అన్నీ తప్పుడు కేసులే

కేపీ శశి లాంటి అరుదైన వ్యక్తిత్వం గల వ్యక్తుల గురించి తెలుసుకోవాల్సిన సందర్భం ముందుకు వచ్చిందిప్పుడు. కేరళకు చెందిన కేపీ శశి గత 2022 డిశంబర్ 25న మరణించారు. ఆయన ఫిల్మ్ మేకర్ అయినప్పటికి, సినిమాలు తీయటం కంటే -అట్టడుగు ప్రజల ప్రతిఘటనా పోరాటాలకు సృజనాత్మక మద్దతునివ్వడం ముఖ్యమని భావించారు. ఆ పోరాటాల నుండే తనకు గొప్ప శక్తి వస్తుందని చెప్పారు. ఆ ప్రతిఘటనా సమూహాల్లో ముస్లిములు, ఆదివాసులు, దళితులు, క్రిస్టియన్లు, పల్లెకారులు ఉన్నారు. ఎక్కడ ఉనికి కోసం పోరాటాలు జరుగుతున్నాయో ఆయన అక్కడకు వెళ్లి కూర్చోనేవారు. ఎక్కడ బాధ, అక్రమ నిర్బంధం, హింసా ఉంటాయో ఆ బాధితుల పక్షాన నిలబడ్డారు.

ఆయన ‘అబ్దుల్ నాసర్ మదనీ’ గురించి తీసిన డాక్యుమెంటరీని చాలా తక్కువమంది చూసి ఉంటారు. 2014లో నిర్మించిన ‘Fabricated’ పేరు గల ఈ డాక్యుమెంటరీ తీయటానికీ, విడుదల చేయటానికీ ఇప్పుడైతే సాధ్య పడదు. అబ్దుల్ నాసర్ మదనీ కథ అంటే అది భారతదేశం బహుళ మత, జాతుల, భాషల సమ్మేళనా రూపం నుండి ఏక శిలా సదృశ్యంగా మారబోతున్న దశ గురించిన కథే. అందుకే తీసి 9 ఏళ్లు అయినా ఈ డాక్యుమెంటరీ సార్వజనీనత కోల్పోలేదు. కేపీ శశి దార్శనికతకూ, విశాల దృక్పథానికి అద్దం పట్టే డాక్యుమెంటరీ ఇది. పీపుల్ డెమక్రటిక్ పార్టీ (PDP) నాయకుడైన అబ్దుల్ నాసర్ మదని జీవిత చరిత్ర గురించి డాక్యుమెంట్ చేస్తూ కేపీ శశి భారత చట్టాలు, వాటి ప్రయోగం, రాజ్యాంగ వ్యవస్థల గురించిన లోతైన చర్చ చేశారు. ఉగ్రవాదం, రెచ్చగొట్టే ఉపన్యాసాలు లాంటి పదాల నిర్వచనం ఈ ప్రజాస్వామిక దేశంలో సమూహానికీ, సమూహానికీ మధ్య ఎలా మారుతుందో అనే విషయం మీద చర్చ చేశారు.

అబ్దుల్ నాసర్ మదని కేరళకు చెందిన ఇస్లామిక్ స్కాలర్. ఆయన 1989లో ఇస్లామిక్ సేవా సంఘ్ (ISS)ను ఆయన స్థాపించారు. బాబ్రీ మసీదు కూల్చివేత తరువాత ఆయన జీవితం మారిపోయింది. ISS మీద నిషేధం విధించారు. తరువాత ఆయన పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీని స్థాపించి ఇప్పటివరకు దానికి చైర్మన్ గానే ఉన్నారు.

ప్రస్తుతం ఆయన బెయిల్ మీద బెంగళూరులో ఉన్నారు. ఆయన మొదటి అరెస్టు 1998లో కోయంబత్తూరు బాంబు పేలుళ్ల తరువాత జరిగింది. ఆయన ఆ కేసులో తొమ్మిదిన్నర సంవత్సరాలు జైల్లో ఉన్నారు. ఆ కేసులో ఎలాంటి ఆధారాలు దొరకక 2008లో ఆయనను విడుదల చేశారు. అదే సంవత్సరం జరిగిన బెంగళూరు వరుస పేలుళ్ల కేసులో ఆయనను మళ్లీ 2010లో అరెస్టు చేశారు. అప్పటి నుండి ఆయన కర్ణాటక ప్రభుత్వ నిర్బంధంలోనే ఉన్నారు. ‘సేవ్ అబ్దుల్ నాసర్ మదనీ’ ప్రచారం 2014 నుండి ప్రారంభం అయింది. ఈ ఏప్రిల్ లో ఆయనకు బెంగుళూరు దాటకూడదన్న షరతుతో అపెక్స్ కోర్టు బెయిలు ఇచ్చింది.

విశిష్టమైన అబ్దుల్ నాసర్ మదని జీవితం గురించి సవివరంగా తన ఫిల్మ్ లో డాక్యుమెంట్ చేశారు కేపీ శశి. కేరళ రాష్ట్రంలోనూ, బయటా ఉన్న వ్యక్తులు ఆయన జీవిత విశేషాల గురించి మాట్లాడారు. ఎలాంటి నేరం చేయకుండా, కేవలం బ్రాహ్మణీయ హిందూ రాజ్యం విషయంగా విమర్శనాత్మకంగా ఉన్నందుకు ఆయన దాదాపు 22 సంవత్సరాలుగా నిర్బంధంలో ఉన్నారు. భారతదేశంలోనే అత్యంత దీర్ఘకాల విచారణా ఖైదీ ఆయనే.

న్యాయం కోసం ఏళ్ల తరబడి జైళ్లలో ఎదురు చూస్తున్న వారికి అంకితం అంటూ ఈ డాక్యుమెంటరీ ప్రారంభం అవుతుంది. కదిలే నీళ్లను, ఎగిరే పక్షులనూ చూపిస్తూ ‘అల్లా హో అక్బర్ అల్లా’ అనే శ్రావ్యమైన గొంతుకతో అజా వినిపించి, వెనువెంటనే పోలీసులు మదనీ ప్రార్థన చేస్తున్న మసీదుకు అతన్ని అరెస్టు చేయటానికి రావటం చూపిస్తారు. ఈ దేశంలో నాలుగున్నర శతాబ్దాల పాటు ప్రశాంత ఆధ్యాత్మిక జీవితాన్ని గడిపి; శాంతిని, సహోదరత్వాన్ని పంచిన ఇస్లాంను ఆచరించిన ముస్లిం సమూహాన్ని అల్లకల్లోలం చేసిన కుట్ర నుండి అబ్దుల్ నాసర్ మదని కథ మొదలైయ్యిందని ఈ సన్నివేశం సూచిస్తుంది.

