ఆదివాసుల మధ్య ఆదివాసి టీచర్

i

మొదటి రోజు:

అనారోగ్యం వల్ల కాలేజీ చదువు కొనసాగించలేననే అనుకున్నాను. ఓటమిని ఒప్పుకోలేని ఆత్మగర్వం అమ్మ దగ్గరికి తిరిగి వెళ్ళకుండా నన్ను ఆపేసింది. నేను ఎంత చిక్కిపోయానో ఆమె చూసి ఉంటేనా, నేను పోగొట్టుకుంటున్న ఆరోగ్యం ముందు, స్వేచ్చ ముందు… ఈ తెల్లోడి కాయితాలెందుకు వచ్చెయ్యమని అనేసేది. అమ్మ కోప్పడితే తట్టుకుని ఇక్కడ ఉండిపోవడం కష్టమయ్యేది.

నా జాతి జనుల కోసం నా పని ఎక్కడ మొదలెట్టాలో ఎప్పటి నుంచో నాకు స్పష్టత ఉంది. అమ్మకు ఉత్తరం రాసేశాను. ఈ ఏడాది తూర్పు ప్రాంత ‘ఇండియన్’ స్కూలులో పని చేయబోతున్నట్లు రాశాను. ఉత్తరాన్ని పడమటికి, అమ్మకు పంపించి నేను తూర్పు దిక్కుకు పయనమయ్యాను.

ఫలితం: నన్ను తీసుకెళ్ళే కారు కోసం ఎదురుచూస్తూ, ఉక్కపోతకు అలసటగా, నల్లని కారు పొగల మధ్య, ఒక పాత పట్నంలో వీధి మొగన నిలబడ్డాను,. కొద్ది నిమిషాల్లో కారు నన్ను ఒక స్కూలు వద్దకు తీసుకెళ్లింది.

స్కూలు క్యాంపస్ భలే ఉంది. దగ్గర దగ్గరగా గుమిగూడినట్లున్న బిల్డింగులు. అదొక ప్రత్యేక గ్రామంలా ఉంది. చుట్టూరా పట్నం కన్న ఈ చిన్న గ్రామమే నాకు ఎక్కువ ఆసక్తి కలిగించింది. బిల్డింగుల మధ్య పెద్ద చెట్ల నీడలు, చల్లని తాజా గాలి. నేలమీద ముదురాకుపచ్చ గడ్డి. ఆ చెట్లూ గడ్డి మధ్యలో ఒక చిన్న ఆకుపచ్చ పంపు. పంపు ఒక చిన్న పెట్టెలా ఉంది. దానికి ఒక వైపు గుండ్రంగా తిరిగే హ్యాండిల్, ఎప్పుడూ కిర్రు కిర్రున చప్పుడు చేస్తూ.

వెళ్లి నన్ను నేను పరిచయం చేసుకున్నాను. నాకు నా గది చూపించారు. కింద తివాచీ పరిచి ఉన్న చిన్న, గది. గోడలు, పైకప్పు నల్ల నల్లగా ఉన్నాయి. రెండు కిటికీలు. రెండూ ఒక వైపే. కిటికీలకు కాస్త పసుపు తేలిన బరువైన తెరలు. గదిలో ఒక మూలగా శుభ్రమైన తెల్లని మంచం. దానికి ఎదురుగా పైన్ కలపతో చేసిన చదరపు బల్ల, బల్ల మీద నల్లని ఉలెన్ బ్లాంకెట్.

