రాజీలేని పోరే మార్గం

ఇతర భాషా సాహిత్యాలలోను, తెలుగు సాహిత్యంలోను ఎప్పటికీ గుర్తు పెట్టుకోదగిన, అద్భుతమైన రచనా భాగాలు, ఏ సందర్భంలోనైనా ఉటంకింపుకు ఉపయోగపడే వాక్యాలు ఎన్నెన్నో ఉన్నాయి. ఒక్కోసారి ఆ ఖండికే మొత్తం రచనను చదవడానికి ప్రేరణ కలిగించవచ్చు. లేదా మొత్తంగా ఆ రచన చదువుతున్నప్పుడు ఆ ఉరవడిలో ఈ ఖండిక ప్రాధాన్యతను పాఠకులుగా మనం గుర్తించలేకపోవచ్చు. అటువంటి రచనా భాగాలు, వాక్యాలు, ఖండికలు అన్ని ప్రక్రియలలోను ఉంటాయి, ఉన్నాయి. ‘కొలిమి’ అటువంటి భాగాలను ఎత్తిచూపడానికి ఒక ప్రత్యేక శీర్షికగా ‘ఏరిన ముత్యాలు’ ను నిర్వహించదలచుకున్నది.

మే దినోత్సవ ప్రత్యేక సంచికగా వెలువడుతున్న ‘కొలిమి’ ప్రారంభ సంచికలో అటువంటి ‘ఏరిన ముత్యాలు’ అత్యంత ప్రభావశీల కార్మికవర్గ నవల మాక్సిమ్ గోర్కీ అమ్మ నుంచి తీసుకున్నాం.
బాల్య కౌమార దశలు అత్యంత కష్టభరితంగా, చదువుకునే అవకాశం కూడ దొరకక, బాల కార్మికుడిగా పనిచేస్తూ ఎదిగిన అలెక్సీ మక్సిమోవిచ్ పేష్కొవ్ ఇరవై నాలుగో ఏట మక్సీమ్ గోర్కీ పేరుతో తన తొలి రచన ప్రకటించాడు. కథలూ వ్యాసాలూ నవలికలూ రాస్తూ తొలి రచనలతోనే ప్రసిద్ధుడవుతూ ముప్పై మూడేళ్ల నాటికి సోషలిస్టు భావాల ప్రభావంలోకి వచ్చాడు. ఆ తర్వాత ఐదు సంవత్సరాలకు రాసిన నవల ‘అమ్మ’. మే దినోత్సవ ప్రదర్శన, ఆ ప్రదర్శనపై పోలీసుల దాడి, ప్రదర్శనకారుల విచారణ అనే ఇతివృత్తం మీద ఆధారపడిన ఈ నవల తల్లీ కొడుకుల బంధం అనే అత్యంత మానవీయమైన ఆర్ద్రమైన మానవ సంబంధాన్ని పూసల్లో దారంలా చిత్రిస్తూ, నూతన మానవుల ఆవిర్భావ ప్రక్రియకు అద్దం పట్టింది. నవలానాయకుడు పావెల్ న్యాయస్థానంలో తామేమిటో చెప్పుకున్న ప్రకటన అది రాసిన నూట పదమూడు ఏళ్ల తర్వాత మాత్రమే కాదు, ఎల్లకాలానికీ ఉత్తేజకరమైనది, ఉద్వేగభరితమైనది, ప్రేరణాత్మకమైనది. చదవండి:

“పార్టీ మెంబరుగా నేను నా పార్టీ వారి తీర్పునే గుర్తిస్తాను. కనుక నా కేసుపరంగా నేనేమీ చెప్ప దలచుకోలేదు. కాని నావలెనే వాదించడానికి నిరాకరించిన మిత్రుల కోరికపైన, మీరు అర్థం చేసుకోని కొన్ని విషయాలను మీకు తెలియచెప్పడానికి ప్రయత్నిస్తాను. సోషల్ – డెమోక్రటిక్ పార్టీ పతాకం ఆధ్వర్యాన మేము జరిపిన ప్రదర్శన ప్రభుత్వాధికారంమీద తిరుగుబాటని ప్రోసిక్యూటర్ అన్నాడు. జారును కూలదోసేందుకు ప్రయత్నించే వాళ్లనుగానే ఆయనెప్పుడూ మమ్మల్ని పరిగణించాడు. నిరంకుశ ప్రభుత్వమొక్కటిమాత్రమే మన దేశాన్ని బంధిస్తున్న గొలుసని మా అభిప్రాయం కాదని ఇందుమూలంగా స్పష్టీకరిస్తున్నాను. అది మొదటి బంధనం మాత్రమే. ప్రజలను ఆ సంకెళ్ల నుంచి తప్పించడం మా విధియని భావిస్తున్నాం.”

