అత్యాధునిక కవిత్వం ‘వాక్యాంతం’

‘వాక్యాంతం’ (End of the Sentence) అని కవితా సంపుటికి నామకరణం చేసినా వచనాన్ని కవిత్వంగా మార్చే వ్యూహాలన్నీ సమర్థవంతంగా వాడుకున్నారు మువ్వా శ్రీనివాసరావు గారు. ఈ కవితా సంపుటిలోని (174) కవితా ఖండికల్లో అనేక విషయాల మీద రాసినవి ఉన్నాయి. అభివ్యక్తి, వైవిధ్యం కూడా ఉంది. ఏ అంశాన్నైనా కవిత్వం చేయగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్నవాడు ఈ కవి.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత జరిగిన పరిణామాలు, అనుభవాలను చాలా బలంగా చిత్రించిన కవితా ఖండికలు ఉన్నాయి. కోస్తాంధ్ర పాలక వర్గాలకు, తెలంగాణ పాలక వర్గాల 1969లో ప్రారంభమైన పంచాయితి 2014 జూన్ రెండున ముగిసింది. ఎన్నో ఆకాంక్షలు ముందుకు వచ్చినయి. సామాజిక తెలంగాణ అని కొందరు అంటే, భౌగోళిక తెలంగాణ అని కొందరు అన్నారు. నీళ్ళు, నిధులు, నియామకాలు అనే ఒక ఆకాంక్ష ప్రజలను అందరిని ఏకం చేసింది.

ప్రజలు అన్ని రకాల దోపిడీలు లేని ”సుఖశాంతుల తెలంగాణ” కోరుకున్నారు. కవి క్రాంతదర్శి కదా! జరుగుతున్న పరిణామాలను సులభంగా పసిగడతాడు. ”ప్రజల స్వామ్య మెప్పుడు?” కవితలో ”పెత్తనం మారనపుడు, మళ్ళీ అవే దోపిడి విత్తనాలు చల్లబడతాయి కదా!” పరిపాలన నమూన మారినపుడు, పాలకుల నీతి మారుతుంది. సామూహిక సంక్షేమం ఒక కేంద్ర బిందువుగా ఉంటుంది. కాని పాలక నీతి మారనప్పుడు

”ఏళ్ళ తరబడి కన్న స్వప్నంలో,
కన్నాలు వెతికి కాపురముండేందుకు,
కొత్త దొంగలు ఎత్తులేస్తున్నారు
కోట్లాది ప్రజల ఆకాంక్షలను కబ్జా చేయాలని చూస్తున్నారు”

తెలంగాణ వచ్చినంక అది కొందరి గుత్త సొత్తు అయింది. బుద్ధి జీవులు పాలక పక్షంలో చేరినారు. ప్రజల బాధల గాథలను పట్టించుకొనే పాట కూలిదయింది. ప్రజల భాగస్వామ్యం లేని పాలన అవతరించింది. ”త్యాగధనులంతా నింగిలోంచి తొంగి” చూస్తున్నారు. ఏ త్యాగం చేయనివారు ఏలికల సమూహం లో కలిసి పోయినారు. ఈ పరిణామాలు చూసిన కవి ప్రజలకు అధికారం ఎప్పుడు వస్తుందని ప్రశ్నిస్తున్నాడు.

”చాటు మాటున ట్యూన్లు” కూడా ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డ సందర్భంగా రాసిందే. చిగుళ్ళను కత్తిరించుకున్న చెట్టులా ఒకరు, మర్రిచెట్టు నీడను తప్పించుకొన్న మొక్కలా మరొకరు” అని ప్రతీకాత్మకంగా ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల గురించి చెపుతున్న కవి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినంతనే అది విముక్తి కాదు. ”భ్రమలు” తొలగి పోతయి. ”మేకప్” చెదిరిపోతుంది. ఆంధ్ర అయినా, తెలంగాణ అయినా ప్రజలని ప్రజలకు దూరం చేసే ”ట్యూన్” కడుతున్నారని హెచ్చరిక చేస్తున్నాడు.

