వివక్షపై గళమెత్తిన ఆఫ్రో -అమెరికన్ రచయిత్రి ఆలిస్ వాకర్

“No person is your friend who demands your silence, or denies your right to grow.”
“The most common way people give up their power is by thinking they don’t have any.”–Alice Walker

టార్చర్

వాళ్ళు మీ అమ్మని హింసించినప్పుడు ఒక మొక్కను నాటు
మీ నాన్నను హింసించినప్పుడు కూడా ఒక మొక్కను నాటు
మీ తమ్ముడు, చెల్లెళ్లను హింసించినప్పుడు కూడా మొక్కలనే నాటుతూ పో
అంతే కాదు… మీ నాయకులను, ప్రేమికులను చంపినప్పుడు కూడా మొక్కల్ని నాటు
వాళ్ళు నిన్ను మాట్లాడమని హింసించినప్పుడు కూడా మొక్కను నాటు
కానీ, చూడు! వాళ్ళు నువ్వు నాటిన మొక్కలనే హింసించి, అడవినే నరికేయాలని చూసినప్పుడు మాత్రం
వాళ్ళే తిరిగి మరొక యుద్దానికి పూనుకున్నట్లే!
మనల్ని వాళ్ళతో యుద్ధానికి సన్నధం చేసినట్లే!

***

ఇది పంతొమ్మిదవ శతాబ్దానికి చెందిన ఆఫ్రో-అమెరికన్ కవయిత్రి , రచయిత్రి ‘ఆలిస్ వాకర్’ రాసిన కవిత్వం. ఆఫ్రికన్ దేశాలలో నల్లజాతి ప్రజలమీద వర్ణ వివక్ష హింసాత్మకంగా మారుతున్న కాలంలో రచయిత్రిగా, హక్కుల కార్యకర్తగా తన నిరసనని, ధిక్కారాన్ని సాహిత్య రూపంలో తెలిపిన నల్లజాతి సాహితీ యోధురాలు. మనిషి కష్టపడి సృష్టించుకున్న ప్రతీది, ప్రాణంతో సహా శత్రువు ధ్వంసం చేస్తున్న ప్రతీసారీ మళ్ళీ పునః సృష్టించి ధైర్యంగా నిలబడాలని చెబుతుంది. అమ్మని, నాన్నని, కుటుంబ సభ్యులందరినీ ఆఖరికి నిన్ను చంపినప్పుడల్లా ఒక చెట్టుని నాటమంటుంది. చెట్టుని ఆశకు, ఆత్మవిశ్వాసానికి, కొత్త ప్రారంభానికి ప్రతీకాత్మకంగా వాడుతుంది . ఇక చెట్లను, అడవులనే నరకడానికి వచ్చినప్పుడు వాడి వినాశనాన్ని వాడే కొని తెచుకున్నట్లు అనుకోమంటుంది. అంటే అది యుద్ధ ప్రకటన కాక మరేమిటి? ఆలిస్ వాకర్ వర్ణవివక్ష మీదే కాదు, లింగ వివక్ష మీద కూడా ఎన్నో రచనలు చేసింది. నల్ల జాతి పేద స్త్రీ ఎదుర్కొన్న జాత్యహంకార దాడులని ఎదుర్కొన్న ఆఫ్రికన్ మహిళ జీవితం గురించి ఆమె రాసిన “ది కలర్ పర్పుల్” నవల ‘నేషనల్ బుక్ అవార్డు’ మాత్రమే కాదు ‘పులిట్జర్ అవార్డు’ని కూడా తెచ్చుకుంది. అంతే కాదు ఆలిస్ వాకర్ ఎన్నో కవితా సంకలనాలు, విమర్శా వ్యాసాలు, ఫిక్షన్, నాన్ ఫిక్షన్ రచనలు చేసింది. అన్నీ కూడా జాత్యహంకార వ్యతిరేక సాహిత్యమే. జాత్యాహంకారంతో ఊపిరాడక విల విల లాడిన నల్లజాతిప్రజల కన్నీటి కథలు. ఆమె రాసిన “Overcoming Speechlessness” కవితా సంకలనం లో రువాండా , తూర్పు కాంగో, పాలస్తీనా, ఇజ్రాయిల్ దేశాల్లో జరిగిన జాతి హననాలను అత్యంత ఆగ్రహంగా, ఆర్ద్రంగా రాసింది ఆలిస్ వాకర్.

***

‘ఆలిస్ మాల్సేనియర్ తాల్లుల్లాహ్ కేట్ వాకర్’ జార్జియా లోని ఈటన్టన్ లో ఫిబ్రవరి 9, 1944 లో బీద కుటుంబంలో జన్మించింది. ధనవంతులైన భూస్వాముల భూమిలో వ్యవసాయం చేసి పంటలో కొంత తీసుకుని జీవనం సాగించే బీద రైతు కుటుంబం. ఆమె తల్లి ఎనిమిది మంది పిల్లలని పోషించడానికి ఇళ్లల్లో బిడ్డల సంరక్షకురాలిగా పనిచేసేది.

ఎనిమిదేళ్ల వయసులో ఆలిస్ ఇద్దరు సోదరులతో ఆడుకుంటున్నప్పుడు వారి చేతుల్లోని తుపాకీ పేలడంతో పెల్లెట్లతో ఆమె కుడికన్ను గాయపడి చూపు కోల్పోయింది. ఆసుపత్రిలో చూపించడానికి కూడా ఆలిస్ తండ్రి వద్ద డబ్బు లేకుండింది. దాని వల్ల ఆమె కంటి లో తెల్లటి మచ్చ ఏర్పడి బయటకి కనిపిస్తుండేది. ఈ గాయం ఆలిస్ ను జీవితాంతం వేధించింది. తోటి పిల్లలు వెక్కిరించినప్పుడల్లా ఆమె విపరీతమైన ఆత్మనూన్యతకు గురి అయ్యేది. తన చుట్టూ ఉన్న ప్రపంచానికి దూరంగా ఉండిపోయింది. “చాలా కాలం వరకు నేను చాలా అసహ్యంగా, కురూపిగా కనిపిస్తాను అనుకునేదాన్ని. ఇది నన్ను చాలా సిగ్గరిగా, సున్నితంగా, ఉద్రేకపూరిత మనస్తత్వం ఉన్న వ్యక్తిగా మార్చి పడేసింది. జనం చాల సార్లు నన్ను అనక పోయినా, నన్నే అంటున్నట్లుగా భావించి వాళ్ళతో దురుసుగా ప్రవర్తించేదాన్ని” అని ఆలిస్ వాకర్ ‘క్రిటికల్ పర్స్పెక్టివ్ పాస్ట్ అండ్ ప్రెసెంట్’ అనే పుస్తకంలో జాన్ ఓ బ్రెయిన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెబుతుంది. తనకు తాను సృష్టించుకున్న ఈ ఒంటరి తనాన్ని ఆలిస్ కవిత్వం రాయడంలో, చదవడంలో పూడ్చుకునేది. ఆలీస్ అమ్మ ఆమెకు ఒక టైపు రైటర్ బహుమతిగా ఇచ్చింది. మిగతా పనులు చేయకుండా కేవలం రాసుకోమనేది. కవిత్వంలో ఆమె శాంతిని వెతుక్కుంది కానీ పదిమంది ఉండే ఆ నాలుగు చిన్న, చిన్న గదుల్లో ఆమెకి కావాల్సిన ఏకాంతం దొరికేది కాదు. అందుకని ఆమె ఇంటి బయట చెట్ల కింద కూర్చుని ఏకాంతంగా రాసుకునేది.

