అతని మీద అతని ప్రేమ?

Hearts are like wild birds
They go where they are loved – Imam Ali

సతీష్ గోడ మీద చాలా ఇష్టంగా పెట్టుకున్న పోస్టర్ అది. విశ్వైక కళ్ళార్పకుండా ఆ వాక్యాలని ఒకటికి రెండుసార్లు చదివింది.కొత్తగా అర్థం అవుతున్నట్లు అనిపించింది.

“నాన్నా చాలా చెప్పాలని ఉంది కానీ ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. నిన్నోసారి కలవాలి. మనం ఎదురుబొదురుగా కూర్చుని చాలా మాట్లాడుకోవాలి. నువ్వు నన్ను తిడతావేమో? ఫరవాలేదు భరిస్తాను నాన్నా”విశ్వైక గొంతు వణుకుతోంది. కళ్లల్లోంచి ధారగా కారే కన్నీటిని తుడుచుకుంటూనే నాన్నతో మాట్లాడుతోంది.

విశ్వైక తండ్రి ప్రసాద్ గుండె గుభిల్లుమంది.”ఏమైంది విశ్వా అంతా మంచిదే కదా, ఎందుకు బిడ్డా అట్ల ఏడుస్తున్నావు? సతీష్ క్షేమమే కదా”? ప్రసాద్ ఖంగారుగా అడిగాడు. అవతల నుంచి విశ్వైక దు:ఖం అణుచుకుంటున్నగొంతు నిశ్వబ్దమైపోతున్నది.పక్కనే ఉన్న వర్ధని భర్త ప్రసాద్‌ను”ఏమైంది విశ్వకు” చెప్పండి అంటూ కుదిపేస్తున్నది.

విశ్వైక దు:ఖంతో ఫోన్ పెట్టేసింది. నాన్నతో మాటలు పూర్తి చేయలేక. బెడ్ రూమ్ లో నిద్ర పట్టక అలజడిగా బాల్కనీలో మాట్లాడుతున్న విశ్వైక మాటలు వింటున్నాడు సతీష్. దు:ఖంతో ముడుచుకుపోయాడు.ఊపిరాడక మెల్లిగా లేచి హాల్లోకి వచ్చాడు. బెడ్ రూమ్ అవతల ఉన్న బాల్కనీలోని నిశ్శబ్దంలో భార్య విశ్వైక వేదన వినిపిస్తోంది.మెల్లిగా చెప్పులేసుకుని ఇంటి బయటికొచ్చి రోడ్డు మీద నడవసాగాడు. ఆకాశం నేల మీద వెన్నెల కుమ్మరిస్తోంది. సతీష్ హృదయం మాత్రం వేడెక్కిపోతోంది. వేసవి రాత్రి ఆ శీతల గాలులు అతని మనసుని మరింత వేడెక్కిస్తున్నాయి. అల్లకల్లోలంగా ఉన్న హృదయాన్ని కుదుటపరచడానికన్నట్టుగా అతను సిగరెట్ వెలిగించాడు. ఊపిరితిత్తుల్లో వెచ్చగా నిండుకుంటున్న పొగ అతన్ని కొంత శాంతపరిచింది. ఇంతలో ఫోన్లో మెసెజ్ రింగ్ మ్రోగింది. శౌర్య నుంచి. అంత వేదనలోనూ సతీష్ పెదవులపై చిన్న నవ్వు విచ్చుకుంది. మళ్లీ విశ్వైక ఏడుపు శబ్దం పక్కనే వినపడ్డట్టై చిన్నబోయాడు. మెల్లిగా నడుస్తూనే మెసేజ్ ఓపెన్ చేసాడు.

“సముద్రం చల్లగాలిని కోరుకున్నట్లు నేను నీకోసం తపించిపోతాను.అడవి చెట్ల కోసం అలమటించినట్లు నేను నీ కోసం ఎదురుచూస్తాను. మనం దగ్గరగా కాకుండా విడిగా ఉన్నప్పుడు నా ఎముకలు బాధతో మూలుగుతాయి.కేవలం ఒక్క నువ్వే వాటిని కలిపి ఉంచే అత్యవసరమైనవాడివైనట్లుగా ఎదురు చూస్తాయి– కెర్లీ రోస్ నార్త్.

డియర్ సతీష్ లవ్ యూ_ శౌర్య. కెర్లీ రోస్ మన గురించే రాసినట్లు లేదూ? మొన్నటి నా ఎముకలు విరిచినట్లున్న నీ దృఢమైన కౌగిలి గ్నాపకం వస్తున్నది. మనం ఇలా విడిగా కాకుండా ఎప్పటికీ కలిసి ఉంటే ఎంత బాగుంటుంది బాగుండేది? కానీ కాలం, కాదు కాదు నువ్వే పిరికివాడిలాగా లోకం, కుటుంబం అంటూ నన్ను దూరం చేసావు. ఎలా సతీష్.. ఎంత కాలం ఇలా? నేనింకా చూడు అక్కడే ఉన్నా నువ్వొదిలినచోట.సతీష్ బాగా గుర్తోస్తున్నావు.”

