ఆనందరావు ఇల్లు

రెండు రోజుల నుండి ముగ్గురు కుర్రాళ్ళు కొత్త ఇంటి గోడలకు రంగులు వేస్తుంటే సంబరంగా చూస్తూ నుంచున్నాడు ఆనందరావు.
ఇన్నేళ్ళ తన సొంత ఇంటి కల నెరవేరినందుకు బహు ఆనందంగా ఉన్నాడాయన.

ఓ… నిన్ను కాదా…
ఏందే ఈ మనిషి పలకడూ…
అన్నా పిలుపుతో తిరిగి చూసాడు ఆనందరావు
ఎదురుగా భార్య లూదిమ్మ.
“ఇయ్యాలన్నా బ్యాంకు దగ్గరకు వెళ్ళి పిల్ల దండ విడిపించుకొస్తావా లేదా”

ఆ… ఎలతాను లేయే…
నీయమ్మ ఒట్టి నొసయ్యిపోయింది నీతో…
అంటూ భార్యను విసుక్కుంటూ వచ్చి గాబు దగ్గర కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లో కొచ్చాడు ఆనందరావు.
అది కాదయ్యా! ఎప్పుడో మొక్కలేసేటప్పుడు పిల్ల దండ తెచ్చి తాకట్టు పెట్టాం కదా…
పంట పండి అమ్ముకున్న తర్వాత కూడా దండ విడిపించకపోతే అల్లుడు పైకి ఏమనకపోయినా, మనసులో ఏమైనా అనుకోడా చెప్పు!
ఆనందరావుకు నచ్చచెబుతూ అన్నం తెచ్చి ముందు పెట్టింది లూదిమ్మ.

“ఎహె… నేనేమన్నా ఊరకుండానా…
ఒక్కొక్క అప్పు తీర్చుకుంటూ వస్తున్నానా!
వాళ్ళ కంటే నీది పెద్ద నొసయ్యిపోయింది నాకు” అంటూ కంచం ముందుకు లాక్కున్నాడు.

“అదేనయ్యా నా బాధ. ఉన్న డబ్బులన్నీ ఇంటి సోకులకు అయిపోతే “దండ” విడిపించలేకపోతామేమోనని”
అంటూ మంచినీళ్ళు చెంబు కంచం ప్రక్కన పెట్టింది లూదిమ్మ.

నీయమ్మ… నువ్వే కదే! ఇల్లో ఇల్లో అని పోరుపెట్టింది. లేకపోతే ఆ పూరి కొంపలేనే చావకపోయామా! అన్నాడు కాస్త చిరాగ్గా

సరేలే అయ్యా! నువ్వుగాంక కట్టావులే ఇల్లు.
పెళ్ళియిన ముప్పై ఏళ్లకి
ముసి ముసిగా నవ్వుతూ మొగుడ్ని తెప్పిపొడిచింది లూదిమ్మ కంచంలో మజ్జిగ పోస్తూ.

“అప్పులు లేకుండా ఇల్లు కట్టిన మొగోడెవరైనా ఉన్నారా ఈ ఊర్లో”
కాస్త రోషంగా ఆనందరావు.

ఈ ఏడాది పంట సరిగా పండడంతో నువు ఈ మాత్రం ఇల్లు కట్టకలిగావుగావు గానీ, లేకుంటే ఆ పూరి గుడిసే గతయ్యేది. మనం తప్ప ఎవరున్నారో చెప్పు ఇల్లు లేకుండా…
అన్నం తిని చేయి కడిగి కండువాకి తుడుచుకుంటున్న భర్తకు బ్యాంకు పుస్తకం అందిస్తూ అంది లూదిమ్మ.

***

ముఫ్ఫై ఏళ్ళ క్రితం పొగాకు గ్రేడింగ్ కంపెనీలున్న పట్టణాన్ని విడిచి, నల్లమట్టి పూర్తి వ్యవసాయ గ్రామమైన పల్లెటూరికి కోడలిగా బిక్కు బిక్కు మంటూ వచ్చింది లూదిమ్మ.

