అసలు సమస్య నీ లోపల తగలబడే ఇల్లా?

“అందుకోవాల్సింది నీలోపల నిరంతరం పరిగెత్తే రైలు బండిని
బయట ఎన్నో రైళ్లు ఎక్కుతావ్
సమయానికి బసునూ
విమానాన్నీ పట్టి అపుతావ్
నీ లోపల నడిచే రిక్షాబండిని మాత్రం ఏమార్చుతావ్” అంటాడొక కవి. మరొక కవి ఇదే భావాన్ని మరోలా అంటాడు చూడండి.

“ఖండాలనాన్నిటినీ తిరిగాను
సముద్రాలనాన్నిటినీ దాటాను
సరస్సుల్ని ఈదాను
నాలోనే హోరెత్తిస్తున్న మహా సముద్రాల్ని చూడలేకపోయాను
నా మనసు మూలల్లో పరుచుకున్న వేళా ఖండాల్ని కనుగొన లేకపోయాను”.

ఒక కథలో ఒక పాత్ర ఏమంటుందో చూడండి
“నాకు నేనే అర్ధం కానప్పుడు నువ్వు మాత్రం ఏమర్ధమౌతావ్. నువ్వు గానీ ఇతరులు గానీ అర్ధం కావడం సులువే. నన్ను నేను తెలుసుకోవడమే కష్టం.

పై వ్యక్తీకరణ లన్నీ ‘know thyself’ ‘Know Yourself’. ‘నిన్ను నువ్వు తెలుసుకో’. ‘ నీ గమ్యం నీవే’ లాంటి భావజాలాన్ని బలపరుస్తున్నాయ్. బాహ్య వాస్తవికత కంటే అంతర్వాస్తవికత ముఖ్యమనే సూచననిస్తున్నాయ్.

తనని తాను తెలుసుకోవడాన్ని అసాధ్యమైన విషయంగా చిత్రిస్తూ వుంటారు చాలామంది. నిజానికి ఎవర్ని వాళ్ళు తెలుసుకోవడం తేలిక నా దృష్టిలో.

ఎవరిలోనైనా ఏముంది లోపల రకరకాల దుర్గంధం, అహం, కొంత చీకటీ కొంత వెలుతురూ వగైరా తప్ప. లోపలి వాస్తవికత కన్నా బయటి వాస్తవికతే సంక్లిష్టమైనది. నా లోపల ఏముందో నాకు తెలిసినంతగా నా చుట్టూ వున్న వాళ్లలో ఏముందో నాకు తెలియడం అంత తేలిగ్గా కుదిరే పని కాదు. ఎవరిని వాళ్ళు తెలుసుకోవడమే అసలైన కష్టం అనేవాళ్లకు వాళ్లేంటో వాళ్లకు బాగా తెలుసు.

లోపలి వాస్తవికతను అందుకోజాలని పదార్థంగా చిత్రించడం వల్ల బాహ్య వాస్తవికతను పట్టించుకోకపోవడం, చిన్నచూపు చూడటం ఉంటుంది. లోపలి ఎగుడుదిగుడులను వైభవీకరించడం ద్వారా బయటి అంతరాల్నీ అసమానతల్నీ, మోసాల్నీ, మాయల్నీ కొట్టిపారేసే ధోరణి ఉంది. దీనివల్ల లాభపడే వాళ్ళెవరూ? బాహ్య వాస్తవికతలో ఆధిపత్య స్థానాల్లో ఉండేవాళ్ళు. పెత్తందారీ పాలక పీఠాల మీద దర్జా వెలగబెట్టే వాళ్ళు.

అందుకే పై వర్గాల కులాల వాళ్ళు ఇలాంటి భావాల్ని ప్రోత్సహిస్తూ వుంటారు.

ప్రతి వ్యక్తికీ తన చీకటి వెలుగుల రుచి తనకు తెలుసు. సామాజిక చీకటి వెలుగుల్ని స్పష్టంగా తవ్వి తీయడం ద్వారానే సామాజిక మార్పు కలిగేది.
చుట్టూ వున్న ఇళ్ళు తగలబడుతుంటే ఆర్పవలసింది బయటి ఇళ్ల మంటల్ని కాదు నీ లోపలి ఇంటి మంటల్ని అని హితబోధ చేయడం ఎంతవరకు సబబు?

తమ లోపల ఏముందో ప్రతి ఒక్కరికీ తెలుసు. అందరికీ తెలిసినదాన్ని తెలీని విషయంగా తెలుసుకోవలసిన విషయంగా చిత్రించడంలో పస లేని మాట నిజమే గానీ అంతర్వాస్తవికత ఉండదని కాదూ, బాహ్య వాస్తవికతతో దానికి పరస్పరత ఉండదని కాదు.