శౌర్య హృదయ ఘోష ముక్కలు ముక్కలుగా కనిపిస్తున్నది. సతీష్ మనసు ముడుచుకుపోయింది. శౌర్య కవిత్వం విపరీతంగా చదువుతాడు,రాస్తాడు కూడా. లా కాలేజీలో పరిచయం అయిన తామిద్దరూ ప్రేమలో పడిన క్షణం నుంచీ, పుంఖానుపుంఖాలుగా కవిత్వం రాస్తూనే ఉన్నాడు. తామిద్దరి రహస్య ప్రేమ చాలా కాలంగా కొనసాగుతూ వచ్చింది. స్పోర్ట్స్ క్లబ్‌లో మొదలైన స్నేహం శౌర్య లవ్ ప్రపోజల్‌తో ప్రేమగా మారింది. ఇద్దరు మెడలోతు ప్రేమలో మునిగిపోయాం. ఇంట్లో అమ్మానాన్నలకి చెల్లి రజనికి ఈ విషయం తెలుసు. పదో తరగతి నుంచి తనకు పురుషుల పట్ల ఉన్న ఆకర్షణకు ఇంట్లో కట్టడి చేస్తూనే ఉన్నారు. ఇంటర్మీడియట్‌లో కౌన్సెలింగ్‌లు, సైకో థెరపీలు, సైకియాట్రి మెడిసిన్స్ కూడా ఇప్పించారు. అయినా పురుష ప్రేమ తగ్గలేదు ఇంకా ఎక్కువైంది. నేను ‘గే’ని నాన్నా అర్థం చేసుకో. మీరెంత ట్రీట్‌‌మెంట్ ఇప్పించినా నాకు ఇది తగ్గదు. ఇదే నాకు సహజం అని ఎన్నోసార్లు కొట్టడానికి వచ్చిన నాన్న ఒళ్లో తల పెట్టుకుని ఏడ్చాడో లెక్కే లేదు. ఆఖరికి ఒక కౌన్సెలర్ అమ్మానాన్నలకి, తగ్గించడానికి ఒత్తిడి పెట్టకండి అతని మానసిక స్థితి ప్రమాదకరంగా మారిపోతుంది అని హెచ్చరించాడు. అతనిష్టమొచ్చినట్టు ఉండనివ్వండన్నాడు. అప్పటికే అమ్మానాన్న కూడా డిప్రెషన్‌లోకి వెళ్లిపోయారు. మెల్లిగా లా కోర్సు పూర్తి చేసాడు. అప్పుడే శౌర్యతో ప్రేమలో పడ్డాడు. తనకు శౌర్యేమీ మొదటివాడు కాదు. తన మీద ఆకర్షణ కలిగిన పురుషులు తనని వాడుకున్నారు. తను సహకరించాడు. తనకీ ఇష్టం కాబట్టి. కానీ అవన్నీ థ్రిల్లింగ్ అనుభవం కోసం వెళ్లిన ఒక నైట్ స్టాండ్ లాంటివి. ఒట్టి ఆకర్షణ మాత్రమే. తనను తాను నేను పరీక్షించుకుని ‘గే’గా ఖచ్చితంగా నిర్ధారించుకోవడం కోసం వెళ్లడం తప్పితే ఎవరితోనూ గాఢమైన ప్రేమలో పడలేదు. పురుషుని పట్ల తనకున్న శారీరక ఆకర్షణ వల్ల భయం,ఆందోళన, పశ్చాత్తాప భావనలోనే , మనుషుల్ని, బంధువుల్ని తప్పించుకుని తిరగడంతోనే సరిపోయింది. లా కాలేజీలోకి చేరాక మెల్లగా LGBTQ కమ్యూనిటీలతో పరిచయంతో తన ప్రత్యేకమైన సమస్య పట్ల ఒక శాస్త్రీయమైన స్పష్టత వచ్చి అక్కడ తనలాంటి ఎంతో మందిని కలిసాక వారిలో కలిగిన సహ అనుభూతి తనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. అదిగో అక్కడ పరిచయం అయ్యాడు శౌర్య. ప్రేమన్నాడు, ప్రేమ లేఖలు రాసాడు, వేచి ఉన్నాడు. తనను సాధించుకున్నాడు. ఇద్దరూ కలిసి బతకాలని, పెళ్లి చేస్కోవాలని అనుకున్నారు. ఇతర పురుషులతో సెక్స్ సంబంధాలు లేకుండా ఇద్దరూ కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు. అన్ని రకాల STD పరీక్షలు చేయించుకున్నారు. అన్నీ నెగటివ్ వచ్చాక సంతోష పడ్డారు. సతీష్ తన ఇంట్లో, శౌర్య తన ఇంట్లో చెప్పారు. అందరికీ తెలుస్తుంది ఒద్దన్నారు. పెద్ద పెద్ద గొడవలైపోయాయి.అమ్మ విల విల ఏడ్చింది.చాచ్చిపోతానంది. ఇద్దరూ రహస్యంగా కలవసాగారు.

