(క్వీర్ కథలు : 4)
‘‘ఫ్లాట్ లో ఎప్పుడూ ఇద్దరాడవాళ్ళే కనిపిస్తుంటారు. ఎప్పుడూ మగాళ్ళు ఉండరు. వాళ్ళ బంధువులు చాలామంది వచ్చి పోతుంటారు. మొన్న ఎవరో పెద్దాళ్ళొచ్చారు. ఆ పొడుగ్గా ఉండే ఆమె, అమ్మా నాన్నలట. వీళ్ళ మధ్య కనపడని కథ ఏదో ఉందిపక్క ఫ్లాట్ లోని బాల్కనీ లోంచి ఇద్దరాడవాళ్ళు మాట్లాడుతున్నారు. బాల్కొనీ లో ఈజీ చైర్ లో కూర్చొని ఉన్న నాకు వాళ్ళ మాటలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. అందులో పక్క ఫ్లాట్ ఓనర్ లక్ష్మి నాకు మంచి స్నేహితురాలు. అలా అన్నావిడ సెకండ్ ఫ్లోర్ ఆవిడ. లక్ష్మి ఇంటికి అప్పుడప్పుడూ వచ్చి పోతూంటుంది.
ఆమె ‘‘అబ్బే ఏ కథా లేదబ్బా. ఇద్దరూ వర్కింగ్ విమెన్. తప్పేముందీ? లేడీస్ హాస్టల్స్ లో లేడీస్ కలిసి ఉండరా? ఇద్దరూ మంచివాళ్ళు. స్నేహంగా ఉంటారని మేం రెంట్ కి ఇచ్చిన నెల రోజుల్లో తెలిసిపోయింది’’ అంటోంది లక్ష్మి మా ఓనర్. లక్ష్మికి నేనంటే ఆరాధనా, ఇష్టమూను. డిగ్రీ దాకా చదివింది. వాళ్ళింట్లో ఎప్పుడూ ఏవో గొడవలు అవుతూ ఉంటాయి. భర్త తాగుబోతు, ఆమెని బాగా కొడుతూ ఉంటాడు. ఇద్దరు పిల్లలు. ఈ ఫ్లాట్ కి వచ్చిన కొత్తల్లో, ఒకరోజు అర్ధరాత్రి తలుపు తట్టిన చప్పుడుకి లేచాను.
‘‘కాంచన గారు ఈ రాత్రి ఉండనివ్వండి నన్ను’’ అంది బలహీనమైన గొంతుతో. మొఖం కన్నీళ్ళతో తడిసిపోయి ఉంది. అది మొదలు, ఆమె అలా చాలాసార్లు వచ్చింది. పదేళ్ళ సంసార జీవితంలో ఇలాంటి సంఘటనలు చాలానే జరిగాయట. పిల్లలిద్దరూ చిన్నవాళ్లు. ఎనిమిది, ఆరేళ్ల పిల్లలు. బాబు, పాప. ఈమెకి ఉద్యోగం లేదు, చెయ్యనివ్వడు.
‘‘నీ బోడి డిగ్రీకి ఎవ్వడిస్తాడే జాబ్? ఇంట్లో పడి ఉండు, పిల్లల్ని చూసుకుంటూ’’ అంటాడట.
‘‘అలా నిస్సహాయంగా ఉంటున్నాను వీడి దగ్గర. పిల్లలు లేకపోతే ఎప్పుడో వీడి మొఖంమీద ఉమ్మి వెళ్లి పోదును కాంచన గారూ” అనేది.
“మీకు తెలుసా ఇప్పుడు మీకు అద్దెకిచ్చిన ఈ ఫ్లాట్ నాది. మా అమ్మ ఇచ్చిన పెళ్లి కానుక. కట్నమే అనుకోండి. మా నాన్న అల్లుడి పేరు మీద రాస్తానన్నాడు. కానీ మా అమ్మవొప్పుకోలేదు. బాగా కోట్లాడి నాపేరు మీదనే రిజిస్టర్ చేయించింది. అలా మా అమ్మ ముందుచూపు వల్ల ఆస్తి నా పేరు మీదే ఉంది. ఇదే కాదు, ఊర్లో నాలుగెకరాలు భూమి కూడా అంతే పంతంతో అన్నయ్య, నాన్నా అడ్డుపడుతున్నా నా పేరు మీదికి రాయించింది. అదంతా అమ్మ ఆస్తి మరి. వీడిలా చావగొడుతున్నాడని తెలిసి ఎన్నోసార్లు అమ్మ వచ్చి కొట్లాడింది కూడా. ‘నా బిడ్డ వొంటి మీద చెయ్యేస్తే ఊరుకోను అని’ అమ్మున్నంతసేపూ గమ్మున ఉంటాడు. వెళ్ళాక షరా మామూలే. నేను తిరిగి కొడితే ఇంకా రెచ్చిపోతాడు. ఇక అమ్మైతే తనతో వచ్చెయ్యమంటుంది. కానీ పుట్టింటికి వెళితే అన్నయ్యా, వదినలతో గొడవ. ఎందుకు వీడితోనే గెలిచి తీరుతా అనుకుంటానెప్పుడూ. కానీ పిల్లలు చాలా డిస్టర్బ్ అవుతున్నారు. వాళ్ళ గురించే నా చింత అంతా. వాళ్లని మంచి వాతావరణంలో పెంచాలి అని ఉంది నాకు. వీడిలా పిచ్చి పిచ్చివేషాలు వేస్తే ఈ ఫ్లాట్ అమ్మేసి ఫిక్స్డ్ లో వేసి నా పిల్లల్ని పెంచుకుంటా. తర్వాతెలాగూ ఉద్యోగం చేసుకుంటా అనుకోండి!” అంది.
‘‘ఇప్పటికైనా ఏమైంది? ముందు పోలిస్ స్టేషన్ లో, లేదా మా మహిళా సంఘంలోవచ్చి వంటి మీద దెబ్బలున్నప్పుడే కంప్లైంట్ ఇవ్వమని” చాలా సార్లు చెప్పాను.
ఒకసారి ఆమె వొంటి మీది దెబ్బలున్నప్పుడే, తీసుకెళ్ళ బోయాను కూడా. ఊహు… వినలేదు. ఇంట్లో పోలీస్ కంప్లైంట్ విషయం వస్తే చాలు, ‘నాన్నని పోలీసులు తీసుకెళతారా అమ్మా’ అంటూ పిల్లలు భయపడుతున్నారు. వద్దు కాంచనా, నేను చూసుకుంటా ఇతని సంగతి’ అంది. మెల్లిగా ఆమెని పీజీలో చేరమని చెప్పాను. ఈ కొత్త ఇంటికి వచ్చి ఎనిమిది నెలలు అవుతుంది. ఈ కాలమంతా లక్ష్మి నాతో, మాధుర్యతో మంచి స్నేహ సంబంధంలోనే ఉంటూ వచ్చింది.
ఇంతలో మాధుర్య ఫోన్ వచ్చింది. ‘‘కంచూ, ఇంటికి రావడం లేట్ అవుతుంది, నాకోసం ఎదురు చూడకుండా నువ్వు తినేయ్” అంది.
‘‘సరే కానీ నీ తిండి సంగతి ఏంటి, బయట తింటావా?” అన్నాను.
**
“ఏదో చోట తింటాలే. నువ్వు లాక్ పెట్టుకుని పడుకో’’అంటూ హడావుడిగా ఫోన్ పెట్టేసింది మాధుర్య. టైం దాదాపు తొమ్మిది అయింది. నేను డిన్నర్ తినేసి ఎప్పటిలా హాల్లో నా టేబుల్ ముందు కూర్చుని రేపు కాలేజ్ లో చెప్పడానికి సబ్జెక్ట్ నోట్స్ తయారీలో పడిపోయాను. చూస్తుండగానే పదకొండు అయింది. సెల్ మోగింది. పక్కింటి లో ఉంటున్న ఓనర్ లక్ష్మి ‘ఒకసారి రానా? పడుకోలేదు కదా’ అంది. ఎలాగూ నోట్స్ పని పూర్తవవచ్చింది. రమ్మన్నా. కాలింగ్ బెల్ మోగింది.
‘‘కాంచన సారీ డిస్టర్బ్ చేసాను’’ అంది లోపలి వస్తూ. మళ్ళీ కొట్టినట్ట్లున్నాడు ఆమె భర్త రవి. వాడికి తను మొన్నే వెళ్లి వార్నింగ్ ఇచ్చి వచ్చింది. ‘‘అబ్బే లేదు తెలుసు కదా నోట్స్ రాసుకుంటున్నా’’ అన్నాను.
‘‘మాధుర్య ఇంకా రాలేదా’’ అంది, లోపలి గదుల వైపు తలతిప్పి మాధుర్య కోసం వెతుకుతున్నట్లుగా చూస్తూ.
