సమకాలీన అక్షరాస్త్రం – ‘అచ్చు’ కవిత్వం

“విద్యలేక వివేకంలేదు. వివేకం లేక విత్తం లేదు. విత్తం లేక శూద్రులు అధోగతి పాలైనారు” – మహాత్మాజ్యోతి రావ్ పూలే.

విద్య అందకుండా వివేకం లేకుండా చేసిన ఒక పక్షపాతం దేశం మూల నివాసులను వలస వాదులు కుట్ర పూరితంగా అక్షరాలకు దూరం చేసినరు. ఎదురు తిరిగినోళ్లను హింసించి, మాట్లాడితే నాలుకలు తెగ్గోసి, వింటే సెవుల్లో సీసం పోసినరు. అంటరాని తనం అంట గడుతూ ఊరికి దూరంగా వెలి వేసిండ్రు. బుద్ధుడి నుండి మొదలు సంఘసంస్కర్తలు ఇచ్చిన ఒక నూతన దృక్పథం, పూలే అందించిన వాస్తవం. ఆచరణలో అంబేద్కర్ చూపిన దారి, నేడు చదువుకున్నా దళిత బహుజనులు అంత తమ అనుభవాలను అక్షరీకరిస్తున్నారు. అట్లాంటి కోవలో సిద్దిపేట్ జిల్లాలో గోనెపల్లి గ్రామంలో సిద్దెంకి లచ్చవ్వ, రాజయ్య దంపతులకు జన్మించి, అక్షరాలను ఆయుధం చేసుకున్నాడు సిద్దెంకి యాదగిరి.

మహనీయులు నడుస్తున్న అక్షర దారిలో కుప్ప పోసిన అక్షరాలతో ‘మాతొవ్వ’గా సుర్వైనడు. కాలంతో పాటుగా బత్కును ఒక పాఠంగా అధ్యయనం చేసి ‘బతుకు పాఠం’ కవిత్వంగా అందించిండు. జరుగుతున్న అరాచకాలపైన అన్యాయాలపైన, తనదైన పంథాలో బతుకులను కథలుగా ‘తప్ష’ చేసినడు. 2021లో తన అస్తిత్వ ముద్రను ‘అచ్చు’ కవిత్వంతో మన ముందటికి వచ్చినడు డా. సిద్దెంకి యాదగిరి.

అచ్చు పుస్తకంలో యాబై తొమ్మిది కవితలున్నవి. మాదిగ తత్వం మరియు దళిత బహుజన తత్వం కలిపి మొత్తం ముప్పై కవితలున్నవి. సమకాలీన అంశాలపై పదిహేడు కవితలు. ఊరు మనాది పైన కవితలున్నవి.

అచ్చు పుస్తకాన్ని సులభంగా అర్థం చేసుకోవడం కోసం నేను నాలుగు విభాగాలుగా విభజించాను. అవి: 1. మాదిగ తత్వం – అస్తిత్వం. 2. వర్తమాన సమస్యలు – రాజకీయం. 3. బహుజన తత్త్వం. 4. ఊరు – మనాది.

అచ్చు అంటే? మన శబ్దకోశంలోని అర్థం, ముద్రణ, ప్రచురణ, సాంచె, పోత అనే అర్థాలు గమనించవచ్చు. కాని దళిత బహుజన జాతుల్లో ఉత్పత్తి కులాల నిఘంటువులోని అచ్చుకు అర్థం వేరు. అస్తిత్వ సంపదకు పట్టు కొమ్మలు ఉత్పత్తి కులాలు. ఉత్పత్తి కులాలలో మాదిగలకు అచ్చు అనే పదానికి విడదీయరాని సంబంధముంది. వారి దృష్టిలో ‘అచ్చు’ కూ ఎనలేని ప్రాముఖ్యత వుంది. నిజంగా అది పేగు బంధమే. అచ్చు అంటే అక్షరాల ముద్రణ కాదు. ఏదో లోహాన్ని కరిగించి పోత బొమ్మగా అచ్చు పోయడం కాదు. మానవ వికాస క్రమంలో సెప్పులు సేయుటకు వనెంను (తోలును) పర్సి పెద్ద కత్తితో మనిషి అడుగులకు తోలు అట్టలు కోయుటను అచ్చు అంటారు.

మనషుల వారి వారి కాలి సైజు ప్రకారం, చెప్పులకు అట్టలు కోయడమన్నమాట. జీవ పరిణామ క్రమంలో మానవ జీవితంను అచ్చును విడదీసి చూడలేం. ఏమి తెలియని ఒక అనమాక జాతిగా పరిగణించబడుతూ, ఊరికి దూరంగా విసిరేయ బడిన అంటరానివారు మాదిగలు.

మాదిగ తత్త్వం – అస్తిత్వం:

సచ్చిన శవాలను పశువుల మృత కళేబరాలను బయటకు గుంజేస్తూ దుర్బల జీవితం గడుపున్నజాతి. సదువుకు సందెకు దూరమైన కులం. కులగజ్జి కుళ్ళుతో వ్యవస్థలో అంటరాని వారు ఎన్నో అవస్థలు పడుతున్నరు మాదిగలు. కృతిమ జ్ఞానం కన్న, ప్రకృతి జ్ఞానం దండిగా గడించిన ప్రజ్ఞశీలురు. మేధో సంపన్నులు. తమ మేధసుకు పదునెట్టి తోలు నుండి వస్తువులను తయారు చేసినరు. సమాజ వికాసంకు తోడ్పడిన నిస్వార్థపరులు మాదిగలు.

అదిమ సమాజాల నుండి మనిషి నాగరికపు ప్రపంచంలోకి అడుగులేస్తూ ఎదిగొస్తున్నప్పుడు. స్థిర నివాసానికి, వ్యవసాయనికి బాటలు పడుతున్నప్పడు పోడు గొట్టి పొతం జేసినప్పుడు. మనిషి పాదాలు కందకుండా, రాళ్ళు రప్పులు తగల కుండా, ముళ్ళు ములకలు గుచ్చకుండా, తన మేథస్సుకు పదునెట్టి శాస్త్రీయతకు ఊపిరి పోసినరు. సచ్చిన పశువుల చర్మం వొలసి వనెం చేసినరు. సబ్బండ వర్ణాలక కాలి అడుగులకు అట్టలు గోసి అచ్చు దీసిండ్రు. సెప్పులు చేసి ఇచ్చిండ్రు. మాదిగలు సమాజ శ్రేయసు కోరి ఉత్పత్తిలో భాగమైనరు. సంపదను మిగుల్చుకోని ఏనాడు దాసుకోలేదు. దోసుకోలేదు.

గత చరిత్రను మరిసి పోయినవారు మనుగడను సాగించలేరు. మనుషులు తమ అస్తిత్వంను జీవన విధానంను తప్పక నెమరేసుకోవాలి. ఏ మనిషైనా నడిసొచ్చిన దారుల్లో తన గతంను వోసారి నేమరేసుకోవాలి. ఇది ప్రకృతి నియమంకూడా, “ హెర్నేస్ట్ హెకెల్” అను శాస్త్రనేత్త తన “పునఃరావృత సిద్దాంతం” లో ఇలా చెప్పినాడు.

