అమెరికా ఎన్నికల్లో బొమ్మ బొరుసు

అమెరికా ఎన్నికలంటే ప్రపంచమంతా ఒక్కటే హడావుడి. దొరగారింట్లో పెండ్లికి ఊరు ఊరంతా సందడి చేసినట్లుగ. ఎన్నికలవేళ అందరూ మాట్లాడుకున్నట్లే మా ఇంట్లో మేము కూడా గెలుపూ ఓటముల చర్చ చేసుకున్నం. ఎవరు గెలువాలని అనుకుంటుండ్రో, ఎందుకో మా పిల్లలు స్పష్టంగా చెప్పారు. నన్ను చెప్పమని అడిగారు. “ట్రంపు ఓడాలని వుంది. కాని బైడెన్ గెలవాలని లేదు” అని చెప్పిన. వాళ్ళు ఒక్కసారిగా మీదికి ఎగబడ్డరు. “ట్రంప్ ఓడాలంటవ్, బైడెన్ గెలువొద్దంటవ్. అసలు నువ్వేం మాట్లాడుతున్నవ్? రేసులో ఇద్దరే వున్నప్పుడు ఒకడు ఓడితే, ఇంకొకడు గెలుస్తడు కదా…” అంటూ వాదనకు దిగిండ్రు. నిజమే, కాని నా బాధ వీడు ఓడుడు, వాడు గెలుసుడు గురించి కాదు. ప్రజలకు ఇంతకు మించిన అవకాశం లేక పోవడం గురించి. లేకుండా చేసిన వ్యవస్థ గురించి.

ఇది నా ఒక్కడి బాధ మాత్రమే కాదు. వాస్తవానికి ఇది కేవలం అమెరికా ఎన్నికలకు మాత్రమే సంబంధించినది కూడా కాదు. బూర్జువా (బూటకపు) ప్రజాస్వామ్యం కొనసాగుతున్న అమెరికా దగ్గర నుండి హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల వరకూ ప్రజలకు మిగిలింది ఇలాంటి అవకాశమే. ఉన్న వాళ్ళలో “lesser evil” ను ఎన్నుకోవడం. అదే యధాతధ స్థితిని కొనసాగించడం.

అయితే కేవలం బహిరంగంగా కనిపించే అంశాలను దృష్టిలో పెట్టుకొని అమెరికా ఎన్నికలను చూస్తే ఎలాంటి ప్రజాస్వామిక, నైతిక విలువలు లేని ట్రంప్ అనే ఒక అధికారవాది (authoritarian personality) ఓడిపోవాలని కోరుకోవడం కూడా ఒక గొప్ప విలువగా కనిపిస్తుంది . ఎందుకంటే ట్రంప్ కూల్చని విలువలు లేవు. అన్నింటికి మించి తెల్ల జాతి ఆధిపత్యాన్ని వైట్ హౌస్ నుండి వీధుల మీదుగా సమాజ నిత్యజీవితంలోకి ప్రవేశపెట్టాడు. విలువలు లేనితనాన్నే హీరోయిజానికి సింబల్ గా అహేతుక మూకలు సమాజంలోని అన్ని స్థాయిల్లో తయారు కావడానికి ప్రేరణగా నిలిచాడు. ఒకప్పుడు జాత్యహంకారాన్ని మనసులో దాచుకున్నోళ్ళు ట్రంప్ సృష్టించిన రాజకీయ వాతావరణంలో చాలా నిస్సిగ్గుగా బహిరంగ ప్రదర్శన చేశారు. కొన్ని అరాచక మూకలు ఇంకాస్త ముందుకెళ్ళి తమ బలప్రదర్శన కోసం, మిగితా వాళ్ళను భయబ్రాంతులను చేయడం కోసం ఆయుధాలతో వీధుల్లో ప్రదర్శనలు చేశారు. వీటిని ట్రంప్ ఏనాడూ పల్లెత్తు మాట అనకపోగా వాళ్ళను నెత్తిన పట్టుకున్నాడు. ఇవన్నీ ఒకవైపు అయితే సమాజంలోని అన్ని వ్యవస్థల్లో ముఖ్యంగా పోలీసు వ్యవస్థలో పేరుకు పోయిన జాత్యహంకారం మూలంగా నల్ల జాతీయులపై హింస పెరిగిపోయింది. దీనికి తోడు గే, లెస్బియన్, మహిళల reproductive rights, పర్యావరణ హక్కుల హననం తీవ్రతరమయ్యింది. లాటిన్ అమెరికా దేశాల నుండి వలసొచ్చిన వారి పరిస్థితి దినదిన గండంగా మారింది.

