ఆత్మగౌరవ ప్రతీక “స్వయంసిద్ధ”

“మనిషి సామాజిక జీవి”, man is social animal. సమాజం లో పురుషులు, మహిళలు, బాలలు, వృద్ధులు ఇలా అందరూ ఉంటారు, అయితే ముఖ్య భూమిక పోషించే సమూహం లోని పురుషులు/స్త్రీల నిష్పత్తి లో పురుషుల ఆధిపత్యం వలన స్త్రీలు తమ వ్యక్తిగత స్వేచ్ఛ ను కోల్పోయి బతుకు ని బలవంతంగా/నిరాసక్తం గా కోనసాగిస్తున్నారు. తమ వ్యక్తిత్వానికి విరుద్ధం గా ఇమడలేని పరిస్థితి నుంచి బయటపడే మహిళల కధల సమాహారమే ఈ “స్వయం సిద్ధ” ..

స్వయం గా తనకి తాను గా కార్యసిద్ధి పొందిన అనేకమంది మహిళల యదార్ధ గాధలు. ఇవన్నీ మన చుట్టూ జరిగేవే. సంకల్ప శక్తి లేమి (Abulia): నిర్ణయాలు తీసుకొనే శక్తి లేకపోవడం, నిర్ణయానికి రాలేరు ఒకవేళ వచ్చినా కూడా అమలు జరుపలేరు. సరిగ్గా “ఇడుపు కాయితాలు ” లో ని కధ. సుధ కుటుంబ బంధం నుంచి బయటకి రాలేక, అందులో ఇమడలేక నిర్ణయం తీసుకుని అమలు పరచడానికి చాలా కాలం తీసుకుంటుంది. తన కింద పని చేసే యశోద అదే సమస్యని ఎదుర్కొన్నా, ఆత్మవిశ్వాసంతో ముందు అడుగు వేసిన తీరుకి ఆశ్చర్యపోతుంది. అందుకే “ఆత్మ గౌరవం లేని చోట అస్సలు ఉండకూడదు”, అవును మనస్సు ని చంపుకొని ఉండలేము.

అనుమానం పెనుభూతం అంటారు, పాపం ఆ అనుమానమే నరకం చూపించింది (స్వయం ప్రకాశిత). అనుమానం తో అవమానం చేసే భర్త తనని విడిచిపెట్టి వెళ్ళాక ఒంటరితనం తో జీవిస్తూ, పురుషుల వేధింపు ల ని సమర్ధవంతం గా ఎదుర్కొంటుంది. పిల్లలు లేకున్నా, మళ్ళీ పెళ్లి చేసుకోమన్నా కూడా కాదని తన భావాల్ని రచన రూపం లో చూసుకొని సంతృప్తి పొందుతుంది. అయితే “కమిట్మెంట్ ” అన్నవి సాహిత్యం లో కూడా పొడ చూపడం దారుణం. పైకి తీసుకువస్తాం అన్న సాకుతో సాహిత్య కారులు చేసే జుగుప్సకరమైన విధానాన్ని చక్కగా ఎండగట్టారు

నైతిక శూన్యవాదం (moral nihilism) వ్యక్తి సమాజంలోని ఇతరుల కి ఏ విధం గా బద్ధుడు గాడని , విధేయుడు గాదని చేప్పే ఒక సిద్ధాంతం. దీని ప్రకారం గా చూసుకుంటే మహిళ/స్త్రీ సమాజానికో/భర్తకు విధేయుడు గా కానీ/బానిస గా ఉండాల్సిన అవసరం లేదు. వైయక్తిక స్వేచ్ఛ కి గౌరవించనంత వరకు అది బానిసత్వమే ఇదిగో ఈ ” ఓ విరామం” లాగ. భార్యాభర్త ల మధ్య విధేయత/నిబద్ధత కేవలం భార్య కి మాత్రమే ఉండాలి అనుకోవడం. పెళ్లి కి ముందు ఉన్న ప్రేమ తరువాత అడుగింటిపోవడం. బిడ్డ ని కనడం మూలాన వచ్చిన వొంటి బరువు ని చూసి చీదరించుకోవడం/పాపాయి పెంపకం లో సలహాలు ఇస్తాడు కానీ పెంచడం లో బాధ్యత తీసుకోడు. ఇలానే మగాడి ఇగో కి సగటు భార్య నలిగిపోతుంది. ఈ ఆధిపత్యాన్ని సహించలేని తాను చివరికి లాయర్ ని ఆశ్రయించక తప్పలేదు. తప్పు కూడా కాదు ఎందుకంటే భార్య అంటే పిల్లల్ని కనిచ్చే యంత్రం కాదు (ఓ విరామం).

