కొ.కు – ‘అట్టడుగు’

కథా కాలానికి 19వ శతాబ్దం సగం గడిచింది, రెండవ ప్రపంచ యుద్దం ముగిసింది. ప్రజలు తమ స్వంత ఊళ్ల నుంచి పొట్ట చేత పట్టుకుని దూర ప్రదేశాలకు వెళిపోవడం సర్వసాధారణ విషయంగా మారింది. అలాటి వారిలో ఒకరు కథకుడు. స్వంత ఊరి లో ఉండే బంధువు రాములు నుండి అతనికి 12 పేజీల ఉత్తరం వస్తుంది. అందులో పెళ్లిళ్లూ, పేరంటాళ్లూ, చావులూ, పుట్టుకలూ, ఆస్తులు పోవడాలూ లాంటి అనేక వివరాలు రాస్తూ, ఆఖర్న గణపతి అనే మరో బంధువు బిచ్చమెత్తుకుంటున్నాడని రాస్తాడు. అది చదివి కథకుడు చలించిపోతాడు. రాములు మీదా, మిగిలిన బందువుల మీదా పట్టరాని ఆగ్రహం వస్తుంది. ఆ సందర్భంలో కొకు రాసిన వాక్యం – మనుషుల వ్యక్తిత్వాలకు గీటురాయి. నాకైతే ఈ లక్షణం ఎవరిలోనైనా కనిపించిన మరు క్షణం నా మానసిక సంబంధం వారితో తెగిపోతుంది, ఎందుకంటే కథకుడిలాగే నేను కూడా “జీవితాన్ని గమనించటమె చాతనయి దాన్ని మార్చడం ఏ మాత్రమూ చాతకానట్టు ప్రవర్తించేవాళ్లని సహించలేను.”

“గడవక వాడు ముష్టెత్తినా మిగిలిన మా బంధువులు వాణ్నెట్లా ముష్టెత్తనిస్తున్నారు?” అనుకుని, తక్షణం 20 రూపాయలు మనీయార్డర్ చేస్తాడు. హేయమైన సంఘటనల్ని నిర్లిప్తులై ఎట్లా చూస్తారు అనేది అతనికి అర్ధం కాదు. అంతలోనే పరిస్తితుల్ని మార్చే శక్తి మనుషులకి లేదేమో అని కూడా అతనికి సందేహం కలుగుతుంది. మార్చలేకపోతే అదే పోయె, మార్పుకోసం ప్రయత్నించే వాళ్లని అడ్డుకోవడం జరుగుతుంది మన సమాజంలో. ‘అర్బన్ నక్సల్స్’ పేరున ఇప్పుడు జైలులో ఉన్న వారు చేసిన నేరం అదే కదా. అదే 1950లలో కొకు అన్నారు: “మనుషుల్ని మార్చడానికి చేసే ప్రయత్నంలోనూ, వ్యయంలోనూ సగానికి సగమైనా వాతావరణాన్ని మార్చడానికి ఎందుకు చేయమూ అని; ఎవరన్నా వాతావరణాన్ని మార్చడానికి ప్రయత్నం సాగిస్తే వాళ్లు దేశద్రోహులనో సంఘద్రోహులనో రుజువు చెయ్యటానికి ఎందుకు ప్రయత్నిస్తామూ అని”.

