అల్పపీడన ద్రోణి

“మేం నలుగురం కలిసే చచ్చిపోతున్నం. మాకు తెలివి ఉంది. కానీ పైసా మాత్రం లేదు. అప్పులోల్లు అందరికీ మార్చి 25న బాకీ తీర్చుతానని వాయిదా పెట్టాము. వాళ్లు వచ్చి అడిగితే ఏం చెప్పాలి. ఈ మధ్య తరగతి వాళ్లకు ఇజ్జత్ ఎక్కువ. నలుగురి ముందు ఇజ్జత్ పోతే బతకలేం. నాకే కనుక ఎకరం పొలం ఉంటే దాన్ని అమ్మైనా బతికేటోళ్లం. ఇప్పుడు ఇల్లు అమ్మితే పది లక్షలు వస్తాయి. కానీ ఇంకా ఎనిమిది లక్షల రూపాయల వరకు బాకీ ఉంది. ఈ ఎనిమిది లక్షల అప్పులను తీర్చలేకే మా నాలుగు ప్రాణాలు పోతున్నాయి. ముప్ఫై ఎకరాల పత్తి వేస్తే వంద క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. కైకిళ్లన్నీ పోనూ మూడు లక్షల రూపాయలే వచ్చాయి. పోయిన ఏడాది నష్టపోయా, ఈ ఏడాది కూడా లాసే వచ్చింది. బిడ్డ పెళ్లికి కూడా అప్పులు చేశా. మా ఆత్మహత్యలకు ఎవరూ కారణం కాదు. కౌలు రైతు పరిస్థితి ఇంతే. నువ్వు లేకపోతే మేము ఉండలేమని భార్యాపిల్లలు అన్నారు. పిల్లలు బతికి ఉన్నా గాని అప్పులోళ్లు వాళ్లను పీక్కుతింటారు. అందుకే ఈ నిర్ణయం.”

మార్చ్ 24, 2021 న మంచిర్యాల్ జిల్లా కాశీపేట్ మండలం మల్కపల్లి కి చెందిన కౌలు రైతు జంజిరాల రమేశ్ అతని భార్య లక్ష్మి, కూతురు సౌమ్య, కొడుకు అక్షయ్ కుటుంబం మొత్తం అందరి సంతకాలతో రాసిన సామూహిక ఆత్మహత్య లేఖ అందరినీ కంటతడి పెట్టించింది.

మామూలుగా ఒకరి ఆత్మహత్యనే చాలా అంత: సంఘర్షణతో వేదనతో కూడినది. వేరే వారితో ఆ బాధను పంచుకోలేక, సమాజంలో ఇమడలేక జరిగేది అనుకుంటే…, ఇద్దరు భార్య భర్తలతోపాటు పదో తరగతి చదువుకున్న కొడుకు, పెండ్లి అయి ఏడాదైనా గడువని రెండు రోజుల ముందే అత్తగారింటి నుండి ఇంటికొచ్చిన నాలుగు నెలల గర్భిణి అయిన కూతురు, కుటుంబ సభ్యులు నలుగురు కలిసి ఆత్మహత్య చేసుకుందామనే నిర్ణయానికి మూడు రోజుల ముందే వచ్చి ఏకగ్రీవంగా ఒప్పందానికి వచ్చిండ్రు అంటే వారిని తమ చుట్టూ ఉన్న పరిస్థితులు ఎంత బలంగా ప్రభావితం చేసినవో ఊహించుకోవచ్చు. రెండు రోజుల ముందే కొడుకు ఊళ్ళోకి వెళ్ళి కొత్త పగ్గాలు (తాళ్లు) తెచ్చి౦డు.  చావు ఏర్పాట్లు చేసుకున్నంక మొదట పిల్లలకు ఉరివేసి ఆ శవాలని దించి ఆ తర్వాత భార్యాభర్తలు ఇద్దరు ఉరి వేసుకొని చనిపోయారంటే మనుషులకి బ్రతుకు , ఈ భూమి, సమాజం ఎంత భారమైపోయిందో – మనుషులకి ,మనుషులు సమాజానికి ఎంత గ్యాప్ ఏర్పడిందో …,.మనుషులెంత ఒంటరి అయిపోయిండ్రో , ఎటువంటి కల్లోల పరిస్థితులల్లో మానవ సమాజం చిక్కుకుపోయిందో అనే ఆలోచనలతో ధు:ఖముతో రెండు రోజులు మునిగిపోయాను.

ఈ బాధని ఒక మిత్రునితో పంచుకుంటే “ఇది ప్రభుత్వ హత్య. సామాజిక హత్య” అని తేల్చేసిండు.

ఇంకా మాట్లాడుతూ “గత ముప్పై సంవత్సరాలుగా వ్యవసాయ ర౦గంలో వస్తున్న సాంకేతిక, సామాజిక మార్పులతో మనిషి సమిష్టి నుండి వ్యష్టి వ్యవస్థకి నెట్టివేయబడ్డాడు. మొదటి పంచవర్ష ప్రణాళికా 1950 కాలానికి 50.82 మిలియన్ టన్నుల ఉత్పత్తితో దేశ జాతీయాదాయంలో ( జీడీపీ ) 55.9% గా ఉన్నప్రాథమిక రంగమైన వ్యవసాయ రంగం, ప్రస్తుతం అప్పటి ధాన్యపు ఉత్పత్తికి ఆరు రెట్లు ఎక్కువగా 303 మిలియన్ టన్నుల ఉత్పత్తిని పెంచినా గాని దేశ జాతీయ ఆదాయంలో దాని విలువ మాత్రం 13% గా తగ్గిందంటే రైతు చేస్తున్న కష్టం విలువ, ఆ ఉత్పత్తి విలువ ఎంతగా తగ్గించబడ్డది. విలువ తగ్గించబడ్డ ఈ దోపిడీ ఎక్కడికి పోతుంది? దీనినంతా ఎవరు లాగుకుంటున్నారు?

సాధారణంగా ఎక్కువ శాతం చిన్న మరియు సన్నకారు రైతులు ఓబీసీలు. వీరు మానసికంగా పై కులాలతో పోల్చుకుంటారు. కానీ నిజానికి రైతుకూలీలకన్నా అధ్వాన్నమైన పరిస్థితి వీరిది. ఇక కౌలు రైతులదైతే అడవిలోనే పొద్దుగూకినట్టుండే బ్రతుకు. ఎడ్లు ఎవ్సము పోయినంకా , ఎవ్సములో మానవ శ్రమ సంబంధాలు మాయం అయినంక ఉత్పత్తి సాధనాలు తన చేతిలో నుండి వెళ్ళిపోయినంకా , సహజంగా తనకుండే జ్ఞానానికి బయటి గతితార్కిక జ్ఞానం అందక రైతు కొంత అశాస్త్రీయం అయిపోయిండు. సందిగ్ధములో పడిపోయిండు.  కానీ నిజమైన సంపధ సృష్టికర్త ఐన రైతు యొక్క  , ప్రతి అడుగు హేతువుతో కూడినదై – ప్రతి కదలిక , మార్పు కారణ కారక సంబంధాలతో కూడినదని అనుభవపూర్వకంగా తెలుసుకున్న మహాజ్ఞాని ఐన రైతు ఇలా అజ్ఞానంగా ఆత్మహత్య చేసుకోడు. ఐతే గియితే తన అనుభవాన్ని ఆచరణలో పెట్టేటప్పుడు వచ్చే అడ్డంకులతో ముందుకు పోలేక  మనం అర్థం చేసుకోలేని పిచ్చివాడు అవుతాడేమో గాని. ఊరిడిచి వెళ్ళి పోతాడేమోగాని. 

ఈ భూగ్రహం మీద అతి తెలివైన జీవిగా పుట్టినప్పటికి  అశాస్త్రీయ విద్యా విధానం వల్ల  సరైన జ్ఞానం అందని వారి పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారంటే అది వేరే విషయం. కానీ ప్రతి మొలకలో, మొక్కలో, ఆకులో, పువ్వులో, పిందెలో, పండులో తన ప్రాణాన్ని నింపుకునే సున్నిత మనస్కుడైన రైతు తన కన్న బిడ్డలనే ఉరివేసే కర్కశత్వాన్ని కలిగి ఉండడు. ఆ దంపతుల చావు బాధాకరం. వారిపట్ల నాకు తీవ్రమైన సానుభూతి ఉంది. కానీ వారిలాగే నీకు ఎదురవుతున్న , నీలో దాగిన సమస్యలని సాల్వ్ చేసుకోలేక , దైర్యం చేయలేక వాళ్ళ చావుని చూసి పలాయనం పొందుతూ రిలాక్స్ అవుతున్న నీ ధు:ఖం చూస్తే కూడా నాకు అసహ్యంగా ఉంది. నువ్వు సరిగ్గా తెలుసుకో మళ్ళీ చెపుతున్నాను ఆత్మహత్య అనేది వ్యక్తిగతం కాదు అది సామాజికం. వ్యవస్థీకృతం. అందులో నాకేమి పేచీ లేదు. కానీ నాకెందుకో ఆ రైతు దంపతుల జీవన విధానములో చేసే వ్యవసాయములో ప్రవర్తనలో కూడా ఏదో లోపము ఉండి ఉంటదని అనిపిస్తుంది. అది చుట్టూ ఉన్న సమాజం వేసిన ప్రభావం అయినప్పటికీ కూడా వ్యక్తిగత అశాస్త్రీయ జీవన విధానాన్ని కూడా మనం మార్చుకోవాలి.  లక్షలుపోసి, ఫంక్షన్ చేసి  బిడ్డ పెళ్ళి చేసుడు ఎందుకు గొంతు పిసికి చంపుడు ఎందుకు? ఏ తప్పుడు వ్యవస్థతో పోటీ పడుదామని 30 ఎకరాలు కౌలుకి పట్టిండు. కనీసం ఎక్కడికైనా పారిపోయి  బ్రతకమని పంపించలేక కొడుకుకి ఉరేసిండు? కాబట్టి చావుని గ్లోరిఫై చేయకుండా , బ్రతికున్న శవాలమైన మనం మన ధు:ఖాన్ని కూడా అందులో కలుపుకొని ఏడ్చే బదులు ఈ విషయాలని కూడా మనం చర్చించుకోవాలి. “  అంత కర్కశంగా నా మిత్రుడు చెప్పేసరికి  నా గొంతు తడారిపోయింది. 

మళ్ళీ జనరల్ గా తను చెప్పడం ప్రారంభించిండు. “రైతు తనకున్న ఎకరము భూమిలోనే పది తీర్ల పంటలు పండించుకునే రోజులు పోయి , మార్కెట్ అనుగుణ పత్తి , ఆడ మగ వరి లాంటి పంటలు పండించుడు పెరిగినంక – ట్రాక్టర్లు, సీడ్ మేనేజర్లు, ఎమ్మార్వో ఆఫీషు, ఎరువులు, పురుగుమందులు, కోత మిషనులు, మీ సేవలు, లారీలు, బ్యాంకులు…, అంటూ రోడ్ మీద, పట్నం చుట్టూ బిచ్చగాళ్ల కుక్క తీరుగా అందరి చుట్టూ తిరిగే బ్రతుకైపోయింది రైతుది. 
ఈ అవస్థలో చిక్కుకుపోయి, అయోమయములో తప్పిపోయి ఎవరికి చెప్పుకోలేక ఒంటరివాడైపోయిండు. గిట్టుబాటు ధర అనేది ఒక బుడుగ. రైతుకీ అసలు ఎక్కడ ధగా జరుగుతుందో తెలియని ఒక మాయ.
 

సమాజంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యమై, కుటుంబాలు, గ్రామాలు, బడులు, ఆస్పత్రులు, గుడులు, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అన్ని నిర్మాణాలు కూలిపోయి వ్యక్తిగా రైతు, అతని కుటుంబం మానసికంగా ఒంటరిదయిపోయింది. పిచ్చిదైపోయింది. పిరికిదైపోయింది. మన దేశంలో సుధీర్ఘకాల భూస్వామ్య౦, కుల వ్యవస్థ రైతులని శ్రామికులని చీల్చింది. దాని ఫలితమే ఈ కుటుంబ సామూహిక ఆత్మ హత్య. హత్య..’’ ఆవేదనతో రగిలిపోయిండు నా మిత్రుడు.

ఈ మాటలు నాకు కొంత ఊరటని నన్ను అర్థము చేసుకున్నట్లు అనిపించింది. 

“దీనికి పరిష్కారం లేదా మరి ?” అని నేనడిగాను.

“ఎందుకు ఉండదు. బాధలున్నోడు ఆ బాధల నుండి బయట పడాలని రకరకాల ప్రయత్నాలు చేస్తాడు. ఢిల్లీలో జరుగుతున్న రైతు ఉద్యమం మన కళ్ళ ముందు కనిపిస్తాలేదా ? అదొక నిర్మాణంగా, ఆశగా అన్పించట్లేదా? నాకైతే అనిపిస్తుంది. ఆదివాసులు మూడువేల సంవత్సరాలుగా యుద్ధములోనే ఉన్నారు. దళితులు , మహిళలని అగ్రకుల ఆధిపత్య బ్రాహ్మణీయ భావజాలం అణగదొక్కింది. ఐనా నిలబడుతున్నారు. రైతులు మాత్రం కుల మత వర్గ ప్రాంతీయంగా చీలిపోయి౦డ్రు. ఆ చీలిపోయిన శూధ్ర రైతాంగం ఇప్పుడు దేశమంతటా  ఒక్కటవ్వబోతోంది. అది ఉత్పత్తిలో తమతో కలిసి ఉండే మిగతా శక్తులతో కలిసి ఉమ్మడి ఐక్య కార్యాచరణ సమితిని ఏర్పాటు చేస్తాది.  ఇంతకాలం వాళ్ళని అబద్ధాలతో , కల్పనలతో , పుక్కిటి పురాణాలతో , అనవసరమైన నాన్ సీరియస్ ఇస్స్యూస్ ని ఇష్యూ గా చేస్తూ , సీరియస్ ఇస్స్యూస్ ని నాన్ సీరియస్ ఇస్స్యూస్ గా చేస్తూ మోసం చేసి , మాయచేసి దోచిన భూస్వామ్య బ్రాహ్మణీయ పెట్టుబడిధారులు దోచిన లెక్కలు తీస్తుంది. దేశవ్యాప్తంగా రైతాంగం వారి యొక్క నిజమైన చారిత్రక గతితార్కిక జ్ఞానాన్ని ఇప్పుడు చేత పట్టుకుంది. 