అప్పటిదాకా భర్త ఊళ్ళో జీతగాడుగా ఉండేవాడు. అక్షరం ముక్క రాని మొరటు మనిషి. తెల్లగా, చక్కగా అమాయకంగా వుండే లూదిమ్మతో జోడీ కలిపారు పెద్దలు.

భార్యంటే కేవలం ఇంట్లో, పొలంలో పనిచేసే పనిమనిషి, వండి వార్చడానికి, రాత్రి ఒంటి సుఖానికి పనికొచ్చే వస్తువు మాత్రమే.
మగాడు ఎక్కడ తిరిగినా, ఏ జాముకొచ్చినా నోరెత్తని బానిస మాత్రమే. ఇది ఆనందరావు దృష్టిలో భార్య అంటే.

అట్టాంటి భర్త మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడానికి లూదిమ్మకు చానా ఏళ్ళు పట్టింది. ఇద్దరు పిల్లలు పుట్టాక కూడా వాళ్ళని తీసుకొని చాలా సార్లు పుట్టింటికి అలిగి వెళ్ళింది.

పెళ్ళాం చేతి కూడు తప్ప మరెవ్వరు పెట్టిన ఎంగిలి పడని ఆనందరావు మూడో రోజుకి పెళ్ళాం కోసం వెళ్ళేవాడు.
ముందుగా పిల్లల్ని మచ్చిక చేసుకొని లూదిమ్మకు దగ్గరయ్యేవాడు.
ఇంకెప్పుడూ కొట్టిననీ, బూతులు తిట్టనని, బాధ్యత లేకుండా ప్రవర్తించననీ ఒట్టులు, ప్రమాణాలు చేయించుకున్నాక గానీ, భర్తను దగ్గరకు రానిచ్చేదికాదు.
ఆ మరుసటి రోజే ప్రయాణం కట్టి, ఇంటికి తెచ్చుకొనేవాడు.

కొన్నాళ్ళకి ఆనందరావుకి రాజకీయ పిచ్చి పట్టుకుంది. ఊళ్ళో పెద్దవాళ్ళతో రాజకీయ పార్టీ సభలకు, సమావేశాలకు పోవడం అలవాటయ్యింది. సాయంత్రం జరిగే మందు పార్టీలకు అలవాటయ్యాడు.
మొదట్లో అరిచి, అలిగి గోలచేసినా, పెద్దోళ్ళవుతున్న పిల్లల ముందు, బజారునపడి చుట్టుపక్కలోళ్ళ ముందు చులకనైపోవడం ఎందుకని అరటవడం మానేసింది లూదిమ్మ.
పిల్లల్ని చదివించుకోవడం, వారి ఆనందమే తన ఆనందంగా బ్రతుకుతుంది.
ఎంత తాగినా ఆనందరావు లూదిమ్మను ఇదివరకటిలా చేయి చేసుకొన్నదిలేదు, లూదిమ్మ పుట్టింటి ముఖం చూసింది లేదు.

ముందు కూతురికి, తర్వాత నాలుగేళ్ళకి కొడుకు పెళ్ళి చేశారు గానీ, వాళ్ళ ఆదాయాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి.
కొడుకు హైదరాబాద్లో ఏదో ప్రైవేటు ఉద్యోగం కావడం చేత వాళ్ళు అక్కడే ఉంటున్నారు.
వాళ్ళ ఆదాయం వారికే సరిపోయేదికాదు.