ఇంతలో అనుకోని అతిథిలా విశ్వైక తన జీవితంలోకి వచ్చింది తన కొలిగ్. ఆమె తనతో ప్రేమలో పడింది. ప్రపోజల్ పెట్టింది. తనకి ఆమెతో స్నేహం తప్ప ప్రేమ లేదు. మూడేళ్ల స్నేహంలో ఆమె తనతో గాఢమైన ప్రేమలో పడిపోయింది. తన స్తబ్దత ఎందుకో ఆమెకి అర్థం కాలేదు. తనకి వేరే గర్ల్ ఫ్రెండ్స్‌ లేకపోవడం ఆమెకి నచ్చింది.శౌర్య ఆమెకు ఉన్న నిజం చెప్పెయ్యమని,తాను“గే“అని చెప్పెయ్యమని అన్నాడు. తానూ కుడా ఆమెకు చెప్పాలని ప్రయత్నిస్తూనే ఉన్నాడు.ఆమె ప్రేమకి నో కుడా చెప్పాడు.”ఎవర్నైనా ప్రేమిస్తున్నావా నన్ను కాకుండా” అంది విశ్వైక బాధతో.”లేదు అలా ఏమి లేదు.ఎవర్ని ప్రేమించట్లేదు” అన్నాడు”మరి నేనంటే ఇష్టం లేదా”?అనేది.’’నేను నీకు తగ్గవాడిని కాదు,నీకున్యాయంచేయలేను”అనేవాడు.”అబ్బా చాలు సతీష్ ఇక సతాయించకు ,నువ్వు లేకుండా బతకలేను,చచ్చిపోతాను”అనేది. ఎన్నోసార్లు ఇంటికొచ్చిన విశ్వైకకి తనంటే ఇష్టమని, ప్రేమని, పెళ్లి చేస్కోవాలని అనుకుంటోందని ఇంట్లో అమ్మానాన్నకి చెల్లికి తెలిసిపోయి చాలా సంతోషించారు. తనని బతిమిలలాడ్డం మొదలుపెట్టారు. బంధువుల కోసం, సమాజం కోసం చేస్కోరా, పిల్లలు పుడితే నీకూ ఒక కుటుంబం ఏర్పడుతుంది. మా పరువూ నిలబడుతుంది అని ఎన్నిసార్లు చెప్పినా తను ఒప్పుకోలేదు. విశ్వైక జీవితం నాశనం చేయనని చెప్పాడు. అసలు ఆమెకే తానొక “గే”నని చెప్పాలని చాలాసార్లు ట్రై చేశాడు. గొంతుదాకా వచ్చిన మాట వెనక్కి వెళ్లిపోయేది.చివరాఖరికి ఒకటి రెండు సార్లు “విశ్వా నేను “గే”ని తెలుసా?” అన్నాడు.విశ్వైక పగలబడి నవ్వింది అన్ని సార్లు.నన్ను తప్పించుకోవడానికి ఈ ఎత్తు వేస్తున్నావు కదా”అని ఒకసారి నవ్వేది,ఇంకో సారి ఏడ్చేది.”నన్ను విడిచి పెట్టకు సతీష్” అంటూ.సరిగ్గా అప్పుడే శౌర్య ఆర్నెల్ల ట్రైనింగ్‌కి విదేశాలకి వెళ్లా‌డు.వెళ్ళే ముందు “సతీష్,విశ్వైక తో స్పష్టంగా చెప్పేయ్.ఆమెని మబ్బులో ఉంచకు.నువ్వు లేకుండా నాకు లైఫ్ లేదు తెలుసు కదా”అని చెప్పి మరీ వెళ్ళిపోయాడు. విశ్వైకకి తనంటే ఇష్టమని శౌర్యకి తెలుసు,కానీ ఇంత గాఢమైన ప్రేమలో ఉందని తను చెప్పలేదు. “నాకు దూరం కాకు నీకు ఆమె మీద ఫీలింగ్స్ వస్తున్నాయా,నిజం చెప్పు”? అని శౌర్య అభద్రతతో భయంతో అడిగేవాడు. “డోంట్ లీవ్ మీ సతీష్” అని ఏడ్చేవాడు.

ఈ లోపల విశ్వైక అమ్మ నాన్నలు వచ్చి “మా అమ్మాయిని మీ ఇంటి కోడల్ని చేస్కోవాలని అసలు ఎప్పుడో వీళ్ల పెళ్లి జరగాల్సింది” అన్నారు. తను కూడా చాలాసార్లు విశ్వైక ఇంటికి వెళ్లి ఉండడం మూలాన్న వాళ్లకు తాను కొత్తేం కాదు. కూతురుకి తనంటే ఇష్టమన్న సంగతి వాళ్లకి తెలిసి తనని ప్రేమగా చూసుకునే వాళ్లు.
“నేను నీకు న్యాయం చేయలేనేమో విశ్వైకా” అని చాలాసార్లు చెప్పాలన్న తన ప్రయత్నాన్ని కొట్టి పడేసేది.ఆమెకి నిజమే చెప్పాలన్న శౌర్య మాటలే వెంటాడేవి. ధైర్యం చేసి “విశ్వా నేను “గే”ని ప్లీజ్ అర్థం చేస్కో” అన్నప్పుడల్లా విశ్వైక పడి పడి నవ్వుతూ “ప్లీజ్ డోంట్ జోక్ విత్ మి”అనేది.ఇంకోసారి కోపగించుకునేది.”నన్ను బాధపెట్టకు ప్లీస్” అనేది దుఖంతో.దాంతో మధనపడ్డాడు. స్ట్రెస్‌కి గురయ్యాడు. శౌర్యను కోల్పోలేడు. శౌర్య లేనిది జీవించ లేడు. శౌర్యా అంతే! ఇక అమ్మకే చెప్పేసాడు . “నా వల్ల కాదు నేను శౌర్యతో రిలేషన్‌ షిప్‌లో ఉన్నా విశ్వైకకి న్యాయం చేయలేను, వాళ్లకి నో అని చెప్పేయండి” అని కనీసం విశ్వైకకి కూడా ఇంత ఖచ్చితంగా చెప్పేయ్యాల్సింది. ధైర్యంగా నో అని చెప్పలేకపోవడం ఇంత అనర్థానికి దారి తీసింది. పైగా అమ్మ విశ్వైకకి తను “గే” అన్న విషయం చెప్పవద్దని ఒట్టు వేయించుకుంది.“చెల్లి గురించి ఆలోచించరా, నీ పెళ్లి అయితే చెల్లి పెళ్లి చేయవచ్చు” అని తనెప్పుడైతే కఠిన నిర్ణయం తీసుకున్నాడో విశ్వైకని పెళ్లి చేస్కోనని అమ్మ నిద్ర మాత్రలు మింగేసింది. చచ్చి బతికింది, బతికి తన పెళ్లి విశ్వైకతో చేసింది.