‘‘లేదు ఆమెకి ఏదో పార్టీ ఉంది లేట్ అవుతుంది’’ అన్నాను కూర్చో మన్నట్లుగా కుర్చీ చూపిస్తూ. ఈ ఎనిమిది నెలల్లో బాగా దగ్గరై పోయింది లక్ష్మి.
‘‘కొట్టాడా మళ్ళీ’’ మెల్లిగా అడిగాను.
‘‘లేదు ఈ మధ్యబాగా ఎదురు తిరుగుతున్నా కాంచనా. అస్సలు సహించడం లేదు. మొన్న రాత్రైతే తాగి వస్తే ఇంతలోకే రానివ్వలేదు’నువ్విస్తున్న ధైర్యం తో. పోలీస్ కంప్లైంట్ రాసి పెట్టాను. అది కూడా చూపించా వాడికి. సరేలే ఇదిగో ఇది చూడు” అంటూ ఏవో కాగితాలు చేతిలో పెట్టింది. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఏం.ఏ సైకాలజీ మొదటి సంవత్సరం అడ్మిషన్ పేపర్స్ అవి.
‘‘ఓహ్ కంగ్రాట్స్ డియర్’’ అన్నాను ఆనందంగా ఆమె చేయి పట్టుకుని. సిగ్గుపడుతూ ‘థాంక్స్’ చెప్పింది లక్ష్మి. ‘ఉండు స్వీట్ తెస్తాను’ అని చెప్పి వంటింట్లోకి వెళ్లి కళా ఖండ్ స్వీట్ తెచ్చి ఆమెకి ఇచ్చాను. లక్ష్మి మొఖం నిండా ఎన్నడూ చూడని ఆనందం. ‘‘నాలాంటి బాధిత స్త్రీలకి విమెన్ కౌన్సెలర్స్ అవసరం చాల ఉంటుంది అనిపించింది. అందుకే సైకాలజీ కోర్స్ ప్రిఫర్ చేసాను. దీంతో పాటు నువ్వు చెప్పిన జెండర్ స్టడీస్ కి కూడా అప్లై చేస్తున్న’’ అంది. ‘గుడ్ మంచి ఆప్షన్స్’ అన్నా. మంచి గిర్నార్ గ్రీన్ టీ చేసుకొని లక్ష్మితో ‘బాల్కనీ లో కూర్చుందాం రా’ అని తీసుకుపోయాను. అక్కడ రెండు కుర్చీల్లో కూర్చొన్నాం. ఇద్దరి మధ్యా నిశబ్దం. బాల్కనీ లోని చల్ల గాలిలో, దూరాన చీకట్లో వెలిగే కృత్రిమ లైట్ల కాంతులని, ఆకాశపు నక్షత్రాలు వెక్కిరిస్తున్నట్లుగా ఉన్నాయి.
‘‘కాంచనా నిన్ను నేను ఏమైనా అడగొచ్చా”? అంది ఉన్నట్లుండి లక్ష్మి. ‘‘ఏమైనా అంటే?’’ అన్నాను కొద్ది పాటి ఆశ్చర్యంతో.
‘‘అదే నీ జీవితం గురుంచి. నువ్వెందుకు ఇంకా పెళ్లి చేసుకోలేదు? మాధుర్య ఎవరసలు? మీ ఇద్దరూ కేవలం ఫ్రెండ్సేనా లేక’, అంటూ కొద్దిగా వెరపుగా ఆగిపోయింది. నాకు తెలుసు లక్ష్మి అనుమానం ఏమిటో? మొన్నోసారి కిచిడీ చేసి వేడివేడిగా పట్టుకొచ్చింది. తలుపులు దగ్గరగా వేసి ఉన్నాయి. నేను వంటింట్లో వంట చేస్తున్న మాధుర్యని, ఆమె వెనకనుంచి గాఢంగా కౌగలించుకుని మెడ మీద మోహంగా ముద్దులు గుమ్మరిస్తున్నాను. మా ఇద్దరికీ ఇలా ఒకరినొకరం ఆశ్చర్య పరుచుకుంటూ లవ్ మేకింగ్ చేసుకోవడం అంటే ఇష్టం. మాధుర్య నన్ను ముద్దుగా విసుక్కుంటున్నది. సరిగ్గా అప్పుడే లక్ష్మి వంటింట్లోకొచ్చి మమ్మల్ని అలా భార్యా, భర్తల్లా సన్నిహితంగా చూసి నిర్ఘాంతపోయి మళ్ళీ వెంటనే తట్టుకుని నిలబడి, ‘కిచిడీ తెచ్చాను’ అంటూ తన చేతిలో ఉన్న హాట్ బాక్స్ ని ముందుకు చాపి, ఖంగారుగా అక్కడినుంచి వెంటనే పరుగున వెళ్లి పోయింది. ‘ఖర్మ,ఈమె కూడా ఇల్లు ఖాళీ చేయమంటుందా ఏంటి” అంది మాధుర్య కొద్దిపాటి భయంతో.
‘‘కంచూ ఇక మనం స్వంత ఫ్లాట్ కి ప్లాన్ చేద్దాం. మన సంగతి తెలిసిన వాళ్ళెవ్వరూ ఇక మనల్ని ఇళ్ళు ఖాళీ చేయమనరు. ఈ బాధ, టార్చర్ ఉండదు ఇక మనకి, నా ప్రాపర్టీ డాక్యుమెంట్స్ తెచ్చుకుంటాను ఇంటికి వెళ్లి. అమ్మ నాన్న ఎప్పటి నుంచో పోరుతున్నారు’’ అంది మాధుర్య నా పెదవుల మీద సున్నితంగా ముద్దు పెట్టుకుంటూ. మేం ఇద్దరం గత రెండేళ్లుగా మూడిళ్ళు మారాం మరి. ఈ సంఘటన తరువాత నుంచి లక్ష్మికి మేమంటే మునుపు లేని ఆసక్తి పెరిగిందని తెలుసు. అయితే ఎప్పుడూ మాతో అమర్యాదగా ప్రవర్తించలేదు.
**
“అవును, మేం ఇద్దరం జీవన సహచరులం. మీ భార్యా భర్తల్లా. కానీ మేము లెస్బియన్స్ మి” అన్నా, చాలా సాధారణమైన విషయం చెప్తున్నట్లు నిదానంగా, స్థిరంగా. విచిత్రంగా లక్ష్మి మొఖంలో పెద్దగా ఆశ్చర్యం ఏమీ కనపడలేదు. ‘‘అనుకున్నానులే’’అంది తెలిసిన విషయాన్నే స్థిరపరుచుకుంటున్నట్లు.
‘‘మీరిద్దరూ ఎలా, ఎందుకు ఇలా”, అని అడుగుతూ సంశయంగా ఆగి పోయింది. నేను ఆమె వైపు నిదానంగా చూస్తూ ఉండిపోయాను. మమ్మల్నిద్దరినీ ఇద్దరు స్త్రీలై ఉండీ అంత దగ్గరగా చూసాక కూడా ఆమె తన మర్యాదని కోల్పోయి గతంలో మమ్మల్ని ఇల్లు ఖాళీ చేయించిన ఇంటి ఓనర్స్ లాగా నానా గొడవ చేసి, అసహ్యించుకుని, ప్రచారం చేసి, ఇంటిపైన అర్ధరాత్రి రాళ్ళువేసి,ఫేక్ కాల్స్ చేసి బూతులు తిడుతూ బెదిరిస్తూ వెళ్ళగొట్టలేదు. అది ఆమె సంస్కారమా, సౌజన్యమా, అయితే అది ఎక్కడనుంచి వచ్చింది? తమ సంబంధాన్ని ఇప్పటిదాకా తమని చూసిన లోకమంతా అసహ్యించుకుని, వెలి వేసి, కర్కశంగా తరిమేస్తే, లక్ష్మికి తెలిసీ తమని నిశబ్దంగా భరించాలని, మౌనంగా ఉండాలని ఎందుకు అనిపించి ఉండొచ్చు? లేక ఆమె మమ్మల్ని అంగీకరించిందా? ఎందుకు? ఆమెకి భర్తతో ఉన్న గొడవలని మేము అర్థం చేసుకుని ఆమెకి ధైర్యమిచ్చి నిలిచినందుకా? ఆమె దుఖాన్ని మేము స్వంతం చేసుకున్నందుకా? భర్త వల్ల ఆ అమానవీయమైన నొప్పి లోంచి, అవమానాల్లోంచి పుట్టిన రహస్యమయమైన సంఘీభావంగా ఆమె మమ్మల్ని అర్థం చేసుకుందా? నిజమైన సహజీవనపు అసలు సౌందర్యం ఆమెకి మమ్మల్ని చూస్తే అర్థం అయిందా? లేక ఆమె ఇద్దరు స్త్రీల మధ్య సంబంధాన్ని, శాస్త్రీయంగా, మానవీయంగా అర్థం చేసుకుందా? మొన్నఇంటి పక్కన ఉన్న కిరాణా షాప్ ముందుకు ఇద్దరు ట్రాన్స్ స్త్రీలు వచ్చి డబ్బు అడుక్కుంటూ ఉంటె షాప్ ఓనర్ లకారాలతో తిట్టడం మొదలు పెట్టాడు. చీదరించుకుంటూ వెళ్ళిపొమ్మని, లేకపోతే పోలీసులని పిలుస్తానని అరుస్తున్నాడు. అప్పుడు అక్కడే ఉన్న లక్ష్మి షాప్ యజమానిని మందలించి వాళ్లకి వంద రూపాయలు ఇచ్చి పంపించింది. అప్పుడే షాప్ లోకి వెళ్ళిన నాకు ఈ దృశ్యం ఎంతో అందంగా కనిపించింది.