పెళ్ళయిన కాడ్నుంచి, అన్నదమ్ముల పంచుకున్న స్థలంలో పూరిల్లు, ఒక ఎకరం మెట్ట భూమి దక్కింది. ఏటా అందులో పొగాకో, మిర్చో పండుతుంది. పాడి బర్రెని మేపుతూ, కూలిజేసుకుంటూ జీవనం సాఫీగానే సాగుతుంది.
వాళ్ళకి ఇల్లు లేదనే దిగులు, ఇల్లు కట్టుకోవాలనే కల మాత్రం కలగానే మిగిలిపోయింది.

ఐదేళ్ళకొకసారి ప్రభుత్వం ఇచ్చే గృహ నిర్మాణ పథకం ద్వారా ఇల్లు నిర్మించుకోవాలని ఎన్నిసార్లు ప్రయత్నించినా ఆ పధకం వీళ్ళ గడపలోకి వచ్చేది కాదు.

ఈ సారి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓ పార్టీ అభ్యర్థి తరుఫున పాపం మోకాళ్ళు నొప్పులయినా కుంటుకుంటూనే ఇల్లిల్లు తిరిగి ప్రచారం చేశాడు.
ఆ ఎన్నికల్లో ఆ సర్పంచి గెలిచాడు. కొన్నాళ్ళకి
హౌసింగ్ బోర్డులో ఆనందరావు పేరువచ్చింది.

కొడుకు, కూతుళ్ళ కుటుంబాలను పిలిపించుకొని ఘనంగా గుణార్ధన చేయించుకున్నారు. బేస్ మట్టం వేస్తే మొదటి విడత బిల్లు శాంక్షన్ చేస్తామన్నారు.

పొలం ఖర్చులకు కూతురు దగ్గర నల్లపూసల దండ తెచ్చి, బ్యాంకుల్లో కుదవబెట్టారు.
ఈ ఏడాది మిర్చి బాగా పండుతుందని రైతులు ఆనందంలో ఉన్నారు. ఒక్కొక్క చెట్టుకు మిరపకాయలు రెండు కేజీల దాకా కాస్తున్నాయి. ఆనందరావు చేనును చూసిన వాళ్ళు కొత్త ఇంటికి వడ్డీకి ఎంత డబ్బులు కావాలంటే అంత ఇస్తున్నారు.

ఇల్లు బేసు మట్టం పూర్తియింది బిల్లు శాంక్షన్ అయ్యింది. లెంటల్ లెవెల్ కొచ్చింది మళ్ళీ బిల్లు రాలేదు. అప్పులు తెచ్చి శ్లాబు వేయించాడు. ఈ లోపు ఎన్నికల కోడ్ వచ్చింది. హౌసింగ్ బోర్డు బిల్లున్ని ఆగిపోయాయి.
వడ్డీలకి తెచ్చిన సొమ్ముతోనే ఇల్లు పూర్తి చేసుకున్నారు.

ఆనందరావు ఇల్లు కట్టి, ఇలా పెయింటింగ్స్ వేయిస్తాడని ఊర్లో ఎవరూ ఊహించలేదు. ఇంత అందంగా ఇల్లు కడతాడని దగ్గర బంధువులే అనుకోలేదు.
అప్పటి దాకా ఆనందరావు చిన్నచూపు చూసిన తోడబుట్టినోళ్ళు, ఇప్పుడొస్తూ గౌరవ మర్యాదలు ఇవ్వడం మొదలు పెట్టారు.

ఆ ఏడాది మిర్చికి మంచి రేటు వచ్చింది. ఎరువులు, పురుగు మందులు అప్పులన్ని తీరిపోయాయి. ఇంటి అప్పులు కొద్దిగా కొద్దిగా తీర్చుకుంటున్నాడు.
వచ్చిన డబ్బంతా ఇంటికే పెడితే, పిల్ల దండ తెస్తాడో లేదోనని దిగులు పట్టుకుంది లూదిమ్మకు. అందుకే భర్తను అంత తొందర చేసి పంపించింది.

***

నవంబరు నెల వచ్చింది. కృష్ణ కాలువ చివరి ఆయకట్టుకు నీళ్ళు వదులారు. రైతులందరు పొలం పనుల్లో హడావుడిగా ఉన్నారు.