గణపతిని గురించి తలపోస్తూ మనకి అతని వివరాలు చెప్తాడు. గణపతి తండ్రి బాగానే సంపాదించాడట, అయితే కాంగ్రెస్ తలపెట్టిన ఉద్యమాలన్నిటిలోనూ, భారీగా ఖర్చులు పెట్టాడట. జాతీయ విద్య పేరిట – గణపతిని స్కూలు మాన్పించి, నవారు నేయించాడట. అది అయిపోయాక సంస్కృతం చెప్పించాడట. గణపతి ఇంకా తన కాళ్ల మీద తాను నిలబడక ముందే ఆ తండ్రి మరణించడంతో కుటుంబంతో సహా గణపతి వీధిన పడాల్సి వచ్చిందట. అప్పటి స్థితిని ఒక్క వాక్యంలో ఇలా సమీక్షిస్తాడు – “కాంగ్రెసు నిజమైన రాజకీయంలో దిగగానే రాజకీయవేత్తలు కాని కాంగ్రెసు వాళ్లంతా అడుక్కు దిగిపోయినారు. గణపతి అట్టఅడుక్కే జారిపోయినాడు పాపం.” చిన్న పాక వెసుకుని, తల్లి వంటి మీద బంగారం అమ్మి కొన్నాళ్లు కాలక్షేపం చేశారట. కానీ ఏదీ స్థిరమైన ఆర్జన కాలేకపోయిందట. అనుకోకుండా ఒక నాలుగెకరాల పొలం ఎవరో దూరపు బంధువు ఆస్థి వచ్చి కలిసిందనీ, ఆ సమయంలోనే ఊరు వదిలి పెట్టి వచ్చాననీ మనకు కథకుడు చెప్తాడు.

ఏడెనిమిదేళ్ల బట్టీ బంధువులందరికీ ఎడమైపోయి, దేశం కాని దేశంలో ఉండటం మూలాన కొంత బంధుప్రేమ అతనిలో కూడుకుంది. 20 రోజుల సెలవు పెట్టుకుని, బంధువులందరినీ చూడాలనీ బయలుదేరతాడు కథకుడు. గణపతిని కలవడానికి ధైర్యం చాలక, ముందు రాములు దగ్గరకి వెళ్తాడు. గణపతి పని పైలా పచ్చీసుగా ఉందంటాడు రాములు. అడుక్కు తినడం నీకు వేళాకోళంగా ఉందా అని గదమాయించి, గణపతి ఇంటికి తీసుకువెళ్తాడు.

అంత భయపడుతూ వెళ్లాక, “ఈ ఇంట్లో నేనూహించిన వాతావరణం లేదు, ఎంచేతా” అని కథకుడు తికమక పడతాడు. గణపతి తల్లి ముద్దినుసు రకాల కూరలూ తరుగుతూ కనిపిస్తుంది. గణపతి భార్య పట్టుచీర కట్టుకుని, పుష్టిగా కనిపిస్తుంది. అంతలో ఒకామె వచ్చి, గణపతి తల్లి దగ్గర నుండి మారుబేరానికి 2 రూపాయల బియ్యం పుచ్చుకుని వెళుతుంది. ఆసరికి, గణపతి రానే వస్తాడు, మరిన్ని కూరలూ, బియ్యం మూటతో సహా. అతన్ని కథకుడు గుర్తించలేకపోతాడు. “పైన చొక్కా లేదు, మొహాన ఇంత కుంకం బొట్టు, మెళ్లో రుద్రాక్షలు, పిలకలో ఒక చిన్న నందివర్ధనం పువ్వూ. మనిషి అతి విచిత్రంగా మారాడు.”

ఎవరో పురాణం చెప్పమన్నారని గణపతి తల్లికి చెప్తాడు, ఆమె సంబరపడుతుంది. మునుపు ఎవరో పురాణం చెప్పించుకుని, దక్షిణ మాత్రమే ముట్ట చెప్పేరనీ, బట్టలు పెట్టలేదని – గుర్తు చేసుకుని ఆడిపోసుకుంటుంది. శాపనాకారాలు పెడుతుంది. గణపతి ముక్తసరిగా పలకరించి, పూజలో కూర్చుంటాడు. ఇద్దరూ లేచి ఆ ఇంట్లోంచి బయటపడతారు.

కథకుడికీ రాములుకీ జరిగిన సంభాషణతో కథ ముగుస్తుంది.