జాతి పునాదిగా విభజించబడిన దక్షిణాది ప్రాంతంలో నివసిస్తున్న ఆలీస్ అక్కడ అవే ఉద్దేశంతో వేరు చేయబడి, విడిగా నల్ల జాతి పిల్లల కోసం నడుపుతున్న పాఠశాలలో చదువుకున్నది. ఆ స్కూల్ విద్యా ప్రమాణాలు, తెల్లవాళ్ళు చదువుకునే ఇతర స్కూల్స్ కంటే కూడా తక్కువగా ఉండేవి. కానీ ఆ స్కూల్లో ఆలీస్ కి అద్భుతమైన టీచర్లు దొరికారు. అప్పటి క్రూరమైన జాత్యహంకారాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలో ఆమెకు చెప్పేవారు. ఒక పక్క తల్లి ఇచ్చిన ప్రోత్సాహం, మరోపక్క టీచర్లు ఇచ్చిన జ్ఞానం తో ఆలీస్ ప్రపంచాన్ని బాగా అర్థం చేసుకుంది. అంతే కాదు, హై స్కూల్ ల్లో అత్యధిక మార్కులు సంపాదించి వీడ్కోలు సభలో ప్రధాన వీడ్కోలు వక్తగా ఉపన్యాసాన్ని ఇచ్చింది.

ఆ తరువాత స్కాలర్షిప్ సహాయంతో వాకర్ అట్లాంటాలోని స్పెల్‌మన్ కాలేజీలో చేరింది. అక్కడినుంచి న్యూ యార్క్ లోని సారా లారెన్స్ కాలేజీ కి మారింది. ఇక్కడ ఉన్నప్పుడు వాకర్ అధ్యయనంలో భాగంగా ఆఫ్రికాకి వెళ్లడం జరిగింది. అక్కడ ఆమె తన జాతి ప్రజలను ఒక సంవత్సరం పాటు దగ్గరగా చూడ గలిగింది. 1965 లో ఆలీస్ గ్రాడ్యుయేట్ అయ్యింది. గ్రాడ్యుయేషన్ తరువాత జార్జియా లోని బీద పిల్లలకి ఉచితంగా చదువు చెప్పేది ఆలీస్. ఇదే సంవత్సరంలో ఆమె తను రాసిన చిన్న కథ పత్రికలో ప్రచురించబడింది. కాలేజీ తరువాత వాకర్ ఒక సామాజిక కార్యకర్తగా, టీచర్ గా, లెక్చరర్ గా పనిచేస్తూనే పౌరహక్కుల సంఘంలో చేరి తన ఆఫ్రికన్ -అమెరికన్ ప్రజల సమానత్వం కోసం, హక్కుల కోసం పోరాడ సాగింది.

వాకర్‌ – వ్యక్తిగత రాజకీయ, రచనా జీవితం

1967లో వాకర్‌, పౌరహక్కుల లాయర్‌ అయిన మెల్విన్‌ రోసెన్‌మాన్‌ లెవెన్‌థాల్‌ని వివాహం చేస్కుంది. తర్వాత వాళ్ళు న్యూయార్క్‌ నించి మిసిసిపీకి మకాం మార్చారు. వీరిద్దరూ చరిత్రలో మొదటి చట్టబద్ధంగా వివాహం చేస్కున్న ఇంటర్‌ రేషియల్‌ జంటగా ప్రసిద్ధి పొందారు. ఈ జంట అక్కడ జాత్యాంహకార తెల్ల జాతి ప్రజలతోనే కాదు కుక్లక్స్‌ క్లాన్‌లతో కూడా వేధించబడ్డారు.

ఈ కుక్లక్స్‌ క్లాన్‌ అనేది యూ.ఎస్‌.ఎ.లో సివిల్‌ వార్‌ తర్వాత రహస్యంగా ఏర్పడిన సంస్థ. ఈ సంస్థ లక్ష్యం, జాత్యాహంకారాన్ని ఎదిరిస్తూ తెల్లవారికి వ్యతిరేకంగా పోరాడి సాధించుకున్న నల్లజాతి ప్రజల హక్కులను రహస్యంగా అణిచివేస్తూండడం, కెకెకె సంస్థ ఒక్క నల్లజాతి ప్రజలనే కాదు ముస్లిమ్స్‌, జూస్‌, కేథలిక్స్‌, విదేశాల్లో పుట్టి పెరిగిన వ్యక్తులను ఇతర సంస్థలను టార్గెట్‌ చేస్కుని వారిని హింసాత్మక పద్ధతుల్లో వేధిస్తుంది.

ఆలిస్, మెల్విన్ లకు 1969లో రెబెక్కా అనే పాప పుడుతుంది. 1976లో ఈ జంట విడాకులు తీస్కున్నారు. 1976 తర్వాత వాకర్‌ కాలిఫోర్నియాలో తన సహ రచయిత రాబర్ట్‌ ఎల్‌. ఎలీన్‌తో కలిసి ఫెమినిస్ట్‌ పబ్లిషింగ్‌ కంపెనీని స్థాపించింది.

భర్తతో విడిపోయాక ఆలిస్‌ వాకర్‌ ప్రఖ్యాత గాయకురాలు, గేయ రచయిత్రీ, గ్రామీ అవార్డ్‌ విజేత, అమెరికన్‌ అయిన ట్రేసీ చాప్‌మాన్‌తో 1990 మధ్యకాలంలో లైంగిక సంబంధంలో ఉంది. ఈ సంబంధం గురించి ఆమె 2006లో బహిరంగపరిచింది. “నేను ట్రేసీతో ప్రేమలో పడ్డాను. మాదొక అద్భుతమైన సంబంధం. మేం మా సహచర్యాన్ని పరిపూర్ణంగా అనుభవించాం. ఇది పూర్తిగా మా వ్యక్తిగత జీవితానికే సంబంధించింది. ప్రజలందరికీ చెప్పాల్సిన అవసరం లేదని” ‘ది గార్డియన్‌’ పత్రికకు ఇచ్చిన ఇంటర్‌వ్యూలో పేర్కొంది.

