అన్నార్తుల ఆర్తగీతం – అశని సంకేత్

“పండ్లు కాసే చెట్లూ, చేపలతో నిండిన నదులూ, ఎందరో స్నేహితులూ, ఇరుగుపొరుగు మనుషులూ మన చుట్టూ ఉండగా మనుషులు ఆకలితో మరణించటం ఎలా జరుగుతుంది? అలాంటిది సాధ్యమని వాళ్లు ఎన్నడూ అనుకోలేదు.ఆకలి కారణంగా మనిషి చనిపోవటాన్ని ప్రత్యక్షంగా చూడటం వాళ్లకిదే మొదటిసారి. ఆకలి మనిషిని చంపెయ్యగలదని మోతీ చావుతో వాళ్లకు అర్ధమైంది. ఇదేమీ కల్పిత గాథ కాదు. సజీవమైన ఒక స్త్రీ అందరూ చూస్తూ వుండగానే ఆకలితో చచ్చిపోయింది. ఆమె చావు వాళ్ళందరినీ వాస్తవం లోకి మేల్కొలిపింది.

మృత్యువు ఎవరినైనా, ఎప్పుడైనా కబళించ గలిగేంత దగ్గరగా వచ్చేసింది.

మామిడిచెట్టు కింద పడివున్న మోతీ మృతదేహం, పడబోతున్న పిడుగుపాటు తాలూకు మొదటి ప్రమాద సూచిక, మొట్టమొదటి మేఘ గర్జన.”

బిభూతిభూషణ్ బంద్యోపాధ్యాయ్ రాసిన ‘అశని సంకేత్’ నవలలోని దృశ్యం ఇది.

1943 లో బెంగాల్ లో ఏర్పడిన తీవ్రమైన కరువు ప్రజల జీవితాలను దుర్భరం చేసింది. బ్రిటిష్ ఇండియా లోని బెంగాల్ ప్రావిన్స్ (ఇప్పటి బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిషా, బీహార్ ) అంతటా వ్యాపించిన కరువు దాదాపుగా మూడు మిలియన్ల ప్రజల ప్రాణాలను బలి తీసుకున్నది.

అప్పటికే ఒకవైపున రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్నది. రవాణా మార్గాలు మూతబడి సరుకుల పంపణీ ఆగిపోయింది. మిలటరీని పోషించటానికి అధిక వ్యయం కారణంగా ఆర్థిక మాంద్యం ఏర్పడింది. దుకాణాల్లో సరుకులు మాయమై, బ్లాక్ మార్కెట్ కు తరలి పోయాయి. సామాన్యులకు తిండి గింజలు కరువయ్యాయి. ఆహార లేమితో వచ్చిన జబ్బులు, మలేరియా, వైద్య సౌకర్యాలు అందుబాటులో లేక పోవటం, వలసలు… ఎన్నో విధాలుగా జనం మరణించారు. ఈ కరువు కాలం ‘Great famine of Bengal’ గా చరిత్రలో నమోదయింది.

బెంగాలీ రచయితలు, కళాకారులు ఎందరో ఆ విషాదకర పరిస్థితిని చిత్రించారు. చిత్తప్రసాద్ బెంగాల్ అంతటా పర్యటించి తన బొమ్మల్లో,వ్యాసాల్లో కరువు బీభత్సాన్ని కళ్ళకు కట్టినట్లు రికార్డ్ చేశారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా నిర్వహించే ‘పీపుల్స్ వార్’ పత్రిక ఆ వ్యాసాలను ధారావాహికగా ప్రచురించింది. అమలేందు చక్రవర్తి, భవాని భట్టాచార్య, ఈ కరువు ఇతివృత్తంగా నవలలు రాశారు. బిభూతి భూషణ్ రాసిన, అశనిసంకేత్ నవల కూడా అదే సమయంలో ఒక బెంగాలీ పత్రికలో సీరియల్ గా ప్రచురితమైంది.