‘‘మా గురుంచి ఎవరు పట్టించుకుంటారు సార్, మాకెవరూ పనులిచ్చేవాళ్ళులేరు. అడుక్కోడం తప్ప వేరే దారేముంది. అట్లా అసహ్యంగా తిట్టడం దేనికి సార్, మీ ఇళ్ళ ల్లో మాలాగా ఆడవాళ్ళు లేరా? నిండు నూరేళ్ళూ బతుకమ్మా నువ్వు” అనుకుంటూ వయసుమళ్ళిన ట్రాన్స్ స్త్రీ లక్ష్మి ఇచ్చిన వంద రూపాయల నోట్ ని కళ్ళకద్దుకుని తన వాళ్ళని తీసుకొని వెళ్లిపోయింది. నేను లక్ష్మిని అక్కడికక్కడే అభినందించాను. లక్ష్మిలో మనుషుల్ని ఉన్నదున్నట్లుగా అంగీకరించే సౌజన్యమేదో ఉంది. ట్రాన్స్ స్త్రీల పైన ఆమె చూపించిన సహానుభూతి లాంటిదేనా నన్నూ, మాధుర్యని అర్థం చేసుకోవడం కూడా? లేకపోతే ఇంకా ఏదైనా నాకు అంతుపట్టని మానవీయమైన, మానసికమైన, స్త్రీ పురుష సంబంధాలకి సంబంధించిన అంతు తెలీని, మార్మికమైన, పోనీ శాస్త్రీయ జ్ఞానమేమైనా ఆమెకి ఉందా? లక్ష్మిని ఇంత మానవీయంగా చేసిన ఆ విలువలు ఏంటి? ఎప్పటికైనా నాకర్థం అవుతుందా? నేనూ, మాధుర్య సహజీవనం చేస్తున్నామని చెప్పాక కూడా ఆమె మొఖంలో కించిత్తు విభ్రమం కానీ, అసహ్యం కానీ కనపడలేదు. తనకు తెలిసినదేదో ఖరారు అయిన భావం మాత్రమే కనిపించింది. ఎంత సాధన చేస్తేనో కానీ అందని మానసిక సంయమనం అది.
**
‘‘మీ ఇద్దరిలో ఎవరు భర్త, ఎవరు భార్య?” ఒకింత ఆసక్తితో అడిగింది లక్ష్మి.
‘‘ఒకసారి ఆమె పురుషుడు, నేను స్త్రీ! మరోసారి నేను పురుషుడు, ఆమె స్త్రీ! కొన్ని సార్లు ఇధ్ధరమూ స్త్రీలమే! చాలా సార్లు నేనే ఎక్కువగా పురుష లక్షణాలతోఉంటాను. స్త్రీ పురుషులుగా ఒకే దేహం నుంచి ఉద్భవించే యుగళ గీతాల్లాంటి వాళ్ళం మేము. అయినా మాఇద్దరి మధ్యా భార్యా భర్త అనే అధికార సంబంధం లేదు. మేము స్నేహితుల్లాగా ఉంటాం” అన్నాను చిరు నవ్వుతో.
‘‘మరి పిల్లలు?’’ ఈసారి ప్రశ్నిస్తున్నట్లుగానే అంది లక్ష్మి.
‘‘దత్తత తీసుకుంటాం’’ అన్నాను నేను.
‘‘మరి వాళ్ళు పెరుగుతున్న క్రమంలో వాళ్లకి సమాజంలో సమస్యలు రావా?” లక్ష్మి.
‘‘వస్తాయి, అప్పటి సమస్యలు అప్పుడు స్పష్టం అవుతాయి. వాటిని డీల్ చేయడం కూడా మెల్లిగా మాకు అర్థం అవుతుంది’’ అన్నాను.
‘‘కాంచనా ఎందుకు మీరిద్దరూ ఈ నిర్ణయం తీసుకున్నారు. అసలిదంతా ఎలా జరిగింది? మీ ఇంట్లో పెద్దవాళ్లు వొప్పుకున్నారా? లక్ష్మి.
‘‘లేదు మాధుర్య పేరెంట్స్ వొప్పుకోలేదు. చాలా పోరాటం చేయాల్సి వచ్చింది. నాకు అమ్మా,నాన్న లేరు. అంటే అమ్మా, చెల్లి పోయారు. నా సవతి తండ్రి జైల్లో ఉన్నాడు. నా కన్నతండ్రి నా చిన్నప్పుడే చనిపోయాడు. అమ్మ మళ్ళీ పెళ్లి చేసుకుంది. కాబట్టి నాకు పేరెంట్స్ సమ్మతికి సంబంధించిన సమస్యే రాలేదు’’ అన్నాను.
‘‘నాన్నెందుకు జైల్లో ఉన్నాడు, చెల్లికేమైంది? ఎలా పోయింది? ఇంత చిన్న వయసులో ?’’లక్ష్మి ఆశ్చర్యంగా అంది.
‘‘చెప్తాను నాన్న జైల్లో ఉండడానికి, నేను సహజీవనాన్ని ఒక పురుషుడితో కాకుండా స్త్రీతో ఎన్నుకోవడానికి ఉన్న సంబంధం నీకు బాగా అర్థం అవుతుంది. అయితే లక్ష్మీ నీకు మా విషయం తెలిసింది కదా. మమ్మల్ని ఇల్లు ఖాళీ చేయిస్తావా ఏంటి?’’ చిన్నగా నవ్వుతూ అడిగాను.
‘‘అబ్బే అలా ఏమి చెయ్యను’’ అంది లక్ష్మి.
‘‘మరి మీ ఆయన ఊరుకుంటాడా?’’ అడిగాను.
‘‘ముందైతే ఆయనకీ మీ విషయం తెలీదు. ఒక వేళ తెలిసినా ఈ ఇల్లు నాది, ఆయనది కాదు.‘‘ ఒకింత గర్వంతో అంది లక్ష్మి. చిన్నగా నవ్వాను నేను.
‘‘మీ నాన్న జైల్లో ఎందుకున్నారు’’? మళ్ళీ అడిగింది లక్ష్మి
నాకెందుకో లక్ష్మి నన్ను సరిగ్గా అర్థం చేసుకుంటుంది అనిపించింది. నేను మెల్లిగా చెప్పసాగాను.
**
‘‘మాది చాలా బీద కుటుంబం నాన్న తాగుబోతు. అమ్మ హాస్పిటల్ లో నర్సు. ఇద్దరు అక్కచెల్లెళ్ళం. చెల్లి రూప. మా బాల్యం అత్యంత భయంకరమైంది. ఎవరికీ ఇలాంటి బాల్యం ఉండకూడదు. చిన్నప్పటినుంచి నుంచి మాతో నాన్నఅంటే మా సవతి తండ్రి ప్రవర్తన బాగుండేది కాదు. అమ్మని తాగుడుకి డబ్బు కోసం బాగా కొట్టేవాడు. అమ్మ నైట్ డ్యూటీ చేసినప్పుడు రాత్రుళ్ళు మా మధ్య పడుకుని వికారంగా చేసేవాడు. మా లోదుస్తుల్లో చేతులు పెట్టేవాడు. మా రెండు కాళ్ళ మధ్య బాగా నొప్పి అయ్యేది. ‘‘అమ్మకు చెప్తే ముందు అమ్మని, మిమ్మల్ని చంపేస్తా’’ అనేవాడు నాన్న. అమ్మని చంపేస్తే మేము ఎక్కడ ఉండాలి అని భయపడే వాళ్ళం. నాన్న చెల్లి కంటే నామీదే ఎక్కువగా చెడ్డ పనులు చేసేవాడు. భయంతో రాత్రుళ్ళు పక్కతడిపిసే దాన్ని. నాన్న దగ్గరికి వెళ్ళేదాన్ని కాదు. చెల్లి నా కంటే ఐదేళ్లు చిన్న. నా ఒళ్లంతా తడుముతూ “ఇది నా తండ్రి ప్రేమ, ఇలానే ఉంటుంది, మీ అమ్మ కూడా నిన్ను ఇలా ముద్దు పెట్టుకోదా” అంటూ అనేవాడు నాన్న. కానీ అమ్మ మా కాళ్ళ మధ్య చేతులతో తడమడం చేయదుగా?