“ముష్టెత్తుకొని గణపతి తగ్గాడనుకుంటున్నావు. వాడి లెక్కలో చాలా పైకి వచ్చాడు.”

“ఇప్పుడు వాడికి డబ్బున్నవాళ్ల ప్రాపకం ఉంది. ఇన్నాళ్లూ వాణ్ని ఉపేక్షించిన కాంగ్రెసువాళ్లు వాణ్నిప్పుడు చేరదీసాశారు. ఈ వూళ్లో కొత్త ధనికవర్గం ఏర్పడింది-దొంగవ్యాపారస్తులు, పరిమిట్లవాళ్లూనూ. వాళ్లంతా మనవాడికి పోషకులు. వాడిప్పుడు బియ్యం అమ్మీ, డబ్బు వడ్డీలకిచ్చీ, డబ్బున్న వాళ్లని పొగడి చక్కగా జరుపుకుంటున్నాడు. భాగ్యవంతుల పెళ్లాలు, వాడి భార్యకి తాము విడిచేసిన ఖరీదైన చీరలిస్తారు. ఆవిడ కళ్లకద్దుకుని స్వీకరిస్తుంది. వాడు పురాణం చెబుతుంటే వినాలి. నువ్విదివరలో రాజకీయ పురాణాలు వినిఉండవు. ఫరవాలేదు, తరించాడు” అన్నాడు రాములు.

“అవును. నిలువుగా తరించాడు, అట్టడుగు తాకాడు”

గణపతి కథని చెప్పడానికి – కొకు ఒక ప్రవాసిని తీసుకున్నారు. పీకే సినిమాలో – మతం వర్సెస్ దేవుడు అనే అంశాల్లో ఉన్న ప్రాధమిక వైరుధ్యాలను చర్చించడానికి, గ్రహాంతర వాసిని ప్రధానపాత్రగా తీసుకున్నట్టు. మన తలలో ఏవైతే, (given) ‘అవి అంతే’ అని స్థిరపడిపోతాయో ఆ భావాలని – ప్రశ్నించడానికి, పరిణామాలతో ఏ రకమైన పరిచయం లేని పాత్రని తీసుకోడం ఒక సమర్ధవంతమైన టెక్నిక్. కథలోకి వస్తే, గణపతి పేదరికం, అతని కష్టాలూ తెలుసు కాని, యాచనని వృత్తిగా చేసుకోడం కథకుడు ఊహించలేనిది. అతనికి తెలిసిన గణపతి – ఎట్లాగైనా నెలకి ఒక 10 రూపాయలైనా సంపాదించాలని విశ్వప్రయత్నం చేసే వ్యక్తి, దాని కోసం, ప్లీడరు వాలంటీరు, కోమటి గుమాస్తాగిరీ – చివరికి పిల్లలకి సంస్కృతం పాఠాలు చెప్పిన వ్యక్తి. అతని గురించి చెప్తూ , “ఇంగ్లీషు చదువు చదివి కృతక సంస్కారం సంపాదించకపోవడం వల్లనో ఏమో గణపతి డబ్బుతత్వమూ, సంఘతత్వమూ బాగా కనుగొన్నాడు.” తన బంధువులందరిలోనూ ‘జీవిత యదార్ధాన్ని’ గుర్తించిన వాడు గణపతే అని కూడా అనుకుంటాడు. అనుభవాల వల్ల ఆర్జించిన పరిజ్ఞానం వల్ల – అతను కమ్యూనిస్టు అవుతాడని వీళ్లు ఒకప్పుడు ఊహించేవారట. ఆ విధంగా ఉండేవన్న మాట గణపతి మాటలు. అటువంటి వాడు అకస్మాత్తుగా దేవతార్చనా, జపం వంటివి మొదలుపెట్టి, దానికి తగ్గ వేషం కోసం – పిలకతో సహా మొత్తం కట్టూబొట్టూ మార్చి కనపడడం అనూహ్యంగా ఉంటుంది. అతని కళ్లతో చూస్తున్నాం కనక మనకీ అది వింతగా కనిపిస్తుంది.