”అక్కడైనా, ఇక్కడైనా పేదజనం ఒక్కటే, ఎప్పటికయినా
ప్రపంచ ప్రజలంతా ఏకం కావల్సిందే…!”

రెండు ప్రాంతాలే కాదు ప్రపంచ ప్రజలు ఏకం కావాలన్న పిలుపునిస్తున్నాడు కవి.

ఆధునిక ప్రజాస్వామ్యంలో చట్టబద్ధ పాలన అనేది ఒక గొప్ప ఆదర్శం. దాన్ని తుంగలో తొక్కే పాలకులు ఎందరో ఉన్నారు. పాలకులు తమ స్వీయ మానసిక ధోరణితో పరిపాలన చేస్తే అణచివేతనే ప్రధానమైన ఆయుధంగా మారుతుంది. ”తూటాలకు, లాఠీలకే కదా పని”.

చట్టాన్ని చాపలాగ చుట్టి పక్కన పడేసినంక ”నాలుకే ఏలిక” అవుతుంది. ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్ళు అన్న భావన ఉంది. దేవుళ్ళకు మొక్కులు తీర్చాల్సి ఉంటుంది. ”ముక్కెరలు, కిరీటాలు మాకేమి వద్ద, పంటల చితిమంటలాపితే చాలు” అన్నది కవి ఆకాంక్ష.

మన ఏలికలు భద్రకాళికి కిరీటాలు, తిరుపతి వెంకన్నకు ఆభరణాలు, యాదగిరి నరసింహ స్వామికి బంగారు తాపడాల గుడి ఇన్ని చేస్తున్నరు. కాని దేశానికి అన్నం పెట్టే రైతుకు గిట్టుబాటు ధరలేక తమ పంటను కాలబెడుతున్నారు. రైతులకు గిట్టుబాటు ధర కావాలని కవి కోరుతున్నాడు.

గాంధీ అనుయాయుల మీద మార్గదర్శి కవిత ఒక సెటైర్. ఆయన చూపిన మార్గంలో నడుస్తామని చెప్పి బహిరంగ వేదికల్లో, ఫేస్ బుక్ వాల్ మీద రాసి గొంతు చించుకొని అరచి చివరికి ఏం చేయలేని క్రియా శూన్యులుగా మారుతున్నారు.

”ఉత్ప్రేరకాలుగా మారాల్సినవాళ్ళం
ఉత్తమాటలుగానే మిగిలిపోయాం”

రాజకీయాల్లో విలువలు లుప్తమై పోతున్నాయి. సిద్ధాంతాలు రద్దయి పదవిలో ఉండటమే అసలు సిద్ధాంతం అయింది. రంగులు మారుతుంటాయి. జెండాలు మారుతుంటాయి. అధికారం ఎక్కడ ఉంటే అక్కడ గడ్డి చిలకలు వాలినట్టు వాలుతుంటారు నాయకులు. ఇది ఆధునిక రాజకీయుల నీతి. ఈ స్థితిని ”ఖద్దరు పూలు” కళ్ళకు కడుతుంది. ”రంగం మీద ఉండటమే ముఖ్యమైనప్పుడు, రంగుదేముందిలే” ఈనాటి రాజకీయ వ్యాపారంలో ప్రజలు ఒక ముడి సరుకు. మభ్యపెట్టడం ఆశలు చూపించడం సహజం అయింది. అందుకే ”ఇజాలు తాకట్టు పెట్టేటోడికి తప్పు లేముంటాయి?”

నేరానికి చట్టానికి మధ్యన ఉన్న చుట్టరికాన్ని గురించి ”మరకలున్న ఉతికిన గుడ్డ” కవిత వ్యక్తీకరిస్తుంది. అసలు నేరానికి చట్టం రక్షణ కవచంగా మారితే, నేరస్తుల కొమ్ముకాస్తే సామాన్యుల పరిస్థితి ఎట్లా ఉంటుంది. ”నేరం చుట్టూ న్యాయం కోటగోడలా” నిలబడ్డట్టు ఉంటుంది.