**
నాన్న భయం తో చదువులో పూర్తిగా వెనకబడిపోయాను. ‘‘అమ్మతో చెప్తే ఇద్దర్ని చంపేస్తాను’’ అని బెదిరించేవాడు నాన్న. భయంతో అన్నం సహించేది కాదు, నిద్రపట్టేది కాదు. నాన్నని తప్పించుకోవడానికి వీధుల్లో, పక్కిళ్లలో ఎక్కువగా గడిపే దాన్ని. వెతుక్కుని మరీ గుంజుకు పోయేవాడు. ‘అన్నం తిందువు రా, హోంవర్క్ చేసుకుందువు రా’ అంటూ. అమ్మకి నైట్ డ్యూటీ లేకపోతే చాలా ఆనందంగా ఉండేది. కానీ నాన్నఅమ్మని నన్ను సతాయించినట్లే సతాయించేవాడని, రెండు గదుల ఆ చిన్న ఇంట్లో స్పష్టంగా తెలిసేది. అమ్మ చాలా ఏడ్చేది. ‘వదిలేయ్’ అంటూ. అమ్మ బుగ్గలు, పెదాల మీద గాట్లు కనపడేవి. ఒక్కోసారి అమ్మ పళ్ళ బిగువన భరించలేని బాధను ఓర్చుకోలేక తలుపు తీసి రోడ్డు మీదకి వెళ్ళిపోయేది. నేను చెల్లి అమ్మని పట్టుకొని కుళ్ళి కుళ్ళి ఏడ్చేవాళ్ళం. ‘‘నాన్నఅక్కని బాగా కొడతాడు’ అని చెప్పేది చెల్లి అమ్మతో. నేను భయంతో చెల్లి నోరు మూసేసేదాన్ని. నాన్న నన్ను ఏం చేస్తాడో అమ్మకు తెలిస్తే అమ్మ నాన్నని చంపేస్తుందేమోనని. ఒకే ఇంట్లో మేము పులి, కుందేళ్ళ లాగా బతుకుతున్నాం. అమ్మ డ్యూటీ కి వెళ్లి పోగానే నాన్న మమ్మల్నిఆకలితో ఉన్న తోడేలు లాగా పట్టేసుకునేవాడు. అమ్మని రాత్రి డ్యూటీ కి వెళ్ళ ద్దని ఏడ్చేవాళ్ళం. నేను నాన్న చేసే గలీజు పనుల వల్ల మాటిమాటికి మూత్రంలో మంటతో ఏడ్చేదాన్ని. ఒక రోజు చాలా ఏడ్చాను నొప్పి భరించలేక. అమ్మకి ఇలా ఎందుకు అవుతుందో చెప్పలేక, మనసులో ఉంచుకోనూలేక, మంట, నొప్పి, భయంతో నరకబాధ అనుభవించాను. ‘‘ఏమైంది, ఎందుకు’’? అని అమ్మ ప్రేమగా అడుగుతున్నా ‘లేదు, లేదు ఏం లేదు’ అన్నాను బాధ భరిస్తూ చిప్పిల్లుతున్న కన్నీళ్ళతో. ఆ స్థితి అలా ఎందుకు ఉందో చెప్పబోతున్న చెల్లిని కళ్ళతో బెదిరిస్తూ. అమ్మకు ఎందుకో భయం వేసింది.వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లింది. డాక్టర్ నన్ను రెండు కాళ్ళ మధ్య పరీక్ష చేసి ‘మీ పాప ప్రైవేట్ పార్ట్స్ లో ఎవరు వేళ్ళు పెడుతున్నారు. అందుకే ఇంత వాపు, నొప్పి. ఎవరో తెలుసుకోండి’ అన్నాడు ఆందోళనగా. అమ్మ దిగ్భ్రాంతికి గురైంది. గుండెలు పగిలేలా ఏడ్చింది. ఎవరో చెప్పమని బ్రతిమిలాడింది. నేను చెప్పలేదు, చెప్పబోయే చెల్లి నోరు మూసేశాను.
**
ఆ రోజు అమ్మకి నైట్ డ్యూటీ ఉండింది. నాన్న చేసిన పనితో నాకు చాలా నొప్పి వచ్చింది. మూత్రంలోమంట, మూత్రం పోసే దగ్గర నొప్పి ఎక్కువైపోయాయి. ‘వద్దు నాన్న’ అని అమ్మ నాన్నను బ్రతిమిలాడినట్లే బ్రతిమిలాడాను. ఆ రోజు రాత్రి నా రెండు కాళ్ళ మధ్యలోకి కత్తి దించుతున్నట్టే అనిపించింది. నొప్పితో ఊపిరాగిపోయేలా అరుస్తూన్న నా నోరు మూసాడు నాన్న. ముందు గదిలో ఉన్న చెల్లి వలవలా ఏడుస్తున్నది. నేను స్పృహ తప్ప పడిపోయాను. మొఖం మీద నీళ్ళు చల్లి లేపాడు ఆ నీచుడు. చిన్న టవల్ మడిచి కాళ్ళ మధ్య పెట్టుకోమన్నాడు. ‘‘ఫో చెల్లి దగ్గర పడుకో ఫో” అన్నాడు. మర్నాడు పొద్దున్నఅమ్మ లేపింది నన్ను, ‘స్నానం చేద్దువు లే కంచూ’ అంటూ. పళ్ళు తోముకుంటూ నొప్పితో వణికి పోతున్నాను. తల స్నానానికి బాత్రూంలోకి తీసుకెళ్లింది. ఇక దుర్మార్గుడు గురించి అమ్మకి చెప్పేయాలని గట్టిగా అనుకున్నాను. కానీ అమ్మని నాన్న చంపేస్తాడేమో ఎట్లా? అమ్మ నాకు తల వీపు రుద్దింది. పాదాలు రుద్దడానికి కాళ్ళు స్టూల్ మీద పెట్టమంటే పెట్టలేకపోయాను. కాలు జరుపుతుంటే కాళ్ళ మధ్య నుంచి రక్తం కారింది. భయంతో అరిచాను. ‘‘నువ్వు పెద్ద మనిషి అయ్యావు కంచూ. జాగ్రత్తగా ఉండాలి నాన్నా” అంటూ గుండెలకు హత్తుకుంది. ఐదు రోజులు సెలవు పెట్టి నన్ను కంటికి రెప్పలా కాచుకున్నది. చుట్టుపక్కల ఎవరైనా అబ్బాయిలు వస్తున్నారేమోనని కనుక్కుంది. చెల్లికి పక్కన తీసుకెళ్లి ‘రూపా, నాన్న గురించి నువ్వు అమ్మకి చెప్తే నాన్న అమ్మని చంపేస్తాడు. మనకిక అమ్మ ఉండదు ప్లీస్ చెప్పకు’ అని ఏడుస్తూ చెప్పనని చెల్లి తో ప్రామిస్ తీసుకున్నాను. నిస్సహాయమైన చూపులతో మెల్లిగా కన్నీళ్లను తుడుచుకుంది చెల్లి.
**
ఒక రోజు నాన్న చెల్లితో నాతో చేసినట్లు చేస్తుండడం చూసి, వణికిపోయాను. చాలా కోపం వచ్చింది. వెళ్లి నాన్న మీద పడ్డాను. ‘వదులు చెల్లిని’ అంటూ చేతులతో రక్కాను. చెల్లి మీద నుంచి నాన్నని గుంజిపడేయ్యడానికి చూసాను. చెల్లి ఏడుస్తున్నది. నాన్న నన్నుఅవతలకి విసిరి కొట్టాడు. నా బలం సరిపోలేదు. ఆ రోజెందుకో నన్ను వదిలిపెట్టాడు. పొద్దున్న ఇంకా అమ్మ నైట్ డ్యూటీ నుంచి రాలేదు. నేను గబా గబా నాన్న దగ్గరికి వెళ్లి ధైర్యంగా ఆయన ఎదురుగా నిలబడి, ‘చెల్లిని అలా చేయకు’ అన్నాను కోపంగా. నాన్న నా చెంప పగలగొట్టాడు. అంత దూరం వెళ్లి పడ్డాను.