బల్ల పక్కన రెండు స్త్రెయిట్ బ్యాక్ కుర్చీలు. నెత్తిన టోపీ కూడా తీసేయకుండా ఒక కుర్చీలో జారగిల బడ్డాను. అక్కడ ఎంత హాయిగా ఎన్నేళ్ళు గడపబోతున్నానో ఆలోచిస్తూ, పైకప్పు నుంచి నేల వైపు, ఒక గోడ నుంచి ఇంకో గోడ వైపు చూస్తూ చాలసేపు కూర్చుండిపోయాను. ఈ పని నేను చేయగలనా, ఇప్పటికే అలసిపోయాను, దీనికి నా శక్తి చాలుతుందా అని అనిపించింది. నా ఆలోచనల్లో నేను ఉండగానే తలుపు వద్ద బరువైన అడుగుల చప్పుడు. తలుపు తెరిస్తే నెరసిన జుత్తుతో ఒక ఆజానుబాహుడు. ఒక చేతిలో గడ్దిటోపీ పట్టుకుని, ఇంకో చెయ్యి నా వైపు చాచాడు. దయగా నవ్వాడు. ఎందుకో అతని ఎత్తు నన్ను సంభ్రమపరిచింది. నా తల మీద ఒక వేలెడు ఎత్తున అతడి బలమైన భుజాలు .

నేనెప్పుడూ కాస్త పొట్టి పిల్లనే. దానికి తోడు మొన్న వసంతకాలం మొదట్లో బాగా జబ్బు చేసి, బాగా బలహీనంగా బక్కచిక్కి కనిపిస్తున్నాను. అతడి చురుకైన కళ్లు నా ఎత్తూ లావూ కొలిచేశాయి. నా మొహంలోకి చూశాడు. తన మొహంలో చిన్న నీడ ఏదో కదిలిందా అనుకుంటుండగా, నా చెయ్యి వొదిలేశాడు. తెలిసిపోయింది, అతడే నా పై ఆఫీసర్.

“ఓహో, కాలేజీ వక్తృత్వ పోటీల్లో జెండా ఎగరేసిన ఆ చిన్ని ఇండియన్ అమ్మాయివి నువ్వేనన్నమాట.” అన్నాడతడు, నాకు చెబుతున్నట్టు కాకుండా తనకు తాను చెప్పుకుంటున్నట్టు. తన గొంతులో ఎక్కడో కాస్త సందేహం కనిపించింది. తను నిలబడిన చోటు నుంచే ఒక సారి గది లోపలికి చూసి, ‘ఇంకా ఏమైనా కావాలా’ అని అడిగాడు. తను వెళ్లిపోడానికి వెనక్కి తిరిగాక కూడా, అడుగులు దూరమయ్యే వరకు అటు వైపే చూస్తూ ఉండిపోయాను. నా మొహంలో నొప్పి నీడలను ఆ ఊరి కార్ల పొగలు దాచలేకపోయాయని, నాకు అర్థమయిపోయింది.

నా దురదృష్టానికి నాకే నవ్వొచ్చింది. కష్టపడి పరిస్టితిని మెరుగుపరుచుకోవాలనుకున్నాను. కాని, టోపీ పక్కకు విసిరేసే సరికి, ఏదో బరువైన బలహీనత నన్ను ఆవరించింది. నీళ్లలో నానిన దుంగలా చిరకాలపు అలసట మీద పడినట్లనిపించింది. మంచం మీద పడి, కళ్ళు మూసుకున్నాను, పరిస్థితిని మెరుగుపరిచే ఉద్దేశాన్ని కూడా పక్కన పడేసి.

ii

పడమటికి ప్రయాణం

ఒక ఉక్కపోత నెలంతా డెస్కు వద్ద కూర్చన్నాను. గుట్టలు గుట్టలుగా పని. ఇప్పుడు గుర్తు చేసుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. నాకేమవుతుందో చూసుకోకుండా ఎలా ఉండగలిగానో ఏమో. కష్టానికి ఓర్చుకునే నా జాతి వారసత్వమే నన్ను కాపాడింది. కాస్త వంగిపోయినా, విరిగిపోకుండా నిలబడ్డాను.

