అడివంచు రైల్వే స్టేషన్

అబ్బాయీ…! యెలా వున్నావు? యేం చేస్తున్నావు? యేమైనా తిన్నావా? యెప్పటిలాగేరొటీన్ పలకరింపులే!

నువ్వు యెలా వుంటావో, యేం చేస్తున్నావో, యేమి తింటావో ప్రతిదీ గుండెకు తెలుస్తూనేవుంటుంది. దస్తోవిస్కీ రాసిన క్రైం అండ్ పనిష్మెంట్ నవలలో చివరి ఘట్టం నీకుగుర్తుండే వుంటుంది కదా. అపారమైన చదువరివి. నిన్ను యిలా ప్రశ్నించడంయెందుకు? ప్రవాస శిక్షలో వున్న రాస్కోల్నికోవ్ కోసం యెంతో శ్రమపడి అన్ని వదులుకొనిసైబీరియాకు వస్తుంది సోఫియా. వో ప్రశాంతమైన రోజు నది వొడ్డున వున్న తాను పని చేసేసున్నంబట్టి వద్దకు వెళ్లి వంట చెరుకు మోపు మీద కూర్చొని నదీప్రవాహాన్ని చూస్తూ, ఆవలి వొడ్డు నుండి నుంచి మెల్లగా వినిపిస్తున్న సన్నని సంగీతాన్ని వింటూ వుంటాడు. అక్కడికి పచ్చని శాలువ కప్పుకొని వస్తుంది సోఫియా. చిరునవ్వుతో బెరుగ్గా చెయ్యిచాపుతుంది. హస్తం చాచినప్పుడల్లా ఆమెకేదో జంకు అతను నిరాకరిస్తాడేమోనని, యెందుకంటే యెప్పుడూ యేదో ఆయిష్టతతో చెయ్యి కలిపినట్టు కనిపిస్తాడు. మౌనంగా వుంటాడు. చూపులు దించేసుకుంటాడు. కానీ యీసారి వారి హస్తాలు విడిపోవు. రాస్కోల్నికోవ్ చటుక్కున ఆమె పాదాల ముందు వాలి కన్నీళ్ళు కారుస్తూ ఆమె కాళ్ళనుపెనవేసుకుంటాడు. నువ్వు ప్రతిసారీ సంశయంగా ప్రశ్నించినప్పుడల్లా నాకు యిదే దృశ్యంగుర్తుకొస్తుంది. నీ పిలుపు కోసం మూడు రోజుల నుంచి చూసి వెళ్ళిపోతున్నానుబరువెక్కిపోయిన గుండెలతో. నీ కన్నీటి చారిక మీదుగా, గాయపడి నీ గుండెలు చెమర్చిననెత్తుటి మడుగుల మీదుగా, పాత మిత్రులను వదిలి వెళ్ళిపోతున్నాను. నిజంగా యీసారిచాలా వొంటరిగా వెళుతున్నాను. ఆకాశం సైతం మబ్బు పట్టి రోదిస్తున్నట్టుగా వుంది. యిదియెప్పుడూ నాలోకి నేను చేసే ప్రయాణం. నా బెంగలోకి, నా దుఃఖం లోకి, నా తడి ఆరనిగాయాల్లోకి, నా ఆదిమ గానాల్లోకి చేసే ప్రయాణం. యెప్పుడూ నా జన్మస్థలానికి, నావైన మూలాల్లోకి నేను చేసే యాత్ర లాగా అనిపించే యీ ప్రయాణం నీ నుంచి దూరంగా వస్తున్న ప్రతిసారినేనేమిటి అనే శోధనలోకి చేస్తున్న వేదనామయ ప్రయాణంలాగా యెందుకుంటుంది? నీవు పిలుస్తావని యీ అడివించు రైల్వేస్టేషన్లో నాలుగు రోజులుగా నిరీక్షిస్తూనే వున్నానుఖాళీ పట్టాలనే చూస్తూ.