**
నైట్ డ్యూటీ నుంచి అమ్మ వచ్చింది. అమ్మకి ఆరోజు సెలవు. చెల్లికి స్నానం చేయిద్దామని అమ్మ చెల్లి బట్టలు విప్పింది. నేనక్కడే ఉన్నాను అమ్మకి సాయంగా. పైగా చెల్లి కూడా చల్లని నీళ్ళు పడితే మంట ఎక్కువై ఏడుస్తుంది. చెడ్డి అంతా గంజిలా జిగురు జిగురుగా ఉంటే అమ్మ నిర్ఘాంతపోయింది. ‘నాన్న, నాన్న’ అంటూ వెక్కిళ్లు పెట్టింది. అమ్మకి క్షణాల్లో అంతా అర్థం అయిపోయింది. ఇన్నాళ్ళ మా పరిస్థితికి కారణం ఎవరో అమ్మకి అర్థమైపోయింది. అంతే వెంటనే అమ్మ భయంకరమైన కోపంతో కర్ర తీసుకొని నిద్రపోతున్న నాన్నని బాదింది. గావు కేకలు వేస్తూ నాన్న లేచాడు. అమ్మ చెల్లి చెడ్డి పట్టుకుని నాన్నకి చూపిస్తూ “ఏంట్రా కుక్కా ఇది”? అంటూ నాన్న మీదకు వెళ్ళింది. అంతే నాన్న అదే కర్ర గుంజుకుని అమ్మని చావ బాదాడు. ‘ఇద్దరితో కాపురం చేస్తానే ఇది నా రెండో పెళ్ళాం’ అంటూ ఎంతలా బాదాడంటే అమ్మ ఒళ్లంతా రక్తపు మరకలు అయినాయి. అమ్మ కుప్పకూలి పోయింది. నేను వెళ్లి నాన్నకు అడ్డం పడుతున్నా ఆపలేదు ఆ రాక్షసుడు. **
నాకు అన్ని అర్థమవుతున్నాయి. నాకు పన్నెండేళ్లు వచ్చాయి మరి. అమ్మ, నాన్నను వదిలేసి ఇల్లు మారింది. హమ్మయ్య అక్కడ నాన్న లేడు. ధైర్యంగా అమ్మకి, నాన్ననాతో, చెల్లితో చేస్తున్న దుర్మార్గం అంతా చెప్పాము నేను చెల్లి. అమ్మ మమ్మల్నిద్దర్నీ గుండెలకదుముకొని గొంతు తెగిపోయేలా “ఎందుకు నాకు చెప్పలేదమ్మలు”? అంటూ మమ్మల్ని ఏడుస్తూనే రెండు చేతులతో భుజాలు కుదుపుతూ, ఆపుకోలేని దుఖం, బాధ, ఉద్రేకంతో మా చంపల మీద కొడుతూ, తన చెంపలు వాయించుకుంటూ నేల మీద పడి ముడుచుకుపోయి, జుట్టు పీక్కొని కుళ్ళి,కుళ్ళి ఏడుస్తూనే ఉంది.
**
నాన్న లేని ఇల్లు చాలా హాయిగా ఉంది. ముఖ్యంగా రాత్రులు కంటినిండా నిద్రపోతున్నాం నేనూ, చెల్లి. కానీ నాలో భయం అలానే ఉండిపోయింది. అట్లా సంవత్సరం గడిచిపోయింది. నాకు పదమూడేళ్లు దాటాయి. ఒకరోజు మా అమ్మ లేన్నాడు నాన్న వచ్చాడు. నాన్నని చూసి చెల్లి భయంతో పారిపోయింది. బడి నుంచి అప్పుడే ఇంటికి వచ్చాము నేను, చెల్లి. నన్ను ఒడిసిపట్టి, తప్పించుకోవడానికి వీలు లేకుండా దారుణంగా రేప్ చేసాడు. లంగా అంతా నెత్తుటిమయం అయిపోయి. నేను స్పృహ తప్పి పోయాను. అమ్మ వచ్చింది కాళిక అయిపోయింది. నన్ను అట్టాగే ఎత్తుకొని పోలీస్ స్టేషన్ కి వెళ్ళింది. నాన్న ఫోటో చూపించింది. కేస్ ఫైల్ చేసింది. నాన్న అరెస్టు అయ్యాడు. తన ఒంటి మీద నాన్న చేసిన రాక్షస గాయాలు కూడా చూపించింది అమ్మ. రొమ్ముల మీద, తొడల మీద నాన్న కాల్చిన సిగరెట్ మచ్చలని చూపించింది. అమ్మందుకే రాత్రుళ్లు తలుపు తీసుకొని రోడ్డుమీదకి పారిపోయేది. నేను కూడా కోర్టులో నాన్న చిన్నప్పటినుంచి నా మీద చేసిన అక్రుత్యాలన్నీ ధైర్యంగా చెప్పాను. చెల్లి కూడ అంతే ధైర్యంగా చెప్పింది. అమ్మకు తోడుగా మహిళా సంఘాలు చాలా పెద్ద గొడవ చేశాయి. వాడికి 29 సంవత్సరాలు అంటే జీవితకాల శిక్ష పడింది. కోర్టులో శిక్ష ఖరారు కాంగానే అమ్మ వెళ్లి వాడి మీద ఉమ్మింది. నేను చాలా రోజులు హాస్పిటల్ లో ఉండి వచ్చాను. అక్కడ నాకు నాలోపలి భయం, దుఖం, బాధ పోవడానికి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఎంత ట్రీట్మెంట్ చేసినా, నాన్న చేసిన గాయాలు చాలా లోతైనవి. నాకు పురుషులంటేనే చిన్నప్పటి నుంచీ ఉన్న భయం, నా సవతి తండ్రి చేసిన రేప్ వల్ల ఒక ఫోబియాగా మారిపోయింది. వాళ్ళని చూస్తే భయం తో పాటు విపరీతమైన అసహ్యం వేసి వొళ్ళంతా జలదరించేది.
**
తర్వాత అమ్మ మా గురించి చాలా జాగ్రత్తలు తీసుకునేది. ఒంటరిగా వదిలేది కాదు, తనతో హాస్పిటల్ కి తీసుకెళ్లేది. మా మీద పురుషుల కన్ను పడకూడదని మా ఇద్దరికీ పాంట్, షర్టు వేసేది. జుట్టు క్రాఫ్ చేసేది. చెల్లి పంజాబీ డ్రెస్సులు, గౌన్లు కావాలని చెల్లి గొడవ పెట్టేది. నాకు మాత్రం ప్యాంటు షర్ట్స్ లోనే రక్షణగా అనిపించేది. నన్ను నేను మగపిల్లాడిగా ఊహించుకోవడం అప్పుడే మొదలైంది. చాలా బాగుండేది ధైర్యంగా అనిపించేది. చెల్లిని అమ్మను చూసుకునే బాధ్యత నాది అనిపించేది. నేను మగవాడి లాగా, నిర్లక్ష్యంగా, సాహసంగా, ఇంటి పెద్ద లాగా ఫీల్ అవ్వసాగాను. జిమ్ లో చేరి కండలు పెంచాను. కరాటే నేర్చుకున్నాను. అబ్బాయిలు చేసే సాహసంతో కూడిన అన్ని పనులూ చేయసాగాను. ఇక అమ్మ నన్ను, చెల్లిని హాస్టల్లో ఉంచి చదివించింది. నాకు చెల్లికి స్కాలర్షిప్ వచ్చేది. అమ్మ వారం వారం వచ్చి జాగ్రత్తలు చెప్పేది. అలా మా చదువులు ఇంటర్ వరకూ సాగాయి. అమ్మ ఎన్నో ఆశలు పెట్టుకుంది మా ఇద్దరి మీద. కానీ చెల్లి నాకు, అమ్మకు పెద్ద షాక్ ఇచ్చింది. ఎవరో అబ్బాయిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. తను చాలా ఆలోచించే నిర్ణయం తీసుకుందని, ప్రణవ్ తనను చాలా గాఢంగా ప్రేమిస్తాడని, తనను బాగా చూసుకుంటాడు అన్న నమ్మకం ఉందని, తాను చాలా సంతోషంగా ఉన్నానని, తన గురుంచి వెతకొద్దు అని ఉత్తరం రాసింది. కనీసం ఎక్కడుందో కూడా రాయలేదు. అమ్మ కుప్పకూలిపోయింది. వారం రోజులు అన్నం తినలేదు కృంగి కృశించి పోయింది. చెల్లి హాస్టల్, కాలేజీ ఫ్రెండ్స్ అందరిని అడుగుతూ పిచ్చిగా, వెర్రిగా తిరిగింది. రోజులు గడిచిపోతూనే ఉన్నాయి. చెల్లి కబురే లేదు. అలా సంవత్సరం గడిచిపోయింది. నిజానికి చెల్లి, నేను మంచి స్నేహితులం. ఇద్దరివీ అవే రక్తాలోడే గాయాలు. నాతో ఎందుకు సంబంధం పూర్తిగా తెంపుకుందో తెలియదు. ఎన్నో సార్లు చెల్లిని తల్లిలా గుండెల్లో పెట్టుకుని వోదార్చాను. అన్నం తినిపించాను. నాన్న పెట్టె బాధలవల్ల ఇద్దరి మధ్య సహానుభూతి లాంటిది ఏర్పడి పోయింది. చెల్లి నన్ను అలా దూరం ఉంచినందుకు, నమ్మనందుకు నాకు చాలా దుఃఖం వచ్చింది. నాకు తెలీకుండానే చెల్లిని నేనేమైనా గాయపరిచానా అని నా మీద నాకే అనుమానం వచ్చింది. ఇక అమ్మ పూర్తిగా మారిపోయింది. అన్నం తినదు నిద్రపోదు, రాత్రింబగళ్లు చెల్లిని కలవరిస్తూ ఉంటుంది. ఉన్నట్లుండి ఒకరోజు, టీవీలో, న్యూస్ పేపర్ లో చెల్లి ఫోటోతో సహా ఒక భయంకరమైన వార్త వచ్చింది. తొలి చూలు ఆడపిల్లని కన్నదని బిడ్డని, తల్లిని గొంతు నులిమి చంపిన భర్త, అత్తమామలు అని. చెల్లి రూప ఫోటోతో సహా వేశారు. మా గుండె పగిలిపోయింది. చెల్లి ఊరికి పరిగెత్తుకుంటూ వెళ్లాం నేను అమ్మ. ప్రవీణ్ వాళ్ళ అమ్మా,నాన్నా పారిపోయారు. అప్పటికే పోస్ట్ మార్టం చేసేసారు. పచ్చి బాలింతైన చెల్లి ఒంటినిండా దారుణమైన గాయాలున్నాయి. భర్త కాల్చినవి. సిగరెట్లతో, బెల్టుతో కొట్టిన కమిలిన మచ్చలు, పాతవి కొత్తవి. గోడకేసి కొడితే చితికిన తల, రాలిపోయిన పళ్ళు. దేహం ఒక చిత్రహింసల మాంసపు ముద్దలా ఉంది. చివరి స్నానం చేయిస్తూ అమ్మ చెల్లి దేహం మీద గాయాలు తడుముతూ కుళ్ళి కుళ్ళి ఏడ్చింది. చెల్లిని సమాధి చేసాము.