“ఒక జీవి తన పుట్టుకకు ముందు తన పూర్వికుల లక్షణాలను మననం చేసుకుంటుంది.” ఉదా. కప్ప తన పిండాభివృద్ది దశలో తన పూర్వీకులైన చేప లక్షణాలను ప్రదర్శిస్తుంది. దీనినే మనం పునరావృత సిద్ధాంతం (Bio genetic of law ) అంటాం. ఇదే విషయాన్ని డా. బాబాసాహేబ్ రాంజీ భీం రావ్ అంబేడ్కర్ తన ప్రసంగంలో ‘చరిత్రను తెలుసుకోని జాతులు, మనుషులు బానిసలుగా మారి చివరికి అంతరించి పోతాయని’ చెప్పినాడు.

అదే పరంపరను సిద్దెంకి తన కవిత్వంలో వివరిస్తూ “నాయిన తొవ్వ” కవితలో మాదిగ జీవితంను, తండ్రి తత్వం పరిపృష్టి చేసినడు.

“ఎందుకను
రేషం అగ్గి మీద గుగ్గిలమైతది
మొలకెత్తె యిత్తునంలా
మనసు పొరల్లోంచి జవాబిస్తడు
గతం నెమరేస్తడు”
(నాయిన తొవ్వ – 13)
భూమికి మానవులకు పంచ భూతాలకు విడదీయలేని ఆ సంబంధంను విడమర్చి కవి సెప్పుతడు. కష్టమైన నష్టమైన భూమి మీద రెక్కలేసి పన్జేస్తే భూదావర సెడగొట్టదనే నమ్మకం మెండుగా కవి తండ్రికి, మనుషులకుంది.

“కడుపు నిండినా ఎండినా
కడుపు చూసే కన్నతల్లి ఈ భూమే
మట్టి పేగు బంధం
బతుకు సంబంధం
నా మాయి ముంత నా ముని మనుమలదాక
ఇదే తావుల ఇదే రేవుల”
(నాయిన తొవ్వ కవిత – 14)

తాతల తండ్రుల నుండి తర తరాలుగా మాదిగలు మట్టినే నమ్ముకొని బతుకున్నరు. మాదిగలు మృదు స్వభావులు. అప్పుడప్పుడు ముక్కోపిగా అగుపిస్తరు. మనిషిని మనిషిగా ప్రేమించే ప్రేమ మూర్తులు. కరుణ మూర్తులు. వెన్ను విరిసి పని సేయడంలో రేష వంతులు, రేషం లేని పుట్టుక దండుగంటరు. తిండి విషయంలో పెద్దగా పట్టింపులుండవు. “తను మెచ్చ తినాలే. ఒగరు మెచ్చ పన్జేయలంటరు”. శ్రమైక జీవనమే వారి జీవన విధానం. అందుకే “మనివున్న తావులో మన్ను బుక్కి సావాలే. ఎరుగని ఊరిలో మొరగని కుక్కలెక్క బతకలేనని” తండ్రి కొడుకుతో… వాదు చేస్తడు. ఈ విషయంను గమనిస్తే మూలవాసులకు మట్టి మీదెంత మమకారముందో తెలుస్తుంది.

కంచె అయిలయ్య గారన్నట్లు భారత దేశంలో ఇంకా ప్రజాస్వామ్య విలువలు బతికి బట్టకడుతున్నయంటే? అవి వెలివాడల్లోనే అనేది చాల సుస్పష్టం. ఇప్పటికి తమ అస్థిత్వంను వదలి వేయని వారు ఒక మాదిగలే. దంచిన దానికి బుక్కిందే కూలని నీతులు సెప్పె కుల వ్యవస్థలో, ఎంత పని చేసిన ఏముంది. ఉత్త సేతులు తప్ప. నిల్వ నీడలేని బతుకులు, కన్నీటి సుడులు, దిగమింగే దుఃఖాలు, కుంగిపోని మనుసు తప్ప ఏముంటది. ఎట్టిజేసి ఎట్టిజేసి ఎరగప్పైన జీతం తప్పా ఏముంటది. ఇదే ముచ్చటను ‘ఇమిడి’ కవితలో మాదిగ జీవితంను కాచి వడగట్టి మన కంటికి చూపుతాడు.

“అక్షరాల చిటికె పదాల చిర్ర
తప్పట దనులై కైగడితే
పాఠక మస్తిష్క మబ్బుల్ని కరిగిస్తది.
మిగ్గుల ముంచి మొగ్గపూసల్ని అల్లినట్లు
మనసుల అద్ది
తీరొక్క తీగలతో పువ్వుల్ని
పద పదానికి పసందుగ అల్లుతది”.

“సదువక శాతలో సగమైన మా అవ్వ
ఆగమైన బతుక్కు ఆనవాలుగా మిలిగింది
శేతలు చేసి చెప్పులు ముడిసిన నాయిన
ఎట్టిల తడిసి ఉట్టి చేతులతో నిల్సిండు”.
(ఇమిడి – 30, 31)

మాదిగలు ప్రకృతి ఆరాధకులు. ఒక సారి మాటిస్తే పానం పోయిన వెనుదీయరు. మనుసు స్పూర్తిగా ప్రేమిస్తే చావుకైన తెగిస్తరు. ఉరి కంభాన్నైనా ముద్దాడుతరు.
“వెలివాడ తేనెటీగల్ని
ఎన్నిసార్లు తెగ్గోసినా
కవ్వించే పుప్పొడి
కుతికెల్లి నరికినా
మృత్యువును ముద్దాడుతూ
ప్రేమతో నవ్వుతూ
మధువునూ సేకరిస్తుంది”.
(శవప్రశ్న – 27)

మధువంటే అమృతం. అమృతం తాగిన వాళ్లకు మరణం లేదు. అమరులవుతరు. పువ్వుకు పుప్పడికున్న సంబంధమే మధువుకు తేనెటీగలకున్నది. ఒక చుక్క మధువు (తేనె) కోసం. ప్రపంచ ప్రదక్షిణం చేస్తయి. గుప్పెడు ప్రేమ కోసం మధుకర్ కర్పూరంల కరిగిపోయి విశ్వ తేజమైనడు.

ప్రేమ అపూర్వమైనది. అద్వితీయమైనది. ఎవరెంతంత అస్వాదిస్తరో? అంతమేరకు రసానుభూతి పొందుతారు. ప్రకృతిలో ప్రేమను గ్రోలుతారో? అంత మేరకు ప్రేమ తరగని అక్షయ పాత్ర అవుతుంది. దానికి ఎల్లలు లేవు. కల్లలు లేవు. మందహాకారంతో మనుషులు గీసుకున్న హద్దులు, కట్టుకున్న కుటిలత్వం కులం గోడలు తప్పా! రాసుకున్న రాతలు తప్పా ఎమిలేదు. ప్రేమ తాత్కాలికంగా ఓడిపోవచ్చును. మానవత్వం లేని మనుషులు పశువులుగా మారి, పసి హృదయాల్లో మొలకెత్తి వికసిస్తున్న, ప్రేమ కుసుమాల రెక్కలు చిద్మేస్తుండ్రు. పైశాచికానందంతో కొద్దిసేపు ఆనందపడవచ్చును. కానీ! ప్రేమకు స్వ, పర, కుల, మత, జాతి బేధాలు లేవు. ఎవరు ఎక్కడ ఏవిధంగా ప్రేమకు అడ్డు కట్టేయలేరు. మనుషులను చంపవచ్చునుగాని, మమతలను ఎవరు వేరు సేయలేరు. ఇతరులను ప్రేమించ లేనివాడు? ఇతరుల ప్రేమను పొందలేడు. ఇతరులకు ప్రేమను పంచలేడు. ప్రకృతి సమతుల్యతను అర్థం చేసుకోలేడు. నిచ్చన మెట్ల కులవ్యవస్థలో కూనారిల్లుతున్న దేశంలో నేటికి కొందరి అగ్ర కులపోల్లకు పెండ్లికి ఆడ పిల్లలు దొరకని వ్యవస్థ, మన ముందరికి వచ్చిదన్న సొయి సాటి మనసులకు వుంటే మంచిది. మాదిగల బలం బలహీనత ప్రేమనే. ఆమాయకంగా కపటంను నమ్మి ఆ ప్రేమను పంచడం వల్లనే నేటి దుర్గతికి కారణంగా భావించవచ్చునని కవి హెచ్చరిక జేస్తడు.