గది నుంచి ఆఫీసుకు ఆఫీసు నుంచి గదికి నేను నిశ్శబ్దంగా నడిచేదాన్ని. ఎవరితో మాట్లాడేదాన్ని కాదు. కాని, చుట్టూరా చాల కళ్ళు నన్ను గమనించేవి. ఒక రోజు బాగా పొద్దున్నే సూపరింటెండెంట్ నన్ను పిలిపించాడు. ఆయన అరగంట సేపు మాట్లాడారు. గదికి తిరిగొచ్చాక నాకు గుర్తున్నది మాత్రం ఒక్క వాక్యమే. “ఇక నీ పచ్చిక-భూమికి నిన్ను వొదిలేస్తున్నాను”. అంటే ఇండియన్ విద్యార్థుల్ని జమ చేయడానికి నన్ను పడమటికి పంపిస్తున్నారన్న మాట.

ఆ ‘ఆహారం’ అవసరమే. ఆ పచ్చిక అవసరమే. కాని, తమ పిల్లల్ని తెలియని వాళ్ళకు అప్పగించేంతగా మమ్మల్ని నమ్మే తలిదండ్రులను వెదుక్కుంటూ ఆ నడి వేసవిలో బయల్దేరడం ఏమంత ఆశావహం అనిపించలేదు. అమ్మను చూస్తాననే సంతోషం ఉంది. సరే, ఈ మార్పు దీనికిదే మంచి విశ్రాంతి అవుతుందిలే అనుకుని, ఆ తరువాత రెండు మూడు రోజులకు పడమటి వైపు, అమ్మ వాళ్ళ వైపు బయల్దేరాను.
మాంఛి ఎండలు, జిడ్డు జిడ్డు కార్ల పొగలు… ఆ ఇంటి వైపు ప్రయాణం కూడా నా ఆరోగ్యానికి పెద్దగా మేలు చేయలేదు. వెనక్కి వెళ్తున్న ప్రదేశాల్ని చూస్తూ గంటలు గడిచాయి. అడవుల్లోంచి మైదానాల్లోకి వెళ్ళే కొద్దీ పైన ఆకాశం విశాలం అవుతున్నట్టనిపించింది. దట్టమైన ఆడవుల మధ్య పెద్ద పెద్ద బిల్దింగులతో ఊళ్లు, నగరాలు రాను రాను కనుమరుగయ్యాయి. చిట్టడవులు కూడా వెనక్కి వెళ్లిపోయాయి. చివరికి విశాల పచ్చిక మైదానాల ఒడిలో అణిగి మణిగి ఉన్నట్లున్న ఇళ్లు మొదలయ్యాయి. ఎండిపోయిన గడ్డి మీద కదిలే మేఘాల నీడలు… పాత స్నేహితులను కలుసుకోబోతున్న ఉద్వేగానికి గురి చేశాయి.

ఒక చిన్న స్టేషన్. ఒకే ఒక ఫ్రేముతో కట్టిన ఇంటితో స్టేషన్. దాని చుట్టూ పెచ్చులూడిన బోర్డుతో నడవడానికి దారి. అక్కడ రైలు దిగాను చివరికి. మా అమ్మ నుంచి, మా అన్న దవీ నుంచి ఇక ముఫ్పై మైళ్లే. ఒక పెద్ద గాలి ఒకటి నా తల మీదనుంచి టోపీ ఎగరగొట్టింది. తలమీద ఏమీ లేకుండా కొండల్లో తిరిగిన చిన్న నాటి రోజులు గుర్తుకొచ్చాయి. చుక్ చుక్ మంటూ రైలు వెళ్లిపోయాక, ఏదో లోతైన ఏకాంతంలోకి జారిపోయి, ప్లాట్ ఫాం మీద నిలబడ్డాను. నెమ్మదిగా దొర్లి దూరంగా కొండల్లో కలుస్తున్నట్లున్నా మైదానం. కొండల పాదాల వద్ద నుంచి కొండల చుట్టూ తిరిగి స్టేషన్ వద్దకు చేరినట్లున్న పొడవాటి రోడ్డు. ఒక చిన్న గుర్రబ్బండిలో ఆ కొండల వైపు బయల్దేరాను. ఇతన్ని నమ్మొచ్చనిపించే గుర్రబ్బండి మనిషి. అతడి తల నుంచి దువ్వెన మొహం చూడని లేత పసుపు జుత్తు చెవుల మీద, ఎర్రని మెడ మీద ఎగురుతోంది. ఏదైనా ప్రమాదమో, ఊరికే పుచ్చిపోయిందో అతడి నోట్లో ఒక కొరుకుడు దంతం లేదు.