పట్టాల మీదగా సుదూరాల నుంచి వచ్చే గాలి శబ్దాన్ని వింటూ అప్పుడప్పుడు గూడ్స్ బళ్లబారులు, వాటిమీద గుట్టలుగా పేర్చిన కలప దుంగలు. అడవిని నరికి చెక్కముక్కల్నితరలించుకుపోతున్నట్లుగా లేదు. అమానుషంగా నరకబడి, నెత్తురోడుతున్నమాంసఖండాలలా కనిపిస్తున్నాయి. ఆ మాంసంలో నా పూర్వీకుల నెత్తురుంది. చెమటుంది. మూలాలు వున్నాయి. స్వప్నాలు వున్నాయి. వాటిని సమూలంగాపెకిలించుకుపోతున్నారు. ఆవరించుకున్నబెంగకు తోడు యేదో అంతులేని వేదన. దీన్నిఆపాలి. బెంగనీ, వేదనని కూడా. నిన్ను ఆగిపొమ్మని చెప్పలేదని నీవు గాయపడ్డావు. కానీపెదవి కింద నొక్కి పెట్టుకున్న ఆక్రందనని అర్ధమయ్యేలా చెయ్యాలంటే మళ్ళీజీబనానందుడి దగ్గరికి వెళ్లాల్సిందే! నీకు గుర్తు వుండే వుంటుంది కదా… ఆ కవితని అనువాదం చేశావు నువ్వు.

“వెళ్లొద్దు సురంజనా! అక్కడికి వెళ్లొద్దు నువ్వు.
అక్కడ యెవరిని పలకరించొద్దు నువ్వు.
వెళ్లొద్దు సురంజనా అక్కడికి వెళ్ళొద్దు నువ్వు”
యింతకు మించిన ఆక్రందన యే మౌనం మాటున దాగి వుంటుందో చెప్పు?

‘నువ్వుఅక్కడకు వెళ్ళొద్దు’ అనే వేడుకోలు పంటి కింద నొక్కి పట్టిన పెదవి గాయపు లోతుల్లోనేసుడులు తిరుగుతోంది. నిజంగానే తెలియదు. నువ్వెళ్ళే పని యేమిటో? ప్రాముఖ్యతయేమిటో? యిక యెలా ప్రాధేయపడగలను? నెపం నీ మీదకు తోయడం లేదు క్షమించు. నేనిక్కడ నా ఆకురాలు అరణ్యంలోకి ప్రవేశించాను. నేను వదిలి వచ్చినప్పుడిలా లేదు. పచ్చగా వీడ్కోలు నిచ్చింది. వెచ్చగా కరచాలనం చేసింది. యెప్పుడు పచ్చగానే వుండే వెలైకొంగు చెట్టు సైతం పసుపచ్చని ఆకుల్ని రాల్చుకుంటుంది. కొండంచు వంపు తిరిగి రాళ్లవాగులోకి దిగాను. వాగులో నీళ్ళు లేవు. యీ వాగు అంతా కప్పేసిన రాలుటాకులే. కళ్ళల్లోచెమ్మ. కొంత దూరం నడిచేసరికి వాగులోని వో బురద మడుగులో చేతిలోని చిన్నపంచెముక్కతో చేపలు పట్టేందుకు ప్రయత్నిస్తున్న వో యేడెనిమిదేళ్ళ కుర్రాడు. వొక్కడికే ఆపంచె చెంగుల్ని పట్టుకోవడం సాధ్యం కావడంలేదు. మడుగు పక్కన నుంచొని చూస్తున్ననన్ను చూసి ఓ చిరునవ్వు నవ్వాడు. అంతే ఆలోచించకుండా ఆ మడుగులోకి దిగేసిపంచె రెండో చెంగు పట్టుకుని చేపలు పట్టాం. వో గంట ప్రయత్నిస్తే రెండు పిడికిళ్ళ చేపలు. ఆ పిల్లాడి కళ్ళల్లో నిండైన వెన్నెల మడుగు. పైకొచ్చి చూసుకుంటే నీవు ముంబాయి అంతాతిరిగి యెంతో యిష్టంతో కొనుక్కొచ్చిన ఖరీదైన తెల్లని బూట్లు కాస్తాబురదమయమైపోయాయి. కోపంతో అదిరే నీ పల్చని గెడ్డపు బుగ్గ గుర్తొచ్చింది. గబగబా ఆబూట్లు విప్పేసి శుభ్రంగా కడుక్కొని, సాక్సులు పిండేసి, వో కర్రకు కట్టుకొని, దిస పాదాల తోనేగుచ్చుకుంటున్న రాళ్ళ దారివెంట నడవడం మొదలు పెట్టాను… బండల మీదుగాకుంగిపోతున్న పొద్దువైపు చూస్తూ … రాస్తానని నీకు వాగ్దానం చేసిన నవల ఆ పదిపేజీల దగ్గరే ఆగిపోయింది.