“బలమూ బహీనత / చావు బతుకు సమస్తం ప్రేమే / ప్రేమ ఆకాశమంత ఎత్తయినది / అగాథమంతలోతైనది” (ప్రేమ మరణమంత బలమైనది -101, 102) ఈపంక్తులను గుర్తుకుచేసుకుంటే ప్రేమలెంత బలమున్నదో, అంతే బాధ్యత వుంది. నిజం మనుషులుగా సచ్చిన, మమతల నెలవుల్లో మనల్ని అజరామంగా నిప్పేది ప్రేమే. గెలిసేది ప్రేమే. విశ్వమానవ తత్త్వం వొంటబట్టించుకున్న మాదిగలకు ప్రేమను మించిన పదార్థం మరోకటి లేదు.

ఒక జీవి ఆహారపు అలవాట్లు వాటి పుట్టుకను బట్టి, వర్ణాన్ని బట్టి, వర్గాన్ని బట్టి, కులాన్ని బట్టి నిర్ణయించబడవు. ప్రకృతిలో జీవుల ఆహారపు అలవాట్లు అనేవి, అవి నివశించే ప్రదేశంలోని ఆహారపు వనరుల లభ్యతపైన ఆధారపడి వుంటవి. అది ప్రకృతి ధర్మం కూడా. ఒక జాతి యొక్క ఆహారపు అలవాట్లును నిర్ణహించే అధికారం ఏ జీవికి(ఎవరికి) లేదు. అలా తినాలని సెప్పడం పెద్ద తప్పు.

ఒకరి మీద ఒకరు పెత్తనం చెలాయించినంత మాత్రనా?! వారి ఆహారపు అలవాట్లను తూడ్సి పెట్టజాలరు. ఇది ప్రకృతి నియమానికి విరుద్దం. జీవావరణానికి పెను ముప్పు. ఇదే విషయంను హెచ్చరిస్తూ కవి గట్టిగా చెప్పతాడు.

“అలవాట్లను నియంత్రిస్తవా/ఆగమైతవ్ / ఏది పులికి చెప్పు గడ్డి తినుమని” ( బహుముఖ వ్యాఘ్రం-47)

ఆహారపు అలవాట్లకు తనకెంత అవినాబావ సంబంధం ఉంది. అదే మననం జేసుకుంటూ రెక్కలు గట్టుకోని తన చిన్ననాటి కలల స్వర్గం తేలిపోతడు కవి. ఇది ఒక కవి సంబంధించిన విషయం కాదు. ఏ జీవికైన, జాతికైన, లోకంలో ఆహారం తీసుకునే ప్రతి బుద్ది జీవులకు వర్తిస్తుంది. కవి అనుభవంలోనే అతని మాటల్లోనే…

“అట్టి తున్కలు నమిలినా/ బొక్క కంకినా/ పులుగు జుర్రుతుంటే/ సర్గం దిగొస్తది”.
ఎంతో సక్కగా ముక్కు సూటిగా తన బతుకును సాక్ష్యామిస్తుడు. పై కులాలకు నిజంగా కింది కులాలపైన ప్రేమ, దయ, జాలి, వుంటే, మానవత్వంతో మాదిగ తత్త్వంను పరిశీలిస్తే ? కావల్సినంత బతుకుంటది. తరతరాలకు తరగని సరకుంటది.

“మనుసు వెడితే/ పట్టజాలనంత బతుకుంటది/ మనుసు వెడితే ఒడువని దినుసుంటది”. (సుగంధాల లందస్వప్నం-16)

ఒకవైపు ప్రపంచంలో అంతరిక్షయానం చేస్తూ ఎన్నో నూతన ఆవిష్కరణలు, విశ్వ రహస్యాలను విప్పుతున్నడు మానవుడు. అయినా ఈ దేశంలో ఇప్పటికీ నిచ్చన మెట్ల కుల వ్యవస్థలో బంధీ. మూఢత్వంలో మగ్గుతుందనడంలో సందేహం.కలుగక మానదు. తమ స్వీయ స్వార్థ ప్రయోజనాల కోసం పాలకులు కులం కుంపటి సెగలు రాజేస్తూ పబ్బగం గడుపుతుండ్రు. దేశంను వల్లకాడుగా మారుస్తున్నరు. నేడు ఉన్నత చదువులు చదివినా విశ్వ విద్యాలయాలలో కులం తిష్ట వేసి కూసుంది. వెలివాడల వెలుగు తారలను మసి బొగ్గులుగా మార్సి మాయం చేస్తుంది. నాటి చుండూరు నుండి నేటి రోహిత్ వేముల, మంథని మధుకర్ దాక, కుల అహంకారం చూస్తనే వున్నం. అది కోర్టు తీర్పులను ఎలా ప్రభావితం జేస్తందో? దోషులను బంధు ప్రీతితో ఎట్లా తప్పిస్తందో? మద్యన ఇచ్చిన కోర్టు తీర్పులు పచ్చి రుజువంటడు కవి. ప్రజాస్వామ్యం పేరు కలవారి కుల స్వామ్యం రాజ్యమేలుతుందని కవి గర్జస్తడు.