అబ్దుల్ నాసర్ మదనీ జీవితంలో మైలురాయి బాబ్రీ మసీదు కూల్చివేత. మసీదు ధ్వంసం కాగానే అద్వానీ మొదట తప్పు జరిగిందని అన్నాడు. కొద్ది రోజులకు కొన్ని తప్పవు అన్నాడు. ఒక సంవత్సరం గడవగానే బాబ్రీ మసీదు కూల్చివేత విజయోత్సవ సంబరాలు జరిపాడు. ఈ సంవత్సర కాలాన్ని ఈ కూల్చివేత పట్ల ప్రజల ఆమోదాన్ని నిర్మించుకోవటానికి ఉపయోగించుకున్నాయి హిందుత్వ శక్తులు. బాబ్రీ మసీదు శిథిలాల నుండి తమ హిందుత్వ ఊడలను దించుకున్నారు. అయితే కూల్చివేతను ఎప్పటికీ ఆమోదించని కొందరు వ్యక్తులు, సమూహాలు మెజారిటేరియిజాన్నే ప్రజాస్వామ్యంగా ముందుకు తెస్తున్న పాలకులకు సవాలుగా ఉన్నారు. వాళ్లలో అబ్దుల్ నాసర్ మదనీ ఒకరు.

అరెస్టుకు ముందు ఆయన తన చుట్టూ చేరిన సహచరులతో ‘ఇది ఒక మత సంస్థ, ఒక అనాథ శరణాలయం. ఇక్కడ మీరు ఎలాంటి అల్లర్లు చేయవద్దని’ మదనీ చెబుతారు. ‘చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా నేను చెబుతున్నదేమిటంటే మీరు ఎలాంటి పరిస్థితుల్లో క్రమశిక్షణ తప్పవద్దు’ అని చెబుతూ చట్టం మీదా, న్యాయస్థానాల మీదా అత్యంత గౌరవంతో పోలీసుల వెంట వెళ్లిన అబ్దుల్ మదని కొంత విరామంతో 25 సంవత్సరాల పాటు నేర రుజువు లేకుండా జైల్లో ఉండిపోయిన వాస్తవం నుండి -ఈ వ్యవస్థలన్నీ విఫలమయ్యాయనే విషాదకరమైన సారాంశం ఈ డాక్యుమెంటరీ ద్వారా మనకు అందుతుంది. అదే సమయంలో మదనీ వ్యక్తిత్వం మనకు గొప్ప ప్రేరణనిస్తుంది. శక్తివంతమైన ఆయన ఉపన్యాసాలు, అద్భుతంగా ప్రజలను కూడగట్టే ఆయన నైపుణ్యాలు, తోటి మానవుల పట్ల ఆయనకున్న కారుణ్య కనికరాలు ఆయనకు శత్రువులయ్యాయని అర్థం అవుతుంది. ప్రమాదకర వ్యక్తిగా ముద్ర వేసి అంతటి ప్రజ్వలమైన చైతన్యాన్ని, మూర్తివంతమైన జ్ఞానాన్ని జైల్లో బంధించారు. 25 సంవత్సరాల ఆయన విలువైన జీవితకాలం అంధకారంలో మగ్గిపోయింది. ఇంతా చేసి ఇప్పటివరకూ ఆయన మీద చేసిన ఆరోపణలలో ఒక్కటి కూడా రుజువు చేయలేక పోయారు.

చదువులో చురుగ్గా ఉంటూ, తాలూకా స్థాయిలో మొదటివాడుగా వచ్చి కలెక్టర్ నుండి బహుమానం అందుకున్న అబ్దుల్ మదని అందరి కుర్రవాళ్లవంటివాడే. విస్తృతంగా చదవటం వలన మదనీ యాక్టివిజం వైపు వెళ్లాడని అతని తండ్రి చెప్పారు. 15 సంవత్సరాల వయసు నుండే ఆయన అధ్యయనం మొదలయ్యింది. స్కూలు పుస్తకాలే కాకుండా ఇతర పుస్తకాలు కూడా ఎక్కువగా చదివేవాడు. అప్పుడు సంతోషపడ్డ తల్లిదండ్రులు, ఆ పుస్తకాలే అతన్ని ప్రమాదంలో పడవేసాయని ఇప్పుడు భావిస్తున్నారు. 1966లో పుట్టిన ఆయనకు 25 సంవత్సరాల వయసు వచ్చేనాటికి బాబ్రీ మసీదు ఘటన జరిగింది.

బాబ్రీ మసీదు కూల్చివేత తరువాత లౌకికవాద రూపం నుండి జారిపోతున్న భారతదేశ అంతర్గత స్వభావం యవ్వనంలో ఉన్న అనేకమంది ముస్లిం యువకులను ఏదో విధంగా ప్రభావితం చేసింది. అబ్దుల్ మదనిని జీవితంలో కూడా పెనుమార్పు జరిగింది. అన్యాయాన్ని సహించని వయసు ఎదురు తిరిగేలాగా చేసింది. సహజమైన వాక్చాతుర్యం, నలుగురిని ఆకట్టుకోగలిగిన వ్యక్తిత్వం ఆయన చుట్టూ పదిమందిని చేరేలా చేశాయి. ఆయనను నాయకుడిని చేశాయి. దాని ఫలితాన్ని ఆయన అనుభవించాల్సి వచ్చింది. బాబ్రీ మసీదు ధ్వంసం తరువాత ఆయన మీద జరిగిన బాంబు దాడిలో ఒక కాలు పోయింది. ఆ కుటుంబాన్ని సొంత ఇంటి నుండి తరిమేశారు. కృతిమకాలు ఉన్న అబ్దుల్ మదనినీ ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకొన్నది అతని భార్య సూఫీయా. కాలు పోయిన ఏడాదికి వాళ్ల పెళ్లి జరిగింది. వాళ్లకు ముగ్గురు పిల్లలు.

