ఆమె ప్రియుడు

(మాక్సిం గోర్కీ కథ – Her Lover)
అనువాదం : గీతాంజలి

నాకు బాగా దగ్గర స్నేహితుడొకడు నాకు ఈ కథ చెప్పాడు. నేను మీకు ఆ కథను చెబుతాను.

నేను మాస్కోలో విద్యార్థిగా ఉన్నప్పుడు, మా ఇంటి పక్కనే అంతగా మంచి పేరులేని స్త్రీలు ఉండేవాళ్లు. అందులో ఒకామె పేరు ‘పోల్’. కానీ వాళ్లామెను ‘టెరేసా’ అని పిలిచేవారు. ఆమె ఎలా ఉండేదనుకున్నారు? ఆమె చాలా పొడుగ్గా, గాఢమైన చిక్కటి వెంట్రుకలతో అంతే నల్లని గుబురైన కనుబొమలతో, పొడవైన మొఖంతో ఉండేది. శిల్పి ఒక ఉలితో చెక్కినట్లే ఉండేది ఆమె ముఖం. ఆమె నల్లని కళ్ళల్లో అదేంటో చెప్పలేని ఒక మృగ మెరుపు ఉండేది. విచిత్రంగా ఆమె గొంతు మొరటుగా ఉండి మాట్లాడుతుంటే ఒక పురుషుడు మాట్లాడుతున్నట్లే ఉంటుంది. మంచి ధృడమైన కండరాలతో .. ఒక క్యాబ్ డ్రైవరుకి ఉండాల్సిన వొడ్డు పొడుగుతో దర్పంగా నడిచేది. మొత్తానికి ఆమె ఒక చేప పిల్లలా ఎప్పుడూ చురుకుగా ఉండేది. ఆమె నాలో నాకే అర్థం కాని ఒక రకమైన భయాన్ని కలిగించగలిగింది. ఆమె నేనుండే మేడ గది ఎదురుగుండానే మొదటి అంతస్తులోని అటక లాంటి గదిలో ఉండేది. ఆమె ఇంట్లో ఉన్నంత సేపూ నేను నా గది తలుపులను పొరపాటున కూడా తెరిచేవాడిని కాదు. కానీ కొన్ని సందర్భాలలో ఆమెను ఎదుర్కోవాల్సి వచ్చేది. మెట్లు ఎక్కుతున్నపుడో, పెరట్లో ఏదో పని కోసం వెళ్ళినప్పుడో ఆమె ఎదురుపడేది. అప్పుడామె కొన్ని సార్లు భలే చమత్కారంగా.. ఇంకొన్ని సార్లు ఏదో విరక్తిలో ఉన్నట్లుగా నవ్వేది. కొన్ని సార్లు ఆమె తాగి ఉండేది. అప్పుడామె చిందరవందరగా చెదిరిపోయిన జుట్టుతో, మత్తులో మసక బారిన కళ్ళతో కనిపించేది. మరీ ముఖ్యంగా ఆమె నవ్వు వికారంగా ఉండేది. అలాంటి సందర్భాలలో ఆమె నాతో మాట్లాడడానికి ప్రయత్నించేది.

“మిస్టర్ స్టూడెంట్ ఎలా వున్నావు”? అని ఒక పిచ్చి నవ్వు నవ్వేది.

ఇది నాలో ఆమె పట్ల నాకున్న అసహ్యాన్ని మరింత పెంచేది. ఒక్కోసారి ఆమెని తప్పించుకోవడానికి నేనున్న క్వార్టర్స్ కు మారిపోవాలనిపించేది. కానీ నా చిన్న గది ఎంతో అందంగా ఉండేది. ముఖ్యంగా కిటికీ బయట వీధి, అటూ ఇటూ తిరగాడే జనం, ఇంకొన్ని అందమైన దృశ్యాలు నాకు కనిపించేవి. అలాంటి గది ఎక్కడా దొరకదు. సరే.. ఒకరోజు నేను మంచం పైన బద్ధకంగా దొర్లుతున్నా. కాలేజీ మానడానికి సాకులు వెతుకుతున్నా. ఉన్నట్లుండి మొరటుగా ఉండే టెరెసా గొంతు నా గదిలో ప్రతిధ్వనించింది.

“నీకు మంచి ఆరోగ్యం సమకూరుగాక మై డియర్ స్టూడెంట్’’ అంటోంది.

“ఏం కావాలి నీకు?” అనడిగాను.