“మేము సోషలిస్టులం, అంటే సొంత ఆస్తి సంపాదనకు వ్యతిరేకులం. సొంత ఆస్తి వ్యవస్థ వల్ల సంఘం విచ్ఛిన్నమవుతుంది. ప్రజలు ఒకరితో ఒకరు కలహిస్తారు. వ్యక్తిగతమైన లాభంకోసం, జనం ఒకరితో ఒకరు కలవకుండా విరోధపడుతూ ఉంటారు. ఈ శత్రు వైరుధ్యాన్ని కప్పిపుచ్చడానికీ, సమర్థించడానికీ అబద్ధాలాడతారు. సొంత ఆస్తి జనాన్ని అబద్ధాలాడిస్తుంది. అవినీతిపరులను చేస్తుంది. దగా చేయిస్తుంది. ద్వేషాన్నిపెంచుతుంది. ఏ సంఘమైతే, వ్యక్తిని కేవలం కొద్దిమందిని ధనవంతులను చేసే సాధనంగా మాత్రమే భావిస్తుందో, ఆ సంఘం అమానుషమైనదనీ, మా ప్రయోజనాలకు భంగకరమైనదనీ మా విశ్వాసం. అలాటి సంఘం చెప్పే నీతులు శుద్ధ అబద్ధాలనీ, మోసపూరితములనీ భావిస్తూ వాటిని మేము తిరస్కరిస్తున్నాం. వ్యక్తి పట్ల ఈ సంఘం వ్యక్తపరిచే విద్వేషాన్నీ, దౌష్ట్యాన్నీ మేము ఖండిస్తున్నాం. ఈ సంఘం, వ్యక్తులను దాస్య శృంఖలాలతో బంధించడానికి చేసే సకల ప్రయత్నాలనూ మేము ఎదుర్కొంటాం. స్వార్థపరమైన ఆశకోసం మానవులను అణగదొక్కడానికి చేసే పనులను ప్రతిఘటిస్తాం. మేము కార్మికులం. అనగా ఎవరి కాయకష్టం చేత, పిల్లల ఆటవస్తువులు మొదలు పెద్ద పెద్ద భారీ యంత్రాల వరకూ తయారవుతున్నాయో, ఆ కార్మికులం. అయినప్పటికీ మా మానవ ఔన్నత్యాన్నిసంరక్షించుకునే హక్కు మాకు లేకుండా చెయ్యబడింది. తమ స్వార్థంకోసం ఎవరైనా మమ్మల్ని ఉపయోగించుకో గలుగుతున్నారు. ప్రస్తుతానికి కొంత స్వేచ్ఛను సంపాదించుకోవాలనుకుంటున్నాం. ఆ స్వేచ్ఛ ద్వారా, యావత్తు అధికారాన్నీ మా కైవసం చేసుకోవాలనుకుంటున్నాం. మా నినాదాలు చాలా సరళమైనవి. ‘సొంత ఆస్తి నశించుగాక!’ ‘ఉత్పత్తి సాధనాలన్నీ ప్రజల చేతుల్లోకి రావాలి!’, ‘రాజకీయ అధికారమంతా ప్రజల చేతుల్లోకి రావాలి’, ‘అందరూ పనిచేసి తీరాలి!’ ఈ నినాదాల వల్ల మేము కేవలం తిరుగుబాటుదారులం కామని మీరు తెలుసుకోగలరు!”