అయితే అదే ఊళ్లో గణపతి పరిణామాన్ని దశలవారీగా చూస్తున్న రాములు వంటి వారికి అంత వింతగా తోచక పోవచ్చు. తెలిసిన వాడు కనక అందరి పనీ అలాగే ఉందని చెప్తూ – “అడుక్కుతినని దెవరులే” అని రాములు అన్నది అసందర్భం కానే కాదు, పరిస్తితులు అంత గడ్డుగా మారాయి. పని కోసం వెతుకుతున్నప్పుడు కనిపించని మార్గాలు, యాచనకు దిగగానే గణపతికి తెరుచుకున్నాయి. గణపతి ఏయే విషయాల్లో రాజీ పడ్డాడో రాములు ఇలా వివరిస్తాడు. “మనకన్నా డబ్బుండి మనకి ఉద్యోగాలివ్వగలిగిన వాళ్లు మన కన్నా గొప్పవాళ్లని ఒప్పుకోం మనం. వాడు ఒప్పుకుంటాడు. వాళ్లతో సమంగా తన సాంఘిక, రాజకీయ హక్కులు కావాలని వాడు కోరడు.” అదే గణపతి కొత్త జీవితాన్ని నిర్వచించగలిగే మూలసూత్రం.

ఒకనాడు, ఉద్యమాలలో ముందడుగు తానే వేసి ఊళ్లో పెద్దమనిషిగా చలామణీ అయిన వ్యక్తి గణపతి తండ్రి. అయితే అలాటి ఉద్యమాల వల్ల ప్రజల్లో పలుకుబడిని సంపాదించి, దానిని రాజకీయ పెట్టుబడిగా వాడి నాయకులుగా ఎదిగిన వారికీ. అతనికీ భేదం ఉంటుంది. వారు ఇచ్చే వర్గం, గణపతిది పుచ్చుకునే వర్గం. ఆ భేదం గుర్తించి, అంగీకరించడం అనేది ఒక్క రోజులో గణపతిలో సంభవించి ఉండదు. దానిని దశల వారీగా గమనించి ఉంటాడు, అందుకే రాములు దానికి ఆశ్చర్యపోడు. కొకు ఇలా వివరిస్తారు: “ అసలు రహస్యమేమంటే, ప్రత్యక్షంగా జరిగే ఏ మార్పునైనా సహించి మనసు సరి పెట్టుకోవచ్చు, కాని పరోక్షంగా జరిగే మార్పులు గురించి మనసు సమాధానపరచుకోవటం చాలా కష్టం. అందుచేతనే మరో దేశంలో జరిగే విప్లవాలూ, మరో వర్గం వాళ్లు చేసే విప్లవాలూ మనని ఆందోళన పెడతై.

బతికి చెడ్డవాడు ఒకడు జీవిక కోసం ప్రయత్నం చేసి, విసిగి వేసారి, ఆఖరికి ముష్టి ఎత్తుకున్నాడన్న కథ – సర్వసాధారణం కాకపోయినా, మనం ఎన్నడూ విని ఉండనిదైతే కాదు కదా. చిన్నదో పెద్దదో కమతం ఉన్న వాళ్లు, పాలూ పెరుగమ్ముకుని బతికిన వాళ్లూ – ఆ భూములు పోగొట్టుకుని, కూలీలుగా మారి, ఆ తర్వాత ఆ పనులూ దొరక్క పట్టణాలు చేరడం, అందులో కొందరు నిర్బాగ్యులకు అడుక్కుతినటం తప్ప మరో దారి లేకపోవడం – ఈ కథలు మన ముందే జరుగుతున్నాయి. వారందరి వ్యక్తిత్వాలూ మరి అట్టడుగును తాకినట్టేనా?