ఆమె మొఖంలో ఒక అయోమయం… ఒక లాంటి అభ్యర్థన కనబడ్డాయి.

“సర్ మీ నుంచి నాకో సాయం కావాలి చేస్తారా” అని అడిగింది.

అది విన్న నేను మౌనంగా ఉండిపోయాను. మరో పక్క ఆమె పట్ల దయగా ఉండాలి… ధైర్యంగా మాట్లాడాలి అనుకుంటున్నా మనసులో.

“నేను ఇంటికి ఒక ఉత్తరం పంపాలి” ఆమె గొంతు అభ్యర్థిస్తున్నట్లుగా… మృదువుగా కాసింత పిరికి తనంతో ఉంది.

“ఓహ్హ్ .. ఆడుకో ఇక” మనసులో అనుకున్నా.

వెంటనే ఎగిరి టేబుల్ ముందున్న కుర్చీలో కూర్చుని పేపర్, పెన్ తీసుకొని, ఆమె వైపు తిరిగి “రా ఇక్కడ కూర్చుని చెప్పు ఏం రాయాలో?’’ అన్నా. ఆమె చాలా ఉల్లాసంగా అక్కడున్న కుర్చీ లో కూర్చుని నా వైపు ఎందుకో పశ్చాత్తాప భావనతో చూసింది. బహుశా నాకు పని చెప్పి బాధ పెడుతున్నా అనుకుందేమో?

“సరే ఉత్తరం ఎవరికి రాయాలో వాళ్ళ అడ్రస్ చెబుతావా?” అన్నాను.

వెంటనే ఆమె “బొలసలావ్ కాష్ పుట్, స్వీప్టిజియానా టౌన్ వారసావ్ వీధి” అని చెప్పింది.

“మంచిది ఇక ఏం రాయాలో చెప్పు” అన్నాను.

“నా ప్రియమైన బోల్స్ .. నా ప్రియాతి ప్రియమైన వాడైన, నమ్మకస్తుడైన ప్రియుడికి, ఆ దేవుడు నిన్ను రక్షించుగాక! బంగారంలాంటి హృదయం నీది. నీ మీద బెంగతో క్రుంగిపోతున్న నీ చిన్నారి పావురాయికి ఉత్తరం ఎందుకు రాయట్లేదో చెప్పు” ఆమె చెబుతూ పోతున్నది.

నాకేమో నవ్వాగలేదు .. ఉప్పెనలా పొంగుకొచ్చేసింది నవ్వు. ఐదడుగుల కంటే పొడవుగా ఉంటుందీమే. ఇక పిడికిళ్లయితే రాళ్ళలాగా గట్టిపడిపోయాయి. ఇక మనిషి లావుగానే ఉంటుంది. ఈ చిన్ని పావురాయి చాలా కాలం నుంచి చిమ్నీలో బతుకుతున్నట్లు నల్లబడిన… అసలెన్నడూ కడగనట్లు ఉండని మొఖంతో ఉండే ఈమె చిన్ని పావురాయా? మెల్లిగా తెప్పరిల్లి “ఈ బోలెస్ట్ ఎవరింతకీ?’’ అని అడిగాను.

ఆమె వెంటనే “బోలెస్ట్ కాదు, బోల్స్ అనాలి మిస్టర్ స్టూడెంట్” అంది నా తప్పునేదో సవరిస్తున్నట్లు.

“అతగాడు బోల్స్ .. నవయవ్వనుడు” అంది మళ్ళీ తనే.

“నవ యవ్వనుడా” నిర్ఘాంతపోయానేమో .. నా నోట్లోంచి అనుకోకుండా వచ్చేసింది.

“ఎందుకంత ఆశ్చర్య పోతున్నావయ్యా .. ఒక ఆడపిల్లగా నాకొక నవయవ్వనుడైన ప్రేమికుడు ఉండకూడదనా నీ ఉద్దేశ్యం?” టెరెసా కొంచెం అలిగినట్లే అన్నది.

హు.. ఈమె ఒక అమ్మాయి .. ? సరే ఏం చేస్తాం ఇక మనసులో అనుకుంటూ “అవును ఎందుకు ఉండకూడదు .. ఏదైనా సాధ్యమే. సరే గానీ నీ ఈ నవ యవ్వన స్నేహితుడితో ఎప్పటినుంచి ఉంటున్నావేంటి?” అనడిగాను.