చేను ప్రక్కనే చేనని ఎకరానికి నలబై వేలు లెక్కన కౌలుకు ఇరువై వేలు చెల్లించి, ఇంటి కొచ్చి భార్యతో చెప్పాడు ఆనందరావు.

అయ్యో… ఎందుకయ్యా అంత కౌలు. పోయిన ఏడాది ముఫై వేలుకి ఇచ్చి ఈ సంవత్సరం నలభై వేలు అంటే, మనకొచ్చేదెంత, కౌలుకు పోయేదెంత మనకెందుకు చెప్పు!
మనకున్న ఆ ఎకరానికే పని చేయలేక చస్తున్నాం. మళ్ళీ అంత కౌలుకు పొలం తీసుకుంటే ఎట్టా చాకిరి చేస్తాం చెప్పు! అంటూ బాధపడింది లూదిమ్మ.

కొడుకు, కూతురు చాకిరికి పనికిరారు. వాళ్ళు ఏడో హైదరాబాద్లో ఉంటిరి. కూతురు ఇక్కడకు వచ్చేది కాకపోయె మనిద్దరం ఏడ ఇరగబడతామయ్యా! బాధగా అంది లూదిమ్మ.

ఇయ్యేడన్నా ఆ ఇంటి అప్పు తీర్చకపోతే వడ్డీలకు వడ్డీలు ఏడ కడతామే! ఎంత నామర్దాగా ఉంటుంది.
ఏం కాదు నువ్వూరుకో…. రెండు ఎకరాల్లో మిరపతోట పెడదాం అప్పులన్ని తీరిపోతాయి అని భార్యకు ధైర్యం చెప్పాడు ఆనందరావు.

పోయిన ఏడాదిలాగే మళ్ళీ బ్యాంకుల చుట్టూ తిరిగాడు బంగారు కుదవబెట్టారు.
గరిక పరక లేకుండా నల్లరేగడి పొలాన్ని మెత్తగా దున్నిచ్చి చదునుచేసి అచ్చుతోలాడు.

రైతులందరు మిరప తోట మీద పడడంతో నారుకు డిమాండ్ పెరిగింది. రెండు రూపాయల మొక్క ఐదు రూపాలయ్యింది.
కూలీల కొరత ఏర్పడింది. అధిక కూలి ఇచ్చి, ప్రక్క ఊళ్ళో కూలీలతో రెండు ఎకరాలకు మిరపతోట వేయించారు. వారం రోజుల తర్వాత ఇడుపులు కూడా వేయించాడు.

చేను ఏపుగా పెరుగింది. పచ్చగా నవ నవ‌లాడుతుంది.
ఎప్పుడూ లేంది ఈ సారి డిసెంబర్ మూడవ వారంలో ముసురు పట్టింది. వారం రోజులు వర్షం ఆగకుండా దంచికొట్టింది. చెరువులు, కుంటలు, వాగులు, వంకలు పొంగి‌ పొర్లాయి.

చేలల్లో ఎక్కడ నీళ్ళు అక్కడే నిలిచిపోయాయి. నీళ్ళు ఎటూ పోయె మార్గం లేదు. సూర్యుడు బయటకు రాలేదు. ఎండ ముఖం చూడక, నీళ్ళల్లో మునిగిన మొక్కల వేళ్ళన్ని కుల్లిపోయాయి. పొల్లు ప్రాంతంలోని మొక్కలు ఉరకెత్తి వాలిపోయాయి. రైతులందరు లబో, దిబో మంటున్నారు.

ఆనందరావు రోజు వెళ్ళి చేళ్ళ చుట్టూ తిరిగి, నీళ్ళు వెళ్ళే మార్గం చేశాడు. అయినా సగం చేను మునిగి దెబ్బతింది.

