అమ్మకానికి దేశం

మనది ప్రజాస్వామ్య లౌకిక సర్వసత్తాక గణతంత్ర దేశం. అంటే యావత్తు దేశం స్వీయ సంపుష్టి పొందడం. స్వావలంబన సాధించడం. అయితే, అందుకు భిన్నంగా సమగ్రాభివృద్ధికి, స్వయం సమృద్ధి కొరకు గడచిన ఏడు దశాబ్ధాలుగా ప్రజలు ఎన్నో శ్రమలకోర్చి తమ రక్తమాంసాలు వెచ్చించి నిర్మించుకున్న ఆస్తులను ఆశ్రితులకు అప్పగించడమే లక్ష్యంగా మోడీ ప్రభుత్వం వ్యవహరించడం అత్యంత దారుణం. మోడీ ప్రభుత్వ ఆర్థిక విధానాలు ప్రజల జీవన విధానాలపైన, జీవన భృతులపైన ప్రత్యక్ష ప్రభావం చూపిస్తున్న దేశ వనరులను, దేశ సంపదను, దేశ శ్రమను స్వదేశీ, విదేశీ కార్పొరేట్లకు కారుచౌకగా దారపోస్తున్నాయి. దేశ స్వావలంబన కోసం ప్రధాన రంగాలైన రక్షణ రవాణా కమ్యూనికేషన్‍, ఆర్థికానికి నాడీ వ్యవస్థలైన బ్యాంకింగ్‍ ఇన్సూరెన్స్, మౌలిక సదుపాయాల కల్పనతో పాటు, ప్రధాన వనరులైన చమురు ఇనుము ఉక్కు, విద్యుత్తు వంటి పరిశ్రమలన్నీ ప్రభుత్వ రంగంలో ఉంటేనే దేశాభివృద్ధి సాధ్యమన్నది సామాజిక, ఆర్థిక వేత్తల మాట కాగా, సమస్త ప్రభుత్వరంగాలను ప్రయివేటుకు అప్పగించాలన్నది మోడీ సర్కారు లక్ష్యం. ఇది పూర్తిగా నెహ్రూ మిశ్రమ ఆర్థిక విధానానికి వ్యతిరేకమైంది.

నిజానికి సంస్కరణ అంటే… గతం కన్నా ఉన్నతీకరణ చెందిన అభివృద్ధికి వ్యక్తీకరణ, స్వాతంత్య్రోద్యమ కాలంలో విదేశీ పెట్టుబడులు అంటే మన స్వేచ్ఛా స్వాతంత్య్రాలను హరించే ఉరితాళ్లని జాతీయోద్యమ నాయకుడు దాదాబాయి నౌరోజీ అన్నారు. సామ్రాజ్యవాద ప్రపంచీకరణ ఆర్థిక విధానాల అమలు (జూలై 1971) మొదలైన నాటి నుంచి దేశ పాలకుల విధాన నిర్ణయాల పుణ్యమాని సంస్కరణలు అంటే విధ్వంసంగా, విధానపరంగా వెనక్కిపోవడంగా, విలువపరంగా తలకిందులు కావటంగా తయారైంది. ఇంకా చెప్పాలంటే… ఆర్థిక సంస్కరణలంటే విదేశీ పెట్టుబడులకు గేట్లు తెరవటంగా, పారిశ్రామిక సంస్కరణలంటే.. ప్రభుత్వరంగ సంస్థలను మొత్తం అమ్మటంగా మారిపోయింది. 1947కి ముందు విదేశీ పెట్టుబడులన్నింటికీ వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించారు. విదేశీ పెట్టుబడులను వ్యతిరేకించటమే అనాడు దేశభక్తి, అలాంటిదిప్పుడు విదేశీ పెట్టుబడులు తేవటమే గొప్పతనంగా, దేశభక్తిగా మారిపోవటం ఓ పెద్ద సామాజిక విషాదం. ఇది కాలం తెచ్చిన మార్పు కాదు. నేటి పాలకుల్లో జాతీయభావనలో, దేశ ప్రజల భవిష్యత్తు పట్ల నిబద్ధతలో వచ్చిన వికృత మార్పు వినాశకర విధానాలకు నిదర్శనం.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‍ ఒక కొత్త పదాన్ని, పథకాన్ని ఆగష్టు 23న దేశం మీదకు వదిలారు. దాని పేరు నేషనల్‍ మానిటైజేషన్‍ పైప్‍లైన్‍(ఎన్‍ఎంపి). జాతీయ ఆస్తుల ద్రవ్యీకరణ ప్రణాళిక. అంటే జాతీయ ఆస్తులను అమ్ముకొని ద్రవ్యంగా మార్చుకోవడం. ప్రైవేట్‍ పెట్టుబడుల ఊతంతో మౌలిక రంగాన్ని మరింత మెరుగుపర్చేందుకు, ఇతర సదుపాయాల కల్పనకు అవసరమైన నిధులను సమీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం బృహత్తర జాతీయ మానిటైజేషన్‍ పైప్‍లైన్‍(ఎన్‍ఎంపి) కార్యక్రమాన్ని ఆవిష్కరించింది. దీని కింద కేంద్ర ప్రభుత్వానికి చెందిన కీలక ఆస్తుల మానిటైజేషన్‍ ద్వారా రూ.6 లక్షల కోట్ల విలువను 2024-25 ఆర్థిక సంవత్సరం లోగా రాబట్టనుంది. దీనికి సంబంధించిన నియమ నిబంధనలను నీతి ఆయోగ్‍ రెండు సంపుటాలుగా విడుదల చేసింది. ఈ పథకం ప్యాసింజర్‍ రైళ్లు మొదలుకుని, రైల్వేస్టేషన్లు, విమానాశ్రయాలు, రహదారులు, స్టేడియంలు ఇలా పలు మౌలిక రంగాల్లో అస్సెట్స్ను లీజుకివ్వడం తదితర మార్గాల్లో ‘మానిటైజ్‍’ చేయనుంది. ఎయిర్‍పోర్ట్ ఆథారిటీ ఆఫ్‍ ఇండియా(ఎఎఐ)కి చెందిన 25 విమానాశ్రయాలు, 40 రైల్వేస్టేషన్లు, 15 రైల్వే స్టేడియంలతో పాటు పలు రైల్వ కాలనీలతో పాటు పలు ఆస్తులు ఇందులో భాగంగా ఉండనున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.88 వేల కోట్లు ఆస్తుల ద్రవ్యీకరణ జరుగనుంది.