“ఆరేళ్లనుంచీ” అన్నది పెదాలు నవ్వుతో విచ్చుకుంటుంటే, కళ్ళల్లో మెరుపేదో కదలాడుతుంటే ఒక రకమైన గర్వంతో.

“ఒహ్హ్ ., అలాగా సరే ఇక ఉత్తరం రాయడం మొదలెడదామా?” అన్నాను. ఇక్కడ ఒక విషయం నేను దాచకుండా చెప్పాలి. నేను బోల్స్ చిరునామా కావాలనే కొద్ధిగా మార్చాను. ఎందుకంటే టెరేసా అతగాడి నిజమైన స్నేహితురాలు కాకపోతే ..? దాని కంటే కూడా తక్కువ స్థాయి మనిషై ఉంటే అనే సందేహం నన్ను వేధించింది.

“నాకు ఈ పనులు చేసి పెడుతున్నందుకు మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు సర్” అని టెరెసా చాలా మర్యాద పూర్వకంగా అంది.

“ఫరవాలేదు” అన్నాను.

“లేదు .. లేదు నిజంగానే నా కృతజ్ఞతలను తెలుపుకుంటున్నాను” అంది మళ్ళీ అంతే మర్యాద పూర్వకంగా.

“బహుశా మీ చొక్కాలు, ప్యాంట్లకు కొద్ది మరమ్మతులు అవసరమేమో” అంది చిన్నవైన పెట్టి కోట్ వేసుకుని.. గున్న ఏనుగులా ఉన్న ఆ ఆడమనిషి ఆ మాటలతో నన్ను సిగ్గుపడేటట్లుగా చేసింది. నా మొఖం ఒక్కసారిగా ఎర్రబారిపోయింది. నాకు ఆమె నుంచి ఏ సేవలు అవసరం లేదని కొంచెం కఠినంగానే చెప్పాను. ఇది విన్న ఆమె మౌనంగా అక్కడినుంచి వెళ్ళిపోయింది. ఒకటి రెండు వారాలు ఇట్టే గడిచిపోయాయి. ఒక రోజు నేను నా గదిలో కిటికీ పక్కన కూర్చొని.. మెల్లిగా విజిల్ వేసుకుంటూ వీధిలో కనిపించే దృశ్యాలను చూస్తున్నాను. మనసులో నన్ను తేలికపరిచే ముఖ్యమైన నిర్ణయం ఒకటి తీసుకోవడానికి ఘర్షణ పడుతూ ఉన్నాను. ఆ క్షణాల్లో నాకు బాగా బోరు కొడుతున్నది. పైగా బయటి వాతావరణం కూడా ఏమంత బాగా లేదు. విసుగు పుట్టించేదిగా ఉంది. బయటకు వెళ్లాలని అనిపించట్లేదు. నాకెందుకు ఇలా అనిపిస్తుంది అని నాలో నేనే విశ్లేషించుకుంటున్నాను. నిజానికి ఈ ఖాళీగా కూర్చొనే పని కూడా బాగా విసుగెత్తించేదే. కానీ వేరే ఏ పనీ కూడా చేయాలనే అనిపించట్లేదు. ఇంతలో ఎవరో అదాటున లోపలికి వచ్చారు. హమ్మయ్య ఎవరో ఒకరు వచ్చారులే బోర్ తగ్గించడానికి అనుకున్నా.

“ఓహ్హ్.. ఉన్నారా మిస్టర్ స్టూడెంట్ మీకు వేరే ముఖ్యమైన పనులేవీ లేవుకదా ఇప్పుడు” అంటూ లోపలికి వచ్చేసింది టెరెసా.
అమ్మో.. టెరెసానా వచ్చింది” అనుకున్నా మనసులో.

“లేవు చెప్పండి ఎందుకు” అనడిగాను.

“నాకు మీరు మరో ఉత్తరం రాసి పెట్టాలి” అంది.

“బోల్స్ కె కదా” అన్నాను.

“కాదు..కాదు ఈసారి అతన్నించి నాకు రాయాల్సి ఉంది ఉత్తరం” అంది ఆమె.

నేను దిమ్మెరపోయి.. “ఏంటీ” అన్నాను వెర్రి మొఖం వేస్కోని.