వాక్యాంతం సంపుటిలో కవుల మీద కవిత్వం మీద అనేక వ్యక్తీకరణలు ఉన్నాయి. P.E.N. కవిత కవులంతా కొలువు కూటానికి జైకొట్టినంక వాళ్ళ కవిత్వం ఇంకి పోయింది. ప్రజలను మరిచిపోయి పాలకుల పథకాల ప్రచారకులుగా, పరిచారికలుగా మారిపోయినారు.

”కోట గుమ్మం ముందు తలలు వేళ్ళాడ
దీసినాకే, కార్యక్రమం మొదలైంది,
బ్యాడ్ లక్, ఇప్పుడు రాయడానికి,
కవి పెన్నులో ధైర్యం ఆవిరై పోయింది”

పదవుల కోసం, ప్రాపకం కోసం, అవార్డుల కోసం రాజకీయ నాయకుల చుట్టు తిరిగే కవుల మీద ఒక వ్యంగ్యంగా ”రాజాజ్ఞ” కవిత సాక్షాత్కరిస్తుంది. పదవులు ఖాళీలేవు ”ముందు పాత కోటల గడీల ధూళిపై, పద్యం రాసుకొని రమ్మను” అని పంపిస్తారు ఏలినవారు.

నాలుగు వాక్యాలు రాసి నాలుగు తరాల కీర్తిని కోరుకొనే వారు అనేకులు ఉంటారు. ”అండ్ల ఏమి లేకున్నా దందెడు గోసి” అన్న సామెత లాగ అవార్డుల కోసం పైరవీలు, లాబీయింగులు నిరంతరం నడుస్తుంటాయి. ప్రభుత్వం కూడ కవులకు అవార్డులు ఇస్తుంది. ”అడుగు పొరల్లోకి చెమ్మ ఆరిపోయే దాకా, అభినందనలు కురిపిస్తుంది”

కవులు రెండు రకాలు – ప్రజల కోసం రాసేవారు; పదవులు, పలుకుబడి కోసం రాసేవారు. ఇద్దరు కవులకు గల తేడాను ”ఎవరు రాయగలరు” కవితలో ”అక్షరాలను మార్కెట్టుకు తాల్చి, వెలిగిపోతుంటాడొకడు, అక్షరాలను మార్పుకోసం వాడి వేధించబడుతుంటాడొకడు”

మానవ సంబంధాల్లోని సున్నితమైన అంశాల మీద కవితలు రాసి మెప్పించినాడీ కవి.

ఆధునిక కాలంలో ఉమ్మడి కుటుంబాలు లేవు. భార్య భర్త ఇద్దరు పిల్లలు. పిల్లలు చదువుకొని ఉద్యోగాల కోసం ఇల్లు విడిచిపోయినపుడు మిగిలేది భార్యా భర్తలిద్దరే. ”నా ఇంట్లో, ఒక్కడినే, నీడలా ఆమె, ఆమె కూడా అంతే, నీడలా నేనూ” ఈ ఇద్దరు ”అందని ఎత్తులో పుష్పించిన, కలల పరిమళాన్ని ఆస్వాదిస్తూ” ఉంటారు (ఒకే ఇద్దరు)

స్త్రీ, పురుష సంబంధాల్లో ఇద్దరు సమానమనేది ఆధునిక ప్రజాస్వామిక విలువ. ”పెళ్ళి@” కవితలో ”ఆమెలో అతడు అతనిలో ఆమె కొత్తగా మొలవడం, శశి నుండి నిశికి వ్రేలాడే వెన్నెల దారాలను మీటుతూ, ఉచ్ఛ్వాస నిశ్వాసల యుగళగీతం ఆగిపోయే దాక, పరవశంతో బతకడం”

అదే స్త్రీ పురుషుల మధ్య అసమానతలు ఎలా ఉంటాయో ”వక్ర స్వరాలు” కవితలో contrast చేసి చూపించినాడు. ”మోసం మాత్రం ఎప్పుడూ, ఆమెకే”