“మేము విప్లవకారులం. ఎంతకాలమైతే, కొందరు ఏ పనిపాటలూ తాము చేయకుండా ఇతరులను ఆజ్ఞాపిస్తూ ఉంటారో, మరికొందరు పనిచేయడం తప్ప ఇంకేమీ చేయకుండా ఉంటారో, అంతకాలం వరకూ మేము విప్లవకారులుగానే ఉంటాం. జడ్జీలైన మీరు ఏ సంఘం యొక్క క్షేమలాభాలను సంరక్షించడానికి ఆజ్ఞాబద్ధులై ఉన్నారో, ఆ సంఘానికి మేము బద్ధ విరోధులం. ఆ సంఘానికీ మీకూ కూడా మేము విరోధులం. మా పోరాటంలో మేము విజయాన్ని సాధించే వరకూ మనకు ఏవిధమైన రాజీ సాధ్యం కాదు. కార్మికులమైన మేము జయించి తీరుతాం! మీ అధికారులు తామనుకునేటంత బలవంతులు కారు. దేన్ని పోగుచేసుకుని రక్షించుకోవడంకోసం తమ ఆధీనంలో ఉన్న లక్షలాది జీవుల ప్రాణాలను వారు ఆహుతి చేస్తున్నారో, ఏదైతే మాపై అధికారం చలాయించే శక్తిని వారికిస్తున్నదో, ఆ సొంత ఆస్తే, వాళ్లలో వాళ్ళకు సంఘర్షణకు కారణమవుతుంది. దాని మూలంగానే వారు శారీరకంగానూ నైతికంగానూ కూడా నాశనమవుతారు. సొంత ఆస్తిని సంరక్షించుకోవడం చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం. నిజానికి మా యజమానులైన మీరంతా, మాకన్న కూడా ఎక్కువ బానిసల వంటివాళ్లు. మేము శారీరకంగానే బానిసలం. మీరు మానసికంగా బానిసలు. అలవాట్లు, దురభిప్రాయాలు అనే కాడిని మీ మెడమీదనుంచి మీరు తొలగించలేకుండా ఉన్నారు. ఆ కాడే మిమ్మల్ని మానసికంగా చంపేసింది. మానసికమైన స్వేచ్ఛ‌ననుభవించడానికి మాకడ్డేమీ లేదు. మీరు మాచేత తినిపించే విషాలు మీరు ఇష్టంలేకపోయినా మా తలకెక్కించే విరుగుళ్ల కన్న బలహీనమైనవి. సత్యాన్ని గురించి మా విజ్ఞానం రోజు రోజుకు పెరుగుతోంది. మానసికమైన పవిత్రతగల వాళ్లందరినీ, మీ వర్గాల్లో నుంచి కూడా ఉత్తములైన వారిని – ఈ సత్యం ఆకర్షిస్తోంది. కొంచెం పరిశీలించండి. మీ వర్గం యొక్క భావాలను సమర్థించగలవాడెవ్వడూ మీతో ఇప్పటికే లేడు, చారిత్రక న్యాయం యొక్క వత్తిడి నుండి మీరు అణిగిపోకుండా రక్షించుకోగల వాదనా సమర్థత మీలో ఏష్యమైపోయింది. మీరు నూతన భావాలను సృష్టించలేకపోతున్నారు. మానసికంగా మీరు వట్టిపోయారు. మా భావాలు పెరుగుతున్నాయి, బలాన్ని పుంజుకుంటున్నాయి, సామాన్య జనాన్ని ఉత్తేజపరచి వాళ్లను స్వాతంత్య్ర పోరాటానికి సమీకరిస్తున్నాయి. కార్మికవర్గం తను వహించవలసిన పాత్రను గుర్తించిన కారణంచేత ప్రపంచ కార్మికులందరూ ఒక మహాశక్తి గా ఏకమైపోతున్నారు. ప్రపంచానికి వాళ్లు తెస్తున్న పునరుజ్జీవనాన్ని ఆపడానికి క్రౌర్యమూ, పరిహాసమూ తప్ప మీదగ్గర మరే సాధనమూ లేదు. అపహాస్యం స్పష్టంగానే కనబడుతోంది. క్రౌర్యం మరింత రేప్పెడుతుంది. ఈనాడు మా కుత్తుకలమీద వెయ్యబడిన చేతులే రేపు మిమ్మల్ని సోదర భావంతో కౌగలించుకుంటాయి. మీ శక్తి బంగారాన్ని పెంచే యాంత్రిక శక్తి మాత్రమే. ఆ శక్తే మిమ్మల్ని పరస్పరం గుటకాయస్వాహా చేసుకోవలసిన ముఠాలుగా చీలుస్తుంది. శ్రమజీవులందరి సౌభ్రాతృత్వం పట్ల రోజుకు రోజూ ప్రవృద్ధమవుతూన్న సజీవమైన మా చైతన్యంలోనే మా శక్తి యిమిడి ఉంది. మీరు చేస్తున్నదంతా అపరాధం. ఏమంటే, అది ప్రజలను బానిసలుగా చేస్తుంది. మీ అబద్ధాలు, మీ దురాశ, మీ దుర్మార్గం ప్రజలను భయపెట్టే పిశాచాలూ, రాక్షసులూ ఉండే ప్రపంచాన్ని సృష్టించాయి. ఈ రాక్షసుల బారినుండి జనాన్ని తప్పించడం మా వంతు. మీరు మానవుడిని జీవితాన్నుంచి విడదీసి నాశనం చేశారు. మీరు నాశనం చేసిన ప్రపంచాన్ని సోషలిజం చేపట్టి, దాన్నొక మహత్తరమైన ఏక ప్రపంచంగా పునర్నిర్మాణం చేస్తుంది. దానినాపడానికి మీరేమీ చెయ్యలేరు! దాని నాపడానికి మీరేమీ చెయ్యలేరు!

నేను దాదాపు ముగింపు కొచ్చాను. మిమ్మల్ని నేను వ్యక్తిగతంగా అగౌరవపరచదలచుకోలేదు. పైగా, విచారణ పేరిట మీరు జరిపే ఈ తమాషాను – నాకిష్టంలేకపోయినా ఇక్కడ కూర్చుని చూస్తుంటే, మీ యడల నాకు సానుభూతి కూడా కలిగింది. ఇంతకీ, మీరూ మానవులే. మానవులైనవాళ్ళు మా లక్ష్యానికి వ్యతిరేకులైనవారైనా, ఇంత సిగ్గు శరాలు లేకుండా, మానవ ప్రతిష్టకు భంగకరంగా, పశు శక్తికి గులాములు కావడం చూస్తుంటే రోత అనిపిస్తోంది…”

Leave a Reply