అపరాజితులు

గాయపడడమంటే
శరీరానికి దెబ్బ తగిలి
నాలుగు నెత్తుటి చుక్కలు
నేల రాలడం కాదు –
ప్రమాదంలో చెల్లాచెదురుగా పడిన మృతదేహాల్లా
బతుకుదెరువుల వలసల్లో
దిక్కుకొకరుగా విసిరేయబడడం –

బతుకుమూటను భుజానికెత్తుకొని
పొట్టకూటికోసం బయలుదేరిన
సంచారజీవులు
నీటిచుక్క కోసం ఇసుక తిన్నెలవెంట సాగే
ఎడారి ఒంటెలా
పూట గడవడం కోసం
గారడీని నమ్ముకొని
ఊరూరా తిరిగే దొమ్మరోళ్ళు –

ఎదుటివాడి మెప్పుకోసం
కొందరు చేసే నానా విన్యాసాలకన్నా
గుప్పెడుమెతుకులకోసం
చౌరస్తాలో నిలబడి
వారుచేసే సాహసాలు చాలా గొప్పవి –

ఆకలి దప్పులు లేకుండాచేసే
విశ్వామిత్రుడి విద్యలు
ముద్దకోసం పోరాడుతున్న
వారికి తెలిసుంటే ఎంత బాగుండేది –

జానెడు పొట్టను నింపుకోడానికి
పట్టుకోల్పోకుండా తీగమీద నడుస్తున్న
పసిపాపను చూస్తే
ఎంతటి వారికైనా సరే
పాప పాదాలకు ప్రాణమిల్లాలనిపిస్తుంది –

జీవం కోల్పోతున్న దేహంలో
జవసత్వాలు నింపడానికి
తనువంతా ఇనుపచట్రంలో ఇరికించి
బయటకుతీసే మహావిద్యముందు
చతుష్షష్టీ కళలన్నీ మోకరిల్లాల్సిందే –

నిత్యం ఆకలి మంటలు
కడుపులో నిప్పుల కొలిమిని రగిలిస్తుంటే
అగ్గితో చెలగాటమాడటం
వారికి పెద్దకష్టమేమీ కాదు –

ప్రాణాల్ని ఫణంగా పెట్టి సాహసాలు చేస్తే
శవయాత్రలో చల్లే చిల్లరపైసల్లా
పావలా, అర్దలు విసిరేసి వెళతారు
దర్జాగాళ్ళు –

తట్టలో పడిన చిల్లర నాణేలను
తనివితీరా చూసుకొని
మరోచోట బతుకాటకు సిద్ధమౌతారు –
అప్పటిదాకా భగభగా మండిన భానుడు
ఆ రోజు కూడా ఎప్పటిలానే
వారిముందు పరాజితుడై
పడమటి కొండల్లో నిష్క్రమిస్తాడు..!

జననం: కోవెలకుంట్ల, కర్నూల్ జిల్లా. ప్రభుత్వ ఉపాధ్యాయుడు, కవి. రచనలు: శిథిల చిత్రాల జాతర (వచన కవితా సంపుటి : 2013). బనగానపల్లె ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు.

3 thoughts on “అపరాజితులు

  1. ఆకలి దప్పులు లేకుండాచేసే
    విశ్వామిత్రుడి విద్యలు
    ముద్దకోసం పోరాడుతున్న
    వారికి తెలిసుంటే ఎంత బాగుండేది……

    చాల బాగా రాశారు….

  2. నా చిన్నపుడు ఇవి చూసి ఆనందించాను . ఇప్పడు ఆ బతుకు పోరాటం చూడ లేని పరిస్థితి మనం కవిత ల తో ఆగి పోకూడదు . 

Leave a Reply