ఈ డాక్యుమెంటరీలో మదనీ గురించి మాట్లాడిన ఆయన సహచరులు, ఇతర మేధావులు, యాక్టివిస్టులు ఆయన కారాగారవాసానికి కారణమైన మారిన భారతీయ రాజకీయ ముఖచిత్రం గురించి మాట్లాడారు. అబ్దుల్ నాసర్ గురించి బాగా తెలిసిన జర్నలిస్టు, యాక్టివిస్టు, రచయిత అయిన బీఆర్పీ భాస్కర్, రచయిత కుంజహమ్మద్ , మానవ హక్కుల కార్యకర్త జీయార్ డబ్ల్యూ వాసు, సివిక్ చంద్రన్ లు ఆయన జైలుకు వెళ్లటానికి గల కారణాలు భారత రాజకీయ వ్యవస్థలో ఉన్నాయని చెప్పారు. రామజన్మ భూమి పేరుతో అయోధ్య పూజకు రాళ్లు మోసుకెళ్లిన కాలం కేరళలో కూడా చాలా సామాజిక మార్పులను తీసుకొని వచ్చిందనీ, అప్పుడే అబ్దుల్ నాసర్ మదని రంగం మీదకు వచ్చాడనీ చెప్పారు. బాబ్రీ మసీదు ఘటనకు ముందే ఆయన గొప్ప వక్తగా అందరికీ తెలిసినప్పటికీ ఆ ఘటన తరువాత ఆయన ఒక గొప్ప నాయకుడిగా ముందుకు వచ్చారని అభిప్రాయ పడ్డారు. ఆ ఘటన జరిగిన తక్షణమే ఆయన ఒక 500 మందిని కూడగట్టి ఊరేగింపు చేయగలిగారని అన్నారు. బాబ్రీ మసీదు కూల్చివేతకు హిందూ పార్టీలన్నిటి మద్దతు ఉందనీ, సైన్యం కూడా ఈ కూల్చివేతని ఆపలేకపోయిందని అన్నారు. ఈ ఘటన తరువాత అబ్దుల్ నాసర్ మదనీ భారతదేశంలో ఉన్న బ్రాహ్మణ పార్టీలకు తలనొప్పి అయ్యాడని అన్నారు.

సినిమా దర్శకుడు కమల్ మాట్లాడుతూ బాబ్రీ మసీదు ఘటన భారతీయుల మనస్తత్వంలో మార్పు తెచ్చిందనీ, ముస్లిములను వేరుగా చూడటం మొదలయ్యిందన్నారు. ఈ మార్పు గురించి వదలకుండా మాట్లాడిన అబ్దుల్ నాసర్ మదనీని టెర్రరిస్టుగా ముద్ర వేశారని ఆయన చెప్పారు.

అప్పుడే అతని మీద బాంబు దాడి జరిగింది. మొదట అతన్ని జైలులో పెట్టటం కంటే నిర్మూలించటం మంచిదనుకొన్నారు. కానీ గాయాలతో అతను బయట పడ్డారు. తన మీద మూడు బాంబులు వేసి ఒక కాలుని మాత్రమే పోగొట్టారని ఒక సభలో అబ్దుల్ నాసర్ చెప్పారు. మదనీ ఆర్ ఎస్ ఎస్ బాధితుడనీ, అసలైన టెర్రరిస్టులు వాళ్లేనని మానవ హక్కుల కార్యకర్త జీయార్ డబ్ల్యూ వాసు ఎలాంటి మొహమాటం లేకుండా చెప్పారు. బాంబు దాడి జరిగిన తరువాత ఒక కాలితో ఆయన నడుచుకుంటూ వచ్చారని అన్నారు. బాంబు దాడి చేసిన వారికి ఎవరికీ ఇప్పటికీ శిక్షలు పడలేదు. వాళ్లను మదనీ క్షమించారు. వాళ్లకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పటానికి వెళ్లని మదనీని తరువాత ఉగ్రవాదిగా ప్రచారం చేశారు.

ముస్లిములను టార్గెట్ చేస్తున్న జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్ర సందర్భాలలో మదనీ మత బోధకుల ఇస్లాంతో సంతృప్తి పడక, రాడికల్ ఇస్లాం పాత్ర ప్రాముఖ్యతను గుర్తించారు. ప్రజాస్వామ్య పునరుద్ధరణకు మైనారిటీలు, దళితులు, ఆదివాసుల ఐక్యత అవసరమనే సుదూర ఆలోచనతో ఆయన రాజకీయ దృక్పథం స్థిరపడింది. ‘అణగారిన కులాలకు అధికారం, పీడిత సమూహాలకు విముక్తి’ అనే నినాదాన్ని ఆయన ముందుకు తెచ్చారు. అప్పటి వరకూ ఏ రాజకీయ పార్టీ ఆ నినాదాన్ని ఇవ్వలేదు. ఆ నినాదం కుర్చీలో కూర్చొన్నవారికి చెమటలు పట్టించింది. దానికి ముందు కూడా కేరళలో నారాయణ గురు, అయ్యంకాళి లాంటి సామాజిక సంస్కర్తలు నిర్వహించిన అనేక దళిత ఉద్యమాలు జరిగినప్పటీ ఇంత సూటి నినాదం ముందుకు ఎవరూ తీసుకొని రాలేదని రచయితా, సామాజిక విమర్శకుడు సికె అబ్దుల్ అజీజ్ అన్నారు.

అబ్దుల్ నాసర్ మదనీ హాజరైన బహిరంగ సభలో ఇచ్చిన సమ్మోహ పరిచే ఉపన్యాసాలలో ఈ విషయాల గురించి మాట్లాడారు. ఆయన ఉపన్యాసాలు సూటిగా, ఆయన మాటలు ఎలాంటి రాజీ లేకుండా ఉండేవి. కంగుమనే గొంతుతో ఆయన మాట్లాడే మాటలను వినటానికి వేలాది ప్రజలు హాజరు అయ్యేవాళ్లు. కేరళలో ఎంతమంది సంస్కర్తలు పని చేసినా దళితులు సాంస్కృతికంగా, సామాజికంగా, ఆర్థికంగా వెలివేతకు గురి అయ్యారని అన్నారు. తానొక నిబద్దత కలిగిన ముస్లింననీ, ప్రతి ముస్లింకూ పేద ప్రజలను ఆదుకోవాల్సిన కర్తవ్యం ఉంటుందని ఆయన తన ఉపన్యాసాల్లో అనేవారు. ఈ దేశంలో దళితులకు, పేదలను స్వాతంత్ర్యం రాలేదని తెగేసి చెప్పారు. చెప్పటమే కాదు, మొదటిసారిగా 80 శాతం కంటే ఎక్కువ ముస్లిములు ఉన్న నియోజకవర్గంలో దళిత అభ్యర్థిని నిలబెట్టిన దళిత ఉద్యమం పీడీపీ. ఆ అభ్యర్థి తరువాత పంచాయితీ ప్రెసిడెంట్ అయ్యారు.

