ఆయన కవిత్వం ఓ ‘కన్నీటి కబురు’

తెలుగు సాహిత్య చరిత్రలో అతి కొద్దిమంది కవులే చందోబద్ధ దళిత పద్య కావ్యాలు రచించారు. ముంగినపూడి వెంకటశర్మ, కుసుమ ధర్మన్న, బీర్నీడి మోషే, గుర్రం జాషువా తర్వాత దళిత పద్య కావ్యాలు రచించిన ప్రసిద్ధ కవి గద్దల జోసఫ్. 1943లో గద్దల జోసఫ్ రచించిన ‘ కన్నీటి కబురు ‘ కావ్యం పేరెన్నికగన్నది. ఈ కావ్యం నాటి సమాజ స్థితిగతులను కళ్ళకు కట్టింది. వేళ్ళూనుకుపోయిన వివక్షను నిరసించి, విద్య యొక్క ఆవశ్యకతను వివరించింది. కన్నీటి కబురు కావ్యంలోని కథానాయకుడు అణగారిన వర్గాల ప్రతినిధి. ఆకలి దప్పులకు అలమటించే నిరుపేద. చిక్కిన కాసుచే కడుపు నింపుకునే అమాయకుడు. తరతరాలుగా ఊరికి దూరంగా నివసిస్తూ మనిషిగా కూడా సరైన గుర్తింపు పొందని దళితుడు. ఓ దళిత వర్గీయున్ని కథానాయకుడిగా చేసి కన్నీటి కబురు కావ్యం ద్వారా సమాజాన్ని ఆలోచింప చేసిన గొప్ప కవి గద్దల జోసఫ్.

గుంటూరు జిల్లా వినుకొండ తాలూకా గోకనకొండలో గద్దల జోసఫ్ 1908 జూలైలో జన్మించాడు. తల్లిదండ్రులు సంతోషమ్మ, జాన్. మహాకవి గుర్రం జాషువా జన్మించిన వినుకొండ నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలోనే గోకనకొండ గ్రామం ఉంటుంది. అది ఓ మారుమూల చిన్న పల్లెటూరు. అక్కడే ఎనిమిదో తరగతి వరకు గద్దల జోసఫ్ చదివి బాపట్లలో టీచర్ ట్రైనింగ్ పూర్తి చేశాడు. సొంత గ్రామమైన గోకనకొండలో హైయర్ గ్రేడ్ ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. గోకనకొండకి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న నాగులవరం గ్రామంలోని వెల్లంకి సుబ్బయ్య శాస్త్రితో ఉన్న స్నేహం, రాయప్రోలు చిదంబర శాస్త్రి వద్ద శిష్యరికంలో సంస్కృతం, తెలుగు సాహిత్యాన్ని క్షుణ్ణంగా చదివాడు. చురుకైన యువకుడిగా నాటి గ్రామాల్లోని స్వజాతి ప్రజల స్థితిగతులను బాగా పరిశీలించేవాడు. చదువుకున్న వ్యక్తిగా ప్రజలను చైతన్య పరుస్తూ ఉండేవాడు. స్వతహాగా సాహిత్యాభిలాషి అయిన గద్దల జోసఫ్ ఇరవై అయిదేళ్లకే గోకనకొండ గ్రామాన్ని దాటి గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల వరకు సాహిత్య మిత్రులతో పరిచయాలు పెంచుకున్నాడు.1933లో చంద్రహాసము అనే కావ్యాన్ని రచించి విమర్శకుల మన్ననలు పొందాడు. ఆ తర్వాత 1943లో రచించిన కన్నీటి కబురు కావ్యం గద్దల జోసఫ్ కు మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది.

కన్నీటి కబురు కావ్యం మూడు ఆశ్వాసాల విషాదాంత సందేశ కావ్యం. ఓ మారుమూల ఉన్న దళితవాడలో కావ్య కథ ప్రారంభమవుతుంది. ఇందులో ప్రధాన పాత్రలు దిబ్బడు అతని కుమారుడు రాయడు అతని కుమార్తె దుగ్గి. మూడు తరాల కథ ఇందులో కనిపిస్తుంది. మూడు తరాలుగా మట్టి మనుషులు అనుభవించే కన్నీళ్లు, కష్టాలు ఇందులో కనిపిస్తాయి. తన కుమారుడు రాయడికి చదువు చెప్పించాలనేది దిబ్బడి కల. తన కల నెరవేరకుండానే దిబ్బడు మరణిస్తాడు. రాయడు కూడా తన ఏడుగురు సంతానంలో కనీసం చివరి కుమార్తె దుగ్గికి చదువు చెప్పించి ముందు తరాన్ని మార్చాలనుకుంటాడు. ఈ క్రమంలో పల్లెల్లో ఉండే పీడిత ప్రజల బాధల్ని పాఠకుల కళ్లకు కట్టినట్లు కవి వివరిస్తాడు. ఈ కావ్యం విషాదంతో ముగుస్తుంది. కానీ, ఎంతో గొప్ప సందేశాన్ని అందిస్తుంది. ” వస్తువు చేత చూసినా, శైలి చేత చూసినా ఇది యొక పురాణముగానో, మహా కావ్యముగానో వన్నేకెక్కగలదు ” అంటూ సర్ కట్టమంచి రామలింగారెడ్డి కన్నీటి కబురు కావ్యాన్ని కొనియాడారు. గద్దల జోసఫ్ దళిత పద్య కావ్యాలకే పరిమితం కాకుండా తెలుగు సాహిత్య ప్రక్రియలన్నిటినీ సృజించాడు.వసంత కుమారి, కట్టమంచి, భారతీయుడు, భారవి, జానకి, భక్తవిజయము, చంద్రహాసము, కథాగుచ్చము, ప్రతిజ్ఞా భేరి, సింహగర్జన, వేమన వంటి కావ్యాలు రాసిన గద్దల జోసఫ్ భావ కవిత్వం, జీవిత చరిత్ర, దేశభక్తి, నవల, కథాసంపుటి, సందేశ కావ్యాలు ఇలా సాహిత్యంలో అన్ని కోణాలను సృజించాడు. ఆయన రచించిన కన్నీటి కబురు కావ్యం అప్పటి డిగ్రీ విద్యార్థులకు పాఠ్యాంశంగా వేశారు. కవిశేఖర, కవిమార్తాండ, సుకవిరాజు వంటి బిరుదులు అందుకున్న గద్దల జోసఫ్ 1971 ఆగస్టు15న మరణించాడు. కన్నీటి కబురు కావ్యం రచించి ఎనబై ఏళ్లు దాటి పోయింది. అయినప్పటికీ, నేటి సమాజానకి కూడా కన్నీటి కబురు కావ్యం ఓ సందేశ కావ్యమే.

( ఆగష్టు 15న గద్దల జోసఫ్ 51వ వర్ధంతి )

గుంటూరు జిల్లా వినుకొండ స్వగ్రామం. ఉపాధ్యాయురాలు. తెలుగు సాహిత్యంలో డిగ్రీ, ఎంఏ, డీఎడ్, బీఎడ్ చదివారు. వినుకొండలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్(తెలుగు)గా పనిచేస్తున్నారు. విద్యార్థులకు తెలుగు సాహిత్యాన్ని బోధించడం అత్యంత ఇష్టం.

Leave a Reply