Generation Gap (తరాల మధ్య అంతరం), నిన్నటి తరం వారు ముందు వెనక అలోచించి అడుగు వేస్తే, నేటి తరం మాత్రం అనాలోచితం గా నిర్ణయాలు తీసుకుంటారు. ఒక కూతురు అమ్మ తీసుకునే నిర్ణయాన్ని చాదస్తం అనుకుంటే, అమ్మ తన ఒంటరి జీవితం లో కష్టాల్ని ఉత్తరం లో వెల్లడించాక గాని తెలుసుకోదు. తల్లి “తపన” ప్రతి ఒక్క కూతురు తెలుసుకోవాలి. ఇది ఒక పాజిటివ్ ఆలోచన మాత్రమే (తపన).

ఎంతో ప్రగతిపదం లో ఉన్నాం అని సంతోషపడే రోజుల్లో కూడా ఈ Gender Discrimination (లింగ వివక్ష) తో కునారిల్లే సమాజం లో ఉన్నాం. కేవలం ఆడబిడ్డ అది కూడా “డౌన్ సిండ్రోమ్” తో పుట్టింది అని సుజాత ని అత్తమామలు వేధిస్తారు. భర్త కూడా ఆదరించకపోగా తప్పంతా భార్య దే అన్నట్టు గా ప్రవర్తిస్తాడు . విసిగి పోయి వదిలేసి వెళ్ళిపోతాడు. సుజాత మానసిక ఎదుగుదల లేని పాప తో ఎన్ని కష్టాలు పడినా ఒక మానసిక వికలాంగుల కేంద్రం లో పాప ని ఉంచాక గాని స్థిమిత పడదు. చేసే ఉద్యగం లో లైంగిక వేధింపులు ఎదుర్కొంటు కూడా పాప గురించి బాధపడుతుంది. ఇలాంటి సుజాతలాంటి అమ్మలు ఎందరో …(ఒంటరి పోరాటం).

ఆడవాళ్ళకి ఆడవాళ్లే శత్రువు అంటారు నిజం కాకపోయినా కొంతమంది అలానే చేస్తారు. కరుణ బిడ్డ కి బాగోలేక హాస్పిటల్ లో చేరితే పక్క బెడ్ ఆమె చూపించిన వివక్ష కి స్నేహితురాలు రాధ కూడా అవాక్కు అవుతుంది. “నేను ఉన్నాను కనకనే” లో ఒక పాత్ర అంటుంది, “పసుపు కుంకాలకి దూరమై బతకటం కన్నా చావడం మేలు” ఇది ఒక కండిషనింగ్ లో పెట్టడం కాదు … చిన్నప్పటి సౌభాగ్య వ్రతాలు ఆచరించి అలా తయారు అయ్యింది ఏమో, నిజానికి ఆమెకి భర్త కన్నా ముత్తైదువు గా ఉండటమే ఇష్టం . నేటి సమాజం లో చాలావరకు అంతే. భర్త జీవితం లో ఒక భాగం మాత్రమే, భర్తే జీవితం కాదు ఈ సత్యం తెలుసుకుంటే అంత గా బాధించచు.

ఎవుసాయం చెయ్యడం మొగవాళ్లదే నా ? చాలావరకు ఇదే అభిప్రాయం కలిగి ఉంటారు. ఆడవాళ్లు సున్నితం కాబట్టి చెయ్యలేరు అనుకుంటారు కానీ తప్పనిసరిగా చెయ్యాల్సిన పరిస్థితి వస్తే మాత్రం మగవాళ్ళకి ఏమి తీసి పోరు. చక్కగా సాగుతున్న కాపురం లో భర్త హటాత్తు గా చనిపోతే భయపడకుండా ఉన్న పొలం లో సేంద్రియ పద్ధతి లో వ్యవసాయం చేసి ఆదర్శ రైతు గా నిలుస్తుంది “భూదేవి” . ఇందులో ఒక గొప్ప మాట అంటుంది, “చదవగలిగినంత చదివించండి, ఎదగాలి అన్నంత ఎత్తు కి ఎదగనివ్వండి/ఆడ పిల్ల కు త్వరగా పెళ్లిళ్లు చేసి పంపించాలి అని, గుండెల మీద భారం గా చూడకండి/చదువుకోవడం వలన జీవితం లో ఎదురయ్యే ఎలాంటి సవాళ్లు అయినా ఎదుర్కొని విజయం సాధించగలరు” (భూదేవి). అతివ ఆత్మవిశ్వాసానికి ఆకాశమే హద్దు, ఇక ఎవ్వరు ఆపలేరు.