ఆధునిక సాంకేతికత మనిషి జీవితాన్ని వేగవంతం చేసింది. ఎవరి Busy లో వాళ్ళే ఉంటారు. ఒక ఇంట్లో ఉన్నా అందరు కలిసి తినడం మాట్లాడుకోవడం అరుదుగా జరుగుతుంది. ఈ పరిస్థితిని ”నిరీక్షణ” కవితలో పట్టుకున్నాడు కవి. మనం వినియోగ వస్తువులు ముఖ్యంగా ఆహార పదార్థాలు, మందులు కొనుగోలు చేస్తాము. వాటి మీద expiry తేది ఉంటుంది. ఆ తేదీలోపే ఆ వస్తువులను వాడాలి. లేకుంటే అవి మేలు చేసే కంటే కీడు చేస్తాయి. ఇది మానవ సంబంధాలలో కూడా ప్రతిఫలిస్తున్నది. అవసరం ఉంటేనే మాట్లాడడం, పలకరించడం లేకుంటే చూసీ చూడనట్టు ఉండటం గమనించవచ్చు. ఆత్మీయతలు, అనుబంధాలు పోయి అవసరాలే ఆధిపత్య స్థాయిలోకి వచ్చిన వైనాన్ని చూడవచ్చు. ”అనుబంధాలపై కూడా ఎక్సపయిరీ తేదీ ముద్రించిన సంగతి నిన్ననే కదా తెలిసింది”. (నిరీక్షణ)

కవి తన వైయక్తిక అనుభవాలను, అనుభూతులను ”వాక్యాంతం” కవితా సంపుటిలో రికార్డు చేసినారు. బాల్యంలో తండ్రి భుజాల మీద ఊరేగిన ”తడిసిన జ్ఞాపకాలు” మానవ సంబంధాలలోని వైవిధ్యాలు, వైరుధ్యాలు, ద్వైదీ స్వభావాలు అనేకం ఈ సంపుటిలో చోటు చేసుకున్నాయి.

గురజాడ నుండి 1980ల వరకు వచ్చిన కవిత్వాన్ని ఆధునిక కవిత్వమని, 1980 తర్వాత వచ్చిన దళిత, స్త్రీ, మైనారిటీవాద కవిత్వాలను అత్యాధునిక కవిత్వం అంటారని సుప్రసిద్ధ విమర్శకులు చే.రా. సూత్రీకరించినారు.

అత్యాధునిక కవిత్వంలో భాషా సారళ్యం, రాజకీయ రాహిత్యం అణచివేయబడుతున్న స్త్రీ, దళిత, మైనారిటీ వర్గాల కవిత్వం, గ్రామీణ నేపథ్యం, అంతర్ముఖత్వం (Subjectivity), కవిత్వం స్పృశించే జీవిత కోణాల విస్తరణ, స్పష్టమైన మధ్యతరగతి స్పృహ ఇవి అత్యాధునిక లక్షణాలుగా చే.రా. భావించినారు. పైన ఉదహరించిన లక్షణాలలో ఒక్క రాజకీయ నిబద్ధత రాహిత్యం మినహా స్థూలంగా అన్ని లక్షణాలు మువ్వా శ్రీనివాసరావు గారి ”వాక్యాంతం” లో ప్రతిఫలిస్తున్నాయి. ఇది అత్యాధునిక కవిత్వం.

కరీంనగర్ పట్టణంలో నివాసం. చేనేత జౌళి శాఖ లో ఉప సంచాలకులు గా పని చేసి విశ్రాంతి తీసుకుంటున్నారు. హైదరాబాద్ విశ్వ విద్యాలయం నుండి MA; MPhil. చెరబండరాజు నవల మీద MPhil, కట్టెపలక కవిత సంపుటి వెలువడింది. సాహిత్యం అధ్యయనం, కవిత్వం, వ్యాస రచనా, సాహిత్యంలో సమాజం అభిమాన విషయాలు.

One thought on “అత్యాధునిక కవిత్వం ‘వాక్యాంతం’

  1. Thanq కొలిమి & కందుకూరి అంజయ్య అన్నా

Leave a Reply