ఆధునిక మానవుని అధివాస్తవిక వేదన

15 ఏప్రిల్ 1931 లో జన్మించిన టోమస్ ట్రాన్స్ట్రోమర్, స్వీడన్ కవులలో ప్రసిద్ధుడైన కవి. అతడి చిన్నతనంలోనే తండ్రి నుండి విడిపోయిన తల్లి అన్నీ తానై అతడిని పోషించింది. స్టాక్ హోమ్ విశ్వ విద్యాలయంలో కవిత్వం, సైకాలజీలను అభ్యసించిన, అధ్యయనం చేసిన వాడు. 1954లోనే అతని తొలి కవితా సంపుటి ‘17 పోయెమ్స్’ వెలువడింది. తరువాతి కాలంలో అనేక కవిత్వ సంపుటాలు వెలువరించిన ట్రాన్స్ట్రోమర్ కవిత్వం ప్రపంచంలోని 50 కి పైగా భాషల లోకి అనువాదం అయింది. 2011లో నోబెల్ బహుమతి ప్రకటించక ముందే ఇంగ్లీష్ మాట్లాడే దేశాలలో అనేక మంది కవిత్వాభిమానులను సంపాదించుకున్న కవి ట్రాన్స్ట్రోమర్. 1993 లో ట్రాన్స్ట్రోమర్ వెలువరించిన ఆత్మకథ Memories Look At Me (జ్ఞాపకాలు నా కేసి చూస్తాయి) కూడా అతని కవిత్వం లాగే ప్రాచుర్యం పొందిన రచన.

ఆధునికత, భావ వ్యక్తీకరణ, అధివాస్తవికత పునాదుల మీద సృజించిన ట్రాన్స్ట్రోమర్ కవిత్వం ఆధునిక సమాజం అనుభవిస్తోన్న ఒంటరితనం, మానవ విచ్ఛిన్నతలను బలంగా ధ్వనిస్తుంది. అయితే, సుదీర్ఘ స్వీడిష్ శీతాకాలాలను, మారే ఋతువుల లయలను, స్వీడన్ దేశ ప్రాకృతిక సౌందర్యాన్ని కూడా అంతే అద్భుతంగా ఆవిష్కరించిన కవి ట్రాన్స్ట్రోమర్.. రోజువారీ జీవితం లోని మార్మికతను తనదైన శైలితో కవిత్వంలో ఆవిష్కరించడం వలన ట్రాన్స్ట్రోమర్ ని ‘క్రిస్టియన్ కవి’ గా కొందరు విమర్శకులు పరిగణిస్తారు. ‘కవిత్వంలో ట్రాన్స్ట్రోమర్ ప్రయోగించే పద చిత్రాలు అప్పుడే తవ్విన బావిలోకి జల ఉరికి వొచ్చినంత లోతుగా వుంటాయి’ అంటారు మరికొందరు విమర్శకులు.

ప్రఖ్యాత అమెరికన్ కవి రాబర్ట్ బ్లయ్ తో ఏర్పడిన స్నేహం, ట్రాన్స్ట్రోమర్ కవిత్వాన్ని అమెరికా అంతటా తిప్పితే, మరొక ప్రఖ్యాత అరబ్ కవి అడోనిస్ తో ఏర్పడిన స్నేహం అతడి కవిత్వాన్ని అరబ్బు దేశాలలో తిప్పింది. ట్రాన్స్ ట్రోమర్ తో భారత దేశానికి ఒక ప్రత్యేక అనుబంధం వుంది. 1984 లో ప్రపంచాన్ని కుదిపేసిన భోపాల్ గ్యాస్ దుర్ఘటన తరువాత, సచ్చిదానందన్ వంటి కవులతో కలిసి భోపాల్ లో కవిత్వం చదివాడు.