**
తర్వాత చెల్లి వస్తువులు తీసుకొచ్చాం. డైరీలో తన సమస్త బాధలని రాసుకుంది. నాకు రాసిన పోస్ట్ చేయని ఉత్తరాల్లో ‘అక్కా ఈ నరకం నుంచి నన్నుతీసుకెళ్ళిపో. ప్రవీణ్ తన కుటుంబ చరిత్ర పెళ్ళైన తర్వాత తెలుసుకున్నాడు. నాన్నమనిద్దరి మీదా చేసిన లైంగిక అత్యాచారాలు అతనికి తెలుసునని రాసింది. అనుక్షణం నేను తండ్రి తోనే అపవిత్రమైన దాన్నట్టు హింసించేవాడు అని, మీ అక్క కూడా అదే జాతనే వాడు. తండ్రితో గర్భాన్ని మోసిన కులట అని నన్నుచిత్రహింసలు పెట్టేవాడు. ‘మీ అమ్మ,నువ్వు, మీ అక్క ముగ్గురూ కలిసి, మీ నాన్నతో కాపురం చేసేవారేంటే వంతులు వారిగా’? అని అసహ్యంగా మాట్లాడేవాడు. ప్రవీణ్ కి ఈ విషయాలు తెలియవనుకొని నేను అనాథని అని చెప్పాను. ప్రవీణ్ తో పెళ్లి కాగానే అతను ఊరు వచ్చేసాను. మీ ద్వారా మా అత్తింటి వాళ్లకి, భర్తకి మన విషయాలు తెలియకూడదని మీకు అడ్రస్ కూడా ఇవ్వకుండా స్వార్థం చూసుకున్నా. అక్కా, అమ్మా నన్ను క్షమించండి. కానీ అక్కా ఎవరో చెప్పేశారు ప్రవీణ్ కి, వాళ్ళ అమ్మ నాన్నలకి. పేపెర్ లో వచ్చిన వార్త కూడ చూపించారు. అంతే నా జీవితం పరమ ఘోరంగా మారిపోయింది. మీ జాడ తెలుసుకోవాలని చాలా ప్రయత్నించాడు. కానీ వీలవ లేదు. నేను చెప్పలేదు. ‘అక్కా నాన్న ఎందుకు మనతో అలా చేయాలి? ఏం పాపం చేసాం మనం? సవతి పిల్లల మైనా, పిల్లలమే, అతనికి బిడ్డలమే అవుతాము కదక్కా’? చెల్లి లేఖల నిండా ఈ రాతలే కనిపించాయి. అమ్మకి దాదాపు పిచ్చెక్కింది. రోడ్లమీద పరిగెత్తడం, బట్టలు చింపేసుకోవడం చేసేది. ఇంతలో నవ్వడం, అంతలో ఏడవడం చేసేది. అమ్మని మళ్లీ సైకియాట్రిస్ట్ కి చూపించాను. చాలా మందులు రాశాడు. వేసుకునేది కాదు. విసిరి కొట్టేది. నీళ్ళల్లో, చాయ్ లో మందులు కలిపిచ్చేదాన్ని. చెల్లిని కలవరిస్తూ ఏడ్చి ఏడ్చి అమ్మ సొమ్మసిల్లి పోయేది. ఈ లోపల చెల్లి భర్త, ప్రవీణ్ కి యావజ్జీవ కారాగార శిక్ష పడింది.
ఆ వార్తని అమ్మ నిర్వికారంగా విన్నది.
**
ఇలాంటి దుర్భర పరిస్థితుల్లోనే నా పీజీ పూర్తి చేసాను. పీహెచ్ డీ దాకా పట్టుదలగా కొనసాగించాను. రోజులు ఇలా నిర్వికారంగా గడుస్తూ ఉన్నాయి. మా సంతోషమంతా చెల్లి మరణంతో ఆవిరి అయిపోయింది. ఇదిలా ఉండగా ఒక రోజు అమ్మని పక్కింటావిడ దగ్గర విడిచి, నా పీహెచ్.డీకి సంబంధించిన పని మీద యూనివర్సిటీకి వెళ్లాను. అక్కడ దళిత పరిశోధక విద్యార్థిని శైలజను లైంగిక వేధింపులకు గురిచేస్తున్న ప్రొఫెసర్ స్వామిరెడ్డికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలో పాల్గొని ఇంటికి వచ్చేసరికి చాలా ఆలస్యమైంది. మధ్యలో పక్కింటి ఆంటీకి ఫోన్ చేసి కనుక్కుంటే ‘అమ్మ నిద్రపోతుంది నేను కొంచెం పనుండి వచ్చాను కాంచనా’ అని చెప్పింది. అమ్మకు తెలియకుండా పొద్దున్నే టీలో మందులు పొడి చేసి ఇస్తున్నాను. అందుకే ఈ మధ్య కొద్దిగా నిద్రపోతున్నది. పోనీలే నిద్రపోతుంది కదా అనుకుని స్థిమిత పడ్డాను. ఇంటికొచ్చేటప్పటికి సాయంత్రం ఆరయింది. నిద్రపోతున్న అమ్మ వైపు చూసాను. అమ్మ నిద్ర మామూలుగా లేదనిపించింది. ఎంత కుదిపిన లేవట్లేదు. పక్కనే నీళ్ల గ్లాస్ ఉంది. కింద అన్నీనేను నిన్ననే ఒక నెల కోసం కొన్న మందుల ఖాళీ స్త్రిప్స్ పడి ఉన్నాయి. అవే కాదు ఇంట్లో ఉన్న అన్ని మందులు స్త్రిప్స్ లోంచి వలవబడి ఖాళీగా పడి ఉన్నై. దాదాపు ఒక వంద మందు బిళ్ళల దాకా వేసుకున్నట్లుంది. నాకు కాళ్ళు చేతులూ వణికిపోయాయి. ఎప్పుడేసుకుందో? అమ్మ గుండె చప్పుడు ఎక్కడో వినిపిస్తుంది. శ్వాస కూడా సరిగ్గా లేదు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాను. ఎంత ప్రయత్నించినా అమ్మ బతకలేదు. ‘‘చాలా పవర్ఫుల్ మందులు వేసుకుంది. డిప్రెషన్ లో ఉన్నవాళ్ళకి ఇలాంటి ప్రమాదకరమైన మందులు అందుబాటులో పెట్టకూడదు అని తెలియదా మీకు’? అని డాక్టర్ కోపడ్డాడు. ‘‘నా భార్య కూడా డిప్రెషన్ పేషెంట్. మందులు ప్రతి పూటా నేనే వేస్తుంటా ఈ భయంతో. ఈ మానసిక రోగులు పసిపిల్లల లాంటి వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలమ్మా’’ అన్నాడు డాక్టర్ చెమ్మగిల్లిన కళ్ళతో.