నిత్య సామాజిక ఆర్ధిక పీడనలో ఉన్న జనానికి తమ లోపలి వాస్తవికతను తెలుసుకోవడమే గమ్యంగా బోధిస్తూ సామాజిక వాస్తవికతను పట్టించుకోని పర్యవసానం దుర్మార్గం అనేదే మనం ముఖ్యంగా గమనించాల్సింది. నిన్ను నువ్వు తెలుసుకోవడం అనేది నీ సమాజాన్ని తెలుసుకోవటం మీద ఆధారపడివుంటుందనేదాన్ని చెప్పినంతవరకూ ఓకే. నిన్ను నువ్వు తెలుసుకోవడం అనేది విడిగా సాధించాల్సిన లక్ష్యం అన్నప్పుడే సమస్య.

The mind is its own place
It can make a hell of heaven
A heaven of hell అంటాడు కవి మిల్టన్. నువ్వు ఉన్న చోటు కాదు నీ మానసిక స్థితి ప్రధానం. నీ మనసు బాగుంటే నువ్వు నరకంలో ఉన్నా స్వర్గం లాగా ఉంటుంది. నీ మనసు బాగోనప్పుడు నువ్వు స్వర్గం లో ఉన్నా నరకంలా ఉంటుంది అనేది కవి భావన. అంటే కష్టసుఖాలనేవి నీ మనసుకు చెందినవి, బయటి పరిస్థితులకు చెందినవి కాదని చెప్పే ఈ దృష్టి సమాజాన్ని కాదు నిన్ను నువ్వు మార్చుకోవాలి అని చెప్పటమే.

ఇలాంటి ధోరణికి విరుగుడుగా ఒక కవి అంటాడు.
హిమాలయాల్లో కూర్చుని వెచ్చగా ఉందని ఎవరు చెప్పగలరు?
అగ్ని కాలుస్తుంటే చల్లగా ఉందని చెప్పే మనసు ఎక్కడైనా ఉంటే చూపండి అని ఆడుగుతాడీ కవి.

కవి, సాహిత్య విర్శకుడు, సామాజిక విశ్లేషకుడు, దళిత బహుజన సాహిత్య ఉద్యమకారుడు. తెలుగు దళిత బహుజ సాహిత్య సిద్ధాంతాన్ని రూపొందించి, పెంపొందించడానికి కృషిచేశారు. 'చిక్కనవుతున్న పాట'(1995), 'పదునెక్కిన పాట'(1996) కవితా సంకలనాలు తీసుకురావడానికి కృషిచేశారు. దళిత బహుజన కవిత్వంలో అంబేద్కరిజం వ్యక్తమైన తీరును విశ్లేషిస్తూ దళిత బహుజన సాహిత్యం దృక్పథం రాశారు. 'The Essence of Dalith Poetry' అనే ఆంగ్ల గ్రంథాన్ని ప్రచురించారు. ఇటీవలే 'కవితా నిర్మాణ పద్ధతులు', 'సామాజిక కళా విమర్శ' అనే పుస్తకాలు ప్రచురించారు. తెలుగు సాహిత్య అకాడమీ అవార్డు(1995), ఇటీవల కలేకూరి, శంబూక, గిడుగు రామ్మూర్తి అవార్డులు వచ్చాయి.

2 thoughts on “అసలు సమస్య నీ లోపల తగలబడే ఇల్లా?

  1. నిజానికి ఎవర్ని వాళ్ళు తెలుసుకోవడం తేలిక నా దృష్టిలో.
    ఎవరిలోనైనా ఏముంది లోపల రకరకాల దుర్గంధం, అహం, కొంత చీకటీ కొంత వెలుతురూ వగైరా తప్ప. లోపలి వాస్తవికత కన్నా బయటి వాస్తవికతే సంక్లిష్టమైనది. నిజమే సార్ గొప్ప జీవిత తాత్వికత మా ముందుంచారు. మీకు నా నమస్సులు . ప్రేమతో.. మీ రాం

  2. ఈ విమర్శ చాలా చక్కగా వ్రాసారు జీవితంలో. మనిషి పడే నిత్య ఆవేదన,,, స్వార్థం సంకుచిత్వం బాగావివరించారు. మనిషి లోపలి గుణాన్ని చక్కని కవిత్వపు పంక్తులతో. ప్రముఖ కవులతో వారి రచనలతో ముడిపెట్టి వ్రాసిన విధానం బాగున్నది. మన తెలుగులో ఈస్థటిక్ సెన్స్ తో వ్రాయగల విమర్శలు చాలా కొద్దిగా కలవు. తత్వం తో కూడిన కవితావిమర్శలు లేవనే గ్రహించాలి. ఈ వ్యాసం ఆ కోవకు చెందినదని నేను భావిస్తాను. కవిత్వం విమర్శలు ఈ తరహాలో వచ్చిన యెడల తెలుగు కవిత్వం విమర్శ పతాకస్థాయి చేరుకుంటుందని నా అభిప్రాయం.. ఎటువంటి విమర్శలు మన లక్ష్మి నరసయ్య గారు మరిన్ని వ్రాయాలి అని కోరుకుంటూ… మీ మాల్యాద్రి

Leave a Reply