ఇన్ని దుర్మార్గపు పనులు చేసిన ట్రంప్ ఓడాలని అనుకోవడం చాలా సహజమైన, ప్రజస్వామికమైన విషయం. ఎందుకంటే ట్రంప్ మళ్ళీ అధికారంలోకి వస్తే ఫాసిజం ప్రతి ఇంటి డోర్ కొడుతుందని భయపడినవాళ్ళూ ఉన్నారు. (ఫాసిజం అనేది చాలా పెద్ద మాట కాబట్టి అది వాడడం సరైనదేనా కాదా అనేది వేరే చర్చ!). అయితే ట్రంప్ ఓటమికి ఇవి మాత్రమే కారణం అనుకుంటే పొరపాటు చేసినట్లే. ఇవి కేవలం బయటికి కనిపించే కారణాలే.

కనిపించని ముఖ్యమైన కారణం: రోజురోజుకు ప్రపంచం మీద అమెరికాకు రాజకీయంగా ఆర్థికంగా పోతున్న పట్టు. దీనికి ట్రంప్ తీసుకున్న దేశీయ పాలసీలు, తాను నడిపించిన అంతర్జాతీయ వ్యవహారాలు కొంత వరకు కారణమే. ఒకవైపు అమెరికా గడ్డ మీది నుండి నయాఉదారవాద ప్రపంచీకరణకు ఇక అడ్డులేదని రాజకీయార్థిక పండితులు సిద్ధాంతాలు వల్లిస్తుంటే, వాళ్ళ సూత్రాలకు వ్యతిరేకంగా ట్రంప్ వ్యవహరించడం మొదలుపెట్టాడు. ఒక స్థాయిలో “ప్రపంచీకరణ వ్యతిరేక జాతీయవాదమని” (anti-globalization nationalism) ఒక బూటకపు రాగమెత్తుకున్నడు. దీనితో ప్రపంచ పెట్టుబడులకు, కార్పొరేట్ అమెరికాగా పిలువబడే దేశీయ పెట్టుబడులకు ఒక ఘర్షణ వాతావరణం ఏర్పడింది. దీనికి తోడు చైనాతో కొనసాగుతున్న వ్యాపార యుద్ధం, కనబడకుండా సాగుతున్న అంతర్యుద్ధం. ఇవన్నీ ఒక రకంగా అమెరికన్ సామ్రాజ్యానికి (American Empire) బీటలు పడేసే వ్యవహారాలే.

ఈ పరిస్థితిలో వచ్చే ప్రశ్నలేమంటే: ఏమి ఆశించి ట్రంప్ వీటన్నింటిని చేసిండు? అమెరికన్ సమాజంలో ఎవరు, ఎందుకు అతని మాటలు నమ్మి మొడటిసారి పట్టం కట్టారు? మరి రెండోసారి ఎందుకు ఓడిపోయిండు? అమెరికన్ సమాజానికి, అమెరికన్ సామ్రాజ్య విస్తరణకు ట్రంప్ చేసిన నష్టమేమైనా వుంటే దానిని బైడెన్ పూడ్చగలడా? ఈ ప్రశ్నలకు సమాధానం కేవలం ట్రంప్, బైడెన్ల చుట్టూ వెతికితే దొరకవు. కనీసం డెబ్భై, ఎనభై సంవత్సరాల అమెరికన్ రాజకీయార్థిక చరిత్రను ఉపరితలంలోనైనా తొవ్వితే కాని కొన్నింటికైనా జవాబులు దొరకవు.