అతడి మొహం పాలిపోయినట్లున్నా, చెంపలు మాత్రం ఇటుక ఎరుపు. తడి తడి కళ్ళు ఎర్రగా, తనకు తెలీకూండా కదులుతున్నాయి. ఆ ఒంటరి స్టేషన్ నుంచి గడ్డి మీదుగా, మంచు మీదుగా మా ‘ఇండియన్’ గ్రామం వైపు బండి నడిపించాడతడు. ఎండవానలకు మరకలు పడిన చొక్కా వొంగిపోయిన భుజాల మీద అస్తవ్యస్తంగా ఉంది. అసలు మనిషే కాస్త వంగిపోయి ఉన్నాడు. లేత పసుపు వెంట్రుకలతో ముందుకు సాగినట్లున్న అతడి గడ్డం… చక్కగా మాట వినే అతడి గుర్రం తల లాగే అటు ఇటు కదులుతోంది.

ఆ ఉదయమంతా పరిసరాల్ని చూస్తూ గడిపాను. అదే పరిచిత ఆకాశం. పైన గుండ్రంగా ఉన్న కొండలు. రోడ్డు పక్కన చాల మొక్కల్ని గుర్తు పట్టాను. వాటి తీయని వేర్లు మా వాళ్ళకు చాల ఇష్టం. మొట్టమొదటి శంఖాకార ‘విగ్వామ్’ను చూడగానే ఉండబట్టలేక సంతోషంగా అరిచే సరికి… బండి మొగన జోగుతున్న డ్రైవరు ఉలిక్కిపడి లేచాడు.

మధ్యాన్నానికి రిజర్వేషన్ తూర్పు అంచుకు చేరే సరికి నాకు స్థిమితంగా కూర్చోడం కష్టమైంది. తన చిన్నారి కూతుర్ని చూసి అమ్మ ఏమంటుందో. నేను ఏ రోజున ఇల్లు చేరేదీ అమ్మకు రాయలేదు. తనను ఆశ్చర్యపరచాలనుకున్నాను. చిన్న చిన్న పొదలు, ప్లమ్ చెట్లతో చిన్న కొండచరియను దాటేసి ఆడివి-పొద్దుతిరుగుడు పూల పసుపు పచ్చని భూమిలో ప్రవేశించాం. ఆ సహజ వనం కాస్తా దాటేసి, మా అమ్మ ఇంటికి చేరాం. కలప క్యాబిన్ పక్కనే మా కాన్వాస్ కప్పిన ‘విగ్వామ్’. డ్రైవరు తెరిచి ఉన్న తలుపు ముందు మా బండి ఆపాడు. కాసేపటికి అమ్మ తలుపు వద్దకు వచ్చింది.

తను పరిగెత్తుకు వచ్చి నన్ను కావిలించుకుంటుందని అనుకున్నాను. కాని, ఆమె కదలకుండా నిలబడింది. నా పక్కన మొరటు మనిషినే చూస్తోంది. ఆమె గాంభీర్యం ఇక భరించలేక, “అమ్మా, ఎందుకు ఆగిపోయావ”ని అడిగాను.

ఆ మాటతో చెడు మంత్రమేదో విడిచినట్లు, అమ్మ ముందుకొచ్చి నా తలను తన చెంపకు ఆనించుకుంది.