వాకర్‌ కొద్దికాలం ఆధ్యాత్మికతలోకి వెళ్ళిపోయింది. ఈ ఆధ్యాత్మిక చింతన తనకు పులిట్జర్‌ అవార్డ్‌ తెచ్చి పెట్టిన ‘ది కలర్‌ పర్‌పుల్‌’ నవలలో కనిపిస్తుంది. అలాగని చెప్పి వాకర్‌ మానవ, స్త్రీల హక్కులను నిర్లక్ష్యం చేసిందని చెప్పలేం. ఆధ్యాత్మిక చింతన ఆమె జీవితంలో ఒక దశ మాత్రమే. కలర్‌ పర్‌పుల్‌ నవలలో స్త్రీల హక్కుల స్వరాన్ని చాలా బలంగా వినిపిస్తుంది. ప్రత్యేకించి, స్త్రీలు రంగు ప్రాతిపదికన ఎట్లా గుర్తించబడతారో, తిరస్కరించబడతారో లేదా అణిచివేతకు గురి అవుతారో బలంగా చెప్పడం వలన వుమెన్‌ ఆఫ్‌ కలర్‌, బ్లాక్‌ ఫెమినిస్ట్‌ లేక ఫెమినిస్ట్‌ ఆఫ్‌ కలర్‌, వుమెనిస్ట్‌గా ముద్ర వేయబడింది ఆలిస్‌ వాకర్‌ మీద. ప్రజలు వాకర్‌ను అణిచివేతలకు గురి అయ్యే స్త్రీల హక్కులను ప్రశ్నించే ప్రతినిధిగా, స్త్రీవాదిగా గుర్తించడం మొదలు పెట్టారు. ”ఇన్‌ సెర్చ్‌ ఆఫ్‌ అవర్‌ మదర్స్‌ గార్డెన్స్‌”లో స్త్రీల హక్కులు, పోరాటాలకు సంబంధించి వాకర్‌ తన ఆలోచనలను పంచుకుంటుంది. వాకర్‌ ‘వుమనిజం’ అనే పదాన్ని కేవలం స్త్రీగా ఒక్క తన గురించి అంటే స్త్రీత్వం, తన మనోదైహిక స్పందనలు, ఇష్టాలు, ఆదర్శాలు, తన అస్తిత్వం చెప్పుకోవడం కోసం మాత్రమే ఉపయోగించలేదు. నల్లజాతి స్త్రీల సామూహిక పోరాట చేతనకు అస్తిత్వాన్ని ప్రతిబింబించేందుకు వాడారు. తెల్లజాతి ప్రజల జాత్యాహంకారాన్ని, లైంగిక అకృత్యాలను అప్పటి సమాజంలో నల్లజాతి స్త్రీలు ఎలా అనుభవించారో ప్రతిఘటించారో చెప్పేదానికి ఒక బలమైన పదంగా ‘వుమనిజం’ని వాడారు.

1985లో అమెరికన్‌ అకాడమీ ఆఫ్‌ రిలిజియన్‌, ఎ సొసైటీ ఆఫ్‌ బిబ్లికల్‌ లిటరేచర్‌లో వుమనిజం ఒక ఉద్యమంగా ముందుకు వచ్చి విజయం సాధించింది. ఇందులో నల్లజాతి స్త్రీల మేధోపరమైన, భౌతిక – ఆధ్యాత్మిక దృక్పథాలను, డిమాండ్స్‌ను చర్చకు పెట్టారు.

వాకర్‌ యుద్ధవ్యతిరేక – శాంతి ప్రతినిధిగా

వాకర్‌ 2003 మార్చ్‌లో 26 మంది ఇతర హక్కుల కార్యకర్తలతో కలిసి యుద్ధానికి వ్యతిరేకంగా వైట్‌ హౌస్‌ దాకా ధర్నాలో పాల్గొన్నందుకు అరెస్ట్‌ అయ్యింది. ఆ ధర్నాలో వేల మంది ప్రజలు పాల్గొన్నారు. అమెరికా చాలా వ్యూహాత్మకంగా ఇరాక్‌ మీద చేయబోయే యుద్ధానికి వ్యతిరేకంగా ప్రపంచ వ్యాప్తంగా అన్ని నగరాల్లో నిరసన కార్యక్రమాలు జరిగాయి. అమెరికాలోనే యుద్ధ వ్యతిరేక ధర్నాలు లాస్‌ ఏంజిల్స్‌, కాలిఫోర్నియా, టెక్సాస్‌, సియాటిల్‌, వాషింగ్‌టన్‌ లాంటి యాభైకి పైగా నగరాల్లో జరిగాయి.

తర్వాత ఇజ్రాయిల్‌లోని వర్ణ వివక్ష శాసనాన్ని ఖండిస్తూ 2009 జనవరిలో వాకర్‌ టొరంటో అంతర్జాతీయ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఇజ్రాయిల్‌ సినీ దర్శకుల ‘సిటీ టు సిటీ’కి వ్యతిరేకంగా యాభై మందితో కలిసి నిరసన సంతకం చేసింది. రెండు నెలల తర్వాత వాకర్‌ ‘కోడ్‌ పింక్‌’ అనే యుద్ధ వ్యతిరేక గ్రూపు సభ్యులైన అరవైకి పైగా మహిళా కార్యకర్తలలో కలిసి గాజా యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ గాజాకి వెళ్ళింది. గాజాలో స్థానిక ప్రజలను కలిసి పరామర్శించి, ఎన్జీవో సంస్థలలో కల్సి యుద్ధ పీడితులకు సేవలు అందించింది. ఇజ్రాయిల్‌, ఈజిఫ్ట్‌ గాజాతో కలిసి సరిహద్దులు తెరిచే ఒక ప్రయత్నం చేయడానికి చర్చల్లో ఆలిస్ పాల్గొన్నది. డిసెంబర్‌లో మళ్లీ గాజా వెళ్ళి ‘గాజా ఫ్రీడమ్‌ మార్చ్‌’లో పాల్గొన్నది. గాజాలో నౌకా సముదాయాల ప్రదర్శనలో 2011లో వాకర్‌ పాల్గొనడం విమర్శలకు దారి తీసింది.

ఆమెను ‘ది జెరూసలమ్‌ పోస్ట్‌’ పత్రిక ఆలీస్‌ వాకర్‌ ఒక జాతి దురభిమాని అని విమర్శించింది. ఇజ్రాయిల్‌ నావికా దిగ్బంధనాన్ని చేధించే గాజా నావికా యుద్ధ సముదాయపు ప్రదర్శనలో పాల్గొని వాకర్‌ టెర్రరిజం ను సమర్థిస్తున్నట్టు అమెరికన్‌ లా ప్రొఫెసర్‌ ఆలన్‌ డెర్షోవిజ్‌ విమర్శించాడు. వాకర్‌ రస్సెల్‌ ట్రిబ్యునల్‌ ఆన్‌ పాలస్టీన్‌కి జడ్జి మెంబర్‌గా ఉండింది. ఇజ్రాయిల్‌ యుద్ధ వ్యతిరేక కేంపెయిన్‌లో చాలా చురుకుగా పాల్గొంది ఆలీస్‌ వాకర్‌.