మోడీ ప్రభుత్వం పెట్టుబడిదారులకు పన్ను రాయితీలు, పారు బాకీలను మాఫీ చేయడం, ఉద్దీపనల పేరుతో ఆర్థిక సదుపాయాలు కల్పించడంతో ప్రభుత్వ ఖజానా ఖాళీ అయింది. కార్పొరేట్‍ పన్నుల వాటా 2018-19లో 3.8 శాతం ఉండగా, అది ఇంకా ఇంకా తగ్గుతూ 2021లో ఈ దశాబ్ది కనిష్టానికి 2.3 శాతానికి చేరింది. కార్పొరేట్‍ పన్నుల మినహాయింపు వల్ల ప్రభుత్వ ఖజానా 2017-18లో రూ।। 93,642.50 కోట్లు, 2018-19లో రూ।। 1,08,785 కోట్లు నష్టపోయింది. ఇక ప్రత్యేక ఆర్థిక మండళ్లలోని పరిశ్రమల మీద పన్ను మినహాయింపు వల్ల రూ।।24,300.22 కోట్లు నష్టం. దీనికి తోడు చౌకగా భూమిని విక్రయించటం, సహజ వనరులను కొల్లగొట్టడానికి అనుమతులివ్వటం కొనసాగుతూనే ఉన్నది. అయినా ఈ కార్పొరేట్‍ సంస్థలు భారీ ఎత్తున దివాళా తీయటమన్నదే దోపిడీ శక్తుల మాయాజాలం. బ్యాంకుల్లో రుణాలు తీసుకొని పరిశ్రమ బోర్డు పెట్టి ఉత్పత్తి ప్రారంభించకుండానే దివాళా తీసినట్లు ప్రకటించడం మన దేశంలో అనవాయితీగా మారింది.

ప్రభుత్వ అనుచిత విధానాల వల్ల ఆదాయం తగ్గి వ్యయం పెరగడంతో ద్రవ్యలోటు పెరిగింది. ప్రపంచబ్యాంక్‍, అంతర్జాతీయ ద్రవ్యసంస్థల నిర్దేశం ప్రకారం ద్రవ్యలోటు జాతీయ స్థూల ఉత్పత్తిలో 3.5 శాతం మించకూడదు. అంతకంటే ఎక్కువ ఉంటే రేటింగ్‍ సంస్థలు దేశం దివాళ వైపు పయనిస్తున్నట్లు చూపుతాయి. అటువంటప్పుడు దేశానికి అప్పు పుట్టదు. ఆ దుగ్ద్గతో ద్రవ్యలోటు పూడ్చుకోవడానికి, ప్రభుత్వ రంగ సంస్థల విక్రయానికి తోడుగా ప్రజా ఆస్తులను 30 నుంచి 50 సంవత్సరాలకు అద్దెకు (లీజు) ఇవ్వడానికి ఉవ్వీళ్లూరడం దివాళకోరుతనానికి పరాకాష్ట. జాతీయ ఆస్థులు అద్దెకిచ్చే ఆస్తుల వివరాలు సిద్ధం చేస్తున్నాయి. రాబోయే వాలుగు సంవత్సరాలలో కేంద్రం విక్రయించే ప్రభుత్వ ఆస్తుల జాబితాను సిద్ధం చేస్తున్నారు. ఆస్తులపై యాజమాన్య హక్కులు ప్రభుత్వానికే ఉంటాయని, ప్రభుత్వం ఎలాంటి ఆస్తులను విక్రయించబోదని, నిర్ణీత గడువు తర్వాత వెనక్కి తీసుకుంటామని నమ్మబలుకుతున్నారు.

