అడవి పిలుస్తున్నది

వేసిన తొలి అడుగు ఆకుపచ్చ నేల మీద వేసిన వాళ్లం
జుంటి తేనె ధారల సారాన్ని జీర్ణించుకొని వచ్చిన వాళ్లం
ఎక్కడినుంచో అడవి పిలుస్తున్న చప్పుడు
ఆ పిలుపును విని తీరాలె
అడవి నుండి పాల పండ్లతో వెళ్లిన వాడివి
ఇనుప కోరలతో తిరిగొస్తావా?
నగరం వైపు తప్పటడుగులతో నడిచి వెళ్లిన వానివి
అడవి దిక్కు తప్పుటడుగులతో తిరిగొస్తావా?
చిగురాకు చేతులతో నీ ఒంటికి గంధం పూసిన చెట్ల మీద
నెత్తుటి బుల్లెట్లు కురిపిస్తావా?
అందంగా అల్లుకున్న తీగలకు ఊయలలూగిన వాడివి
వన జీవన విధ్వంసానికై ఉరితాళ్లతో తిరిగొస్తావనుకోలేదు!
కొండ వాలు నుంచి జాలువారిన చల్లని చెలిమెనీళ్లు తాగిన వాడివి
విషపు పాత్రతో నడిచొస్తావనుకోలేదు.
చల్లని నీడ నిచ్చిన చోటికి నిప్పులు పంపిస్తావనుకోలేదు
మరచి పోయినవు
అత్యవసరమైపుడల్లా ఆయుధం పుట్టింది అడవిలోనేనని!
మరచి పోయినవు
తడిలేని నేలమీద తండ్లాటలే వుంటాయని
దు:ఖం ఉగ్గబట్టిన భూమి మీద యుద్ధాలు మాత్రమే ఉంటాయని
భూమిని ముక్కలు ముక్కలుగా చేసి సంపద చేసుకుంటున్న వేళ
గూడు చెదిరితే బాధ పడి కొమ్మ విరిగితే కలత చెంది చెట్టు కూలితే చింతిల్లి
నగర ఆక్టోపస్ చేతుల్లో చిక్కుకున్న నరున్ని విడిపించే
ఒక నిష్కల్మష మానవున్ని అడవి మళ్లా పిలుస్తున్నది
నీ కాలుష్యపు గాలి దుమారాలకు
ఎప్పుడో అడవి రగులుకోక పోతుందా?
వన నాశక నగరాల వైపు తేనెటీగల గుంపొకటి దండెత్తి రాకపోతుందా?
నీ వ్యాపార రాజకీయాన్ని చుట్టు ముట్టక పోతుందా?
అయితే అడవికెళ్లిన వాడు తప్పకుండా చిగురించే వస్తాడు

పుట్టింది కరీంనగర్ జిల్లా కోహెడ మండలం, నాగసముద్రాల. కవి, రచయిత, ప్రభుత్వ ఉపాధ్యాయుడు. రచనలు: పునాస, ఎర్రమట్టి బండి(కవితా సంకలనాలు). చిక్కనవుతున్న పాట, పొక్కిలి, మత్తడి, మునుం, ఎడపాయలు, మొగులైంది, దూదిపూల దు:ఖం, నూరు అలల హోరు(ప్రజా సాహితి)లాంటి సంకలనాల్లో పలు కవితలు ప్రచురితమయ్యాయి.

One thought on “అడవి పిలుస్తున్నది

Leave a Reply