ఇజ్రాయిల్‌ జాత్యాంహకర ధోరణులకు నిరసనగా తన కలర్‌ పర్పుల్‌ పుస్తకాన్ని హిబ్రూ భాషలో అనువాదం చేయడానికి అనుమతిని నిరాకరించింది. ఇజ్రాయిల్‌ జాత్యాంహంకారాన్ని ఎక్కడికక్కడ ఖండిస్తూ ఇతర ఆఫ్రికన్‌ కళాకారులను, రచయితలను వాకర్‌ జాగృతపరిచింది. 2013లో అలీషియా కీస్‌ అనే ఆఫ్రికన్‌ గాయకురాలిని ఇజ్రాయిల్‌ లోని టెల్‌ అవైవ్‌లో ఆమె చేయబోయే సంగీత కచేరీని కేన్సల్‌ చేయమని ఉత్తరం రాసింది. ”ప్రపంచ వ్యాప్తంగా జాత్యంహకార దేశాలను మన నల్లజాతి కళాకారులు బహిష్కరిస్తున్నారు. మన ఇద్దరి అభిప్రాయాలూ – దారులూ కూడా ఒకటే అనిపిస్తుంది నువ్వు ఈ సంగీత కచేరీని జాత్యాహంకారంతో విర్ర వీగే ఇజ్రాయిల్‌ దేశంలో చేయకపోవడం వలన మన నల్ల జాతి ప్రజల ఆత్మగౌరవం పెరుగుతుంది” అని లేఖలో అలీషియాని అభ్యర్తించింది. కానీ అలీషియా వాకర్‌ అభ్యర్థనను తిరస్కరించింది.

ఆలీస్‌ వాకర్‌ ప్రఖ్యాత రచనలు

ద థర్డ్‌ లైఫ్‌ గ్రాంజ్‌ కోప్‌లాండ్‌
ఇన్‌ లవ్‌ & ట్రబుల్‌
మెరిడియన్‌
ది కలర్‌ పర్‌పుల్‌
యు కాంట్‌ కీప్‌ ఎ గుడ్‌ వుమెన్‌ డౌన్‌ – స్టోరీస్‌
పొసెసింగ్‌ సిక్రేట్స్‌ ఆఫ్‌ జాయ్‌
ది టెంపుల్‌ ఆఫ్‌ మై ఫెమిలియర్‌
నౌ ఇజ్‌ ది టైమ్‌ టు ఓపెన్‌ యువర్‌ హార్ట్‌.

కవితా సంకలనాలు:

హార్డ్‌ టైమ్స్‌ రిక్వైర్స్‌ ఫ్యూరియస్‌ డాన్సింగ్‌
టేకింగ్‌ ది ఆరోస్‌ అవుట్‌ ఆఫ్‌ హార్ట్‌
ఎ పోయెమ్‌ ట్రావెల్డ్‌ డౌన్‌ ఆఫ్‌ మై ఆర్మ్‌

నాన్‌ ఫిక్షన్‌ రచనలు:

ఇన్‌ సర్చ్‌ ఆఫ్‌ అవర్‌ మదర్స్‌ గార్డెన్‌
వారియర్‌ మార్క్స్‌
లివింగ్‌ బై ది వర్డ్‌
ది సేమ్‌ రివర్‌ ట్వైస్‌
ఎనిథింగ్‌ వి లవ్‌ కన్‌ వి సేవ్‌డ్‌
గో గర్ల్‌
సెంట్‌ బై ఎర్త్‌
ఓవర్‌ కమింగ్‌ స్పీచ్‌లెస్‌నెస్
చికెన్‌ క్రానికల్స్‌

‘ద కలర్‌ పర్పుల్‌’ – ఆలిస్‌ వాకర్‌ నవల

తీవ్రమైన అణిచివేతల, లైంగిక అకృత్యాల వలన బాధపడి స్వేచ్ఛా స్వాతంత్రాల కోసం పోరాడి తన జీవన లక్ష్యం తెలుసుకొని వాటిని చేరిన సిలీ జీవితగాధా చిత్రణ ఈ నవల. స్త్రీ పురుష సమానత్వాన్ని – కుటుంబాల్లో పితృస్వామ్యాన్ని, ఆడపిల్లలపై తండ్రి చేసే లైంగిక అత్యాచారాలను, ఆస్తి కేంద్రంగా కొనసాగే కుట్రలు, రాజకీయాలను ఈ నవలలో చూస్తాం.

జార్జియాలోని ఒక మారుమూల గ్రామీణ ప్రాంతంలో పెరిగిన ఆఫ్రికన్‌ – అమెరికన్‌ టీనేజర్‌ ‘సిలీ’ అనే అమ్మాయికి అయిన మానసిక గాయాలు, ఘర్షణ, అవమానాలపై ఆమె సాధించిన విజయాలను ‘ది కలర్‌ పర్పుల్‌’ నవలలో వాకర్‌ చిత్రిస్తుంది. ఈ నవలను వాకర్‌ 1982లో రాసింది. 1983లో ఈ నవలకు పులిట్జర్‌ బహుమతి వస్తుంది. నవలంతా కూడా చదువు రాని ఒక అమ్మాయి తెల్లజాతి వారిచే అవమానాలు ఎదుర్కొంటూ సాధికారత కోసం చేసే పోరాటాలను, స్త్రీ పురుష సమానత్వం – స్త్రీ వాద కోణంలోంచి రాసింది వాకర్‌. ఈ నవల శక్తివంతమైన స్త్రీ పాత్రల చిత్రీకరణకు మాత్రమే కాదు నవలంతా రచయిత్రి ఉపయోగించిన నల్లజాతి లేదా ఆఫ్రికన్‌ ఇంగ్లీష్‌ భాషలోని దేశీయత వలన చాలా ప్రశంసలు పొందింది.

ఈ నవలలో ‘సిలీ’ అనే యుక్త వయసుకు వచ్చిన అమ్మాయి ఊహించలేని దుర్మార్గాల్ని అనుభవించిన తర్వాత దిగ్భ్రాంతికి లోనై ఎవరికీ చెప్పుకోలేక భగవంతుడికి రాసే ఉత్తరాల్లో అమాయకంగా తనపై జరిగిన అన్యాయాన్ని రాస్తుంది. ప్రశ్నిస్తుంది. ఒక రకంగా తనపై ఇతరులు వేసిన ముద్రలను తిరస్కరించే ప్రయత్నమూ చేస్తుంది. ‘సిలీ’ తండ్రి ఆల్ఫాన్సో సిలీ మీద లైంగిక అత్యాచారం చేస్తుంటాడు. విపరీతంగా కొడుతూ ఉంటాడు. పధ్నాలుగేళ్ళ వయసులో చిన్నారి ‘సిలీ’ రెండవసారి గర్భవతి అవుతుంది. చదవులేని బీద కుటుంబానికి చెందిన సిలీ తండ్రి అత్యాచారాల్ని మౌనంగా భరిస్తూంటుంది.

