అప్పుడే బాగుంది…

అప్పుడే బాగుంది
తెలిసీ తెలియక అమాయకంగా ఉన్నప్పుడే బాగుంది
నాలాగే అందరూ ఉండి ఉంటారు అని అనుకున్న
తెలియని తనం ఉన్నప్పుడే బాగుంది
మనుషుల్లో కొందరు కిందకి
అడుగున తొక్కి వేయబడ్డారు అని
తెలియనపుడే బాగుంది
మతం, దాని తో పాటు పుట్టిన కులం,
మతం మారినా పోదని తెలియనప్పుడే బాగుంది
దేవుడు, మతం పేరు చెప్పి
మనిషిని చంపగలిగే మనుషులు ఉన్నారని తెలియనప్పుడు,
అప్పుడే బాగుంది
దేవుడు ఉన్నాడని
వాడేదో ఖర్మకి తగ్గ న్యాయం చేస్తాడని అనుకున్న అజ్ఞానమే బాగుంది
ఏదైనా అన్యాయం జరిగితే
న్యాయం చేయటానికి
గొప్ప న్యాయ వ్యవస్థ ఉందని నమ్మే
అమాయకత్వమే బాగుంది
గొప్ప రాతలు పాటలు రాసే వాళ్లు,
గొప్ప సినిమాలు తీసే వాళ్లు
గొప్ప వాళ్ళని అనుకునే అప్పటి అమాయకపు మూర్ఖత్వమే బాగుంది
నేను ఉన్న, పుట్టి పెరిగిన స్థితి
ఓ ప్రివిలేజ్డ్ అని గ్రహించ నపుడు,
హా… అవును అప్పుడే బాగుంది.
ఇప్పుడు…
నాతో పెరిగిన వాళ్ళే నా చుట్టూ ఉన్న వాళ్ళే
ద్వేషం మనసు నిండా నింపుకొని ఉన్నారని,
తొక్కేయబడ్డ మనుషులు పైకి రావాలని
అలుపెరుగని ప్రయత్నం చేస్తున్నారని,
కులంతో పాటు అటించిన అంటరాని తనం
మతం మారినా పోదని,
మతం పేరు చెప్పి మనిషిని చంపటం అనేది
పుణ్య కార్యంగా చూస్తున్నారని,
పసి బిడ్డను అత్యాచారం నుండి కాపాడలేని దేవుడు
ఏ న్యాయమూ చేయలేడని,
వాడు రాడనీ, అసలు లేనే లేడని,
న్యాయం దక్కటానికి డబ్బు పరపతి ముఖ్యం అనీ,
చాలా మంది మనుషులకి
వాళ్ళ కున్న కళ లకి, వాళ్ళకి
మధ్య పొంతన లేకపోవటం అనేది సత్యం అనీ,
నేను ప్రివిలెజ్డ్ స్థితిలో బతుకుతున్న అనీ,
పీడితులు అనే ఓ వర్గం ఉంటుందనీ,
వాళ్లు అప్పుడూ ఇప్పుడూ అంతటా
ఇంకా అట్లాగే ఉన్నారని,
ఇప్పుడు తెలియటం కష్టంగా ఉంది
పీడితుల కోసం, పీడితుల పక్షాన ఉండే వాళ్ళ కోసం
నేనూ ఏదో చేయాలి అనిపిస్తున్న ఈ క్షణం,
ఏం చేయలేక, ఏదో నొప్పిలా(?! )ఉంది .
అవును అప్పుడే బాగుంది…
ఇప్పుడు పీడితులకి ఏం చేయలేక
ఏం మార్చలేక పోతున్న నా నిస్సహాయ స్థితికి
వేదనే మిగిలింది
అవును అప్పుడే బాగుంది.

Leave a Reply