అన్నింటికంటే ముందు ఒక్క విషయం స్పష్టంగా చెప్పుకోవాలి. అదేమంటే, అమెరికన్ రాజకీయాలలో ఉన్న అతి ప్రధానమైన పార్టీల (డెమక్రాటిక్, రిపబ్లికన్) మధ్య ఉన్న ముఖ్యమైన పోలికలు ఏమిటన్నది. రెండూ మార్కెట్ సానుకూల పార్టీలే. రెండూ రాజ్యం మార్కెట్ వ్యవహారాలలో తలదూర్చొద్దని భావించేవే. అయితే ప్రధానమైన తేడా వున్నదల్లా ఆ పార్టీలు అమెరికన్ సామాజిక జీవితాన్ని ఎట్లా చూస్తాయి అనే విషయంలోనే. డెమక్రాటిక్ పార్టీ కొంతైనా ఉదారవాద భావాలను కలిగి వుంది. దానికి అనుగుణంగానే ఉదారవాదం కలిగించే మార్కెట్ స్వేచ్ఛతో పాటుగా వ్యక్తి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే భ్రమలను ప్రజలలో నమ్మబలుకుతుంది. రిపబ్లికన్లు కొంత మొరటుగా మాట్లాడితే, డెమక్రాట్లు దానినే నాజుకుగా చెప్తారు. అంతిమంగా ఇద్దరు కోరుకునేది మార్కెట్ స్వేచ్ఛనే!

చరిత్రలో ఇరవయ్యో శతాబ్దపు తొలి భాగమంతా విధ్వంసమే. మొదటి ప్రపంచ యుద్ధం (1914-1918), దాని తర్వాత కోట్లాది మందిని చంపిన స్పానిష్ ఫ్లూ (1918-1920), వీటి మూలంగా తలెత్తిన తీవ్ర ఆర్థికమాంద్యం (1929-1938). ఈ సంక్షోభాల నుండి బయటపడేలోపే (లేదా ఈ సంక్షోభాల మూలంగా తీవ్రమైన సంఘర్షణల నుండే) వచ్చిన రెండో ప్రపంచయుద్ధం (1939-1945). ఇన్ని కుదుపుల మూలంగా అమెరికన్ సమాజము, ఆర్థికవ్యవస్థ తీవ్రమైన సంక్షోభంలోకి కూరుకపోయాయి. ఎప్పుడు “మార్కెట్ పనిని దానంతట అది చేసుకోనివ్వండి. దానిని నియంత్రించే పని చెయ్యొద్దు” అని చెప్పే ఉదారవాద ఆర్థికవేత్తలు సహితం తమ సిద్ధాంతాలను కట్టిపెట్టి రాజ్యం సహాయం కోసం మొరబెట్టుకున్నారు. ఎందుకంటే ఉద్యోగాలు, ఇతర ఆర్థిక వనరులు పోయి వ్యక్తి తలసరి ఆదాయం బాగా దెబ్బతిని తన వినమయ శక్తి కోల్పోయిన స్థితి వచ్చింది. మార్కెట్ తనంతట తానుగా కొత్త వినియోగదారులను తయారు చేసుకోలేదు. కాబట్టి దానికి ఒక బయిటి శక్తి/ వ్యవస్థ సహాయం కావాల్సి వచ్చింది. ఆ శక్తి వున్నది కేవలం ఉదార రాజ్యానికే అని నమ్మి వాళ్ళు ఆ అప్పీల్ చేసారు. అలాంటి ఆర్థిక శాత్రవేత్తలలో జాన్ మెనార్డ్ కీన్స్ ప్రముఖుడు. దానితో అప్పటి అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ రోజువెల్ట్ “న్యూ డీల్” పేరుతో సంక్షేమ పథకాలను (1933 నుండి 1939 వరకు) విస్తృతంగా ప్రవేశపెట్టాడు.

న్యూ డీల్ లో భాగంగానే పెద్ద ఎత్తున ఇంఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ప్రారంభించారు. సాంఘీక భద్రత పథకాలకు పెద్దపీట వేశారు. ఉద్యోగ అవకాశాలు పెంచారు. వ్యవసాయానికి, పరిశ్రమలకు విపరీతమీన రాయితీలు ఇచ్చారు. మొత్తంగా ఆర్థికరంగానికి ఒక బూస్టింగ్ ఇంజెక్షన్ ఇచ్చారు. ఇవన్నీ దేశీయంగా చేస్తూ అభివృద్ది చెందుతూ ప్రపంచ వ్యవహారాలలో కూడా పట్టు సాధించడపై దృష్టి పెట్టారు. అందులో భాగంగానె బ్రెటన్ వుడ్ సంస్థలను (న్యూహంషేర్ రాష్ర్టంలోని బ్రెటన్ వుడ్ అనే ప్రాంతంలో జరిగిన ఒక అంతర్జాతీయ సమావేశం తర్వాత ఏర్పడిన సంస్థలు కాబట్టి ఆ పేరు వచ్చింది) ఏర్పాటు చేశారు. జులై 1944లో ప్రపంచబ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధిని ఏర్పాటుచేశారు. వీటికి తోడుగా తర్వాత అక్టోబర్ 1947లో ఏర్పాటు చేసిన జనరల్ అగ్రీమెంట్ ఆన్ టారిఫ్ అండ్ ట్రేడ్ (ఇదే 1995లో ప్రపంచ వాణిజ్య సంస్థగా మార్పు చెందింది) సంస్థను కూడా జత చేశారు.