మొదటిసారి పుట్టిన బిడ్డను తండ్రి అడవుల్లోకి తీస్కెళ్లి ఏం చేస్తాడో తెలీదు. రెండోసారి పుట్టిన బాబుని ఆల్ఫాన్సో దొంగతనం చేసి ఎక్కడికి తీస్కెళతాడో తెలీదు. సిలీ తల్లి అనారోగ్య పీడితురాలై చనిపోతుంది. ఆల్ఫాన్సో రెండో పెళ్ళి చేస్కున్నప్పటికీ సిలీపైన లైంగిక అత్యాచారాన్ని చేస్తూనే ఉంటాడు.

సిలీ చెల్లెలు నెట్టిని ఆల్‌బర్ట్‌ వివాహం చేస్కోవాలని అనుకుంటాడు. కానీ ఆల్ఫాన్సో అనాకారి అని ముద్రపడ్డ సిలీని వివాహం చేస్కోమని చెబుతాడు. ఆల్బర్ట్‌కి గాయకురాలైన షగ్‌ అనే ప్రేమికురాలు ఉంటుంది. ఆమె అందమైన ఫోటో సిలీని ఆకర్షిస్తుంది. చిన్నప్పట్నించీ తండ్రీ – చుట్టుపక్కల వాళ్ళు సిలీని నల్లని – అనాకారిగా ముద్ర వేసి అవమానిస్తూంటారు. ఆల్బర్ట్‌ సిలీని పెళ్ళి చేస్కుంటాడు కానీ ఆ వైవాహిక జీవితం పట్ల సిలీకి ఇష్టం ఉత్సాహం కలగదు. ఆల్బర్ట్‌, సిలీని దారుణంగా హింసిస్తూ గొడ్డులా ఇంటి పని, పొలం, పిల్లల పనీ చేయిస్తుంటాడు. ఆల్బర్ట్‌ నెట్టీపైన ఉన్న ఇష్టాన్ని వదులుకోడు. ఇది గమనించి నెట్టీ అక్కడ్నించి తప్పించుకుంటుంది. దీనికంటే ముందే నెట్టీ తన తండ్రి ఆల్ఫాన్సో ఇంట్లోంచి కూడా పారిపోయి సిలీ ఇంట్లో ఆశ్రయం పొందుతుంది. ఆల్బర్ట్‌ ఆమెని అక్కడనుండి వెళ్ళిపోయేలా చేస్తాడు. నెట్టీ జాడ కనుక్కోలేకపోతుంది సిలీ. నెట్టీ మరణించింది అని నమ్ముతుంది. ఆల్బర్ట్‌ సిలీతో హింసాత్మకంగా పెత్తనం చేస్తుంటే అతని చెల్లెలు కేట్‌ బాధపడి తిరగబడమని చెబుతుంది. ఆల్బర్ట్‌ కొడుకు హార్పో సోఫియాతో ప్రేమలో పడతాడు.

తండ్రి అత్యాచారాల నుంచి బయటపడ్డా, ఆసక్తి లేని హింసాత్మకమైన దాంపత్య జీవితంతో ఆల్బర్ట్‌ వలన సిలీ విసిగిపోయి ఉంటుంది. ఆ సమయంలో అక్కడి లోకల్‌ బార్‌లో పాడడానికి గాయకురాలు షగ్‌ ఏవరీ వస్తుంది. సిలీ ఆమెను చూడ్డానికి వెళ్ళాలని అనుకుంటుంది కానీ ఆల్బర్ట్‌ వెళ్ళనివ్వడు. ‘మర్యాదస్తుల ఇండ్లనించి ఆడవాళ్ళు బయటకు వెళ్ళరు’ అని ఆపేస్తాడు. హార్పో వలన సోఫియా గర్భవతి అవుతుంది. ఇద్దరూ పెళ్ళి చేస్కుంటారు. హార్పోని సోఫియా ధిక్కరిస్తూ స్వాభిమానంతో ఉండడం సిలీని అబ్బురపరుస్తుంది. అదే క్రమంలో హార్పో సోఫియాని భయపెట్టి కొట్టి లొంగ దీస్కోవాలని ప్రయత్నం చేసినా సోఫియా మానసికంగా, శారీరకంగా హార్పో కంటే దృఢంగా ఉంటుంది. అతని హింసను ఎదిరిస్తుంది. ఇదే సమయంలో షగ్‌ ఆరోగ్యం పాడవుతే ఆల్బర్ట్‌ ఆమెను ఇంటికి తీస్కొస్తాడు. ప్రారంభంలో షగ్‌ సిలీతో మొరటుగా వ్యవహరించినా తర్వాత స్నేహంగా ఉంటుంది. సిలీ ఆమెకు సేవలు అందించి త్వరగా కోలుకునేలా చేస్తూంది. షగ్‌, సిలీతో ఆల్బర్ట్‌ను ఎదిరించమని, హింసను భరించద్దని చెబుతుంది. సిలీ తనపై బాల్యంలో తండ్రి చేసిన లైంగిక దాడులు అతని వలన తాను ధరించిన గర్భాలు లాంటి బాధాకరమైన విషయాలు పంచుకుని కన్నీరు పెట్టి, ఉపశమనం పొందుతుంది. షగ్‌ సిలీని, తనను తాను ప్రేమించుకోవాలని, గౌరవించుకోవాలనీ చెప్తుంది. ఆమె దేహాన్ని ఆమె ప్రేమించుకునేలా, ఇష్టపడేలా చేస్తుంది.