“అయ్యో నేనొక మూర్ఖురాలిని మీకు సరిగా చెప్పలేక పోయాను. నన్ను క్షమించండి. ఇది నా స్నేహితుడి నుంచి. నాకు ప్రీతిపాత్రమైన వాడు, గొప్ప హృదయం ఉన్న మనిషి అచ్చం నాలాగా అంటే ఈ టెరెసా లాగా అన్నమాట. అదీ సంగతి” ..కళ్ళల్లో ఏవో గర్వపు చూపులు పారాడుతుంటే, “సర్.. మీరు ఇక ఈ టెరేసాకు ఉత్తరం రాసిస్తారా?” అంది.

ఆమె నన్ను ఒకసారి మీరు అని, మరోసారి నువ్వు అనడం గమనించాను. నేనామెను పరీక్షగా చూశాను. ఏదో ఆపదలో ఉన్నట్లే ఉంది ఆమె ముఖం ఆమె చేతి వేళ్ళు వణుకుతున్నాయి. మొదట నాకేదీ అర్థం కానట్లే మెదడు మబ్బు మబ్బుగా అనిపించింది.

తరువాత తేరుకుని.. “చూడండి మేడమ్ .. బోల్స్, టెరెసాలు ఎవరూ లేరిక్కడ నువ్వు అన్నీ పచ్చి అబద్ధాలు ఆడుతున్నావు. ఈ మిషతో నన్ను కలుసుకుందామని అనుకుంటున్నావు కదూ .. చూడు నీతో స్నేహం చేసే ఆలోచన నాకస్సలు లేదు” నేను అరిచినంత పని చేశాను. ఉన్నట్లుండి ఆమె భయపడిపోయినట్లు అనిపించింది. ఉన్నచోటే కదలకుండా కూర్చుంది. తరువాత అక్కడే తన పాదాలను ఆందోళనగా అటూ ఇటూ కదప సాగింది. చూసే వారికి నవ్వు వచ్చేటట్లు. మధ్య మధ్యలో ఏదో గొణగసాగింది. ఏదో చెప్పాలనుకుంటున్నట్లు కానీ చెప్పలేకపోతున్నట్లుగా ఉంది ఆమె వ్యవహారం. ఇదంతా అసలు ఎక్కడికి దారి తీస్తుందో చూడాలని ఉంది నాకు. అంతా విచిత్రంగా ఉంది.. నేనేమైనా తప్పు చేశానా అని కూడా అనిపించసాగింది.

“మిస్టర్ స్టూడెంట్”.. ఆమె గొంతు పెగిలించుకుని అన్నది. కానీ ఏమీ అనలేక హఠాత్తుగా లేచి గది బయటకు వెళ్ళిపోయింది. చెదిరిన మనసుతో నేను గదిలో అలా కూర్చుండిపోయాను. మెల్లిగా లేచి తలుపు వైపుగా తిరిగి చెవులు రిక్కించాను. ఆమె తలుపులను బలంగా వేసుకుంది. పాపం ఆమె చాలా కోపంగా ఉంది మరి! ఇక అంతా ముగిసిపోయింది అనిపించింది. కానీ వెంటనే ఆమె గదికి వెళ్ళి ఆమెను నా గదికి తీసుకు వచ్చి ఆమెకేమి రాసిపెట్టాలో అంతా.. ఆమె చెప్పినదంతా మాట్లాడకుండా రాసి ఇవ్వాలని అనిపించింది. ఆమె కోసం ఇలాంటి భావన కలగడం కూడా నాకు వింతగా అనిపించింది. ఈ ఆలోచన ఎంత బలంగా కలిగిందంటే ఒక్క క్షణం కూడా నన్ను నిలువనివ్వలేదు. వెంటనే ఆమె అపార్ట్మెంట్ కి వెళ్లిపోయాను. గది లోపలకెళ్ళి చుట్టూ చూశాను. ఆమె తన టేబల్ దగ్గర కూర్చుని ఉంది. మోచేతులు రెండూ టేబల్ మీద పెట్టి అర చేతుల్లో తన మొఖం పెట్టుకుని విషాదంగా కూర్చుని ఉంది.

నేను ఆమె దగ్గరికెళ్ళి “దయచేసి నా మాట విను” అన్నాను.

మా కథలో ఈ మలుపు దగ్గరికి వచ్చేసరికి నాకు చాలా చిరాగ్గా ఇబ్బందిగా అనిపించింది. నాకు నేను ఒక మూర్ఖుడి లాగా కూడా అనిపించాను. మరెందుకొచ్చాను ఆమె గదికి? తెలీదు.