గంగా చరణ్, అనంగ అనే దంపతులు ప్రధాన పాత్రలుగా సాగే ఈ రచన గ్రామీణ బెంగాల్ లో కరువు విశ్వరూపాన్ని కళ్ళకుకట్టినట్లుగా చూపించింది. తనదైన ఒక నమూనాలో సాగిపోతున్న గ్రామీణ సమాజం రెండవ ప్రపంచయుద్ధ పరిణామాలతో ఒక కుదుపుకు లోనైంది.

బజార్లలో సరుకులు జనం చూస్తుండగానే అనూహ్యంగా అదృశ్యమై పోతున్నాయి. ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. సైన్యం కొరకు రైతులవద్ద బలవంతపు ధాన్య సేకరణను చేపట్టింది ప్రభుత్వం. మిగిలిన గింజలు ధనవంతుల అటకల మీదికి, బ్లాక్ మార్కెట్ లోకి చేరి పోయాయి. నిరుపేదల ఆదాయ మార్గాలు మూసుకుపోయి, వారి కొనుగోలు శక్తి దారుణంగా పడిపోయింది.

అన్నానికి బదులుగా పప్పు గింజలతో, కాయగూరలతో కడుపు నింపుకున్న జనానికి అవికూడా దొరకని పరిస్థితి ఏర్పడి అడవి దుంపలూ,ఆకులూ, జలచరాలూ, పీతలూ దొరికినా చాలని పోటీ పడాల్సిన గతి పట్టింది.

సమాజం అల్లకల్లోలమైంది. మానవ సంబంధాలు విచ్చిన్నమయ్యాయి. కుటుంబాలు కూలిపోయాయి.

బెంగాల్ కరువును గురించి ప్రసిద్ధ ఆర్థికవేత్త అమర్త్య సేన్ లోతైన విశ్లేషణలు చేశారు. ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గిపోవటం, జనాభా పెరుగుదల అధికంగా ఉండటం కారణంగానే ఆ కరువు ఏర్పడిందని ప్రధానస్రవంతి ఆర్థిక వేత్తలు చేసిన సూత్రీకరణలను ఆయన తోసిపుచ్చారు.

1943లోకన్నా అతితక్కువ ఉత్పత్తి జరిగిన సంవత్సరాల్లో సైతం ఇటువంటి కరువు ఏర్పడలేదు. బ్రిటిష్ ప్రభుత్వపు దోపిడి ఆర్థిక విధానాల ఫలితంగా ఏర్పడిన ఆర్థిక మాంద్యమే కరువును సృష్టించింది. అసలైన సమస్య ఆహారం లేకపోవటం కాదు,అది సామాన్య ప్రజలకు అందుబాటులో లేకపోవటం. బెంగాల్ లోని కఠినమైన కుల,వర్గ విభజనను బ్రిటిష్ ప్రభుత్వ లాభార్జన విధానాలు మరింత గట్టిపరిచాయి. సామాజిక హోదా ఆధారంగా కరువు ఫలితాలను ప్రజలు అనుభవించారు. నిమ్న కులాల ప్రజలు,స్త్రీలు కరువుకు ప్రధానంగా బలయ్యారు – ఇది అమర్త్య సేన్ అభిప్రాయం.

ఈ ఆర్థికవేత్త చేసిన విశ్లేషణనే తన నవలలో అలవోకగా వ్యక్తం చేశారు బిభూతి భూషణ్. పీడిత ప్రజల పట్ల గొప్ప సహానుభూతితో, నిష్పాక్షికమైన దృక్పథంతో, నిశితమైన పరిశీలనతో ఆయన దీన్ని సాధించగలిగారు.