మరో సంగతి, పోనీ పరిస్తితుల కారణంగా గణపతి యాచనకు సిద్ధపడ్డా – పుట్టి పెరిగిన చోట మానం వదిలేసుకుని ఎలా జీవించగలడనీ, “ముష్టెత్తడానికి వెనక ఎంత వంశాచారం ఉండాలి? ఎంత స్వానుభవం ఉండాలి?” అవన్నీ గణపతికి ఎలా వస్తాయని కూడా దిగులు పడతాడు. అతనికి తెలీనిది, గణపతి అవలంబించినది ఒక వృత్తిని కాదు, అది – ఒక కళగా సాధన చేసి సంపాదించిన ప్రావీణ్యం. ఇందులో ఐరనీ ఏమిటంటే – గణపతికి పూర్వానుభవం లేకుండా లేదు. బ్రాహ్మలు తరతరాలుగా దాని మీద పట్టు సంపాదించి ఉన్నారు. శాస్త్రం పేరు చెప్పి భయపెట్టి, పుణ్యలోకాలని చెప్పి ఆశ పెట్టి డబ్బు గుంజుకునే వాళ్ల కథలు వీరేశలింగం గారి కాలం నుండీ ప్రసిద్ధమే, అందులో కొత్త లేదు. ఇచ్చకాల మాటలు చెప్పి గృహస్తులను ఉబ్బేసి, వారి దాయాదుల పేరెత్తి నిందించి బహుమానాలను పొందే వారి కళను మనం గుర్తు పట్టగలగాలి. మాయాబజార్లోని తాన శాస్త్రి, తందాన శర్మలను గుర్తు చేసుకోండి. తెచ్చిపెట్టుకున్న చిరునవ్వుతో క్రీగంటితో అందరినీ కనిపెడుతూ మెప్పించడానికి తంటాలు పడుతున్న పండిత బ్రాహ్మడినీ, అందులో సగం కూడా ఆర్జించక పోయినా నిర్పూచీగా తన శ్రమ ఫలితాన్ని పుచ్చుకుని స్వతంత్రంగా నిలబడే వంట బ్రాహ్మడిని పక్క పక్కన చూసినప్పుడు – వృత్తికీ, కళకీ భేదం కనపడింది నాకు.

ఒకప్పుడు రాజుల దగ్గర విదూషకులు ఉండే వారట, వారి పని రాజునీ, అతని పరివారాన్నీ రంజింపచెయ్యడం. రాజు మనసెరిగి మాట్లాడడం అతని ఉద్యోగ ధర్మం. ఇప్పుడు కేవలం బ్రాహ్మలకే కాక అందరు కళాకారులకీ ఆ సౌలభ్యం దొరికింది. సినిమా ఫంక్షన్ల వేదికల మీద కొంత మంది కారెక్టర్/కామెడీ యాక్టర్లు ఆ పాత్రని నిర్వహించడం చూస్తూనే ఉంటాం. వారి పని హీరోని పొగుడుతూ అభిమానులను ఎంటర్టెయిన్ చెయ్యడమే. చెప్పొచ్చేదేమిటంటే – తమ చాతుర్యాన్నీ, విద్యనీ, కళనీ – మనోరంజనానికి వాడడం ఏనాడూ ఉన్నదే.