ఆస్మదీయుల కొరకే ఆస్తుల ద్రవ్యీకరణ :

మోడీ ప్రభుత్వం దేశాన్ని పాలించడం మొదలైన తర్వాత గత ఏడేళ్లలో అది అవలంభించిన ప్రాధాన్యత క్రమాన్ని పరిశీలిస్తే ప్రభుత్వ రంగంలోకి ప్రైవేటును పిలిచి పెద్ద పీట వేయడానికే ఎక్కువ విలువ ఇచ్చినట్టు బోధపడుతుంది. చివరికి ప్రజల జీవితాలకు ధీమాను కలిగిస్తున్న జీవిత బీమా సంస్థను కూడా స్టాక్‍ మార్కెట్‍లో పెట్టడానికి వెనుకాడడం లేదు. విశాఖ ఉక్కు, ఎయిర్‍ ఇండియా, షిప్పింగ్‍ కార్పొరేషన్‍ వంటి విలువైన ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుకు చవకగా అప్పగించే కార్యక్రమాన్ని ప్రధాని మోడీ ప్రభుత్వం అత్యుత్సాహంగా చేపట్టింది. 2015లోనే కేల్కర్‍ కమిటీ ప్రభుత్వ-ప్రైవేట్‍ భాగస్వామ్యానికి సరైన ప్రత్యామ్నాయం ‘ఆస్తుల నగదీకరణ’నే అని చేసిన సూచనలలోనే ఇవాళ్టీ ఆస్తుల నగదీకరణ ప్రణాళికకు బీజాలు ఉన్నాయి. ప్రజలు వీధుల్లోకి వచ్చి హృదయావేదనతో ఎంతగా నిరసన తెలిసినా వారి మాట పెడచెవిన పెట్టి ప్రభుత్వ రంగ ఆస్తులను ప్రైవేటుకు ధారాదత్తం చేసే పనిని నిరాటంకంగా కొనసాగిస్తోంది. ప్రైవేటు యజమానులు వారి సొంత డబ్బుతో పారిశ్రామిక వాణిజ్య రంగాల్లో ప్రవేశించి దేశ ఆర్థికాభివృద్ధికి తోడ్పడితే వారికి అవసరమైన కొన్ని మౌలిక సదుపాయాలను ప్రజాధనంతో కల్పించడాన్ని దేశ ప్రగతికి దోహదం చేసే కృషిగా భావించి హర్షించవచ్చు. కాని ప్రభుత్వం వద్ద గల విలువైన ఆస్తులను, సంపదను ప్రైవేటుకు దఖలు పరిచి దానివల్ల దేశానికి మేలు కలుగుతుందని చెప్పడం కంటే బూటకం మరొకటి ఉండదు.

ద్రవ్యలోటును నియంత్రణలోకి తీసుకొచ్చేందుకు, అలాగే దీర్ఘకాలంలో మౌలిక సదుపాయాల రంగానికి నిధుల సహకారం అందించేందుకు ఈ ప్రణాళిక దోహదం చేస్తోందని ప్రభుత్వం చెప్పడంలో వాస్తవం లేదు. మౌళిక సదుపాయాల కల్పన పేరుతో ఆశ్రితుల సంపదలు పెంచే కుట్ర ఇందులో దాగి ఉందన్నది యదార్థం. 2019 డిసెంబర్‍లోనే రానున్న 6 సంవత్సరాలలో రూ. 111 లక్షల కోట్ల విలువ గల మౌలిక సదుపాయాలను కల్పించడానికి ‘జాతీయ అవస్థాపనా పైప్‍లైన్‍’ (ఎన్‍ఐపి) ప్రకటించారు. ఈ పెట్టుబడిని 85 శాతం బడ్జెట్‍ ద్వారా, 15 శాతం రుణాల ద్వారా సమకూర్చుకుంటామని ప్రకటించారు. ప్రభుత్వం ప్రజా ఆస్తులను అద్దెకివ్వడం ద్వారా సమకూరేది 6 లక్షల కోట్లు మాత్రమే. అంటే సముద్రంలో కాకి రెట్టంత అని విధితమవుతుంది. ఇందుకు గాను ఆగ మేగాల మీద పాత, ప్రస్తుత ఆస్తులలో ప్రైవేట్‍ పెట్టుబడులను ఆకర్షించేందుకు గాను నేషనల్‍ మానిటైజేషన్‍ పైప్‍లైన్‍ (ఎన్‍ఎంపి) అనే ప్రణాళికను ప్రారంభించారు.

జాతీయ ఆస్తులను ద్రవ్యీకరించడానికి సంబంధించిన ప్రణాళిక రోడ్‍ మ్యాప్‍ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‍ విడుదల చేశారు. ఈ సందర్భంగా నీతి ఆయోగ్‍ సిఇఒ అమితాబ్‍ కాంత్‍ మాట్లాడుతూ, జాతీయ మానిటైజేషన్‍ పైప్‍లైన్‍ కింద 20కి పైగా ఆస్తి తరగతులు మానిటైజ్‍ చేయనున్నామని అన్నారు. ఈ ప్రణాళికలో ప్రధానంగా మూడు ప్రధాన రంగాల్లోని రోడ్డు 27 శాతం, రైల్వే 25 శాతం, పవర్‍ సెక్టార్‍లు 15 శాతం వరకు ఉంటాయి. ప్రభుత్వ ఆలోచనల్లో, విధానాల రూపకల్పనలో ప్రజల ప్రస్తావన కన్పించడం లేదు. ప్రభుత్వం ఒక వాణిజ్య సంస్థగా వ్యవహరిస్తోంది. అది గుత్త సంస్థల పెట్టుబడుల ప్రయోజనం కోసం మాత్రమే నిరంతరం కృషి చేస్తున్నట్లు స్పష్టమవుతున్నది. దేశ సంపద ప్రజల సొత్తు, దీన్ని కాపాడడం ప్రభుత్వ నైతిక బాధ్యత. ఇంతగా కార్పొరేట్లకు దోచి పెడుతుంటే ప్రభుత్వ రుణభారం పెరుగుతోంది. ఇవాళ మన దేశ రుణాల వాటా జిడిపిలో 62 శాతం వరకు ఉంది. అందులో విదేశీ రుణం 11.5 బిలియన్‍ డాలర్లు. జిడిపిలో రుణాల వాటా ప్రమాదకరమైన స్థాయిని దాటింది.