సమాజంలో బలంగా ఉన్న వర్గ,కుల విభజనలూ, పితృస్వామ్యం ఈ కరువు కాలంలో ఎంత స్పష్టంగా వ్యక్తమైందో ఈ నవల చెబుతుంది. సొంత భూములున్న రైతులు రహస్యంగానైనా కొంత ధాన్యాన్ని నిలవ చేసుకున్నారు. శ్రమ చెయ్యకపోయినా, నిరుపేదలే అయినా కులం ద్వారా వచ్చిన ఆధిక్యత వల్ల బ్రాహ్మణులకు కూడా కొంత తిండి దొరికింది. ఇక భూమిలేని నిమ్న కులాల పేదలు నిస్సహాయంగా కరువు కోరలకు చిక్కిపోయారు. కుటుంబాల్లోని పితృస్వామ్య సంస్కృతి స్త్రీల నుండి ఎప్పుడూ త్యాగాలనే ఆశిస్తుంది కనుక, స్త్రీలు మరింతగా ఆకలి పాలయ్యారు. పిడికెడు గింజలకోసం ఆడవాళ్ళు శరీరాలను అమ్ముకోటానికి సిధ్ధపడ్డారు.

ఈ పరిణామాలను ఆర్తితో చిత్రించారు బిభూతి భూషణ్.

స్వార్థంతో, లాభాపేక్షతో కఠినంగా కరడుగట్టిన సంపన్నులనూ, కులం ద్వారా దొరికిన ఆధిక్యతను వాడుకుంటూ పబ్బం గడుపుకోవాలని చూసే బ్రాహ్మణ వర్గాలనూ ఆయన అసహ్యించుకున్నారు. మరోవైపున ఆయన రచనలు అన్నిటిలో వలెనే ఇందులోని స్త్రీలు కూడా శక్తిమంతులు, సాహసికులు, దయామయులు.

వాళ్లు పరిస్థితులకు ఎదురీదుతూ పరిష్కారాలను అన్వేషిస్తారు. సామాజిక విభజనలను తోసిపుచ్చి మానవ సంబంధాలను సజీవం చేస్తారు. అనంగ, మోతీ, ఛుట్కీ… ఈ స్త్రీలందరూ రచయిత ఆకాంక్షలకు ప్రతినిధులు.

వ్యవస్థ లోని దుర్మార్గాలు, ప్రభుత్వాల అన్యాయాలు, సామాజిక అసమానతలు, ప్రకృతి వైపరీత్యాలు – ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం మానవ సంబంధాలను సున్నితంగా,పటిష్ఠంగా నిర్మించుకోవడమేనని హృద్యంగా చెప్పారు బిభూతి భూషణ్ ఈ నవలలో.

1950 లో ఆయన మరణించారు. ఆ తర్వాత తొమ్మిదేళ్లకు 1959 లో బెంగాలీలో నవలగా వెలువడిన ‘అశని సంకేత్‘ కు ఆయన భార్య రమా బంద్యో పాధ్యాయ్ పరిచయ వాక్యాలు రాశారు. 1973 లో ఇదే టైటిల్ తో సత్యజిత్ రే దర్శకత్వంలో సినిమాగా రూపొందింది.

2018 లో ‘Distant Thunder’ పేరిట ఇంగ్లిష్ లోకి అనువాదమైంది.

ఎనభయ్యేళ్ళ కిందట సంభవించిన ఒక మహా విపత్తును అర్థం చేసుకోవడానికీ, పీడిత ప్రజలపట్ల మన స్పందనలను సున్నితంగా మలచుకోవటానికీ ఈ నవల దోహదం చేస్తుంది.

నెల్లూరు జిల్లాలో పుట్టి పెరిగారు. ప్రస్తుతం హైదరాబాద్ లో నివాసం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో తెలుగు సాహిత్యంలో పిఎచ్.డి చేశారు. సాహిత్యం, సామాజిక శాస్త్రాల అధ్యయనంలో, ముఖ్యంగా సాహిత్య విమర్శలో ఆసక్తి. మిత్రులతో కలిసి "చూపు" పత్రికను కొంతకాలం నిర్వహించారు. సాహిత్య, సాహిత్యేతర గ్రంథాల అనువాదం, రచన వంటి అంశాల్లో కృషి చేస్తున్నారు.

Leave a Reply