అడోనిస్ – ఆధునిక అరబ్ కవిత్వానికి తొలి చిరునామా

‘అడోనిస్’ అన్న పేరుతో సుప్రసిద్ధుడైన ‘అలీ అహ్మద్ సయీద్ ఎస్బర్’, అంతర్జాతీయ కవిత్వానికి సిరియా దేశం ఇచ్చిన గొప్ప కానుక. అరబ్ చారిత్రక మూలాలను విడిచి పెట్టకుండానే ఆధునికతను, తిరుగుబాటును ధ్వనించే కవిత్వం అడోనిస్ సొంతం. అప్పటిదాకా వెలువడిన అరబ్ కవిత్వాన్ని భిన్న మార్గంలో నడిపి, ఆధునిక అరబ్ వచన కవితకు ఆద్యునిగా గౌరవం పొందినవాడు అడోనిస్. 1988 వ సంవత్సరం నుండి అనేక సార్లు సాహిత్య నోబెల్ బహుమతికి నామినేట్ అయిన అరుదైన కవి. 1 జనవరి, 1930 న సిరియా లోని అల్ ఖసాబిన్ గ్రామంలో జన్మించిన అడోనిస్ గొప్ప అనువాదకుడు కూడా!

20 కవితా సంకలనాలు, 13 విమర్శ గ్రంథాలు, డజన్ల కొద్దీ అనువాద గ్రంథాలు వెలువరించిన అడోనిస్ ను అరబ్ ప్రపంచ ‘లివింగ్ లెజెండ్’ గా అంతర్జాతీయ కవిత్వ ప్రపంచం గౌరవిస్తుంది. ఆయన 1964 లో వెలువరించిన ‘సమగ్ర అరబ్ కవిత్వ సంపుటులు’ ఇప్పటికీ క్రమం తప్పక పునర్ముద్రణలో వుంటాయి.

చిన్ననాట స్కూలు చదువుకు కూడా నోచుకోని అడోనిస్, తన గ్రామం లోని మసీదు ఆవరణలో ఖురాన్ ను చదువుకున్నాడు. దానికి తోడు, తండ్రి ద్వారా ప్రాచీన అరబ్ సాహిత్యం పట్ల యిష్టం పెరిగింది. 1944 లో కొత్తగా ఏర్పడిన రిపబ్లిక్ ఆఫ్ సిరియా అధ్యక్షుడు అడోనిస్ నివసించే గ్రామానికి వొచ్చినపుడు, ఆయన సమక్షంలో అడునిస్ ఒక కవిత వినిపించాడు. ఆ సంఘటన, తదనంతర కాలంలో అడోనిస్ ఉన్నత చదువులు చదవడానికి బాటలు వేసింది.

సైన్యంలో పనిచేస్తున్న 1955-56 కాలంలో, సిరియన్ సోషల్ నేషనలిస్ట్ పార్టీ లో సభ్యునిగా వున్నందుకు అడోనిస్ జైలు పాలయ్యాడు. ఒక వ్యవస్థగా మొత్తం సమాజం మీద రుద్దబడే మతం పట్ల స్పష్టమైన వ్యతిరేకతను కలిగి వున్న అడోనిస్, వ్యక్తిగత మత స్వేచ్ఛ మాత్రం వుండవలసిందే అన్నాడు. మతానికి, కవిత్వానికి వున్న భేదం గురించి చెబుతూ, ‘మతం జవాబు వంటిదైతే, కవిత్వం ఎప్పుడూ ప్రశ్న వంటిదే’ అన్నాడు. 2011 లో సిరియా దేశ పౌరులు వేలాదిగా నిరసన వ్యక్తం చేస్తూ రోడ్ల మీదకు వొచ్చి ప్రాణాలు కోల్పోయినపుడు కూడా, ‘మసీదుల నుండి బయలుదేరే నిరసనలను నేను సమర్థించలేను’ అని ప్రకటించి విమర్శల పాలయ్యాడు.