రైతు ఉద్యమం ఎక్కడ పెరిగిపోతదో, ఎక్కడ విజయవంతం అవుతదో, ప్రస్తుత దేశ సమస్యలకి ఎక్కడ పరిష్కారం చూపుతదో, ఎక్కడ ఆ ఆర్గానిక్ ఇంటలెక్చువల్స్ ఐనా రైతు వర్గం నుండి దేశానికి దిశా నిర్ధేశం అందించగల కొత్త నాయకత్వం వస్తదేమోనని ప్రభుత్వం ఆ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న దళారి బూర్జువా పెట్టుబడిదారీ మూక చేస్తున్న కుట్రలా తోస్తుంది నాకు’’ అన్నాడు.

“అర్థం కాలేదు నాకు’’ అన్నాను నేను. నిజంగానే నేను అంతా కన్ఫ్యూజన్ లో ఉన్నాను. 

“దేశంలో అనివార్యంగా ముందుకొచ్చిన రైతు ఉద్యమాన్ని కనుమరుగు చేయడం, ప్రభుత్వ రంగాన్ని వీలైనంత తొందరగా ప్రైవేటుపరం చేయడం, ఇదే సమయంలో ఈ దేశంలోలో ఉత్పత్తి శక్తులు, ఉత్పత్తి సంబంధాలలో వచ్చిన విపరీతమైన మార్పులకి మిగులు మనుషులుగా మారిపోయిన, తిరుగుబాటు చేయబోయే నిరుద్యోగ యువతని, ప్రజలని వదిలించుకోవడం, ఎంతో కొంత ఆస్తి కలిగి ఉన్నమద్య తరగతి పెటీ బూర్జువాల దగ్గర ఉన్న ఆ కొద్ది మొత్తాన్ని అనారోగ్యం పేరిట గుంజుకోవడం కోసమే ప్రభుత్వం మిగతా కొన్ని దేశాల వలె ముందస్తు జాగ్రత్త తీసుకోకుండా, దేశ జనాభాకు సరిపడ టీకాల తయారీ మీద ఆసక్తి పెట్టకుండా, కరోనాని గాలికి వదిలి ఎలెక్షన్స్, కుంభమేళా ఇతర మతపరమైన కార్యక్రమాలకి అనుమతినిచ్చి జనం సులభంగా గుంపుగా మారే అవకాశం ఇచ్చి కరోన రెండో వేవ్ కి కారణమైంది. దీని వల్ల రోజుకి వేలాది మంది ప్రజలు చనిపోతుండ్రు’’ మిత్రుడు చెప్తుంటే ఇంకా తెల్సుకోవాలన్పించింది.

“మరీ ఇగ ఇంతేనా? దీనికి ప్రత్యామ్నాయం, పరిష్కారం లేదంటావా?’’ ఎంతో ఆసక్తిగా నేను.

“రైతులేమి మనలాంటి నప్పతట్లోల్లు కాదు కదా చూస్తూ ఊరుకోడానికి ?’’ తనకి కొంత కోపం వచ్చింది నా ప్రశ్నలకి.

కానీ చెప్పడం మొదలు పెట్టిండు తనే “ఢిల్లీలో లక్షలాది మందిగా మోహరించి పోరాడుతున్న రైతాంగం – తప్పనిసరి మూడు కర్తవ్యాలని తెలుసుకుంటది. కుల వర్గ పోరాటాలని దేశవ్యాప్తంగా సమీకరించడం, ఉత్పత్తి శక్తుల అభివృద్ధి, శాస్త్రీయ విజ్ణానం పెంపొదించుకోవడం. రైతులు తప్పకుండా కొత్త నిర్మాణ రూపాలని రూపొందించుకుంటారు. ముందుకు తీసుకెళ్తారు “

“వామ్మో! అదంతా ఏమో కానీ ఇది అది అని లేకుండా మొత్తం వ్యవస్థ కుప్పకూలే దశకి చేరింది. ఎవ్వరూ బ్రతికే పరిస్థితులైతే లేదు’’ ఇంకేం మాట్లాడాలో అర్థం కాక, ఓపిక లేక ఫోన్ పెట్టేసిన.

నాకు అంతా గజిబిజిగా, లోలోపల గందరగోళంగా ఉంది. తను చెప్తున్నా ఆ మూడు కర్తవ్యాలు ఎప్పుడు, ఎలా జరుగుతాయి? అసలు రైతుల ఉద్యమం ముందుకుపోతుందా?
** **
కౌలు రైతు అయిన మా చిన్నతనం నాకు గుర్తుకు వచ్చింది నాకు. ఇంతకంటే హీనమైన పరిస్థితుల గుండా నడిచి వచ్చిన మా కుటుంబం యాదికొచ్చింది. తిండి లేకుంటే ఆకలితో మాడి పండుకుంటే అర్ధరాత్రి దొర గారి పాలేరు ఇచ్చిన మొక్క జొన్న కంకులని తెచ్చి బయట పొయ్యిలో కానీ టంపి పెట్టి కానీ కాలిస్తే అందరికీ తెలుస్తదని నడింట్లో కుంపటిలో కాల్చుకొని తిని బతికిన రోజులు గుర్తుకు వచ్చినయి. అప్పులోల్లు తెల్లవారంగానే ఇంటికొచ్చి వాకిలి ఊడువకుండా చీపురు గుంజుకొని ఆ రోజు అప్పు కట్టేదాకా పొయ్యి అంటుపెట్టకుండా పొయ్యి మీద గంజు పెట్టనియ్యని రోజులు గుర్తుకు వచ్చినయి. కానీ అప్పట్లో మేమెందుకు ఆత్మహత్యా చేసుకోలేదు? ఇప్పుడు వాళ్లెందుకు చేసుకున్నారు??

ఎన్ని సంఘటనలు ఒక రైతుగా, ఒక కౌలు రైతుగా మా కుటుంబంలో. అవే ఆలోచనలు. అనేక ప్రశ్నలు నా మనసు నిండా.

** **
నా చిన్నతనంలో 1992 వ సంవత్సరం. అప్పటికే ఊళ్ళో రైతుకూలీల పోరాటాలు జరిగి మా ఊరి దొరలు చాలా మంది పట్నం బాట పట్టినారు. పరంపోగు ( ప్రస్తుత కేశవ నగర్ ) లో బంజేరు, పరంపోగు భూములు పేదలకి పంచబడ్డాయి అప్పటికే. దొరలు వాళ్ళ భూములని కొద్ది కొద్దిగా అమ్ముకు౦టున్నారు. కానీ ఇంకా ఉన్న చాలా భూములు పాలుకి, కౌలుకి ఇచ్చిండ్రు. అలా మేము మా పొలం దగ్గరి మురహరి రెడ్డి దొర భూమిని, శ్రీనివాస్ రెడ్డి దొర ( చిన్నదొర ) భూమిని, బోడ మీద (భగత్ సింగ్ నగర్ ) కాడ ఉన్న శ్రీనివాస్ రెడ్డి దొర భూమిని ఒక్కో ఏడాది ఒక్కో దగ్గర ఉన్న భూమిని పాలుకు పట్టి దున్నుతున్నం.

ఈ మధ్యనే సాకలోళ్ల ఇండ్లకి పంచాయతి ఆఫీసుకి మధ్య అర్ధరాత్రి పూట డాం డీం అని పోలీసులకి నక్సలైటులకి నడుమ ఎదురుకాల్పులు జరిగి చనిపోయిన చింతపల్లికి చెందిన తిరుపతి అనే నక్సలైటు శవ౦ గ్రామ పంచాయతీ ఆఫీసు ముందు మూడు బజార్ల కాడ నడి రోడ్ మీద పొద్దoత ఉండే. ఆ భయం ఇంకా ఊరిని విడిచిపెట్టలేదు. సర్పంచ్ ఐన చిన్న దొర కొడుకు రాంకృష్ణ రెడ్డి కూడా ఏడాదికి రెండు మూడు సార్లు తప్ప ఊరికి రాడు.

ఆ రోజు నేను స్కూల్ నుండి మధ్యాహ్న భోజనానికి ఇంటికి వస్తున్నాను నా దోస్తులతో కలిసి.
మా సైన్సు సార్ బోర్డ్ పై బొమ్మ గీసి చెప్పిన ఎల్ పీ జీ గ్యాస్ గురించి అది అసలు ఎలా ఉంటుంది, ఎలా పని చేస్తుందోనని మాకు తోచిన విధంగా చర్చించుకుంటూ వస్తున్నాం.

ఊరంతా ఏదో అలజడిగా ఉంది.

ఊరిలోని పెద్ద మనుషులుగా పిలవబడేవారు, వారి వారి జీవితాల్లో కొంత ఆరామ్ సమయం దొరికి పెద్దరికం చేసేవాళ్ళు, పెద్ద మనుషుల మాటలకి మడుగులొత్తే వాళ్ళు, రోజు గ్రామపంచాయితీ ఖచ్చీరు కాడ, ఊళ్ళో ఉన్న దాసరి లక్ష్మి రాజం చాయే ధుఖానo దగ్గర, ఆరెల్లి వెంకటయ్య గౌడ్ పెద్ద ఇంటి ముందు గద్దెల మీద కూసుండే వారందరిని దాటుతూ నేను మా ఇంటి వైపు నడుస్తూ పోతుంటే వాళ్ళ మాటలు వింటూ ఉంటే ఊళ్ళో ఏదో జరగరానిది జరిగిందని నాకు అర్థమయింది.

“నీ అవ్వ ఇగా ఊరికి కొత్త సాలువడ్డంటే .., సేతులింత ఉప్పు పెట్టేటోడు కూడా దొరకడు’’ కరణం నాగేశ్వర్ రావు దొర ఇంటి ముందు గద్దెకి దూరంగా ఉన్న బండల మీద కూసున్న గుంపులోనున్న ఒక పెద్ద మనిషి మాటలు.

“నెరీ ఇంత అధ్వానం లేకుండే మునుపు. పాత సర్పంచ్ రంగారెడ్డి దొర ఊరు దాటినప్పటి నుండే విచ్చలవిడితనం పెరిగింది. ఊల్లే కట్టడి తప్పిపోయింది.’’ కొంపలు మునిగిపోయినంత బాధ, నిరాశ కొద్ది లక్ష్మి రాజం చాయే గుడిసె నుండి బయటకు వస్తూ అంటున్న బొంగోని వీరయ్య.

“ఎహే ఇగనన్న తగ్గ శిక్ష జేసి పాబంది సేయకుంటే ఊరు మొత్తం నాశడమైతది. నడువురా వెంకటి! అంగేసుకో నడువు!’’ అని తన ఇంటి గద్దె మీద మందితో కూసున్న ఆరెల్లి వెంకన్నని చూస్తూ .., అప్పటికే తన ఇంటి నుండి బయల్దేరి ముగ్గురిని వెంబడేసుకోని సేతుల దోవతి సింగులు పట్టుకొని దబ్బ దబ్బ నడ్సుకుంటూ వస్తున్నడు రాంరెడ్డి దొర.

ఇక ఆగి మాట్లాడేదేమీ లేదు. అందరూ తన వెంట రమ్మని అంటూ చెప్తూ ముందుకు సాగుతున్నాడు రాంరెడ్డి దొర.

నాకేదో కీడు శంకిస్తున్నది మనసులో. పైగా ఆయా గుంపులో ఉన్న మనుషుల్లో కొందరు నా వైపు అదోలా చూడడం నా అనుమానానికి కారణం.
నేను నా తొవ్వలో చివరి సోపతి ఐన మా యూసుఫ్ గానికి “ జెప్పనత్తరా నేను. తిని రెడీగుండు’’ అని చెప్పి ఆరెల్లి మొండన్న ఇల్లు మూల మలిగి మా ఇంటి తొవ్వ దిక్కు చూసిన.

తొవ్వ నిండా జిబ్బ జిబ్బ మనుషులు.
బురద మనుషులు. మట్టి మనుషులు. బుడ్డ గోషి పెట్టుకున్నోళ్ళు. మోకాలి దాకనే దోతైనా. చీరైనా గుంజి కట్టుకొని నిలబడ్డ మనుషులు. ఆకలి పూట తిండికి ఇంటికచ్చిపోయే మనుషులు. ఎవలకి వాళ్ళు మాట్లాడుకునేటోల్లు కొందరైతే, చిన్న చిన్న గుంపులుగా గుమికూడినోళ్ళు కొందరు.

నా వైపు జాలిగా అదోలా చూస్తున్న కొన్ని చూపులు.
జరగరానిదేదో మా ఇంట్లోనే జరిగిందనే విషయం నాకు రూఢీ అయింది.
నేను మా ఇంటి ముందుకొచ్చేసరికి ఇంట్లోకి పోదామంటే కనీసం జాగ లేనంతగా మంది ఉన్నరు బయట.
నా జబ్బ మీది పుస్తకాలని తీసి నా రెండు చేతులల్లో పట్టుకొని నేను మా ఇంట్లోకి చేరిన.
ఇంటి నిండా కూడా మంది ఉన్నరు.