వీటన్నింటిని తన రాజకీయ, ఆర్థిక బలంతో జేబు సంస్థలుగా మార్చుకున్న అమెరికా ప్రపంచంలో ఏర్పడిన ప్రతి రాజకీయ, ప్రాకృతిక సంక్షోభాన్ని అవకాశంగా ఉపయోగించుకొని తన పెత్తనాన్ని సుస్థిరం చేసుకుంది. బ్రెటన్ వుడ్ శకంగా (1944 నుండి 1973 వరకు) పిలిచే కాలమంతా “ప్రపంచాన్ని ఉద్దరించడం నా బాధ్యత” అనే బూటకపు “పెద్దన్న” పాత్రను పోషిస్తూ తన ఆధిపత్యాన్ని పెంచుకుంది. తన మాట వినని దేశాలను “పనికిరాని రాజ్యాలుగా” (రోగ్ స్టేట్స్) ప్రకటించి ఆయా దేశాలలో రాజకీయ సంక్షోభాలను సృష్టించడమో, అధికారంలో ఉన్నవారిని కూలదోయడమో చేసింది. అంతేకాదు 1960లలో ఉధృతమైన సోషలిస్టు ఉద్యమాలను అణివేయడానికి అమెరికా తన గూఢాచారా సంస్థ సీ.ఐ.ఏ ద్వారా చెయ్యగలిగిన కుట్రలు అన్నీ చేసింది. ఎక్కడెక్కడ అమెరికన్ దౌత్యకార్యాలయాలు ఉన్నాయో అక్కడ కుట్రల కుంపటి రాజేసింది.

అయితే 1970 తొలినాళ్ళ నుండే అమెరికా తనకున్న కనీస ఉదారవాద స్వభావాన్ని కూడా వదులుకొని మార్కెట్ కు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడమే కాకుండా సమాజంలో ప్రతి దానిని సరుకుగా మార్చే నయాఉదారవాదాన్ని నెత్తికెత్తుకుంది. దానిని ప్రపంచ వ్యాప్తం చేయడానికి కొత్త పాలసీలను అమలులోకి తెచ్చింది. వాటిని బ్రెటన్ వుడ్ సంస్థల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా అమలుచేయించింది. “మీకు అప్పులు కావాలా, అయితే మేము చెప్పినట్లు చెయ్యండి” అని షరతులు పెట్టి అన్ని దక్షణాది దేశాలలో సంస్థాగత మార్పులు తీసుకొచ్చింది. అమెరికా ఒత్తిడిని ఎదిరించి సోవియట్ యూనియన్ ప్రభావంలో వుండిన దేశాలు కొంతవరకు నిలువగలిగినవి కాని మిగతా ప్రపంచమంతా అమెరికా మార్కెట్ శక్తుల పరమయిపోయింది. లాటిన్ అమెరికాలో మొట్ట మొదట తన ప్రయోగాన్ని 1973లో చిలీతో మొదలుపెట్టింది. అక్కడున్న సోషలిస్టు ప్రభుత్వాన్ని కూల్చి, అధ్యక్షుడు సాల్వడార్ అయెండె ను చంపి తన కీలుబొమ్మ, నియంత పినోషే ని గద్దె మీడ కూర్చోబెట్టింది. ఆ తర్వాత తాను కోరుకున్నట్లే తన నయాఉదారవాద పద్ధతులను కొనసాగించింది.