1956 లో సిరియా విడిచి వెళ్ళిన అడోనిస్, లెబనాన్, ఫ్రాన్స్ దేశాలలో ఎక్కువ కాలం గడిపాడు. ఆ కాలంలోనే సరికొత్త అరబ్ కవిత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తూ, అరబ్ జాతీయతను గూర్చి తాను కన్న కలలను మేనిఫెస్టోల రూపంలో రచించాడు. అతని కవిత్వం నిండా మార్మికతను నింపుకున్న అరబ్ జాతీయ భావాలు పలకరిస్తాయి. ప్రొఫెసర్ గా, విజిటింగ్ ప్రొఫెసర్ గా లెబనాన్, ఫ్రాన్స్, మొరాకో, అమెరికా వంటి దేశాలలో పనిచేసి, చివరికి భార్య, ఇద్దరు కుమార్తెలతో కలిసి ప్యారిస్ లో స్థిరపడ్డాడు.

//ఇరవయ్యవ శతాబ్దం//
పసి పిల్లల ముఖాన్ని ధరించిన శవపేటిక
కాకి గుండెల్లో రాయబడిన ఒక పుస్తకం
కల్లోలం సృష్టించే మారణాయుధాన్ని ధరించి
వేగంగా దూసుకు వెలుతున్న భయానక మృగం
పిచ్చివాడి ఊపిరితిత్తుల లోపల శ్వాసించే రాయి
ఇదే ఇరవయ్యో శతాబ్దం

//పిల్లలు //
పిల్లలు వర్తమాన పుస్తకాన్ని చదివి,
చితికిన అవయవాల గర్భాలలో
ఇది వికసించే సమయం అంటారు
పిల్లలు ఇలా రాసుకుంటారు
మృత్యువు భూమిని ఎలా కబళిస్తుంది
నీరు నీటికి ఎలా ద్రోహం చేస్తుంది

//మృత్యువు కోసం ఒక ఉత్సవం //
మరణం వెనుక నుండి మాత్రమే వొస్తుంది
అది మన ముందుకు వచ్చినప్పుడు కూడా
జీవితం మాత్రమే దానితో యుద్ధం చేస్తుంది
కన్ను ఒక రహదారి
రహదారి ఒక కూడలి
ఒక పిల్లవాడు జీవితంతో ఆడుకుంటాడు
ఒక వృద్ధుడు జీవితం మీద వాలిపోతాడు
మాట్లాడీ మాట్లాడీ నాలుక తుప్పు పట్టిపోతుంది
కలలు కరిగిపోయి కన్నులు పొడిబారిపోతాయి
ముఖం మీద ముడతలు – గుండెలో గుంతలు
శరీరం, సగం వంగి పోయి తెరిచిన తలుపు
తల, ఒకే రెక్కతో ఎగిరే సీతాకోక
మృత్యువు లేఖ అందించాక
ఆకాశం నిన్ను చదువుతుంది
మనిషి ఒక పుస్తకం
జీవితం దానిని నిరంతరం చదువుతూ వుంటుంది
మృత్యువు ఒక్కసారే ఒక్క వుదుటున చదివేస్తుంది
మరి ఈ నగరం ఏమిటి?
కాలం అనే నిశీధిలో
చేతికర్ర వలె ఉదయం పలకరిస్తుంది
ఇంటి తోట లోకి వసంతం వచ్చింది
కూడా తెచ్చిన కానుకలన్నింటినీ
తన చేతుల నుండి కురిసే వర్షం కింద
తోట లోని చెట్లకు ఇవ్వడం ప్రారంభించింది
కవి ఎప్పుడూ ఎందుకు పొరబడతాడు?
వసంతం అతనికి ఆకులను ఇస్తుంది
కవి వాటిని తన అక్షరాలతో అలంకరిస్తాడు
మన ఉనికి, కిందకు జారవిడిచే ఒక వాలు
మనం నిరంతరం పైకి ఎగబాకడానికి జీవిస్తాము
నేను ఈ మట్టిని అభినందిస్తున్నాను
నీటినైనా ఎండమావినైనా
ఈ పాత్ర లో కురిపించేది
మట్టి మాత్రమే కాబట్టి

పుట్టింది, పెరిగింది వరంగల్ లో. హైదరాబాద్ లో నివాసం. నాలుగు కవితా సంపుటులు (వాతావరణం, ఆక్వేరియం లో బంగారు చేప, అనంతరం, ఒక రాత్రి మరొక రాత్రి) వెలువడినాయి. కొన్ని కథలు, పుస్తక సమీక్షలు, సాహిత్య వ్యాసాలు కూడా.

Leave a Reply