ప్రైవేట్‍సంస్థలకు అప్పగించనున్న ప్రజా ఆస్తులపై ఏటా రూ. 1,50,000 కోట్ల ఆదాయం ‘అద్దె’ రూపేణా సమకూరనున్నదని ప్రభుత్వ పెద్దలు ఆనందభరితులవుతున్నారు. ఆస్తులు ప్రైవేట్‍వ్యక్తులు, ప్రైవేట్‍సంస్థల ఆధీనంలోకి వెళ్ళిపోయినప్పటికీ వాటి అసలైన ‘యజమాని’ ప్రభుత్వం మాత్రమేనని ప్రధానమంత్రి ఆయన మంత్రులు బుకాయిస్తున్నారు. బదిలీ కాలపరిధి ముగిసినప్పుడు ధర మందగించిన ఆస్తులన్నీ మళ్ళీ ప్రభుత్వ పరమవుతాయని కూడా అంటున్నారు. ఇది, ‘నేషనల్‍ మానిటైజేషన్‍ పైప్‍లైన్‍’(ఎన్‍ఎమ్‍పి)లోని కీలకాంశం. ప్రైవేట్‍ సంస్థలకు అప్పగించదలిచిన ఆస్తుల జాబితాలో 27వేల కిలోమీటర్ల రోడ్డు, 28,698 సర్క్యూట్‍ కిలోమీటర్ల నిడివి గల విద్యుత్‍ సంబంధిత ఆస్తులు, 6000 మెగావాట్ల థర్మల్‍, సౌర విద్యుదుత్పాదన ఆస్తులు, 8154 కిలోమీటర్ల సహజవాయువు పైప్‍లైన్స్, 3930 కిలోమీటర్ల పెట్రోలియం ఉత్పత్తుల పైప్‍లైన్‍, 2,10,00,000 మెగాటన్నుల గిడ్డంగులు, 400 రైల్వేస్టేషన్లు, 90 ప్యాసింజర్‍ రైళ్ల నిర్వహణ కార్యకలాపాలు, 265 గూడ్స్ షెడ్స్, కొంకణ్‍ రైల్వే, 2,86,000 కిలోమీటర్ల పైబర్‍, 14,917 టెలికాం టవర్లు, 25 విమానాశ్రయాలు, 9 ప్రధాన ఓడరేవులు, 2 జాతీయ స్టేడియాలు ఉన్నాయి.

ప్రభుత్వం తలపెట్టిన జాతీయ ఆస్తుల ద్రవ్యీకరణ ప్రణాళిక అనివార్యంగా కీలకరంగాలైన నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, సౌరశక్తి, టెలికాం, సహజవాయువు పైప్‍లైన్‍, పెట్రోలియం పైప్‍లైన్‍, గిడ్డంగులు మొదలైన వాటిలో గుత్తాధిపత్యాలకు దారితీస్తుంది. ఆర్థిక కార్యకలాపాలలో ప్రైవేట్‍రంగానికి ప్రాధాన్యమిచ్చే విధానాలను మనదేశం గత ముప్పై ఏళ్లుగా అనుసరిస్తోంది. పారిశ్రామిక, సేవల రంగాలలో సదరు విధానాలు గుత్తాధిపత్యాలకు దారితీస్తున్నాయి. మొదటి నుంచీ పెట్టుబడిదారీ విధానాలనే అనుసరించిన ఆర్థికవ్యవస్థలు గుత్తాధిపత్యాల ఆవిర్భావం పట్ల ఆందోళన చెందుతున్నాయి. అమెరికాయే ఇందుకొక ఉదాహరణ. గూగుల్‍, ఫేస్‍బుక్‍, అమెజాన్‍ మొదలైన సంస్థల గుత్తాధిపత్యాన్ని అరికట్టేందుకు తీసుకురావలసిన చట్టాలు, చేపట్టవలసిన చర్య విషయమై అమెరికా కాంగ్రెస్‍, ప్రభుత్వం చర్చలు జరుపుతున్నాయి. ఇక చైనా సైతం క్రమబద్ధీకరించలేని స్థాయిలో పెరిగిపోయిన టెక్నాలజీ కంపెనీలు కొన్నిటిపై చర్యలు చేపడుతోంది. సరిగ్గా ఇందుకు విరుద్ధ మార్గంలో దేశాన్ని తీసుకువెళ్ళేందుకు మన పాలకులు ఉవ్వీళ్లూరడం ఆశ్చర్యకరం, ఆందోళనకరమైంది.