అంతటితో ఆగలేదు. 1975 నాటికి లాటిన్ అమెరికాలోని తన కీలుబొమ్మ ప్రభుత్వాలను (చిలీ, పెరూ, పరగ్వే, ఉరుగ్వే, అర్జంటీన, ఈక్వడార్) ఒక్కచోటికి చేర్చి అన్ని రకాల వామపక్ష, ప్రజాస్వామిక ఉద్యమాలను అణివేయడానికి కావాల్సిన సమాచారాన్ని తెలుసుకోవడానికి “కాండార్” (లాటిన్ అమెరికన్ రాబందు) అనే పేరు మీద రహస్య కార్యకలాపాలను సీ.ఐ.ఏ నిర్వహించింది. దీని ఫలితంగా వందలాది కవులు, కళాకారులు, రచయితలు, ప్రశ్నించే ఎందరో బుద్ధిజీవులు కిడ్నాప్ కు, హింసకు గురయ్యారు, చివరికి మాయమయ్యారు.

అమెరికా తన సామ్రాజ్యవాద పెత్తనాన్ని విస్తరించడానికి రెండు ఉదారవాద సూత్రాలను ఉపయోగించుకుంది. ఒకటి, శాంతి; రెండు, ప్రజాస్వామ్యం. శాంతి నిర్మాణం పేరిట యుద్ధాలు చేసింది. నెత్తుటి మడుగులో శాంతి కలువలను ప్రపంచానికి చూపాలనుకున్నది. అదే చేసింది. గత యాభై ఏండ్లుగా పేలుతున్న బాంబుల వెనుక, కూలుతున్న రాజ్యాల వెనుక అమెరికా హస్తం ఉంది. శాంతిమండలాల నిర్మాణం ఒకవైపు, మార్కెట్ విస్తరణ కోసం స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం అనే భావనల ప్రచారం మరోవైపు. ప్రజాస్వామ్య ఉద్ధరణ పేరుతో కృత్రిమ ఉద్యమాలు, స్వచ్ఛందసంస్థలు ఎన్నో నిర్మాణం చేయించింది. తన మాట వింటే బహుమతి, వినకపోతే శిక్ష అనే పద్ధతిన ప్రపంచం నలుమూలల విస్తరించింది. దాని కోసం ఎంతటి రిస్క్ అయినా చేసింది. అయితే ఈ గుత్తపెత్తనం ఎంతకాలమో కొనసాగే పరిస్థితి లేకుండాపోయింది. 1990ల చివరి నుండే ప్రపంచీకరణ పేరిట జరిగిన విధ్వంసం నుండి పుట్టుకొచ్చిన ఆగ్రహం వివిధ రూపాలలో ప్రపంచమంతా బయటపడడం మొదలయ్యింది.

అయితే రోజురోజుకు పెరుగుతున్న ప్రతిఘటనలను తగ్గించడానికి 2000 తొలినాళ్ళ నుండే “పేదరిక నిర్మూలన,” “సాధికారత అభివృద్ది,” “ప్రజల వద్దకే పాలనా,” “engagement and enlargement,” “గ్లోబల్ గవర్నన్స్” ఇలాంటి అందమైన పదాలతో కొత్త మోసాన్ని దేశ రాజధానుల నుండి ప్రపంచ ప్రజల నట్టింట్లకు తెచ్చింది. ఈ పాలసీలను అమలు చేయడానికి మన్మోహన్ సింగ్, చంద్రబాబు లాంటి దళారీలు తోడయ్యిండ్రు. ఈ పద్ధతుల ద్వారా పేద దేశాలు పూర్తిగా ప్రపంచ మార్కెట్ కు వనరులను, శ్రమను, సేవలను అందించే ప్రాంతాలుగా మార్చబడినవి. అంతేకాదు ప్రపంచీకరణ మూలంగా లబ్ధిపొందిన మధ్యతరగతి, ఆ పైవర్గాలు ప్రపంచ మార్కెట్ కు పెద్ద వినియోగదారులుగా మారారు.