మాకున్న రెండు కట్టె కుర్చీలల్లో ఒక దాంట్లో మా బాపు. ఆ పక్కన మా బాపు మేనమామ, తన చిన్ననాటి దోస్తు మా గైశెట్టి వెంకటయ్య తాత కూసున్నడు.

ఒక మంచంలో మా రంగు తాత, మా కాకయ్య ఇట్యాల రాజిరెడ్డి ఇంకో ఇద్దరు.

కింద నేల మీదనే మా అవ్వతో సహా ఇల్లంతా కూసున్న చాలా మంది ఆడోల్లు.

నేను సాయెమానులోకి పోయినా అక్కడుండబుద్ది కాక.

మా చిన్నక్క గడాంచెలో పడుకొని ఏడుస్తుంది.

మా చిన్నక్కకి అపోజిటుగా గడాంచెలో ఆ చిన్న సందులో నేను కూడా పడుకున్నాను.
నా రెండు కండ్లలో నుండి నీళ్ళు ధారలై కారుతున్నాయి.

** **

మళ్ళీ మళ్ళీ చెప్పడం అని కాదు కానీ మా చిన్నతనంలో మా ఇంట్లో ఏనాడూ పైసా ఉండేది కాదు. డబ్బులు, ఆ డబ్బులు దాచిపెట్టుకునే అవసరం మాకు రాలేదు. నేను ఎప్పుడైనా డబ్బులు చూసిందంటే అది ఏదైనా ఊరికి పోయేముందు మా తల్లితండ్రులు షేట్ దగ్గర అప్పు కింద తీసుకచ్చుకునే అవసరమయ్యే డబ్బునే చూసేదీ.

ప్రైవేటుగా చాలా మంది దగ్గర అప్పు కాగితాలు రాయించి తీసుకున్న అప్పు పోంగా మా అవసరాలకి ఎప్పుడైనా అవసరమొస్తే శేట్ దగ్గర ఖాతాలో రాయించుకొని తీసుకోవడమే. పంట పండిన తర్వాత కుప్ప కాడ కుంచెం బిందె పట్టి మాదిగ, మన్నెపు, సాకలి, మంగలి, వడ్ల, కమ్మర, కుమ్మర, మేర …, అన్ని వృత్తి సేవా కులాల వారికి, వ్యవసాయ పనులకు వచ్చిన వారికి, సంచార కులపోల్లకి, ఆశ్రిత కులపోల్లకి వారి వాటా వారికి ఇవ్వంగా మిగిలినవి షావుకారికి కొలిచి అప్పు ఇంకా మిగిలి ఉంటే ఆ అప్పులకి వడ్డీకి వడ్డీ కిందా తిరిగి అప్పు కాగితం రాసి ఇవ్వడం.

అతను దయతలిస్తే ఏమైనా వడ్లు కానీ జొన్నలు కానీ తిండి గింజల కింద ఉంచుకునేది. షావుకారి ఒప్పుకోకుంటే ఉన్నయి మొత్తం కొలిచి మేము ఇచ్చిన మేర రామమ్మ దగ్గర, సాకలి వెంకటనర్సు దగ్గరనే తిరిగి తిండి కోసం ధాన్యాన్ని పెచ్చుల కింద తెచ్చుకునేది.( పెచ్చు అంటే డబ్బుకి వడ్డీ ఎలాగో ధాన్యానికి అధనపు ధాన్యము ఇవ్వడము).

అంతే కానీ మా ఇంట్లో చేతిలో డబ్బు అనేది ఎప్పుడు ఉండేది కాదు. మా ఇంట్లో నేను చిన్నోడిని కాబట్టి పెద్దగా లెక్కకు రాను కానీ మా అక్కలిద్దరిలో ఒకరున్నా పెండ్లీలు అయి ఇంకొకరు పోయినా కానీ మా అన్న అవ్వ బాపుతో కలిసి వాళ్లెప్పటికి ఐదుగురు కైకిలిగాళ్ళు, జీతగాళ్ళు అన్నట్లే. కానీ అంత శ్రమ చేసినా గాని ఆ బయటి ఐదుగురి కైకిలోళ్ల లేదా పై కుప్ప కాడనే కొలిచి పెట్టిన పైవారికి ఉన్న మిగులు మాకు ఉండకపోయేది.

ఇక పోతే బాపైన అవ్వైనా వాళ్ళ జీవిత కాలంలో సంపాదించింది కొన్నది గుంట భూమి లేదు. ఆడబిడ్డల పెండ్లిల కోసం ఉన్న భూమిని అమ్మడం తప్ప.
ఇదంతా ఎందుకు సెప్తున్నాను అంటే – అప్పటికి రెండేళ్ల కింద 1991 మార్చ్ 21 ఉదయం పూట మా తాత ఇట్యాల రాయుడు చనిపోయిండు.

మా బాపుకి తన పదమూడో ఏటనే తల్లి చనిపోయింది. నలుగురు పెళ్లి కావలసిన ఆడపిల్లలని వదిలి తన తల్లి చనిపోయింది. అప్పటి నుండి తొండికో మొండికో మా బాపుకు తన జీవితంలో పెద్ద ధీము మా తాతనే. అటువంటి మాటకైనా ఎంతో దైర్యంగా నిలిచి ఉండే తన తండ్రి చనిపోవడంతో మా బాపు ధుఃఖ౦లో మునిగిపోయిండు. మా తాత కొరి జీవునం పోయిన వెంటనే తన తండ్రి పాదాలపై పడి పది నిమిషాల దాకా ఏడిసిండు బాపు.

కానీ అంతకు మించి ఏడుద్దామంటే పరిస్థితులు, సమయం తనకి అనుమతించలేదు.

ఎందుకంటే చనిపోయినా సమాచారం మా చుట్టాలకి చెప్పి సాకలాయనని ఇచ్చి పంపాలన్నా మిగతా అంత్యక్రియలు జరపాలన్న చేతిలో డబ్బు ఉండని కుటుంబం కదా మాది.

మా తాత శవం అలా ఉండగానే బాపు వెంటనే లేచి శేట్ ఇంటికి వెల్లిండు డబ్బుల కోసం.

అప్పుడు శేట్ ఊళ్ళో అప్పు వసూళ్ల కోసం వెల్లిండు.

నడుముకి గుంజి కట్టిన తువ్వాలని చుట్టుకోని గంట సేపు బాపు శేట్ ఇంటి ముందే చేతులు కట్టుకోని నిల్సున్నాడు. మా తాత చనిపోయిండని తెలిసిన వాళ్ళు, మా ఇంటికొచ్చి చూసి పోయేటోల్లు మా ఇంటి దగ్గర ఉండాలిసిన బాపుని శేట్ ఇంటి ముందు చూసి రకరకాలుగా అనుకుంటూ పోయిండ్రు.
ఆ తర్వాత తిరిగొచ్చిన శేట్ “ పొద్దు పొద్దున్నే మంచి గిరాఖే’’ అని ఎప్పట్లాగే ఆ పైసలు ఈ పైసలు అని నాలుగు కొసిరి, గులిగి, తిట్టి ఇంటి ముందు దూరం పేపర్ పెట్టి సంతకం తీసుకొని కొంత డబ్బు ఇచ్చిండు.

తాత అంత్యక్రియలు జరిగిపోయినవి.

ఆ తర్వాత నెలకే మా పెద్దక్కకి కొడుకు పుట్టిండు కరీంనగర్ ఖుతిజా దవాఖనలో. ఏడాది మాసికం అయిపోయింది. తండ్రి ఏడాది మాసికం అయినంకా ఆడబిడ్డలందరికి కొత్త బట్టలు, చీరెలు, రైకలు, దోతులు, అంగీలు పెట్టాలంటే మరో శేట్ దగ్గర అప్పు కిందనే బట్టలు తెచ్చి పెట్టడం జరిగింది.

ఆ తెచ్చిన బట్టల పైసలు వడ్డీతో సహా తిరిగి ఆరు నెలల్లో చెల్లించాలనేది అప్పు ఒప్పందం. ఇంకా పంట చేతికి రావడం ఆలస్యమైంది. ఆలస్యం ఐతే షరా మామూలే వడ్డీకి వడ్డీని కలిపి తిరిగి అప్పు కాగితం రాయించుకోవడం అనే అవకాశమే పెద్ద ఓదార్పు. ఐతే ఈ పైసల విషయంలో ఆగకుండా ఒత్తిడి చేయడం వెనుకా, మా బాపు పజీత్ తీయాలనే కొందరి కుట్ర ఉంది.

బాపు తత్వాన్ని ప్రశ్నించే గుణాన్ని ఇష్టపడనీ, తన నిస్వార్థ సామాన్య జీవన విధానం వల్ల ఎక్కడో తమ అహం దెబ్బ తిన్న కొంత మంది బలమైన కుట్ర ఉంది ఈ ఒత్తిడి వెనుక.

ఆ రోజు మబ్బులనే బాపు మేం పాలుకి తీసుకొని మక్క జొన్న వేసిన శ్రీనివాస్రెడ్డి దొర భూమిలో తవ్వుటం పెట్టి ఎద్దులని నాగలి మీదనే ఉంచి తినిపోవడానికి ఇంటికొచ్చిండు.

అప్పటికే మా ఇంట్లో యుద్ధం లాంటి వాతావరణం ఉంది. మాకు కొత్త బట్టలు కొనడానికి అప్పు ఇచ్చిన శేట్ ఎట్ల పడితే అట్లా నోటికొచ్చినట్లు మాట్లాడుతుండు. మా పెద్దక్క వాళ్ళ మామ వచ్చి ఉన్నడు ఇంట్లో ఆమెని తీసుకెళ్లడం కోసం.

శేట్ ఆ మాటలు కావాలని రెచ్చగొట్టుడు, వాడపొంట ఊల్లో ఇజ్జత్ మానం తీయాలనే ఆలోచనతో, మా బాపు వ్యతిరేకులైన కొందరి ప్రోత్సాహoతోనే అది జరుగుతుంది. ఆ క్రమంలో ఆ శేట్ మరీ గలీజుగా మాట్లాడేసరికి – కోపం పట్టలేక – ఎపుడు ఇతరుల గురించి కొట్లాడే, మాట్లాడే బాపు తొలిసారిగా తన సమస్య మీద తానే స్పందించాల్సి వచ్చి, తన చేతిలో ఉన్న ముల్లుకట్టెతో శేట్ కొంకల పొంట, దోవతి సింగుల మీదికెల్లి రెండు దెబ్బలు గట్టిగానే వేసిండు.

అంతే – ఆ చర్యనే ఆ రోజు ఊళ్ళో సంచలన సంఘటనెైంది.

ముల్లు గట్టె దెబ్బలు తాకగానే “వాయ్యో…., వావ్వో’’ అంటూ శేట్ మా ఇంటి ఎదురుగా ఉండే కుమ్మరి కేశవులు తాత ఇంట్లో సొచ్చిండు.

కేశవులు తాత, మా బాపు వరుసకు తండ్రి కొడుకులు. కానీ తనకి ఎక్కువ డబ్బు ఉన్నాగానీ తన గుణం వల్ల తను మా వాడలో పెద్దరికం చేసే క్రమంలో మా బాపు నుండి ఎదురయ్యే వ్యతిరేకత క్రమంలో సహజంగా ఎప్పటికీ ఒక ఆగర్భ శతృత్వం ఉంటుంది. కాబట్టి ఆ రోజు కేశవులు తాత ఇల్లు మా శతృ శిబిరంగా నిలిచింది.

శేట్ వాళ్ళ ఇంట్లో చేరగానే పెద్ద ఎత్తున అరుస్తూ కేశవులు రోడ్ మీదికి ఉరికొచ్చి అటూ ఇటూ పెద్ద పెద్ద అంగలేసి నడుస్తూ నెత్తి నోరు కొట్టుకుంటూ
“గింత అన్నాలం ఉంటదా ? గింత మదమా? నీ మోర పూ-ల -డ్డ. ఠాణకి పట్టించి నీకు రోకలు బండలెక్కియ్యకపోతే పుట్టనోళ్ళు పెరుగనోళ్ళు నేరుత్తరు. ఊల్లో మల్ల కొత్త సిరత్తు మొదలైతది’’ అని అందరికి అప్పీల్ చేస్తూ మా బాపుని తిడుతున్నడు.

చాలా మంది మా ఇంటిని చుట్టుముట్డడంతో వెంటనే ఎడ్లబండిని కట్టి ఠాణాకెల్లి కేసు పెడుతామని శేట్ ని బండిలో కూసోబెట్టుకోని బయల్దేరిండు.
మా ఇంటికి దూరంగా మూడు బజార్ల కాడ ఎడ్లబండి ఆపబడింది.

పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలని కొందరు. వద్దు ఏదైనా పెద్ద ఎత్తుననే దండుగ కట్టించి మదం అణచాలనీ మరి కొందరు రకరకాల చర్చలు నడుస్తున్నాయి.

అందరు కలిస్తే అక్కడ స్థిరంగా ఉన్నది పది పదిహేను మంది మాత్రమే. వాళ్ళందరూ మా ఊరి పెద్ద మనుషుల కిందికి వచ్చేవారే.
ఇక పోతే మా ఇంటి ముందు పెద్ద జాతరలాగా మంది చేరిండ్రు.

ఊల్లో పొలం పనులన్ని ఆగిపోయినావేమో అన్నట్లు ఒక్కొక్కరుగా మా ఇంటికి చేరిండ్రు. ఎవరికి వారే అయ్యో అయ్యో అంటున్నారే కానీ ఏం చేయాలో అనేది ఎవరికి ఏం తోచడం లేదు.