ఇక “దేవుని పెండ్లాం దేవి పోత” కథ అంతా “జోగిని” గా మారిన ఒక దళిత మహిళ గోస. రాత్రి పటెల్ కలలో కనిపించి జోగిని గా మార్చమనడం ఎట్లా కరెక్ట్ అవ్వుద్ది ? నాలాగే మిగతా ఆడవాళ్ళని కూడా జోగిని గా చెయ్యమని ఎందుకు అడగదు దేవత పెద్దవ్వ? అని నిలదీస్తుంది. జోగిని గా సమాజం లో తన పాత్ర కేవలం వాంఛ తీర్చుకోవడనికి వస్తువు మాత్రమే. ఈమె కేవలం ఒక పాత్ర అప్రచలితత (Role obsolescence) వ్యక్తి కి ఆపాదితమైన సామాజిక పాత్ర. సమాజం లో పేరు ఉంటుంది కానీ పెద్ద కులపోళ్ల సమూహం లో మాత్రం ప్రాముఖ్యం ఉండదు . జోగిని లు వృధ్యాప్య పింఛన్ / ఒంటరి ఆడవాళ్ళకి ఇచ్చే పింఛన్ కోసం ఆఫీస్ లో భర్త చచ్చిపోయినడు అనే కాగితాన్ని తీసుకు రమ్మంటారు. లేని భర్త ని ఎక్కడ నుంచి తీసుకు రావాలి అని మొత్తుకున్నా వినరు. లేని భర్త తో విడాకుల కాగితాన్ని ఎక్కడ నుంచి తీసుకురాగలదు. అదే లేనిదే డబ్బులు రావు. లేని “ఇడుపు కాయిదాలు” ను ఎక్కడ నుంచి తెచ్చి ఇవ్వను పెద్దమ్మ అని వాపోతుంది. జోగిని వ్యవస్థ పై ఎక్కుపెట్టిన అస్త్రం ఈ కధ

Personal Idealism (వైయక్తిక ప్రత్యమ్నాయవాదం) శక్తి వైయుక్తిక సంపన్న జ్ఞానం /సంకల్పం/ఆత్మ చైతన్యం అనేటువంటి వైయుక్తిక గుణాలు. ఇలాంటి వ్యక్తిగత స్వేచ్ఛ ని కావాలని కోరుకొని కుటంబం హింస నుంచి దూరం గా ఒంటరి జీవితాన్ని ఆహ్వానించిన వాళ్ళు ఎందరో. ఈ కధల్లో చాలావరకు పురుష ఆధిక్యత నుంచి/సమాజపు ఆంక్షలనుంచి దూరం గా జరిగి తమ అస్తిత్వాన్ని నిరూపించుకుంటారు. Regorism [కఠోరతావాదం] నిగ్రహవాదం. నియమాల ఆచరణలో కఠినత. నైసర్గిక కోరికలు ప్రవృత్తులని నిగ్రహించాలి. శ్రీదేవి తన కూతురికి తన గతం చెప్తూ ఎన్ని కస్టాలు ఎదురుకోవాల్సి వచ్చిందో చెప్తుంది ఆ క్రమం లో చాలా సార్లు శరీర వాంఛ ల పట్ల కఠినత అవలింబించేది. బహుశా సమాజానికి భయపడి నా ఏమో, అయితే తన తరానికి /ఇప్పటి తరము లో గల నిర్ణాయక శక్తి ని పరిశీలించాక ఆశ్చర్యపోవడం అవుతుంది. ఎందుకంటే కష్టాలు వచ్చినా కూడా ఒంటరితనపు జీవితాన్ని కోరుకోవడం. పెళ్లి అనేది చివరి అంకం కాదు అని తెలుసుకొని కొంచం దిగులు పడుతుంది (చిన్న చిన్నవి) .