**
అమ్మ నా గురించి ఆలోచించలేదు. తన సమస్త బాధలకి ఆత్మహత్యే పరిష్కారం అనుకుంది. నన్ను ఒంటరిని చేసేసింది. నాకు మగవాళ్ళ మీద ఉన్న వ్యతిరేకత ఇంకా పెరిగిపోయింది. నా సవతి తండ్రే కాదు నేను పెరుగుతున్న క్రమంలో స్త్రీల మీద, పిల్లల మీద లైంగిక అత్యాచారాలు చేసిన ఎంతోమంది పురుషులను చూస్తూ వచ్చాను. వార్తలు చదువుతూ వచ్చాను. వావి వరుసలు కూడా చూసుకోని పురుష మృగాలాంటి వాళ్ళను ఎలా నమ్మను? పురుషుల మీద నమ్మకం పూర్తిగా పోయింది. ఆఖరికి అమ్మను కూడా నాకు దక్కనివ్వని పురుష సమాజాన్ని ఇట్లా తయారు చేసిన వ్యవస్థ మీద అసహ్యం వేసింది. నన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నా అని వెంటపడుతున్న హరీష్ ని మొదటి నుంచి తిరస్కరిస్తూ వచ్చాను. ఖచ్చితంగా నో అని చెప్పేసాను. ‘నువ్వు ఆడదానివి కాదా ఇంత ప్రేమిస్తున్నా కరగవా’? అంటూ బాధపడ్డాడు. దుఖం ఆపుకోలేక భావోద్వేగంగా నన్ను కౌగలించుకుని నన్ను ముద్దు పెట్టుకోబోయాడు. నాకు ఆ స్పర్శ నా సవతి తండ్రిని గుర్తు చేసింది. వెంటనే అతన్ని తోసేసాను. ఏమో నాకు తెలీదు. ఒక్క హరీష్ నే కాదు నాకు పురుషులందరూ నా సవతి తండ్రుల్లాగే కనపడతారు. మృగాల లాగా దాడిచేసి, తూట్లు పొడిచే పురుష దేహం, ఆ క్రౌర్యానికి నిస్సహాయంగా బలి అయి పోయే బలహీనమైన, సున్నితమైన స్త్రీత్వం అంటే నాకు భయం. నాలో ఆ భావనలు, నేనొక స్త్రీనన్న ఎరుక పూర్తిగా పోయాయి. పురుషుడు అన్నా, అతని దేహ నిర్మాణం అన్నా విపరీతమైన అసహ్యం, భయం వేస్తుంది. పురుషుల డ్రెస్ లో ఉంటూ అమ్మాయిల మీద, చెల్లి మీద, నా మీద దాడి చేసే నా సవతి తండ్రి లాంటి మగవాళ్ళని ఎదిరిస్తూ, తంతూ తరుముతున్నట్లు, అమ్మని, చెల్లిని రక్షించే బలమైన పురుషుడిలాగా నేను చిన్నప్పటి నుంచే ఫీల్ అవుతూ పెరిగాను. అందుకేనేమో నాలో మెల్లగా పురుషుడికి తలుపులు మూసుకుపోయాయి. నా సవతి తండ్రి లాంటి దుర్మార్గుడితో అంతటి దైర్య సాహసాలతో యుద్ధం చేస్తూ గెలుస్తూ వచ్చిన అమ్మే నా హీరోయిన్! అంత పోరాడి కాపాడుకున్న చెల్లి అంత దారుణంగా హత్యకు గురైందని బాధ, వేదనలో షాక్ క్కి గురైన అమ్మ, ఇక పోరాడలేక ఆత్మహత్య చేసుకున్నాగానీ నిత్యం క్రూరుడైన భర్తతో పోరాడిన అమ్మనే నాకు ప్రేరణ!
**
అందరికీ కాదు కానీ చాలా మందికి పెళ్లి, భర్త అంటే హింసాత్మక జీవితాంతం తప్ప మరొకటి కాదని అర్థమయి పోయింది. నన్ను ప్రేమించిన మంచి వాళ్ళు అయినా హరీష్ లాంటి యువకుల పైన కూడా నాకు ఏ ఫీలింగ్స్ కలగడం లేదు. మమ్మల్ని నా సవతి తండ్రి క్రూరత్వం నుంచి, రక్షించిన అమ్మలాంటి స్త్రీలలోనే భద్రత ఉంది అని అర్థం అయిపోయింది. ఈ ఆలోచనలోంచి నాకు నా పీహెచ్డీ ఫ్రెండ్, స్టూడెంట్స్ యూనియన్ నాయకురాలు మానస మీద ప్రేమ ఆకర్షణ కలగసాగాయి. ఈ మార్పుకు నేను ఖంగారు పడ్డాను. కానీ నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. ఆమె గురించి ఆలోచించకుండా ఉండలేకపోయాను. ఆమె మీద రోజు రోజుకి ప్రేమ పెరగసాగింది. ఒకసారి ప్రేమలేఖ రాశాను. షాక్ కి గురైంది. ముక్కలు చేసి ముఖం మీద విసిరికొట్టి, క్లాస్ లో అందరికీ చెప్పింది. అందరూ నన్ను దూరం పెట్టసాగారు నన్ను‘లెస్బియన్’ అనసాగారు. నాకు బాధ కలిగినా భరించాను. చాలా సార్లు మానసని ముద్దు పెట్టుకోవాలనిపించేది. స్పర్శించాలన్నకోరిక వేధించేది. కానీ ఆమెకి ఇష్టం లేకుండా ఆ పని చేయలేను. ఆమెకు ఎలాగూ నేనంటే ఇష్టం లేదు. పైగా నాది ఎస్సీ కులం. ఆ చిన్న చూపు కూడా ఉంది యూనివర్సిటీలో. నా మీద ఎలాగూ ‘లెస్బియన్’ అన్న ముద్ర పడిపోయింది. నాకేం పెద్ద బాధ కలిగేది కాదు. అవును. నేను స్త్రీని ప్రేమించగలను, కానీ పురుషుడిని ప్రేమించలేను. మానసకు పెళ్లయి పోయిన రోజు బాగా ఏడ్చాను. నా పీహెచ్డీ పూర్తవుతున్న సమయంలో యూనివర్సిటీలో ఒక బ్రిలియంట్ దళిత క్రిస్టియన్ స్టూడెంట్, ప్రొఫెసర్స్ చూపించే కులవివక్ష భరించలేక ఆత్మహత్య చేసుకుంటే పెద్ద ఉద్యమం నడిచింది. ఆ సమయంలో ఇదిగో నాకు లాయర్ మాధుర్యతో పరిచయమైంది. ఆమె భర్తతో విడాకులు తీసుకుంది. ఆమె లెస్బియన్. భర్తతో సెక్స్ జీవితంలో రాజీ పడలేక పోయింది. అతని జీవితం నాశనం చేస్తున్నాఅని బాధపడింది. భర్తతో తన సమస్యని చెప్పుకుంది. టీనేజి నుంచే తనకి ఈ ఫీలింగ్స్ ఉన్నాయని అమ్మా, నాన్నలతో చెప్పడానికి భయపడ్డానని, చెబితే అమ్మ ముందే హార్ట్ పేషంట్. ఏమైనా అవుతుందని గమ్మున వాళ్ళు చూపించిన సంబంధం చేసుకున్నాననీ చెప్పింది. కానీ పెళ్లి అయ్యాక ఏడాది కాలం ఈ సమస్యతో సతమతమయ్యాక భర్తకి చెప్పుకుంది. అతను సహృదయుడు. తానే ప్రేమించిన అమ్మాయిని మర్చిపోలేక పోతున్నానని, ఆ అమ్మాయి ఇంకా పెళ్లి కాకుండా అలాగే ఉందని ఆమె లేనిది తానూ బతక లేనని తన తల్లి దండ్రులకి చెప్పాడు. మాధుర్యని అతను అంత సౌజన్యం తో అర్థం చేసుకున్నాడు. ఇద్దరూ మ్యూచ్యువల్ సపరేషన్ పద్దతిలో అత్యంత గౌరవంగా విడిపోయారు. మాకు ఇద్దరికీ స్నేహం కుదిరి మనసులు కలిసాయి. ముందుగా తనే ప్రపోజ్ చేసింది. ఇద్దరం ఒకరినొకరం అర్థం చేసుకోవడానికి కలిసి పనిచేసే క్రమంలోనే ఒక సంవస్తరం పట్టింది. ఇద్దరి మధ్య మంచి కంపాటబిలిటి ఉంది. మాధుర్య వాళ్ళ అమ్మా నాన్న మొదట చాలా వ్యతిరేకించారు. ఇంట్లో అంగీకరించడానికి రెండేళ్లు పట్టింది. ఇద్దరం ఇప్పుడు రెండున్నరేళ్లుగా లివింగ్ రిలేషన్లో ఉన్నాం. ఒక పాపని దత్తత తీసుకుంటున్నాం. త్వరలో తల్లి దండ్రులం అవ్వబోతున్నాం’’ సంతోషంగా నవ్వుతూ వెలిగి పోతూన్న కళ్ళతో చెప్పింది కాంచన.