“అంతరం మారది కుల వ్యామోహం తరగది /వివిధ వ్యూహాలను పదును పెట్టి/పగ ప్రతీకారంతో పద్మవ్యూహాం రచిస్తుంది” (రోహిత్ మరణం – 49)

“గున్క పువ్వోలే తల నెరిసిన దోతి కుచ్చిల్ల సైగలు/ బడుగు కుతికెలపై అధికారం ప్రయోగిస్తుంది”. (రోహిత్ మరణం – 50) ఈ పంక్తులను గమనిస్తే నేను చిన్నప్పుడు సదువుకున్న…
“వేరు పురుగు చేరి వృక్షంబు….విశ్వదాభిరామ వినుర వేమ” పద్యంకు
మాతెలుగు సారు చెప్పిన అంతర భావం గుర్తుకు వచ్చింది. ఛీడ పురుగులతో సెట్టుకు ప్రాణ హాని వుండదు. అవి ఆకుల్ని మాత్రమే తింటయి. రసాల్ని పీల్చుకుంటయి. అదే పెంటలో వున్న లద్దె పురుగు సెట్టును చేరి (వేరు) మూలంనే సమూలంగా కొట్టి వేస్తుంది. పచ్చని సెట్టును మొత్తం పాడుజేస్తుంది. సమాజంలో కడుపు తిప్పలకు చేసే చిన్న దొంగతనాలతో, చిల్లర మల్లర దొంగలతో దేశానికి నష్టంలేదు హానిలేదు. వారిని మార్చవచ్చును. ప్రజల మద్య తిరిగే లద్దె పురుగు లాంటి ఖద్దర్ తొడిగె పెద్ద నాయకులతోనే దేశానికి, సమాజానికి ముప్పుందన్నడు వేమన. వీరిని మనం మార్చలేం. అవసరాలకు అనుగుణంగా మారినట్టు కన్పిస్తరు. నిజంగా దేశాన్ని ఛీకటి బజారుల తాకట్టు బెట్టి తమాష జేస్తుంది, చూస్తుంది వీరేనంటడు వేమన. కుల గజ్జి సమాజం కులం వేయి తలల వెర్రి వేషాలేస్తుంది.

చార్లేస్ డార్విన్ తన “జీవ పరిణామ సిద్దాంతం”లో చెప్పినట్లు, బతకడంకోసం ప్రకృతిలో ప్రతిజీవి పోరాటం చేయాల్సి వుంటుది. ప్రకృతి శక్తులు, భౌతిక శక్తులు, స్వజాతి శక్తులు, విజాతి శక్తులు, శక్తులేవైన కావచ్చును, ఎదురునిల్సి పోరాడి గెలిసిన జీవులే మనుగడలో నిలుస్తయి. మిగిలినవి ప్రకృతిలో నిమిష్క్రమిస్తయి. ఈభావనే కవి తన మనుగడ రణం కవితలో వ్యక్తం జేస్తడు. ఎనలేని ఆత్మ విశ్వాసంను ప్రకటిస్తాడు. అక్షరాలనే ఆయుధంగా మల్సి ఎట్టి బతుక్కుల్లో మార్పు కోసం పోరాటం చేయక తప్పదంటడు. తన చేవ్రాలును శిలాశాసనంగా లిఖిస్తడు.

“కదిలే కాలంతో కలెపడాలని/రేపటి పొద్దుకు హద్దుల్లేని స్వేచ్ఛని/ కవిత్వంగా అద్దాలనేది నాస్వప్నం” (సుగందాల లందస్వప్నం-17)

“శోకాలు కల్గించిన శ్లోకాల సాక్షిగా/పరిహాసించిన పదాల వాదాలమీద/శిక్షించిన ఆ క్షరాలతోనే/పుటం వేసిన అవమానాల కొలిమిలొంచి/ సాహిత్యం అందరిదని చెప్పడానికి /కైగట్టి దీటుగా చేవ్రాలు చేస్తున్న”

“నా సంతకం శిలాశాసనం/జ్వాల తోరణం/మనుగడ రణం”.* అవును కవి సెప్పినట్లుగా మాదిగలు తమ మనుగడ కోసం పోరాటం సేయక తప్పదు.
మాదిగ అస్థిత్వం – కవితలు.

నాయిన తొవ్వ, సుగందాల లంద స్వప్నం . ఆరిపోని జ్యోతి .శవప్రశ్న. ఇమిడి. మనుగడ రణం. రోహిత్ మరణం. వ్రణం 9.వెంటాడే జ్ఞాపకం. ఆత్మగౌరవ శిఖరం సమ్మతం, చూపుడు వేలు, దాతు, శకలం… పై కవితల్లో మాదిగ జీవితం జాడలు పుష్కలంగా తోడుకోవచ్చును. ఎన్ని బాదలున్న తిండికి లేక దేహం చిక్కిపోయి బొక్కలు తేలిన రంగెల్సి పోయిన మనుస్సు ఎల్సిపోని మనుషులు మాదిగలు. మానవీయ దృష్టి కోణంతో మనుషులను ఎరిగి నడుస్తున్న మహా మనుషులు మాతంగ ఋషులు.

“ఎల్సిపోని మనుషులు ఎరిగిన మనుషులు”(నాయిన తొవ్వ – 14 )

వర్తమాన సమస్యలు- రాజకీయం:

కవికి తన జాతి సమస్యలే కాదు. సమకాలీన వర్తమాన రాజకీయ అంశాలపైన మంచి చూపు వుంది. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న అరాచక దాడులను చూసి కలత చెందుతాడు. వరస సంఘటనలకు బాధ్యులెవరో? కారణాలేమిటో? అలజడులు ఎందుకు జరుగుతున్నయో? తనదైన శైలిలో వివరిస్తడు. తన దృష్టికి వచ్చిన ప్రతి సంఘటనకు స్పందిస్తడు. తన అక్షరాలతో కవిత్వమయం చేస్తడు. నిత్యం సమాజంలో వుంటు, సమాజ మార్పుకోసం పాటు పడే వక్తలు, వ్యక్తులు వారు. అలాంటి వారిని విచక్షణ రహితంగా హత్య చేస్తు రుజువులు లేకుండా చేసి, రూపుమాపే, వ్యవస్థపై నిరసనగా కవి తన ఆవేధనను వ్యక్తంజేస్తడు. రాజ్యం చేస్తున్న హింసను దమన నీతిని బాహటంగా వ్యతిరేకిస్తడు.

“చట్టమని వల్లిస్తున్న ఆదర్శరాజ్యంలో పత్తా దొరకని హత్యలు/సాక్ష్యాలయి తిరిగే అక్షరాలపై కక్ష/చైతన్యం నింపె అక్షరాలకు శిక్ష” (రక్తాక్షర పతాకం – 19)

అక్షరాలు ఎంజేస్తయో విస్పష్టంగా సేప్పుతాడు. అక్షరాలు విడిగా వుంటాయి. ఒక్కొక్క అక్షరం కలిస్తేనే పదాలవుతాయి. పదాలే చైతన్యపు ప్రవాహాలవుతయి. రెపరెపలాడే ఆత్మవిశ్వాస పతాకాలవుతయి. గాయాలైన కాయాలకు మాటల మలాంలవుతయి. దివ్యౌషధ సంజీవిని అవుతయి. నిజమైన అక్షరాలు నియతృత్వం పోకడలను, ఎండగడుతయి ఎదిరిస్తయి. కుట్రల కంచుకోటలను బద్దలు కొడుతయి. పీడనలకు ఘోరి కడుతయి.