“సరే.. సరే ఒక్కసారి నా మాట వింటారా?” అన్నాను వీలైనంత సౌమ్యంగా. ఆమె ఒక్కసారిగా కుర్చీలోంచి లేచి నా వైపు వచ్చింది. ఆమె కళ్ళు తళతళా మెరిసిపోతున్నాయి. నా భుజాల మీద తన రెండు మొరటు చేతులు వేసి గుసగుసగా చెప్పడం మొదలు పెట్టింది.

“చూడండి.. ఆశ్చర్య పోవద్దు .. ఇదిలాగే ఉంటుంది. అసలు బోల్స్ అన్నవాడే లేడు. అలాగే టెరెసా కూడ లేదు. కానీ నీకు దానితో సంబంధం ఏంటి చెప్పు? పేపర్ మీద పెన్ను పెట్టి నేను చెప్పింది రాయడం అంత కష్టమైన పనా మీకు? ఓహ్హ్ .. అబ్బా మీరు కూడా ఇంతేనా? ఇంకా వయసులో చాలా చిన్నవాడివి నువ్వు. ఇలా ఉండొచ్చా? అవును ఎవరూ లేరక్కడ .. బోల్స్ కానీ, టెరెసా కానీ ఎవరూ లేరు. ఒక్క నేనే ఉన్నాను! అవును ఏం? .. ఒక్క నేను మాత్రమే.. అర్థం అవుతుందా” ఆమె ఒక్క క్షణం ఆగింది.

“క్షమించండి.. నాకర్థం కాలేదు. బోల్స్ టెరెసా ఇద్ధరూ లేరంటే ఏమిటి దాని అర్థం? “బోల్స్ లేడా అక్కడ?”

“లేడు .. అంతే” ..ఆమె అంది.

“టెరేసా కూడా లేదా?”

“టెరెసా కూడా లేదు.. నేనే టెరెసా!” ఆమె చాలా విశ్వాసంతో అంటూ స్థిరంగా.. సూటిగా నన్ను చూసింది. నాకేమీ అర్థం కాలేదు. నేను నా కళ్ళప్పచెప్పి అయోమయంగా ఆమెని చూస్తుండి పోయాను. మా ఇద్దరిలో ఎవరూ ముందు స్పృహలోకి వస్తారా అని ఎదురు చూస్తూ ఉండిపోయాను. ముందు ఆమెనే తేరుకుని టేబుల్ దగ్గరికి వెళ్ళింది. టేబుల్ సొరుగులో ఏదో వెతికింది.

మళ్ళీ తిరిగి నా దగ్గరికి వచ్చి, దెబ్బతిన్న గొంతుతో “బోల్స్ కి ఉత్తరం రాయడం నీకంత కష్టంగా ఉంటే రాయకు. ఇదిగో మొన్న నువ్వు బోల్స్ కి రాసిన ఉత్తరం తీసుకెళ్లిపో. నాకు ఉత్తరాలు రాసిపెట్టేవాళ్లు ఎంతో మంది ఉన్నారు తెలుసా.” ఆమె చేతిలో నేను బోల్స్ కి రాసిపెట్టిన ఉత్తరం ఉంది.

ఓహ్హ్.. నాకు తల తిరిగింది. నేను వెంటనే..”చూడు టెరేసా ఏమైనా అర్థం అంటూ ఉందా దీనికంతా అసలు? నీకు నేను బోల్స్ కోసం ముందే ఒక ఉత్తరం రాసి ఇచ్చాగా .. మళ్ళీ వేరే వాళ్ళతో రాయించుకోవడం దేనికి? అయినా బోల్స్ కి రాసిన ఉత్తరం ఇంకా నీ దగ్గరే ఎందుకు ఉంది?.. పోస్ట్ ఎందుకు చేయలేదు?

“ఎక్కడికి పంపాలి?” టెరెసా.

“అదేంటి.. ఇంకెవరికి .. బోల్స్ కే” కోపాన్ని అదిమి పెట్టుకుంటూ నేను.