తప్పో ఒప్పో అతని ఉపాధి కోసం అతనికి చేతనైనదేదో చేసుకుని డబ్బు సంపాదించుకుంటున్నాడు. అతని ఇష్టం. కానీ కథకునికెందుకు – అది అట్టడుగుగా కనిపించింది? గణపతి కనీసం తను పంపిన ఇరవై రూపాయల మాటైనా ఎత్తుతాడేమో అని చూస్తాడు, కానీ ఆ విషయమే ఎత్తడు. ప్రేమగా తనకి సహాయం చేసిన వారిని పట్టించుకోకపోవడం, ప్రపంచంలో ప్రతీ ఒక్కరూ తనకి ఇవ్వడానికే ఉన్నట్టు, వారి దగ్గర నుంచి పుచ్చుకోడమే జీవిత లక్ష్యమన్నట్టు – గణపతి ప్రవర్తన కనిపిస్తుంది. మనుషులు ఉదారంగా ఇవ్వలేదని వారిని నిందించడం, తోటి పేదవారి పట్ల వైరం పాటించడం – ఇవన్నీ గణపతి ప్రత్యేకంగా అలవర్చుకున్నవి. రాములు గణపతి గురించి చెప్పినప్పుడు ఇలా అంటాడు – “నువూ నేనూ వాడికిప్పుడొక మనుషులల్లే కనిపించం. ఉద్యోగాలు చేస్తున్నామని గణపతి మనల్ని చూసి జాలి పడతాడు. లోపల ఏవగించుకుంటాడు కూడా.”

అతి విచిత్రమైనదీ, ఈనాడు మరింత ప్రాసంగికత ఉన్న పరిణామం – చివరిలో వస్తుంది. “వాడు పురాణం చెబుతుంటే వినాలి. అందులో కూలిజనాన్నీ, సోషలిస్టులనీ, కమ్యూనిస్టులనీ వాడు తిట్టడం విని తీరాలి.” అని చెప్తాడు రాములు. రాజకీయ పురాణం మాట వినగానే నాకు ముందుగా గుర్తు వచ్చిన పేరు, గరికపాటి. ఆయన తన పిల్లల పేర్లు కూడా గురజాడ, శ్రీశ్రీ పెట్టుకున్నాడట, కనక వారి భావాల పరిచయం ఉందనుకోవాలి. ఆయన ప్రవచనాలలో – కాశ్మీరులో రద్దు చేసిన ఆర్టికల్ 370 నుంచీ, ఆడవాళ్లు మోటర్ సైకిల్ మీద అటోకాలూ ఇటో కాలూ వేసుకు కూచోడం వరకూ అన్నిటి మీదా మాట్లాడతాడు. అత్యంత తిరోగామి భావాలను – పురాణాల సందులో, జోకులేస్తూ చొప్పిస్తాడు. అప్పుడనిపించింది నాకు – మామూలు వాళ్ల కన్నా ప్రగతి శీల మార్గంలో కొంత దూరం ప్రయాణించి– కమ్యూనిస్టుగా మారబోయి మరలిపోయిన వాళ్లు వెలిగక్కే విషం – అబ్బ, దుర్భరం.

నా పాత వ్యాసం లో ఒక వాక్యాన్ని (తోడేళ్లతో కలిసి వేటాడి కుందేళ్లతో కలిసి చిగురు మేయడం) ప్రస్తావిస్తూ ఒక మిత్రుడు (ఆయనకు కొకు అసలు నచ్చరట, అది వేరే సంగతి) “ఆ కేటగిరీ కింద ఎక్కువమంది లెఫ్ట్ క్యాంప్‌కి చెందిన వాళ్ళే ఉన్నారని, పేరు, కీర్తి, అవార్డులు… వీటికోసం పడిగాపులు పైరవీలు చేసిన, చేస్తున్న బుద్ధిజీవుల్లో వామపక్షం వారే అధికం”- అనీ ఒక అబ్జర్వేషన్ చేసారు. ఆలోచించి చూస్తే అది కొంత మేరకు వాస్తవమేనని అనిపించింది. అది యాదృచ్చికం కాదనిపించింది కూడా.