తను షగ్‌ ఆకర్షణ, ప్రేమలో పడ్డట్లు సిలీ అర్థం చేస్కుంటుంది. ఆమె పట్ల తన ఆకర్షణను సిలీ అర్థం చేసుకోలేక సతమతవుతుంటుంది. హార్పో పెట్టే హింసలను భరించలేక సోఫియా ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. హార్పో మొదలుపెట్టిన జూక్‌ జాయింట్‌ సెంటర్‌లో షగ్‌ ఐవరీ రాత్రిళ్ళు పాడుతూ ఉంటుంది. షగ్‌ ప్రేమలో సిలీ తనను తాను ఒక మనిషిగా అనుభూతి చెందడం మొదలుపెడ్తుంది. తను లేనప్పుడు ఆల్బర్ట్‌ సిలీని కొడుతున్నాడని గ్రహించిన ‘షగ్‌’ అక్కడే ఉండిపోవాలని నిర్ణయించుకుంటుంది. సిలీకి షగ్‌ కీ మధ్య సామీప్యత పెరిగి శారీరక సంబంధానికి దారి తీస్తుంది. ఇద్దరి స్త్రీల మధ్య లైంగిక ఆకర్షణ కలగడం పట్ల సిలీలో చాలా ప్రశ్నలున్నా ఆమె షగ్‌ ఆకర్షణ నుంచి తప్పించుకోలేకపోతుంది. షగ్‌ సిలీని భర్త హింసని భరించద్దని తిరగబడమని చెప్తుంది. ఇదే సమయంలో తిరిగి వచ్చిన సోఫియా భర్త కొత్త గర్ల్‌ ఫ్రెండ్‌ ‘స్క్వీక్‌’ విషయంలో తగాదా పడుతుంది. తర్వాత పట్టణంలో మేయర్‌ భార్య మిస్‌ మిల్లే సోఫియాని తన దగ్గర పని మనిషిగా చేయమంటే సోఫియా తిరస్కరిస్తుంది. సోఫియా స్వాభిమానంతో పొగరుగా ‘చెయ్యను ఫో’ అంటుంది. మేయర్‌ సోఫియా చెంప పగలగొడతాడు. సోఫియా వెంటనే తిరగబడి మేయర్‌ చెంప మీద కొడుతుంది. మేయర్‌ కిందబడిపోతాడు. సోఫియా జైలుపాలవుతుంది. స్క్వీక్‌ సోఫియాని విడిపించే ప్రయత్నాలు విఫలమవుతాయి. పన్నెండు సంవత్సరాలు మేయర్‌ ఇంట్లో సోఫియా పనిమనిషిగా ఉండాలన్న శిక్ష పడుతుంది.

ఈ లోపల షగ్‌… గ్రేడ్‌ అనే అబ్బాయిని పెళ్ళి చేస్కుంటుంది. అతనితో ఉంటూనే సిలీతో లైంగిక సంబంధం కొనసాగిస్తుంటుంది. నెట్టీ గురించి సిలీని అడుగుతుంది షగ్‌. నెట్టీ బతికి ఉంటే తనకు తప్పక ఉత్తరాలు రాసేదని రాయటం లేదు కాబట్టి ఆమె చనిపోయిందని అనుక్కుంటున్నా అనీ అంటుంది సిలీ. తాను నెట్టీ రాసిన ఉత్తరాలను ఆల్బర్ట్‌ దగ్గర చూసానని చెబుతుంది షగ్‌. సిలీకి కోపం వస్తుంది. ఎలాగోలాగ నెట్టీ ఉత్తరాలను సంపాదిస్తుంది. ఆల్బర్ట్‌ ట్రంకు పెట్టెలో దాచిపెట్టిన ఉత్తరాలు సంవత్సరాల తరబడి రాసినవి చదివి కన్నీటి పర్వంతమవుతూ ఆల్బర్ట్‌ని చంపెయ్యాలన్నంత కోపంలో రగిలిపోతుంది సిలీ.

ఉత్తరాల నిండా నెట్టీ, సిలీ నించి పారిపోయాక తన జీవితంలో జరిగిన సంఘటనలను పంచుకుంటుంది.

నెట్టీ సామ్యూల్‌ – కార్నీ అనే మిషనరీ దంపతులతో స్నేహం చేసి వాళ్ళకు తోడుగా ఆఫ్రికాకు వెళుతుంది. వీరికి ఒలీవియా, ఆడం అనే దత్తత తీసుకున్న పిల్లలుంటారు. వీరికి నెట్టికి పోలికలు ఉండడాన్ని కార్నీ గమనించి సామ్యూల్‌ నెట్టీలను అనుమానిస్తుంది. అంతవరకూ ఉన్న స్నేహాన్ని తగ్గించి నెట్టీని దూరం పెడుతుంది. మిషనరీ సంస్థలకు సంబంధించి – ఆఫ్రికన్‌ ప్రజలకు సంబంధించి తనకు ఉన్న విశ్వాసాలు భ్రమాలు పోతాయి నెట్టీకి. ఆఫ్రికన్లు స్వార్థంగా, మొండితనంలో ఉండడాన్ని గమనిస్తుంది. సామ్యూల్‌ ద్వారా ఆ దత్తత తీస్కున్న పిల్లలిద్దరూ సిలీకి పుట్టిన పిల్లలు అని తెలుస్తుంది. సిలీ తండ్రి ఆమె కన్న తండ్రి కాదు. సవతి తండ్రి అని కూడా తెలుస్తుంది. పైగా తమ తండ్రి ఒక షాప్‌ ఓనర్‌ అని ఆయన సాధించిన విజయం పట్ల ఆగ్రహం పెంచుకున్న తెల్లవాళ్ళు అతన్ని నరికి చంపేసారనీ తెలుసుకుంటుంది. కానీ ఆల్ఫాన్సో తనే సిలీ – నెట్టి స్వంత తండ్రి అని చెబుతాడు. అతనికి తన భార్య ఇల్లు కొట్టెయ్యాలన్న కుట్ర ఉంటుంది మనసులో.

అప్పుడు నెట్టీ, సామ్యూల్‌ – కార్నీలకు తను సిలీ స్వంత చెల్లెలిని అనీ ఆ పిల్లలకు పిన్ని అవుతాననీ చెబుతున్నది. కానీ తీవ్రమైన అనారోగ్యంలో ఉన్న కార్నీ నమ్మదు. కానీ మరణించే ముందు నమ్ముతుంది. ఆ ఉత్తరాన్ని చదివాక సీలీ ఆల్ఫాన్సోని కలుస్తుంది. నిలదీస్తుంది. నెట్టీ రాసిన సంగతులన్నీ నిజమే అని ఒప్పుకుంటాడు. ఆల్ఫాన్సో తను సిలీకి సవతి తండ్రి మాత్రమే అన్న వాస్తవాన్నీ ఒప్పుకుంటాడు. సిలీ తీవ్రమైన దిగ్భ్రాంతికి లోనవుతుంది. భగవంతుడిపై విశ్వాసాన్ని కోల్పోతుంది. షగ్‌ సిలీని ఓదారుస్తుంది. భగవంతుణ్ణి సంప్రదాయ పద్ధతిలో కాకుండా మరొక పద్ధతిలో, రూపంలో, సారంలో చూడమంటుంది. విశ్వాసాన్ని కోల్పోవద్దంటుది.

సోఫియాను ఆర్నెల్ల ముందే బానిసత్వం నించి విముక్తి చేస్తాడు మేయర్‌. క్రమంగా షగ్‌ స్నేహం, ప్రేమ, ఇచ్చే చైతన్యంలో తనను హింసిస్తున్న భర్తను ఎదిరించే సాహసాన్ని పొందుతుంది సిలీ. షగ్‌ – సిలీ ఇద్దరూ టెనసీ రాష్ట్రానికి వెళ్ళిపోదామని నిర్ణయించుకుంటారు. హార్పో గర్ల్‌ఫ్రెండ్‌ అతని హింసలనుంచి తప్పించుకోవడానికి తనూ వీరితో కలిసి వస్తాంటుంది.