ఆ రోజుకి ముందు సాయంత్రం పూట కామ్రేడ్ ఆరుట్ల కమలాదేవి మా ఊరిలో సీ.పీ.ఐ. పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి వచ్చింది. ఇటువంటి సందర్భంలో మా కుటుంబానికి అండగా ఉండవలసిన కా. ఆది మధుసూదన్, కా. తాళ్ళపెల్లి లక్ష్మణ్ లు ఆమెతో పాటే తెల్లవారి ఏదో ముఖ్య సమావేశానికి అని పట్టణానికి పోవడంతో అందుబాటులో లేరు.

క్రితం రాత్రి ఊరేగింపులో తమకున్న వాటిలో మంచి చీరెను కట్టుకోని ఆ సభను జయప్రదం చేసిన మహిళలలో కొందరైన మద్దికుంట మల్లవ్వ, శ్రీరాములపేట మల్లవ్వ, ఆడెపు రాంబాయిలు. సెకండ్ క్యాడర్ అయిన తెనుగొల్ల తూడి కనుకయ్య, సాకలి శంకర్, రావుల స్వామి, వడ్ల లక్ష్మీరాజంలు వచ్చి ఆ సమస్య పరిష్కారం కోసం ఆలోచన చేస్తుండ్రు.

ఎవరు ఏం చేసినా గానీ మా బాపు తరపున దేనికైనా ముందుపడి, బాధ్యత తీసుకోని జమానత్ పడైనా ఏ బరువునైనా స్వీకరించడానికి ముందుకొచ్చే వ్యక్తి మా బాపు మేనమామ, తన చిన్ననాటి ప్రాణ స్నేహితుడైన మా గైశెట్టి వెంకటయ్య తాతనే.

అయితే మా ఇంటి దగ్గర కేవలం నాలుగో వంతు మాత్రమే మగవారు ఉన్నారు. వారిలో కూడా స్థిరంగా ఉన్నవారు లేరు. కానీ పెద్ద ఎత్తున వచ్చిన ఆడవాళ్ళు మాత్రం అక్కడే నిఖరాను అయిపోయిండ్రు.

బాపు సంఘటన పట్ల తీవ్రంగా చలించిపోయింది ఎక్కువ మంది ఆడవాల్లే. తమ స్వంత ఇంట్లో ఏదో బాధాకరమైన సంఘటన జరిగినట్లు కనీసం తాగే నీల్లైనా ముట్టుకుండా అక్కడే ఉండిపోయిండ్రు. వాళ్ళ పనులన్ని వదిలిపెట్టుకున్నరు. కొందరు చర్చలల్లో భాగస్వామ్యమైతే, మరికొందరు నిశ్శబ్దంగానే కూసున్నరు.

కుమ్మరి ఓదవ్వ మా బోల్లు తోముకచ్చింది. తెనుగు మధురవ్వ బియ్యం పొయ్యి మీద పెట్టింది. మా గైశెట్టి రాధమ్మ అందరికి మంచి నీళ్ళిత్తుంది.
మూడు బజార్ల కాడి చర్చల బృందం ప్రతినిధిగా కేశవులు తాత, మా ఇంటి నుండి చర్చల బృందం ప్రతినిధిగా మా వెంకటయ్య తాతలు వ్యవహరించిండ్రు.

వెంకు తాత వెల్లిండు. చాలా సేపు వాగ్వివాదాలు. చర్చోపచర్చలు.

కేశవులు తాత, వెంకు తాత ఇద్దరు ఇంటికి రాగానే అందరు మా ఇంటి ముందు వేప చెట్ల కింద గుమికూడిoడ్రు.

“నువ్వు చెప్పలేవయ్యా బావా !’’ కేశవులు తాత వెంకు తాతని చూస్తూ
“నువ్వైతే మొదాలు చెప్పలేవు. దాని ఇలవరుసెందో నేను సెప్తా గనీ’’ తన దోతి సింగులు సరి చేసుకుంటూ వెంకు తాత.

కేశవులు తాత కాళ్ళు నేలకి విరగతన్ని నిల్చోని “ఇగో ….ఇవి నా ముచ్చట కాదు. శేట్ మంకు. అక్కడున్న నలుగురు పెద్ద మనుషులు, మేం అందరం కలిసి పానసరం పండి ఆయన పియ్యి తింటమని బ్రతిమిలాడితేనే గీ ముచ్చటకైనా ఒప్పుకున్నడు. అందుకనె వీళ్ళు నాకు దగ్గరోల్లు కాదు. ఆల్లు దూరపోల్లు గాదు. పది మందిలో జరిగిన ముచ్చట. లడాయి లేదు. లష్కర్ లేదు. ఇండ్ల ఎవల్ని బలిమి చేసేది కూడా లేదు. ఇట్టమైతెనేమో ఒప్పుకోని తప్సీలు చేసుకోండ్రి. లేకుంటేనెైతే ఎడ్లుకచ్చురం పాణసరం అట్లనే కాళ్ళ మీదనే ఉన్నది. శేట్ అయితే ఠాణకి పట్టిత్తడట. ఏదన్న మీరే తేల్చుకోండ్రి’’

“దెహే…, అసలు ముచ్చటేందో సెప్పలేవురా లమిడీ ! నిన్ను కాదనీ శేట్ ముందుకు పోతడా ? హc ..హ్హె “

కళ్ళు తెల్ల గుడ్డు వచ్చేలా అందరి దిక్కు తిప్పుకుంటూ తల అడ్డం ఊపుతూ, మూతి వంకర చేస్తూ అసలు గుట్టు కేశవులు దగ్గరనే ఉందనేలా చేతులు తిప్పుతూ మా రంగు తాత హావభావాలు.

” హే… గిందుకనే నాకంత ఎక్కడలేని మంట దెం…తదయ్య మీ మాటలింటే.

నాకు శేట్ ఏమన్న అక్క సుట్టమా ? అయ్య సుట్టమా నా మాట వినడానికి. మీ దమ్ము. శేట్ దమ్ము. నడుమ నేనెవ్వన్నీ ” కేశవులు తాత అసహనంతో.

”ఏ…, అయితెమాయె తియే కేశవులు సిన్నాయిన. పెద్ద మనిషి తీరుగా నీకు మంచిగా అనిపించింది. నీకు తోసిన కాడికి చెయ్యి. నిన్నెందుకెవలేమంటరు గనీ’’

నీళ్ళు తాగించడానికి తీసుకెల్తున్న ఎడ్లని తాడుతో ఆగపట్టి నిల్చోని తనని శాంత పరిచేందుకు మధ్యలో కలిపించుకోని మా అంజత్త మాట్లాడింది.

“అందుకనే శేట్ ముచ్చటేoదో సెప్త వినుండ్రి. వెంకటయ్య బావ ముందు నడిసిన ముచ్చటే ఇది’’ కేశవులు తాత.

” హా…. సెప్పు. ఒడవనియ్యి ముచ్చట. పొద్దందాక పడావు నడుసుకుంట పంటదా? ఏమున్నదయ్య రెండు మాటలతో ఓడదెంగడానికి. నీ అక్క పంచాతుకునా వారెత్తే ! ….

అండ్ల చేసిన తప్పేముంది. దొంగతనమేముంది? ఎవ… నన్న ఇగ్గిండా వెంకటయ్య పటేల్ ? ఎవన్నన్న పొడ్సిండా? నిజమే ఏమన్న పైసలు ఎగదెంగుతనని అన్నడా ?”

నెత్తిన పిండిన బట్టల మూట ఎత్తుకోని మెడలు సరిగా నిలబెట్టడానికి ప్రయత్నిస్తూ నిల్సున్న సాకలి వెంకటనరసు.

వెంకటనరసు మొఖంల మొఖం పెట్టి చూస్తూ కేశవులు తాత తలకాయ మీదికి కిందికి కట్టంగా ఊపిండు మూతంతా బిగవట్టి.
కండ్లు ఎరుపెక్కినయి. గడ్డం దూసుకున్నట్లు చేసిండు చేతితోని.

కేశవులు తాతకి దైర్యం చాలట్లేదు. గుటుకలు మింగుతండు.
కానీ తప్పలేదు. నెత్తి మీది తువ్వాల విప్పి మల్లీ మంచిగా సుట్టుకోని గట్టిగా సరాయించి తుపుక్కున కింద ఊంచి కాలితోని మట్టి కప్పిండు.
ఆ కప్పిన మట్టి సుట్టే కాలి పెద్దనేలుతోని మల్లన్న పట్నాల లెక్క అడ్డం నిలువు గీతలు గీసుకుంటూ –
“ఇగో…., శేట్ ఠాణకి పట్టియ్యొద్దంటే వెంకన్న ఇరవై వేల రూపాయలు దండుగ కట్టాలే “

“హా…., వాయ్యో ” వెంటనే గుంపు నుండి గజిబిజిగా వినవస్తున్న మాటలు.

“అబ్బో వీనింట్ల పీనుగెల్ల …. జెనిగ తీర్గ నెత్తురు పీల్చుకున్నోడు. అదేందయ్యా ! అసలు వడ్డీ తింటనే ఉండే. మీదికెళ్ళి తిట్టుడే౦ది? మీరేం పెద్ద మనిషితనం జేసిర్రు? మొదాలు తిట్టిన ఆ శేట్ దే అసలు తప్పు. డానికేం లేదా దండుగ? ఇ౦కేంది వెంకన్న ఉన్న భూమి అమ్ముకోవాలే అన్నట్లు ఉంది మీ కథ”.

కోపముతో మాట్లాడుకుంటూ కుంటుకుంటూ కుంటుకుంటూ ముందుకు వచ్చింది ఒడ్డె మల్లమ్మ.  

“గిదే రెండే౦డ్ల కిందనైతే షావుకారి గట్లా తిట్టునా? మల్లా వీళ్ళు మిడకొడుతార్రు. మీకు మార్నగాలం పుడుతది గని “ మందిల నుండి ఎవ్వరో.

కేశవులు తాత కండ్ల కిందికెళ్ళి చూసుకుంటూనే – “లేకుంటే రెండో ముచ్చటేందంటే – వెంకన్న రెండెకరాల భూమిని శేట్ కి ఐదు ఏండ్లు ఉత్తగనే కౌలు కింద రాసి ఇవ్వాలే”.

“దెస్ … నీ అవ్వ! ఆళ్ళ కుటుంబానికే తిండికి ఎల్లక పాలు కింద దొర భూములు సేత్తంటే. కౌలుకి ఇయ్యాల్నట కౌలుకి “
కూసున్న చిన్న గోడ మీదికెల్లి ఆమాంతం కింద దునికి అక్కడ నుండి నిరసనగా వెల్లిపోయిoడు మా రాజయ్య మామ. లుంగి పైకి కట్టక కాళ్ళకి అడ్డం రాంగ తప్ప తప్ప నడుసుకుంటూ, ఊంచుకుంటూ, అడ్డదిడ్డంగా ఏవేవో తిట్టుకుంటూ ఆగకుండా పోతుండు.

“లేదంటే లాస్ట్ కి పెద్ద మనుషులమందరం కలిసి – తిండికి లేనోడని బ్రతిమిలాడి ఒప్పించిన ముచ్చటింకోటి ఉంది’’ కేశవులు తాత.
“ అవ్ బాంచెను – తమరు సొక్కపూస“ మళ్ళీ మందిలో నుండే ఎవరో అన్నరు.

“ఏందో ఆయింత సెప్పలేవు ! ఆ… ల పొట్టు ముచ్చట” అపుడే కోపంతో వచ్చిన మా పెద్ద గోపు తాత.

“ఆ…. అట్టిగనే అయితది ఆ…ల పొట్టు ముచ్చట. వాన్ని వీన్ని తన్నిపోయి నడింట్లో చేరి ఎనగర్ర దిక్కు కాలు మీద కాలేసుకోని సాపుకోని ఎల్లెలుకల పన్నట్లు కాదు పైస ఎవారమంటే. పోలీస్ ఠాణా అంటే. పాత రోజులు కావు” కేశవులు తాత.

“దెహే … మేమెన్నడన్న పైసల మొఖం కానినోల్లమా? పైసలు సంపాయించినోళ్ళమా? ఠాణా మొఖం చూసినోల్లమా? నీ పైస – కు, నీ _కు ……..” పండ్లు కటర కటర కొరుకుతూ గోపు తాత.

“ఏ… ఆగలేవుర్రయ్యా! మీ బావ మరదులకి పగ ఉంటే ఓ రోజు పిత్త తాగి దోతులూసిపోoగా బజారంత బొర్రంగ ఎవలద్దంటార్రు గనీ …., ఇపుడు నడిసే ముచ్చటైతే నడువనీయుండ్లి. ముందుగాల ఎద్దసొంటి మనుషులని అనరాని మోటు మాటలు తిట్టిన ముచ్చటే౦ది?” దండెం సమ్మయ్య, ఊల్లోని పాలేర్ల సంఘానికి పెద్ద.

“మళ్ల కిరికిరి తెచ్చేటట్లున్నది గని మీ కథ. ఠాణల రోకలి బండలెక్కించిన సంగతి మతికి లేదా?’’ గుంపునుద్దేశించి కేశవులు తాత.

“ గు… బట్ట ఊడిపోంగా నడి బజార్లకెళ్ళి ఉరికిచ్చిన సంగతి మీకు మతికి లేదా ?’’ మళ్ళీ మందిలో నుండి. అతడే.

కేశవులు తాత తానే తమాయించుకొని “ఇగో ఆఖరు ముచ్చటేందంటే – దండుగ కట్టకుంటే అసలు వడ్డీ కలిపిన అప్పు రెండు వేలు ఇపుడే కట్టి శేట్ రెండు కాళ్ళ మీద పడి క్షమాపణ కోరాలే. గంతే’’.

చివరి మాట అనేసరికి అందరిలో కలకలం రేగింది.
ఇంత ముందు కంటే ఈ మూడో షరతులో – మా బాపు శేట్ కాళ్ళ మీద పడి తప్పయిందని క్షమాపణ కోరడమనేది అక్కడెవరికి మింగుడుపడుత లేదు.