కేరళలో ఇప్పటికీ పరిష్కరించని ఆదివాసీ భూముల సమస్య మీద సికె జాను నిరాహారదీక్షకు కూర్చొన్నపుడు, ఆమెకు సహాయం చేయాలని కోళికోడ్ ప్రాంతంలో పని చేస్తున్న కొన్ని సంఘాలు భావించాయి. వాళ్లు అబ్దుల్ నాసర్ మదనీని కలిశారు. ఆయన ఆదివాసుల సమస్య అంటే అది అత్యంత అణచివేయబడిన వారి సమస్య అని వ్యాఖ్యానించారు. వాళ్లు పేదల్లో అత్యంత నిరుపేదలని ఆయన అభిప్రాయం. ఆదివాసీ స్త్రీలు ఈ దేశంలో అత్యంత పీడితులని అన్నారు. వాళ్ల సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాముఖ్యత ఇవ్వాలని ఆయన అన్నారు. చెంగర ఆదివాసీ ఉద్యమానికి మద్దతునిచ్చి ఆ సభల్లో ఆయన ఉపన్యసించారు.

ముత్తంగి పోరాటానికి నాయకత్వం వహించిన సికె జాను ఈ డాక్యుమెంటరీలో మాట్లాడుతూ ఆ పోరాటంలో 729 మంది ఆదివాసులు ఒక్కొక్కరి మీద 12 కేసులు పెట్టారని, అవన్నీ తప్పుడు కేసులని చెప్పారు. అలాంటి తప్పుడు కేసులు పెట్టటం కేరళలో అలవాటనీ, మదనీ మీద కూడా అలాంటి కేసులే పెట్టారని ఆమె అన్నారు.

ఆవేశపూరిత ఉపన్యాసాలు, త్రికరణశుద్ధి ఆచరణ ఫలితాలను మదనీ త్వరలోనే అనుభవించారు. మార్చి 21, 1998న ఆయనను కోయంబత్తూరు పేలుళ్ల కేసులో అరెస్టు చేశారు. ఈ అరెస్టు వెనకాల జయలలిత ఉన్నదని జీయార్ డబ్ల్యూ వాసు అభిప్రాయం. అప్పుడు కేంద్రంలో ఉన్న బ్రాహ్మణ బీజేపీ పార్టీ ఆమెకు సహకరించిందని అన్నారు.

2009 నవంబర్ లో ఆయన బెయిల్ పిటిషన్ హైకోర్టుకు చేరి, జస్టిస్ కృష్ణయ్యర్ లాంటి వాళ్లు రాసిన లేఖలతో, ఆయన బెయిలు అవకాశాలు పెరుగుతున్న సమయంలో ఆయనకు విడుదలకు పని చేస్తున్న ఆయన భార్య సూఫీయాను కేరళ, కాలంసేరి బస్సు పేలుడు కేసులో అరెస్టు చేశారు. అప్పుడే కేరళలో జరగబోతున్న స్థానిక ఎన్నికల్లో పీడీపీ కార్యకర్తలు ఇబ్బడిముబ్బడిగా పోటీ చేయబోతున్నారు. అదే సమయంలో బస్సు తగలబడటం యాదృచ్ఛికం కాదు. ఆ కుటుంబం తీవ్ర మానసిక వేదనను గురి అయింది.

ఆయన మీద కేసులన్నిటిని కొట్టేసి విడుదల చేశాక జరిగిన విడుదల సభ కొన్ని లక్షల మందితో జరిగింది. ఆ సభలో రాజకీయ నాయకులు కూడా పాల్గొన్నారు. గాయకుడు జేసుదాస్ పాటలు పాడారు. రాజకీయ నాయకులు ఆయనను ‘వీరుడని’ పొగిడారు. మీడియా ఎత్తేసింది. అదంతా తమ స్వప్రయోజనాల కోసమే అంటారు దర్శకులు కమల్. పీడీపీ పార్టీకి ఆనాడు ఉన్న ప్రతిష్ఠ అలాంటిది. వాళ్లిచ్చిన మద్దతు అంతా అబద్దమని త్వరలోనే తెలిసిపోయింది. 2010 ఆగస్టు 17న ఆయనను మళ్లీ బెంగుళూరు పేలుళ్ల కేసులో ఆయనను అరెస్టు చేయగానే హఠాత్తుగా మీడియా ఆయనను ఉగ్రవాదిగా మాట్లాడటం మొదలు పెట్టింది. బెంగళూరులో బాంబు పేలుళ్లు 2008లో ఆయన మొదటి సారి విడుదల అయిన కొత్తల్లో జరిగాయి.

బలహీనంగా, జబ్బుతో ఉన్న మనిషిని అరెస్టు చేయటానికి 4000 మంది పోలీసులు వచ్చారు. ఆ చెర నుండి ఇక ఆయన బయట పడలేకపోయారు. తానిక తిరిగి రాలేనని అనిపిస్తుందని ఆయన వెళుతూ చెప్పి పోయారు. ‘జస్టిస్ ఫర్ మదనీ ఫోరం’ లో పని చేస్తున్న భాసురేంద్ర బాబు మాట్లాడుతూ ‘బెంగళూరు పేలుళ్ల కేసులో మూడు చార్జి షీట్స్ వేశారు. మొదటి రెండిటిలో మదనీ లేరు. మూడో దాంట్లో ఆయనను ఇరికించారు. దేశద్రోహ నేరాలకు ఎలాంటి సాక్ష్యాలు లేకుండా, బెయిల్ రాకుండా ఏళ్ల తరబడి జైల్లో ఉంచవచ్చు. ఆ లొసుగును ఉపయోగించుకొని ఆయనను నిర్బంధించారు. తరువాత ఆయనకు వ్యతిరేకంగా తెచ్చిన ప్రవేశ పెట్టిన సాక్ష్యాలు, నేరారోపణలు అన్నీ తప్పుడువే’ అని చెప్పారు.