“రసికారే గాయాలపై మాయని మచ్చలపై/మలాం పూయడానికి అక్షరాలు ఔషదమవుతయి/కారేకనుకొలుకుల్ని కొంగవాలు కత్తుల్ని చేస్తూనే/మనుసును విల్లుజేస్తయి”

“కుతంత్రమే రణతంత్ర మయ్యేచోట/అక్షరాలు మనుసు దరిత్రిలోంచి అగ్గి పిడుగులై/ఆశలేని ప్రాణాల్తో మొలుస్తుంటయి” ( అక్షరాలు – 18)

దేశ వ్యాప్తంగా కవులు, కళకారులపైన జరుగుతున్న నిర్భంధాలను చూసి కవి ఆవేదన చెందుతాడు.
ఉరి కొయ్యలు చెరసాలలు ఉద్యమాలను ఆపలేవు. పాలకులు ఎంతగా ప్రజలను హింసిస్తూ నిర్బందిస్తే, ప్రజలు అంతెంత్తున్న నియతృత్వ పోకడలను ఎదిరిస్తరు. ప్రజాకంటకాలను పడగొడ్తరు. తమకు కావల్సిన నాయకున్ని ఎన్నుకుంటరు. ప్రజా సంక్షేమం కోరే కవులు కళకారులందరు, సమాజ నాయకులే నిర్మాతలే. నిజమైన కవులు కళకారులు పూల దండలోని దారంలాంటోల్లు. సమాజ చలన శీలతను పసిగట్టే ప్రగతిశీలులు వాళ్లు. జనం హృదయంలో కొలువున్న మార్గదర్శులు.

“కనిపించకుండా వినిపించే కవివి/ ఆత్మగౌరవాన్ని మండించి వక్తవి/ తలొంచని వెదురు వనాన్ని విత్తే మేధావి/ సమాజంకోసం ఒకడు ఒక్కనికోసం సమాజం”.

“రాహుకేతుల్ని పెంచుతున్న రాజ్యంలో/రచయితల రక్తంతో తడిసిన చరిత్ర/ఎప్పటికి గాయపడ్డ గ్రంథమే” (తిరగబడుతున్న సిరా-37)

ప్రకృతిలో మనం ఉహించని హఠత్ పరిణామాలు ఒకదాని మీద ఒకటి పడితే మానవజీవితం ఏవిధంగా చిన్నాభిన్నం చేస్తయో మనకు తెల్సిందే..

పల్లెల్లో గతంలోకి తొంగిచూస్తే ప్రతి ఇంటి ముందర పందిరి వుంటది. పందిరి కింద మంచమేసుకోని వేసవి కాలంలో ఆకాశంలోకి చూస్తు చుక్కలను లెక్కిస్తూ, ఆలోచనల పల్లకి తేలిపోతరు శ్రమ జీవులు. ఆరుగాలం చేసిన శ్రమను మరిసి పోతారు. ఆనందంగా పిల్ల పాపలతో కతలు సెప్పుకుంటు కాసేపు విశ్రమిస్తున్న తరుణం. ఉల్కు పలుకు లేకుండా పందిరి బడితెలు ఇరిగి మీద పడితే ఏముంటది? ఊపిరాడక చావడమే. ఏకంగా పందిరి మీది రాయే పడితే ? ఊహించడమే కష్టమే. ప్రజలు నమ్ముకున్న ప్రభువులు, దయ, జాలి, కరుణ లేక కట్టు బట్టల్తో, ఉన్నపల్లంగా ఎల్లిపొమ్మంటే ఎట్లా? ఎటు పోతం. పుట్టిన నుండి గిట్టేదాక తాతల తండ్రుల నుంచి నేటి వరకు ఉన్నచోటును కాళి చేయమంటే? మావల్ల కాదంటుది వేములఘట్టు. ఇదెంత నరకయాతన, గుండె కోత, మనలకు అనుభవంలోకి వస్తేగాని తెలువదు. రాజ్యంలో రాజు తలుసు కుంటే దెబ్బలకు కొదువా! అన్నట్లు? ప్రజలు నిరసనలు తెల్పితే? పౌజును దింపి పశువులను బాదినట్టు బాదితే? దిక్కులేని జనానికి దిక్కెవరు? ఆదుకునేటోల్లే అన్యాయం చేస్తుంటే?!, బతుకు కోసం పోరాటం చేయక తప్పదు. అయిన ఇక్కడే పుట్టినం. ఇక్కడే చస్తమంటు వేములఘట్టు సమర శంఖం ఊదుతుంది.

“పందిరి మీది గుండు ఉరుములేని పిడుగై / మిన్నోలే యిరిగి మీద పడ్డదిట

ఇక్కడినేల/కదనానికి కత్తులు దూస్తుంది/ఇక్కడి పంటలు/బతికెతందుకు జీవిగంజి పోస్తయి”.
ఈకవితను కవి ఎత్తుకోవడమే చాల అద్భుతంగా వుంది. పాబంది కవితలో వాస్తవ పరిస్థితులను వివరిస్తడు.

“ పీనుగుల మీద సానుభూతి చల్లి/ఉద్యమం నడిపివోనివి /నీహామీలు భూటకం/నువ్వాడేది నాటకం/మావోళ్లు బతుకుల్ని అరడుగుల కాగడా జేసి కాలుతుండ్రు”.

సమాజంలోని అన్యాయలను జరుగుతున్న ఘోరాలను గమనిస్తూ మనకెందుకనే నిర్లక్ష్యపు భావనను కవి వ్యతిరేకిస్తడు. మేధావుల మౌనం దేశానికి చాల ప్రమాదం కాబట్టి మేదావులరా! బడుగు బలహీన వర్గాల నాయకల్లరా! భ్రమల్లో నుండి బయటకు రండి. మన సమాజ హితం కోసం, అందరం కలిసి నోరు విప్పాల్సివుంటది. ఇజాల కోసం నిజాలను పాతరేయడం కోసం కాదు. పాతరేయబడిన ఎన్నో నిజాల కోసం నోరు విప్పండి. అప్పడే సమాజం మిమ్ముల్ని హర్షిస్తుంది. ఆరాధిస్తుంది. మీ వ్యక్తిత్వం వెలుగుతుంది. మీరు నోరు విప్పక ఎంత కాలముంటరో? అంత వరకు నిజానికికి ద్రోహం చేసినవారవుతరు. అందుకే నోరు విప్పి మాట్లాడుమని కవి వేడుకుంటాడు.

“ఇజాల కోసం గాదు /నిజాల కోసం, సమాజంకోసం / గొంతు విప్పడం నేర్చుకుంటే / వ్యక్తిత్వం- శక్తివంతం / వ్యవస్థ -సమర్థవంతం”.
పైవిధంగానే కీర్తులాట కవితలో ద్వంద్వ వ్యక్తుల అసలు రూపాన్ని, గోడమీది పిల్లిలా వుండే మనుషుల బాగోతంను బట్ట బయల్జేస్తడు. ఇట్లా దాదాపుగా వర్తమాన రాజకీయ సమస్యలపైన కవి తన దృష్టిలో సమస్యను వివరించడానికి ప్రయత్నం చేస్తడు. ఇది కవికున్న స్పష్టమైన చూపుగానే చెప్పవచ్చును.

వర్తమాన సమస్యలు: అంశాలపై పదిహేడు కవితలున్నవి. అక్షరాలు, రక్తాక్షర పతాకం, వేములఘట్టు గొంతు విప్పడం నేర్చుకో, తిరుగబడుతున్న సిరా, బహుముఖ వ్యాఘ్రం, ముల్లె కట్టిన సూది, వేయితలల విష్పష్ట దృశ్యం, అనలు కొనలు, పాబంది, శుద్దాంత, శబ్ద పల్లవం, చావని బతుకుకోసం, దివిటి, కుంజీ, కీర్తులాట, రక్తం కూడు. ఇవ్వన్నికూడా ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ యదార్థాలను దృశ్య మాలికగా మన కండ్ల ముందర నిల్పేవి.