ఆస్తుల ద్రవ్యీకరణతో ప్రమాదం :

బిజెపి 2014 ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చిన, మోడీ ఎన్నికల సభల్లో గంభీరంగా ఘోషించిన అంశాలు. అక్రమ సంపదను 100 రోజుల్లో స్వాధీనం చేసుకోవడం, ఐదు సంవత్సరాలలో రైతుల ఆదాయం రెట్టింపు చేయడం, యువతకు ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పించడం, పారదర్శక పాలన అందించడం వంటి హామీలు తుంగలో తొక్కి ఎన్నికల ప్రణాళికలో పేర్కొనని పెట్టుబడి అనుకూల, ప్రజా వ్యతిరేక విధానాలను నిరంకుశంగా అమలు చేస్తోన్నారు. పెద్దనోట్ల రద్దుతో అక్రమ సంపాదన అంతా సక్రమ సంపదగా మారింది. వస్తుసేవల పన్ను (జిఎస్‍టి) అమలుతో అనేక సూక్ష్మ చిన్న మధ్యతరగతి పరిశ్రమలు, (ఎంఎస్‍ఎంఇ) వ్యాపారాలు మూతపడ్డాయి. కార్మిక వ్యతిరేక స్మృతులు, రైతు వ్యతిరేక చట్టాలు, సర్వం ప్రైవేటీకరణతో కొత్త ఉద్యోగాలు రాలేదుగానీ ఉన్న ఉద్యోగాలు పోయాయి. ఒక్క కలంపోటుతో ప్రభుత్వరంగ సంస్థల సమస్త ఆస్తులను ఇంచుమించు సంపూర్ణంగా లుప్తం చేసేందుకు ప్రధానమంత్రి, ఆయన ఆర్థిక మంత్రి కంకణం కట్టుకున్నారు.

కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రయివేటీకరణ విధానాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థతో పాటు ప్రజాజీవనానికీ ప్రమాదం పొంచి ఉంది. పెట్టుబడిదారులు పేర్లుమార్చి ఎప్పటికప్పుడు సరికొత్త ప్రయివేటీకరణ విధానాలతో ప్రభుత్వరంగంపై దాడి చేస్తున్నారు. అత్యవసర, నిత్యవసరమైన రైల్వేలను, టెలికాంను, విద్యుత్‍ను కూడా ప్రయివేటుపరం చేస్తారని ఎవరు ఊహించలేదు. గతంలో పెట్టుబడిదారులకూ ఎంతో కొంత సామాజిక బాధ్యత ఉండేది. వారు ప్రభుత్వరంగం ఉండాలని కోరుకునేవారు. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. లాభాలకోసం విద్య, వైద్యం సహా అన్నిరంగాలనూ ఎన్డీఏ ప్రభుత్వం ప్రయివేటుపరం చేస్తోది. అదానీ, అంబానీ లాంటి ఒకరిద్దరి చేతికి ప్రభుత్వ ఆస్తులు వెళ్లడం వల్ల ప్రజలకు ఒనగూడే ప్రయోజనాల కంటే నష్టాలు, కష్టాలు ఎక్కువవుతాయి. ఈ చర్యల వల్ల దేశంలో సంపద కూడ అభివృద్ధి చెందదు.

నేషనల్‍ అస్సెట్స్ మానిటైజేషన్‍ పైప్‍లైన్‍, నేషనల్‍ ఫైనాన్స్ అండ్‍ డెవలప్‍మెంట్‍ బ్యాంక్‍ ద్వారా 17 శాతం పెట్టుబడి సేకరిస్తామంటున్నారు. మానిటైజేషన్‍ అనేది కొత్తగా దేశంలోకి వచ్చిందన్నారు. ఇది ఆస్ట్రేలియన్‍ మోడల్‍ విధానం. 2014 నుంచి 2018 వరకు ఆస్ట్రేలియాలో ‘అసెట్‍ రీసైకిలింగ్‍’ పేరుతో దీన్ని అక్కడ అమల్లోకి తెచ్చారు దాన్నే బ్రౌన్‍ ఫీల్డ్ అంటారని తెలిపారు. గ్రీన్‍ ఫీల్డ్ పెట్టుబడి అంటే ఒక సంస్థను ఆరంభం నుండి నిర్మించడం, బ్రౌన్‍ఫీల్డ్ పెట్టుబడి అంటే ఉనికిలో ఉన్న సంస్థను కొనడం లేదా అద్దెకు తీసుకుని అభివృద్ధి చేయడంగా భావిస్తారు. బ్రౌన్‍ఫీల్డ్లో కొత్తగా పెట్టుబడులు పెట్టకుండా, ఉన్న పెట్టుబడులనే మరోచోటకు దారిమళ్లిస్తారు. ఇలాంటి విధానాల అమలుకు ఆస్ట్రేలియా 5 బిలియన్‍ డాలర్లు కేటాయిస్తే 3.3 బిలియన్లు మాత్రమే ఖర్చు చేశారు. అక్కడ అన్ని రాష్ట్రాలు ఈ విధానాన్ని అంగీకరించలేరు. అమలుకు అంగీకరించిన రాష్ట్రాల్లో ప్రజల నుంచి తిరుగుబాటు వచ్చింది. ముఖ్యంగా ఉపాధి, నిరుద్యోగం ఆ రాష్ట్రాల్లో పెరిగింది. మానిటైజేషన్‍ పేరుతో అక్కడి విద్యత్‍ప్లాంట్లను 99 సంవత్సరాలకు లీజుకు ఇచ్చారు. ఆ తర్వాత ప్రయివేటు గుత్తాధిపత్యం పెరిగి, కరెంటు చార్జీలు ప్రజకు భారమయ్యాయి.