కేకే షాహీనా అనే మహిళా జర్నలిస్టు మదనీ కేసు మీద పాత్రికేయ పరిశోధనకు పూనుకున్నారు. ఆయనకు వ్యతిరేకంగా నిలబెట్టిన ఆరుగురు సాక్షులను ఆమె కలిశారు. వాళ్లలో ముగ్గురు కేరళకు చెందిన వారు. ఒకరు మదనీ ఉంటున్న ఇంటి యజమాని జోస్ వర్గీస్. కర్ణాటక పోలీసులు ఆయనను కేరళ పోలీస్ స్టేషన్ కు పిలిచి ఏ విషయం చెప్పకుండా కొన్ని కాగితాల మీద సంతకం పెట్టించుకొన్నారు. అవి కన్నడ భాషలో ఉండటానికి ఆయనకు అర్థం కాలేదు. అందులో తాను అబ్దుల్ నాసర్ మదనీ బెంగుళూరు పేలుళ్ల కేసు నేరారోపితులు (పోలీసులు వాళ్లని లష్కర్ తోయిబా యాక్టివిస్టులని అంటారు) టి. నసీరు, సర్పస్ నవాస్ లతో మాట్లాడుతుండగా చూశానని తరువాత వాళ్లు రాసుకున్నట్లు తెలిసింది. ఇంటి యజమాని తరువాత చాలా ఛానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నిజాన్ని చెప్పారు. ఆ స్టేట్ మెంట్ ను తప్పుడుగా తయారు చేశారని కూడా చెప్పారు. రెండో సాక్షి మదనీ సొంత తమ్ముడు జమాల్. ఆయనతో కూడా అలాంటి సంతకాలే పెట్టించుకొన్నారు. ఆయన కొల్లాం మేజిస్ట్రేట్ దగ్గరకు వెళ్లి తాను ఎలాంటి కాగితం మీదా సంతకం చేయలేదని అఫిడివిట్ సబ్‌మిట్ చేశారు. మూడో సాక్షిని కన్నూరులో విచారణ చేశామని పోలీసులు చెప్పారు. కానీ వాళ్లు స్టేట్ మెంట్ తీసుకున్నామని చెప్పిన రోజు ఆయన ఎర్ణాకులంలో ఆసుపత్రిలో మరణ శయ్య మీద ఉన్నారు. కాన్సర్ రోగి అయిన ఆయన తరువాత నాలుగు రోజులకు మరణించారు. కర్ణాటకవాసులైన మిగతా ముగ్గురిలో ఇద్దరు బీజేపీ-ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తలు. వారిలో యోగానంద అనే అతను మదనీని టీవీలో తప్ప తాను ఎక్కడా చూడలేదని చెప్పారు. ప్రధమ సాక్షి అయిన యోగానంద్ కు తాను పోలీసు రికార్డుల్లో ఒక సాక్షినన్న విషయం కూడా తెలియదు. 2007లో అతను విడుదల అయినప్పటి నుండి వాళ్ల ఇంటి చుట్టూ పోలీసులు ఉండేవాళ్లు. ప్రతివారం పోలీసు స్టేషన్ కు వెళ్లి సంతకం చేసి రావాల్సి వచ్చేది. అలాంటి వ్యక్తి మళ్లీ బాంబు పేలుళ్ల కుట్రలో ఎలా ఉంటాడనీ, కూర్గ్ ఎలా వెళ్లగలుగుతాడనీ ఆయన భార్య సూఫీయా ప్రశ్నిస్తోంది.

కేకే షాహీనా మిగతా ఇద్దరు సాక్షులను విచారించటానికి వెళుతుండగా పోలీసులు వెంటబడి ఆమెను తరిమేశారు. తరువాత ఆమె టెర్రరిస్టని ప్రచారం చేశారు. కన్నడ వార్తాపత్రికలు మదనీ అనుకూలమైన టెర్రరిస్టు కర్ణాటక వచ్చిందని రాశాయి. ఆమె కలవలేకపోయిన ఇద్దరి సాక్షులను ఆమె చంపుతానని బెదిరించిందని ఆమె మీద హత్యాప్రయత్నం కింద కేసు పెట్టారు.

శశీ తన డాక్యుమెంటరీలో తప్పుడు కేసులు పెట్టి నిర్బంధించిన అనేకమంది గురించి ప్రస్తావించారు. వారిలో వినాయక్ సేన్, సోనీ సోరి, పర్యావరణ కార్యకర్త ఎస్పీ ఉదయకుమార్, సంజీవ్ భట్, అడ్వకేట్ లు శాన్ వాస్, అభయ్ సాహులు, కశ్మీర్ ప్రొఫెసర్ ఎస్ ఏ ఆర్ గిలానీ, జర్నలిస్టు కేకే షాహీనా, ఆదివాసీ నాయకురాలు దయామణి బార్లా, ఆదివాసులు కోపా కుంజమ్, కొడోపి లింగారంలు ఉన్నారు. ఎమర్జెన్సీ కాలంలో కేరళలో ఎన్ కౌంటర్ కు గురి అయిన విద్యార్థి రాజన్ గురించి కూడా ప్రస్తావించారు. అతను ఆ రోజుల్లో చాలామంది విద్యార్థుల్లాగా రాడికల్ అయినప్పటికి అతని మీద బనాయించినవి అన్నీ తప్పుడు కేసులే. ఈ డాక్యుమెంటరీ తీసింది 2014లో. ఇప్పుడు కేసుల బాధితుల లిస్టు చాంతాడంత ఉంది.