అందరూ గొల్లున లేచిండ్లు. ఆడోల్లు శాపెనార్థాలు పెట్టిండ్లు.
బాపు భుజం మీద చేయి వేసి వెంకు తాత మా ఇంట్లోకి తీసుకెల్లిండు.

“ఈ పాపం పాడుగాను. నోరు లేని పశురం అసొంటి మనిషికి ఏం కట్టం ఇది” ఆడోళ్ళందరు తలో మాట అనుకుంటూ బాపుని సుట్టుముడుతూ నడుస్తున్నరు ఇంట్లోకి.

కొందరు కోపం పట్టలేక అల్లెడ౦ మల్లెడం వదురుతున్నారు.

బాపు అంటే ఆడోళ్ళందరికి ఎక్కడలేని గౌరవం. మంచి భావం.

మా సొంత భూమిలో కానీ పాలుకి పట్టిన భూమిలో కానీ పొలం పనులకి రావడానికి చాలా మంది ఇష్టపడేవారు. “కనుకవ్వా! నన్ను ఐతే మర్సిపోకూ బిడ్డా !” అని చాలా మంది మా అవ్వకి అప్పుడప్పుడు గుర్తు చేసేవారు.

వయసు ఎక్కువై పెద్దగా పని చేయలేని వారు, మధ్య మధ్యలో ఇంటికి పోయి పసిపిల్లలకి పాలిచ్చి వచ్చే బాలింతలు, ఇంటికి తొందరగా పోయే పసిపిల్లల తల్లులు, పెద్దవాళ్లతో సమానంగా పని చేయలేని అప్పుడే కొత్తగా కూలీ కైకిలి పనిలోకి దిగిన పడుసు పిల్లలు, కుంటి రాజవ్వలు, నడుము వంగిపోయిన బొడ్డు మల్లమ్మలు, ఎప్పుడైనా వాగు చెరువు దాటి పనులకు పోవాలంటే తన పొడుగు కట్టెతోని నీళ్ళ లోతు కొలిచిన తర్వాతనే ఆ వాగు చెరువు దాటేటి – నాలుగు అడుగుల కుమ్మరి లింగవ్వలు. వీళ్లతో పాటు మొగునితో విడాకులైన ఒక్క కొడుకు గల గుంటి కొమురవ్వలు, కాలేరు (సింగరేణి కాలరీస్ ) మీద బాయిల పని చేస్కుంటా ఎప్పుడో సారి వచ్చే భర్త గల కొలిపాక ఎల్లవ్వలు, మంత్రసాని పని చేసే మంగలి కనుకవ్వ వీళ్ళందరితో పాటు పనిలో అలుపు సొలుపు ఎరుగని గుత్తలకు పట్టి పని చేసే కమ్యూనిస్ట్ పార్టీలో, మహిళా సంఘంలో పనిచేసే ఆడేపు రాంబాయి, మద్దికుంట మల్లవ్వ, శ్రీరాములపేట మల్లమ్మ, కొలిపాక మధురవ్వలు ఇంకా వాళ్ళ పనికి న్యాయం చేసి వెళ్లిపోయే మా పాళోల్లు, కులపోళ్లూ. తక్కువే ఐనా దాదాపు అదే రకమైన మొగోళ్ళు కూడా మా వ్యవసాయ పనులల్లో పాల్గొనేవారు.

దాదాపు పొద్దున పది గంటలకు వస్తే సాయంత్రం నాలుగు గంటలకి ఇంటికి వెళ్ళేవారు. పగటీలి అన్నం తినుడు తో కలుపుకొని ఆరు గంటల పని. ఐతే ఈ ఆరు గంటల పనిలో జరిగే సృజనాత్మకమైన జీవితాన్ని చూస్తే అది కేవలం శారీరక శ్రమ చేసే కార్య రంగం కాదు. అదో అద్భుత మానవ జీవన వికాస రంగస్థలం వేదికలాగా అనిపిస్తది.

బాపు దున్నుతూ, జంబు (గొర్రు ) కొడుతూ, ఒడ్డు చెక్కుతూ, అప్పుడపుడు నారు వేస్తూ, కలుపు కుప్పలు తీసివేస్తూ, మెదలు కడుతూ సహజంగా ఈ పని చేసే ఆడవాళ్ళకి దూరంలో ఉంటడు కావాలనే.

ఆడవాళ్ళు పని ప్రారంభించడంతోనే అనేకమైన జోకులు, తిట్లు, ఒకరినొకరు ఆట పట్టించడం మొదలు అవుతది. తమ చుట్టూ ప్రపంచ వ్యవహారాలన్నీ కూడా వారి తీర్పు ఇవ్వనిదే దాటిపోవు. అందులో వారికి తెలిసిన దేశ రాజకీయాల నుండి కుటుంబ వ్యవహారాలు, లైంగిక సంబంధాల వరకు ఉంటాయి. అన్ని విషయాలు చాలా ఓపెన్ గా చర్చిస్తారు. తీవ్రంగా వ్యతిరేకించుకుంటారు. వాదులాడుకుంటారు. కొన్ని విషయాలలో ఏకాభిప్రాయానికి వస్తారు. కొన్ని ఒక ముగింపుకి, ఒక అభిప్రాయానికి రాకుండానే మిగిలిపోతాయి.

ఒక ముచ్చట మీద వాదించుకొని ఒక రోజు గుంటి కొమురవ్వ, కొలిపాక ఎల్లవ్వ నాట్లేసేటోల్లు నాటు ఆపి దబ్బెడ దబ్బెడ ఆ బురదలోనే ఒకలెనుకాల ఇంకొకలు పడి ఉరుకుతున్నరు.

ఒక రోజు ముందే పెట్టిన కొత్త ఒడ్ల మీదికెళ్ళి ఉరుకుతుంటే ఒడ్లు ఒరములన్నీ కరాబ్ అవుతున్నాయి. నాటుకి సిద్దంగా జంబు కొట్టి మిర్రలు సాపు చేసి ఉన్న మడులల్లో వాళ్ళ అడుగులతో మోకాలు లోతు గుంటలు పడుతున్నాయి. ఐనా ఒకరికొకరు దొరకలేదు.

మిగతా వారందరూ నాటేసుడు మానేసి కొంత మంది ఎల్లవ్వని ఇంకొంత మంది కొమురవ్వని సపోర్ట్ చేస్తున్నారు.
ఉరికి ఉరికి ఇక దొరుకుతాను అనే సమయములో గుంటి కొమురవ్వ “ఓ బాపు ! అనుకుంటా జంబు కొడుతున్న బాపు దగ్గరికి పోయి బాపు వెనకాల ఆగింది.
బాపు జంబు నిలుపుదల చేసి “అరే … ఏందుర్రా!“ అనే అంతలోనే …
కొలిపాక ఎల్లవ్వ వచ్చి “నువ్వు జరుగు మామ! నువ్వు ఇడిసిపెట్టు దాన్ని!’ అని బాపు సుట్టూ తిరిగింది.

ఇద్దరు తిరిగి తిరిగి ఒకలనొకలు అందుకునే క్రమంలో జరిగిన ఆ గింజుకోవడం, తోపులాటలో ఆయింత బాపుని దొబ్బి కింద పడేసిర్రు.

ఆ బురదలోనే పడి ఒకల మీద ఇంకొకలు పడి సికెలు పట్టి కొట్టుకుంటున్నారు.
బురదలోంచి లేచి – చిరుకోపం హాస్యం పట్టుదలతో కూడిన ఆ సన్నివేశం చూసి బాపు “ఈ పోరాగాండ్ల పెండ్లాం ముం…పొయ్యా ! రార్రా వీళ్లనెవలన్న ఆగవడుతురు’’ అని బాపు నాటేసెటోల్లని పిలిసిండు.

మొత్తం మీద కొద్దిసేపటికి ఆ అంకం అలా ముగిసింది.
అలా పనిలో భాగంగానే కొందరు పాటలు పాడుతారు. ప్రత్యేకంగా పాటగాళ్ళు అంటూ ఎవరు ఉండరు. అందరూ పాడేవాళ్లే. ప్రతి గొంతు ఒక విలక్షణమైనదే . ప్రతి గొంతు ఒక ప్రత్యేకమైన జీరతో, రాగంతో, తనువు మనసు ఏకమైన అద్వైతంతో సాగుతది. ఒక్కోసారి ప్రధాన పాటకుల గొంతు ఆగిపోతాది కొండంత రాగం తీయలేక, ఊపిరి ఆగక. సరైన పదాలు దొరకక. కానీ ఆ వెను వెంటనే ఎవరో ఒకరు ప్రధాన పాటకులుగా మారిపోతారు. ఆ పాటని అందుకుంటారు. తమకు తోచిన రీతిలో పదాలతో మళ్ళీ ఆ మొదటి ప్రధాన పాటకురాలు కలిసివచ్చే వరకు కొనసాగిస్తారు. ఆ పాటలని మిగతా వాళ్ళందరూ అంతే అద్భుతంగా బృందగానం చేస్తారు. ఆ పాటలు పాడే సమయంలో విహంగ వీక్షణం గనుక చేసినట్లైతే – పాట ఇంధ్రధనస్సు రూపం ధరిస్తే ఎలా ఉంటదో వారు అలా కనిపిస్తారు. పాట ప్రకృతిలో భౌతిక రూపం ధరించి కదిలే సెలయేరులా ఎలా ఉంటుందో అలా ఉంటారు. మానవ సమాజంలో పాట ఎలా పుట్టిందో ఎందుకు పుట్టిందో అర్థం అవుతది.

పాటల తర్వాత ముచ్చట్లు మొదలవుతాయి. కొందరు వారి వ్యక్తిగతమైన బాధలు, కష్టాలు చెప్పుకుంటారు. ఆ చెప్పే క్రమంలో దు:ఖటిల్లుతరు. ఆ ధు:ఖాన్ని ఆపుకోలేక గట్టిగా బయటకు ఏడుస్తూ పని వదిలేసి కుప్పకూలిపోతరు. వెంటనే అందరూ పని ఆపి ఆమె దగ్గరికి చేరుకుంటారు. వయసులో పెద్దవారు, భారీ గుణం గలవారు, వాళ్ళకి దగ్గరి వారు ఆమెని దగ్గరికి తీసుకొని, దేహం మొత్తంగా అలుముకొని ఓదారుస్తారు. కన్నీళ్లని తుడిసి మొఖం మీద ఇన్ని చల్లి కొన్ని మంచి నీల్లని తాగిస్తారు. ఆమె కష్టాలకి సమాజంలో చూసిన అనుభవాల్లో నుంచి గ్రహించిన, విన్న కథలల్లో నుంచి ఉదాహరణలు చెప్తూ ఆమె సమస్యకి పరిష్కార మార్గం చూపుతారు. కొద్దిసేపు ఆమెని ఒడ్డు మీదనే కూసోబెట్టి రెస్ట్ కల్పిస్తారు. ఈ లోపు ఆమె పనిని పక్కనున్న ఇద్దరు పూర్తిచేస్తారు. అంతే కాదు ఎవలకన్నా పైసల బాధ, అప్పుల బాధ ఉంటే దానికి పరిష్కారం చూపే విధంగా పైసలు పుట్టే సోలితి చెప్తారు.

సహజంగా వదిన, మరదళ్లు, అమ్మమ్మ బాపమ్మ, మనుమరాళ్ళు, అత్త, కోడళ్ళు…. రెండు వ్యతిరేక టీములుగా , రెండు విరుద్ధ భావజాల గ్రూపులుగా ఏదో ఒక గ్రూపులో చేరిపోతారు. కొందరు ఈ విభజనలో ఏదో ఒక గ్రూపుల కిందికి వచ్చినప్పటికి భావజాల పరంగా ఆ గ్రూపులోనే కొనసాగుతూ వ్యతిరేక గ్రూపుని సమర్థిస్తారు. మహిళా సంఘాలలో, కమ్యూనిస్ట్ సంఘాలలో పని చేసే వాళ్ళు ఈ రెండు గ్రూపులని సమన్వయం చేస్తారు. భావజాల పరంగా వారిని ఒకటిగా చేసే ప్రయత్నం చేస్తారు. ఇలా చేసే క్రమంలో వయసులో పెద్ద వాళ్ళలో కొందరు ఈ మహిళా సంఘాలలో, కమ్యూనిస్ట్ సంఘాలలో పని చేసే వాళ్ళ ఆలోచనలకి తోడుగా కొన్ని గత సంఘటనలు అనుభవాలని జోడిస్తూ మరింత వ్యవహారికమైన ఆచరణీయమైన ముచ్చట్లతో విషయాలతో ఆ రోజు చర్చకి ఒక సమగ్రమైన ముగింపునిస్తారు. ఈ క్రమంలో ఒక్కోసారి వెంకన్న బాపుని అడుగుదాము, వెంకన్న మామని అడుగుదాము, తాతని అడుగుదాము అని బాపు అభిప్రాయాలూ కూడా తీసుకునేవారు.

