ఆచూకీ

కవిత్వం
సీతాకోకలు కట్టుకుని
మల్లెపూలు పెట్టుకుని
వెన్నెల్లో తిరగడం
అస్సలేం బాగలేదు

పెద్దగా కనబడని
సీతాకోకచిలుకలు కవిత లోకి
ఎలా చొరబడుతున్నాయో తెలియడం లేదు
తప్పిపోయిన పిల్లల్నెవరూ
ఆచూకీ కోసం అడగడం లేదు

ఆకర్షణ గేలానికి చిక్కిన
ఆడపిల్ల ,మోసపోయి కూడా
ఇలా తొంగి చూడటం లేదు

పూలకు సిగ్గులేదు
అదే పని గా పుస్తకాల్లో దూరిపోతాయ్
అడవిలో గాయపడ్డ జింక పిల్ల అరుపులు
కవితలో ఇమడటం లేదు

కొండ మీద నుండి జారీ
కాళ్ళు, చేతులు విరిగిన జలపాతపు
నీటి గొంతు కంపిత ధ్వని
పాట లోకి రావడం లేదు

ఎక్కడెక్కడో పడి
గాయాలు పాలౌతున్న వెన్నెల
చేతులు చాస్తున్నా
అక్కున చేర్చుకునే గేయం లేదు

విషపురుగు పాకి తల్లడిల్లి,
విల విల లాడిన గూడెపు ప్రాణమొకటి
గాల్లో తిరుగుతోంది…

పుట్టింది నెల్లూరు జిల్లా, ఓజిలి, రాచపాలెం. కాకినాడలోని పిఠాపురం రాజా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు శాఖాధిపతి. 'నీటిపూలవాన', 'గోరువంకల గానం' అనే రెండు పిల్లల కవితా సంకలనాలు వేశారు. ఎక్సరే, తానా, రంజని, కుందుర్తి వంటి పురస్కారాలు పొంది ఉన్నారు. రాధేయ కవితా పురస్కార నిర్వాహకులలో ఒకరు.

13 thoughts on “ఆచూకీ

  1. గోపాల్ గారు. చక్కని కవిత అద్భుతంగా మలిచారు. అభినందనలు

  2. కవిత్వం ఆచూకీ నీకైనా చిక్కింది మిత్రమా అద్భుతం

  3. మిత్రమా..నీ హృదయ వేదన అర్ధమయ్యింది..

  4. పదాలు అనే పూలతో అల్లే మీ కవితలు పూలమాల వలె ఎప్పుడు బాగుంటాయి సార్……

  5. మంచి కవిత సర్….చాలా బావుంది సర్…

Leave a Reply