అసంపూర్ణం

ప్రతి రాత్రి
ఉదయాన్ని ఉదయిస్తే!
ఆరోజు…
కొండచిలువను మింగి
కొన్నిశవాల్నిపుక్కిలించిన
కాళరాత్రి
*
అక్కడి హాహాకారాలకి
కొండలు సైతం కరిగి
కాలువలైన కన్నీళ్ళు
రక్తంతో తడిసి
ఎర్రటి ఆకాశంలా
కళ్ళల్లో పరచుకున్న భూమాత
*
తలలు తెగిన మొండాలు
కాళ్ళు చేతులు విరిగి
ఖండఖండాలై
శ్వాసకోసం పోరాడుతూ
రక్తపు మడుగులో కొట్టుకొంటున్న
అమాయక విగతజీవులు
*
చేరుకోవాల్సిన గమ్యాన్ని
చేరుకోలేక
అనంత వాయువుల్లో
కలిసిన ప్రాణం లేని దేహాలు
*
అక్కడ…
ఎదురు చూసే మనస్సులో
క్షణక్షణానికో
గుబులు మహామేఘ విస్ఫోట‌నం
*
మరి కొంతమంది
ఎండిన చూపులతో
ఎదురు చూపులతో
ప్రాణం ఉన్నా లేనట్టే
పోగొట్టుకున్న వస్తువుల్ని ఏరుకుంటున్నట్లు
కాళ్ళు చేతుల్ని ముఖాల్ని
ఏరుకుంటూ
కనిపించే విషాద శిలారూపాలు
*
కొన్నిసార్లు జీవితం
మధ్య‌లో ఆగిపోయే ప్రయాణం
ప్రయాణాలు అనంత దూరాలు
గమ్యం తెలియని సుదూర తీరాలు
*
పాదం కదిలినంత కాలం
ప్రాణ మున్నంతకాలం
సాగేదే జీవితం.

హైద‌రాబాద్‌లోని వివేక‌వ‌ర్ధ‌ని క‌ళాశాల ఇంగ్లిష్ డిపార్ట్‌మెంట్‌లో అసోసియేట్ ప్రొఫెస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు 'ఆచూకీ'(మ‌రో ఇద్ద‌రు క‌వుల‌తో క‌లిసి), 'ప‌ర్యాయ‌ప‌దం' (క‌వితా సంక‌ల‌నం), ఒక క‌విత ఇర‌వై కోణాలు('కుంప‌టి' క‌విత‌పై ప్ర‌యోగం) వెలువ‌రించారు. త్వ‌ర‌లో మ‌రో క‌వితా సంక‌ల‌నం రాబోతోంది. క‌విత్వంతో పాటు ఇత‌ర క‌వుల క‌విత్వంపై విమ‌ర్శ వ్యాసాలు, బీసీ క‌వుల అస్తిత్వ సంచ‌ల‌న క‌విత్వ సంక‌ల‌నం 'స‌మూహం'కి ముందు మాట రాశారు.

Leave a Reply