పసిపిల్లాడికి పాలు లేకుండా చేసిన ఆ పసితనపు గిల్టీభావనాగాయం దగ్గరేఆగిపోయింది. యిప్పుడీ పిల్లాడు చేపల కోసం చేసిన లాంటి యుద్ధం అప్పుడు ఆ నవల్లో పిల్లవాడు యెందుకు చేయలేకపోయాడనే ఆలోచన మరింత దట్టంగా ఆవరించుకుంది. చెప్పు… నిన్ను యెలా నమ్మించను నువ్వే నా మనసని! రూమీలాగా చెప్పనా?

“ప్రేమ
నా శరీరంలోకి రక్తంలాగ వచ్చింది
నా నరాల గుండా పరిగెత్తి
నా హృదయాన్ని చుట్టేసింది.
నీ సమక్షంలో నేను చూశాను ప్రేమ స్పర్శ ని…
నా యెడమ అరచేతి మీద
నా నుదుటిమీద
నా కనురెప్పల మీద
నా కంఠం మీద
నా వేళ్ళ కొసల మీద
నా కుడి చేతి బొటని వేలి మీద
ప్రేమ స్పర్శ…
యిప్పుడు నువ్వు నాలో
చూసేది కేవలం పై తొడుగులనే
మిగిలినదంతా ప్రేమకు చెందినవే.
నీకు మాత్రం చెందినవే!” అంటూ.

యింకా అపనమ్మకమే కదా నీకు? పోనీ ద్యూయ్ షేన్ గుర్తున్నాడు కదా… కజాహ్ స్తెప్మైదానం నుంచి విశాల ప్రపంచంలోకి ప్రయాణం ప్రారంభించిన అల్తినాయ్ యెక్కిన రైలుకదులుతుంటే దానివెంట పరిగెత్తుతూ ఆ రైలు మోతలో ద్యూయ్ షేన్ యేమి చెప్పివుంటారో, అల్తినాయ్ విన్నదేమిటో… యిలా చెప్పుంటారా… అలా చెప్పుంటారా… యిలాఅర్ధమయి వుంటుందాని మనమెన్నోసార్లు మాటాడుకొన్నాం చూడు… యిప్పుడాసంభాషణలు పదేపదే నాకెందుకు గుర్తొస్తున్నాయంటావు? బహుశా… ఆ రోజు నువ్వు మైక్ ముందు నిలబడి మాటాడిన మాటలు భలే హాంటింగ్ గా వుండటం వల్ల కావొచ్చు. యేo మాటలవి!

“నదీ… సముద్రం… శిఖరాలు… యెడారులు… కొండలు… మైదానాలు… పీఠ భూములు యిలా భూమి మీదున్న సమస్తం మీదా అపారమైన ప్రేమ వుండాలి. అప్పుడే ప్రతివొక్కరి మూలాల్ని గౌరవించగలం. మట్టి వాసన తెలిసిన వాళ్ళకి మాత్రమే ఆ మట్టిపరిమళం కోల్పోతే జరిగే నష్టం తెలుస్తుంది. మనం ఆధునికులం. యిక్కడి మనుషుల్లోవున్న స్వచ్ఛత, స్పష్టత మనకు లేకపోవడానికి కారణం మనం యేదయినా మార్కెట్ లోకొనుక్కోగలమనే ధీమా కావొచ్చు. కానీ పుట్టి పెరిగిన చోటు నుంచి వొక్కసారిగాఅర్ధాంతరంగా వెళ్లిపోవడం అంటే భూమి నుండి మొక్కని పెకిలి వేసినంత యాతనగావుంటుంది. చెరువులోని చేపపిల్లను వొడ్డున పడేసినట్టు వుంది. యిక్కడ సాధారణప్రజలకు భద్రత మీద యింత కాలం కనీస సానుభూతి లేదని తెలుస్తోంది. మన వారంతాఆడుకున్న జ్ఞాపకాలు శిథిలం కాబోతున్న బాధాకరమైనమయిన సందర్భమిది. యీఆనకట్టల మూలంగా వారిదైన యే వొక్క ఆనవాలు కూడా మిగల్చడం లేదు. యెన్నితరాలు ఆ నేలమీద ఆకలి, కష్టం, సుఖం, దుఃఖం, కలబోసుకొని వుండొచ్చు. నాలుగేళ్ళుచదివిన బడి చదువు అయిపోయాక వొదిలి పోతుంటేనే దుఃఖం ఆగదు. కొత్తగాపెళ్ళయిన పెళ్లి కూతురు వూరొదిలి పోలిమర దాటి వో సారి వూరికి దండం పెట్టి తనవారిని, వూరిని వదలలేక వదల్లేక వెళ్ళు తుంది కదా! వూరి పొలిమేరలోకి రాగానే కాళ్ళకురెక్కలొస్తాయి కదా! యిప్పుడు అడివిలో వొక్కో రెక్కా విరిచి మంటల్లో మాడుస్తున్నారు. చరిత్రకు మూలవాసులు ఆనవాళ్ళు కోల్పోయి అనాథలు కాబోతున్నారు. యిప్పుడువూళ్ళు.. అడవులు… అసలు నిలబడిన చోట కాళ్ళ కింద నేలే మాయమవుతుంటేయింకెక్కడ పొలిమేర? అడివంతా జ్ఞాపకాల గుండెగనుల్ని తవ్వుకుంటున్నాయి” అన్నావు. యిలా నువ్వు తప్పా మరెవ్వరు మాటాడగలరు?