వారం రోజులు తర్వాత గానీ పొలం ఆరలేదు. ఉరకెత్తిన చేలను మళ్ళీ దున్నేసుకున్నారు రైతులు. చాలా దూరం పోయి మిరపనారు మరింత ఖరీదు పెట్టి తెచ్చుకున్నారు.
ఆనందరావు పొలంలో సగం పంట ఉరకెత్తి పోయింది. మళ్ళీ పొగనారు తెప్పించి పోయికాడ ఇడుపులు వేయించాడు. వారం రోజులకొకసారి బలం మందు ఎగబెట్టాడు, మూడు రోజులకొకసారి పురుగుల మందు కొట్టించాడు. మొత్తానికి చేనును ఒక ఆకారంలోకి తెచ్చాడు.

హైదరాబాద్లో కొడుకుకు స్థిరమైన ఆదాయం లేకపోవడంతో, ఇంటి దగ్గర నుండి కొంత డబ్బు సర్దుబాటు చేయాల్సి వస్తుంది. ఇక్కడే ఉండి పొలం చూసుకోరా అంటే వినేవాడు కాదు.

ఇంటికి తెచ్చిన అప్పు, పొలానికి తెచ్చే అప్పు, కొడుకుకు సర్ధే అప్పులు పెరిగిపోతున్నాయి. బ్యాంకులో క్రాఫ్ లోను, బంగారు తాకట్టు ఉండనే ఉన్నాయి. ఇంత అప్పు ఎలా తీర్చాలనే ఒక ప్రక్క బెంగగా వుంటున్నా, రెండు ఎకరాల్లో మిరపతోటలో వచ్చే ఆదాయంతో అప్పులన్ని తీర్చెయొచ్చునే ధీమాలో ఉన్నాడు ఆనందరావు.
రోజు వంది రూపాయలు తీసుకొని క్వార్టర్ మందు వేయనిదే నిద్రపట్టేదికాదు పాపం.

ఈ ఏడు కూడా మిరపకాయలు బ్రహ్మణ్ణంగా కాస్తున్నాయని రైతులు సంతోషంగా వుంటే, పొగతోటలు వేసినోళ్ళుకు సరైన ధరలు లేక ఉసూరుమంటున్నారు.
ఆనందరావు మిరపతోట ఎత్తుగా ఏపుగా పచ్చగా పెరిగింది. కానీ, కాపు సరిగా లేదు. నిదానంగా వస్తుందనే ఆశతో ఉన్నాడు.

మిరపకోతలు మొదలయ్యాయి. అందరికి ఒకేసారి పంట రావడంతో ఒకరికొకరు చేబొదుళ్ళకు కూలికి పోతున్నారు.
బయట ఊర్ల నుండి ఆటోలో ఎక్కువ కూలిచ్చి, కూలీలను తెచ్చుకుంటున్నారు. ఎండాకాలం కావడంతో మధ్య మధ్యలో కూలీలకు కూల్ డ్రింక్స్ తెప్పించడం ఆనవాయితి అయ్యింది.

అధిక కూలీలను పెట్టి మిరపకోత కోపిస్తున్నా మిరపకాయల రాసి పెరగడం లేదు ఆనందరావుకి. మొదటి విడత, రెండవ విడత కూలీ కలిపి ఎకరాకు డెబ్భై వేలు పెట్టు బడి లక్షరూపాయలు. రెండెకరాల మీద మూడు లక్షలపైగా అయ్యింది. ఆనందరావు, లూదిమ్మ గొడ్డు చాకిరి ఉండనే వుంది.