ప్రపంచ మార్కెట్ కు అనుకూల చట్టాలను, పాలసీలను తయారి చేసి “శాంతిని” కాపాడే దళారీ రాజ్య వ్యవస్థ ఉచితంగా దొరికాయి. దానితో అమెరికన్ పరిశ్రమలు పెద్ద ఎత్తున దక్షిణాది దేశాలకు తరలిపోయినవి. దీనికి తోడు అమెరికా తన గడ్డ మీద కూడా నయాఉదారవాద పాలసీలను అమలుచేసింది. ప్రభుత్వరంగం అన్ని రంగాలలో కృశించుకుపోయింది. చివరికి జైళ్ళు కూడా ప్రైవేట్ సంస్థలు నడిపే స్థితి వచ్చింది. దీని మూలంగా ఎలాంటి సాంఘిక భద్రత లేని క్యాజువల్ లేబర్, నిరుద్యోగం పెరిగిపోయింది. వాటితో పెరిగిపోయే మానసిక ఒత్తుడుల నుండి బయట పడటానికి ఆల్కహాల్, డ్రగ్స్, క్రీడల మీద పిచ్చి వ్యామోహం, వీడియో గేములు… ఇలా అనేక రకాలుగా మనిషి సమాజం నుండి, అంతిమంగా తన నుండి తాను పరాయీకరణ చెందే ప్రక్రియ కొనసాగుతూ వుంది. వీటన్నింటి మూలంగా మతం మీద మూఢవిశ్వాసాలు పెంచుకోవడం, సమస్యలకు సమాధానం దొరకని పరిస్థితుల్లో ఆత్మహత్యలు చేసుకోవడం కోకొల్లలుగా జరుగుతున్నాయి. మొత్తంగా సమాజం విధ్వంసమయిపోయింది.

ఈ పరిస్థితుల్లో ట్రంప్ ఎత్తుకున్న “అమెరికాను మరోసారి గొప్పగా చేసుకుందాం” అనే నినాదం సమాజం అట్టడుగున ఉన్న ప్రజానీకానికి ఒక ఆశగా తాకింది. అదే అవకాశంగా అమెరికన్ సమాజం ఒక విధ్వంసకర స్థితిల్లో వుండడానికి కారణం బతుకుదెరువు కోసం వచ్చిన లాటిన్ అమెరికన్లు, ఏషియన్లు అని విషం కక్కిండు. జాతి విద్వేషాలను రెచ్చగొట్టి నల్లజాతీయుల ఉనికికే ప్రమాదం తెచ్చిండు. తమ పరిశ్రమలు విదేశాలకు తరిలిపోవడం ద్వారా లబ్ధిపొందిన ప్రపంచ పెట్టుబడిదారులను వదిలేసి పేదదేశాల మీద నిందలు మోపిండు. ఒకవైపు తన వ్యక్తిగత ఆర్థిక, రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా రష్యాకు మద్దతునిస్తూ, మరోవైపు చైనాతో కయ్యం పెట్టుకున్నడు. వీటన్నింటిని నమ్మిన దిగువ మధ్యతరగతి, రైతులు, గ్రామీణ ప్రజలు, మతమౌఢ్యులు అందరూ కలిసి ట్రంప్ ను గద్దె ఎక్కించిండ్రు.

అధ్యక్ష పదవి మొదలయినప్పటి నుండే ట్రంప్ డ్రామా మొదలయ్యింది. పాలనలో ఒక శాత్రీయత కాని, ప్రజాస్వామికత కాని, నైతికత కాని ఏవీ లేవు. కనీస రాజకీయ విలువలు కూడా లేవు. ఇవి ఏవీ లేక పోయినా ఒబామా, బైడెన్ల మాదిరిగా యుద్ధాలు చేయకపోగా అప్పటికే జరుగుతున్న యుద్ధాల స్థాయిని, తద్వారా ఖర్చును తగ్గించాడు. వలసచట్టాలను పటిష్టం చేసి కొత్తగా వచ్చే వలసలను కొంతవరకు తగ్గించిండు. చైనా మీద వ్యాపార ఆంక్షలు విధించి, దిగుమతి సుంకాలు పెంచిండు. దేశీయ పరిశ్రమలకు టాక్స్ తగ్గించడమే కాకుండా వాటి మీద ప్రభుత్వ నియంత్రణను సడలించిండు. దాని ద్వారా పరిశ్రమలకు లాభాలు, ఉద్యోగులకు వేతనాలు పెరుగుతాయని ప్రకటించిండు. ఇవన్ని చేస్తూనే విదేశీ మార్కెట్ పోటీని తన గడ్డ మీద తగ్గించడం కోసం G7, G20 వంటి సామ్రాజ్యవాద కూటములకు అమెరికా చేసే సహకారాన్ని చాలా కుదించాడు. దేశంలోకి వచ్చే, పోయే పెట్టుబడులను క్రమబద్ధీకరించడానికి దాదాపు 15000 అమెరికన్ కంపెనీలను పర్యవేక్షించే పని మొదలుపెట్టాడు. ఈ పనుల మూలంగా దేశీయ పెట్టుబడికి కొంత మేలు జరిగినా గ్లోబల్ పెట్టుబడి స్వేచ్ఛకు ఇబ్బందులు తలెత్తినవి.

