అతనలానే…

జీవితానికి ఎవడు భయపడతాడు
వేయి రెక్కల గుర్రమెక్కి
భూనభోంతరాళాలు సంచరించే
ఊహల విశ్వనాథుడు భయపడతాడా-
మట్టిని మంత్రించి సర్వ వ్యాధి నివారణోపాయాన్ని
కనుగొన్న చెరకుడు భయపడతాడా
అతనికి ప్రతిదీ ఒక సవాలు
స్థూపంలాంటి ఒక ప్రశ్న- ప్రశ్నల
మూల మూలాల్ని వెదికి పట్టుకునే ఎరుకలవాడు
నెరుస్తాడా- వెన్ను చూయిస్తాడా
రాయో, ర‌ప్పో, రాజ్య‌మో, గీజ్య‌మో
సర్వాన్ని జీర్ణించుకునే- ‘వాతాపి జీర్ణం’ విదురుడు
ఎక్కడికీ వెళ్లడు, అన్నింటినీ కలిపి కుట్టేస్తాడు
సమ‌ర్థనలుంటాయి, దిద్దుబాటులుంటాయి
ఖండ ఖండాలుగా నరికి అవతల పారేయాల్సినవీ
వుంటాయి, ఊరేగుతూ యింటింటినీ తాకుతూ
విధిని వెక్కిరిస్తూ
ప్రతి మనిషి చుట్టూ ముగ్గు పోస్తాడు
మనిషిని చూసి జీవితం వెరవాలి
పప్పీలాగ కాళ్ల చుట్టూ తిరగాలి
జీవితానికి ఎవడు భయపడతాడు
ముఖ్యంగా కవి భయపడతాడా
భయానికే భయమయిన మాంత్రికుడు
కవి భయపడతాడా

క‌ల కేంద్రంగా భ‌విష్య‌త్తుకు రూప‌మిచ్చే
క‌వి భ‌య‌ప‌డ‌తాడా
దారి చూపుతూ తెప్పోత్స‌వం చేసే
మ‌నిషి భ‌య‌ప‌డ‌తాడా-
అత‌ని వేళ్ల చివ‌ర‌లు చూడండి-
అవి జాతులు, న‌దులు, ప్ర‌పంచ ప్రాణ కేంద్రాలు
నిత్య సంచారి చెంచువాడు క‌వి భ‌య‌ప‌డ‌తాడా

చినుకులు రాల‌నీ, రాళ్లు ప‌గ‌ల‌నీ
రాత్రుళ్ల మీద పూలు కుర‌వ‌నీ-
అత‌ను ముందుకే మున్ముందుకే
అత‌ని వెన‌కాల ఒక కుక్క ఉంటుంది
కూర్మికి మారు పేరైన కుక్క ఉంటుంది
అత‌నూ భుజం మీద కొంకె క‌ర్ర‌తో
స‌ద్దిమూట‌తో – అత‌న‌లానే
కాలం పుట్టిన‌ప్ప‌టి నుంచీ అత‌న‌లానే
అత‌న‌లానే-

జ‌న‌నం: కార్మూరివారి పాలెం, గుంటూరు జిల్లా. 1967 నుంచి వివేక‌వ‌ర్ధిని డిగ్రీ కళాశాల‌(హైద‌రాబాద్‌)లో ఆంగ్లోప‌న్యాస‌కులుగా ప‌నిచేసి ప‌ద‌వీ విర‌మ‌ణ చేశారు. ర‌చ‌న‌లు: 'ర‌క్తం సూర్యుడు', 'ఆసుప‌త్రి గీతం', 'మోహ‌నా ఓ మోహ‌నా', 'అంతర్జ‌నం'... 25 క‌వితా సంక‌నాలు ప్ర‌చురించారు. 1970-72మ‌ధ్య రెండేళ్ల పాటు 'వేకువ' అనే సాహిత్య ప‌త్రిక న‌డిపారు. కేంద్ర సాహిత్య అకాడ‌మీ, స‌ర‌స్వ‌తీ స‌మ్మాన్ అవార్డులు పొందారు.

Leave a Reply