ప్రజల దృష్టిలో, నాయస్థానాల దృష్టిలో ఉగ్రవాది ఎవరు? అధికార రాజకీయాల్లో టెర్రరిస్టు ఎవరు? అనే విషయాలను ఈ డాక్యుమెంటరీలో సవివరంగా చర్చించారు. జస్టిస్ వీ ఆర్ కృష్ణయ్యర్ కూడా తనను 30 రోజులు జైల్లో ఉంచి ఎలాంటి నేరాన్ని రుజువు చేయలేక విడుదల చేశారని చెప్పారు. నేరారోపణ ఉండదు, విచారణ ఉండదు -ఊరికే ప్రజలను జైళ్లల్లో పెడతారని ఆయన అన్నారు. మదనీ కేసులో మొదటి 9 సంవత్సరాలు ఎలాంటి నేరాలు రుజువు చేయకుండా ఆయనను జైల్లో ఉంచటం అంటే, రాజ్యాంగం ప్రజలకు ఇచ్చిన స్వేచ్ఛగా బతికే హక్కును కాల రాయటమే కదా అని కృష్ణయ్యర్ ప్రశ్నించారు.

భారతదేశంలోని న్యాయ వ్యవస్థ గురించి వ్యాఖ్యానిస్తూ కేరళ హైకోర్టు లాయర్ నందినీ ‘మనం ఉన్నత వర్గాలు, నిరంకుశ రాజ్యాలు ఏలుతున్న కాలంలో బతుకుతున్నాం. ఈ ధోరణి అన్ని వ్యవస్థలలో చాప కింద నీరులా చేరింది. న్యాయ వ్యవస్థ కూడా దానికి భిన్నంగా లేదు. జడ్జీలు కూడా కొన్ని సమూహాల మీద ముందస్తు అభిప్రాయాలతో ఉంటారు. తటస్థ, పక్షపాత రహిత జడ్జిమెంట్లు ఉండటం లేదు. ఎవరైనా నేరం రుజువు అయిందాకా నిర్దోషులే. కానీ మదని విషయంలో అతని మీద ఆరోపణలు చేసినప్పటినుండి నేరస్తుడే అయ్యాడు. ఆయన్ని కలిసిన వాళ్లందరూ దేశద్రోహులుగా ముద్రకు గురి అయ్యారు’ అన్నారు.

‘ముస్లిములను తీవ్రవాదానికి, ఉగ్రవాదానికి ప్రతీకలుగా చూపిస్తూ వచ్చారు. మదనీ ఇలాంటి స్థిరాభిప్రాయాల బాధితుడ’ని -మదనీ విడుదల కోసం జరిగిన ఒక సభలో మాట్లాడుతూ ఎస్ ఏ ఆర్ గిలానీ అన్నారు. కశ్మీరీ అయిన ఎస్ ఏ ఆర్ గిలానీ స్వయంగా అలాంటి బాధితుడే. పార్లమెంటు దాడి కేసులో ఆయనను ఇరికించి జైలు పాలు చేశారు. ‘Jail is bail. It is a norm. But for Mr Madani it is always jail for him. Not bail. They chose him to instil fear among the communities whom he represents. These are politics of fear’ మదని విడుదల సభలో అన్నారాయన.

ప్రపంచంలో జైళ్లలో అన్యాయంగా ఉన్న 20 మందిని పరిశీలిస్తే అందులో మదనీ ఒకరనీ అగ్ర కులాల, ఫాసిస్టు శక్తుల కోరికల, ఇష్టానుసారం అతనికి పరిమితమైన బహిరంగ జీవితమే మిగిలిందని కేరళ ఎమ్మెల్యే జమీలా ప్రకాశం అన్నారు. ‘కొంతమంది ఎన్ని తప్పులు చేసిన ఒక్క తప్పుకు కూడా శిక్ష ఉండదు. అదే సమయంలో కొంతమంది ఏ తప్పూ చేయకపోయినా అనేక శిక్షలకు గురి అవుతారు. మదనీ ఒక ఇస్లాం స్కాలర్. అతను ఒక మతపరమైన స్కాలర్ గా మిగిలిపోతే అతని మీద ఎలాంటి తప్పుడు కేసులు ఉండేవి కావు. ఇస్లాంలో ఉన్న నిజమైన సంగతులను, ఇస్లాం స్ఫూర్తితో ఆయన దళితులు, మైనారిటీలు, పీడితుల విముక్తి అలుపెరగకుండా పని చేశాడ’ని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ ‘దేశంలో పౌరుడిగా వారి స్థానం ఏమిటి అనే ప్రశ్న ప్రధానస్రవంతి హిందువులకు రాదు. కానీ బహిరంగ జీవితంలో హక్కులు నిరాకరించబడిన ముస్లిములకు పదే పదే ఆ ప్రశ్న వస్తుంది’ అన్నారామె.

‘కాలు లేని వ్యక్తిని మీరెందుకు హింస పెడతారని’ జస్టిస్ కృష్ణయ్యర్ బీజేపీ కేంద్రమంత్రిని అడిగినపుడు -ఆయనకు కాలు లేదు, కానీ అతని నాలుక చాలా పొడవు. ఆ నాలుకే మాకు ప్రమాదం తెస్తుందని వ్యాఖ్యానించాడు. ఈ విషయం మీద చాలామంది ఆసక్తికరమైన అభిప్రాయాలు చెప్పారు.

‘కొంతమంది సిగ్గులేని వాళ్లకు వ్యతిరేకంగా ఆయన తన నాలుకను కొరడాగా వాడారు. ఆ నాలుకకు ముళ్లు ఉన్నాయి. అవి తగిలిన వాళ్లకు నొప్పి కలిగింది’ అన్నారు కేరళ ఎమ్మెల్యే జమీల ప్రకాశం. ‘అలా మాట్లాడటం తీవ్రవాదం కాదు, భాషలో వాడితనం. అణగారినవారికి అధికారం అనే మాట అలాంటి వాడి వ్యక్తీకరణంతోనే వస్తుంది మరి’ అన్నారు సికె అబ్దుల్ అజీజ్. సివిక్ చంద్రన్ ఈ విషయంలో వెలిబుచ్చిన అభిప్రాయం గొప్పగా ఉంది. ‘తొగాడియా, మదనీ వ్యక్తీకరణలలో తేడాలను చూడాలి. వ్యవస్థ తొగాడియా గొంతుకతో గర్జిస్తుంటే, అసహాయులు మదనీ గొంతుకతో విలపిస్తున్నారు. అట్టడుగు వర్గాల కేరళ దళితుల, ఆదివాసులు, రైతులు, ముస్లిం మైనారిటీలు, స్త్రీలు, గ్రామ ప్రజల నాయకత్వంలో ముందుకు వస్తుంది. ఇక విశ్రాంతి తీసుకోవాల్సిన రాజకీయాలకూ, ఈ అట్టడుగు రాజకీయాలకు సంఘర్షన ఉంది. మదనీ ఈ సంఘర్షణకు బాధితుడు’ అన్నారాయన. ‘రెచ్చగొట్టే ఉపన్యాసాలు చేస్తున్నారనే అభియోగంతో దాదాపు 150మందిని ఇప్పుడికిప్పుడు అరెస్టు చేయొచ్చు. ఉమాభారతి, రిత్వంభర, ప్రమోద్ ముతారిక్ వాళ్లలో కొందరు. వాళ్లు ఇప్పటికే అలాగే మాట్లాడుతున్నారు’ అన్నారు రచయిత కుంజహమ్మద్. ‘రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని ఆరోపిస్తే, ఎవరు రెచ్చగొడుతున్నారనేది కూడా ప్రశ్న అవుతుంది. ప్రజలను రెచ్చ గొట్టటం, స్వార్థ ప్రయోజనాలను రెచ్చగొట్టటం రెండూ వేరు వేరు విషయాలు. ఆయన దుర్మార్గ రాజకీయ నాయకులను రెచ్చగొట్టాడు’ మానవ హక్కుల కార్యకర్త జీయార్ డబ్ల్యూ వాసు.