వీటికి తోడు ట్రంప్ కు ఎలాంటి నికరమైన రాజనీతి లేదు కాబట్టి అతను ఎప్పుడు ఏం చేస్తడో అనేది ద్రవ్యపెట్టుబడి స్వేఛ్ఛకు, షేర్ మార్కెట్ వ్యవహారాలకు ఇబ్బందిగా మారినవి. దీనితో అమెరికా ఆర్థిక స్థితిగతులను నిర్ణయించే వాల్ స్ట్రీట్ ట్రంప్ కు దూరం కావడం మొదలుబెట్టింది. అందుకే ఆ బడా పెట్టుబడుదారులు చరిత్రలో ఏ అధ్యక్ష పోటీదారుడికి ఇవ్వనంత డొనేషన్లను బైడన్ కు ఇచ్చారు. తమ చేతుల్లో వున్న అన్ని అతి పెద్ద మీడియా సంస్థలను ట్రంప్ కు వ్యతిరేకంగా నడిపించారు. వీటన్నింటిని మించి నల్లజాతీయుల మీద ఎక్కువైన హింస, హత్యల మూలంగా వాళ్ళు ట్రంప్ ఓటమే పనిగా పెట్టుకున్నారు. లాటిన్ అమెరికా నుండి వచ్చిన వారికి వీసాలు సరిగ్గా లేవని లక్షలాది మందిని అమెరికన్ సరిహద్దు అవతలకు విసిరివేశాడు. తల్లితండ్రులను, పిల్లలను విడదీసి ఎన్నో కుటుంబాలను ధ్వంసం చేశాడు. దానితో లాటిన్లు పగపట్టారు. అంతలోనే కరోనా వచ్చి ట్రంప్ ఎంతటి అహేతుకవాదో, పరిపాలనా అసమర్థుడో, మూర్ఖుడో మొత్తం సమాజానికి బట్టబయలు చేసింది.

అయితే ఇంత అమానవీయ పనులు చేస్తున్నా తాను నమ్ముకున్న ఓటర్ల బేస్ మాత్రం ఏమీ మారలేదు. వాళ్ళకు తోడు “Hindus for Trump” అనే హిందుత్వ సంస్థలు కూడా బహిరంగంగా మద్దతు ప్రకటించాయి. అందుకే దేశంలో పోలైన ఓట్లలో 42.3 శాతం ట్రంప్ కే వచ్చాయి. ట్రంప్ కంటే బైడన్ కు కేవలం 40 లక్షల ఓట్లే ఎక్కువ వచ్చాయి. అంటే అమెరికన్ సమాజంలో ఇంకా జాత్యహంకారాన్ని, అశాస్త్రీయతను, అమానవీయతను సమర్తించే ప్రజలు దాదాపు సగం వున్నారు. 2000 సంవత్సరంలో బుష్ కు ఐదున్నర కోట్ల మంది ఓట్లేసి గెలిపిస్తే బ్రిటిష్ మీడియా “అమెరికాలో అంత మంది బుద్ధిహీనులు ఉన్నారా?” అని పెద్ద పెద్ద హెడ్డింగ్స్ పెట్టి రాసింది. ఇరవై ఏండ్లలో ఆ బుద్ధిహీనత ఏడున్నర కోట్లకు పెరిగింది. ట్రంప్ ఓడిపోయినా ఆ ఏడున్నర కోట్ల మంది ప్రపంచమంతా గొప్పలు చెప్పుకునే అమెరికన్ అభివృద్ధిని, ప్రజాస్వామ్యాన్ని, ఉదారవాదాన్ని ఎగతాళి చేస్తూనే వుంటారు.