నిజ్జంగా అబ్బాయీ! మట్టి మహిమ… మనుషులంటే ప్రేమ… యిన్నేళ్ళు నీకోసం, నీవాళ్ళకోసం, నువ్వు పుట్టి పెరిగిన ప్రాంతం కోసం నీ గుండె లోతుల్లో పొగిలిన దుఃఖపుసాంద్రత యిప్పుడిప్పుడే అర్ధమవుతోంది. నీ లక్ష్యం గొప్పది. నువ్వు కలగంటున్న స్వప్నంమరింత గొప్పది. యిప్పుడు కోల్పోతున్న అడవి జ్ఞాపకాల కోసం కలిసి పని చెయ్యటంమినహా మరే దారీ లేదనిపిస్తోంది. యిప్పుడు నీదే నాదీ వొకే దారి. నువ్వుకలుస్తానన్నావని వచ్చాను. నీకోసం నీకిష్టమైన కొన్ని పుస్తకాలూ పట్టుకొచ్చాను. అడివిఅంటే నీకెంత ప్రేమ! అరణ్యంలో చెట్లను మనసారా కౌగలించుకోవాలనే తీవ్ర కాంక్షతోసమస్తాన్నివదిలి వచ్చేశావు. అడివిలో తిరుగుతూ…తిరుగుతూ… బడిలో పిల్లలకి క్లాస్పుస్తకాలలోని చదువుతో పాటు జీవితాన్ని దర్శించే స్పష్టతను యిచ్చే చదువునిసాహిత్యం నుంచి నువ్వు పరిచయం చేస్తుంటే భలే ప్రేమేసింది అబ్బాయి. యీజీవితాన్ని ప్రేమించేట్టు పిల్లలతో మమేకమయిన నిన్ను చూసిన ప్రతీసారీ అరణ్యమంతదట్టంగా… సముద్రమంత లోతుగా…ఆకాశమంతవిశాలంగా… పువ్వుల తోటలంతమృదువుగా… సూర్యుడంత తీక్షణంగా వుండే అనాది పరిమళపు యీ అబ్బాయియెప్పుడూ మరెక్కడా వుండి వుండడని తీర్మానించుకుంటాను. యీ తడితడిముదురాకుపచ్చని అడివిలో తవ్వని నేలా, కొట్టని చెట్టూ, వలసపోని మనుష్యులూ, యెగిరిపోని పిట్టలూ… నీలాంటి కొందరు మనుష్యుల వల్లే మిగిలి వున్నాయి. నీలాంటివారివల్లే రుతువులింకా పూర్తిగా గతి తప్పలేదు. గ్రీకు నాగరికతని యిష్టంగా పదేపదేచదువుకునే నువ్వు ఆధునిక మానవుణ్ణి గ్రీకు నాగరికత ఆవిష్కరించినట్టు ప్రకృతి విధ్వంసాన్ని ఆపగలిగే డిస్కోర్సుని నన్ను చెప్పమని అడిగి… అంతలోనే “హోవార్డ్ ఫాస్ట్ ‘ది లాస్ట్ ప్రాంటియర్’ లో వేల వేల మైళ్ళ నడుస్తూ అడుగడుగునా ప్రాణాలమీదికివస్తోన్న ప్రమాదాలని యెదురుక్కొంటూ స్వేచ్ఛ కోసం చేసిన పోరాటాన్ని చెపుతూ, ప్రకృతిలో జరిగిపోయిన విధ్వంసం యిర్రివర్సిబుల్… కనీసం మిగిలి వున్న దానినైనా అట్టి పెట్టుకోవాలనే యెరుక వున్నా… ఆచరణ లో లేకపోవటం యెంత అన్యాయం” అనినువ్వు ఆడియన్స్ ని వుద్దేశించి డయాస్ మీద నుంచి మాటాడేడప్పుడు… మనకిమన గురువు గారు చెప్పిన పాఠం నీకెంత గుర్తుందో కానీ నా రక్తంలో పూర్తిగాయింకిపోయింది.