***

ఇండియా వచ్చిన శౌర్య విషయం తెలిసి డిప్రెషన్‌లో మునిగిపోయాడు. మోసం చేసావని ఏడ్చాడు. డ్రగ్స్ తీస్కోవడం మొదలెట్టాడు.తను దగ్గరుండి కాపాడుకున్నాడు. శెలవు పెట్టి విశ్వైకని వదిలి శౌర్యని తీసుకుని పదిహేను రోజులు బెంగళూరులో గడిపి, శౌర్యలో తనని ఎప్పటికీ వదలనన్న విశ్వాసాన్ని కలిగించాడు. తనకీ శౌర్య కావాలి. అలా విశ్వైకతో, శౌర్యతో ఇద్దరితో జీవించడం మొదలుపెట్టాడు. తనేమీ బై సెక్షువల్ కాదు.విశ్వైక మీద కోరిక కలిగేది కాదు. తన కోసం వయాగ్రా వేస్కోని సెక్స్ చేయవలసి వచ్చేది. ఎందుకని అడిగేది విశ్వైక. “చెప్పాగా నాకు సమస్య ఉంది” అనేవాడు కానీ అసలు సమస్యల్లా శౌర్యతో తన సంబంధం అని నేరుగా చెప్ప లేదు. చెబితే తాను ఏమైపోతుందో అన్న భయం.నిత్య నరకం అనుభవించసాగాడు. విశ్వైకతో బలవంతపు శృంగారం చాలా స్ట్రెస్ కలిగించేది. విశ్వైక ధైర్యం చెప్పి యాండ్రాలజిస్ట్ దగ్గరకి తీసుకుని వెళ్లింది. సెక్స్ హార్మోన్ ప్రొఫైల్ చేయించి పెద్ద సమస్య లేదని విటమిన్లు,వయాగ్రా లాంటి మాత్రలు రాసారు.ఆ మందుతో విపరీతమైన తల నొప్పి వచ్చేది.గుండె ఎక్కువ సార్లు కొట్టుకునేది.డాక్టర్ చెప్పాడు కూడా.కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఈ మందుకి. పరిమితంగా మాత్రమే వాడాలి.అలవాటుగా వాడకూడదు.సహజమైన కోరికతోనే కలవాలి.మెల్లిగా మీరు ఈ టేబ్లేట్ మానెయ్యాలి. మీరు ఇద్దరూ ఒకసారి సెక్షాలజిస్ట్ ని కలిసి సెక్స్ థెరపీ,సెక్సువల్ కౌన్సిలింగ్ తీసుకోండి” అని చెప్పాడు.డాక్టర్ కి ఏం తెలుసు అసలు విషయం? అదే శౌర్య దగ్గర కోరికతో దేహం నిప్పుల కొలిమై రగులుతుంది.శృంగార వాంఛ హృదయంలో మృదంగంలా మోగుతుంది. శరీరం,సమస్త ఇంద్రియాలూ అతని మీద కోరికతో తీయగా మూలుగుతాయి. శౌర్య తన అనాది ప్రియుడు! యుగాలుగా వేచిన తరువాత,అనంతమైన దుఖవియోగ కాలాల తపస్సు తరువాత దొరికిన తన ప్రాణ సఖుడు. అతను దగ్గర లేక పోవడం,అతని వియోగం హృదయాన్ని దుఃఖంలో ముంచెత్తుతుంది.ప్రియమైన వాడి దగ్గర ఉండలేకపోవడమంత దురదృష్టమేమైనా ఉందా ఈ లోకంలో?శౌర్య దగ్గరికి రెక్కలు కట్టుకుని వెళ్ళిపోవాలని ఉంటుంది. తనకి దూరంగా ఉంటున్న శౌర్యదీ ఇదే బాధ.కానీ విడిగా ఉండలేక పోతున్నారుఇద్దరూ.వారంలో రెండు సార్లు మాత్రమే కలవడం అదీ రకరకాల భయాలతో,నియమాలతో కలవడం ఇద్దరికీ కష్టంగా ఉంది.

