారం కూడా వ్యాపారంగా సాగుతూనే ఉంది. దానికి కారణం పేదరికం. పాలకులు అవినీతికి పాల్పడడం ప్రధాన కారణమన్నారు. పాట మనిషి మనసుకు ఆనందాన్ని ఇస్తుంది. పాట సినిమాలో, పోరాటంలో ఒక భాగం. మనిషి ఆలోచనకి అర్థాన్ని ఇస్తుంది. కానీ, ఇప్పుడు ఉన్న పాటలో డీజే చప్పుడు తప్ప ఏమి లేదు. అందుకే పాట మాయమైపోయింది, సాహిత్యం తగ్గిపోతుందని అన్నాడు.

కులం, మతంతో ఎన్నో ప్రేమ జంటలు విడిపోతున్నాయి. కానీ, ఏ హద్దులు లేని ప్రేమను కలగంటూ ఆన్లైన్లో ప్రేమలేఖను పంపాడు. ఇండ్ల కోసం కూడా కులం , మతం అడ్డు రావడం ఒక బాధాకరమైన విషయం. ఎందుకంటే మనుషుల మధ్య, దేశాలు, ప్రాంతాల మధ్య అంటరానితనం ఇప్పుడూ అప్పుడూ ఒక నిషేధమే. అందుకే ఈ దేశం అన్నీ ఉన్నా (crisis) క్రైసిస్ లోనే ఉంది.

ముగింపు: ఈ పుస్తకంలో కవితలు ఆలోచనలను పుట్టిస్తాయి. అనేకానేక సంఘటనలను గుర్తు చేస్తాయి. ఈ దేశంలో ఉన్న వివక్షను, రైతుల జీవితాన్న, అభివృద్ధి పేరిట కొనసాగుతున్న విధ్వంసం గురించి, నీలిమేఘం , కృత్రిమ మేధా సంపద గురించి ఇలా అనేక విషయాల గురించి రాసాడు. ఈ పుస్తకం మన హృదయాలను తట్టి లేపుతుంది. ఆలోచనల్లో ముంచెత్తుతుంది.

పుస్తకం : సూక్ష్మజీవి
కవి : బాలు అగ్నివేష్
ప్రచురణ : ఎన్నెల పిట్ట

కవయిత్రి. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం. ఎస్సీ (కంప్యూటర్ సైన్స్) చదువుతున్నారు.

One thought on “ఆలోచనల్లో ముంచెత్తే కవిత్వం

  1. టెక్నాలజీ పెరుగుతున్నా కొలది మాతృత్వం ఒక యాంత్రికంగా మారుతోంది…దేశగమనం శిలావస్థకై పయనమవుతుంది…🙏🏼🙏🏼

Leave a Reply