చరిత్ర వాకిలి ముందు పరుచుకున్న
నా జీవిత తెరలను ఒక్కొక్కటి విప్పి చూసినప్పుడు అందులో మాసిపోని వేదనలే నవ్వుతూ కనబడ్డాయి
క్షణాలను అరచేతుల్లోకి ఒంపుకొని
సీతాకోక రెక్కలను కట్టుకొని
ఆకాశంలోకి ఎగిరిపోయి ఆ వేదనల నవ్వులను తొక్కెయ్యాలనుకుంటాను నాలోని ఆశలకు ఒక కొత్త ఉదయాన్ని చూపెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటాను
కానీ
ఎప్పటికప్పుడు
కొత్తదనం దుప్పటిని కప్పుకునే
ఈ పితృస్వామ్యం
నా చూపులకి గంతలుకట్టి
అంతుచిక్కని చీకటి బావిలోకి
తోసేస్తూ ఉంటుంది
నేను నేర్చిన అంకెలకు కూడా
ఆ లోతు అంతుబట్టకుండా చేస్తుంది
పోరాడి, పోరాడి ఓడిపోయిన నేను ముక్కలు ముక్కలుగా తెగిపడిపోతుంటాను వాటి చుట్టూ కూడా నిరంకుశ అహంకార అరాచకాలు ఈగలోలె ముసురుతూనే ఉంటాయి
ఈ నిరంతర యుద్ధానికి చిరునామాగా ఉన్న నేను నా చరిత్రను మళ్ళీ లిఖించుకొని అస్తిత్వాన్ని కాపాడుకోడానికి అలసిన నా మనసు ఫినిక్స్ పక్షిగ మారాలి…
బావుంది కవిత