***

ఈ ఏడాదిలో పెద్ద సమస్యలు రాలేదు. విశ్వైకకి తెలీకుండా శౌర్యతో తన సంబంధం కొనసాగుతూనే ఉండింది. విశ్వైక తనతో ఆనందంగానే ఉండింది. ఒక పక్క మనసులో విశ్వైకను మోసం చేస్తున్నానన్న పశ్చాత్తాపం తినేస్తున్నది. మరొక పక్క విశ్వైక మీద మనస్సులో కృతజ్ఞత. ఇటు శౌర్యని ఒదులుకోలేని మమకార బంధం. ఎడారీ, వసంతం రెండూ ఒక్కసారి కమ్ముకున్నంటున్నట్లు అనుభూతి. ఉక్కిరిబిక్కిరతనం .అసలొక్కోసారి ఇద్దరినీ ఒదిలిపెట్టి ఎటైనా అదృశ్యమైపోవాలనిపిస్తుంది. బలవంతపు పెళ్లి చేసిన అమ్మ,నాన్నల మీద కోపం వచ్చేస్తుంది.దుఖం కమ్మేస్తుంది.ఏంటీజీవితమని విరక్తి వచ్చేసి ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనిపిస్తుంది. మెల్లిగా ఆల్కహాల్,సిగరెట్లు ఎక్కువైనాయి.పిచ్చోడిలా తయరైపోతున్నాడు.అటు శౌర్య పరిస్థితీ అలాగే ఉంది.తనని మోసం చేసావని కుమిలిపోతూనే ఉంటాడు నిత్యం.ఒకసారి తన ఫ్రెండ్ వసంత్ దగ్గరికి వెళ్ళిపోయాడు.బాధ శ్రుతి మించినప్పుదల్లా అతనే దిక్కూ,గురువు కూడా.”చెప్పు వసంత్, ఇలాంటి పరిస్థితిలో ఏం చెయ్యను”? దు:ఖం మరిచిపోవడానికి విస్కీ చేదుగా మింగుతూ అడిగాడు. వసంత్ తనలాగే ఒక “గే” మరొకరితో సహజీవనం చేస్తున్నాడు. “ఖచ్చితంగా ఉండాల్సింది నువ్వు శౌర్యతో ప్రేమలో ఉన్నప్పుడు, పూర్తి “గే” వి అయినప్పుడు సమాజం కోసం, పరువు కోసం, కుటుంబం కోసం, ఇంట్లో బలవంతం చేస్తున్నారని, విశ్వైకని కచ్చితంగా తిరస్కరించే అవకాశం ఉండి కూడా నువ్వు ఎక్కడో, స్వార్థంగా, లౌక్యంగా ఉన్నావేమో అనిపిస్తుంది. కాస్తేంటీ బాగా మోసపూరితంగా వ్యవహరించావు. అందర్నీ మోసం చేసావు. నిన్ను నువ్వు మోసం చేసుకున్నావు. కచ్చితమైన నిర్ణయం తీస్కోకుండా నువ్వూ నరకం అనుభవిస్తున్నావు. నాకూ వచ్చాయి సంబంధాలు. నన్నూ అమ్మాయిలు ప్రేమించారు కానీ నేను ఖచ్చితంగా తిరస్కరించాను. పేరేంట్స్ నిశ్చయించిన అమ్మాయితో సహా. మా పేరేంట్స్ కూడా నన్ను,జేమ్స్ తో సంబంధం వద్దన్నారు. ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసారు. నేను బయటకి వచ్చేసి నా పార్టనర్‌ జేమ్స్ తో బతుకుతున్నాను. ఎవరినీ మోసం చేయలేదు” అన్నాడు వసంత్. సతీష్ పశ్చాత్తాపంతో ముడుచుకుపోయాడు. కన్నీళ్లు చెంపలెంబడి ధారగా కారిపోసాగాయి.”లేదు వసంత్నేను విశ్వైక తో రెండు మూడుసార్లు చెప్పాను ఆమె అసలు సీరియస్ గ తీసుకోలేదు.నేను తనని పెళ్లి చేసుకోవడం నుంచి తప్పించుకుందామని నేను అబద్దం ఆడుతున్నానుకుంది.ఆమె నన్ను నమ్మలేదు” సతీష్ బాధగా అన్నాడు.”నువ్వు చెప్పా వలసినంత గట్టిగ,స్థిరంగా చెప్పలేదంతున్నాను.సరే ఇప్పటికైనా ఫరవాలేదు. ఏదో ఒక నిర్ణయం తీసుకో .నీ భార్యతో స్పష్టంగా మాట్లాడు. ఈ నిత్య ఘర్షణ,బాధ వద్దు,పైగా నీ భార్యతో సెక్స్ లో పాల్గొనడానికి నువ్వు తీసుకునే వయాగ్రా టేబ్లేట్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని అంటున్నావు.ఈ బాధ అంతా ఎందుకు చెప్పు?నిర్ణయం ఇప్పుడైనా ఖచ్చితంగా తీసుకుంటే ముగ్గురి జీవితాలు బాగు పడతాయి కదా?”వసంత్ ఓదార్పుగా అన్నాడు.”నేను చెప్పే ప్రయత్నం చేసినప్పుడు తను హాస్యంగా కొట్టిపడేసింది, కానీ ఇప్పుడు ఆమెకి నిజం తెలిసిపోయింది. మేమిధారం కలయిక లో ఉన్నప్పుడు చూసేసింది. షాక్ లోకి వేల్లిపాయింది.తట్టుకోలేకపోయింది. దివారాత్రుళ్లు ఏడుస్తూనే ఉంది,నాతో మాట్లాడడం లేదు ” అన్నాడు సతీష్. ” ఎప్పుడో ఒకప్పుడు బయట పడాల్సిందే కదా,మంచిదే అయింది.మాట్లాడు కన్విన్స్ చేయి షాక్ తగ్గి, బాధపోయి నార్మల్ అవడానికి కొన్ని రోజులు పడుతుంది. షీ ఈజ్ ఇన్ పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్. బాధగా ఉంది విశ్వైకని తలుుకుంటుంటే. నేను కూడా మాట్లాడతాను” అన్నాడు వసంత్.
ఈ సంభాషణను గుర్తు చేసుకుంటూ ఎంత దూరం నడిచాడో చూస్కో లేదు సతీష్. “మాట్లాడాలి విశ్వైకతో, కానీ ఆమె తనని ఒదిలి ఉండగలదా? “ఏమో చెప్ప లేం ఆమె ఆత్మ గౌరవం దెబ్బతిన్నది తను మోసం చేసాననుకుంటుందా? తనని అసహ్యించుకోవట్లేదు కదా?సతీష్ దిగులుగా ఇంటి వైపుకి నడిచాడు.