కవిత్వం నవలలు మాత్రమే కాకుండా, ట్రాన్స్ట్రోమర్ మంచి పియానో సంగీతకారుడు. పియానోతో ఎంతగా మమేకమై పోయిన కవి అంటే, 1990లలో పక్షవాతంతో శరీర కుడి భాగం మొత్తం పడిపోయినా, ఎడమ చేయితో పియానో వాయించడం నేర్చుకున్నాడు. తదనంతర కాలంలో కచేరీలు చేసే మంచి గాయనిగా ఎదిగిన ట్రాన్స్ట్రోమర్ కూతురు ఎమ్మా, అతని కవితలు కొన్నింటిని పాటలుగా పాడి ఒక ఆల్బమ్ వెలువరించింది. 2015 లో ట్రాన్స్ట్రోమర్ మరణించిన తరువాత, మరి కొందరు గాయకులు కూడా ట్రాన్స్ట్రోమర్ కవితలను పాటలుగా రూపొందించి, అతని కవిత్వం పట్ల తమ ప్రేమను ప్రకటించారు.

| జంట |
గదిలోని లైట్ స్విచ్ ఆఫ్ చేస్తారు వాళ్ళు
మాయమయే ముందు కాంతి ఒక్క క్షణం మెరుస్తుంది
నీళ్ల గ్లాసులో కరిగిపోయే మందు గోళీలా

హోటల్ గోడలు, చీకటి ఆకాశంలో కలిసిపోతాయి
ప్రేమ కదలికలు స్థిమిత పడ్డాక
వాళ్ళు నిద్రపోతారు

అప్పుడు వాళ్ళ రహస్య ఆలోచనలు కలుసుకుంటాయి
స్కూలు పిల్లవాడి తడి పెయింటింగ్ లో కలుసుకుని
ప్రవహించే రెండు భిన్నమైన రంగులలా

అంతా చీకటీ నిశ్శబ్దం
కానీ నగరం దగ్గరైంది ఈ రాత్రి

చల్లబడిన కిటికీలతో
ఇండ్లు సమీపం లోకి వచ్చాయి

వాళ్ళు గుంపులుగా నిలబడి ఎదురుచూస్తున్నారు
ఎటువంటి వ్యక్తీకరణలూ లేని
ముఖాలతో వున్న గుంపులు

| జాతీయ అభద్రత |
అండర్ సెక్రెటరీ ముందుకు వంగి
X గుర్తు గీస్తుంది
ఆమె చెవి పోగులు అటూ యిటూ వూగుతాయి
మెడ మీద వేలాడే కత్తుల వలె

మచ్చల సీతాకోక నేల మీద అదృశ్యంగా వున్నట్టు
తెరిచిన వార్తా పత్రికలోకి దెయ్యం మాయమై పోతుంది

ఎవరూ ధరించని శిరస్త్రాణం
అధికార పీఠం అధిరోహిస్తుంది

నీళ్ల అడుగున ఈదుకుంటూ
తల్లి తాబేలు పారిపోతుంది

| శీతాకాలం రాత్రి |
నా దుస్తుల నుండి
నీలి కాంతి ప్రసరిస్తుంది
శీతాకాలం రాత్రి
రాలే మంచుముద్దల తంబురా శబ్దాలు
కళ్ళు మూసుకుంటాను
బయట నిశ్శబ్ద ప్రపంచం
ఎక్కడో వున్న ఇరుకు సందు గుండా
మరణించిన వాళ్ళను అక్రమంగా
సరిహద్దు దాటిస్తున్నారు

You need to add a widget, row, or prebuilt layout before you’ll see anything here. 🙂

పుట్టింది, పెరిగింది వరంగల్ లో. హైదరాబాద్ లో నివాసం. నాలుగు కవితా సంపుటులు (వాతావరణం, ఆక్వేరియం లో బంగారు చేప, అనంతరం, ఒక రాత్రి మరొక రాత్రి) వెలువడినాయి. కొన్ని కథలు, పుస్తక సమీక్షలు, సాహిత్య వ్యాసాలు కూడా.

Leave a Reply