“కూతురా, నీకేం దయ్యం పట్టింది అలాంటి వాడిని ఇంటికి తీసుకొచ్చావు?” అని అడిగింది, డ్రైవరు వైపు చూపిస్తూ. డ్రైవరు నేను ఇచ్చిన నోటును ఎగుడు దిగుడు పళ్ళ మధ్య పట్టుకుని, జేబుల్లో చిల్లర వెదుక్కుంటున్నాడు, నాకివ్వడానికి.

“తనను నేను తీసుకురావడమా, అబ్బే, తనే నన్ను తీసుకొచ్చాడు. తను డ్రైవరు” అన్నాను.

ఆ కాస్త వివరణతో అమ్మ నా చుట్టూ చేతులేస్తూ, వేరే అనుకున్నందుకు క్షమాపణ చెప్పింది. క్షణకాలపు అపార్థానికి ఇద్దరం నవ్వుకున్నాం. ఇక ఆమె ‘టీపీ’లో నేల మీద పొయ్యి రాజేసింది. మంట మీదుగా వంగిన ఫోర్కు లాంటి కడ్డీ మీద అడుగున మసిబారిన కాఫీ పాత్రను వేలాడదీసింది. ఎర్రని నిప్పుల మీద పెనం ఉంచి రొట్టె కాల్చింది. ఆ తేలిక పాటి మధ్యాన్న భోజనాన్ని… క్యాబిన్ లోని భోజానం బల్ల మీద ఉంచింది, ఒక గళ్ల గళ్ళ బట్ట పరిచి.

మా అమ్మ ఎప్పుడూ బడికి పోలేదు. తెల్లవాళ్ళ ఆచారాల కోసం తన ఆచారాల్ని వొదులుకోడం ఆమెకు ఇష్టమే గాని, చిన్న చిన్న చిన్న రాజీల వద్దనే ఆగిపోయింది. ఇంటి రెండు కిటికీలకు గులాబీ రంగు తెరలు పెట్టింది. కిటికీల దూలాలకు రంగు వేయలేదు. వాటిని గొడ్డలితో మొరటుగా నరికి అమర్చారంతే. మట్టితో చేసిన పైకప్పు నుంచి చిన్న చిన్న పొద్దుతిరుగుడు పూలు కనిపిస్తాయి. బహుశా, గాలికి వచ్చి పడిన విత్తనాలవి. ఆ దూలాలకు నా తల ఆనించాను. ఎప్పటికీ మరిచిపోలేని చిత్రమైన వాసన. అలాంటి ఇళ్లలో నేల మీద, పైకప్పు మీద వాన నీళ్లు ఇంకిపోయి తయారైన సహజమైన వాసన.

“అమ్మా, నీ ఇంటిని కాంక్రీటు ఇంటిగా మార్చలేదెందుకు? ఇంతకన్నా సుఖమైన ఇల్లు వొద్దా నీకు?” అని అడిగాను. కేవలం తన అనాసక్తే దానికి కారణమనుకుని అలా అడిగాను.

“అమ్మాయ్, మరిచిపోయావా? నేను పెద్ద దాన్నయ్యాను. పూసల పని చెయ్యడం లేదు. మీ అన్న, దవీ, ఉద్యోగం పోయింది. ఒక ముద్ద తిండికి కూడా కటకటగా ఉంది” అందామె.

దవీ మా రిజర్వేషన్ లో ప్రభుత్వ గుమాస్తాగా పని చేసేవాడు. నాకు అంతవరెకే తెలుసు. తనకు ఉద్యోగం లేదని అమ్మ చెప్పే సరికి ఆశ్చర్యపోయాను. నా కళ్ళలో ప్రశ్నలను చూసి, “దవీ నీకు చెప్పలేదా? వాషింగ్టన్ లోని మన ఘనమైన తండ్రి మీ అన్న పెన్ను లాగేసుకోడానికి తన తెల్ల కుమారుడిని పంపించాడు. అప్పట్నించి, తూర్పు-ప్రాంత బడిలో దవీ చదువుకున్న చదువు తను బతకడానికి పనికి రాకుండా పోయింది. “

అమ్మకు ఏం చెప్పాలో నాకు తోచలేదు. నాలో రేగిన మంటలను చల్లార్చుకోడం ఎలాగో కూడా తోచలేదు.