అంతే కాదు బాపు దగ్గర చాలా మంది తమ బాధలు రహస్యాలు చెప్పుకునేవారు. వాళ్ళ విషయాలు వినే తీరిక బాపుకి ఉండకపోయేది. అటువంటి సందర్భంలో అందరూ పని విడిచిపెట్టిన తర్వాత మా బాపు అవ్వ చేస్తుంటే వాళ్ళు కూడా ఆగి పని చేస్తూ చాలా విషయాలు చెప్పుకునేవారు. మా పొలం చుట్టూ ఒకరోజు దడి కట్టుతుంటే ఒక రోజు కొలిపాక రాధవ్వ వచ్చి ఆ కట్టే దడి ఆవల నిల్చు౦డి నారపోసలు అందిస్తూ దడి కట్టడంలో భాగస్వామియై పొద్దంత ఉండిపోయింది. కైకిలికి వచ్చింది కాదు తన విషయాలు చెప్పుకొవడం కోసం వచ్చింది. బాపుది చాలా విశాల హృదయం. కానీ ఒక తండ్రిలా అందరి బాధలని కడుపులో పెట్టుకొని పరిష్కారం చెప్పేవాడు. భర్త చనిపోయిన స్త్రీలు పరాయి మగాడితో సంబంధం పెట్టుకుంటే చాలా జాగ్రత్తలు చెప్పి హెచ్చరించేవాడు. కలగబోయే పరిణామాల గురించి ముందే చెప్పేవాడు. అటువంటి విషయాలు బయటకు చెప్తూ హేళన చేసేవారిని లేదా వాళ్ళని దొరకబట్టి ఇబ్బంది పెట్టేవారిని “పాపపు మనుషులు’’ అని తిట్టేవాడు.

దొరల అనుమానాలకి అవమానాలకి చనిపోయిన దొరసానుల గురించి చెప్పేవాడు. వాళ్ళు ఎంత ప్రేమగాళ్ల మనుషులు’’ అన్నాలంగా చంపేసిండ్రు బిడ్డలని “ అని బాధపడేవాడు.

ఆయన పదే పదే చెప్పే పేర్లలో భారతవ్వ దొరసాని, శీలోత్రిదేవి దొరసాని. అందులో నిండు గర్భిణీలు, చిన్న పిల్ల తల్లులు కూడా ఉండడం అతన్ని బాధపెట్టిన అంశం. వాళ్ళు వాళ్ళకి దొరికిన సమయాలల్లో పాలేరోళ్ళు, కూలీలు పనికి వచ్చిన మనుషుల పట్ల ఎంత ప్రేమ చూపేవాళ్లు, ఏం సక్కదనాల మాట వాళ్లది? ఎటువంటి రూపం వాళ్లది అని బాధపడేవాడు.

అందమైన మేదరి బుట్టలమ్మే మహిళా వెంబడి ప్రతిసారి తిట్టుకుంటూ వచ్చే ఆమె భర్త ని చూసి “పోరి బతుకు నాశనమైంది“ అని బాధపడేవాడు బాపు. పూదరి రాజీరు అప్పుల కింద ఉన్న ఇల్లు అమ్మి కట్టాలనే నిర్ణయం తీస్కున్నపుడు బాపు వ్యతిరేకించిండు. అప్పు ఇచ్చినోళ్లందరిని బ్రతిమిలాడిండు. అసలు తీసుకొని వడ్డీ వదిలేస్తే అతను ఇల్లు అమ్మే అవసరం రాదు అని.

ముగ్గురు ఆడపిల్లల కుటుంబం అందులో ఇంకా ఇద్దరు ఆడపిల్లలు పెళ్ళి కావాల్సిన పిల్లలు ఎక్కడ ఉన్న ఇబ్బంది ఉంటది అని. ఐనా తప్పనిసరై ఇల్లు అమ్మినపుడు మా ఇంటి వెనుకాల జాగలో బాపు పెద్ద గుడిసె వేస్తానని అడిగిండు. కానీ గముండ్లోల్ల కనుక లచ్చక్క ఇల్లు కిరాయికి ఇవ్వడంతో ఆ ఇంట్లో ఉన్నరు. వాళ్ళు. ఒక అమ్మాయికి ఎట్లనో అట్లా పుస్తే మట్టెలు పెట్టి పెండ్లి చేసి పంపించిండు రాజీరు మామ. రెండో అమ్మాయి ఒక వేరే ఊరు అబ్బాయితో వెళ్ళిపోయి పెళ్ళి చేసుకుంది. 

దానితో పాటు కమ్యూనిస్ట్ పార్టీలో ఉంటూ మంచి విలువలు కలిగి ఉన్న మా బాపు, మా అవ్వ అంటే సామాన్య జనం అందరికీ ఇష్టమే.
** **
ఇంట్లో కూసున్నంకా చాలా సేపు చర్చలు జరిగినయి.

వెంకు తాత అప్పు డబ్బులు వడ్డీతో సహా అప్పటికపుడే కట్టి ఏదో రకంగా ఒప్పించే ప్రయత్నం చేస్తానని ఆది మీసాల రామయ్య, తూడి కనుకయ్యలని తీసుకొని వెల్లిండు. కానీ వాళ్ళు ఎంత మాత్రం ఒప్పుకోలేదనే సంకేతంగా వెంకు తాత వస్తూనే ఏడుస్తూ “వీడు ఎక్కడెక్కడైతే ఎవనెవనికి పైపోటుగా పని చేసిండో, తిట్టిండో, తప్పు పట్టిండో వాళ్ళందరూ అక్కడ కురువడేసుకోని ఒక్కటై కూసున్నరు. వాళ్లెక్కడ వింటరు. శెంటెము వినరు.” అన్నడు.

ఇక మిగిలిన మార్గం అదేనని అందరికి అర్థమైంది.
కొద్ది సేపు అందరు నిశ్శబ్దమైపోయిండ్రు.

మొగురానికి ఆనుకొని కాళ్ళు సాపుకొని కూసున్న అవ్వగారు అత్తగారు అదే ఊరు ఐన గముండ్లొల్ల మెరుగు వీరక్క ధు:ఖంతో ఆమె కాళ్ళ మీదికి ముందుకు వంగి “చిన్నప్పుడే అవ్వని పోగొట్టుకున్నడు. సచ్చిపోయిన అవ్వ రొమ్ము మీద పడి పాలు సీకిన చిన్న చెల్లెని సంకనేసుకొని ఆరుగురు అక్క సెల్లెండ్లని సాది లగ్గాలు చేసి పుటానా పుట్టుకు ఒక్క రోజు సుఖపడ్డది లేదు.

మల్ల గా అక్క సెల్లెండ్లకే కొత్త బట్టలు పెట్టినందుకు వసుదేవుడు గాడిది కాళ్ళు పట్టుకున్నంత కట్టమచ్చింది. నీ సిన్నాయిన్న పుట్టుబడి పాడుగాను …” అని ఏడుస్తూ కొంగుతోని సీమిడి తీసుకొని తనను తానే ఓదార్చుకుంది.

వీరక్క మాటలతో అందరూ కండ్లల్లో నీళ్ళు చేరినయి.
కొంత మంది సిన్నగా ఏడుత్తార్రు.
మా అవ్వ పెద్దగా ఏడుసుడు మొదలువెట్టింది.
గైశెట్టి కనుకమ్మ, కొత్త రాధమ్మ, అంజత్త, కుమ్మరి రాజమ్మ అందరూ ఏడుస్తార్రు.
“ఏందుర్రా ! ఆగుర్రి .. ఆగు. నీ ఏడుపు అయ్యకు నా ఏరుగ. హరిచ్చంద్ర మారాజు అంతటోడే కాటికాపరోని కాళ్ళు పట్టిండు. మనమంతకన్న దండోళ్ళమా ? నన్ను అడుగితే సెప్తా. పెద్ద దండి ముచ్చట లెక్క చెయ్యవడ్తిరీ “ దర్వాజాకి తాకే అంతా ఎత్తు ఉండే కమ్మరి రాధమ్మ అంటూనే బాపు దగ్గరికొచ్చి

“వెంకన్నా! లే బిడ్డా ! నీకేం నాదాను లేదు. నువ్వు చేసిన దొంగతనమేం లేదు. లంగతనమేం లేదు.
అరిహర నారాయనులకే అచ్చినయి కట్టాలు. మనమెంత?
గుండె పెద్దది చేస్కొని లే బిడ్డా లే నా మాట విను“ అని బాపు రెక్క పట్టింది.

అంతే ఇంకేం మార్గం లేదన్నట్లు అందరూ మొగోళ్లు ముందు బయటకు రాంగా ఆడోల్లు వెనకాల వస్తుర్రు.
మా అన్న, రంగు తాత, బాలయ్య మామ, రాజయ్య మామ, మా రాజిరెడ్డి కాక, కమ్యూనిస్టు యువకులైన తూడి శంకర్, సాకలి శంకర్, రావుల స్వామి కొందరు ఆడొల్లు కూడా అందరూ లోపల మసిలిపోతుండ్రు కోపంతో.

“ హే … పోక ముందే అదైనా ఏదన్నా ఖచ్చితం మాట్లాడి రావాలే ఎవరన్న పెద్ద మనుషులు. ఆడికి పోయి తప్పైందని కాళ్ళు పట్టుకున్నాంక ఆయింత ఆ కోపగొండి శేట్ సిప్ప సప్ప సంపితే. చెప్పు తీసిండనుకో కొట్టడానికి …’’ తెనుగు మధురవ్వ సందేహం వ్యక్తం చేసింది.

“ మరే … అంతే’’ మొదటి నుండి అక్కడే ఉండి చూస్తూ ఉన్న ఎప్పుడూ అంగీ వేసుకోకుండానే ఉండే కుమ్మరి చిన్న కేశవులు.

“ అవ్ …, ఆ మాట నిజమే. వీని ఇంట్ల పీనుగెల్ల’’ జాగిరి ఇందిరమ్మ చేతి వేళ్ళని సెంపాల మీద ఒత్తుకుంటూ.

“ నీ అక్క ! కాళ్ళు రెక్కలు గు…లకు ఇరగదెంగం శేట్ గానివి. అట్టిగానే ఉన్నమా ఇక్కడ? గా మాత్రం ఖదర్ లేకుంటనే బతుకుతున్నమా? “ గముండ్లొల్ల రావుల స్వామి మామ.

“ హే ! పిలగా ఆగురా ! బండ కింద మన చెయ్యి పడ్డది. దాన్ని ఎట్లనో అట్ల ఊడగుంజుకోవాలే గాని. ఇది రేశానికత్తే పనికి వచ్చే సమయం కాదు’’ కామ్రేడ్ తూడి కనుకయ్య.

“ లేకుంటే మరి. ఎన్నడైనా వాడేమన్న సెమట అడిపి సంపాయించిండా ఆ అప్పుకిందిచ్చిన పైసలు. మన రెక్కల కట్టం కాకపోతే. మన కడుపుల కొట్టి ఇప్పటికీ సుల్తానాబాదులో కోటి రూపాలతోని పెద్ద పెద్ద రైసు మిల్లులు కట్టిండు కొడుకులకి. అందుకే ఆ అహంభావం ఆగనిత్తలేదు. ఇయ్యాల్లో రెపో ఐతే ఊరినిడిసి పోతడు. ఇంకేముంది ఇక్కడ మింగడానికి మన భూములు తప్ప వానికి’’ రావుల స్వామి.

“అది కాదురా అయ్యా ఇప్పుడు ముచ్చట. ఇగో అందరి పొత్తుల మనిషి, పెద్ద మనిషి గైశెట్టి వెంకన్ననే ఉన్నడు. ఆడికి పోయిన౦కా అందరం ఒక్క మాట మీద ఉండాలే. కానీ మనిషికో మాట అని అంత ఇచ్చుకదందం చేయద్దు. వెంకన్న ఏ మాట సెప్తే మనమంతా ఆ మాట జవదాటకుండా ఉండాలే.
అదేడికైతే గాడికి కానియ్యి. కానీ మనమంతా ఒక కట్టు అయినంకనే మనం ఇక్కడ నుండి కదలాలే. ఏమంటవు రంగయ్య మామ?’’ తూడి కనుకయ్య అందరిని సముదాయించే పని చేస్తుండు.

“ హే …, నువ్వు చెప్పిందే సై ఉన్నది. ఒగలను పెద్ద మనిషనుకున్నాంకా ఆళ్ళ మీదికెళ్లే నడువాలే. కానీ ఆడికి పోయినంకా మనిషికో మాట అంటే మనం తప్పుల పడుతం సుమీ ! పెద్ద మనిషిగా వెంకటిగానికి దోయకుంటే మనద౦డ్లనే నలుగుర్ని విచారించి సెప్తడు. అంతే కానీ మనం ఎవ్వనికి వానిమే పెద్ద మనుషులమంటే అట్టిగ తప్పుల పడుతం.

ఇంకో ముచ్చట కూడా నేను సెప్తున్న వినుర్రి ! ఆడికి పోయినంక మనకొగడు ఎక్కిత్తడు, వాల్లదండ్లోడే ఒకడు ఎగేత్తడు మనల. ఒకడు మనకు కోపం అచ్చేటట్లు మాటలంటడు. ఒకడు రెచ్చగొట్టుతడు. అందుకే వెంకటిగాడు ఏది సెప్తే గదే. అట్లా అని మనమే రక్తం సచ్చి లేం. కానీ ఏదైనా అందరం ఒక్క మూటి మీద ఉండాలే’’ రంగు తాత తువ్వాల నడుముకి చుట్టుకొని చేతిలోని కట్టెని బలంగా పట్టుకున్నాడు.

అందరూ సరే అన్నారు. ఒప్పుకున్నారు.
ఇంట్లకెళ్ళి బాపుకి తాగడానికి శెంబుల నీళ్ళు తీసుకచ్చి ఇచ్చింది మద్దికుంట మల్లవ్వ.

నోట్లో పోసుకుని గరగరా అని గొంతులోనే ఆపి ఉంచిండు సగం నీళ్ళు బాపు. సగం తాగిండు. ఇన్ని మొఖం మీద చల్లుకున్నాడు.
పని కాడ కాసె పోసుకున్న దోతిని కొంత విప్పి మల్ల అట్లనే గట్టిగా బిగించి కట్టుకున్నాడు బాపు.