దళిత బహుజన తత్త్వం:

“బుద్దం శరణం గచ్ఛామి/ సంఘం శరణం గచ్ఛామి/ దమ్మంశరణం గచ్ఛామి”.
ఇవి ఎవరో అనామక జనం మతి భ్రమించి మాట్లాడిన మాటలు కావు. సకల భోగాలను తృణ ప్రాయంగా త్యజించిన సిద్ధార్థుని నోటినుండి వచ్చిన అణిముత్యాలు.

పై పంక్తులను (మంచి మాటలను) మనం గుర్తించుకుంటే?సంఘమంటే ఎమిటో? మనుషులుగా మనం సంఘంలో ఏం చేయకూడదో ? ఏంచేయాలో తెలిసిపోతుంది. ఆమాటలు ఎన్నో జీవితాలకు తొవ్వ చూపిన కాంతి కిరణాలు. మాటలకు సేతలకు పొంతన ఎన్నిమాటలైన మాట్లాడవచ్చును. ఎంతో ఆదర్శవంతమైన మాటలు వల్లిస్తూ, కూసున్న కాడ పుణ్యం మూట కట్టుకోవచ్చు. స్వలాభం కోసం, అరచేతిలో స్వర్గ నరకాలు చూపవచ్చును. ప్రజల కాసులతో పబ్బగం కాసుకోవచ్చును.

వలసవాదులు తెలిసో తెలియకో మనది పుణ్య భూమన్నరు. ఇది సంతోష పరిచే విషయం. నిజంగా మనది ముమ్మాటికి పుణ్యభూమే. ప్రజల కోసం, సమాజంలో మార్పుకోసం. తమ సమస్త సుఖ సౌకర్యాలను గడ్డి పోచతో సమానంగా భావించి, పరివాజ్రకునిగా మారిన గౌతమ బుద్దున్ని కన్న గొప్పదేశం. ఆయన కోరికలే మానవుల దుఃఖానికి కారణమని చెప్పినడు. తానే సంఘం కోసం మొదట భవ బంధాలను త్యజించి బుద్దుడు చూపినడు. అసలు సిసలైన ఆచారణ వాదిని కన్న ధన్యభూమి మనది.

ప్రజల్లో ఎలాంటి హెచ్చు తచ్చులు వుండరాదని, సంఘంలో అంతా సమానమే. ఎక్కడ పీడనకు, హింసకు, అంటరాని తనంకు తావుండరాదన్నడు. సమత, మమత, కరుణ,సిద్దాంతంకు ఊపిరి పోసి, ఆచరించి చూపినడు సిద్దార్థుడు. అట్లాంటి ఒక మహా మనిషి, పుణ్య పురుషుడు నడయాడిన నేల మనది. ముందుగా మారల్సింది ప్రజలు కాదు. ప్రజలను పాలించే పాలకులే మారలని బోధించిన బోధి తత్త్వభూమి. సమాజంలో తన బోధనలతో పెను మార్పులు తీసుకు వచ్చినడు గౌతమ బుద్దుడు. సిద్ధార్థుని బోధనలు ఆచరించి కుల రహిత పాలన చేసి విశ్వ పాలకుడైనడు సామ్రాట్ అశోక చక్రవర్తి. ఈదేశంలో దళిత బహుజనలకు మంచికాలమేదైన వున్నదంటే? అది అశోక చక్రవర్తి పాలన కాలమే. మౌర్యుల పాలనే పీడిత జాతులకు స్వర్ణ యుగంగా పేర్కోన వచ్చును. దీనికి విరుద్దంగా అడ్డ దిడ్డంగా అందరు గుప్తుల కాలంను స్వర్ణ యుగమంటూ, నేటికి మభ్యపెట్టి గొప్పలు సెప్పుతుండ్రు. నిజంగా అది ఎవరికి స్వర్ణయుగమంటే? పని చేయక పబ్బగం గడిపే పరాన్నబొక్తలకు అనవచ్చును.

బౌద్దంను దేశం నుండి సమూలంగా నిర్మూలించడానికి ప్రయత్నించిన కుట్ర దారులకు స్వర్ణయుగం. నిజంగా గుప్తుల కాలం, భారత దేశ చరిత్రలో ఒక చీకటి యుగం. ప్రజలను కుట్రలతో వచించి పీడితుల్ని జేసింది. ఎదురు తిరిగినోల్లను చంపి, భయ భ్రాంతులకు గురి చేసి బానిస వ్యవస్థను రూపొందించిన కాలం. అగ్రకుల ఆధి పథ్యంను నిలుపుకోను మనుస్మృతిని మల్లి తిరగ రాసిన కాలం. కుల వ్యవస్థను ప్రవేశపెట్టి ప్రజలను నిలువున చీల్చిన కాలం. దళిత బహుజనులను విద్యకు, విత్తంకు దూరంచేరింది. స్త్రీలను వంటిల్లలో బందించి చదువుకు, సందేకు దూరం చేసిన దుర్మార్గపు వ్యవస్థ. నేడు సంఘంలో ఎన్ని అవసక్షణాలున్నయో, అన్నింటికి పాదులేసిన పాడు వ్యవస్థ. తెల్లోడు విభజించి , పాలించుమనే నీతి సెప్పినాడని మనం అనుకుంటం. కానీ! అది శుద్ద తప్పు అనవచ్చును. మనషుల్ని కుక్కల కంటే హీనంగా చూసే, మనుస్మృతి చట్టం చేసిందెవరు? ఈ స్వర్ణ యుగపు రాజులే కదా!? దానికి పునాదులు స్వర్ణ యుగమని చెప్పతున్న గుప్తుల కాలంలోనే పడ్డవన్నది మనం మరువరాదు. నాటి నుండి నేటి వరకు దినదిన ప్రవర్థమానం చెందుతూ, మనుషులను చిన్నాభిన్నం చేసి, కుల వ్యవస్థ వెర్రివేయి తలలేసిందని చరిత్ర నొక్కి చెప్పుతున్న నగ్నసత్యం.

సమాజం కోసం బుద్దుడు నుండి మొదలుకొని అశోకుడు, చత్రఫతి శివాజీ, సాహు మహారాజు, మహాత్మాజీతి రావు పూలే, డా. బాబా సాహేబ్ భీంరావ్ రాంజీ అంబేడ్కర్, పెరియార్ ఇ.వి.నాయకర్ రామస్వామి, నారాయణ గురుగౌడ్, మాన్యశ్రీ కాన్షీరాం లాంటి ఎందరో మహానుభావులను, ఆదర్శ వంతులను, ఆచరణ వాదులను, సమాజ మార్పుకోసం, నిచ్చన మెట్ల కుల వ్యవస్థను కూల్చడానికి బహుజన సమాజ నిర్మాణానికి కృషి చేసిన ఎందరో సంఘ సంస్కర్తలను కన్నది ఈదేశం.