ఆల్బర్ట్‌ నించి విముక్తి పొందిన సిలీ టెనసీ లో పాంట్లు సైజ్ చేస్తూ కుడుతూ అమ్ముతూ ఉండే వ్యాపారంలోకి ప్రవేశించి ఆర్థిక స్వాతంత్య్రపు స్వేచ్ఛానందాలను చవి చూస్తుంది. కొద్ది కాలానికి జార్జియా వెళ్ళిన సిలీకి ఆల్ఫాన్సో చనిపోయాడని తెలుస్తుంది. అతను ఆక్రమించుకున్న ఇల్లు, భూమీ తన స్వంతం చేస్కుంటుంది.

ఇక్కడ నెట్టీ – సామ్యూల్‌ను వివాహం చేస్కుంది. సామ్యూల్‌ కొడుకు ఆడమ్‌ ‘తాషీ’ అనే స్థానిక ఆఫ్రికన్‌ అమ్మాయిని ఆఫ్రికా తెగ సాంప్రదాయ పద్ధతిలో పెళ్ళి చేస్కుంటాడు. తాషీ బాల్యంలోనే నొప్పితో కూడిన దుర్మార్గమైన ఫీమేల్‌ జెనైటల్‌ మ్యూటిలేషన్‌ అంటే ఖత్నా అనే జననాంగపు కోత అనే దుర్మార్గమైన మత సంప్రదాయానికి బలి అయిన అమ్మాయి.

దానితో పాటు ఫేషియల్‌ స్కారింగ్‌ కూడా జరుగుతుంది తాషీకి. ఆమె ఆఫ్రికాలోని హౌడా అనే ఆదివాసీ తెగకి చెందిన అమ్మాయి. వీళ్ళు పూర్వీకులు ముఖం మీద కొన్ని కాలిన గుర్తులు చేస్కొనడం వలన వారు వారి పూర్వీకులతో సంబంధంలో ఉంటారనే మూఢ నమ్మకంతో, చిన్నప్పుడే తమ పిల్లలకు ముఖంపైన వివిధ ఆకారాలలో మచ్చలను పొడిపిస్తారు. అలాగే స్త్రీల లైంగికత్వాన్ని కంట్రోల్‌ చేయడానికి, పరిశుద్ధమైన స్త్రీలను తయారు చేసే నెపంతో స్త్రీలలో లైంగికానందాన్ని కలగ చేసే నరాల సముదాయం ఉండే క్లైటోరిస్‌ అనే బాహ్య జననాంగాన్ని చిన్నప్పుడే ఖండిస్తారు. ఇదొక దారుణమైన సంప్రదాయం దీనికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు స్థానిక ఆఫ్రికాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా నడుస్తున్నవి.

తాషీ దుఃఖంతో సహానుభూతి చెందడానికి ఆడమ్‌ తాను కూడా మొఖంపైన మచ్చలకు చేస్కుంటాడు. సిలీ మళ్ళీ మారిన ఆల్బర్ట్‌తో సహ జీవనం చేస్తూ ఆర్థిక స్వేచ్ఛను పొందడంతో పాటు ఆధ్యాత్మిక చింతన వైపు మళ్ళుతుంది. తన పిల్లలను కలుసుకుంటూనే చెల్లి నెట్టీని కలుస్తుంది.

నవలంతా సిలీ – భగవంతుడికి రాసే ఉత్తరాల్లోనే కొనసాగుతుంది. ఈ నవలలో ఆలిస్‌ వాకర్‌ అన్ని రకాల అణిచివేతలకు వ్యతిరేకంగా పోరాడిన బలమైన స్త్రీల పాత్రలను చిత్రిస్తుంది. జాతి వివక్షతో పాటు లైంగిక అణిచివేత రెంటికీ గురైన ఆఫ్రికన్‌ – అమెరికన్‌ స్త్రీలు చేసిన పోరాటమే ఈ నవల సారాంశం.

నవలలో ఆఫ్రికన్‌ – అమెరికన్‌ స్త్రీలు ఆఫ్రికన్‌ – అమెరికన్‌ పురుషుల వలన అణిచివేతకు లైంగిక అత్యాచారాలకు గురి అవడం, అదే సమయంలో అప్పటి సమాజంలో ఉన్న తెల్లవారి జాత్యాహంకారానికి బలవటం చూపిస్తుంది వాకర్‌.

కుటుంబంలో స్త్రీ పైన పిల్లల పైన అధికారం చూపించి – ఆస్తిని, ఆధిపత్య స్థానాన్ని పొందడానికి క్రూరంగా ప్రవర్తించే భర్తల, తండ్రుల మొత్తానికి మగవారి పాత్రలు కనిపిస్తాయి. ఈ నవలలో బాల్యంలో తండ్రి వల్ల, వివాహం అయ్యాక భర్త వల్ల లైంగిక అత్యాచారాల్ని భరించిన స్త్రీగా సిలీ పాత్ర చిత్రణ ఉంటుంది. అదే సమయంలో అదే ఆధిపత్యాన్ని ఎదిరించి నిలబడ్డ సోఫియా – షగ్‌ పాత్రలు ఉంటాయి.

”భార్యలు చిన్నపిల్లలాంటి వాళ్ళు. వాళ్ళను పిల్లల్ని కొట్టినట్లే కొట్టి అదుపులో పెట్టుకోవాలి” అంటాడు ఆల్బర్ట్‌. ‘ఎందుకు సిలీని కొడతావు నువ్వు’ అని అడిగిన కొడుకు హార్పోతో. హార్పో తండ్రిని అనుసరించి భార్య సోఫియాని హింసతో అదుపులో పెట్టాలనుకుని ఆమెను కోల్పోతాడు. పాలుకు వ్యవసాయం చేసే కుటుంబాల్లో ఇంటి పని, పొలం పని కూడా స్త్రీలు పిల్లలు చెయ్యాలన్న పితృస్వామ్య నమూనాల పాత్రలను వాకర్‌ చక్కగా విశ్లేషిస్తుంది. తరం నుంచి తరానికి కొనసాగే పురుషాధిక్య భావజాలాన్ని కళ్ళను కట్టినట్లు చూపిస్తుంది. వాకర్‌ తన భర్త నుంచి హింస, మరోవైపు అతని పిల్లలకు చాకిరీ చేస్తూ వంట పశుపోషణ వ్యవహారాలలో నలిగి పోతున్నా భర్తను ఎదిరించే సాహసం చేయదు. షగ్‌ చెప్పినా కానీ అన్నీ భగవంతుడికి నేను – నాకిలా అన్న వాక్యంలో మొదలుపెట్టి ఉత్తరాలు రాస్తూ ఉపశమనం చెందుతుంటుంది.

ఎప్పుడైతే చెల్లెలు నెట్టీ ఉత్తరాలు భర్త దాస్తాడో, ఆమెలో బానిసత్వాన్ని ఎదిరించే ధైర్యం వస్తుంది. కత్తి చూపించి ‘యూ డాగ్‌… నిన్ను చంపి నా డోర్‌ మ్యాట్‌గా వేస్కుంటాను అంటుంది. షగ్ లో కల్సి ఆమె ఇంటికి వెళ్ళిపోతుంది. ప్రేమించిన స్త్రీ, భార్య ఇద్దరు స్త్రీలు అహంకారి అయిన ఆల్బర్ట్‌ని వదిలి వెళ్ళాక కానీ అతనికి బుద్ధి రాదు.