అబ్బాయీ… యింకా రాలేదు నువ్వు … ఆకలవుతోంది… అన్నం ఆకలి కాదు. కవిత్వపుఆకలి. అన్నం, నీడ లేకపోయినా పర్లేదు కానీ నీ కవిత్వం లేకుండా వుండటం కష్టం. నాకునీ కవిత్వం యెంత చదివినా తనివి తీరదు. జీవితం మీద అపారమైన ప్రేమ వున్ననువ్వు రాసే కవిత్వం జీవితాల్ని వెలిగిస్తుంది. నచ్చిన పుస్తకాన్నో, రాగాన్నో, మనిషినో జీవనంలోకి అనువదించుకునే వారు బహు అరుదు. దట్టమైన అరణ్యంలో పుట్టి పెరిగిన నువ్వు అసలు యింత సాహిత్యాన్ని యెప్పుడు యెలా చదివావాఅని నాకెంతఆశ్చర్యమో! అబ్బా! వేపపూల తీయ్యని గాలి వొళ్లంతా కమ్ముకొంటుంది. ముఖ్యంగా అడివిలో తిరుగుతున్నప్పుడు, వేపపువ్వుల తీయ్యని వగరు గాలులుపెనవేసుకొంటున్నప్పుడు యే సుదూర కనుమల్లోకో, యే ప్రవాస సీమల్లోకో చేస్తోన్న ప్రయాణాన్ని ఆపి అక్కడే వేప పువ్వుల టీ తాగించే వాడివి. యెంత పిచ్చి నీకా వగరుపరిమళమంటే … పైగా పదేపదే నా జుట్టుని చేతుల్లోకి తీసుకొని ఆ సౌరభాన్నిఆస్వాదిస్తూ ముద్దు పెట్టుకునే వాడివి జుట్టంతా వేపపువ్వుల సుగంధమని… నువ్వు జుట్టుని ముద్దు పెట్టుకొనే ప్రతీసారీ యీ వేపపువ్వుల రుతువుని మరింతగాపొడిగించమని వో ధరఖాస్తు పెట్టుకొంటుంటాను వసంతరాణీ గారికి…

త్వరగా రా అబ్బాయీ నువ్వు రమ్మని చెప్పిన యీ అడివంచు రైల్వే స్టేషన్ కి.

కవయిత్రి, కథా రచయిత్రి. నగర జీవనంలో స్త్రీల సంఘర్షణల్ని కథల్లోకి తీసుకువచ్చారు. తొమ్మిది కథల సంపుటాలు, మూడు నవలలు, ప్రేమ లేఖలు, మ్యూజింగ్స్ వెలువరించారు. 'వార్త' దినపత్రికలో దశాబ్దకాలం పాటు 'మైదానం' కాలమ్ నిర్వహించారు. రచనలు: మనసుకో దాహం, సాలభంజిక, మంచుపూల వాన, వాన చెప్పిన రహస్యం, 'మసిగుడ్డ', 'ముక్త', 'ఇన్స్టంట్ లైఫ్', ద లాస్ ఆఫ్ యిన్నోసెన్స్, కుప్పిలి పద్మ కథలు, ముక్త, మంత్రనగరి సరిహద్దుల్లో, పొగమంచు అడివి, 'నెమలీకలు పూసే కాలం' (కవిత్వం), 'మంత్రనగరి సరిహద్దుల్లో (ప్రేమ కథలు), 'పొగమంచు అడవి', 'మోహనదీ తీరంలో నీలి పడవ' (కవిత్వం) సంకలనాలుగా వచ్చాయి.

One thought on “అడివంచు రైల్వే స్టేషన్

  1. కత్తుల వీరునికి కన్నె మనసెందుకో ! కోటలోని మొనగాడా వేటకు వచ్చావా ?? లాగా రెండు contradicting అంశాలు ఇంత హృద్యంగా మీరే చెప్పగలరు.
    సమాజ హితం కోసం వూరికే మాటలాడుతూ
    ఆవేశంతో ఊగిపోతూ ఉండే వాడు కాడు మీ కథానాయకుడు మీ genere నూ.
    అభినందనలు ma’am

Leave a Reply