ఇదే విధానానికి కొన్ని మార్పులు చేసి ఇప్పుడు కేందప్రభుత్వం మనదేశంలో అమల్లోకి తెస్తున్నది. ప్రజావినియోగ వస్తు ధరలు పెరిగితే, ఆ ప్రభావం ప్రజలపై తీవ్రంగా ఉంటుంది, తద్వారా ఉపాధి సమస్య ఏర్పడుతుంది. పెట్టుబడిదారుల మధ్య పోటీతత్వం పక్కకు పోయి, గ్రూపులు కట్టి సిండికేట్లు అవుతారు. దీనివల్ల ఆయా రంగాల్లో వారికి గుత్తాధిపత్యం ఏర్పడుతుంది. రాజకీయజోక్యం వల్ల ఆస్తుల విలువను తక్కువ చూపి ప్రయివేటుకు ధారాదత్తం చేస్తున్నారు. ఆస్తులను ప్రస్తుల మార్కెట్‍ విలువ ఆధారంగా కాకుండా నిర్మాణ సమయంలో పెట్టిన పెట్టుబడి ఆధారంగా ఆశ్రితులకు అప్పగిస్తున్నారు. ఈ విధానాలు భారతదేశంలో అమలైతే ప్రజలు హక్కులు, రిజర్వేషన్లు కోల్పోవల్సి వస్తుంది. 2001లో దేశంలో సర్‍చార్జిలు, సెస్‍లు 3 శాతం ఉండగా, ఇప్పుడు 30 శాతానికి పెరిగాయన్నది గమనించాలి. ఇప్పటివరకు కేందప్రభుత్వరంగ సంస్థల ప్రయివేటీకరణే కొనసాగుతున్నదనీ, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్ని కూడా ప్రయివేటీకరిస్తే 30 శాతం అదనపు ఆర్థిక సహాయం చేస్తామని కేంద్రం ప్రకటించడం గమనార్హం. ఉభయ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. తెలంగాణ, ఆంధప్రదేశ్‍ భూములు అమ్ముకోవడం ఎప్పుడో ప్రారంభించాయి. కేంద్రం ఇంకా ఎలాంటి విధివిధానాలూ ఇప్పటివరకు రూపొందించలేదు.

మొత్తంగా ఆస్తులు ద్రవ్యీకరించే బృహత్‍ ప్రణాళికలో అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. మొదటి అనుమానం ధరలు విపరీతంగా పెరగుడం, ప్రజా సంక్షేమం కొరబడటం, రెండవ సందేహం, అస్మదీయుల కోసం జాతి సంపద విలువను తక్కువగా చూపుతారని, తద్వారా క్విడ్‍ ప్రోకోలు కొకొల్లలుగా ఉంటాయన్నది. మొత్తం పక్రియ పారదర్శకత లోపం వల్ల సమాజాన్ని మరింత సంక్షోభంలోకి నెట్టే అతి గొప్ప కుంభకోణంగా మారే ప్రమాదముందన్న భయం. ఇంకా ఒక ఆస్తిని సుదీర్ఘకాలం అనుభవించేందుకు వీలుగా అధికారాలు పొంది, దానిని అభివృద్ధి చేసిన తరువాత, ప్రభుత్వం ఇచ్చినదానిని వెనక్కు ఇచ్చేయడం జరిగే పనేనా? అన్నది ప్రశ్న. సర్వసాధారణంగా ప్రభుత్వ ఆస్తులు ప్రైవేటు చేతుల్లోకి పోవడమే తప్ప తిరిగి రావడం కనిపించదు. పైగా, గరిష్ట స్థాయిలో సద్వినియోగం చేసే క్రమంలో సదరు ప్రైవేటు యజమానులు బ్యాంకు రుణాలు తీసుకుంటారు. పెట్టుబడులు పెడతాడు. ప్రభుత్వానికి ఎంతో కొంత ముట్టచెబుతూ, వాటిని మరింత విలువైన ఆస్తిపాస్తులుగా మార్చి, ఎక్కువే పిండుకుంటారు. ఆ తరువాత కూడా వాటిని తిరిగి అప్పగించడానికి కాదు, అనుభవించడానికే ప్రయత్నం జరుగుతుంది.

మోడీ ప్రభుత్వం ఎందుకిలా చేస్తోంది? :

2014 పార్లమెంటు ఎన్నికల ముందు హిందూత్వ ఫాసిస్టు శక్తులకు, కార్పొరేట్‍ పెట్టుబడికి మధ్య ఏర్పడిన ఐక్యత విజయవంతంగా కొనసాగాలంటే రెండు షరతులు నెరవేరాలి. మొదటిది ఏ సంక్షోభ పరిస్థితులు 2014లో ఈ కార్పొరేట్‍-ఫాసిస్టు కూటమి ఏర్పాటుకు దారితీశాయో, వాటిని ఈ కూటమి అధిగమించగలగాలి. అంటే ఆర్థిక సంక్షోభం ఉండకూడదు. రెండవది హిందూత్వ ఫాసిస్టు కూటమిలోని వ్యక్తులకు, కార్పొరేట్లకు మధ్య ఘర్షణకు దారితీసే విధంగా పెట్టుబడిదారీ వ్యతిరేక ప్రకటనలు, ఖండనలు ఉండకూడదు. మోడీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక నిర్ణయాల్ని మన దేశ మీడియా ఏడేళ్లలో ఏనాడు ప్రజాకోణంలో విశ్లేషించలేదు. మోడీ ప్రభుత్వ నిర్ణయాలన్నింటీని కీర్తిస్తూ ఎడిటోరియల్స్ రాశారు. మోడీ కార్పొరేట్‍ అనుకూల, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్న మేధావులను, ప్రజా సంఘాల నాయకులను, కళాకారులను, రయితలను, హక్కుల సంఘాలపై అక్రమ కేసులు పెట్టి ఉపా దేశద్రోహం వంటి నల్ల చట్టాలను ప్రయోగించి నిర్బంధించడం గత ఐదేళ్లుగా కొనసాగుతూనే ఉంది. మనదేశంలో కార్పొరేట్‍ దోపిడీకి, ప్రభుత్వ నిర్బంధ విధానాలకు మధ్య అవిభాజ్య సంబంధం కొనసాగుతోంది.