సిలీకి షగ్‌ తన జీవితంలోకి వచ్చాక మాత్రమే తాను ఒక మనిషిని అన్న స్పృహ కలుగుతుంది. తన జీవితం మీద ప్రేమ కలుగుతుంది. బాల్యంలో లైంగిక అత్యాచారం చేసిన తండ్రి – పెళ్ళైనాక అదే లైంగిక అత్యాచారం భౌతిక హింస చేసిన భర్త… ఈ క్రమంలో తన దేహం మీద జీవితం మీద గౌరవాన్ని కోల్పోయిన సిలీ… షగ్‌ పరిచయం, ఆల్బర్ట్‌ హింసా దౌర్జన్యాలను భరించాల్సిన అవసరం లేదని ఎదిరించాలనీ ప్రశ్నించాలనీ చెప్పడం, ముఖ్యంగా సౌందర్యవతి అయిన షగ్‌ ఆమెని ప్రేమించడం- ఇవన్నీ తన దేహం, జీవితం మీద గౌరవాన్ని ప్రేమనీ కలిగిస్తాయి. షగ్‌ని అమితంగా ప్రేమిస్తుంది. ఇద్దరూ పురుషాంహకారి అయిన ఆల్బర్ట్‌ని వదిలేస్తారు.

సామాజిక ఆమోదం కోసం షగ్‌ గ్రేవీని వివాహం చేస్కున్నా, సిలీతో మునుపటి లానే సంబంధం కొనసాస్తుంటుంది. కానీ ఇంత సాహస పాత్రలను సృష్టించిన ఆలిస్‌ వాకర్‌ తిరిగి సిలీని – ఆల్బర్ట్‌ దగ్గరికి సోఫియాని హార్పో దగ్గరికి ఎందుకు చేరుస్తుందో అర్థం కాదు. తెల్లవారి జాత్యాహంకారాన్ని ధిక్కరించిన సోఫియా, భర్త పురుషాహంకారాన్ని ఎదిరించిన సోఫియా తిరిగి మళ్ళీ అదే భర్తని ఎందుకు ఆమోదిస్తుందో తెలీదు. ఒకసారి పాత్రలకు చైతన్యవంతంగా తీర్చిదిద్దాక తిరిగి అవే పాత్రల్ని మూస ధోరణిలో, సాంప్రదాయ పద్ధతిలో స్వాభిమానం లేని పాత్రలుగా రచయిత్రి ఎందుకు మలిచిందో తెలీదు. మొత్తానికి కుటుంబంలో భార్యలు, పిల్లల మీద పురుషుల పెత్తనం, అణిచివేత, లైంగిక హింస అదే సమయంలో తెల్లవారి జాత్యాహంకారాన్ని ఏక కాలంలో ఎదుర్కొనే ఆఫ్రికన్‌ – అమెరికన్‌ స్త్రీల సాహసోపేతమైన వ్యక్తిత్వాన్ని ఈ నవలలో చూపారు రచయిత్రి.

ఈ నవల చదివాక తన సవతి తండ్రి వలన పుట్టిన పిల్లలని కలిసిన సిలీ మానసిక స్థితి ఊహించలేము. అలాగే నవలలో ఆఫ్రికా దేశంల్లో పాటించే క్రూరమైన స్త్రీల జననాంగ విచ్ఛేదన, ఫేషియల్‌ స్కారింగ్‌ లాంటి మూఢ విశ్వాసాలను నవల చివరలో ఇప్పటి తరం తాషీ అనే ఆఫ్రో – అమెరికన్‌ స్త్రీ పాత్ర ద్వారా చూచాయిగా చెప్పే ప్రయత్నం చేసారు రచయిత్రి.

‘ది కలర్ పర్పుల్‌’ నవల మీద నిషేధం

అమెరికాలో ఈ నవల 1984 నించి అన్ని పాఠ్య పుస్తకాల్లోంచి తీసి వేయబడింది. దీనిలో ఉన్న సిలీ తండ్రి చేసే బాల్యపు లైంగిక హింసను – కారణంగా చూపారు. రచయిత్రి ఒక ఆఫ్రికన్‌ అమ్మాయి జీవితంలో జరిగిన వాస్తవ గాధలను చిత్రించే ప్రయత్నం చేసారు. ఈ కథ తమ పిల్లల పాఠ్యాంశంగా ఉండడం చాలా మంది తల్లిదండ్రులకు నచ్చలేదు. ఎందుకంటే ఇది దేవుడికి వ్యతిరేకంగా ఉంది. తన జీవితంలో చేదుని హింసను భరించలేని సిలీ – దేవుడి పైన విశ్వాసాన్ని కోల్పోవడం రచయిత్రి రాయడం తల్లిదండ్రులకు నచ్చలేదు. అలాగే కథలో సిలీకి షగ్‌కీ మధ్య మొదలైన లెస్బియన్‌ సంబంధం ఇంకా వారి మధ్య శృంగార సన్నివేశాల చిత్రణ కూడా తల్లిదండ్రులకు నచ్చలేదు. అది అనవసరం అని వాళ్ళ భావన.

కానీ వాకర్‌ ప్రకారం హింసని సెక్స్‌ని ప్రొమోట్‌ చేయడం తన ఉద్దేశ్యం కాదని 10 ఏళ్ల పిల్లని తండ్రి రేప్‌ చేసిన సందర్భాన్ని అలా కాకుండా ఎలా రాయగలమని ప్రశ్నిస్తుంది. తనను తాను అంగీకరించుకోవడానికి ప్రేమించుకోవడానికి లెస్బియన్‌గా చిత్రించానని చెప్తుంది. ప్రేమించుకునేలా చేయడం తప్ప మరేం కాదని అంటుంది వాకర్‌.

డా. భారతి : Psychotherapist & marital counselor. కలం పేరు గీతాంజలి. పుట్టిన స్థలం హైద్రాబాద్. ర‌చ‌న‌లు: 'ఆమె అడవిని జయించింది', 'పాదముద్రలు'. లక్ష్మి (నవలిక). 'బచ్ఛేదాని' (కథా సంకలనం). 'ప‌హెచాన్‌' (ముస్లిం స్త్రీల ప్రత్యేక కథా సంకలనం), 'పాలమూరు వలస బతుకు చిత్రాలు' (కథా సంకలనం), 'హస్బెండ్ స్టిచ్' (స్త్రీల విషాద లైంగిక గాథలు) 'అరణ్య స్వప్నం' (కవితా సంకలనం) సెప్టెంబర్ 2019 లో విడుదల అవుతుంది.

Leave a Reply