**
కాంచన కథ వింటున్న లక్ష్మి అప్పటికి ఎన్ని సార్లు ఏడ్చిందో తెలీదు. ఆమె కళ్ళ నుంచి చెంపల మీదుగా కన్నీటి చారికలు ఎండిపోయి కనిపించాయి. ‘‘ఎంత భయంకరమైన బాల్యం మీది, నిజంగానే ఎంత బాధ పడ్డారు మీరంతా’’ అంది కదిలిపోతూ. మెల్లిగా వోదారుస్తున్నట్లు నా చెయ్యి నిమిరింది. ఆమె కళ్ళల్లో కన్నీటి పొరలు. వెంటనే తేరుకుని నా కళ్ళల్లోకి లోతుగా చూస్తూ ‘గట్టి పిండానివే ఎంత కష్టాన్నైనా తట్టుకునే శక్తి చాలా ఉంది నీకు. యూ ఆర్ మై హీరొయిన్”అంది. మళ్ళీ వెంటనే టాపిక్ డైవెర్ట్ చేయాలనుకుంటున్నట్లు.
**
‘‘అవునూ మీకు ఏ సమస్యలూ రాలేదా సమాజం, కుటుంబం నుంచి”? లక్ష్మి ఆసక్తిగా అడిగింది. ‘ఎందుకు రాలేదు లక్ష్మీ? చాలా ప్రశ్నలు అవమానాలు, అనుమానాలు వస్తున్నాయి. అన్నిటినీ ఫేస్ చేస్తున్నాం. మా మటుకు మాది చాలా అందమైన అనుబంధం. మాకు అత్యంత సహజమైంది. మా అనుభూతులకి భిన్నంగా పురుషులతో బతక మనడమే అసహజం, అన్యాయం. మాది సహజ లైంగిక ధోరణా కాదా అనేది పక్కన పెడితే, ఫ్యూడల్ వ్యవస్థ మూలాలున్నపెళ్లిలో పెత్తనాలు, ఆధిపత్యాలు, హింసా, తాళి కట్టాడన్న అధికారంతో మారిటల్ రేప్ లు చేస్తూ, కంట్రోల్ని ప్రదర్శించే భర్తలుండే దాంపత్యంలోని, ప్రేమ లేని , అసమ, అసహజ సంబంధం కంటే అక్రమమైంది ఏం ఉంది చెప్పు? ఇలాంటి ఏ సమానత్వం, గౌరవం లేని స్త్రీ, పురుషుల మధ్య జరిగే పెళ్లిలోని కృత్రిమ, షరతులతో కూడిన ప్రేమ కంటే కల్మషం లేనిది మా ఇద్దరి స్ర్తీల మధ్య ఉన్నప్రేమ.
మా మధ్య పెత్తనాలు, ఆధిపత్యాలు, అణిచివేత, క్రౌర్యం ఇవేవీ ఉండవు. ఒక్క ప్రేమా, పరస్పర గౌరవం తప్ప! మా సహజీవనం ఒక అద్భుతమైన పూల తోట. అందులో మా ఇద్దరి ప్రేమ, అనురాగం అనే పుష్పాలు, రాతిరి వెన్నెలలో, ఉదయపు లేత ఎండలో అత్యంత సహజంగా వికసిస్తాయి. ఎందుకంటే మాది బానిస, యజమాని సంబంధం కాదు కాబట్టి! మా సంబంధంలో అభద్రతా, భయం, నమ్మక ద్రోహాలు ఉండవు. మా మధ్య సెక్స్ కూడా చాలా గొప్పఅనుభూతితో మొదలై, మరో గొప్ప అనుభవంగా ముగుస్తుంది. కోరిక లేని భార్యని బల ప్రయోగంతో లొంగదీసుకోవడం గానూ, పురుషుడి కోరిక స్త్రీని బాధ పెట్టేట్లుగానో ఉండదు మా మధ్య శృంగారం. చల్లని వెన్నెలలో, మెరిసిపోతూ తెర్లుతూ ఉండే నదితో అందమైన చంద్రుడు పరవశంగా సంగమించినంత సహజంగా, అందంగా ఉంటుంది మా మధ్య శృంగారం. మీ భార్యా భర్తల మధ్య శృంగారం ఒక ఏక పక్ష ఆక్రమణలా ఉంటే, మా మధ్య సమంగా సాగే జుగల్బందీలా ఉంటుంది’ నేను చాల ప్రశాంతంగా, బహుశా పరవశంగా కూడా చెబుతూ పోతున్నాను. లక్ష్మి విభ్రమగా వింటూ ఉంది. ఇక మా ప్రత్యేక సమస్యల పరిష్కారాలూ అవీ ఎలా అంటావా?
మాకు సపోర్టుగా ఉండే ‘ఎల్జీబీటీ’ హక్కుల సంఘం లో చేరాం. ఈ సమాజం మమ్మల్నిఅంగీకరించక పోయినా ఫరవాలేదు. మాకు సవ్య మైనది అనిపించే దిశలో నడుస్తున్నాం. పోరాటం మా జీవితం లో భాగం అంతే. ఎవరేమనుకున్నా కానీ ముందుకే వెళతాం. తొలుత అసహ్యించుకునే వాళ్ళు, తరువాతి వాళ్ళూ, మా ముని మనుమల మనుమరాళ్ల తరంలో కొంచెం మాకు అనుకూలంగా మారవచ్చు” అన్నాను నేను రిలీఫ్ గా నిట్టూరుస్తూ.
**
విభ్రమంగా వింటూ ఉన్న లక్ష్మి “సరేలే ఏమనుకుంటారు. అనుకోనీ ఎలా అన్నా! వాళ్ళు, వాళ్ళ లాగా మాత్రమే ఆలోచిస్తారు. పొద్దున్న లేస్తే పెత్తనం చేస్తూ తాగో, తాగకో పురుషాహంకారంతో భార్యలను హింసించే నార్సిసిస్టిక్ మొగుళ్ళతో చేసే సంసారంలో, గుచ్చే ముళ్ళు తప్ప ప్రేమ పుష్పాలెక్కడ పూస్తాయని? అవునూ మీ మాధుర్యా, నువ్వూను ఈ ఓనర్ల బాధ పడలేక ఇల్లు కొనుక్కుంటామని అంటున్నారు కదా నా ఫ్లాట్ అమ్ముతాను. కొంటారేంటి? మార్కెట్ వాల్యూకే ఇస్తాను సుమా” నవ్వుతూ అడుగుతున్న లక్ష్మిని కాంచన అలా ప్రేమగా చూస్తూ ఉండిపోయింది. అప్పటికి చీకటి విచ్చుకుని వెలుతురు పూలు లక్ష్మి మొఖాన్ని వెలిగిస్తున్నాయి. నేను లక్ష్మిని ఆమె ఫ్లాట్లో వదిలి తిరిగి వచ్చాను. నా టేబుల్ మీద నా డైరీ పలకరించింది. రోజూ రాత్రి ఏదో ఒక భావం, ఆలోచన, కవిత డైరీలో రాసి గానీ పడుకోను. పక్కనే ఫోటో ఫ్రేమ్ లో మాధుర్య అందంగా నవ్వుతోంది. నవ్వుతున్న మాధుర్య పెదవులు ఉదయపు కాంతి పడి మెరిసి పోతున్న గులాబీ రేకుల్లా ఉన్నాయి. నాలో ఏదో తెలీని పరవశం కలిగింది.పెన్ అందుకున్నాను.
పాపులు !
నాకుతెలుసు! నిన్నుస్పర్శిస్తూ,
నన్ను నేను చాలా ప్రమాదంలో పడవేసుకుంటున్నానని !
కానీ,మన పెదవులు మోహంతో కలిసిపోతున్నప్పుడు,
ఏ నరకాన్నైనా ఎందుకు లెక్క చేస్తాను చెప్పు?
-లూనా మారియా.
అవును,మేము లూనా మారియా అన్నట్లు రిస్క్ తీసుకునే సహజీవనం చేస్తున్నాం. ఈ లోకులు మిమ్మల్ని పాపులనే అనచ్చు గాక! కానీ నమ్మండి, మేం నిజమైన ప్రేమికులం.