మన దేశంలో బిజెపి గాని ఆర్‍ఎస్‍ఎస్‍ గాని ఏనాడు దళారీ బడా బూర్జువా పెట్టుబడికి, భూస్వామ్య భావజాలానికి వ్యతిరేకతంగా వ్యవహరించలేదు. నిజానికి అవి సామ్రాజ్యవాద దోపిడీకి విదేయంగా ఉన్నాయి. కనుక ఈ ఇద్దరు భాగస్వాముల నడుమ ఎటువంటి సైద్ధాంతిక సమస్యలూ తలెత్తే అవకాశం లేదు. కాని మొదటి షరతు-అంటే ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించడం అసాధ్యం. అంతకంతకూ ప్రపంచీకరణ అవుతున్న ద్రవ్య పెట్టుబడికి, జాతీయ సరిహద్దులకే పరిమితమై కొనసాగుతున్న జాతి రాజ్యాలకు (నేషన్‍ స్టేట్‍) నడుమ ఉన్న వైరుధ్యం ఈ సంక్షోభాన్ని అధిగమించనివ్వదు. అలా అధిగమించడానికి అవసరమైన ప్రభుత్వ వ్యయం పెంపుదలను అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి అనుమతించదు. అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడికి మన పాలకులు ముప్పై ఏండ్ల క్రితమే లొంగిపోయారు. దాన్ని ఎదిరించే స్వభావం మన దేశ పాలకులకు లేదు. అందువల్లనే దేశంలో పెరుగుతున్న సంపద ప్రజలకు చేరడం లేదు. 10 శాతం మంది 74 శాతం సంపదను కలిగి ఉన్నారు. 50 శాతం ప్రజల దగ్గర 5 శాతంలోపే సంపద ఉంది. పెరుగుతున్న సంపద కార్పొరేట్ల వద్దకే వెళ్తుంది.

ద్రవ్యీకరణతో ప్రజలకు కలిగే నష్టమేమిటి? :

ప్రభుత్వం ప్రజా ఆస్తిని ప్రైవేటు నిర్వాహకుడికి అప్పజెప్పడం అంటే ఆ ప్రభుత్వ సంస్థ ద్వారా ఇంతవరకూ ఒక హక్కుగా, ఒక సహ యజమానిగా ప్రతీ పౌరుడూ పొందుతున్న ఉచిత సేవ కాస్తా ఇప్పుడొక సరుకుగా మారిపోతుంది. అలా మారిపోయాక ఏ వినియోగదారుడి కొనుగోలుశక్తి ఎక్కువగా ఉంటే అతడికే లేదా ఆమెకే దానిని వినియోగించుకునే అవకాశం వస్తుంది. తక్కినవారికి నిరాకరించబడుతుంది. ఒక హక్కుగా పొందే స్థితి నుండి కొనుగోలు శక్తి ఉంటేనే పొందగలిగే స్థితి ఏర్పడుతుంది. వేలంలో పోటీ పడి అధిక మొత్తంతో ఆస్తులను దక్కించుకున్న సంస్థలు అధిక యూజర్‍ చార్జీలు ప్రజలపై వేస్తారు. అయితే ఈ యూజర్‍ చార్జీలు పెంచకూడదని ప్రభుత్వం వాళ్ళ నుంచి హామీ తీసుకునే అవకాశం ఉండదు. ఒకవేళ ప్రైవేటు సంస్థల రాబడులు తగ్గిపోతే దానిని పూడ్చడానికి అవసరం అయితే ప్రభుత్వమే నిధులను పంపిణీ చేయవలసి ఉంటుంది. అంతకన్నా ముఖ్యంగా ప్రస్తుతం ప్రభుత్వ ఆధీనంలో ఉండే సంస్థలలో పనిచేసే ఉద్యోగుల భద్రత విషయంలో వారికి అందించే వేతనాల విషయంలో హామీ ఉంటుందా అంటే అనుమానమే. ప్రయివేటు రంగంలో శ్రామిక దోపిడీ అనేది ప్రాథమిక లక్షణం. అంతేకాదు ప్రస్తుతం ఉన్న శ్రామికులకు కూడా ఉద్యోగ భద్రత ఉండదు. కొత్తగా ఉద్యోగ కల్పన జరగదు. వేతనాల కోత, ఉన్న ఉద్యోగులను తొలగించడం అనేది సహజంగా జరిగే పక్రియ.