ఈ విషయంలో తన అభిప్రాయాన్ని చెబుతూ మదనీ ‘నేను నిజం మాట్లాడుతున్నాను కాబట్టి వాళ్లు ఇబ్బంది పడుతున్నారు. బాబ్రీ మసీదు కూలగొట్టినపుడు నేను మాట్లాడిన మాటలు చాలా ఉద్రేకపూరితంగా ఉన్నాయి. కానీ అప్పుడు కూడా నేను దేవాలయాలకు, హిందూ మత స్థలాలకు ఎలాంటి హాని చేయొద్దనే చెప్పాను. అంతేకాదు, వంద మసీదులను కూల్చివేసినా గుడుల దగ్గర ఒక పిడికెడు మట్టిని కూడా మీరు నష్టపర్చవద్దని కూడా చెప్పాను. రెచ్చగొట్టే ప్రసంగాలు చేశానని కేరళ ప్రభుత్వం నా మీద అప్పుడు చాలా కేసులు పెట్టింది. కరుణగప్పలి కోర్టు మేజిస్ట్రేట్ ముస్లిం కాదు, హిందువు. అతను కేసు వాదోపవాదాలను విని ఆధారాలు లేవని కేసులన్నిటినీ కొట్టేశాడు. కొల్లం మేజిస్ట్రేట్, అతను పవిత్ర హిందువు. నేను హిందూ మతానికి వ్యతిరేకంగా మాట్లాడితే వారికి అర్థం అవుతుంది. ఆయన నా ఉపన్యాసాలను పరిశీలించి, వాదనలను విని కేసును కొట్టేశారు. నా ఉపన్యాసాలలో హిందూ దేవతలకూ, దేవుళ్లకూ, హిందూ మత విశ్వాసాలకూ వ్యతిరేకంగా ఒక్క విషయం కూడా లేదనీ ఆయన చెప్పారు. అద్వాని, అశోక్ సింఘాల్ లను విమర్శించింది వాళ్లు హిందువులు అవటం వలన కాదు. అది రాజకీయ విమర్శ. ఆ దృష్టితోనే కొల్లం కేసులన్నిటినీ కొట్టేశారు’ అని చెప్పారు.

సాలిడారిటీ యూత్ మూవ్ మెంట్ కేరళ రాష్ట్ర సెక్రెటరీ పి ఐ నౌషాద్ మాట్లాడుతూ మదనీ దళితులను, మైనారిటీలను, ఆదివాసులనూ ఐక్యం చేసే ఉద్దేశ్యంతో ఇస్లాం విముక్తి రాజకీయాలను వాడుకున్నాడని చెప్పారు. ఆ రాజకీయాలు సంఘ్ పరివార్ రాజకీయాల పట్ల, అగ్ర వర్ణ ఫాసిస్టు దృష్టికోణం పట్ల విమర్శనాత్మకంగా ఉంటాయని అన్నారు. ‘మదని తీసుకొన్న చొరవ చాలమందికి సంతోషంగా లేకపోవటం సహజం. ఒక పక్క ఆయన సామాన్య పౌరుడి కోణంలో ప్రభుత్వ నయా ఉదారవాద విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడతాడు. ఇంకో వైపు ఆయన ముస్లిం. కాబట్టి ప్రభుత్వానికి ఒకే దెబ్బకు రెండు పిట్టలు దొరికాయి. ఒకే సమయంలో ఆయన ముస్లిం టెర్రరిస్టుగా, ఇంకో వైపు సామాన్య పౌరుల పోరాటాలను ముందుకు తీసుకుని పోయేవాడిగా తలనొప్పి అయ్యాడు. ఆయనను అరెస్టు చేస్తే సామాన్య ప్రజల పోరాటాలను బలహీన పరచవచ్చు అని వాళ్లు భావించారు’ చెప్పారాయన.

ఒక కేసులో తొమ్మిదిన్నర సంవత్సరాలు జైల్లో ఉండి నిర్దోషిగా విడుదలయ్యాక, మళ్లీ అలాంటి కేసులోనే అరెస్టు చేయటం అంటే -ఇంకో పదేళ్లు లోపల పెట్ట వచ్చుననే అర్థం. మీడియా మాత్రం ఈ కోణాన్ని మాట్లాడటం లేదు. ఈ డాక్యుమెంటరీలో మీడియా పాత్ర గురించి కూడా చర్చ జరిగింది.