చాలా మంది రైతులకు ఎకరాకు ఏబై టిక్కీలు (సుమారు ఇరవై ఐదు క్వింటాళ్లు) అయితే, ఆనందరావుకు రెండు ఎకరాల్లో ఏబై టిక్కీలు మాత్రమే అయ్యాయి.
ఆయనకే కాదు ఆయనతో పాటు ఒకేచోట మిరపనారు తెచ్చిన రైతులందరిదీ అదే పరిస్థితి.
దిగాలు పడిపోయాడు ఆనందరావు.
అందరితో పాటు అంతే ఖర్చులు పెట్టినా ఫలితం రాలేదు. మిరపనారోడు కల్తీ ఇత్తనాలు వేసి మోసం చేశాడని అర్థమయ్యింది.

అదేం చిత్రమో గానీ, మార్చి దాకా క్వింటాకు ఇరవై మూడు వేలు స్థిరంగా వున్న మిర్చి రేటు రైతు చేతికి పంట రాగానే అమాంతంగా తగ్గి పదకొండున్నర వేలుకు పడిపోయింది.
గుంటూరు మిర్చి యార్డు మూసేశారని అది తెరిచేసరికి మూడు నాలుగు నెలలు పడుతుందని చెబుతున్నారు.

అప్పుడు దిగారు దళారులు రంగంలోకి. రైతులకు ఉండే అష్టకష్టాలను ఆసరాగా చేసుకొని బేరాలాడసాగారు.
సొంత భూమి వుండి పెట్టుబడులు పెట్టుకోగలిగే స్థోమత ఉన్నవాళ్లు సరేగాని, కౌలు తీసుకొని, పెట్టుబడులకు అప్పులు తెచ్చినవాళ్ళ పరిస్థితి ఏం గానూ. ఎంతోకంతకి పంట తెగనమ్ముకోకుంటే వడ్డీల మీద వడ్డి పెరుగుతున్నాయి.
పైగా పంట చేతికి రాగానే ఎక్కడ అప్పులోల్లంతా ఇంటికి రావడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఇయ్యిలేకపోతే ఇంకెప్పుడూ ఇవ్వలేడని తెలుసు వాళ్ళకు.

ఈ పరిస్థితుల్ని ఆనందరావు తెలియంది కాదు, సగానికి సగం రేటుకు అమ్ముకోవడం ఇష్టంలేదు. అలాగని రేటు వచ్చేదాకా ఎ.సి.లో పెడితే రేటు వచ్చేదాకా ఆ బాడుగలు భరించలేరు.
అప్పులోళ్ళు అప్పటి దాకా ఆగరు. చచ్చే చావొచ్చిందిరా దేవుడా అనుకున్నారు. భార్యాభర్తలు.

అంతలోనే హైదరాబాద్ నుండి కొడుకు కుటుంబంతో దిగాడు. పంటలు చేతికి వచ్చాయి కదా తండ్రి ఏమైనా ఆర్ధికంగా ఉపయోగపడతాడేమోనని ఆశతో.

ఎ.సి.లో పెడదామంటే అప్పులోళ్ళు ఊరుకొనేట్టులేరు. చేసేదేమీలేక క్వింటాకు పన్నెండు వేలుకు అమ్మితే, ఆ సంవత్సరం తెచ్చిన పొలం అప్పులకే సరిపోయాయి.

లాభాలు దేవుడెరుగు, కనీసం భార్యాభర్తల చాకిరీ కూడా మిగల్లేదు. లెక్కేలేసుకుంటే పాత అప్పులు మొత్తం ఆరు లక్షలదాక వుంది. అందరు ఇంటి మీదకొచ్చి నానా రకాలుగా మాటలంటున్నారు.

పైకి తాగుబోతు, పొగరుబోతుగా కనిపించే ఆనందరావు ఆత్మాభిమానం కలవాడు కావడంతో కూడు, నీళ్ళు సహించడం లేదు.