“అసలు అలాంటి వ్యక్తే లేడు”! నా అయోమయం పెరిగిపోయింది. ఆమె ఏమంటుందసలు? చెప్పద్ధూ.. ఆమె మొఖం మీద ఉమ్మి వెళ్లిపోవాలన్నంత కోపం వచ్చింది. అప్పుడామె దెబ్బతిన్న గొంతుతో “ఏంటా.. అసలు విషయం చెబుతాను. అసలక్కడ ఎవరూ లేరు” అంది రెండు చేతులూ రెండు వైపులా పక్కలకంటా బారుగా చాపుతూ. అసలక్కడ తన ఉత్తరం తీసుకోవడానికి ఎందుకు బోల్స్ లేడో అర్థం కాక నివ్వెరపోతున్నట్లే! ఆమె ముఖంలో నిరాశా.. కొద్ది కోపమూ కనిపించాయి. మళ్ళీ తానే కొద్దిగా తగ్గుతూ దేనికో లొంగిపోయినట్లు .. మెల్లిగా చిన్న గొంతుతో “కానీ నాకతగాడు అక్కడ ఉండి తీరాల్సింది అనిపిస్తుంది. ఎందుకంటే.. నేను కూడా మనిషినే కదా.. అందరిలాగా నాకు కూడా మనుషులు కావాలనిపిస్తుంది కదా .. మనుషులతో ఉండాలనిపిస్తుంది కదా అంది.

మళ్ళీ ఆమెనే “అయినా ఒకటి చెప్పు నాకు. నా ఉత్తరాలవల్ల అవతలి వ్యక్తికి ఏ నష్టమూ కలగనప్పుడు రాస్తే ఏం? నాకు తెలుసు అలాంటిదేమీ ఉండదని టెరెసా ఆగింది.

“ఎవరికి నష్టం కాదు?” నేనడిగాను.

“ఇంకెవరికీ.. బోల్స్ కే ”అంది టెరెసా నన్నో వెర్రివాడిని చూస్తున్నట్లే చూస్తూ.

“కానీ బోల్స్ అసలు ఉనికిలోనే లేడుగా”? అన్నాను నేను.

“అయ్యో.. అయ్యో.. అబ్బా.. ఏమైందిప్పుడు అతను లేకపోతే చెప్పు? అవును అతను నిజంగానే లేడు.. కానీ ఉండే అవకాశం కూడా ఉంది కదా. నేనతనికి ఉత్తరం రాస్తాను. అలా రాస్తేనే అతను అక్కడ ఉన్నట్లు అనిపిస్తాడు ! ఇంక టెరెసా అంటావా? అంటే, నేనన్నమాట. నాకు అతను తిరిగి ఉత్తరం రాస్తాడు. మళ్ళీ నేను తిరిగి బోల్స్ కి ఇంకో ఉత్తరం రాస్తాను. అలా మేము ఇద్ధరము ఒకరికొకరం ఉన్నట్లే కదా?” ఆమె కొద్దిగా తల పక్కకి వంచి కనుబొమలేగరెసి నన్ను గెలిచినట్లే చూసింది. కానీ ఆమె కళ్ళల్లో పెను విషాదం సుళ్ళు తిరుగుతున్నది. ఆమె పెదవి చివరి నవ్వులో అదిమి పెట్టిన దు:ఖ సముద్రం దాక్కుని ఉంది. ఆఖరికి నాకు అంతా అర్థం అయింది. నాకు ఏదో వ్యాధి సోకినట్లే నీరసంగా.. నీరు నీరు అయిపోయాను. సిగ్గుతో హృదయం ముడుచుకుని పోయింది.. భయం వేసింది. నా ఇంటికి మూడు గజాల అవతలే ప్రపంచంలో ఎవరూ లేకుండా ఒక మనిషి వొంటరిగా బతుకుతున్నది. నాకు ఈ విషయం తెలీనే లేదు చూడు ! ఈ లోకంలో ఆమెతో ప్రేమగా.. దయగా మాట్లాడడానికి.. పలరించడానికే ఎవరూ లేరు. కనీసం ఒక్క మనిషి కూడా. ఈ మనిషేమో ఇక్కడ తనకోసం ఇంకొక మనిషినే సృష్టించుకుంది. ఎంత విషాదం ఇది? సాటి మనిషిగా, ఆమె పొరుగు వాడిగా నేను ఎంత సిగ్గుపడాలి?

“సరే నీకు సరైన విధంగా అర్థం చేయిస్తాను. చూడూ .. నువ్వు నాకోసం బోల్స్ కి ఉత్తరం రాసావు కదా? దాన్ని నేను మరొకరికి ఇచ్చి నాకోసం చదవమన్నాను. ఏం? వాళ్ళు చదువుతారు. అలా వాళ్ళు నాకోసం చదువుతున్నప్పుడు .. నేను దాన్ని వింటూ బోల్స్ ఉన్నట్లే ఊహించుకుంటాను. ఇక నేను బోల్స్ నుంచి టెరెసాకు ఉత్తరం రాయమని అడిగాను కదా నిన్ను.. అది నాకే అన్న మాట. ఇలా మీరు ఉత్తరాలు రాసి నాకోసం చదువుతుంటే, ఖచ్చితంగా బోల్స్ నాకోసం ఉన్నట్లే అనిపిస్తుంది. దాని మూలాన్న జీవితం కాస్త తేలిగ్గా ముందుకు వెళ్లిపోతుందేమో అనిపిస్తుంది” అంది టెరెసా.