***

ఎంతగా ప్రేమించి, ఎంత ఇష్టంగా చేస్కుంది సతీష్‌ని? తనని ఎంతమంది ప్రేమించినా కాదని సతీష్ తనకు దొరికిన వరమని, ఎంత తపస్సు చేస్తే దొరికాడో కదా అని మురిసిపోయి, వెరవకుండా ప్రేమ లేఖలు రాసీ, వెంటపడి, వెంటపడి అతని ప్రేమని సంపాదించుకుందని?నాన్న కూడా వాళ్లు మిడిల్ క్లాస్, ఆస్తులేమి లేవు అని గొణిగినా అతన్ని తప్ప మరొకర్ని చేస్కోనన్న తన మొండి పట్టుదల ముందు తలవొంచాడు.సతీష్ పెళ్లికి పెద్ద ఉత్సాహం చూపించనితనం అర్థమవుతున్నా తను తేలికగా తీసుకుంది. ఏవో పనుల ఒత్తిడి ఇంట్లో సమస్యలు అనుకుంది. ప్రేమ గుడ్డిది మొత్తానికి. తను ‘గే’ అని చెప్పడానికి ప్రయత్నం చేసాడు కూడా.తానే తేలిగ్గా కొట్టి పడేసింది. నమ్మలేదు.తనని పెళ్లి చేసుకోవం తప్పించుకోవడానికి అలా నాటకాలు ఆడుతున్నాడు అనుకుంది.ఎంత పెద్ద షాక్ ఇది తనకి? ప్రపంచం తలకిందులవ్వడం, లోకం అంధకారం అవడం అంటే ఏమిటో బాగా అర్థం అయింది. అసలు తనకి కొంచెం కూడా అనుమానం రాలేదు. పెళ్లైనాక చాలా సంతోషంగా ఉన్నాం ఇద్దరం. సతీషే లోకంగా బతికింది తను. సతీష్ కూడా చాలా బాగుండేవాడు. జీవితానందం అంటే ఏంటో తెలిసొచ్చిన క్షణాలవి. మూణ్ణెల్లు ఇట్టే గడిచిపోయాయి. మధ్య మధ్యలో సతీష్ ప్రవర్తన ఆశ్చర్యాన్ని,బాధనీ కలిగించినా అతని పట్ల ఉన్న అవ్యాజ్య ప్రేమ వలన సర్దుకుపోయేది. నిత్యం అతన్ని సంతోషంగా ఉంచడానికి ప్రయత్నించేది. నాన్న త్రీ బెడ్రూమ్ ఫ్లాట్ పెళ్లి కానుకగా ఇచ్చాడు. ఇద్దరూ అందులోనే ఉండేవారు. అత్తమామ వాళ్లు,వాళ్ళ ఇండిపెండెంట్ హౌస్‌లోంచి రామన్నారు. తమ ఇద్దరి అభిరుచికి తగ్గట్లుగా ఇంటిని రకరకాలుగా అందంగా అలంకరించుకునేది. తను సతీష్‌ని సంతోషంగా ఉంచడానికి ప్రయత్నించేది. కానీ సతీష్ చాలాసార్లు మూడీగా, డిప్రెస్సడ్ గా కనిపించేవాడు. తనతో సెక్స్‌లో పెద్దగా ఆశక్తి చూపించేవాడు కాదు. అడిగితే స్ట్రెస్ అనే వాడు.డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లింది కూడా. గంటలు గంటలు ఫోన్‌లో మాటలు, వాట్సాప్ ఛాటింగ్‌లు చేస్తూ,ఫోన్ లో ఏవో దిగులు పాటలు వింటూ గడిపేసేవాడు. అర్థరాత్రి పక్కన కనిపించేవాడు కాదు. లేచి చూస్తే ఇంకో బెడ్ రూమ్‌లో తలుపులు వేస్కోని కనిపించేవాడు. “ఏంటిది” అంటే “నాకు కొన్నిసార్లు ఏకాంతం అవసరం అనిపిస్తుంది విశ్వా ఏమీ అనుకోకు” అనేవాడు. తనకు బాధ కలిగేది. తనను కాదనుకునే ఏకాంతం ఏమిటీ అదీ అర్ధరాత్రిళ్లు అనిపించేది. అతని కొలిగ్ అడ్వకేట్ శౌర్య ఎప్పుడూ వెన్నంటి ఉండేవాడు. ఇంట్లోని ఆఫీస్ రూంలో, ఒక్కోసారి గెస్ట్ బెడ్‌రూమ్‌లో గంటలకొద్దీ గడిపేవారు.

“ఆఫీస్ వర్క్, అవే కేసులు డిస్కస్ చేస్తున్నాం” అనే వాడు తనతో. వాళ్లిద్దరూ ప్రాణ స్నేహితులకంటే కూడా ఎక్కువ చనువుగా ఉండేవాళ్లు. తన కళ్ల ముందే సతీష్‌ని ఉన్నట్లుండి కౌగలించుకునేవాడు శౌర్య.ఆ కౌగిలి ఇద్దరు మగ స్నేహితుల సాధారణ్ కౌగిలిలా అనిపించేది కాదు.ఇద్దరు ప్రేయసీ ప్రియుళ్ళ మోహ కౌగిలిలా, విడిపోవడానికి ఇష్టపడని సుదీర్ఘ కాలానంతర సంగమాలింగనంలా అనిపించేది.చాలా దగ్గరగా రాసుకుంటూ కూర్చొనే వాళ్లు ఇద్దరూ. శౌర్య, సతీష్‌ను చూసే చూపులు కూడా వింతగా ఉండేవి. ఎంతో ఇష్టంగా ఒక మైకంలో ఉన్నట్లు చూసేవాడు.మళ్ళీ కనిపించడేమో అన్న లాలస కనిపించేది అతని కళ్ళల్లో. శౌర్య చూపులకు సతీష్ బ్లష్ అవడం తనకు వింతగా అనిపించేది. తనకు ఏవో అనుమానాలు రాసాగాయి. కొన్నిసార్లు సతీష్ ఉన్నట్లుండి వారం రోజులంటూ గోవా, బాంబే, బెంగళూరు అఫిషియల్ ప్రాజెక్ట్ ట్రిప్స్ అంటూ వెళ్లిపోయేవాడు. అలా వెళ్లొచ్చాక చాలా హ్యాపీగా కనిపించేవాడు. ఆ టైమ్‌లో శౌర్య కూడా సిటీలో కనిపించేవాడు కాదు. ఇలాగే తొమ్మిది నెలలు గడిచిపోయాయి. ఇదంతా తనకు ఎంతో ఆత్మీయంగా మారిపోయిన సతీష్ చెల్లెలు రజనీతో చెప్పుకునేది తను. ఆమె దగ్గరా సమాధానం లేదు.