ప్రేమ బంధం లో ఉన్నప్పుడు పిల్లలు కావాలి అనిపించినప్పుడు అది పెళ్లి కాకుండా అన్నప్పుడు సమాజం ఆమోద ముద్ర వేస్తుందా ? అస్సలు వెయ్యదు పైగా ఒకలాంటి ముద్ర వేస్తుంది. వసుధ విషయము లో కూడా అదే జరగబోయేది కానీ పట్టుదలతో సంజు ని ఈ లోకం లో కి తెస్తుంది IVF ద్వారా. అర్జున్ ని ఇంకా తల్లితండ్రుల్ని ఒప్పించి తన కోరిక ని నెరవేర్చుకుంటుంది. ఉద్యోగం లో ప్రమోషన్ వచ్చి అమెరికా వెళ్ళాక/సంజు కి అమ్మ గొప్పతనం తెలుస్తుంది. కాదు కాదు ఉత్తరం ద్వారా తెలుపుతుంది. నిన్నటి తరం తీసుకున్న గొప్ప ఆత్మ విశ్వాస నిర్ణయం. అది Amoral (నీతి బాహ్యం) నైతిక ద్రుష్టి లో ఇది మంచా/ చెడు అని చెప్పలేని స్థితి లో వసుధ ఉన్నా కూడా భవిష్యత్తు దృష్టా గట్టి నిర్ణయమే తీసుకొని ముందుకు వెళ్తుంది( అనగా అనగా ఒక అమ్మాయి) ….

ఆడవాళ్లు తెగించి కొట్లాడకపోతే /ఆత్మ గౌరవమే కాదు జీవితాన్నే కోల్పోవాల్సి వస్తుంది” , ఈ తెగింపు తోనే మృగాళ్ల మధ్య నుంచి “సుక్లమ్మాయి” ని రక్షించి వొడ్డున పడేసింది సాధారణమైన ఒక బస్సు కండెక్టర్. అడవి బిడ్డలని మోసం చేసి ఎలా లూటీ చేస్తున్నారో చక్కగా చెప్పారు. మత్తు లో ముంచి వాళ్ళ చేత ఎలాంటి నీతి బాహ్యమైన పనులు చేపిస్తున్నారో/పసి పిల్లలకి గంజాయి ని అలవాటు చేసి వాళ్ళ జీవితాల్ని బుగ్గి పాలు చేస్తున్న నాయకుల పట్ల అసహ్యం /కోపం రావడం సహజమే. “కొండమల్లి “లో పాపం చంటి బిడ్డ తో ప్రయాణం చేస్తున్నప్పుడు లైంగిక వేధింపులకు గురి అయితే చూస్తూ ఊరుకోలేకపోతుంది. చివరికి ధైర్యం చేసి బుద్ధి చెప్తుంది అలాంటి తెగింపు నేటి మహిళలకి కావాలి (కొండమల్లి).

Pacifism: శాంతివాదం. సమస్య పరిష్కారానికి యుద్ధం /హింస కాక శాంతి ద్వారా చేసే ఒక ప్రయత్నం . స్వయం సిద్ధ కధల్లో ఏ కధ ని చూసినా సమస్య శాంతియుతం గా ముగిసిపోదు దాని కోసం పెద్ద యుద్ధమే చెయ్యాల్సి ఉంటుంది. Objective ethics (వస్తుపరమైన నీతి) వ్యక్తి సమాజం లో నియమిత స్థానాన్ని ఆధారం గా చేసుకొని ఏర్పడిన నీతి /ఆచారం. అనాది గా సమాజం స్త్రీ కి భార్య స్థానం ఇచ్చి నియమాల్ని, ఆంక్షలు విధించింది. పెళ్లి బంధం లో ఇద్దరికి బాధ్యత ఇవ్వకుండా కేవలం స్త్రీ కి బాధ్యత ఇచ్చి, భర్త కి మాత్రం హక్కులు ఇచ్చి అపరిమిత అధికారాన్ని కట్టబెట్టింది. స్త్రీలు ఎప్పుడు భర్త/మగాడి నీడ వంచనే ఉండాలి అన్న సామాజిక ఆధిపత్యాన్ని కనబరుస్తుంది. వ్యక్తి భావాలని బట్టి కాక , వ్యక్తి గుణాలని బట్టి నిర్ణయిస్తుంది. అలాంటి Social Objective Ethics ఎక్కడికక్కడ మహిళాభివృద్ధి ని అడ్డుకుంటాయి.

ఒక్కటే జిందగీ లో ఒక అమ్మ సంఘర్షణ. ప్రేమ వివాహం చేసుకొని అయినవాళ్ళని దూరం గా వదిలి వస్తుంది. కూతురి ప్రేమ గా చెప్తుంది కానీ కూతురి భవిష్యత్తు కోసం ఉరుకుల పరుగుల జీవితం లో తనని హాస్టల్ లో వేస్తుంది పెళ్లి పట్ల విముఖత కలిగిన కూతురి ని కౌన్సిలింగ్ ఇచ్చి మళ్ళీ గాడి లో పడేస్తుంది. ఒంటరితనం ఉంటూ కూతురు ని చదివిస్తుంది. అయితే ఇద్దరు ఒకరి ఆనందం కోసం మరొకరు తపన పడతారు. తన తల్లి చేసిన తప్పు నే చెయ్యకుండా ఒంటరి గా మిగిలిపోకుండా తల్లి కి ఆనందం కలిగిస్తుంది. (ఒక్కటే జిందగీ)…