దవీ దూరంగా పచ్చిక-మైదానంలో ఉంటున్నాడు. ఒక రోజంతా ప్రయాణం చేయాల్సినంత దూరం. మరునాటికి గాని మా వద్దకు రాలేడు. మేము ఇద్దరం మౌనంగా ఉండిపోయాం.

ఇంటి దూలాల మధ్య మూలల్లోంచి గాలి మూల్గులు వినిపించాయి. దూలాలు సరిగ్గా అమరని కంతల్లోంచి ఆ చిన్న ఇంటిలోనికి ప్రసరించే పగటి వెలుగును చూశాను. అమ్మ వైపు తిరిగి దవీ కష్టాల గురించి ఇంకా చెప్పమని అడిగాను. “అమ్మాయ్, ఇన్నాళ్ళుగా ఈ చిన్ని ఊరు తెల్ల తోలు దొంగలకు ఆశ్రయమైంది. దీని గురించి ‘ఇండియన్లు’ వాషింగ్టన్ లోని ఘనమైన తండ్రికి ఫిర్యాదు చెయ్యలేరు. ఫిర్యాదు చేస్తే,
దాని దుష్ఫలితాలు ఇక్కడే కనిపిస్తాయి. మీ అన్న దవీ ఒక చిన్న తగాదాలో మన తెగకు న్యాయం చేయాలని ప్రయత్నించాడు. ఫలితం… ఈ కష్టాలు”

నేనేమంటానో విందామని అమ్మ ఆగింది. నేను ఏమీ మాట్లాడలేదు.

“అమ్మాయ్, న్యాయం ఆశించడానికి మనకు ఒకే ఒక ఆధారం ఉంది. మనకు జరిగే అన్యాయాలకు ప్రతీకారం చేయాలని ‘మహా ఆత్మ’ (గ్రేట్ స్పిరిట్ ను) ప్రార్థిస్తున్నాను.” అందామె. నేను పెదిమ కదిలించకపోవడం గమనించి ఊరుకుంది.

నా శక్తి అంతా హరించుకుపోయినట్టనిపించింది. ఏ విశ్వాసాన్నీ ఇంకెంత మాత్రం నిలబెట్టుకోలేననిపించింది. నిస్సహాయంగా ఏడుస్తో అన్నాను, “ అమ్మా, మరిక ప్రార్థించొద్దు. మనం చచ్చిన బతికినా ఆ ‘మహా ఆత్మ’ కు పట్టదు. మంచి కోసం, న్యాయం కోసం ఎదురు చూడొద్దు, ఎదురు చూస్తే, నిరాశపడక తప్పదు”

“కూతురా, అలా పిచ్చిగా మాట్లాడకు.” అంటూ నా తల నిమిరింది, నేను చిన్న పిల్లగా ఉన్నప్పుడు నిమిరినట్టే.

పర్యావరణ, మానవ హక్కుల కార్యకర్త, అమ్మ. బాల్యం కర్నూలు జిల్లా, నందికొట్కూర్ తాలూకా లోని మండ్లెం గ్రామంలో. హైస్కూల్, ఇంటర్ హైదరాబాదులో. బి.టెక్ కర్నూల్లో. ప్రస్తుత నివాసం పెన్నింగ్టన్, న్యూ జెర్సీ. సామాజిక స్పృహ ఉన్న సాహిత్యం చదవడం, రాయడం ఇష్టం.

Leave a Reply