బురద చుక్కల పొక్కల బనీను మీద తువ్వాలేసుకున్నడు.
సెడువాక౦ వానకి చెట్టు మీద తడిసిన విప్పిన పత్తి పువ్వు లెక్కున్నాడు బాపు.
ఈ లోపు సాయంత్రం నాలుగున్నర దాటింది. పనులకు పోయినోల్లు , కైకిలి కూలీకి పోయినో అందరూ మా ఇంటి ముందు తొవ్వ మొత్తం తట్టిర్రు. వందల మందికి చేరిండ్రు జనం.

ఆ గుంపులో నుండి ముందుకి వచ్చి చేతిలో ఉన్న కొంకెని కింద పడేసి
“అయ్యో వెంకవ్వా ! నా నాయిన్న ! నీ మొర ఏ దేవునికి ముడుతలేదు బిడ్డా ! నీ కట్టం ఏ శంకరుడు ఎత్తుకుంటలేడు కొడుకా !”
మాకు వడ్లు పెచ్చుల మీద ఇచ్చే మేరొల్ల గుడ్డి రామమ్మ ఆమె కొంగుని ఆమె ముఖం మీదనే కప్పుకోని నిలబడి ఏడుస్తుంది.

అప్పుడే ఊరికి పోయి వస్తున్న కుర్మోల్ల మొగిలి మల్లయ్య మామ ఆయన భార్య మల్లవ్వని ఒక్కదాన్నే ఇంటికి పొమ్మని సెప్పి ఆ గుంపులో కలిసిండు.
మల్లత్త కొంగు కొస్స నోట్లో పెట్టుకొని సంచి పట్టుకొని ఆడనే నిలబడి చూసుకుంటా బాధపడుతుంది.

బాపు గుంపుని దాటి మా ఇంటి ముందు నుండి బజార్ ఎక్కిండు. అక్కడ నుండి 500 మీటర్ల దూరం ఉంటాది శేట్ ఠాణాకి పోతనని కట్టి ఉన్న ఎడ్ల బండి శేట్ మద్దతుదార్లు పడి మంది పెద్ద మనుషులుగా చెలామణీ అయ్యేవాళ్లు ఉన్న మూడు బజార్ల చోటు.

బాపు పక్కనే గైశెట్టి వెంకటయ్య తాత ఒక పక్క ఇంకో పక్క తూడి కనుకయ్య. వెనుకాల మొగొల్ల గుంపు. ఆ తర్వాత ఆడోల్లు. వాళ్ళకి ముందే దూరంగా , తొవ్వకి పక్కగా చిన్న పిల్లలమైన మా వాడ పిల్లలం.

బాపు వస్తుంటే కుమ్మరోల్ల మల్లమ్మ ఇంటి ముందు నుండి తొవ్వకి వచ్చి బాపుని అలుముకొని కన్నీళ్ళు తీసింది. బాపు గదవ పట్టుకొని “ఏం కాదు బిడ్డా ! మేమంతా లేమా నీకు? దైర్నం సెడకు’’ అని బాపు రెండు సేతులు తీసుకొని ఆమె నుదురికి ఆనించుకుంది.

ఇంకొంచెం ముందుకి పోంగానే మా మాదిగ జోగు రాజవ్వ దూరంగా ఉండగానే “నీ బాంచెను పటేలా! నువ్వేవలకేం అన్నాలం జేత్తివి పటేలా !! “
అని ఏడుస్తూ భూమిని మొక్కింది.

గుంపు పెద్ద గుంపైంది. బజార్ మొత్తం పిక్కుటమైంది జనంతో.
అందులో ఒగరు చిన్నగా “ఎర్ర జెండెర్రజెండెన్నియ్యాలో …’’ అని పాడడం మొదలు వెట్టిండ్రు.

“ హే… అద్దురా పిలగా !’’ అని తూడి కనుకయ్య బందు చేయించిండు.
మా ఇంటి నుండి శివుని గుడి దాటి తట్టింది ఆ గుంపు, ఆ సమూహం.

మా బాపు మొఖం ఎప్పటిలా సహజంగానే ఉంది. ఆ జనంలో కనిపిస్తున్న ఆగ్రహామో, ఆవేశమో, దు:ఖమో, బాధనో అతని మొఖంలో ప్రతిఫలి౦చట్లేదు.

రోజు పొలం పనులకి వెళ్ళే ముందు, ఇంటికి వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో అలానే ఉంది అతని ప్రవర్తన.
జీవితంలో నిత్యం ఎన్నో యుద్ధాలను, ఎన్నో ఓటములని అవమానాలని ఎదుర్కొన్నవాడు. ఏడాదంతా కష్టపడితే నోటి దాకా వచ్చిన పంటలు పాడైపోయినా కానీ మళ్ళీ పని చేసుకపోవడమే తప్ప మరో విషయం తెలియనివాడు. నిత్య బతుకు పోరులో నిలిచి పోరాటమే మార్గమని తెలిసినవాడు చాలా సహజంగా నడుస్తుండు.

వాళ్ల౦దరు కూడా తప్పుని ఒప్పుకోవడానికి పోతున్న ఓడిపోయిన వారిలా, నిందిత మనస్తత్వంతో లేరు.

వారిలో ఒక విజేత మనస్తత్వం నిండిపోయింది. పోరాట మనస్తత్వం వారిని ఆవహించింది. జ్ణానుల సమూహం వలె ఉన్నారు.

చైతన్యం ఇంధ్రధనస్సు రూపం ధరిస్తే ఎలా ఉంటదో వారు అలా కనిపిస్తున్నారు. చైతన్యం ప్రకృతిలో భౌతిక రూపం ధరించి కదిలే మనుషులు ఎలా ఉంటారో వాళ్ళు అలా ఉన్నారు. మానవ సమాజంలో తిరుగుబాటు ఎలా పుట్టిందో ఉద్యమాలు ఎందుకు పుట్టినవో వాళ్ళని చూస్తే అర్థం అవుతది.

ఆ సమూహం, ఆ చైతన్య ప్రవాహం నిమిష నిమిషాన విస్తరిస్తుంది.
ముందుకే మున్ముందుకే సాగిపోతుంది.
అనేక మాటలు, పాటల మధ్య పెద్ద ఊరేగింపు నడుస్తుంది.
బజార౦తా మొగులు ముట్టెలా పొగతో దుమ్ము రేగుతుంది.

ఆ దుమ్ములో భూమ్మీద కాళ్ళు, గాల్లో చేతులు తప్ప మనుషులు అంతా ఒకే ముద్దగా మసకగా కనిపిస్తున్నారు.
ఆ పది మంది శేట్ లాంటి బేపారుల, దళారుల పెద్ద మనుషుల గుంపుని చుట్టుముట్టి మింగేసేలా దగ్గరికి చేరింది ఆ సమూహం. ఆ కోలాహలం.
** **
26-05- 2021. దగ్గర దగ్గర ముప్పై ఏండ్ల తర్వాత.

ఆ సమూహం, ఆ చైతన్య ప్రవాహం ఎన్ని అడ్డంకులొచ్చినా గాని నిమిష నిమిషాన విస్తరిస్తుంది.
ముందుకే మున్ముందుకే సాగిపోతుంది.
రోజు రోజు కి మరింతగా ఉధృతమవుతుంది.
గల్లీ నుండి డిల్లీ వరకు రైతులు వారి సమస్యల పరిష్కారం కోసం, వారి హక్కుల సాధన కోసం, సమాజ రక్షణ కోసం యుద్ధ రంగంలో దూకిండ్రు.
దేశమంత కరోనాతో లాక్ డౌన్ నడుస్తున్న వేళ. దేశమంతా ఒక అప్రకటిత ఎమర్జెన్సీ అమలవుతున్న కాలాన.

దేశ రాజధానిని చుట్టుముట్టి రైతులు రోడ్ మీదనే తాత్కాలిక గుడారాలు ఏర్పర్చుకొని చిన్న చిన్న ఎల్ పీ జీ స్టవుల మీద వండుకొని తింటూ రైతు వ్యతిరేక మూడు చట్టాలని కేంధ్ర ప్రభుత్వం వెంటనే వెనక్కు తీస్కోవాలనే ఉద్యమంలో గత ఆరునెలలుగా పోరాడుతున్నారు.

ఒక సృజనాత్మకమైన ఉత్పత్తిలో భాగస్వామ్యులైన ఆ సృష్టికర్తలు సమాజ పొలంలో నిండి పేరుకపోయిన చెత్తని ఎప్పటికప్పుడు తొలగించి కాలపెట్టి తిరిగి దున్ని పంటలు తీసి సమాజానికి తిండి పెట్టడానికి వారు ముందుకే మున్ముందుకే సాగిపోతున్నారు.

ఈ ముప్పై ఏండ్ల అనుభవం మామూలుది కాదు. అనేక రకాల ఎగుడు దిగుళ్లని తప్పొప్పులని కష్ట నష్టాలని బేరీజు వేసుకున్న పరిణిత అనుభవం.
ఆ సమూహంలో. ఆ ఉద్యమంలో. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు సాగుతున్న ఆ సుధీర్ఘ నడకలో కలిసి రాలేకపోతున్నవారు, అడుగులేయలేకపోయిన వారు, తమని తాము నిర్మాణం చేసుకోలేని వారు, నిర్మాణాల్లో భాగస్వామ్యం కాలేకపోయినవారు వెనుకబడిపోతున్నారు. ఆ సమూహం నుండి మాయమైపోతున్నారు.

సమూహపు నిర్మాణ ఉక్కు గొలుసులు గత ముప్పై ఏండ్లుగా ఒక ప్రణాళికాబద్ధంగా తెంచివేయబడుతున్నాయి.
ఏ ముక్కకి ఆ ముక్కగా విడగొట్టబడి సాగతీయబడి కరుగబెట్టబడుతున్నాయి.
కరిగబెట్టినా కానీ మళ్ళీ గట్టిపడగానే ఆ ఉక్కు మళ్ళీ తన నిర్మాణ గుణాన్ని చూపెడుతుంది గత అనుభవాలతో మరింత గట్టిగా.
ఆ సమూహంలో, ఆ నిర్మాణంలో కలవలేక, ఆ చైతన్యాన్ని అందుకోలేక అనేక మంది విసిరివేయబడుతున్నారు. ఒంటరైపోతున్నారు. ముక్కలైపోతున్నారు.

ఆ వెనకబడిపోయిన మనుషులుగా, ఆ ఒంటరి అయిపోయిన మనుషులుగా, మాయమైపోయిన మనుషులుగా రాయబడని లెక్కించబడని జాబితాలోకి కోట్లాది జనం చేరుతున్నారు రోజు రోజుకి.

ఆ చేరికలో కాశిపేట సామూహిక ఆత్మహత్య చేసుకున్నజంజిరాల రమేశ్, లక్ష్మి, సౌమ్య, అక్షయ్ ల రైతు కుటుంబం కలిసిపోయింది.

ముప్పై ఏండ్ల కింద మా బాపుకి ఊరు ఊరంతా కలిసి వచ్చి ఇచ్చిన ఆ మద్దతులో కనీసం ఒకరైనా ఇవ్వగలిగినా గాని, ఒక్కరైనా ఆ మనిషి లోపలి ధు:ఖాన్ని విని అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు అనే నమ్మకాన్ని కల్గించగల్గినా కానీ – యంత్రాలు మింగిన, పురుగుల మందులు మాయం చేసిన పొలంలోని, చెలుకలోని ఆ మానవీయ శ్రమ సంబంధాలు మచ్చుకైన మిగిలి ఉన్నా గాని – అప్పటి కమ్యూనిస్ట్ పార్టీ లాంటి, మహిళా సంఘాల్లాంటి ఏ ఒక్క నిర్మాణం గ్రామాలలో మిగిలి ఉన్నా గాని ఈ రోజు జంజిరాల రమేశ్ కౌలు రైతు కుటుంబం ఆత్మహత్య చేసుకునేది కాదు. నాకు ఈ దు:ఖం ఉండేది కాదు.

ఒకప్పుడు ఇక్కడే ఈ గడ్డ మీదే పుట్టి దేశమంతా వ్యాపించిన నిప్పు – మా బాపు వెంట నడిచిన ఆ సమూహం ఇప్పుడేమైంది?

అవును ఈ ప్రతి ఆత్మహత్య ప్రభుత్వ హత్య, సామాజిక హత్య, సామూహిక హత్యనే.

చనిపోయే ముందు ఆ నలుగురు “ఎలాంటి ప్రలోభాలు లేకుండా, ఎవరి ఒత్తిడి లేకుండా, ఎలాంటి మత్తుపానీయాలు తీసుకోకుండా, సరైన మానసిక స్థితిలో ఇది మా ఇష్టాపూర్తిగా రాసి చేస్తున్న సంతకం సహీ – ’’ అని వారి ఇంటి లోపల తలుపుల పక్క గోడకి అన్నం మెతుకులతో అంటించిన సామూహిక ఆత్మహత్య ప్రకటన లేఖ ఇక్కడి రైతులకి కౌలు రైతులకి తెలుస్తుందా? నివురుగప్పిన నిప్పు గుప్పుమంటుందా?

ఎండాకాలం తగ్గుముఖం పట్టి కారుమబ్బులు కమ్ముకుంటున్న పరిస్థితుల్లో ఆ ఆత్మహత్య లేఖ ఢిల్లీ రాజధాని నగర వీధుల్లో రైతులకి, ఉద్యమకారులకి అధ్యయన అంశమైంది. పోరాట అంశమైంది. ఈ దేశ ఉమ్మడి అంశమైంది.
** **
నేను మా ఊరికి బయల్దేరిన. మెదడు నిండా అనేక అర్థం పర్థం లేని ఆలోచనలు.