ఆమె కళ్ళల్లోని దైన్యం నన్ను నిలువునా వణికించేసింది.

“ఓహ్హ్ .. ఏమిటిది బాధతో నా మెదడు మొద్ధు బారదు కదా” నాలో నేను అనుకున్నాను. ఇక అప్పటినుంచీ ఆమెకు నేను వారానికి రెండు ఉత్తరాలు రాసే వాడిని. బోల్స్ నుంచి టెరెసాకి తిరుగు ఉత్తరాలు రాసేవాడిని. బోల్స్ టెరెసాకు రాసే ఉత్తరాలు మటుకు చాలా ప్రేమతో రాస్తున్నట్లు రాసేవాడిని. అవి వింటూ ఆమె సంతోషం తో ఏడ్చేసేది. ఒక విధంగా చెప్పాలంటే, ఆమె సంతోషం, దుఃఖాల్ని ఏక కాలంలో భరించలేక పెద్దగా… నిస్సహాయంగా తన మొరటు గొంతుతో గర్జించేది. ఊహల్లో ఉన్న బోల్స్ నుంచి ఉత్తరాలు రాసి, ఆమెకు వినిపించి తనకి ఇంత ఆనందాన్ని ఇచ్చినందుకు ప్రతిగా ఆమె నా చొక్కాలకు, ప్యాంటులకు ఉన్న రంధ్రాలను చక్కగా కుట్లు వేసి ఇచ్చేది. విచిత్రంగా ఈ కథంతా జరిగి మూడు నెలలు అవుతూ ఉందో లేదో… ఆమెను అరెస్ట్ చేసి జైలుకి తీసుకెళ్లారు. ఏం నేరం చేసిందో తెలీదు. సందేహమే లేదు, ఈ పాటికి ఆమె చనిపోయి ఉంటుంది.

ఇదంతా చెబుతున్న నా స్నేహితుడు ఆగి తాగుతున్న సిగరెట్ నించి బూడిద దులపరించాడు. తలెత్తి ఆకాశం వైపు దిగులుగా చూస్తూ ఇలా ముగించాడు.