వామపక్ష భావజాలాన్ని నిందించడంలో, హేళన చెయ్యడంలో మాజీలకు సాటి మరెవరూ ఉండరు. ఇది నాకు విపరీతంగా తోచింది. ఇదే విషయాన్ని చర్చిస్తూ ఉంటే మరో మిత్రుడు దానికి కొన్ని సంభావ్య కారణాలు చెప్పారు – తాము వదిలి వచ్చిన జాగాను మనసారా తిట్టుకుంటే వారికి మనశ్శాంతిగా ఉండొచ్చు లేదా ఆ మార్గంలో కొనసాగనందుకు వారి మనస్సు వారిని పెట్టే బాధనుంచి ఉపశాంతి కోసం అలా మాట్లాడతారేమో అనీ అన్నారు. ఇవన్నీ నిజమేనేమో.

గణపతిలాగా డబ్బుతత్వమూ, సంఘతత్వమూ కనుగొన్నవాళ్లు దానికి లొంగిపోవాలనుకుంటే అది వారి యిష్టం. వారి పరిజ్ఞానాన్ని, చాతుర్యాన్నీ, కళనీ – సాంఘికంగా ఎదగడానికి వాడుకోవాలనుకుంటే – అదీ వారి యిష్టమే. ప్రపంచానికి దానితో ఏం సంబంధం ఉండదు. కానీ దానిన ఒక గొప్ప శాశ్వత సత్యమని నమ్మించాలని, ప్రచారం చెయ్యాలనీ ప్రయత్నిస్తున్నప్పుడే – అట్టడుగును నిలువుగా తాకుతారు.

పుట్టింది విశాఖపట్నం. చదువు ఎం. ఏ. ఇంగ్లిష్. విశ్లేషణాత్మక వ్యాసాలు, కథ, నవల, సినిమాలపై సమీక్షలు రాస్తున్నారు.

7 thoughts on “కొ.కు – ‘అట్టడుగు’

  1. ఇప్పుడు బటకుతున్న వాళ్ళకి అగి చూసిన అర్థంకాని సమాజపు స్వరూపాలను దాని లోపలి పొరలు పొరలుగా ఏర్పడిన జడత్వాన్ని; పైకి కనపడని మనసుకు అర్థమైనా కొన్ని వివక్షలును, అధికార దర్పం కోసం మనిషి చేసే వికృత చేష్టలను అర్థవంతంగా అర్థంచేసుకుని వాటిని వినమ్రంగా చెప్పడం సీత గారి ప్రత్యేకం.

  2. రచయితలకు ఆ మాటకొస్తే సమాజంలో ప్రతి ఒక్కరికీ, కొకు రచనలు వెలుగు తోవలు సమాజాన్ని, రాజకీయాల్ని, మనుషుల్ని, మానవ సంబంధాలను అర్థం చేసుకోడానికి ఉపయోగపడే ఉపకరణాలు
    గణపతిని గరికపాటితో పోల్చడం సరి అయినది. ఇలాంటి పనికిమాలిన, అనుత్పాదక వర్గాలు అధికారంలో ఉన్న వారికి apologists గా వుంటారు.
    మంచి కథని గుర్తుచేశారు

  3. మంచి కథని గొప్ప గా పరిచయం చేశారు. మీ రచనల వల్ల మళ్లీ కొకు ని చదవాలనే కోరిక పెరుగు తోంది.

  4. చాలా సంవత్సరాల క్రిందట చదివిన కథ. కొకు దార్శనికుడు అని మళ్ళీ మళ్ళీ చెప్పే కథ.ఆ శైలి,ఒక సర్జన్ ఏ అనుభూతిని వ్యక్తం చెయ్యకుండా చేసే ఆపరేషన్ లాగా ఉంటుంది.

  5. చాలా మంచి పరిశీలన . ఇప్పటి పరిస్థితులు అవగాహన కు సమన్వయం బాగుంది

  6. ఇప్పుడే చదివాను. వహాలాగుంది వ్యాసం. సినిమా వాళ్ళ గురించిన పరిశీలన బాగుంది. మాజీల ద్వేషానికో కారణం మీరు చెప్పిన ఆత్మ సంతృప్తే

Leave a Reply