అంతుపొంతు లేని ఆలోచనలు. కొంత సమాధానం, సావధానం కోసమని బయల్దేరిన ఒక్కడినే.
నాకేం కరోన రాలేదు. కానీ గత నెల రోజులుగా నాలో జ్వరం. అనుకుంటే ఏవేవో అన్ని రకాల ఇతర వ్యాధి లక్షణాలు ఉన్నట్లే ఉంది.
నాకేం ఆర్థిక సమస్యలు లేవు.
కుటుంబపరమైన సమస్యలు కూడా లేవు.
కానీ అంతు లేని ఆవేదన, తెలియని బాధ, లోలోపల గడ్డకట్టుకున్న దు:ఖం.

రోడ్ అంతా ఖాళీగా ఉండడం వల్ల వెహికిల్ నడుపుతూనే గ్లాస్ దించి చుట్ట పక్కల చూస్తున్నాను.
రోహిణి సొచ్చి వారం రోజులకొచ్చింది.

రైతులు కొందరు పంటలు కోత అయిపోయిన భూములల్లో గుంటుకు కొడుతార్రు.
మొక్కజొన్న దంట్లు తీసేస్తార్రు. పొలాలల్లో చెత్త చెదారం కాలబెడుతుండ్రు.
కొందరు ఎడ్ల బండ మీద, ట్రాక్టర్ల మీద పెంట జారగొడుతున్నరు.

కొందరు కరెంట్ మోటార్లు సగవెట్టుకుంటార్రు.
వానాకాలం పంటకి సిద్దమవుతున్నారు.
కొందరు ఇల్లు సదిరించుకుంటార్రు. బియ్యం పట్టించుకుంటున్నారు.
ఎడ్ల బండ్లు ట్రాక్టర్లు సగవెట్టుకుంటున్నరు.
గాలి దుమారం ఒకేసారి విపరీతంగా మొదలైంది.
సుడిగుండం అటువంటి గాలికి నా వెహికిల్ పడిపోతుందేమో అన్నంత భయమయింది.
రోడ్ పక్కన తాటి చెట్ల కమ్మల బుయ్యిమనే సప్పుడు మొగులు విరిగి మీద పడ్డంటే పానం జల్లుమంటుంది.
తొవ్వ మీద పోయేటోళ్ల మీద గంపెడు గంపెడు దుమ్మెత్తి పోస్తుంది.

ఒక నడీడు మహిళ ఆ ఊరి నడుమ ఉన్న గిర్ని కాడ పట్టించిన ఎండు మిరప పొడి డబ్బా మీద మూతలేకనే ఎత్తుకపోతుంటే గాలికి చెలరేగిపోయి ఆ పంచాయత్ ఆఫీసు కాడ బాతాకాని కొడుతున్న పెద్ద మనుషుల కండ్లల్ల పడి మంటలు లేసి కండ్లన్ని నలుసుకుంటూ తిట్టుకుంటూ ఇంటి దారి పట్టిండ్రు.

ఒక రైతు తుంట కట్టి మెదుపుతున్న కొల్లాగెలలోకెల్లి ఒకటి కట్టు తప్పిపోయి తొవ్వ పొంట వస్తున్న గుంబొత్త మనిషిని అమాంతం కొమ్ముల మీదేసుకొని లేవట్టి ఎత్తేత్తే అక్కడికక్కడే పిడాత పానం పోయింది.

ఎక్కడో అంటిన ఎల్గడి మంట వందల ఎకరాల పైనే ఉన్న భూమి అంతా ఆవరించి ఉన్న కొయ్య కాళ్ళని దాటి వేగంగా వ్యాపించి ఊరునెక్కడ అంటుకుంటదోనని ఊరి కొస వాడోల్లు ఆందోళనతో చూస్తున్నారు.

ఇంకా లాక్ డౌన్ ఉండడం వల్ల బ్రతుకంతా అగోచర అత్యవసర స్థితిలో మగ్గుతుండడం వల్ల పనులు లేక, కరోనాకీ బయటకు రాలేని వారిలో బయటకు బద్ధలు కానీ అధికపీడనo, బాధ లోలోపల ఒత్తుటం అవుతుంది. వాళ్లంతా తమ కడుపులో ఉన్న ఒత్తిడినంతా బయటకు పోగలిగేలా చేయగల ఒక దుమారం కోసం, ఒక అల్పపీడనం కోసం ఎదురు చూస్తున్నారు.

వాళ్ళున్న కిటికీలళ్ళకెళ్లి బయట వాతావారణం ఎట్లా ఉన్నదోనని చిన్నగా చూస్తున్నారు.
ఇప్పుడు వీస్తున్న ఈ కొత్త గాలి దుమారానికి బయటకొచ్చిన మనుషులు మూతికి కట్టుకున్న మాసికలు (మాస్కులు ) ఊడిపోతున్నాయి. కాళ్ళు చేతులు మంచిగా ఆడుతున్నాయి.

ఆ గాలి దుమారానికి కరోన పోటు గాలి ఎక్కడికో పోయి ఈ కొత్త పాటు గాలి, మూలగాలి మనుషుల గుండెల నిండుగా పీల్చి బయటకు వదిలేలా చేస్తుంది.
మట్టు తెంపుకున్న చిన్న చిన్న కొల్లాగేలు, దొడ్డినిడిసి బయటకొచ్చిన దుడ్డెలు, దడి దాటిన బుజ్జి మేక పిల్లలు, గొర్రె పిల్లలు, కోడిపిల్లలు బజారంతా వాటిదే అయినట్లు ఎగురుతున్నాయి. ఆడుతున్నాయి.

చిన్న పిల్లలు తాటి గిరికెలు, బొమ్మ గిరికెలు పట్టుకొని తమకు అడ్డే లేనట్లు గాలివాటుగా పరిగెడుతున్నారు వాడ మొత్తం.

ఎవ్వలో కచ్చీరు కాడ ఎమ్మెల్యే గారికి శుభాకాంక్షలు చెప్తున్న పెద్ద ఫ్లెక్సిని ఊడబీక్కపోయి పెంకలూడిపోయిన తన ఇల్లు మీద కప్పుకుంటున్నడు.
ఇంకొకరు ఊరవతల ఉన్న మామిడి తోటలోని పండ్లు ఎవలకి భయపడకుండానే తెంపుకొని తువ్వాలలో కట్టుకొని భుజాన వేసుకొని ఇంటికి వస్తుండు.
చిన్న చిన్నగా చినుకులు మొదలైనాయి.

ఒక అతను పిచ్చోని లెక్కున్నాడు. పెయి మీద అంగి లేదు. ఆ ఈదురు గాలికి తట్టుకోలేక ఊరి మధ్యలో ఆవిష్కరణ కోసం సిద్దంగా ఉన్న విగ్రహం ముసుగుని లాగేసి కప్పుకొని కూసున్నాడు అదే గద్దె మీద.

వర్షం ఒక్కసారి విపరీతంగా పెరిగింది. విసిరిసిరి సంపుతుంది.
వైపర్ వేసినా గాని తొవ్వ కనిపించడం లేదు నాకు. కొద్ది సేపు ఆగిన రోడ్ పక్కన.

అంత పెద్ద గాడ్పు దుమారంలో వానలో కూడ ఇద్దరు బార్య భర్తలు తమ పిల్లలతో సహా ఎడ్ల బండి నిండా ఎడ్లకి సరిపడ గడ్డి, కొంత సామానుతో నా వెహికిల్ కి ఎదురుగా ఉత్తరం దిక్కు ఊరుదాటి సాగి పోతున్నారు.

ఏడున్నగిదే బ్రతుకాయే కానీ బ్రతికేదేదో చచ్చే లోపు దాని అంతమేoదో తెలుసుకొని చావాలే అన్నట్లు ఉంది వాళ్ళ పట్టుదల చూస్తే.

                 ** **

ఎట్లాగోల సాయంత్రం ఏడు గంటలకి ఇంటికి చేరి ఫ్రెష్ అయి తిని నెమ్మదిగా టీవీ ఆన్ చేసిన. అన్ని న్యూస్ ఛానల్స్ లో ఒకటే వార్త వస్తున్నది.

“ ఇప్పటికే కరోనాతో సతమతమవుతున్న భారత్ లో మరి కొద్ది రోజుల్లో తుఫాన్ వచ్చే సంకేతాలు స్పష్టంగా అగుపిస్తున్నాయి.
ఆరేబియా సముద్రంలో అల్పపీడన ద్రోణి ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.

ప్రతి యాబై ఏండ్లకి ఒక్కసారి హిందూ మహా సముద్రంలో కలిగే తీవ్రమైన ఒత్తిడి వల్ల ఏర్పడే అల్పపీడన ద్రోణఇ వల్ల కలగబోయే ఈ తుఫానుని “ తౌక్టే “ ( Tauktae- Gecko -Lizard , A symbol for rebirth and life cycles, the circling of energy. Also symbolise there is always hope for rebuild our own lives) గా పిలవనున్నారు.

దీని ప్రభావంతో కేరళ, లక్షద్వీప్, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. కాబట్టి తీర ప్రాంతాలలోని మత్స్యకారులు కొద్ది రోజులు వేటకి వెళ్లకూడదని వాతావరణ శాఖ హెచ్చరించింది.

ఇదే క్రమంలో ఇది బలపడి వచ్చే పదిహేను రోజుల్లో వాయువ్య దిశగా కదిలి దీని ప్రభావం గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలపై దీని ప్రభావం విపరీతంగా ఉండవచ్చు.

ఈ తుఫాన్ ప్రభావం క్రమక్రమంగా దేశ వ్యాప్తంగా తన ప్రభావం చూపించనుంది.
సైక్లోన్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలువబడే మహాపాత్ర గారు దీనిపై మాట్లాడుతూ – ఈ తుఫాన్ ఏ దిశను తీసుకోనుందో, దీని ప్రభావమెంతో ఇప్పుడే చెప్పలేమన్నారు. గతంలో సరిగ్గా ఇటువంటి ఒత్తిడితో 1925 లో ఏర్పడిన తుఫాన్ భారత దేశంలో విపరీతమైన మార్పులకి కారణమైందని కానీ ఈ సారి దాని విస్తృతి కంటే దాని ప్రభావమే వినూత్నంగా ఉండనుందని, ఆ ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడే సరిగ్గా అంచనా వేయలేమని అభిప్రాయపడ్డాడు.’’

మా అవ్వ అన్నం వేసుకొని వచ్చి నా ముందు ఇంకో కుర్చి జరిపి అందులో పెట్టి అంటుంది… “ నీకు ఇంకా సదువుకున్న అమాయకపుతనం పోలేదు కదరా కొడుకా! రేపు పొద్దుగాల అత్తే ఏమవు? ఊరగల్ల దుమారంల వానల పడి వచ్చినవు. ఎటుపడితే అటే పోతవు. యాళ్లపాల లేకుండా పోతవు.
కాలం మంచిగ లేదు బిడ్డా!. ఎటు దిక్కు నుంచెల్లి ఎటు సుట్టుకపోయేది తెలుత్తలేదు. ఎవల దంచుకపోయేది తెలుత్తలేదు. “

బయట బడబడమని ఆకాశంలో మెరుపులు, పిడుగులు పడుతున్నట్లు చెవులు గడేలు పడేటువంటి సప్పుడు. కుక్కల గుంపు ఎడతెగని వింత అరుపులు.

ప్రస్తుతం సమాజములో మనుషుల మద్య నిండి ఉన్న తీవ్రమైన ఈ అల్పపీడనం అసలు ఎలా బద్దలవుతుంది ? ఈ గ్యాప్ ని , సంక్షోభాన్ని పూడ్చడానికి బయట నుండి ఏ శక్తి రావాలి ? ఎవరు పూనుకోవాలి ? ఎలా రావాలి . అసలు అది సరిగా ఛానలైజ్ అవుతుందా ? దాని ఫలితాలు ఎలా ఉంటాయి ? 
సరిగా నిద్ర పట్టని ఈ రాత్రి అల్పపీడన ధ్రోణిలోని కల్లోలాలు అన్నీ నా మనసులో గజిబిజిగా కకావికలుగా ప్రశ్నోపప్రశ్నలుగా అతి వేగంగా పరిగెడుతున్నాయి. 

పుట్టిన ఊరు: కనగర్తి. ఓదెల మండలం, పెద్దపల్లి జిల్లా. SRR డిగ్రీ కాలేజీ కరీంనగర్ లో బీ.కామ్ . చదివి కాకతీయ విశ్వవిద్యాలయంలో బీ.ఎడ్ చేసారు.
సాహిత్యం పరిచయం: చిన్నతనంలో కమ్యూనిస్టు పార్టీ పాటలు, పాఠశాల స్థాయిలో ఠాగోర్ జీవిత చరిత్ర(7వ తరగతి తెలుగు ఉపవాచకం), గౌతమ బుద్ధుని జీవిత చరిత్ర(ఇంటర్ లో), డిగ్రీ చదివేటపుడు మాక్సిం గోర్కీ అమ్మ, నేను హిందువునెట్లయిత?, చలం సాహిత్యం.
రచనలు: 'ఒక మూల్నివాసీ గీతం' పేరుతో త్వరలో కవితా సంకలనం రానుంది. 'మహానీయుల జీవిత చరిత్ర'ల వ్యాసాలు (దినపత్రికల్లో). ప్రస్తుతపు కథ ఆరవది . మంచిర్యాల్ జిల్లా జన్నారం తహసీల్దార్ గా పనిచేస్తున్నారు.

 

One thought on “అల్పపీడన ద్రోణి

 1. మంచి కథ
  తమ దోపిడీ పీడన హింస లతో దుదీర్ఘకాలం
  దగా పడ్డ వాళ్ళంతా తమ సుదీర్ఘ కాలపు
  యాతన మయమైన బతుకును
  కార్మిక కర్షక వర్గపోరాటం
  ఉత్పతి శక్తుల అభివృద్ధి
  శాస్త్రీయ విగ్యనమ్
  లో గెలుచుకుంటారు.

Leave a Reply