“మీ అన్న శౌర్యతో అంత చనువుగా ఎందుకుంటాడు?” అనే ప్రశ్నకి “నువ్వు కాస్త ఎక్కువగా ఆలోచిస్తున్నావేమో వదినా” అనేది రజని గాభారాగా. రజని ఏదో దాస్తుందేమో అనిపించేది. తనకి తన ‘లా’ ప్రాక్టీస్ మీద ఆసక్తి పోయింది. ఏదో బాధ, దు:ఖం ఒంటరితనం తనని వేధించసాగాయి. శౌర్య తనకు తెలిసిన కార్పొరేట్ కంపెనీలో లా ఫర్మ్‌లో ఉద్యోగం ఇప్పిస్తాన్నాడు. తనే ఒద్దంది. అలా సాగుతున్న తన జీవితంలో స్తునామీ ఒక్కసారి వచ్చిపడింది. ఒక రోజు ఒక ఎల్ .ఎల్. బీ కాలేజీకి గెస్ట్ ట్యూటర్ గా నాలుగు రోజులు సదస్సుకు విజయవాడకి వెళ్లాల్సి వచ్చింది. కానీ సదస్సు మూడు రోజుల్లోనే ముగిసిన పోయింది. మధ్య మధ్యలో సతీష్ నుంచి మెసెజీలు వస్తూనే ఉన్నాయి. “ఎప్పుడు వస్తున్నావు’ ‘మిస్ యూ’, ‘ఐ లవ్యూ” అంటూ. అవేవి తనకి ఆనంధాన్నివ్వడం లేదు. ఇన్నేళ్ల ప్రేమ ఆకర్షణ ఎటుపోయాయో అర్థం కాలేదు. తను విజయవాడ నుంచి హైదరాబాద్‌కి బయలుదేరింది. ఫ్లాట్‌కి వచ్చి తన దగ్గర ఉన్న ఎక్స్ ట్రా కీస్‌తో మెయిన్ డోర్ తెరవబోయింది. కానీ తలుపు లాక్ వేసి లేదు. ఆ సమయంలో సతీష్ ఆఫీసులో ఉంటాడు. ఆశ్చర్యంగా లోపలికి వెళ్లింది. హాల్లో షూస్ శౌర్య వే. బెడ్రూంలోంచి ఏవో శబ్దాలు, చిన్న అరుపుల్లాంటివి వినిపిస్తున్నాయి. మెల్లగా శబ్దం లేకుండా వారగా వేసి ఉన్న తలుపులను తోసింది. ఎదురుగా కనిపించిన దృశ్యం తనలో ప్రకంపనలు సృష్టించింది. ఒణికిపోయింది. స్థాణువైపోయింది మెదడు స్తంభించిపోయింది. మంచం మీద సతీష్, శౌర్య పూర్తిగా నగ్నంగా ఉన్నారు. పక్కనే ల్యాప్టాప్‌లో సతీష్‌కి ఇష్టమైన ఫంకజ్ ఉదాస్ హిందీ గజల్ “ఆఫ్ జిన్ కే కరీబ్ హో తే హై, ఓ బహూత్ ఖుష్ ససీబ్ హోతేహై”{నువ్వు ఎవరికి దగ్గరగా అయితే ఉంటావో,వాళ్ళు చాలా అదృష్టవంతులు”} వినిపిస్తోంది. ఇద్దరూ మైమరచి ఉన్నారు. దృఢమైన సతీష్ పూర్తిగా శౌర్య వీపు మీద వాలిపోయి ఉన్నాడు. ఇద్దరి దేహాల కదలిక పెనవేసుకున్నరెండు పాముల నృత్యంలా ఉంది. గదిలోంచి ఏదో పరిమళం, వాళ్లెంతగా నిమఘ్నమైపోయి ఉన్నారంటే తనను అస్సలు గమనించనే లేదు. “స్టాపిట్” అంటూ తను అది తనకే నొప్పి భరించలేని ఆక్రందనలాగా వినిపించిది. వాళ్లిద్దరూ ఒక్కసారి తేరుకున్నారు. విడిపోయి, ఖంగారు,ఖంగారుగా దుప్పట్లు కప్పుకుని బట్టలు వెతుక్కుంటూ దొరికినదాంతో ఒళ్లు కప్పుకుంటున్నారు. అంటే,ఇన్ని రొజులూ సతీష్ తనొక ‘గే’అని చెబుతూ వస్తున్నది అబద్దం కాదన్నమాట . ఈ పచ్చి నిజం కళ్ళెదుట సాక్షాత్కరించి తనని నిలువెల్లా వణికించింది.
సతీష్ పరమ వింతగా, కొత్తగా కనిపించాడు. సిగ్గుతో, ఖంగారుగా పక్క చూపులు చూస్తున్నాడు. పరిగెత్తుకుంటూ ఒక్కదుటున ఇంటి నించి బయటపడుతుంటే సతీష్ వెనక నించి “విశ్వా” ఆగు అంటూ వెంటబడ్డాడు.

***

“విశ్వా నన్ను క్షమించు నీకు ఈ విషయం క్లియర్‌గా చెప్పాల్సింది” విశ్వైక ఏం మాట్లాడలేదు.” భయపడ్డాను.ఇంట్లో ఒత్తిడి ఎక్కువైంది. పైగా నీకు చెప్పాలని ప్రయత్నిస్తే నువ్వు లైట్‌గా తీసుకున్నావు నమ్మనే లేదు. అయినా నేను అసలు విషయం ఇదీ అని స్పష్టంగా చెప్పాల్సింది. నాదే తప్పు. అమ్మ,చెల్లె కోసం ఎక్కడో నాలో స్వార్థం పని చేసింది” కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్పాడు సతీష్.

“ఇంకో విషయం విశ్వా! నాకీ జీవితం వద్దు రెండు మొఖాలేసుకుని, ఇద్దరు మనుషుల్లా బతకలేను. నేను బైసెక్సువల్‌ని కాను విశ్వా పూర్తిగా “గే”ని. నాకు నీ పట్ల ప్రేమే గానీ, కోరిక లేదు. ప్రమాదకర మందులు వేసుకుంటూ నీతో సెక్స్ జీవితాన్ని గడపలేను. నాకు శౌర్య కావాలి. శౌర్యతోనే నా మనోదేహాలు వికసిస్తాయి.నేను నిజమైన మనిషిలా ఉంటాను నటించను జీవిస్తాను. విశ్వా ఇప్పటికైనా ఇష్టం వచ్చినట్లు జీవించాలని ఉంది. నేనిక నటించలేను నాకిక ముక్తి ప్రసాదించు నన్ను క్షమించు, నన్ను కరుణించు నన్ను శౌర్య దగ్గరికి పంపించు.నాకు శౌర్య నివ్వు . నిన్నొక దేవతలా పూజించుకుంటాం నేనూ,శౌర్యా ఇద్దరమూ” వలా వలా ఏడుస్తూ విశ్వైక కాళ్ల మీద పడ్డాడు సతీష్.