ఇప్పుడు పత్రికలన్నీ అధికారిక వార్తలనే రాస్తాయి. పోలీస్ స్టేషన్ ల నుండి, విచారణ కమిషన్ నుండి తీసుకొన్న వార్తలనే వాళ్లు రాస్తారు. పోలీసులు చెప్పిందే నిజమనుకొంటారు. ఇంకో పద్ధతిలో దాన్ని నిర్ధారించుకోవాలని అనుకోరు. షాహినా ఆ ప్రయత్నం చేసినపుడు, ఆమెకు వేధింపులు ఎదురయ్యాయి. ఆమె కూడా పాత్రికేయురాలు అయినప్పటికీ మొదట మీడియా వ్యక్తులంతా తమ తమ రక్షిత గుహల్లో తలదాచుకున్నారు. సాంస్కృతిక నాయకులు, యాక్టివిస్టులు ఈ విషయాన్ని ముందుకు తీసుకొని రాగానే పాత్రికేయులు ఈ విషయం మీద దృష్టి పెట్టారు. ఆమెకు ఇప్పటికీ వేధింపులు ఉన్నాయి. అయితే షాహినా తన కేసు కంటే మదనీ కేసు గురించి ఎక్కువ మాట్లాడదల్చుకొన్నది. ‘నాకు ఇంతమాత్రం మద్దతుదారులు ఉన్నారు. నేను జైల్లో అయితే లేను. మదనీ విషయంలో పూర్తి నిశ్శబ్దం ఉంది. కేరళలో అతని గురించి పూర్తిగా వ్యతిరేక భావనలు ఉన్నాయి’ అన్నారామె.

‘ఇప్పుడు ఇండియాలో జర్నలిస్టులు, ఆర్టిస్టులు, యాక్టివిస్టులు భయమనే కత్తి అంచుల మీద ఉన్నారు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ప్రభుత్వ ఉగ్రవాద భయంతో మూగపోయింద’ని దర్శకులు కమల్ అభిప్రాయ పడ్డారు.

ఈ డాక్యుమెంటరీ సమయానికి అబ్దుల్ నాసర్ మదనీ సరిగ్గా చూడలేకపోతున్నాడు. భుజాల నుండి నొప్పి వీపుకు పాకి ఇప్పుడు చేతులకు కూడా వచ్చింది. ఒక్క కాలుతో బాత్ రూమ్ కు వెళ్లలేక పోతున్నారు. అంత చదివే మనిషి చదవలేకపోతున్నాడు. శిక్షాకాలంలో 100 కేజీల బరువు ఉండే నాసర్ 45 కేజీలకు తగ్గిపోయారు. జైలు జీవితంలో ఆయన తీవ్రమైన హింస అనుభవించారు. కరుడు గట్టిన క్రిమినల్స్ ఒక్క నెలలో బెయిల్ తీసుకొని వెళుతుంటే నాసర్ కు ఏళ్ల తరబడి తన పిల్లల్ని చూసే అవకాశం కూడా ఇవ్వలేదు. ‘ఆయన నిర్దోషి అని తేలేసరికి మనిషి మిగలడేమో అనిపిస్తుంది. మేము కోర్టుల చుట్టూ తిరుగుతున్నాం. ప్రాసిక్యూటర్ అతన్ని ప్రపంచ టెర్రరిస్టు అనగానే అంతా మారిపోతుంది. తప్పుడు కేసుల్లో ఇరికించి అతని జీవితాన్ని నాశనం చేసే కుట్ర ఇది’ సూఫీయా చెప్పింది.

‘Standing for Abdul Nassar Madani is not just for one person. You are standing for entire democracy. You are standing for future generations of this country’ అన్నారు ఎస్ ఏ ఆర్ గిలానీ.

మదనీ జీవితాన్ని న్యాయవ్యవస్థ విఫలం చేసింది. అది విఫలం కాదని అనుకునే ఒకే ఒక వ్యక్తి అబ్దుల్ నాసర్ మదని.

ఏ పార్టీ అధికారంలో ఉన్నా పార్లమెంటరీ రాజకీయాలకు అధికార దాహం ఎక్కువ. అవి ఎంతటి నేరాలనైనా చేయగలవు. ఆ నేరాలకు బలి అయిన మదనీ విడుదల కోసం అతని కుటుంబంతో పాటు, కేరళ పీడిత సమాజం అంతా ఎదురు చూస్తోంది.

ఈ ఆర్టికల్ రాసేనాటికి దర్శకులు కేపీ శశితో సహా, ఎస్ ఏ ఆర్ గిలానీ మన మధ్య లేరు. పది సంవత్సరాల క్రితం ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశాడని కేరళ ప్రభుత్వం ఈ డాక్యుమెంటరీలో నిజాలు మాట్లాడిన 90 సంవత్సరాల జీయార్ డబ్ల్యూ వాసు మీద కేసు పెట్టి అరెస్టు చేయించింది. మానవ హక్కుల కోసం పోరాటం కొనసాగుతూనే ఉంది.

(ఈ డాక్యుమెంటరీని యూట్యూబ్ లో చూడవచ్చు)

స్వస్థలం ఒంగోలు. ప్రస్తుతం గుంటూరు ప్రభుత్వ మహిళా పాలిటిక్నిక్ కాలేజీలో ఎలక్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ బ్రాంచ్ హెడ్ ఆఫ్ సెక్షన్ గా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు. 'మాతృక' బాధ్యతలు చూస్తున్నారు.

3 thoughts on “అన్నీ తప్పుడు కేసులే

  1. కేపీ శశి డాక్యుమెంటరీ గురించి చాలా బాగా రాశారు. నమ్మశక్యం కానంత వివరాలు. రాజ్యాంగం హామీ ఇచ్చే స్వేచ్ఛా స్వాతంత్ర్యాలూ, చట్టబద్ధమైన ప్రజాస్వామిక హక్కులూ వాస్తవంలో ఇలా తలకిందులుగా ఉంటున్నాయి. అధికారంలో ఎవరున్నా రాజ్యం స్వభావం మారదన్నమాట.

  2. S I R GILANI —-COMMENTS ARE RIGHT —YOU ARE STANDING FOR ENTIRE DEMOCRACY—,,,,,,,,,,,,,,
    SALUTES ABDUL JI —- WE NEED MORE ABDUL NASSER MADANI ,S—-WISH /HOPE

  3. ఎంతో ఓపికతో ఎన్నో వివరాలతో, ఈ వ్యాసం రాశారు. నిజానికి ఈ డాక్యుమెంటరీ మరియు మీ సమీక్ష వ్యాసం బహుళ ప్రచారం లోకి రావాల్సిన అవసరం ఉంది. ఒక మతం లోని అతివాదులు, అంతా వారు కోరుకున్నట్లు జరుగాలనే ఆధిపత్య వాదుల అత్యాశకు ఎందరెందరో నిరపరాధులు బలై పోతున్నారు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం.

Leave a Reply