దళిత బహుజను కలవనీయకుండా గుప్తుల కాలము నుండి మొదలై కుట్రలు, నేటికి కొనసాగుతున్నయి. పీడితుల ఓట్లను కొల్ల గొట్టడానికి అధికారం ఎదో రూపంలో కుల వ్యవస్థను నిలబెడుతునే వుంది. అంతరాలను సృష్టిస్తుంది. పచ్చని బతుకులను దగ్దంజేస్తుంది. దేశంలో కులం లేని రాజకీయాలను చూడలేం. అది చేసిన హత్యలు ఎన్నో లెక్కించలేం. ఈదేశంలో మనం ఒకటిగా కలిసి వున్నదెప్పుడు? ఒక కంచంలో తిన్నదేప్పుడు? ఒకవేల “కంచం పొత్తువున్నగాని మంచం పొత్తులేదు” కదా అంటు కవి ప్రశ్నస్తడు.

“వంద అబద్దాలు ఒక్క నిజం చేస్తయా/పొత్తులేకున్నా ఎన్నాళ్ళు బొంకుతవ్/వాకిల్లు తొక్కనోల్లం/కంచమూ మంచమూ వేరేనాయే/నువ్వు నువ్వే నేను/మనం కలిసి ఉన్నది ఎక్కడ”.( సమ్మతం-91) నేడు దడి కట్టుకోని మడి కట్టుకున్న కుల వ్యవస్థ కారణంగా కొన్ని కులాలోని మగ పొరగాల్లకు ఆడ పిల్లలు దొరకని నగ్నసత్యం. నాటి దుర్మార్గపు ఆచారాలకు కట్టు బాట్లకు, బలై నలిగి పోతున్న యువతను చూస్తే కడుపు తర్కుపోతుంది. ఇదే విషయం మనాది సర్వే కవి సెప్పుతడు.

“బిడ్డా! మనుసు పెట్టి విను/ముప్పై తొమ్మిదేళ్ల పెద్దోడు/ పెండ్లి ఆశలు కొట్టేసుకొని విస్తర్ల మిషన్లతో కుస్తీ పడుతుండు/ ఇగ రాసుకో తల్లి / గూనపెంకల ఇల్లు వానోస్తే ఉరుస్తది/బిల్లు మందం కరంట్ వాడుతం”. ఇది అగ్రకులంలోని కఠిన నిజం.
కవి తను అనుభవిస్తున్న ఘోర కుల వ్యవస్థను గూర్చి ఇలా అంటడు.

“ఒక్కటే దేశం ఒక్కటే భాషంటున్నప్పుడు/ ఒక్కటే కులమని ఎందుకనవు తండ్రీ… ఇప్పుడు మత నినాదాలు అక్కర్లేదు / వైరాగ్యం పుచ్చుకుంటే వైరమెక్కడది/మనిషిని మనీషినిగా నిలుపుదాం పదా”. (దమ్మం-104,105)

దళత బహుజన బతుకుమారాలంటే? వాళ్ళను వాళ్ళు తెలుసుకొని దేశానికి పాలకులైనప్పుడే సాధ్యం అంటడు.

“ఎనాళ్ళు/ ఇంకెనాళ్ళు/చౌరస్తాలో నిలబడ్డ ఆత్మగౌరం/ఎత్తిన చూపుడు వేలుతో/పాలకులు పుడవుతారని ప్రశ్నిస్తుంది”. (చూపుడువేలు కవిత-110)

ఈ మహానీయులు చేసిన గొప్ప ప్రయత్నాలవల్ల ఎంతో కొంత అక్షరాలను నేర్చుకొని తమ బతుకులను దిద్దుకొని తమ ఆలోచనలకు పదును పెట్టుకొని తమ హక్కులకై పోరాటం చేయాలంటడు. అందుకే కవి దళిత బహుజన గీతాలాపన చేస్తడు.
బుద్దంశరణం. పూర్ణం, వేడుకోలు, అక్షరాల లక్ష్యగాన్ని, గోదారి, మనాది సర్వే, జ్యోతిపథం, మనిషికోసం, ఇక్కడి మట్టి, అస్తమించని వేగుచుక్కలు, పంతం, చూపుడువేలు, దిశ, సమ్మతం మొదలైన కవితలు.

ఊరు మనాది:

కవికి తన పుట్టిన ఊరంటే ఎనలేని మమకారము. తన ఊరుతో పెనవేసుకున్న అనుబంధాలను నెమరేసుకుంటడు. రెక్కలు కట్టుకొని ఎగిరిపోయి పసిపోరని తరిక ప్రకృతిని పల్లెను తడిమి చూస్తడు. ఊరి బతుకులు ఎట్లా వుంటయో? ‘మండువ’కవితలో మహాగొప్పగా చిత్రికరించినడు.

“అది మయ సభ కాదు/మమతల మండువ /అంటు ముట్టులేని సమానత్వపు వేదిక”.
ఈవాక్యాలను బట్టి మండువ గొప్పతనం అర్థమవుతుంది. ఊరుగొప్పతనం. ఊరుకు పక్కన తాటివనం. వనం మద్దెల ఎల్లమ్మ గుడి అటు వైపున నీటి పరువాలతో ఉరకులు వేసే వాగు. వాగునానుకొని పచ్చిని పంట పోలాల దృశ్యం ఎంత వర్ణించిన తక్కువే. చూసిన కొలది తరగని తన్వి తీరని వేడుకే.

కవి ఊరు చుట్టు అల్లుకున్న దృశ్యాలను కలంలో బంధించి, మండవ దగ్గర ఊరి బతుకులను పునః ప్రతిష్ట చేస్తూ జీవం పోస్తడు. ఒక చుట్టూ ఉన్న సమాజంను ఆవిష్కరిస్తడు. వీరగోని పెంటయ్య మండువ నవల చిత్రీకరించినట్లు కవి బతుకులు చిత్రిస్తాడు.

మండువలో మాదిగ, మాల, కాపు, గౌడ, చాకలి, మంగలి, గొల్ల, కుర్మ, తెనుగు, దూదేకుల,పెద్ద చిన్న తేడాలేదు. సబ్బండ జాతులు, సకల వర్ణాలు, భేద భావాలు మరసిపోయి, నిండు మనసుతో కలసి పోయే జన సభ మండువ. జీతగాల్లు నాతగాల్లు పటేలు పాలేర్లను, కూలి నాలిని, ఇరుగు పొరుగును, అచ్చగాని, బుచ్చగాన్ని, అర్దేశిని, పర్దేశిని, తొవ్వ సారెంట పోయే జంట మనుసులను ఒక తాటి కిందికి తెచ్చె అభీష్టాల, అభిప్రాయాస వేదిక మండువ. ఎందరో మనుసుల అనుభూతుల, అనుభావాల కలయిక మండువ.

మండువకు మాదిగలకు (ఎల్లమ్మ) మాతమ్మకు, ఎల్లమ్మకు ఎల్లగౌడునికి ఉన్న సంబందమే ఉన్నది. ఈ రెండు కులాలు ఎల్లమ్మ సిద్దోగం ( జాతర )కలిసే చేస్తయి. ఇదెంతో చూడ ముచ్చటగా వుంటది. కంచే అయిలయ్యగారనట్లు ఉత్పత్తికి దూరంగా ఉన్న బాపణ, క్షత్రియ, వైష్య ఈమూడు కులాలు తప్పా! ఉత్పత్తిలో వున్న అన్ని కులాల ఆత్మీయ సమ్మేళనం మండువ. ఇక్కడ పనికి మనుసులకు విడదీయరాని సంబంధముంది. సేను సెలక దగ్గర పని పాటల్లో అంత కలిసే పన్జేస్తరు. సద్దలు కలిసే తింటరు. కలిసే వుంటరు, కలిసే పంటరు, ఒకరినొకరు తాకుతరు. ఇది మోసలకు వేదికైన మయసభ కాదు. మమతలకు నెలువైన మండవ అంటడు. బహుజాతుల పెట్టుబడ్డి వలలో చిక్కి, ఊరు సిగలోంచి కనుమరుగవుతుందని కవి మనోవేదన చెందుతడు.