అయితే ఇది కేవలం ట్రంప్ మూలంగా మాత్రమే జరిగింది కాదు. చారిత్రకంగా ప్రపంచం మొత్తాన్ని కబలించివేసే వైరస్ గా మారిన అమెరికన్ సామ్రాజ్యవాదం తన సమాజంలో అట్టడుగు వర్గాలను అరాచక శక్తుల, రాజకీయ మూర్ఖుల చేతుల్లోకి పోయే విధంగా చేసింది. అయితే ట్రంప్ ప్రపంచానికి చేసిన మేలొకటుంది. అదేమంటే రాజమందిర (White House) వ్యవహారాలను నగ్నంగా నడి రోడ్డులో నడిపి అమెరికన్ అధ్యక్ష పదవికే “కొత్త వన్నె” తెచ్చిండు. అసత్యాలను, అబద్ధాలను అధికార భాష చేసి ప్రపంచ సమాజానికి అమెరికా మీద ఉండే భ్రమలు తొలిగించిండు.

అయితే బైడెన్ గెలుపుతో కేరింతలు కొట్టేవాళ్ళు గుర్తు పెట్టుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. మాల్కం ఎక్స్ ఎప్పుడో చెప్పినట్లు దయ్యం విడిచిపెట్టి పోయి దైవదూత ఏమి రాలేదు. “యుద్ధం వద్దు, శాంతే ముద్దు” అంటూ శాంతి ప్రవచనాలు పలుకుతూ వచ్చిన ఒబామా-బైడెన్లు బుష్ మొదలు పెట్టిన యుద్ధాలను (ఇరాక్, అఫ్గనిస్తాన్ లలో) మరింత ఉధృతం చేశారు. అంతేకాదు కొత్త యుద్ధాలు మొదలుబెట్టి లిబియా, సిరియాలను పూర్తిగా నాశనం చేశారు. ఈ యుద్ధాల ద్వారా డ్రోన్ లతో చేసే దాడులను మామూలు విషయంగా చేసిండ్రు. ట్రంప్ లాటిన్ అమెరిక్ వసలదారులను వెనక్కి పంపుతున్నాడని అవేశపడుతున్నామే కాని ఒబామా-బైడెన్ కాలంలోనే ఇరవై లక్షల మందిని సరిహద్దులు దాటించారు. అంతేకాదు బుష్ కూడా ఇవ్వనన్ని రాయితీలు బ్యాంకులకు, బడా పెట్టుబడి వర్గాలకు వీళ్ళ కాలంలో ఇచ్చారు. నిజానికి తెల్ల జాతి పోలీస్ ఆఫీసర్ గొంతు మీద కాలుబెట్టి నలిపేస్తుంటే నల్లజాతి యువకుడు “ఊపిరాడటం లేదని” చేసిన ఆర్తనాదం ఒబామా-బైడెన్ కాలంలోనే మొదలయ్యింది. Black Lives Matter ఉద్యమం మొదలయ్యింది కూడా అప్పుడే.

మొన్నటి వరకు ఒక పెట్టుబడిదారుడే (state of capitalist) స్వయంగా అధికారాన్ని కొనసాగించాడు. ఇక రేపటి నుండి సామ్రాజ్యవాద పెట్టుబడి ఏజెంట్ (state of capital) పరిపాలన కొనసాగిస్తాడు. మొదటివాడు అమెరికాకు ప్రమాదం, రెండోవాడు ప్రపంచానికే ప్రమాదం. ఇప్పుడు బైడెన్ ఇస్తున్న నినాదం: “అమెరికా ఫస్ట్.” దేశీయంగా వున్న సమస్యలను చక్కబెట్టి మళ్ళీ ప్రపంచంలో అమెరికా రాజకీయ, ఆర్థిక, మిలిటరీ ఆధిపత్యాన్ని పునరుద్ధరించే పనికి సిద్ధమవుతున్నాడు. అమెరికన్ సామ్రాజ్యవాద చరిత్ర తెలిసిన ఎవ్వరైనా బైడెన్ విజయాన్ని ఎలా ఆహ్వానిస్తారు!?

పుట్టింది చారకొండ (పాలమూరు). పెరిగింది అజ్మాపూర్ (నల్లగొండ). సామాజిక శాస్త్ర విద్యార్థి, ప్రజా ఉద్యమాల మిత్రుడు. అమెరికాలో అధ్యాపకుడిగా, పరిశోధకుడిగా పనిచేస్తున్నాడు.

2 thoughts on “అమెరికా ఎన్నికల్లో బొమ్మ బొరుసు

  1. America first is not Biden slogan sir —all presidents slogan -agenda
    Biden —honest —trustworthy politician -more experience leader .good for the country

Leave a Reply