“సరే.. మనిషికి చేదు అనుభవాలు ఎక్కువగా ఎదురైనప్పటికి… తరువాత జీవితం కాస్తంత మధురంగా మారినా కానీ ఈ చేదు వాళ్ళని అంటిపెట్టుకునే వుంటుంది. ఇక మనం ధర్మం.. అధర్మం అంటూ ఉలిక్కిపడుతూ గగ్గోలు పెట్టేస్తాం. ఇతరులని మాత్రం మన జీవితంలోని సంపదల, సుఖశాంతుల మబ్బు పొరల మధ్య నుంచి చూస్తూ .. మనకనుకూలంగా ఏవో లెక్కలు వేస్తూ… వాళ్ళ మంచి చెడులని, వాళ్ళ జీవితాల్లోని దారిద్య్రాన్ని నిర్వచిస్తూ .. మనం మాత్రం ఏ తప్పులు చేయని సత్తె పూసలుగా .. మనల్ని మనం లౌక్యంగా ఒప్పించుకునే ప్రయత్నం చేస్తూ తృప్తి పడిపోతుంటాము. ఏంటో అర్థమే కానీ వింత ఇది ! ఈ మొత్తం అంతా మన మూర్ఖత్వాన్ని .. అవకాశవాదాన్ని ఎంత క్రూరంగా బయట పెడుతుందో కదా.. సమాజంలో కొంతమందిని అదే అన్నార్తులను..పేదలను ఒట్టి దిగజారిపోయిన మనుషులు అంటాం కదా. నిజానికి ఈ దిగజారిపోయిన మనుషులు నిజంగా ఎవరో తెలుసుకోవాలని ఉంది నాకు. చెప్పు ఎవరూ వీళ్ళు? నిజానికి అన్ని మానవ అనుభూతులతో సహా వాళ్ళంతా ఒకటే రక్తం.. ఎముకలు, మాంసం, నరాలు ఉన్న మనుషులు మనలాగా. కానీ వాళ్ళని మనం దిగజారిన మనుషులుగా ముద్రలు వేస్తాం. అలా అలవాటు పడిపోయాం నిజానికి. యుగాలుగా మనకి ఇదే విషయం తిరిగి, తిరిగి చెప్పబడుతోంది. మనం అన్నీ సార్లూ వింటూనే ఉంటాం. కానీ ఇదెంత వికారమైన .. భీతికొలిపే విషయమో ఆ దెయ్యానికే తెలియాలి. అదే ఏమీ చేయకుండా ఒట్టిగా వింటూ మాత్రమే ఉండడాన్ని గురించే నేను మాట్లాడేది. లేదా మనం అంతా ఈ మానవత్వాన్ని గురించి ఈ పెద్ద వాళ్ళు ఇచ్చే ఉపన్యాసాలను వింటూ పూర్తిగా చెడిపోయామా? వాస్తవానికి మనం కూడా దిగజారిన మనుషులమే. మనది మరో రకమైన దిగజారుడుతనం. దీన్లో లౌక్యం ఉంటుంది. నేను చూసినంత మటుకు స్వార్థం అనే బురద గుంటలో గొంతు దాకా దిగజారిపోయిన వాళ్ళం. మనల్ని మనం.. మన లోపలి స్వార్థాలకి, మాలిన్యాలకు.. అత్యాశలకు, అహంకారాలకు ఏదో ఒక బలమైన సాకుని చూపించి అదే ధర్మబద్ధమని మనం నమ్ముతూ ఎదుటి వాళ్ళని కూడా అదే నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తాం. కానీ ఇప్పుడిక ఇదంతా చాలనిపిస్తుంది. ఇదెంత పాతబడ్డ విషయమంటే.. అదిగో ఆ పర్వతాలంత పురాతన విషయం. మాట్లాడడానికి కూడా సిగ్గు పడేంత. నిజానికి చాలా… అవునవును, చాలా పాత విషయం ఇది. అవును యిదింతే!”

డా. భారతి : Psychotherapist & marital counselor. కలం పేరు గీతాంజలి. పుట్టిన స్థలం హైద్రాబాద్. ర‌చ‌న‌లు: 'ఆమె అడవిని జయించింది', 'పాదముద్రలు'. లక్ష్మి (నవలిక). 'బచ్ఛేదాని' (కథా సంకలనం). 'ప‌హెచాన్‌' (ముస్లిం స్త్రీల ప్రత్యేక కథా సంకలనం), 'పాలమూరు వలస బతుకు చిత్రాలు' (కథా సంకలనం), 'హస్బెండ్ స్టిచ్' (స్త్రీల విషాద లైంగిక గాథలు) 'అరణ్య స్వప్నం' (కవితా సంకలనం) సెప్టెంబర్ 2019 లో విడుదల అవుతుంది.

3 thoughts on “ఆమె ప్రియుడు

  1. సమూహాల్లో ఒంటరులుగా బతికే మనుషుల కథ ఎంత పాతదో, అంత సమకాలీనమైనది.
    ఈ ఫార్ములాను అనుసరించిన కథలు తెలుగులో కూడా వచ్చాయి.
    అనువాదం సరళంగా బావుంది.

  2. dr.jatin
    నా ఇంటికి మూడు గజాల అవతలే ప్రపంచంలో ఎవరూ లేకుండా ఒక మనిషి వొంటరిగా బతుకుతున్నది. నాకు ఈ విషయం తెలీనే లేదు చూడు ! ఈ లోకంలో ఆమెతో ప్రేమగా.. దయగా మాట్లాడడానికి.. పలరించడానికే ఎవరూ లేరు. కనీసం ఒక్క మనిషి కూడా. ఈ మనిషేమో ఇక్కడ తనకోసం ఇంకొక మనిషినే సృష్టించుకుంది. ఎంత విషాదం ఇది? సాటి మనిషిగా, ఆమె పొరుగు వాడిగా నేను ఎంత సిగ్గుపడాలి?——- సూటిగా హృదయంలోకి చొచ్చుకు పోయింది. అనువాదం అత్యంత సరళంగా అనువాదంలా కాకుండా వుండి. అభినందనలు. గోర్కీ కథకి నిలువెత్తు గగుర్పాటు

Leave a Reply