వ్యవసాయనికి ప్యాట చెరువుకు కవి పుట్టిన ఊరికి విడిపోని మట్టి బంధముంది. చెరువు గూడు కట్టుకొని అల్లుకున్న బతుకులు చెరువు నిండినప్పుడు ఏలా వుంటాయో, ఎండినప్పుడు ఎలా కననమవుతయో సెప్పుతడు. సెరువు దుంకి అలుగు దుంకినట్లే కవి మనసు పొరల్లోంచి కవిత్వం తన్నుకు వస్తుంది. సెరువు నిండితే సుగందాల కస్తూరి వాసనవుతుంది. కాదంటే ఒక పూటకు కూడు దొరకని కరువుకు నిలయమవుతుందంటడు. రాజగోపాల్ పేటను చుట్టు పక్క ఊర్ల జనం ప్యాటగా సంబోధిస్తరు. ఇది జనంలో వాడుకలో వున్న పదం. జనం వాడుకలో వున్న పదాలను కవిత్వంలోకి తేవడంలో కవి సిద్దహాస్తుడనవచ్చు.

“కరువుల రైతు కన్నీళ్ళు తుడిచే అలుగు /పొలాల గొంతు తడిపే కన్న తల్లి/మాప్యాట చెరువు సుట్టూ ఆమెడ పెట్టు” ( page-51)

“మాబలమూ బలహీనత చెరువు/ సామూహిక జీవన విధానం/సంస్కృతి –సాంస్కృతిక వేదిక/ భరోస-బతుకు/మాచెరువే మాఆదెరువు / నిదడుతే కస్తూరి పల్లె/ ఎండితే కననీళ్ళపల్లి”. (ఆశల అలుగు 51,52) ఈ కవితను సదివినప్పుడు త్రిపురనేని గోపిచంద్ ‘రిక్షవోడు’ కథ తప్పక గుర్తుకు వస్తుంది.

“ఆకలి ఆవురారంటుంటే/ కడుపు తిప్పలకు జేరిపోతులాట /తృప్తి లేని జీవితం /కడుపార తినది – కన్నార పండది/మనసార ఎక్కడా ఉండది”

చెరువు నిండక కడుపుకు లేక బతకడం కోసం అనివార్యంగా వలస పోవల్సి వస్తుంది. కొన్నిజాతులు దేశ సంచారం పోతరు. ఆ సంచార జీతం చాల దుర్బలంగా వుంటుందని కవి వాపోతడు. నేడు ప్రపంచం ఎంతో మారిపోతుంది. ఎన్నో కొత్తకొత్త ఆవిష్కరణలు జరుగుతున్నయి. టెక్నాలజీ మానవ జీవితంను పెను మార్పులకు గురిచేస్తుంది. టెక్నాలజీతో ఎంత లాభముందో, అంతే ముప్పుంది. రేడియేషన్ వల్ల ప్రకృతి ఎన్నో జాతుల జీవులు కనుమరుగవుతయి. ఇదే ముచ్చట రేడియేషనే కవిత వివరిస్తడు.

ఊరంటేనే ఎవుసం. ఎవుసమంటేనే రైతులు గుర్తుకు వస్తరు. రైతే దేశానికి వెన్నముకలు. రైతే – రాజు, నేలమీది చీమకు, గగనమందు పక్షికి, జీవారణంలో సకల ప్రాణకోటికి, తన నెత్తురు సత్తువను చెమట చేసి ఆరుగాలం పంట దీసి అన్నపెట్టే ప్రాణదాత రైతు. ప్రజలకు కష్టమొస్తే ప్రభువులు ఆదుకోవాలి. ప్రభువులకు కష్టమొస్తే ప్రజలు ఆదుకోవాలి. భూమిపై కర్మ చేసేటోడు లేకంటే కలియుగానికి కంకెడు మెత్కులు పెట్టెటోడు వుండడు. రైతు దేశంలో రైతుకెందుకు ఎవుసం దినదిన పాన గడమవుతుందో? బ్లాక్ మార్కేట్ బజారులో, పాలకులాడే చదరంగం ఆటలో వారితో నిలబడ లేక ఎత్తులేయ లేక చిత్తైపోతుండు రైతు. ఒకవైపు నమ్ముకున్న పాలకులు మోసం జేస్తుండ్రు. మరోక వైపు కన్నతల్లై ఆదుకునే ప్రకృతి కన్నెర జేస్తుంది. సకాలంలో వానలు రావు. వానకోసం కొండంత ఆశతో మొగులు మీదికి చూసే రైతు బేల చూపులు నజరు దప్పుతున్నయి. పొలంలోనే రాలి పోయి, పంచ భూతల్లో కల్సిపోతుండు రైతు.

“మిన్నుకు మన్నుకూ తెగని చూపు దారం / వానరాదు/ ఆశచావది”. (ఎదురుచూపులు-62)

“నేలలోతుల్లోకి దిగి అడుగంటిన బీవజలాన్ని/మనుసు దోసిల్లతో దేవిపైతు గొంతుల్లి తడిపి/పోయే ప్రాణాల్లి నిలుపాలనే నిలువేత్తు కోరిక”.

“నిరీక్షణ చూపు ఎర్రటెండల తపస్సు/సేధ్యగాడితో మమేకమై కనికరించని మేఘాన్ని/కన్నాళ్లతో కరిగిచాలని మనాది/
బాకీల సేగతో బుసకొడుతున్న అప్పుల కుప్పలు/తిప్పల పడుతున్నరైతును తిత్తి తీస్సున్నమిత్తి” (దుఃఖపడుతున్ననేల-28)

దుఃఖ పడుతున్ననేల, ఊరుకుతి, రేడియేషనే జ్వాల, రైతుకోసం, బతుకమ్మ, ఆశలఅలుగు, సంచారం సంచలనం, ఎదురు చూపులు, శకలం, మండువ, దమ్మం, వెన్నెముకలు, ప్రేమ మరణ మంత బలమైనది.

పై కవితలే కాదు పుస్తకంలోని చాల కవితల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా పల్లె జీవితం రైతు గడుపుతున్న దీన స్థితిని తెలియజేస్తయి. అన్ని అంశాలకు సమ ప్రాధాన్యతను ఇస్తు తెచ్చిన ‘అచ్చు’ పుస్తకం దళిత బహుజన జీవితాలను అచ్చుపోసి మనకండ్లకు చూపింది. డా. సిద్దెంకి యాదగిరి కలం నుండి మరింత మంచి కవిత్వం అందిస్తడనే నమ్మకం కల్గిస్తున్నందుకు అభినందనలు.

ప్రభుత్వ ఉపాధ్యాయులు. గ్రామం - దాచారం, మం. బెజ్జంకి, జిల్లా - సిద్దిపేట( కొత్తది) కరీంనగర్ (పాతది)

Leave a Reply