విశ్వైక ఆశ్చర్యపోయింది. తన మీద కాకుండా శౌర్య మీద సతీష్‌కి అంత ప్రేమ, నిజమైన ప్రేమ , తనని కాదనుకునే ప్రేమ, శౌర్య దగ్గరికి చేర్చమని విలవిలా దు:ఖిస్తూ కాళ్ళ మీద పడి వేడుకునేంత ప్రేమ ఉండడం ఆమెని నిర్ఘాంత పరుస్తున్నది.విశ్వైకలో ఏదో జరిగిపోతోంది. స్పష్టత ఏదో వస్తోంది.పొరలు పొరలుగా ఆమెలో ఏదో విడిపోతున్నది. ఆమె కన్నీళ్లు తుడుచుకుంటూ కింద పడి దుఖిస్తున్న సతీష్‌ని తప్పుకుని గది బయటకు వెళ్లిపోయింది.

***

“లేదు నాన్నా, నాకే బాధా లేదు. నేను సతీష్‌ని ప్రేమించింది నిజం. అయితే అతనికి నా మీద ప్రేమ లేదన్నదీ అంతే నిజం. నేనతన్నిబాగా బలవంత పెట్టాను. అతను నాకు తన సెక్సువల్ ఐడెంటి టీ ని చెప్పాలని ప్రయత్నం చేసినప్పుడల్లా కొట్టిపడేసేదాన్ని. అతనికి ఇంకో స్త్రీ మీద ప్రేమ, మోహం ఉంటే బాధ కలిగేది. నాన్నా కానీ అతనికి తనలాంటి మరో పురుషుడి మీద ప్రేమ, ఆకర్షణ ఉన్నాయి. అతను“గే”అని తెలిసి నా దగ్గర కొంత కాలం దాచాడు. అదీ నన్ను బాధపెడుతోంది.అయితే నిజాయితీగా చెప్పటానికి ప్రయత్నించాడు. నేనే పెద్దగా పట్టించుకోలేదు నాన్నా. పైగా వాళ్లమ్మ ఆత్మహత్యా ప్రయత్నం చేసింది.నేన,నన్ను చేసుకోక పోతే చచ్చిపోతానని బెదిరించాను. నేను చాలా ఆలోచించాను నాన్నా. విశ్వైక తండ్రి భుజాల మీద తలవాల్చి మెల్లిగా అంది.కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్న తల్లిని దగ్గరికి తీసుకుని ఏడవద్దన్నట్లు తల ఉపుతూ మెల్లిగా కళ్ళు తుడిచింది.

“కోరికలు, ఇష్టం లేకపోయినా అతన్ని నాతో జీవించమనడం తప్పు నాన్నా.అతన్నైనా ప్రేమించిన మనిషితో బతకనిద్దాం. వద్దు! నువ్వెవరితో మాట్లాడొద్దు. మాట్లాడినా నేను అతనితో ఉండను.అతనూ నాతో ఉండదు.శౌర్యను అతడు గాడంగా ప్రేమిస్తున్నాడు .ప్రేమికులను విడదీయడం పాపం నాన్నా. అతను, శౌర్యతో ఉండడమే న్యాయం నాన్నా. వద్దు నాన్నా “గే” గా బతకడం, పురుషుడి మీద పురుషుడికి ప్రేమా, ఆకర్షణ ఉండడం తప్పు కాదు నాన్నా! ప్రకృతంత, సూర్యోదయమంత,స్వచ్ఛమైన జలపాతం అంత, తోటలో పూసే పువ్వుంత సహజమైంది నాన్నా. అతన్ని, నాతో కలిసి బతకమనడమే అసహజం,నేరం! అమ్మావదిలెయ్, నా జీవితం ఏమవుతుందీ చెప్పు? ఏమీ కాదు, కోలుకుంటాను. నా జీవితం ఇంకా చాలా మిగిలే ఉంది అమ్మా. కాకపోతే సతీష్‌ని మరిచిపోవడానికి కాస్తం సమయం పడుతుంది.అమ్మా, అన్నట్లు సతీష్-శౌర్య వాళ్ల కొత్త ఇంటికి లంచ్‌కి పిలిచారు. ఉంటా నాన్నా నేను వెళ్లాలి.ఏం లేదమ్మా నేనేం బాధ పదను.సతీష్ సంతోషమే నాకు ముఖ్యం అమ్మా.నేనేం త్యాగం చేయలేదు. న్యాయంగా జరగాల్సింది జరిగేట్లు చేసాను. సరే అమ్మా రాత్రి తొమ్మిది కల్లా వచ్చేస్తాను.మీరిద్దరు డిన్నర్ చేసెయ్యండి” విశ్వైక గుండెల్లో బాధ అణుచుకుంటూ తన గదిలోకి వెళ్ళింది.మెల్లిగా గోడ మీద ఉన్న తనవి, సతీష్‌వి పెళ్లి ఫోటోలు తీసేసి బీరువాలో సర్దేసింది. సతీష్ ఫోన్ మోగింది. “సతీష దార్లోనే ఉన్నా వస్తున్నా పది నిమిషాలంతే” అంది.

డా. భారతి : Psychotherapist & marital counselor. కలం పేరు గీతాంజలి. పుట్టిన స్థలం హైద్రాబాద్. ర‌చ‌న‌లు: 'ఆమె అడవిని జయించింది', 'పాదముద్రలు'. లక్ష్మి (నవలిక). 'బచ్ఛేదాని' (కథా సంకలనం). 'ప‌హెచాన్‌' (ముస్లిం స్త్రీల ప్రత్యేక కథా సంకలనం), 'పాలమూరు వలస బతుకు చిత్రాలు' (కథా సంకలనం), 'హస్బెండ్ స్టిచ్' (స్త్రీల విషాద లైంగిక గాథలు) 'అరణ్య స్వప్నం' (కవితా సంకలనం) సెప్టెంబర్ 2019 లో విడుదల అవుతుంది.

Leave a Reply