ఇంతవరకూ ఒక హక్కుగా ప్రభుత్వ ఆస్తుల ద్వారా సేవలను పొందగలుగుతున్న అత్యధిక ప్రజానీకం ఇకముందు వాటి సేవలను పొందలేని స్థితికి నెట్టబడడం అనేది ఆ ప్రజల ప్రజాస్వామిక హక్కును హరించడమే అవుతుంది. అందుచేత మానిటైజేషన్‍ అంటే కేవలం ఆదాయాల మధ్య అసమానతలను మరింత పెంచే చర్య మాత్రమే కాదు. ప్రజల హక్కులను హరించడం కూడా. ఒక రోడ్డును, ఒక రైల్వే ప్లాట్‍ఫాంను ఇంతవరకూ ఉపయోగించుకున్న విధంగా ఇకముందు ఉపయోగించలేని స్థితికి నెట్టబడడం అప్రజాస్వామికం కాక ఇంకేమవుతుంది? ఈ విధంగా ప్రతీ దానిని ఒక సరుకుగా మార్చివేస్తూ పోవడం అంటే పౌరుల పౌరహక్కులను, జీవించే హక్కును క్రమంగా కాలరాస్తూ పోవడమే. ఈ విధంగా మోడీ ప్రభుత్వం పౌరులందరికీ ఉన్న సమాన ప్రజాస్వామ్య హక్కుల స్థానంలో పూర్తి వివక్షతతో కూడిన ఆర్థిక విధానాన్ని ప్రవేశ పెడుతోంది. అంటే మన దేశాన్ని మళ్లీ వలస పాలన కిందికి తీసుకెళ్తుంది. ఇది అత్యంత ప్రమాదకరమైన తిరోగమన చర్య మాత్రమే కాదు ఈ దేశ ప్రజానికాన్ని ఆర్థిక బానిసత్వంలోకి నెట్టే దుర్మార్గపు చర్య.

ముగింపు :

ప్రజా ఆస్తులను రక్షించాల్సిన ప్రభుత్వం అప్పనంగా ఆశ్రితులకు అమ్మడం లేదా అద్దెకు ఇవ్వడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. ప్రజల భవిష్యత్తుకు కీడు తలపెడుతున్న ద్రోహ చిత్తులు అమ్మకాలకు అడ్డుగా నున్న దేనిని ఖాతరు చేయడం లేదు. ప్రభుత్వ సంస్థలు, ఆస్తులు ప్రైవేటుపరం అయ్యాక రాజ్యాంగం కల్పించిన బడుగు బలహీన సామాజిక వర్గాల చేయూత కోసం ఏర్పరిచిన రిజర్వేషన్లు అప్రకటితంగానే కనుమరుగై పోతాయి. ఈ సారాన్ని ఎస్సీ, ఎస్టీ, బిసి, మహిళ, మైనారిటీ సామాజిక వర్గాలు అప్రమత్తమై వివేచనతో స్పందించాలి. ప్రభుత్వ వర్గాలు ఆస్తులు అమ్మి సంక్షేమాన్ని చేపడుతామనే మాయమాటల మర్మాన్ని అర్థం చేసుకోవాలి. కొండనాలుకకు మందేసి ఉన్న నాలుకను ఊడబెరికే ఊసరవెల్లుల రంగులు పసిగట్టాలి. లక్షల కోట్ల రైటాఫ్‍తో బడాబాబులకు లబ్దిచేకూర్చే పాలకులు, వేలకోట్లతో విలాసవంత విన్యాసాలు నిర్మించుకునే నాయకులు సామాన్యుల సంక్షేమం ఎప్పుడో అటుకెక్కించారు.

ప్రైవేట్‍ రంగానికి లాభాపేక్ష తప్ప ప్రజాసంక్షేమం పట్టదు. అది ప్రజలను నిర్దాక్షిణ్యంగా పీల్చి పిప్పి చేస్తుంది. ఆశ్రిత పెట్టుబడిదారీ వ్యవస్థ లోతుగా వెళ్లూనుకుంటున్న మనదేశంలో ప్రైవేట్‍రంగం ప్రభుత్వ ఆస్తులను, ఆదాయాలను గరిష్ఠ స్థాయిలో స్వప్రయోజనానికి వినియోగించుకుంటుంది. మోడీ ప్రభుత్వ ఏడేళ్ల నిర్వాకం మిగిల్చింది రైతు కంట్లో కారం, గ్యాసు బండ భారం, పెట్రో మోత, శ్రామికులకు స్వేదం, నిరుద్యోగ శోకం, అత్యాచార పర్వం, ప్రశ్నించే గొంతుకు నిర్బంధం. ఇదే మన పాలకుల నిర్వాకం ఇప్పటికయినా మేల్కోవాలి. అమ్మకపు దారుల అధికారాన్ని అడ్డుకోకపోతే నిన్నూ, నన్నూ మనందరినీ వేలానికి పెడతారు, మనమంతా పోగేసుకున్న దాన్ని తెగబడి అమ్మేస్తున్నారు. మేధావులారా, శ్రామికులారా, ఆలోచనా పరులారా దేశభక్తి జెండా కప్పుకున్న తోడేళ్ళ గుంపుని పసిగట్టండి. నిజమైన దేశభక్తితో దేశాన్ని రక్షించండి. మేధావులు ప్రశ్నలు ఎక్కుపెడితే సామాన్యులు ఓటు తూటాను పేల్చుతారు. ప్రజాసంఘాలు పోరుబాట పడుతాయి.

క‌డ‌వెండి, జ‌న‌గామ జిల్లా. ఉపాధ్యాయ ఉద్య‌మ నాయ‌కుడు. సామాజిక‌, రాజ‌కీయార్థిక విశ్లేష‌కుడు.

Leave a Reply