ఆ మధ్య తరచూ మద్యం త్రాగుతున్నాడు.
ఒకరోజు ఫుల్గుగా మద్యం సేవించి వచ్చి.
ఓమ్మే… లూదే…
పలకవేందశె… నీ అమ్మ శెడి నాయాలా!
పొలం అమ్మేసి అప్పులు తీరుస్తానే అన్నాడు.
అందుకు భార్యా లూదిమ్మ, కొడుకు ససేమిరా అన్నాడు.
“ఉన్నా కొద్ది పొలం అమ్మితే ఊళ్ళో మనకు విలువేముంటుందయ్యా అంది లూదిమ్మ ఏడుపు ముఖం పెట్టి.
నాన్నా… నువు పొలం అమ్మితే ఊరుకునేది లేదని కొడుకు ఎదురు తిరిగాడు.
పొలం అమ్మకపోతే మరి బాకీలు ఎట్టా తీరుతాయిరా! అని కొడుకును నిలదీశాడు ఆనందరావు.
తల్లీ కొడుకులిద్దరూ మాట్లాడలేదు.

ఆనందరావు పొలం అమ్ముతున్నాడని తెలియగానే, అప్పులోళ్ళు , బ్రోకర్లు ఇంటి చుట్టూ తిరుగుతున్నారు.
నాలుగు రోజులగా ఇంట్లో ఎవరికి మనశ్శాంతి లేకుండా పోయింది. రోజూ భార్యతో గొడవ పడుతున్నాడు ఆనందరావు.
ఒక రోజు పూటుగా ‌తాగొచ్చి, గొడవపెట్టుకొని మాటామాటా పెరిగి భార్యను దబీదిబీన బాదేశాడు.
తల్లిని కొడుతున్న తండ్రిని చూసి కొడుకు సహించలేక, తండ్రి మీద చేయిచేసుకొని అవతలకు నెట్టివేశాడు.

కొడుకు చేతిలో దెబ్బతిన్నందుకు ఆనందరావు అవమాన పడ్డాడు, ఆవేదన చెంది నలుగురిలో తన పరువు పోయిందని ఎవరితో మాట్లాడకుండా తనలో తాను కుమిలిపోయాడు.

***

మూడు రోజులుగా ఆనందరావు ఇంటికి రావడంలేదు. ఇంట్లో గొడవలు పడలేక కూతురు దగ్గరకు వెళ్ళింటాడు అనుకున్నారు. మొదటి కూతురికి, తర్వాత తెలిసిన బంధువులకు ఫోన్లు చేసి కొనుక్కున్నారు. ఎవరూ లేడని చెప్పడంతో లూదిమ్మ కంగారు పడింది.

ఎప్పుడూ ఎవరి చేత్తో కూడు పెట్టినా తినని మనిషి, మూడు రోజులుగా ఏం తిన్నాడో, ఏడున్నాడోనని దిగులు పడిపోతుంది లూదిమ్మ.

కొడుకు, కూతురు, కోడలు అల్లుడు తలో దిక్కు ఆనందరావు ఆచూకి కోసం ఊరురూ వెతుకుతున్నారు. ఎవరికి ముద్ద సహించడం లేదు.

అకస్మాత్తుగా ఓ వార్త ఊరంతా గుప్పుమంది. కుటుంబ సభ్యులు, బంధువులు ఉన్న పలాన ఊరి బయట పొలాల వైపు పరుగులు తీశారు. మురుగు కాలువ తూములు దగ్గర ఆనందరావు వెల్లికిలా పడుకొని విగతజీవిగా కనిపించాడు. ప్రక్కన మద్యం బాటిలు, పురుగు మందుల డబ్బా కనిపించాయి.

పుట్టింది ప్రకాశం జిల్లా, నాగులుప్పలపాడు మండలం, చవటపాలెం. తాను ప‌నిచేస్తున్న‌చోట స‌హ‌చ‌ర కార్మికుల జీవితాల‌ను క‌థ‌లుగా మ‌లుస్తున్న‌క‌థ‌కుడు. ప్ర‌స్తుతం మైనింగ్ ఫోర్ మ‌న్ గా ప‌నిచేస్తున్నాడు.

Leave a Reply