ఒకే వస్తువు తో కధల పుస్తకం రావడం గతం లో వచ్చాయా/లేదో తెలియదు కానీ ఒకే కధాంశం తో భిన్న కధలు రావడం మాత్రం సంతోషం. ఒంటరితనాన్ని ఆలంబన గా తీసుకొని భర్త తోడు లేకున్నా/సమాజం సూటి పోటీ మాటలు అంటున్నా కూడా వాటిని ఖాతరు చెయ్యకుండా తాము అనుకున్నవి ఆత్మవిశ్వాసం తో నేటి మహిళలు విజయం సాధించడం గొప్ప విషయము.

Solipsism (ఆత్మ పరిమిత వాదం) వ్యక్తి అస్తిత్త్వానికి మించిన అస్తిత్వం దేనిని నిరూపించలేము. వ్యక్తి అస్తిత్వ అనుభవం పరిమితం కానీ అనుభవం మానసికం. ఈ కధల్లో స్త్రీలు అస్తిత్వ ఎరుక తో ముందుకు వెళ్తున్నారు. ఎన్నో బాధలు పడుతున్నా కూడా బంధం లో ఉండాలి అని అనుకోవడం లేదు. కష్టాలు ఉన్నా కూడా ఒంటరితనాన్ని /ఒంటరి జీవితాన్ని/స్వేచ్చాయుత విధానాన్ని కోరుకుంటున్నారు.

అయితే ఈ కధల్లో తమ ఈ స్థితి కి కారణం కేవలం పురుష ఆధిక్యమేనా? సామాజిక కట్టుబాట్లు వంటి ఇతర కారణాలు కూడా ఉన్నాయా ? అయితే మగవాళ్ళు అందరు చెడ్డవాళ్లే నా అని ప్రశ్న వేసుకుంటే చాలావరకు అందరు కాకపోయినా చాలామటుకు అవును అనే సమాధానం వస్తుంది. తాము అనుభవిస్తున్న ఈ స్థితి కి కారణం పురుష సమాజమే అనే బలమైన వాదన కూడా ఉంది. సంఘర్షణ కి దారి తీసిన పరిస్థితికి మేల్ ఇగో కూడా కారణమే ..పైన ఉదహరించిన కధలు కేవలం కొన్ని మాత్రమే. ..ఇంకా అనేక కధలు మనసు ని హత్తుకుంటాయి. ఆలోచింపచేసే కధల పుస్తకం ఈ “స్వయంసిద్ధ”. ఎన్నో వ్యప్రయాసలు కోర్చి ఈ పుస్తకాన్ని అందించడం ముదావహం. ఈ సంకలనంలో కధలు రాసిన రచయిత్రులందరికి పేరు పేరున అభినందనలు. ఈ రకంగా అయినా స్త్రీ సమస్యల పట్ల సమాజపు ద్రుష్టి కోణం మారాలని మనస్పూర్తి గా కోరుకుంటున్నాను. ఈ సందర్బంగా ‘స్వయంసిద్ద’ కథా సంకలనం ద్వారా స్త్రీవాదంలో స్త్రీల మరోకోణాన్ని సాహితీ ప్రపంచంలో ఆవిష్కరించిన హస్మిత ప్రచురణ కర్తలు, భండారు విజయ మరియు పి. జ్యోతి గార్లకు శుభాభినందనలు.

వృత్తి : medical transcription. ప్రవృత్తి: కవిత్వం, కథ, సమీక్షలు, విమర్శ.
రెండు కవిత్వపు పుస్తకాలు ప్రచురించారు. ఇంకా కొన్ని సాహిత్య వ్యాసాలు రాశారు. నటన అంటే చాలా ఇష్టం. నాటక సమాజంలో పలు నాటకాలు వేసిన నేపథ్యం. ప్రస్తుతం ఉండేది హైదరాబాద్ లో.

2 thoughts on “ఆత్మగౌరవ ప్రతీక “స్వయంసిద్ధ”

  1. కొలిమి పత్రిక యాజమాన్యం వారికి, సాహితీ విమర్శకులు పుష్యమీ సాగర్ గారికి కృతజ్ఞతలు 💕

    1. ధన్యవాదాలు అండి…చక్కని పుస్తకాన్ని అందించారు అభినందనలు

Leave a Reply